
సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ఆస్పత్రి నుంచి పసికందు అపహరణకు గురైతే నిర్లక్ష్యానికి శిక్షగా ఆ ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతర్రాష్ట్ర నవజాత శిశువుల కిడ్నాప్ రాకెట్‌లో సూత్రధారులైన 13 మంది నిందితులకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం మంగళవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, హైకోర్టులకు కీలక ఉత్తర్వులిచ్చింది.
‘‘దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులు, జిల్లా కోర్టులు పెండింగ్‌లో ఉన్న పిల్లల కిడ్నాప్‌లు, అక్రమ రవాణా కేసులపై తక్షణం దృష్టిపెట్టాలి. ట్రయల్ కోర్టుల్లోని కిడ్నాప్‌ల కేసుల వివరాలు తెప్పించుకోవాలి. ఈ మేరకు మేం సర్క్యులర్ జారీ చేసిన ఆరు నెలల్లోపు ట్రయల్ కోర్టుల్లో ఈ కేసుల విచారణ కచ్చితంగా పూర్తవ్వాలి. అవసరమైతే కేసులను ప్రతిరోజూ విచారించండి. విచారణ పూర్తవగానే హైకోర్టులు మాకు నివేదించాలి’’ అని ధర్మాసనం సూచించింది.
సిఫార్సులను రాష్ట్రాలు అమలుచేయాలి
‘‘మానవుల అక్రమ రవాణా ముఖ్యంగా ఆస్పత్రుల్లో నవజాత శిశువులు, బహిరంగ ప్రదేశాల్లో చిన్నారుల కిడ్నాప్ ఉదంతాల నివారణలో రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాల్లో తీవ్ర లోపాలున్నట్లు భారతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(బర్డ్) గుర్తించింది. 2023 ఏప్రిల్ 12వ తేదీన బర్డ్ ఇచ్చిన నివేదికను రాష్ట్రాలు కూలంకషంగా పరిశీలించాలి. నివేదికలోని ప్రతి అంశాన్ని, చేసిన ప్రతి సిఫార్సును రాష్ట్రాలు తప్పక పాటించాలి. మా ఆదేశాలను తూ.చ.తప్పకుండా అమలుచేయండి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండొద్దు’’ అని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తీవ్రమవుతున్న కిడ్నాప్‌లు
‘‘కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి పొందిన చిన్నారులను బాలల ఉచిత, నిర్బంధ విద్య,2009 చట్టం ప్రకారం స్కూళ్లలో చేరి్పంచండి. వాళ్ల విద్యావసరాలు తీర్చండి’’ అని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ‘‘ కిడ్నాపర్ల పంథా మారింది. వినూత్న మార్గాల్లో అపహరణ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నిందితులకు అలహాబాద్ హైకోర్టు అత్యంత నిర్లక్ష్యంగా బెయిల్ మంజూరుచేయడం నిజంగా బాధపడాల్సిన విషయం. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇలాంటి మరెందరో నిందితులు బయటికొచ్చి పత్తాలేకుండా పారిపోతున్నారు. దీంతో కేసుల్లో పురోగతి ప్రశ్నార్థకంగా మారుతోంది.
కనీసం ఆ నిందితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వారానికి ఒకసారైనా హాజరయ్యే హైకోర్టు షరతును విధిస్తే బాగుండేది. ఈ కేసుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరి సైతం విస్మయం కల్గిస్తోంది. హైకోర్టు ఈ కేసులో బెయిల్ ఇస్తే ఇంతకాలమైనా యూపీ సర్కార్ ఎందుకు బెయిల్‌ను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించలేదు?. ఈ కేసు తీవ్రతను రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం అర్థంచేసుకోలేదు’’ అని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. బాధితులు, వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని యోగి సర్కార్‌ను ఆదేశించింది. నిందితులను రెండు నెలల్లోపు పట్టుకోవాలని ఆదేశించింది.