న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరితీయ బడ్డ నలుగురు దోషులు అద్భుతం జరుగుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష వేయకుండా నిలిపివేస్తారని ఆశ పడ్డారని తెలిపాయి. కోర్టు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని పదేపదే అడిగారని జైలు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో విచారణ జరగడంతో చివరి నిమిషంలో తమకు మరణదండన తప్పుతుందన్న ఆశ నలుగురు నేరస్తుల్లో కనిపించినట్టు చెప్పారు. తీహర్ జైలులోని 3వ నంబర్ బరాక్‌లో ఉన్న దోషుల చివరి నిమిషం వరకు ’కోర్టు నుంచి ఏదైనా వర్తమానం వచ్చిందా’ అన్న ప్రశ్న తమకు ఎదురైందని వెల్లడించారు. ఉదయం 5.30 గంటలకు ఉరితీసే వరకు తమకు కాపలా ఉన్న 15 మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారట. (ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!)
లడ్డూలు, నూడుల్స్ అడిగారు
నలుగురు దోషులకు గురువారం మధ్యాహ్నం రోజూ మాదిరిగా ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఇచ్చారు. ప్రత్యేకంగా ఏమి అడగలేదని, అందరూ లంచ్ చేశారని జైలు అధికారులు తెలిపారు. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. అక్షయ్, పవన్ రాత్రి భోజనం చేయలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముకేశ్, అక్షయ్, వినయ్ తమకు లడ్డూలు, నూడుల్స్ కావాలని అడగడంతో వాటిని తెప్పించి పెట్టినట్టు వెల్లడించారు. గురువారం రాత్రి 11 గంటలకు దోషులు నలుగురికి న్యాయవాది, మానసిక వైద్యుడి సమక్షంలో చివరిసారిగా వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్ (పశ్చిమ) డెత్‌వారెంట్‌ను దోషులకు చదివి వినిపించారు. ఉరిశిక్షకు భయపడిన పవన్ కాసేపు గలాభా సృష్టించడంతో అతడి వద్ద ఎక్కువ మంది పోలీసులను ఉంచారు. జైలు సిబ్బంది ఇచ్చిన బట్టలు వేసుకునేందుకు అతడు నిరాకరించాడు. ‘మేము ఇచ్చిన బట్టలను వేసుకోకుండా నేలకేసి కొట్టాడు. తనను క్షమించాలని ఏడుస్తూ వేడుకున్నాడు. ఉరి కంబం దగ్గరకు తీసుకెళుతుండగా దోషులందరూ తమను క్షమించాలని కన్నీళ్లు పెట్టుకుంటూ అర్ధించార’ని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. (నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి తగలబెట్టేవాడిని..)
8వ నంబర్ సెల్ ఉన్న వినయ్ శర్మ, ముఖేష్ సింగ్.. ఒకటో నంబర్‌సెల్ ఉన్న పవన్ గుప్తా, ఏడో నంబర్ సెల్‌లో ఉన్న అక్షయ్ సింగ్‌లను భద్రత సిబ్బంది ఉరికంబం వద్దకు తీసుకొచ్చారు. వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్‌లను ఒకేసారి ఉరి తీశారు. ఆ సమయంలో జిల్లా మేజిస్ట్రేట్, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు సహాయ సూపరింటెండెంట్స్, వార్డెన్, వైద్యాధికారి, ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ ఉన్నారు. యూపీలోని మీరట్‌కు చెందిన తలారి పవన్ జలాద్‌కు ఒక్కో ఉరికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.60 వేలు చెల్లించినట్టు సమాచారం. జైలులో పనిచేసిన సంపాదించిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని దోషులు చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2 వేల నుంచి మూడు వేల వరకు ఉన్నట్టు సమాచారం. డబ్బుతో పాటు వారి బట్టలు, దుప్పట్లను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. (తలారికి లక్ష నజరానా.. జైలు వద్ద హడావుడి)
Comments
Please login to add a commentAdd a comment