మనీలాండరింగ్‌ యాక్ట్‌లో ఈడీ అరెస్టుపై సుప్రీం కీలక తీర్పు | ED cannot arrest after special court takes cognizance of PMLA complaint: Supreme Court | Sakshi
Sakshi News home page

మనీలాండరింగ్‌ యాక్ట్‌లో ఈడీ అరెస్టుపై సుప్రీం కీలక తీర్పు

Published Thu, May 16 2024 5:47 PM | Last Updated on Thu, May 16 2024 6:53 PM

ED cannot arrest after special court takes cognizance of PMLA complaint: Supreme Court

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్‌ 19 ప్రకారం నిందితుడుని అరెస్ట్‌ చేసే విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారాలను సుప్రీంకోర్టు తగ్గించింది. మనీలాండరింగ్‌ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఆ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేయకూడదని వెల్లడించింది. ఒకవేళ సదరు నిందితుడిని  విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలంటే ఈడీ తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

ఈ మేరకు గురువారం పీఎంఎల్‌  కేసులో ఈడీ అరెస్ట్‌ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మనీలాండరింగ్‌ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత.. కేసులో నిందితుడిగా చూపిన వ్యక్తిని  సెక్షన్‌ 19 కింద అరెస్టు చేయడానికి ఈడీ అధికారులకు అధికారం ఉండద సుప్రీం పేర్కొంది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లకు నిందితుడు న్యాయస్థానం ఎదుట హాజరైతే దాన్ని కస్టడీలో ఉన్నట్లుగా పరిగణించకూడదని తెలిపింది

‘ఈడీ  ఫిర్యాదును దాఖలు చేసే వరకు నిందితులను అరెస్టు చేయని కేసుల్లో, ఆ తర్వాత కూడా వారిని అరెస్టు చేయకూడదు. ముందుగా ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి సమన్లు జారీ చేస్తుంది. ఆ సమన్లకు నిందితులు స్పందించి కోర్టులో హాజరైతే వారు కస్టడీలో ఉన్నట్లు పరిగణించకూడదు. ఒకవేళ సదరు వ్యక్తి ప్రత్యేక కోర్టుకు సమాధానం ఇచ్చిన తర్వాత అతడిని కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే.. దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని  విశ్వసిస్తే విచారణకు అనుమతిస్తుంది’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భయన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

నిందితుడు కోర్టు సమన్లకు సమాధానం ఇవ్వడంలో విఫలమైతే మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 70 కింద అతనికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాలని అది కూడా బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ అయి ఉండాలని తెలిపింది.

కాగా పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 19 ఈడీ అధికారులకు తన వద్ద ఆధారాల ఆధారంగా.. కేసులోని నిందితులను నేరుగా అరెస్ట్‌ చేసే అధికారాన్ని, స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసే అధికారాన్ని కల్పిస్తుంది. అయితే అరెస్ట్‌కు గల కారణాలను ఈడీ సంబంధిత వ్యక్తులకు వీలైనంత త్వారగా తెలియజేయాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement