
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై ఆరేళ్ల పాటు నిషేధం సరిపోతుంది
జీవితకాలం నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అవుతుంది
సుప్రీంలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలన్న వినతిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వారిపై అనర్హత వేటు వేయడం అనేది కేవలం పార్లమెంట్ పరిధిలోని అంశమని ఉద్ఘాటించింది. నిర్ణయాధికారం పార్లమెంట్‌దేనని పేర్కొంది. దీనితో న్యాయ వ్యవస్థకు సంబంధం లేదని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 8(1) ప్రకారం.. రాజకీయ నేతలు ఏవైనా క్రిమినల్ కేసుల్లో దోషులుగా నిరూపితమైతే వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. అలాంటి వారిపై కేవలం ఆరేళ్ల నిషేధం సరిపోదని, జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ గతంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 10వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నాయకులపై జీవితకాలం నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఆరేళ్లపాటు నిషేధం విధిస్తే సరిపోతుందని తేల్చిచెప్పింది. అయితే, దోషులుగా నిర్ధారణ అయిన నాయకులపై జీవితకాల నిషేధం విధించాలా? లేక ఆరేళ్లపాటు నిషేధం విధించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకొనే అధికారం పార్లమెంట్‌కే ఉందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment