
చట్టం రాజ్యాంగబద్ధతపై ఊహాగానాలే వినిపిస్తున్నాయి
అందుకే అన్ని పిటిషన్లు కొట్టివేయండి
సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం–2025 అమలును పాక్షికంగా లేదా తాత్కాలికంగా కూడా నిలిపివేయొద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం ద్వారా ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. చట్టం రాజ్యాంగబద్ధతపై వ్యక్తమవుతున్నవి కేవలం ఊహాగానాలేనని స్పష్టంచేసింది. అందుకే అందుకే చట్టం అమలుపై స్టే విధిస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని విన్నవించింది.
చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేయాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రెటరీ షెర్షా సి.షేక్ మొహిద్దీన్ శుక్రవారం సుప్రీంకోర్టులో 1,332 పేజీల ప్రాథమిక అఫిడవిట్ కౌంటర్ దాఖలు చేశారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాన్ని కేంద్రం సమర్థించుకుంది. 2013 తర్వాత దేశంలో అదనంగా 20.92 లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తిగా మార్చారని అఫిడవిట్‌లో వెల్లడించింది.
వక్ఫ్ ఆస్తులు ఏకంగా 116 శాతం పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొంది. స్వాతంత్య్రం కంటే ముందు, స్వాతంత్య్రం తర్వాత 18.29 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ ఆస్తిగా ఉండేదని పేర్కొంది. గతంలో అమల్లో ఉన్న వక్ఫ్ చట్టాన్ని దురి్వనియోగం చేశారని, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి వక్ఫ్ ఆస్తులుగా మార్చేశారని ఆక్షేపించింది. ఇలాంటి ఆక్రమణలు అడ్డుకోవడానికే వక్ఫ్(సవరణ) చట్టాన్ని తీసుకొచ్చినట్లు స్పష్టంచేసింది.
రాజకీయ పార్టీల సభ్యులతో కూడిన పార్లమెంటరీ ప్యానెల్ ద్వారా లోతైన అధ్యయనం, విశ్లేషణ చేసిన తర్వాతే చట్టంలో సవరణలు తీసుకొచ్చినట్లు వివరించింది. పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై కొందరు పిటిషన్లు దాఖలు చేశారని కేంద్రం విమర్శించింది. వాటిని కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరింది. సవరణ చట్టంతో వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు మైనార్టీలుగా మారిపోతారన్న వాదనను కేంద్రం తిరస్కరించింది.
చట్టంతో వారికి ఎలాంటి నష్టం జరగదని, వక్ఫ్ బోర్డులో వారు మెజార్టీగా ఉంటారని తెలియజేసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్(సీడబ్ల్యూసీ)లో మొత్తం 22 మంది సభ్యులుంటారని, ఇందులో నలుగురు ముస్లిమేతరులు ఉంటారని వెల్లడించింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 5న తదుపరి విచారణ జరగనుంది. అప్పటిదాకా వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని, కేంద్ర వక్ఫ్ మండళ్లలో కొత్తగా నియామకాలు చేపట్టబోమని కేంద్రం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజాగా ప్రాథమిక కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేసింది.