convicts
-
బిల్కిస్ బానో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేప్ కేసులో ఇద్దరు దోషులకు శుక్రవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శిక్ష తగ్గింపును కొట్టివేస్తూ ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును సవాల్ చేస్తూ దోషులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనిలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సమాన సంఖ్యలో జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇచి్చన తీర్పుపై తామెలా విచారణ చేపట్టగలమని (రెండు ధర్మాసనాల్లోనూ సమంగా ఇద్దరేసి జడ్జీలు ఉన్నందువల్ల) ప్రశ్నించింది. 2002లో గోద్రా అలర్ల అనంతర ఘటనల్లో గర్భవతి బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురు హత్యకు గురుయ్యారు. ఈ కేసులో మొత్తం 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. భగవాన్‌దాస్ షా పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2022 మే 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష విధానానికి అనుగుణంగా షాను విడుదల చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో గుజరాత్ ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన బిల్కిస్ బానో కేసుల యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న 11 మందిని స్రత్పవర్తన కలిగి ఉన్నారనే కారణంతో క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తాయి. వివిధ రంగాలు చెందిన మేధావులు, ప్రముఖులు ఆరు వేల మంది దోషులకు శిక్ష మినహాయింపును రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఒక లేఖలో కోరారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 8న వారికి శిక్ష మినహాయింపు సరికాదని తీర్పునిచి్చంది. రెండు వారాల్లోగా దోషులందరూ జైలులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. విచక్షణాధికారాలను తప్పుగా వాడారని, అనైతిక పద్దతుల ద్వారా దోషులకు అనుకూలంగా వ్యవహరించారని గుజరాత్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి క్షమాభిక్షను ప్రసాదించే అధికార పరిధి కూడా ఆ రాష్ట్రానిదేనని, గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర అధికారాన్ని చట్టవిరుద్ధంగా లాక్కుందని పేర్కొంది. సమానబలం కలిగిన సుప్రీంకోర్టు ధర్మాసనాలు (రెండూ ద్విసభ్య ధర్మాసనాలే) శిక్ష మినహాయింపుపై పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని, విస్తృత ధర్మాసనానికి ఈ కేసును రిఫర్ చేయాలని పిటిషనర్లు కోరారు. ‘ఇదేం పిటిషన్. ఇది ఎలా విచారణార్హం అవుతుంది? ఇది పూర్తిగా తప్పుగా అర్థం చేసుకొని వేసిన పిటిషన్. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎలా వేస్తారు? సమాన సంఖ్య ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పును మేము సమీక్షించలేం’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లు శుక్రవారం స్పష్టం చేశారు. దీంతో పిటిషన్ల తరఫున న్యాయవాది రిషి మల్హోత్రా తమ వ్యాజ్యాన్ని ఉపసహరించుకోవడానికి అనుమతి కోరారు. ధర్మాసనం దీనికి సమ్మతించింది. భగవాన్‌దాస్ షా మధ్యంతర బెయిల్‌ను కూడా కోరారు. -
Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
న్యూఢిల్లీ: లోక్‌సభకు తాజాగా ఎన్నికైన 543 మందిలో 46 శాతం అంటే 251 మంది నేరచరితులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) నివేదించింది. ఈ 251 మందిలో 27 మంది దోషులుగా తేలారు. నేర చరితులు ఇంత భారీ సంఖ్యలో దిగువసభకు ఎన్నికవడం ఇదే మొదటిసారి అని ఏడీఆర్ పేర్కొంది. 2014 ఎన్నికల్లో 34 శాతం అంటే 185 మంది, 2009లో 30 శాతం అంటే 162 మంది, 2004లో 23 శాతం అంటే 125 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. -
‘బిల్కిస్’ దోషులు జైలుకు
గోధ్రా: బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు గుజరాత్‌లోని గోధ్రా సబ్ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం దోషులందరూ జనవరి 21వ తేదీ అర్ధరాత్రి జైలుకు వచ్చినట్లు స్థానిక క్రైం బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ దేశాయ్ ధ్రువీకరించారు. 2002లో గుజరాత్లో మత కలహాల సమయంలో బిల్కిస్ బానో అనే అయిదు నెలల గర్భవతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని దుండుగులు దారుణంగా చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి కోర్టు 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. అయితే, 14 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన వీరిని సత్ప్రవర్తన కలిగిన వారిగా పేర్కొంటూ 2022లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది. -
Bilkis Bano Case: సుప్రీంను ఆశ్రయించిన దోషులు
ఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో తాము లొంగిపోయే గడువును పెంచాలని కోరుతూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు నుంచి ఆరు వారాల పాటు పొడిగించాలని కోరుతూ ముగ్గురు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్లను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దోషులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యతను పేర్కొంటూ గడువు పొడిగింపును కోరాడు. తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి సమయం కావాలని, ఆరు వారాల పొడిగింపును కోరాడు. మూడవ దోషి మితేష్ చిమన్లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపును అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అఘాయిత్యం చోటు జరిగింది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే వీళ్లను విడుదల చేసింది. అయితే.. ఈ అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
నిఠారీ హత్యలు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశ్యవ్యాప్తంగా చర్చనీయాశమైన నిఠారీ హత్యల కేసులో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది.ముఖ్యంగా సురీందర్ కోలికి మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు కోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురీందర్ కోలీపై ఉన్న 12 కేసుల్లో నిర్దోషిగా తేల్చింది. అలాగే మరో నిందితుడు వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధేర్‌పై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషి అని కోర్టు సోమవారం నిర్ధారించింది. అత్యాచారం, హత్య ఆరోపణలపై దోషులుగా తేల్చిన ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ కోలీ, పంధేర్‌లు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్వీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్‌పై మొత్తం 6 కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా కోర్టు తేల్చిందని మోనీందర్ సింగ్ పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ వెల్లడించారు. 2006లో నోయిడాలోని నిథారీ ప్రాంతంలో మధ్య మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు కలకలం రేపాయి. 2006, డిసెంబరు 29న నోయిడాలోని నిథారీలోని పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో ఈ సంచల హత్యలు వెలుగులోకి వచ్చాయి. సురీందర్, పంధేర్ ఇంట్లో పనిమనిషిగా ఉండేవాడు. ఈ సందర్భంగా పిల్లలను మిఠాయిలు, చాక్లెట్లతో మభ్య పెట్టి ఇంట్లోకి రప్పించేవాడు. ఆ తరువాత పంధేర్వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడనేది ప్రధాన ఆరోపణ. బాధితుల్లో ఎక్కువ భాగం ఆ ప్రాంతం నుండి తప్పిపోయిన పేద పిల్లలు, యువతులవిగా గుర్తించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పిల్లల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడవేసేవారనీ సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాకుండా నరమాంస భక్షక ఆరోపణలు కూడా చేసింది. 2007లో పంధేర్, కోలీలపై సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. అయితే 19 కేసుల్లో మూడింటిని తొలగించిన సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా సురేంద్ర కోలీపై బాలికలపై అనేక అత్యాచారాలు , హత్యలకు పాల్పడి దాదాపు 10 కంటే ఎక్కువ కేసులలో మరణశిక్ష విధించాయి కోర్టులు. జూలై 2017లో, 20 ఏళ్ల మహిళ పింకీ సర్కార్ హత్య కేసులో స్పెషల్ CBI కోర్టు పంధేర్, కోలీలను దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్ హైకోర్టుకూడా సమర్ధించింది. అయితే, కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయంలో జాప్యంకారణంగా దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఈ నిఠారీ హత్యల్లో మరో బాధితురాలు 14 ఏళ్ల రింపా హల్దార్ హత్య, అత్యాచారానికి సంబంధించి 2009లో సాక్ష్యాలు లేకపోవడంతో పంధేర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. #WATCH | Manisha Bhandari, lawyer of Nithari case convict Moninder Singh Pandher, in Prayagraj, Uttar Pradesh "Allahabad High Court has acquitted Moninder Singh Pandher in the two appeals against him. There were a total of 6 cases against him. Koli has been acquitted in all… pic.twitter.com/BYQHeu3xvz — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023 -
మనీ లాండరింగ్ కేసుల్లో 93 శాతం నేర నిరూపణలు
న్యూఢిల్లీ: దేశంతో గత తొమ్మిదేళ్లలో మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 93.54 శాతం నేరాలను నిరూపించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద 31 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసిందని, ఇందులో 29 కేసుల్లో 54 మందిని దోషులుగా గుర్తించిందని వెల్లడించారు. పీఎంఎల్ఏ కింద నేర నిరూపణ రేటు 93.54 శాతం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈడీ గత తొమ్మిదేళ్లలో రూ.16,507.86 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని తెలియజేశారు. -
గోద్రా కేసు..దోషులకు సుప్రీంకోర్టులో ఊరట
ఢిల్లీ: గోద్రా రైలు దహనం కేసులో దోషులకు ఎట్టకేలకు ఊరట లభించింది. గుజరాత్ అల్లర్లకు కారణమైన గోద్రా సబర్మతి రైలు దహనం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఎనిమిది మందికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే మరో నలుగురికి మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు శుక్రవారం బెయిల్ ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది మంది 17 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించిన కారణంగా వాళ్లు బెయిల్‌కు అర్హులేనని ప్రకటించింది ధర్మాసనం. అయితే ఈ నేరంలో మరో నలుగురి పాత్ర తీవ్రత దృష్ట్యా వాళ్లకు బెయిల్ అభ్యర్థలనలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. 👉 2002, ఫిబ్రవరి 27వ తేదీన గుజరాత్ గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లను తగలబెట్టారు. ఈ దుర్ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయోధ్య కరసేవకు వెళ్లి తిరిగి వస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఆ మరుసటి రోజు నుంచి గుజరాత్ భగ్గుమంది. ఈ పరిణామం.. గుజరాత్ అల్లర్లకు కారణమైంది. 👉 2011లో స్థానిక కోర్టు(ట్రయల్ కోర్టు) గోద్రా ఘటనకు సంబంధించి కేసులో.. 31 మందిని నిందితులుగా, 63 మంది నిర్దోషులుగా ప్రకటించింది. పదకొండు మందికి మరణశిక్ష, 20 మందికి జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు. 👉 ఈ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. గుజరాత్ హైకోర్టు 31 మందినీ దోషులుగానే ప్రకటించింది. కానీ, ట్రయల్ కోర్టు విధించిన 11 మంది మరణశిక్షను మాత్రం జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు ఇచ్చింది. 👉 గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. 2018లో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. అది అప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది. 👉 ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన బెయిల్ కోసం దోషులు పిటిషన్లు వేసుకోగా.. కొందరి బెయిల్ పిటిషన్లను(ట్రయల్ కోర్టు మరణ శిక్ష ఖరారు చేసిన దోషులకు) సుప్రీం కోర్టు తిరస్కరించింది. అయితే.. జీవిత ఖైదు పడిన వాళ్లకు మాత్రం బెయిల్ అభ్యర్థనలను పరిశీలిస్తామని పేర్కొంది. అంతకు ముందు.. 👉 సోమవారం ఏప్రిల్ 17వ తేదీన సుప్రీం కోర్టులో దోషుల బెయిల్ అభ్యర్థనలపై విచారణ సందర్భంగా.. గుజరాత్ ప్రభుత్వం ఈ కేసులో గట్టి వాదనలే వినిపించింది. దోషులు తీవ్ర నేరాలను పాల్పడ్డారని, బోగీలకు బయటి నుంచి డోర్లను బిగించి మరీ మారణకాండకు పాల్పడ్డారని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. అయితే ఇప్పటికే పదిహేడేళ్ల శిక్షఅనుభవించిన విషయాన్ని గుర్తు చేస్తూ దోషుల తరపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. 👉 ఇక ఇవాళ్టి వాదనల తర్వాత ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది సీజేఐ నేతృత్వంలోని బెంచ్. ఇదీ చదవండి: గుజరాత్ అల్లర్ల కేసు.. బీజేపీ నేతను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు -
బిల్కిస్ బానో దోషులకు ఇదోరకం శిక్ష!
గాంధీనగర్: బిల్కిస్ బానోస్ సామూహిక అత్యాచార కేసులో దోషులకు క్షమాభిక్ష.. తదనంతర సన్మాన ఘట్టం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వాళ్లను మళ్లీ కటకటాల వెనక్కి పంపాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే.. జైలు నుంచి విడుదలయ్యాక ఆ పదకొండు మందిలో చాలావరకు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలీసులు మాత్రం వాళ్ల కదలికలపై నిఘా పెట్టి ఉంచగా.. సొంత వూరిలోనే అవమానాలు, ఛీత్కారాలు, బెదిరింపులతో భయంభయంగా గడుపుతున్నాయి దోషుల కుటుంబాలు. గుజరాత్‌లోని రంధిక్పూర్లో.. చాలావరకు దోషుల ఇళ్లకు తాళాలు ఉన్నాయ్. అక్కడంతా నిశబ్ద వాతావరణం నెలకొంది. తమ విడుదలపై విమర్శలు చెలరేడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ మళ్లీ అరెస్ట్ చేస్తారో.. అక్రమ కేసులు బనాయించి కటకటాల వెనక్కి నెడతారేమో అని ఊరి వదిలి పారిపోయినట్లు బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన వివరణ ద్వారా తెలుస్తోంది. బిల్కిస్ బానోస్‌పై అఘాయిత్యం జరిగే సమయంలో.. శైలేష్ భట్ బీజేపీ క్రియాశీలకగా నేతగా ఉన్నాడు. ఆ సమయంలోనే శైలేష్ భట్, మిటేష్ భట్లు ఇళ్లలో ఉండేవాళ్లు కారని.. రాజకీయాలంటూ తిరిగేవాళ్లని చుట్టుపక్కల వాళ్లు చెప్తున్నారు. ఆగష్టు 15న రెమిషన్ మీద విడుదలయ్యాక ఈ ఇద్దరు ఇళ్లకు తాళాలు వేసుకుని ఎటో వెళ్లిపోయారు. మరో దోషి రాధేశ్యామ్ షా ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి. ఇక మరో నిందితుడు బకాభాయ్ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆ కుటుంబం మరో చోట గుడారం వేసుకుని జీవిస్తోంది. అయితే తన భర్త జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి గ్రామస్తులు కొందరు ఆయన్ని వెంబడించి.. ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని బకాభాయ్ భార్య మంగ్లీబెన్ చెబుతోంది. ఆ భయంతో తన భర్త బయటకు రావడం మానేశాడని ఆమె అంటోంది. అంతేకాదు.. తప్పుడు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపుతామంటూ కొందరు ఆయన్ని బెదిరిస్తున్నారని ఆమె వాపోతోంది. దోషుల్లో నలుగురైదుగురిది మాత్రమే ఉన్నత కుటుంబాలు. మిగతా కుటుంబాలు కూలీనాలీ చేసుకుని బతికేవే!. గ్రామస్థుల నుంచి ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీ నుంచి దోషుల కుటుంబాలపై అప్రకటిత బహిష్కరణ నడుస్తోంది. అప్పటిదాకా కూలీనాలీ పనులు చేసుకుంటూ పోతున్న ఆ కుటుంబాలకు(ఐదారు).. వాళ్లు విడుదలయ్యాక ఉపాధి లేకుండా పోయింది. వెలివేత, చిన్నచూపు తప్పడం లేదు. తప్పు చేసింది ఒకరైతే.. శిక్ష తాము అనుభవించాల్సి వస్తోందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఇప్పుడు. ఇదీ చదవండి: బొగ్గు కుంభకోణం: ఇప్పుడు ఆ మంత్రిపై సీబీ‘ఐ’ -
28 ఏళ్ల తర్వాత సిస్టర్ అభయ హత్య కేసులో తీర్పు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో 1992లో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళశారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది. రేపు(డిసెంబర్23) దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది. 1992, మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ హత్యకు గురైంది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్, నన్ సెఫీ హత్య చేసినట్లు నికోర్టు నిర్ధారించింది. 28 ఏళ్ల తర్వాత అభయ హత్య కేసులో తీర్పు వెలువడింది. చదవండి: 9 కంపెనీలు.. 9 బ్యాంకులు.. రూ.9వేల కోట్లు కేసు వివరాలు.. 1992లో సిస్టర్ అభయ(21) కేరళలోని బీఎంసీ కళాశౠలలో సైకాలజీ కోర్సు చేస్తోంది. ఆ సమయంలో థామస్ కొట్టూరు సైకాలజీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 27న కొట్టాయంలోని సెయింట్ పియస్ ఎక్స్ కాన్వెంట్లో ఉన్న ఓ బావిలో అభయ శవమై తేలింది. ప్రమాదవశాత్తు అభయ బావిలో పడి మరణించి ఉండవచ్చునని పోలీసులు తొలుత నిర్దారించారు. కానీ మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెన్‌పురక్కల్ ఈ కేసును కోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం దీని విచారణను 1993లో సీబీఐకి అప్పగించింది. అనంతరం సిస్టర్ అభయ హత్యకు గురైందని సీబీఐ తేల్చింది. ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత సెయింట్ పియస్ కాన్వెంట్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న థామస్ కొత్తూర్, జోస్ పుత్రుక్కయిల్‌తో పాటు ఓ సిస్టర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం... మార్చి 27,1992న తెల్లవారుజామున 4.15గంటలకు సిస్టర్ అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్ వైపు వెళ్లింది. అక్కడ థామస్ కొత్తూర్,జోస్ పుత్రుక్కయిల్ ఓ క్రైస్తవ సన్యాసినితో అభ్యంతరకర రీతిలో కనిపించారు. ఈ విషయం అభయ ఎక్కడ బయటపెడుతుందోమోనన్న భయంతో ఆమెపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతదేహాన్ని కాన్వెంట్ ప్రాంగణంలోని బావిలో విసిరేశారు. తమ కుమార్తెకు న్యాయం జరగాలని చాలాకాలంగా ఎదురుచూసిన అభయ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే మరణించారు. ఎట్టకేలకు 28 ఏళ్ల తర్వాత ఈ కేసు ఓ కొలిక్కి వచ్చి థామస్. నన్ సెఫీని దోషులుగా తేల్చుతూ న్యాయస్థానం తీర్పిచ్చింది. -
నిర్భయ దోషులకు ఉరి: చివర్లో ఉత్కంఠ
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరితీయ బడ్డ నలుగురు దోషులు అద్భుతం జరుగుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష వేయకుండా నిలిపివేస్తారని ఆశ పడ్డారని తెలిపాయి. కోర్టు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని పదేపదే అడిగారని జైలు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో విచారణ జరగడంతో చివరి నిమిషంలో తమకు మరణదండన తప్పుతుందన్న ఆశ నలుగురు నేరస్తుల్లో కనిపించినట్టు చెప్పారు. తీహర్ జైలులోని 3వ నంబర్ బరాక్‌లో ఉన్న దోషుల చివరి నిమిషం వరకు ’కోర్టు నుంచి ఏదైనా వర్తమానం వచ్చిందా’ అన్న ప్రశ్న తమకు ఎదురైందని వెల్లడించారు. ఉదయం 5.30 గంటలకు ఉరితీసే వరకు తమకు కాపలా ఉన్న 15 మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారట. (ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!) లడ్డూలు, నూడుల్స్ అడిగారు నలుగురు దోషులకు గురువారం మధ్యాహ్నం రోజూ మాదిరిగా ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఇచ్చారు. ప్రత్యేకంగా ఏమి అడగలేదని, అందరూ లంచ్ చేశారని జైలు అధికారులు తెలిపారు. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. అక్షయ్, పవన్ రాత్రి భోజనం చేయలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముకేశ్, అక్షయ్, వినయ్ తమకు లడ్డూలు, నూడుల్స్ కావాలని అడగడంతో వాటిని తెప్పించి పెట్టినట్టు వెల్లడించారు. గురువారం రాత్రి 11 గంటలకు దోషులు నలుగురికి న్యాయవాది, మానసిక వైద్యుడి సమక్షంలో చివరిసారిగా వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్ (పశ్చిమ) డెత్‌వారెంట్‌ను దోషులకు చదివి వినిపించారు. ఉరిశిక్షకు భయపడిన పవన్ కాసేపు గలాభా సృష్టించడంతో అతడి వద్ద ఎక్కువ మంది పోలీసులను ఉంచారు. జైలు సిబ్బంది ఇచ్చిన బట్టలు వేసుకునేందుకు అతడు నిరాకరించాడు. ‘మేము ఇచ్చిన బట్టలను వేసుకోకుండా నేలకేసి కొట్టాడు. తనను క్షమించాలని ఏడుస్తూ వేడుకున్నాడు. ఉరి కంబం దగ్గరకు తీసుకెళుతుండగా దోషులందరూ తమను క్షమించాలని కన్నీళ్లు పెట్టుకుంటూ అర్ధించార’ని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. (నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి తగలబెట్టేవాడిని..) 8వ నంబర్ సెల్ ఉన్న వినయ్ శర్మ, ముఖేష్ సింగ్.. ఒకటో నంబర్‌సెల్ ఉన్న పవన్ గుప్తా, ఏడో నంబర్ సెల్లో ఉన్న అక్షయ్ సింగ్‌లను భద్రత సిబ్బంది ఉరికంబం వద్దకు తీసుకొచ్చారు. వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్‌లను ఒకేసారి ఉరి తీశారు. ఆ సమయంలో జిల్లా మేజిస్ట్రేట్, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు సహాయ సూపరింటెండెంట్స్, వార్డెన్, వైద్యాధికారి, ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ ఉన్నారు. యూపీలోని మీరట్‌కు చెందిన తలారి పవన్ జలాద్‌కు ఒక్కో ఉరికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.60 వేలు చెల్లించినట్టు సమాచారం. జైలులో పనిచేసిన సంపాదించిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని దోషులు చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2 వేల నుంచి మూడు వేల వరకు ఉన్నట్టు సమాచారం. డబ్బుతో పాటు వారి బట్టలు, దుప్పట్లను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. (తలారికి లక్ష నజరానా.. జైలు వద్ద హడావుడి) -
‘నిర్భయ’దోషులకు ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ తల్లిదండ్రుల ఏడేళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. 2012లో రాజధాని నడిబొడ్డున నడుస్తున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయని అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషులైన ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31)లను శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరితీశారు. ఇలా ఒకేసారి నలుగురికి ఉరి శిక్ష అమలు చేయడం తీహార్ జైలు చరిత్రలో ఇదే మొదటిసారి ప్రాణాల మీద ఆశతో దోషులు చివరి వరకు ఉరిశిక్ష అమలును ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకుంటూ ఆఖరి వరకు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. దాంతో, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వారి ఉరిపై సందిగ్ధత నెలకొంది. గురువారం రాత్రి పవన్ గుప్తా పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు అత్యవసర విచారణ చేపట్టాయి. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రెండోసారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పవన్ గుప్తా వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు బెంచ్ అసాధారణ రీతిలో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రారంభించింది. గంటపాటు జరిగిన వాదనల అనంతరం ఆ పిటిషన్‌ను బెంచ్ కొట్టివేసింది. దాంతో, ఉరి శిక్ష అమలు చేయడానికి చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉరిశిక్ష అమలుకు ముందు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినివ్వాలని అక్షయ్ సింగ్, పవన్ గుప్తా పెట్టుకున్న అభ్యర్థనను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇది జరిగిన మూడు గంటల్లోనే తీహార్ జైలు అధికారులు నలుగురికీ ఉరి శిక్ష అమలు చేశారు. నిబంధనల ప్రకారం.. ఉరి వేసిన తరువాత అరగంట పాటు వారిని ఉరికంబానికే వేలాడదీసి ఉంచారని జైలు అధికారులు తెలిపారు . ‘ఉరిశిక్ష అనంతరం డాక్టర్లు పరీక్షించారు. నలుగురూ మృతి చెందారని నిర్ధారించారు’ అని ఆ తరువాత తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ ప్రకటించారు. ఆ తరువాత డీడీయూ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించామన్నారు. అక్షయ్, ముఖేష్‌ల మృతదేహాలను బిహార్, రాజస్తాన్‌ల్లోని తమ తమ గ్రామాలకు వారు తీసుకెళ్లారని చెప్పారు. వినయ్, పవన్‌ల మృతదేహాలను ఢిల్లీలో రవిదాస్ క్యాంప్‌లో ఉన్న వారి ఇళ్లకు తరలించామన్నారు. చివరి క్షణాలు ఒకవైపు కోర్టులో వాదనలు జరుగుతున్నా.. తీహార్ జైలు అధికారులు ఉరిశిక్ష అమలుకు సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. గురువారం రాత్రి నుంచే మొత్తం జైలుని లాక్డౌన్ చేశారు. దోషులు నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచారు. రాత్రి డిన్నర్‌ని ముఖేష్, వినయ్ రోజూ మాదిరిగా ఇచ్చిన టైమ్‌కి తినేశారు. వారికిచ్చిన ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఉన్నాయి. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. ఆ తర్వాత అతను ఏం తీసుకోలేదు. పవన్ గుప్తా కూడా ఆహారం తీసుకోవడానికి నిరాకరించాడు. వారిలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని, రాత్రంతా కూడా వారు ముభావంగానే గడిపారని జైలు అధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత లాంఛనాలు పూర్తి చేయడానికి తెల్లవారు జామున 3.30 గంటలకి ఆ దోషులు నలుగురిని నిద్ర లేపడానికి అధికారులు వెళ్లారు. అయితే వారు మేలుకొని ఉన్నారు. రాత్రంతా వారు నిద్రలేకుండానే గడిపారని జైలు అధికారులు వెల్లడించారు. స్నానం చేయడానికి, అల్పాహారం తినడానికి ఇష్టపడలేదు. నిర్వికారంగానే ఉరికంబం వైపు అడుగులు వేశారు. ఒకరి ఆత్మహత్య.. మరొకరి విడుదల దోషులుగా తేలి, ఉరిశిక్షకు గురైన నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులుగా విచారణ ఎదుర్కొన్నారు. విచారణ జరుగుతుండగానే.. ఆ ఇద్దరిలో రామ్‌సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు నేరం జరిగిన సమయానికి మైనర్ కావడంతో.. నిర్బంధ వసతి గృహంలో మూడేళ్లు శిక్ష అనుభవించి 2015 సంవత్సరంలో విడుదల అయ్యాడు. ప్రధాని మోదీ హర్షం నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. నిర్భయ కేసును ప్రస్తావించకుండా.. ‘న్యాయం గెలిచింది. మహిళల గౌరవం, భద్రత మనకు అత్యంత ముఖ్యమైన విషయం. మన మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మహిళల సాధికారతపై ప్రధానంగా దృష్టి పెట్టే.. మహిళలకు సమానత్వం, సమాన అవకాశాలు లభించే సమాజాన్ని మనమంతా కలిసి నిర్మించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, మహిళలపై హింసను నివారించేందుకు మరణశిక్ష ఏ నాటికి పరిష్కారం కాబోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. ఈ ఉరి శిక్ష భారతదేశ మానవహక్కుల చరిత్రలో ఒక మరకలా నిలిచిపోతుందని పేర్కొంది. ఆఖరి కోరికలివే ఉరికంబం ఎక్కడానికి ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తన అవయవాలను దానం చేశాడు. అదే తన ఆఖరి కోరికని చెప్పాడు. వినయ్ తాను జైల్లో ఉన్నప్పుడు వేసిన పెయింటింగ్‌లను జైలు సూపరింటెండెంట్‌కి ఇవ్వమని కోరాడు. తాను చదివే హనుమాన్ చాలీసా తన కుటుంబసభ్యులకు ఇవ్వమని చెప్పినట్టు జైలు అధికారి వెల్లడించారు. ముఖేష్, వినయ్, పవన్, అక్షయ్ ఎవరూ ఎలాంటి విల్లు రాయలేదని ఆ అధికారి చెప్పారు. విజయ సంకేతం చూపుతున్న నిర్భయ తల్లిదండ్రులు, లాయర్లు సీమా కుష్వాహ, జితేంద్ర ఝా 2012 నుంచి 2020 వరకు న్యూఢిల్లీ: నిర్భయ ఘటన 2012 డిసెంబర్ 16న చోటు చేసుకోగా, దోషులకు ఉరిశిక్ష 2020 మార్చి 20న అమలైంది. ఏడు సంవత్సరాలకు పైగా ఈ కేసు విచారణ సాగింది. దోషులుగా తేలి, ఉరిశిక్షను నిర్ధారించిన తరువాత కూడా కేసును సాధ్యమైనంత సాగదీశారు. విచారణ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కార్యాలయం చుట్టూ పలుమార్లు ఈ కేసు చక్కర్లు కొట్టింది. చివరగా, మార్చి 5న ట్రయల్ కోర్టు మార్చి 20న ఉరిశిక్షను అమలు చేయాలని డెత్ వారెంట్లను జారీ చేసింది. ‘నిర్భయ’ తలారికి లక్ష నజరానా యశవంతపుర: నిర్భయ హంతకులను ఉరి తీసిన తలారి పవన్ జల్లూద్కు రూ.లక్ష నజరానా ప్రకటించినట్లు నటుడు జగ్గేశ్ ట్వీట్ చేశారు. హంతకులను ఉరితీసే వ్యక్తికి రూ. లక్ష బహుమతిగా ఇస్తానని గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉరితీతతో సత్యం, ధర్మానికి న్యాయం లభించిందన్నారు. ఈ డబ్బుతో తన కుమార్తె వివాహం చేస్తానని జల్లూద్ గతంలో పేర్కొనడాన్ని జగ్గేష్ గుర్తు చేశారు. జైలు వద్ద నినాదాలు తీహార్ జైలు వెలుపల గురువారం రాత్రంతా జనం హడావుడి కనిపించింది. కరోనా భయాన్ని కూడా పక్కనపెట్టి వందలాది మంది గుమిగూడారు. దోషులను ఉరి తీశారన్న వార్త వినగానే జాతీయ జెండాను ఎగురవేస్తూ లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేశారు. న్యాయం దక్కింది నిర్భయ దోషులకు ఉరిశిక్షపై పలువురు ప్రముఖుల హర్షం న్యూఢిల్లీ/బెంగళూరు: నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ సహా, పలువురు కేంద్రమంత్రులు, మహిళా సంఘాలు సానుకూలంగా స్పందించాయి. పలువురు రాజకీయ నేతలు న్యాయనిపుణులు హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష అమలును పలువురు కేంద్ర మంత్రులు స్వాగతించారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాలకు కఠిన శిక్షలు అమలు చేయాలని బాలీవుడ్ ప్రముఖులు రిషి కపూర్, తాప్సీ పన్ను, రితేశ్ దేశ్‌ముఖ్ తదితరులు పేర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాత్రం.. మహిళలపై అత్యాచారాలకు దోషులకు మరణ శిక్ష విధించడం ఏమాత్రం పరిష్కారం కాదని తెలిపింది. భారత్ మానవహక్కుల రికార్డుపై ఈ ఘటనను మాయని మచ్చగా అభివర్ణించింది. దోషులకు కఠిన శిక్షలు పడేలా నిర్భయ తల్లి సాగిస్తున్న పోరాటాన్ని స్వయంగా చూశాం. ఇందుకు కొంత సమయం తీసుకున్నా, చివరికి ఆ కుటుంబానికి న్యాయం దక్కినందుకు సంతోషంగా ఉంది. నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుతో నేరగాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని గట్టి హెచ్చరిక పంపినట్లయింది. –మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నిర్భయ ఘటనల వంటివి భవిష్యత్తులో జరక్కుండా చూస్తామని ఈ సమయంలో మనమంతా ప్రతినబూనాలి. ఏ కూతురికీ ఇలాంటి ఆపద రాకూడదు. వ్యవస్థలో లోపాలను అధిగమించేందుకు పోలీసులు, కోర్టులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలి. –ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర వేదనను అనుభవించిన ఒక కూతురు నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. మరణశిక్ష అమల్లో జాప్యం అయ్యేలా దోషులు తప్పుదోవ పట్టించకుండా ఇకపై న్యాయవ్యవస్థ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. –కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ నిర్భయకు ఎట్టకేలకు న్యాయం దొరికింది. ఆమె ఆత్మకు శాంతి లభించింది. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయడం మిగతా వారికి హెచ్చరికలా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఈ కేసు బయటపెట్టింది. వీటిని నలుగురు దోషులు వాడుకున్నారు. –జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ నిర్భయ నివాసంలో హర్షం దోషులకు ఉరిశిక్ష అమలు శుక్రవారంనాడు పూర్తి కావడంతో పశ్చిమ ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నిర్భయ కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగువారు సంతోషం వ్యక్తం చేశారు. నిర్భయ కుటుంబసభ్యులను కలిసేందుకు జనం క్యూ కట్టారు. ఈ సందర్భంగా వారంతా స్వీట్లు పంచుకున్నారు. పాటలు పాడుకుంటూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి మా ఇంటి ఆవరణలో నిర్భయకు నివాళిగా రోజూ కొవ్వొత్తులను వెలిగిస్తున్నాం. ఇటీవల ఒక రోజు రాత్రి భారీ వర్షం కురిసినా కూడా ఒక కొవ్వొత్తి వెలుగుతూనే ఉండటం గమనించాం. దీనిని మేం శుభ సూచికంగా భావించాం’అని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ తెలిపారు. నిర్భయ దోషుల మృతదేహాలతో ఆస్పత్రి వద్దకు వచ్చిన వ్యాన్ -
డమ్మీ ఉరి పూర్తి, 20న ఉరి శిక్ష అమలు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర్భయ సామూహిక హత్యాచార కేసులో దోషుల ఉరి శిక్ష అమలుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం తలారి పవన్ జల్లాద్ డమ్మీ ఉరి కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 20 న ఉరి తీయడానికి రెండు రోజుల ముందే తీహార్ జైలులో నలుగురు మరణశిక్షకు సంబంధించి డమ్మీ ఉరిని నిర్వహించినట్టు తలారి పవన్ బుధవారం తెలిపారు. మంగళవారం మీరట్ నుండి వచ్చి తాడులను పరీక్షించడానికి డమ్మీ ఉరిశిక్షను అమలు చేశామన్నారు. తీహార్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మరోసారి అన్ని సన్నాహాలతో, బుధవారం 'డమ్మీ ట్రయల్' జరిగినట్టు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ తెలిపారు. జైలు నెంబర్ -3 ఉరి గదిలో జైలు అధికారుల సమక్షంలో దీన్ని నిర్వహించామని, ఉరి శిక్ష అమలుకు ముందు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విషయమని ఆయన తెలిపారు. తద్వారా ఉరి సమయంలోఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్ధారించుకునేందుకు డమ్మీ ట్రయల్ ఉంటుందన్నారు. ఇది అరగంట పాటు కొనసాగిందని సీనియర్ అధికారి చెప్పారు. మరోవైపు శిక్ష ఖరారైనప్పటినుంచి దోషులు నలుగురు న్యాయ పరమైన అవకాశాలను వినియోగించు కుంటూ, శిక్ష అమలుపై అవరోధాలతో మరణ శిక్షనుంచి విజయవంతంగా తప్పించుకుంటున్నారు. తాజాగా విడాకులు ఇప్పించాల్సిందిగా అక్షయ్ భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఇది ఇలా వుంటే ఉరిశిక్ష అమలు పై స్టే విధించాలని కోరుతూ దోషులు మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసిన కోర్టు, నిర్భయ దోషుల తాజా పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించనున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 20 ఉరి శిక్ష అమలవుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ కేసులో ఆరుగురు దోషలుగా తేలగా, విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల తరువాత తిహార్ జైలులో ఆరవ నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ జువైనల్ హోంనుంచి విడుదలయ్యాడు. మిగిలిన దోషులు నలుగురు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లకు విధించిన ఉరిశిక్ష అమలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు శిక్ష అమలు కావాల్సి వుంది. -
ఉరి మళ్లీ వాయిదా
-
నిర్భయ దోషులకు రేపే ఉరి ...
-
నిర్భయ దోషులకు రేపే ఉరి..!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ తొలగింది. డెత్‌వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు నిరాకరించింది. దీంతో రేపు(మార్చి 3) ఉదయం 6గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. మరోవైపు తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. దీంతో నలుగురు దోషులకు రేపు తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు అయ్యే అవకాశం ఉంది. (చదవండి : మార్చి 3న ఉరితీయండి ) అయితే పవన్‌కి ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. మరో వైపు ఈ కేసులో ఉరి అమలు వాయిదా పడేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అన్నీ అడ్డంకులు తొలిగిపోవడంతో రేపు ఉదయం ఆరు గంటలకు నలుగురు నిందితులను తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. -
‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు!
న్యూఢిల్లీ: తీహార్ జైలు అధికారులు తమకు సహకరించడం లేదంటూ నిర్భయ దోషులు ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను అధికారులు ఇవ్వడం లేదని ఉరిశిక్ష పడిన నలుగురిలో ముగ్గురు శుక్రవారం కోర్టులో పిటిషన్లు వేశారు. వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌కు అవసరమైన 70 పేజీల డైరీ ప్రతితోపాటు అక్షయ్‌కుమార్ సింగ్, పవన్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్లకు జైలు అధికారులు కొన్ని పత్రాలను ఇవ్వాల్సి ఉందని అందులో తెలిపారు. అవి లేనందున వెంటనే దరఖాస్తు చేయలేకపోయామని, వాటిని వెంటనే ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకోసం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భావించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పటియాలా హౌస్ కోర్టులో వేసిన ఈ పిటిషన్లు శనివారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. కాగా, వినయ్, ముకేశ్ సింగ్‌లు ఆఖరిప్రయత్నంగా వేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతోపాటు ముకేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరిశిక్ష అమలును పలు విధాలుగా సవాలు చేస్తూ కాలం గడిపేయొచ్చనే అభిప్రాయం దోషుల్లో ఏర్పడరాదంటూ గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని పటియాల కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలలోపు నలుగురు దోషులు వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31), ముఖేష్ కుమార్ (32), పవన్(26)లకు మరణశిక్ష విధించనున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులను చివరిసారిగా చూసుకునే అవకాశం దోషులకు కల్పించాలనేది అనవాయితీ. అయితే మీ చివరి కోరిక ఏంటని జైలు అధికారులు దోషులను ప్రశ్నించినప్పడు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గర పడుతుండటంతో దోషుల తల్లిదండ్రులుకు జైలు అధికారులు ఓ వర్తమానం పంపారు. ‘నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఫిబ్రవరి 1న ఉరితీస్తున్నాం. ఈలోపు మీ పిల్లల్ని చివరి సారిగా చూసుకోవడానికి ఉరితీసే సమయంలో లోపు జైలుకు రావచ్చు’ అని సమాచారం ఇచ్చారు. (చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు) కాగా ఉరిశిక్ష అమలుకు అధికారులు జైలు నెం3లో ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇసుక బస్తాలతో ట్రైల్స్ కూడా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్ జల్లద్ నలుగురు దోషులను ఉరితీయనున్నారు. కాగా అనేక ఉత్కంఠ పరిణామాలు, రివ్యూ పిటిషన్ల కొట్టివేత అనంతరం వారి ఉరికి రంగం సిద్ధమైంది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు దోషులు చేయని ప్రయత్నలు లేవు. చివరికి సుప్రీంకోర్టు కూడా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
చివరి కోరికపై మౌనంగా నిర్భయ దోషులు
-
బ్రజేశ్ ఠాకూర్ దోషే
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఒక షెల్టర్ హోంలో బాలికలపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు బ్రజేశ్ ఠాకూర్‌ను ఢిల్లీలోని పోక్సో కోర్టు సోమవారం దోషిగా తేల్చింది. ఠాకూర్, మరో 18 మంది దోషులేనని స్పష్టం చేసింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, లైంగిక దాడి, లైంగిక వేధింపులు, బాలికలకు డ్రగ్స్ ఇవ్వడం, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం.. తదితర నేరారోపణలపై బ్రజేశ్ ఠాకూర్, ఆ వసతి గృహం సిబ్బంది, బిహార్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని పలువురు ఉద్యోగులపై ఈ కేసు నమోదైంది. ముజఫర్‌పూర్‌లో ఠాకూర్ నిర్వహిస్తున్న వసతి గృహంలో జరిగిన ఈ దారుణాన్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెన్ 2018లో వెలుగులోకి తెచ్చింది. బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం తదితర నేరాలకు సంబంధించి పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం), భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఆయనను న్యాయమూర్తి సౌరభ్ కులశ్రేష్ట దోషిగా నిర్ధారించారు. ఏ శిక్ష విధించాలనే విషయమై ఈ నెల 28న వాదనలు వింటామని న్యాయమూర్తి ప్రకటించారు. పైన పేర్కొన్న నేరాలకు యావజ్జీవం పడే అవకాశముంటుంది. ముజఫర్‌పూర్‌లోని చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రోజీ రాణిని కూడా కోర్టు దోషిగా పేర్కొంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ దిలీప్ కుమార్ వర్మ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవి రోషన్ సహా మిగతా 17 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని ఠాకూర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో సీబీఐ హాజరుపర్చిన 69 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది. వేధింపులకు గురైన 44 మంది బాలికల వాంగ్మూలాలను తీసుకుంది. ఆ బాలికల్లో 13 మంది మానసికంగా సరైన ఎదుగుదల లేనివారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజువారీ విచారణ చేపట్టి ఆర్నెల్లలో విచారణను కోర్టు ముగించింది. బ్రజేశ్‌తో తన భర్తకు సంబంధాలున్నాయన్న ఆరోపణ రావడంతో బిహార్ మంత్రి మంజు వర్మ పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019లో ఈ కేసును ముజఫర్‌పూర్ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో కోర్టుకు బదిలీ చేశారు. -
సోనియా అంత మనసు లేదు
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ దోషులను క్షమించాలంటూ సుప్రీంకోర్టు లాయర్ ఇందిరా జైసింగ్ చేసిన సూచనపై ‘నిర్భయ’ తండ్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి సలహా ఇచ్చినందుకు జైసింగ్ సిగ్గుపడాలన్నారు.. తమకు సోనియా గాంధీ అంత పెద్ద మనసు లేదని వ్యాఖ్యానించారు. మరణశిక్షను తీవ్రంగా వ్యతిరేకించే జైసింగ్ శుక్రవారం ఒక ట్వీట్ చేస్తూ... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను క్షమించినట్టుగానే ఈ కేసు దోషులను నిర్భయ తల్లిదండ్రులు క్షమించాలని సూచించారు. ఒక తల్లిగా నిర్భయ తల్లిదండ్రుల బాధను తాను అర్థం చేసుకోగలనని, కాకపోతే మరణశిక్ష మాత్రం సరికాదని ఇందిరా జైసింగ్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు. రాజీవ్ హంతకురాలు నళినీ శ్రీహరన్‌కు న్యాయస్థానం మరణ శిక్ష విధించగా.. సోనియాగాంధీ జోక్యం చేసుకుని ఆమెను క్షమించినట్లు ప్రకటించారు. ఆ తరువాత ఆమెకు పడ్డ మరణశిక్ష కాస్తా యావజ్జీవ కారాగార శిక్షగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాలన్నింటిపై నిర్భయ తండ్రి స్పందిస్తూ.. ఇందిరా జైసింగ్ సూచనను తోసిపుచ్చారు. మహిళగా ఉంటూ అలాంటి సలహా ఇచ్చినందుకు ఆమె నిర్భయ తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఏడేళ్లుగా మేము ఈ కేసుపై పోరాడుతున్నాం. మేము రాజకీయ నాయకులము కాము. సామాన్యులము. మా హృదయాలు సోనియా గాంధీ అంత విశాలం కాదు’’ అని స్పష్టం చేశారు. ఇందిరా జైసింగ్ చేస్తున్న వ్యాఖ్యల వంటివే దేశంలో అత్యాచారాలు పెరిగిపోయేందుకు కారణమని అన్నారు. నిర్భయ తల్లి కూడా తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. సామూహిక అత్యాచారం వంటి క్రిమినల్ కేసుల్లో పడే శిక్షపై దోషులను క్షమించమని బాధితుల కుటుంబ సభ్యులు చెప్పడంతో ఏమీ మారిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘‘న్యాయ వ్యవస్థ పరంగా చూస్తూ బాధితురాలి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు అనే విషయానికి విలువ లేదు. న్యాయస్థానాలు చట్టం ప్రకారమే నడుచుకుంటాయి. పైగా సోనియాగాంధీ మాదిరిగా నిర్భయ దోషులను క్షమించాలన్న ఇందిరా జైసింగ్ సలహాను నిర్భయ తల్లిదండ్రులు తోసిపుచ్చుతున్నారు’’ అని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేదీ తెలిపారు. అయితే రాష్ట్రపతికి పెట్టుకునే క్షమాభిక్ష పిటిషన్లలో ఇలాంటి (బాధితురాలి కుటుంబం క్షమించింది) విషయాలను ప్రస్తావించవచ్చునని మరో న్యాయవాది వికాస్ సింగ్ చెప్పారు. -
సభ్య సమాజానికే ఇది తలవంపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోక్సో కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన సమాజానికే తలవంపులు తెచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ దారుణ సంఘటన 2012 డిసెంబర్లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు తర్వాత నాలుగు నెలలకు చోటుచేసుకుంది. నిందితులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్ బాధితురాలిని లైంగికంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని వదిలేసి వెళ్లారు. 40 గంటల తరువాత ఏప్రిల్ 17న బాలికను రక్షించారు. ప్రస్తుతం ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి నరేశ్‌కుమార్ మల్హోత్రా ఇద్దరినీ దోషులుగా నిర్ధారించారు. బాలికను వారు క్రూరంగా హింసించారని వ్యాఖ్యానించారు. ‘మన సమాజంలో మైనర్ బాలికలను దేవతలుగా ఆరాధిస్తారు. కానీ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది’ అని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, తన కుమార్తెకు న్యాయం లభించినందుకు బాలిక తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘విచారణ రెండేళ్ళలో పూర్తి కావాలి, కానీ ఆరేళ్ల తరువాతైనా మాకు న్యాయం లభించినందుకు సంతోషం’ అని అన్నారు. దోషులకు శిక్షల విధింపుపై జనవరి 30న విచారిస్తామని కోర్టు తెలిపింది. 2013లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మే 24 చార్జిషీట్ దాఖలు చేశారు. జూలై 11న అభియోగాలు మోపుతూ హాజరుపరిచారు. -
జైల్లో డమ్మీ ఉరి ట్రయల్స్
-
నిర్భయ దోషులందరూ తీహార్ జైల్లో
న్యూఢిల్లీ: ఢిల్లీలో నిర్భయపై మూకుమ్మడి అత్యాచారం, హత్య కేసులో దోషులకి ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిహార్ బక్సర్ జైలు నుంచి ఉరితాళ్లను తీసుకువస్తున్నారు. ఉరికంబంపై శిక్ష అమలు ఎలా జరపాలో నలుగురు దోషుల బరువు, ఎత్తున్న దిష్టిబొమ్మలకి ఉరి తీసి డమ్మీ ట్రయల్స్ వేసి చూశారని జైలు వర్గాలు తెలిపాయి. దోషులందరినీ ప్రస్తుతం తీహార్ జైలు నంబర్ మూడులో వేర్వేరు గదుల్లో ఉంచి సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జైలు నంబర్ 3లోనే దోషులకి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇటీవల మండోలి జైలులో ఉన్న పవన్ కుమార్ గుప్తాను తీహార్ జైలుకి తరలించినట్టు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సందీప్ గోయెల్ వెల్లడించారు. ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్, వినయ్ శర్మను ఉంచిన జైలు నెంబర్3లో పవన్ కుమార్ గుప్తాను ఉంచారు. నిర్భయను 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి బస్సులో ఆరుగురు రాక్షసులు మూకుమ్మడిగా అత్యాచారం చేయడమే కాకుండా, దారుణంగా హింసించడంతో ఆమె కొన్నాళ్లు మృత్యువుతో పోరాడి సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ జైల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల పాటు జువైనల్ హోంకి పంపారు. మిగిలిన నలుగురిని ఏ రోజైతే అత్యంత పాశవికంగా నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారో అదే రోజు డిసెంబర్ 16న ఉరితీస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దోషులందరూ ఒకే జైలుకి చేరడంతో వారికి ఉరిశిక్ష అమలు జరపడం ఖాయమన్న వార్తలకు ఊతమిచ్చినట్టయింది. ఢిల్లీ కాలుష్యం చంపేస్తోంది.మళ్లీ ఉరి ఎందుకు ? సుప్రీంలో అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ మరణ దండనని సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టుకెక్కినట్టు అతని తరఫు లాయర్ ఏపీ సింగ్ వెల్లడించారు. తన రివ్యూ పిటిషన్లో అక్షయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఎలాగూ తమని చంపేస్తోందని, తమ ఆయుష్షుని తగ్గిస్తోందని మళ్లీ ఉరి శిక్ష ఎందుకంటూ ప్రశ్నించాడు. 2018, జూలై 9న అత్యున్నత న్యాయస్థానం మిగిలిన ముగ్గురు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ని కొట్టి వేసింది. అప్పుడు రివ్యూ పిటిషన్ వేయని అక్షయ్ ఉరి శిక్ష అమలుకు సన్నాహాలు జరుగుతున్న వేళ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసే అవకాశాలే ఎక్కువున్నాయి. -
నేను ఉరి తీస్తా.. ఆమె ఆత్మ శాంతిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: 2012లో డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హత్యాచార ఘటన ‘నిర్భయ’ కేసు దోషులకు మరణ శిక్ష ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారి లేకపోవడంతో జైలు అధికారులు టెన్షన్ పడుతున్నారన్న వార్తకు స్పందన వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ షిమ్లాకు చెందిన రవి కుమార్ దేశాధ్యక్షుడు రామనాథ్ కోవింద్‌కు ఒక లేఖ రాశారు. ఢిల్లీ తీహార్ జైలులో ఎగ్జిక్యూటర్ లేనందున తనను తాత్కాలిక తలారిగా నియమించాలని కోరారు. తద్వారా నిర్భయ కేసు దోషులను త్వరలో ఉరి తీయవచ్చు. నిర్భయ ఆత్మ శాంతిస్తుందని ఆయన పేర్కొన్నారు. కదులుతున్న బస్సులో పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా మార్చారు. నేరస్థులో ఒకడైన రాంసింగ్ తానున్న జైలు లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బాల నేరస్థుడు సంస్కరణ గృహంలో ఉన్నాడు. ఇక మిగిలిన నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేసింది సుప్రీంకోర్టు. మరోవైపు క్షమాభిక్ష పిటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించడంతో, తీహార్ జైలులో ఉన్న వినయ్ శర్మ రాష్ట్రపతిని ఆశ్రయించాడు. అయితే దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష పెట్టవద్దని జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రపతికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్‌కు మరణశిక్షను అమలు చేయనున్నారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని ‘బ్లాక్ వారెంట్’ జారీ చేసే అవకాశముందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అక్కడ తలారి లేక.. ఇతర జైళ్లలో తలారీలు ఎవరైనా ఉన్నారా అని తీహార్ జైలు అధికారులు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల్లోనూ పదవీ విరమణ చేసిన తలారీలు ఎవరైనా ఉన్నారా? అని వెతికే పనిలో ఉన్నారు. తలారీని కాంట్రాక్టు పద్ధతిపై నియమించాలని తీహార్ జైలు అధికారులు యోచిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తాజా లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. Himachal Pradesh: Ravi Kumar, from Shimla has written to President Kovind to appoint him as temporary executioner in Delhi’s Tihar Jail as there is no executioner there.He states, “Appoint me executioner so ‘Nirbhaya’ case convicts can be hanged soon & her soul rests in peace". pic.twitter.com/fqZLarNZIQ — ANI (@ANI) December 4, 2019 -
'నిర్భయకేసు దోషులకు త్వరలో మరణశిక్ష'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపి, మహిళల రక్షణకు కొత్త చట్టాలు చేసేలా పాలకులను కదిలించిన నిర్భయ కేసులో దోషులకు వచ్చే నెలలో ఉరి శిక్ష అమలు కానుంది. ఇప్పటి వరకూ వారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఆమోదానికి నోచుకోలేదు. నిర్భయ కేసులో మరణశిక్ష పడి, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న వినయ్‌శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే కోర్టు దోషులను ఉరి తీయాలని బ్లాక్ వారెంట్ జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరి తీసే తలారీ లేకపోవడంపై జైలు అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఉరి తీసే తలారీ ఉద్యోగాన్ని భర్తీ చేయడం కానీ.. తాత్కాలికంగా ఎక్కడైనా పని చేస్తున్న వారిని తీహార్ జైలుకు బదిలీ చేసి.. శిక్షను అమలు పరచలా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన నలుగురినీ ఉరితీయాల్సి ఉంది. ఇటీవల శర్మ మెర్సీ పిటిషన్ పెట్టుకోగా, దాన్ని తిరస్కరించాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. నిర్భయ ఘటనలో దోషులకు క్షమాభిక్ష పెట్టవద్దని లేఖ లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మతోపాటు ముకేష్, పవన్, అక్షయ్ లకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఢిల్లీలో 2012 డిసెంబరు 16వ తేదీన కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె అదే సంవత్సరం డిసెంబర్ 20న కన్నుమూసింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా నిర్ణయించారు. అంతే కాకుండా ఆ పేరుపై మహిళల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది.