‘నిర్భయ’దోషులకు ఉరి | Nirbhaya convicts have been hanged at Tihar jail | Sakshi
Sakshi News home page

‘నిర్భయ’దోషులకు ఉరి

Published Sat, Mar 21 2020 4:55 AM | Last Updated on Sat, Mar 21 2020 12:35 PM

Nirbhaya convicts have been hanged at Tihar jail - Sakshi

ఉరి శిక్ష అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకుంటున్న ఢిల్లీ వాసులు

న్యూఢిల్లీ: నిర్భయ తల్లిదండ్రుల ఏడేళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. 2012లో రాజధాని నడిబొడ్డున నడుస్తున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయని అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషులైన ముఖేష్‌ సింగ్‌(32), పవన్‌ గుప్తా(25), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌(31)లను శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు తీహార్‌ జైల్లో ఉరితీశారు. ఇలా ఒకేసారి నలుగురికి ఉరి శిక్ష అమలు చేయడం తీహార్‌ జైలు చరిత్రలో ఇదే మొదటిసారి ప్రాణాల మీద ఆశతో దోషులు చివరి వరకు ఉరిశిక్ష అమలును ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించారు.

చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకుంటూ ఆఖరి వరకు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. దాంతో, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వారి ఉరిపై సందిగ్ధత నెలకొంది. గురువారం రాత్రి పవన్‌ గుప్తా పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు అత్యవసర విచారణ చేపట్టాయి. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రెండోసారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పవన్‌ గుప్తా వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు బెంచ్‌ అసాధారణ రీతిలో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రారంభించింది.

గంటపాటు జరిగిన వాదనల అనంతరం ఆ పిటిషన్‌ను బెంచ్‌ కొట్టివేసింది. దాంతో, ఉరి శిక్ష అమలు చేయడానికి చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉరిశిక్ష అమలుకు ముందు  కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినివ్వాలని అక్షయ్‌ సింగ్, పవన్‌ గుప్తా పెట్టుకున్న అభ్యర్థనను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇది జరిగిన మూడు గంటల్లోనే తీహార్‌ జైలు అధికారులు నలుగురికీ ఉరి శిక్ష అమలు చేశారు. నిబంధనల ప్రకారం.. ఉరి వేసిన తరువాత  అరగంట పాటు వారిని ఉరికంబానికే వేలాడదీసి ఉంచారని జైలు అధికారులు తెలిపారు

. ‘ఉరిశిక్ష అనంతరం డాక్టర్లు పరీక్షించారు. నలుగురూ మృతి చెందారని నిర్ధారించారు’ అని ఆ తరువాత తీహార్‌ జైలు డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయెల్‌ ప్రకటించారు. ఆ తరువాత డీడీయూ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించామన్నారు. అక్షయ్, ముఖేష్‌ల మృతదేహాలను బిహార్, రాజస్తాన్‌ల్లోని తమ తమ గ్రామాలకు వారు తీసుకెళ్లారని చెప్పారు. వినయ్, పవన్‌ల మృతదేహాలను ఢిల్లీలో రవిదాస్‌ క్యాంప్‌లో ఉన్న వారి ఇళ్లకు తరలించామన్నారు.

చివరి క్షణాలు  
ఒకవైపు కోర్టులో వాదనలు జరుగుతున్నా.. తీహార్‌ జైలు అధికారులు ఉరిశిక్ష అమలుకు సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. గురువారం రాత్రి నుంచే మొత్తం జైలుని లాక్‌డౌన్‌ చేశారు. దోషులు నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచారు. రాత్రి డిన్నర్‌ని ముఖేష్, వినయ్‌ రోజూ మాదిరిగా ఇచ్చిన టైమ్‌కి తినేశారు. వారికిచ్చిన ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఉన్నాయి. అక్షయ్‌ గురువారం సాయంత్రం టీ తాగాడు. ఆ తర్వాత అతను ఏం తీసుకోలేదు. పవన్‌ గుప్తా కూడా ఆహారం తీసుకోవడానికి నిరాకరించాడు.

వారిలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని, రాత్రంతా కూడా వారు ముభావంగానే గడిపారని జైలు అధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత లాంఛనాలు పూర్తి చేయడానికి తెల్లవారు జామున 3.30 గంటలకి ఆ దోషులు నలుగురిని నిద్ర లేపడానికి అధికారులు వెళ్లారు. అయితే వారు మేలుకొని ఉన్నారు. రాత్రంతా వారు నిద్రలేకుండానే గడిపారని జైలు అధికారులు వెల్లడించారు. స్నానం చేయడానికి, అల్పాహారం తినడానికి ఇష్టపడలేదు. నిర్వికారంగానే ఉరికంబం వైపు అడుగులు వేశారు.  

ఒకరి ఆత్మహత్య.. మరొకరి విడుదల
దోషులుగా తేలి, ఉరిశిక్షకు గురైన నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులుగా విచారణ ఎదుర్కొన్నారు. విచారణ జరుగుతుండగానే.. ఆ ఇద్దరిలో రామ్‌సింగ్‌ తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు నేరం జరిగిన సమయానికి మైనర్‌ కావడంతో.. నిర్బంధ వసతి గృహంలో మూడేళ్లు శిక్ష అనుభవించి 2015 సంవత్సరంలో విడుదల అయ్యాడు.

ప్రధాని మోదీ హర్షం
నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. నిర్భయ కేసును ప్రస్తావించకుండా.. ‘న్యాయం గెలిచింది. మహిళల గౌరవం, భద్రత మనకు అత్యంత ముఖ్యమైన విషయం. మన మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మహిళల సాధికారతపై ప్రధానంగా దృష్టి పెట్టే.. మహిళలకు సమానత్వం, సమాన అవకాశాలు లభించే సమాజాన్ని మనమంతా కలిసి నిర్మించాలి’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, మహిళలపై హింసను నివారించేందుకు మరణశిక్ష ఏ నాటికి పరిష్కారం కాబోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వ్యాఖ్యానించింది. ఈ ఉరి శిక్ష భారతదేశ మానవహక్కుల చరిత్రలో ఒక మరకలా నిలిచిపోతుందని పేర్కొంది.  

ఆఖరి కోరికలివే  
ఉరికంబం ఎక్కడానికి ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ తన అవయవాలను దానం చేశాడు. అదే తన ఆఖరి కోరికని చెప్పాడు. వినయ్‌ తాను జైల్లో ఉన్నప్పుడు వేసిన పెయింటింగ్‌లను జైలు సూపరింటెండెంట్‌కి ఇవ్వమని కోరాడు. తాను చదివే హనుమాన్‌ చాలీసా తన కుటుంబసభ్యులకు ఇవ్వమని చెప్పినట్టు జైలు అధికారి వెల్లడించారు. ముఖేష్, వినయ్, పవన్, అక్షయ్‌ ఎవరూ ఎలాంటి విల్లు రాయలేదని ఆ అధికారి చెప్పారు.


 విజయ సంకేతం చూపుతున్న నిర్భయ తల్లిదండ్రులు, లాయర్లు సీమా కుష్వాహ, జితేంద్ర ఝా

2012 నుంచి 2020 వరకు  
న్యూఢిల్లీ: నిర్భయ ఘటన 2012 డిసెంబర్‌ 16న చోటు చేసుకోగా, దోషులకు ఉరిశిక్ష 2020 మార్చి 20న అమలైంది. ఏడు సంవత్సరాలకు పైగా ఈ కేసు విచారణ సాగింది. దోషులుగా తేలి, ఉరిశిక్షను నిర్ధారించిన తరువాత కూడా కేసును సాధ్యమైనంత సాగదీశారు. విచారణ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కార్యాలయం చుట్టూ పలుమార్లు ఈ కేసు చక్కర్లు కొట్టింది. చివరగా, మార్చి 5న ట్రయల్‌ కోర్టు మార్చి 20న ఉరిశిక్షను అమలు చేయాలని డెత్‌ వారెంట్లను జారీ చేసింది.

‘నిర్భయ’ తలారికి లక్ష నజరానా
యశవంతపుర: నిర్భయ హంతకులను ఉరి తీసిన తలారి పవన్‌ జల్లూద్‌కు రూ.లక్ష నజరానా ప్రకటించినట్లు నటుడు జగ్గేశ్‌ ట్వీట్‌ చేశారు. హంతకులను ఉరితీసే వ్యక్తికి రూ. లక్ష బహుమతిగా ఇస్తానని గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉరితీతతో సత్యం, ధర్మానికి న్యాయం లభించిందన్నారు. ఈ డబ్బుతో తన  కుమార్తె వివాహం చేస్తానని జల్లూద్‌ గతంలో పేర్కొనడాన్ని జగ్గేష్‌ గుర్తు చేశారు.  

జైలు వద్ద నినాదాలు
తీహార్‌ జైలు వెలుపల గురువారం రాత్రంతా జనం హడావుడి కనిపించింది. కరోనా భయాన్ని కూడా పక్కనపెట్టి వందలాది మంది గుమిగూడారు. దోషులను ఉరి తీశారన్న వార్త వినగానే జాతీయ జెండాను ఎగురవేస్తూ లాంగ్‌ లివ్‌ నిర్భయ, భారత్‌ మాతా కీ జై అని నినాదాలు చేశారు.


న్యాయం దక్కింది
నిర్భయ దోషులకు ఉరిశిక్షపై పలువురు ప్రముఖుల హర్షం    
న్యూఢిల్లీ/బెంగళూరు: నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ సహా, పలువురు కేంద్రమంత్రులు, మహిళా సంఘాలు సానుకూలంగా స్పందించాయి. పలువురు రాజకీయ నేతలు న్యాయనిపుణులు హర్షం వ్యక్తం చేశారు.  దోషులకు ఉరిశిక్ష అమలును పలువురు కేంద్ర మంత్రులు స్వాగతించారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాలకు కఠిన శిక్షలు అమలు చేయాలని బాలీవుడ్‌ ప్రముఖులు రిషి కపూర్, తాప్సీ పన్ను, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు పేర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ మాత్రం.. మహిళలపై అత్యాచారాలకు దోషులకు మరణ శిక్ష విధించడం ఏమాత్రం పరిష్కారం కాదని తెలిపింది. భారత్‌ మానవహక్కుల రికార్డుపై ఈ ఘటనను మాయని మచ్చగా అభివర్ణించింది.  
 
దోషులకు కఠిన శిక్షలు పడేలా నిర్భయ తల్లి సాగిస్తున్న పోరాటాన్ని స్వయంగా చూశాం. ఇందుకు కొంత సమయం తీసుకున్నా, చివరికి ఆ కుటుంబానికి న్యాయం దక్కినందుకు సంతోషంగా ఉంది. నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుతో నేరగాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని గట్టి హెచ్చరిక పంపినట్లయింది.
–మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ
 
నిర్భయ ఘటనల వంటివి భవిష్యత్తులో జరక్కుండా చూస్తామని ఈ సమయంలో మనమంతా ప్రతినబూనాలి. ఏ కూతురికీ ఇలాంటి ఆపద రాకూడదు. వ్యవస్థలో లోపాలను అధిగమించేందుకు పోలీసులు, కోర్టులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలి.
–ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
 
తీవ్ర వేదనను అనుభవించిన ఒక కూతురు నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. మరణశిక్ష అమల్లో జాప్యం అయ్యేలా దోషులు తప్పుదోవ పట్టించకుండా ఇకపై న్యాయవ్యవస్థ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
–కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌
 
నిర్భయకు ఎట్టకేలకు న్యాయం దొరికింది. ఆమె ఆత్మకు శాంతి లభించింది. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయడం మిగతా వారికి హెచ్చరికలా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఈ కేసు బయటపెట్టింది. వీటిని నలుగురు దోషులు వాడుకున్నారు.
–జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రేఖా శర్మ  
 
నిర్భయ నివాసంలో హర్షం
దోషులకు ఉరిశిక్ష అమలు శుక్రవారంనాడు పూర్తి కావడంతో పశ్చిమ ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నిర్భయ కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగువారు సంతోషం వ్యక్తం చేశారు. నిర్భయ కుటుంబసభ్యులను కలిసేందుకు జనం క్యూ కట్టారు. ఈ సందర్భంగా వారంతా స్వీట్లు పంచుకున్నారు. పాటలు పాడుకుంటూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.  ‘గత ఏడాది డిసెంబర్‌ 12వ తేదీ నుంచి మా ఇంటి ఆవరణలో నిర్భయకు నివాళిగా రోజూ కొవ్వొత్తులను వెలిగిస్తున్నాం. ఇటీవల ఒక  రోజు రాత్రి భారీ వర్షం కురిసినా కూడా ఒక కొవ్వొత్తి వెలుగుతూనే ఉండటం గమనించాం. దీనిని మేం శుభ సూచికంగా భావించాం’అని నిర్భయ తండ్రి బద్రీనాథ్‌ సింగ్‌ తెలిపారు.   


నిర్భయ దోషుల మృతదేహాలతో ఆస్పత్రి వద్దకు వచ్చిన వ్యాన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement