
ఈడీ తీరుపై సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్‌ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది.
‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్‌ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్‌ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు ఈడీ తరఫున వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment