death penalty
-
యువజంట పరువు హత్య.. హంతకులకు మరణశిక్ష
హుబ్లీ/ యశవంతపుర: ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి యువజంట దారుణ హత్యకు గురైంది. ఈ మర్యాద హత్య కేసులో గదగ్ జిల్లా కోర్టు నలుగురు దోషులకు మరణశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాలు.. గదగ్ జిల్లాలోని గజేంద్రగడ తాలూకా లక్కలకట్టి గ్రామానికి చెందిన రమేష్ మాదర (29), గంగమ్మ (23) అనే దంపతులను 2019లో కత్తులతో పొడిచి హత్య చేశారు. గంగమ్మ బంధువులే ఈ రక్తపాతానికి పాల్పడ్డారు. కులాంతర పెళ్లి చేసుకోవడం వారికి ఎంతమాత్రం ఇష్టం లేదు. గజేంద్రగడ పోలీసులు గంగమ్మ బంధువులైన శివప్ప రాథోడ్, రవికుమార్ రాథోడ్, రమేష్ రాథోడ్, పరశురామ రాథోడ్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేసి, జిల్లా కోర్టులో చార్జిషీట్ ను సమర్పించారు. విచారణలో ఈ నలుగురి నేరం రుజువు కావడంతో వారికి మరణశిక్ష విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెలువరించారు. అనంతరం దోషులను జైలుకు తరలించారు. మరికొందరిపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో విముక్తుల్ని చేశారు. -
ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!
యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది కోల్‌కతా యువ వైద్యురాలి హత్యాచారం కేసులో.. సంజయ్ రాయ్‌కి మరణశిక్ష పడకపోవడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత అరుదైన కేసు కాదనే ఉద్దేశంతోనే అంతటి శిక్ష వేయడం లేదని సీల్దా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ కేసులో కంటికి కన్నులాగా.. ప్రాణానికి ప్రాణం తీయడమే సరైందని.. న్యాయస్థానం ఆ అంశాల్ని పరిశీలించి ఉండాలనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో బెంగాల్లోనే చర్చనీయాంశమైన కేసుల్ని ప్రస్తావిస్తున్నారు.కిందటి ఏడాది ఆగష్టులో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారోదంతం.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన బాట చేపట్టడంతో వైద్య సేవలపైనా ప్రభావం పడడమే అందుకు ప్రధాన కారణం. అదే సమయంలో మహిళలపై అఘాయిత్యాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందనే వాదనను ఈ కేసు తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే బెంగాల్ సర్కార్ అపరాజిత పేరుతో ప్రత్యేక చట్టం చేసుకుంది కూడా. కానీ, దోషికి సరైన శిక్ష పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఆర్జీకర్ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించాయి పశ్చిమ బెంగాల్ న్యాయస్థానాలు.1. ఆగష్టు 2023లో మతిగరలో 16 ఏళ్ల అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అతనికి సిలిగూరి కోర్టు కిందటి ఏడాది సెప్టెంబర్ 21న మరణశిక్ష విధించింది.2. 2023 ఏప్రిల్‌లో.. తిల్జల ప్రాంతంలో ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగింది. సెప్టెంబర్ 26వ తేదీన ఆ మానవమృగానికి మరణశిక్ష విధించింది కోల్కత్తా కోర్టు.3. కిందటి ఏడాది అక్టోబర్‌లో కుల్తలి ఏరియాలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడ్డ వ్యక్తికి.. డిసెంబర్ 6వ తేదీన కోర్టు మరణశిక్ష విధించింది.4. డిసెంబర్ 13వ తేదీన.. తొమ్మిదేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడికి మరణశిక్ష విధించింది ఫరక్కా కోర్టు.5. కిందటి ఏడాది నవంబర్‌లో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడి ప్రాణం తీసిన కిరాతకుడికి ఆదివారం(జనవరి 20న) హూగ్లీ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.ఈ ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించిన న్యాయస్థానాలు.. ఆర్జీకర్ కేసు, ఆ కేసులో చోటుచేసుకున్న పరిణామాలను ఎందుకు అంతతీవ్రమైనవిగా పరిగణించలేకపోయిందనేది పలువురి ప్రశ్న. అయితే దీనికి న్యాయ నిపుణులు వివరణ ఇస్తున్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ మాట్లాడుతూ.. ఈ తరహా శిక్షలు కేవలం బాధితురాలికో, ఆమె కుటుంబానికో మాత్రమే కాదు.. యావత్ సమాజానికి న్యాయం జరుగుతుందనే సందేశాన్ని పంపిస్తాయి. మహిళలు, మరీ ముఖ్యంగా మైనర్ల విషయంలో కలిగే అభద్రతాభావాన్ని తొలగించే అడుగు అని అన్నారు. అయితే.. పైన చెప్పుకున్న అన్ని కేసులు మైనర్లపై జరిగిన అఘాయిత్యాలే. తీర్పులు ఇచ్చిన అన్ని కోర్టులు.. పోక్సో న్యాయస్థానాలే. పైగా ఈ కేసులన్నింటిలో బాధిత చిన్నారులకు.. వాళ్ల కుటుంబ సభ్యులతో నేరానికి పాల్పడిన వాళ్లకు పరిచయాలు ఉన్నాయి. నమ్మి వెంట వెళ్లిన చిన్నారులను చిధిమేశాయి ఆ మానవమృగాలు. పైగా ఈ కేసుల్లో బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే అత్యంత అరుదైన కేసులుగా ఆయా న్యాయస్థానాలు గుర్తించాయి అని చెబుతున్నారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ. మతిగర, కుల్తలి, ఫరక్కా కేసుల్లో స్వయంగా ఈయనే వాదనలు వినిపించారు. పై ఐదు కేసుల్లో మరణశిక్షలను, అలాగే ఆర్జీకర్ కేసుల్లో యావజ్జీవ కాగారార శిక్షను న్యాయనిపుణులు సమర్థిస్తున్నారు. భావోద్వేగాలు, ప్రజాభిప్రాయాలు.. న్యాయవ్యవస్థలను ఎంతమాత్రం ప్రభావితం చేయబోవని చెబుతున్నారు. అలాగని.. ఆ ఆందోళనలను గనుక పరిగణనలోకి తీసుకుని కోర్టులు సత్వర న్యాయానికి ప్రయత్నించడం ఎంతమాత్రం మంచిదికాదని అంటున్నారు.అత్యంత అరుదైన కేసంటే.. మన దేశంలో అంత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్షలు విధిస్థాయి న్యాయస్థానాలు. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఆధారంగా సుప్రీం కోర్టు తొలిసారి ఈ తరహా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు ముగ్గురిని హతమార్చాడనే అభియోగాల కింద బచ్చన్ సింగ్ అనే వ్యక్తికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించగా.. హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత కేసు సుప్రీం కోర్టుకు చేరింది.ఐపీసీ సెక్షన్ 302 రాజ్యాంగబద్ధతతో పాటు సీఆర్పీసీలోని సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్షలకు ప్రత్యేక కారణాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలను ఈ కేసు సవాల్ చేసింది. అయితే ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ వైసీ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. 1980 ఆగష్టు 16వ తేదీన తీర్పు వెల్లడించింది. కింది కోర్టులు విధించిన మరణశిక్షను సమర్థించింది.భారతీయ న్యాయవ్యవస్థకు ‘‘అత్యంత అరుదైన కేసు’’ సిద్ధాంతాన్ని తెచ్చిపెట్టింది ఈ తీర్పు. నేర తీవ్రత, ప్రత్యేక పరిస్థితులను, మానవ హక్కులను గౌరవించడంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే.. అంతిమ మార్గంగా మరణశిక్షలు విధించాలని తీర్పు సమయంలో రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు తర్వాతి కాలంలో భారతీయ కోర్టులకు మార్గదర్శకంగా మారింది.అంత్యత అరుదైన కేసులకు వర్తించేవి ఇవే..నేర తీవ్రతనేరానికి పాల్పడ్డ తీరు, ఉద్దేశాలుఆ నేరం.. సమాజంపై చూపించే ప్రభావంనేరస్తుడి వయసు, కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పరిస్థితులునేరస్థుడిలో జైలు జీవితం పరివర్తన తీసుకొచ్చే అంశాల పరిశీలనమన దేశంలో అత్యంత అరుదైన కేసుల్లో మరణశిక్షలు పడ్డవెన్నో. వాటిల్లో కోల్‌కతాలో స్కూల్ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ ధనంజయ్ ఛటర్జీ(1990)కి, నిర్భయ ఘటన(2012)లో, 2008లో ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్‌లకు అత్యంత ప్రముఖమైన కేసులుగా నిలిచాయి.అయితే.. అత్యంత అరుదైన కేసుల్లో సాధారణంగా కింది కోర్టులు మరణశిక్షలు విధిస్తుంటాయి. వాళ్లు పైకోర్టులకు వెళ్లినప్పుడు.. ఊరట లభించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి అని బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ జయంత మిత్రా అంటున్నారు. ఆర్జీకర్ కేసులోనూ నిందితుడు పైకోర్టులో తనకు పడ్డ జీవితఖైదు శిక్షనూ సవాల్ చేసే అవకాశం లేకపోదని చెబుతున్నారాయన. -
ఎం.ఎం.ఎం మర్డర్స్.. మగ్గు.. మరణశిక్ష!
నేరాల నిరోధం (ప్రివెన్షన్), కేసులు కొలిక్కి తీసుకురావడం (డిటెక్షన్), నిందితుల్ని దోషులుగా నిరూపించడం (కన్విక్షన్).. ఇవి పోలీసుల ప్రాథమిక విధులు. మొదటి రెండింటి మాట అటుంచితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడోది మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కోర్టులో నేర నిరూపణే కష్టసాధ్యంగా మారిన తరుణంలో ఇక నిందితుడికి ఉరి శిక్ష అనేది దుర్లభమే. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు కేసుల్లోనే ఈ శిక్షపడగా.. వాటిలో ఒకటి హైదరాబాద్‌లోని నారాయణగూడ పరిధిలో జరిగిన ఓ కుటుంబ హత్యకు సంబంధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష పడటంతో ఓ హోటల్ మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా నిలిచింది.హైదరాబాద్, అంబర్‌పేటలోని గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగుల సాయి.. శుభకార్యాలకు బ్యాండ్ వాయించే పని చేస్తుండేవాడు. ఆ పనిలేనప్పుడు చిత్తుకాగితాలు ఏరుకుని బతుకీడ్చేవాడు. అతనికి స్నేహితుడి ద్వారా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి వాసి ఆర్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2014లో ఇరువురూ ఒక్కటి కాగా.. ఏడాదికి కూతురు పుట్టింది. ఆ ఇద్దరి మధ్యా ఉన్న చిన్న చిన్న స్పర్థలు చినికి చినికి గాలివానగా మారడంతో ఆర్తి 2021లో భర్తను వదిలేసింది. కూతురిని తీసుకుని చిక్కడపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్లతో కలిసి ఉండసాగింది. సాయి తరచు ఆర్తి పుట్టింటికి వెళ్తూ ఆమె కుటుంబీకులతో ఘర్షణ పడేవాడు. ఓ సందర్భంలో జితేందర్‌పై దాడి చేసి, మరోసారి కోర్టు ధిక్కరణ నేరంపై జైలుకూ వెళ్లాడు. ఆర్తికి మగతోడు అవసరమని తలచిన జితేందర్ భార్య అనువైన సంబంధం కోసం వెదకసాగింది. ఆమె ద్వారా పరిచయమైన నాగరాజు మీద ఆర్తి కుటుంబానికి సదభిప్రాయం కలగడంతో 2021లో వీరిద్దరికీ వివాహం చేశారు. తన భార్యను వివాహం చేసుకుని తనకు పూర్తిగా దూరం చేశాడనే ఉద్దేశంతో నాగరాజుపై ద్వేషం పెంచుకున్నాడు సాయి. హైదరాబాద్, నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న మార్కెట్లో నాగరాజు పూల వ్యాపారం చేసేవాడు. అతనికి ఆర్తి చేదోడువాదోడుగా ఉండేది. తరచు తమ దుకాణం వద్దకు వచ్చి ఘర్షణ పడుతున్న, తన భార్యతో వాగ్వాదానికి దిగుతున్న సాయిని నాగరాజు అనేకసార్లు మందలించాడు. వీరికి కొడుకు (విష్ణు) పుట్టడంతో సాయిలో ద్వేషంతో పాటు ఈర్ష్య కూడా పెరిగింది. దాంతో అతని ప్రవర్తన విపరీతంగా మారడమే కాదు ఆర్తి కుటుంబాన్ని నాశనం చేస్తానంటూ పలుమార్లు బహిరంగంగానే బెదిరించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన నాగరాజు.. తన భార్యను వేధిస్తున్న సాయిని బెదిరించాలని భావించాడు. 2022 నవంబర్ 7న నారాయణ గూడ మెట్రో స్టేషన్ వద్ద నాగరాజుకు సాయి కనిపించాడు. అతడిని అడ్డగించి.. మరోసారి ఆర్తితో మాట్లాడినా, ఫోన్ చేసి బెదిరించినా ఊరుకునేది లేదంటూ బెదిరించిన నాగరాజు.. ఇకపై ఆమెను సోదరిగా భావిస్తూ చెల్లి అని పిలవాలంటూ హెచ్చరించాడు. ఈ పరిణామంతో విచక్షణ కోల్పోయిన సాయి.. చిక్కడపల్లికే చెందిన తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి నాగరాజు, ఆర్తిల హత్యకు కుట్రపన్నాడు. అదేరోజు రాత్రి హైదరాబాద్, నల్లకుంటలోని పెట్రోల్ బంక్ నుంచి ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకు వచ్చాడు. ఆర్తి, నాగరాజు తమ దుకాణంలో ఉన్నారని గుర్తించిన అతగాడు.. ఇద్దరిపైనా పెట్రోల్ చల్లడం ఇబ్బందికరమని భావించాడు. తన స్నేహితుడు రాహుల్‌తో కలిసి నారాయణ గూడ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న లక్కీ కేఫ్‌లోకి వెళ్లాడు. అక్కడ మంచి నీళ్లు తాగుతూ అదును చూసుకుని ఓ మగ్గు తస్కరించాడు. నాగరాజు దుకాణానికి సమీపంలో ఆగి బాటిల్లోని పెట్రోల్‌ను మగ్గులో పోసుకున్నాడు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ చేతిలో అగ్గిపెట్టెను సిద్ధంగా ఉంచుకుని నాగరాజు దుకాణం వద్దకు వెళ్లాడు. ఆర్తి, నాగరాజు తేరుకునేలోపే వారిపై మగ్గులోని పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. ఆ దాడిలో వీరిద్దరితో పాటు ఆర్తి ఒడిలో ఉన్న ఎనిమిది నెలల విష్ణు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ నుంచి రాహుల్‌తో కలిసి బర్కత్‌పుర వైపు పారిపోయిన సాయి నల్లగొండకు చేరి తలదాచుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆర్తి, విష్ణు, నాగరాజు చనిపోయారు. పోస్టుమార్టంలో ఆర్తి గర్భవతని తేలింది. దీంతో సాయి చేతిలో చనిపోయింది నలుగురుగా తేల్చారు. నారాయణగూడ పోలీసులు సాయి, రాహుల్‌ను అదే నెల 16న అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారులు ఘటనాస్థలి నుంచి కాలిన స్థితిలో ఉన్న మగ్గును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఇన్వెస్టిగేషన్ అనంతరం 48 మందిని సాక్షులుగా చేరుస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా కొందరు సాక్షులు విముఖత చూపినా.. పెట్రోల్ చల్లేందుకు వాడిన, సగం కాలిన మగ్గు కీలకమైన భౌతిక సాక్ష్యంగా మారింది. దీన్ని తస్కరించినట్లు సాయి అంగీకరించగా.. అది తమ మగ్గే అంటూ లక్కీ కేఫ్ యజమాని సాక్ష్యం చెప్పాడు. దీన్ని సైతం ఓ కీలక ఆధారంగా పరిగణించిన న్యాయస్థానం సాయి, రాహుల్‌ను దోషులుగా తేల్చింది. గత నెల 20న (20.12.2024) సాయికి ఉరి శిక్ష, రాహుల్‌కు జీవితఖైదు విధించింది. ఈ కేసు విచారణలో నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ కీలక పాత్ర పోషించారు. -
రేపిస్టులకు, హంతకులకు మరణశిక్షే: ట్రంప్
వాషింగ్టన్: మరణశిక్షను కఠినంగా అమలు చేస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. మరణశిక్ష పడిన ఫెడరల్ ఖైదీ శిక్షలను తగ్గించిన జో బైడెన్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఉరిశిక్ష పడిన 40 మందిలో 37 మందికి పెరోల్ లేకుండా యావజ్జీవ కారాగార శిక్షను మారుస్తూ సోమవారం బైడెన్ తీసుకున్న నిర్ణయం అర్థరహితమని, బాధిత కుటుంబాలను అవమానించడమేనని ట్రంప్ విమర్శించారు. హింసాత్మక రేపిస్టులు, హంతకులు, రాక్షసుల నుంచి అమెరికన్ కుటుంబాలను, పిల్లలను రక్షించేందుకు మరణశిక్షను పకడ్బందీగా అమలు చేయాలని న్యాయశాఖను ఆదేశిస్తానని ట్రంప్ ప్రకటించారు. ‘మన దేశంలో అత్యంత దారుణమైన హంతకుల్లో 37 మందికి జో బైడెన్ మరణశిక్షను తగ్గించారు. ఇది నమ్మశక్యం కాని నిజం. దీనివల్ల బాధితుల బంధుమిత్రులు మరింత కుంగిపోతారు’అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాటా్ఫమ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. మరణశిక్షపై బైడెన్ తాత్కాలిక నిషేధం ఫెడరల్ మరణశిక్షపై బైడెన్ తాత్కాలిక నిషేధం విధించారు. ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న 40 మంది ఫెడరల్ ఖైదీల్లో 37 మందికి పెరోల్ అవకాశం లేకుండా జీవిత ఖైదుగా మారుస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్ సోమవారం ప్రకటించారు. 2013 బోస్టన్ మారథాన్ బాంబర్లలో ఒకరు, 2018లో 11 మంది యూదు ఆరాధకులను హత్య చేసిన దుండగుడు, 2015లో తొమ్మిది మంది నల్లజాతి చర్చిలలో కాల్పులు జరిపిన శ్వేతజాతి ఆధిపత్యవాదిని ఆయన తన ఉత్తర్వుల నుంచి మినహాయించారు. ఈ ఖైదీల్లో తోటి ఖైదీలను హత్య చేసిన తొమ్మిది మంది, బ్యాంకు దోపిడీల సమయంలో చేసిన హత్యలకు నలుగురు, జైలు గార్డును చంపిన కేసులో ఒకరు ఉన్నారు. బైడెన్ నిర్ణయంపై కొన్ని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఫెడరల్ ఖైదీలకు మరణశిక్షను విధించడంలో కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు మరింత కష్టతరం చేయాలని కోరుతూ న్యాయవాద గ్రూపుల నుంచి వచి్చన ఒత్తిడితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదం, విద్వేష ప్రేరేపిత సామూహిక హత్యలు కాకుండా ఇతర కేసుల్లో ఫెడరల్ మరణశిక్షలపై విధించిన నిషేధానికి అనుగుణంగా వారి శిక్షలను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం సమంజసమని బైడెన్ అన్నారు. ఏసీఎల్యూ, యూఎన్ కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఈ నిర్ణయాన్ని అభినందించాయి.అధ్యక్షుడి ప్రమేయం ఎంత? క్రిమినల్ కేసుల్లో ప్రతివాదుల కోసం ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోరే శిక్షలను నిర్దేశించడంలో లేదా సిఫారసు చేయడంలో అధ్యక్షుల ప్రమేయం ఉండదు. అయినప్పటికీ ట్రంప్ చాలా కాలంగా న్యాయ శాఖ కార్యకలాపాలపై మరింత ప్రత్యక్ష నియంత్రణను కోరుతున్నారు. తాను అధికారంలోకి రాగానే మరణశిక్షను అమలు చేయా లని విభాగాన్ని ఆదేశిస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ప్రకటించారు. పోలీసు అధికారులను చంపినవారికి, మాదకద్రవ్యాలు, మావన అక్రమ రవాణాకు పాల్పడినవారికి, యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు ఫెడరల్ మరణశిక్షను విస్తరించాలని ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు. మరణశిక్షను ఒక ముఖ్యమైన సాధనంగా తాను భావిస్తున్నానని, దానిని ఉపయోగించాలనుకుంటున్నానని ట్రంప్ చాలా స్థిరంగా చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఆచరణలో ఇది జరుగుతుందా? అనేది కష్టమైన విషయం. హత్యకు పాల్పడిన వ్యక్తులకు మరణశిక్షను ఒకప్పుడు చాలా మంది అమెరికన్లు సమరి్ధంచారు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ మద్దతు తగ్గుతోంది. అక్టోబర్‌లో జరిగిన ఓ సర్వేలు.. సగం మంది అమెరికన్లు మరణశిక్షను వ్యతిరేకించారు. 2007లో నిర్వహించిన ఓ సర్వేలో మాత్రం 10 మంది అమెరికన్లలో 7 మంది మరణశిక్షను సమరి్థంచారు. -
29మంది బాలలకు మరణశిక్ష
పిల్లలను రక్షించాల్సిన ప్రభుత్వమే వారిని శిక్షిస్తోంది. అన్యాయం, అసమానతలపై గొంతెత్తడమే వారి నేరమైంది. 29 మంది పిల్లలకు కోర్టు మరణశిక్ష విధించడం నైజీరియా లో సంచలనం రేపింది. అయితే బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలకు మరణ శిక్ష విధించడానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనుమతించకపోవడంతో బెయిలు మంజూరు చేసింది. నైజీరియాలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా జీవన వ్యయ సంక్షోభం నెలకొంది. సరైన విద్య, ఉపాధి లేదు. చివరకు ఆకలితో చనిపోయే రోజులొచ్చాయి. దీనిపై తీవ్రమైన నిరసనతో యువత సామూహిక నిరసనలను చేపట్టింది. ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో దాదాపు 20 మందిని ప్రభుత్వం కాల్చి చంపింది. వందలాది మంది యువకులను అరెస్టు చేశారు. 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 ఆరోపణలతో కేసు వేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ 76 మందిలో 29 మంది చిన్నారులు ఉండటం, వారంతా 14 నుంచి 17 ఏళ్లలోపు వారు కావడం సంచలనమైంది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆవరణలోనే నలుగురు చిన్నారులు కుప్పకూలిపోయారు. అయితే నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదని బాలుర తరఫు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో పాటు కఠినమైన ఆంక్షలు విదించింది. నైజీరియాలో 1970లో మరణశిక్షను ప్రవేశపెట్టారు. 2016 నుంచి ఉరిశిక్ష అమలులో లేదు. నైజీరియా కోర్టు సంచలన తీర్పు21 కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియా జనాభా పరంగా ఖండంలో అతిపెద్దది. ఆఫ్రికాలో ముడిచమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అయినా ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటిగా ఉంది. ఇటీవలికాలంలో ద్రవ్యోల్బణం రేటు కూడా 28 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. స్థానిక నైరా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఓవైపు ప్రజలు ఆకలితో చస్తుంటే.. ప్రభుత్వ అధికారుల జీవనశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ దేశ రాజకీయ నాయకులు ఆరోపణలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చట్టసభ సభ్యులు అత్యధిక పారితోíÙకం అందుకుంటున్నారు. ప్రభుత్వాధినేతలు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని తెలిపిన ఐక్యరాజ్యసమితి.. ఆహార సంస్థల నివేదికలో నైజీరియాను ‘ఆందోళన కలిగించే హాట్ స్పాట్’గా వర్గీకరించింది. ఈ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగాలు, ఆహార భద్రతను డిమాండ్ చేస్తూ యువత ఆందోళనలు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రిచర్డ్ మూర్కు మరణశిక్ష అమలు
కొలంబియా: స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపిన 1999నాటి కేసులో నల్ల జాతీయుడు రిచర్డ్ మూర్(59)కు సౌత్ కరోలినా జైలు అధికారులు శుక్రవారం మరణ శిక్ష అమలు చేశారు. అతడికి క్షమాభిక్ష ప్రసాదించిన శిక్షను జీవిత కారాగారంగా మార్చాలంటూ కేసును విచారించిన ముగ్గురు జ్యూరర్లు, ఒక జడ్జితోపాటు పాస్టర్లు, జైలు మాజీ డైరెక్టర్, మూర్ కుటుంబం చేసిన వినతిని గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ తోసిపుచ్చారు. దీంతో, జైలు అధికారులు శుక్రవారం సాయంత్రం రిచర్డ్ మూర్కు విషం ఇంజెక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేశారు. 1999 సెపె్టంబర్లో స్పార్టన్బర్గ్లోని ఓ రిటైల్ స్టోర్‌కు వెళ్లిన మూర్‌ను జేమ్స్ మహోనీ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. చేతికి గాయం కాగా వెంటనే స్పందించిన మూర్ అతడి మరో చేతిలోని తుపాకీని లాక్కుని ఛాతీపై కాల్చడంతో మహోనీ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఘటన సమయంలో మూర్ డ్రగ్స్ ప్రభావంతో ఉన్నాడని పేర్కొంటూ మరణ శిక్ష విధించింది. అయితే, మూర్ నేర చరితుడు కాడని, జైలులో ఉన్న సమయంలో స్రత్పవర్తనతో మెలిగినట్లు తోటి ఖైదీలు తెలిపారంటూ అతడి తరఫు లాయర్లు గవర్నర్ మెక్ మాస్టర్‌కు తెలిపారు. అటువంటి వ్యక్తి మరణశిక్ష బదులుగా క్షమాభిక్ష ప్రసాదించాలని, పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన మూర్కు మరణ శిక్ష విధించడం అన్యాయమని వాదించారు. మూర్ కేసును విధించిన జ్యూరీలో ఆఫ్రికన్ అమెరికన్లు ఒక్కరూ లేని జ్యూరీలో మరణ శిక్ష పడిన ఏకైక నల్లజాతీయుడు మూర్ అని వారు శుక్రవారం రాసిన లేఖలో గుర్తు చేశారు. అయినా క్షమాభిక్ష ఇచ్చేందుకు మెక్ మాస్టర్ నిరాకరించారు. మూర్ కుమారుడు, కుమార్తె ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ తండ్రి తమ జీవితాలపై ఎంతో సానుకూల ప్రభావం చూపారన్నారు. తండ్రి కోరిక మేరకే ఎయిర్ ఫోర్స్‌లో చేరానంటూ అలెగ్జాండ్రా మూర్ తెలిపింది. స్పెయిన్ మిలటరీ బేస్‌లోని తమ నివాసంలో ఫోన్ మోగినప్పుడల్లా ‘తాత ఫోన్ చేశాడా?’అంటూ తన ఐదేళ్ల కూతురు అడుగుతూ ఉంటుందని అలెగ్జాండ్రా అన్నారు. సౌత్ కరోలినాలో 50 ఏళ్ల క్రితం మరణ శిక్షను పునరుద్ధరించాక 45 మందికి ఆ శిక్షను విధించారు. ఇందులో ఒక్కరికి కూడా క్షమాభిక్ష ఇచి్చన దాఖలాలు లేవు. -
యూఎస్ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అభ్యర్థులైన అటు కమలా హారిస్, ఇటు డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంతోపాటు దేశ పౌరులకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని అక్రమ వలసదారులపై విరుచుకుపడ్డారు. వలసదారులను ప్రమాదకరమైన నేరస్థులుగా అభివర్ణించారు. అమెరికా పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కొలరాడోలోని ఆరోరాలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ వలసదారులపై ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే వెనిజులా గ్యాంగ్ ట్రెన్ డీ అరాగ్వాకు చెందిన ముఠా సభ్యులను లక్ష్యంగా చేసుకొని ‘ఆపరేషన్ అరోరా’ ప్రారంభిస్తానని చెప్పారు.. ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక పాలసీని ప్రస్తావిస్తూ.. చట్టవిరుద్దమైన వలసదారుల చొరబాటు పౌరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిని త్వరలోనే పరిష్కరిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.‘మన దేశాన్ని ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికాను ఆక్రమిత అమెరికా అని పిలుస్తున్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వలసదారులే లక్ష్యంగా నేషనల్ ఆపరేషన్ అరోరాను ప్రారంభిస్తా. దీంతో నవంబరు 5న అమెరికా విముక్తి దినోత్సవంగా మారుతుంది. అమెరికన్ పౌరుడిని, చట్టబద్ధంగా ఉన్న అధికారులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించే బిల్లును తెస్తాం. వెనెజువెలా గ్యాంగ్‌ను ఏరిపారేయడానికి ఆరోరాపై దృష్టిసారిస్తా. అరోరాను, దాడి చేసి స్వాధీనం చేసుకున్న ప్రతీ పట్టణాన్ని నేను రక్షిస్తా. ఈ క్రూరమైన నేరస్థులను జైలులో పెడతాం. వారిని దేశం నుంచి తరిమేస్తాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక, యూఎస్ ప్రభుత్వం దక్షిణ సరిహద్దు నియంత్రణకు మెక్సికోతో పలు సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో వలసదారుల చొరబాటు పెరిగిపోతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు.అంతేగాక మహిళలు, పిల్లల అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులతో సహా ఇతర నేరస్థులకు మరణశిక్షను పొడిగించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు. ఇక వచ్చే నెల 5వ తేదీని అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారిస్‌లు బరిలో ఉన్నారు. -
ఆరోపణ రుజువైతే సందీప్ ఘోష్‌కు మరణశిక్ష!
కోల్‌కతా ఆర్జీ కర్ ఘటనలో.. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు భారీ షాకిచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం గనుక రుజువైతే మరణశిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఆగష్టు 9వ తేదీన ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్లో యువ వైద్యురాలిపై అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని సందీప్ ఘోష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోందాల్పై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఘటన వెలుగుచూసిన అనంతరం ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ వెల్లడించింది. ఇద్దరూ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం, కప్పి పుచ్చేందుకు యత్నించడం వంటివి చేశారని ఆరోపిస్తూ.. అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరూ బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని(సీల్దా కోర్టు కాంప్లెక్స్) ఆశ్రయించారు. కేసులో తన క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని.. తప్పుడు ఉద్దేశంతో ఈ కేసులో ఇరికించారని ఘోష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. కోర్టు మాత్రం బెయిల్ అభ్యర్థతను తోసిపుచ్చింది. ‘‘సందీప్ ఘోష్‌పై ఉన్న నేరారోపణ తీవ్రమైంది. ఈ కేసులో ఆయన్ని బెయిల్‌పై విడుదల చేయడం న్యాయపరంగా వీలు కాదు. ఒకవేళ ఆయనపై ఆరోపణ రుజువైతే గనుక.. అత్యంత అరుదైన కేసుగా భావించి మరణశిక్ష విధించాల్సి వస్తుంది’’ అని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వ్యాఖ్యానించారు. అలాగే.. అభిజిత్ మోందాల్ బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. నిందితుల కస్టడీ కోరింది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీదాకా కస్టడీకి అనుమతించింది కోర్టు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్టయ్యాక మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడటంతో పాటు.. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. మరోపక్క, ఘోష్.. పాలిగ్రాఫ్ పరీక్ష, లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌లో కీలక ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు తేలింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL).. ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. ఇక..ఆయనపై నమోదైన నేరారోపణల దృష్ట్యా.. ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది.కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. -
కాంగోలో 37 మందికి మరణ శిక్ష
కిన్షాసా: ఆఫ్రికా దేశం కాంగోలో మే నెలలో జరిగిన విఫల తిరుగుబాటు యత్నం ఘటన లో పాలుపంచుకున్న ఆరోపణలపై అక్కడి కోర్టు ఏకంగా 37 మందికి మరణ దండన విధించింది. దోషుల్లో అమెరికాకు చెందిన ముగ్గురు, బెల్జియం, కెనడా, యూకేలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. అప్పీల్ చేసుకునేందుకు వీరికి కోర్టు ఐదు రోజుల గడువిచ్చింది. తిరుగుబాటుకు పాలుపంచుకున్నారంటూ మొత్తం 50 మందిపై ఆర్మీ అభియోగాలు మోపింది. కోర్టు వీరిలో 14 మందిని నిర్దో షులుగా పేర్కొంటూ విడుదల చేసింది. కో ర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ఆరుగురు విదేశీయుల తరఫు లాయర్ తెలిపారు. -
Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్షే
కోల్‌కతా: అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరిస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వచ్చేవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను పెట్టి ఈ బిల్లును ఆమోదిస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రేప్ లాంటి నేరాలను తాము ఏమాత్రం ఉపేక్షించబోమని మమత అన్నారు. అత్యాచారానికి మరణశిక్ష విధించే సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో ఆలస్యం చేసినా, రాష్ట్రపతికి పంపినా.. తాను రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టం తేవాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి టీఎంసీ శనివారం నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని తెలిపారు. గవర్నర్ తమ బిల్లును తొక్కిపెడితే రాజ్‌భవన్ ఎదుట మహిళలతో పెద్ద ఎత్తున ధర్మా చేస్తామని మమత అన్నారు. టీఎంసీ ఛాత్ర పరిషద్ వ్యవస్థాపక దినోత్సవం ర్యాలీని ఉద్దేశించి మమత బుధవారం ప్రసంగించారు. రాజ్‌భవన్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గతంలో ఒక ఉద్యోగిని ఆరోపించడాన్ని ప్రస్తావించారు. గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తమ ప్రభుత్వంపై, టీఎంసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 20 రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లను తక్షణం విధుల్లో చేర్చాల్సిందిగా కోరారు. ‘తమ సహచరిణికి న్యాయం కోరుతున్న డాక్టర్ల ఆవేదన పట్ల నేను మొదటినుంచీ సానుభూతితోనే ఉన్నాను. ఘటన జరిగి చాలా రోజులు గడిచిపోయినా జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు దిగలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ రోగులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి విధుల్లోకి తిరిగిరండి’ అని మమత విజ్ఞప్తి చేశారు. మెడికోల కెరీర్‌కు ఇబ్బంది రాకూడదనే ఒక్క డాక్టర్‌పై కూడా ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదన్నారు. ‘ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ స్వా«దీనం చేసుకొని 16 రోజులు అయింది. దర్యాప్తు పురోగతిని సీబీఐ బయటపెట్టాలి’ అని మమత డిమాండ్ చేశారు. శవాలపై రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపిచి్చందని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యను చూపి బీజేపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటోందని మండిపడ్డారు. ప్రధాని ఎందుకు రాజీనామా చేయలేదు? ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లపై మమతా తీవ్రంగా స్పందించారు. ‘ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, మణిపూర్‌లతో మహిళలపై లైంగిక దాడులు, హింసను నిరోధించలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాజీనామా చేయలేదని నేను బీజేపీ అడుగుతున్నా. అస్సాంలో ఒక నిందితుడినే ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, భవిష్యత్తులో గెలవలేమని తెలుసు కాబట్టే తన రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరి్టఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వాడి బీజేపీ పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతోందని, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోందని ఆరోపించారు. దుర్గా పూజ సంబరాలను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందన్నారు. బెంగాల్ తగలబెడితే.. ఢిల్లీ కూడా బెంగాల్‌ను అపఖ్యాతి పాల్జేయడానికి కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి కుట్ర పన్నారని బీజేపీపై మమత ధ్వజమెత్తారు. బెంగాల్‌ను తగలబెడితే అసోం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ, యూపీల్లోనూ అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం సిగ్గుచేటని బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ అన్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చేసిన ఫిర్యాదులో కోరారు. -
సంకెళ్ల సంస్కృతి మళ్లీ మొదలా?
మన దేశంలో నిందితులకు బేడీలు వేయడం అతి మామూలు విషయం. ఈ విధంగా బేడీలు వేయడం చట్టబద్ధమేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బేడీలు వేయడానికి చట్టబద్ధత లేదా? నిందితులు తప్పించుకుంటే ఎలా అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 49 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి తప్పించుకోకుండా కావలసిన నిర్బంధాన్ని పోలీసులు ఉపయోగించవచ్చు. అంతేకాని నిందితులకి సాధారణంగా బేడీలు వేయకూడదు. ఈ విషయాన్ని చాలా కేసులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ చేసినప్పుడు సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అరెస్ట్ అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను నిలుపుదల చేయడం. అది కోర్టు ఉత్తర్వుల వల్ల కావచ్చు లేక అతని మీద ఆరోపించబడిన నేరానికి జవాబు చెప్పటం కోసం కావచ్చు. అరెస్ట్ ఉద్దేశ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు అతను కోర్టులో జవాబు చెప్పటానికి, రెండవది అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించటానికి. అరెస్ట్ చేసే క్రమంలో అవసరమైన బలప్రయోగాన్ని పోలీసులు ఉపయోగించవచ్చు. అయితే ఆ వ్యక్తి అరెస్ట్‌ని నిరోధించినప్పుడు మాత్రమే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది. జీవిత ఖైదు కానీ మరణ శిక్ష కానీ విధించే నేరం చేసిన వ్యక్తులను అవసరమైతే చంపటానికి కూడా అవకాశం ఉంది. అంతే కానీ సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. సంకెళ్ళు వేయడాన్ని చట్టం ఆమోదించదు. సంకెళ్ళు వేయడం లాంటి చర్యలు అమానుషమనీ, ముద్దాయి గౌరవానికి భంగం కలిగించడమనీ చాలా కేసుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 లకు సంకెళ్ళు వేయడం అనేది విరుద్ధం. సంకెళ్ళు, బంధనాలు శిక్షపడిన ఖైదీలకు కానీ విచారణలో ఉన్న ఖైదీలకు కానీ వేయడానికి వీలులేదు. కోర్టు ముందు హాజరు పరిచిన ముద్దాయిలకు సంకెళ్ళు వేయాలంటే మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. ఆ వ్యక్తి పారిపోడానికి ప్రయత్నం చేస్తాడని ఆధారాలు ఉన్నపుడు, పోలీసుల కస్టడీ నుంచి పారిపోతాడని కచ్చితంగా భావించినప్పుడు, అరుదైన కేసుల్లో, హింసాత్మకమైన ప్రవృత్తి ఉన్నప్పుడు, వాళ్ళు అపాయకరమైన వ్యక్తులు అయినప్పుడు మేజిస్ట్రేట్ ఈ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా నిర్ణయానికి రావడానికి మేజిస్ట్రేట్ కారణాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో స్పష్టం చేసింది. అందులో ప్రముఖమైన కేసు ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ (ఏఐఆర్ 1980 సుప్రీం కోర్టు 1535). ఒకవేళ పోలీసులు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి సంకెళ్ళు వేసినట్లైతే వారు కోర్టు ధిక్కార నేరం కింద శిక్షింపబడతారని సుప్రీంకోర్టు సిటిజెన్స్ డెమొక్రసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం 1996 సుప్రీంకోర్టు కేసెస్ (క్రిమినల్) 612 లో స్పష్టం చేసింది. సంకెళ్ళు వేయకుండా ముద్దాయి తప్పించుకోకుండా ఉండడానికి సుప్రీంకోర్టు ప్రేమ్ శంకర్ శుక్లా కేసులో కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించింది. అవి ఎస్కార్ట్‌లో ఉన్న పోలీసుల సంఖ్య పెంచాలి. వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి. వారికి సరైన శిక్షణ కూడా ఇవ్వాలి. అయితే కొత్తగా వచ్చిన ‘భారతీయ నాగరిక సురక్ష సంహిత’ సంకెళ్ళు వేయడం విషయంలో అనుమతి ఇచ్చింది. ఈ కొత్త చట్టం లోని సెక్షన్ 43లో అరెస్ట్ ఎలా చేయాలో చెప్పారు. అదే విధంగా సబ్ సెక్షన్ 3లో అరెస్ట్ చేసినప్పుడు సంకెళ్ళు వేయడం గురించి కూడా చెప్పారు. నేర స్వభావాన్ని నేర తీవ్రతను బట్టి అరెస్ట్ చేసిన వ్యక్తులకు సంకెళ్ళు వేయవచ్చు. అలవాటుపడిన నేరస్థులకు, మళ్ళీ మళ్ళీ నేరం చేసిన వ్యక్తులకు, కస్టడీ నుంచి తప్పించుకున్న వ్యక్తులకు, వ్యవస్థీకృత నేరం చేసిన వ్యక్తులకు, తీవ్రవాద చర్యలు పాల్పడిన వ్యక్తులకు, మాదక ద్రవ్యాల నేరాలు చేసిన వ్యక్తులకు, ఆయుధాలు, మందుగుండు సామాను అక్రమంగా కలిగిన వ్యక్తులకు; హత్య, రేప్, యాసిడ్ దాడి, నకిలీ నాణాలు, నోట్లు కలిగి ఉన్న వ్యక్తులకు, మనుషుల అక్రమ రవాణా చేసే వ్యక్తులకు, పిల్లలపై సెక్స్ నేరాలు చేసిన వ్యక్తులకు, రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తులకు పోలీసులు సంకెళ్ళు వేయవచ్చని ఈ నిబంధన చెప్తుంది. రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు ఏమిటి అనే విషయంలో స్పష్టత లేదు. అందుకని అందరికీ సంకెళ్ళు వేసే అవకాశం ఉంది. మళ్ళీ నేరం చేసిన వ్యక్తులకు సంకెళ్ళు వేయవచ్చు. దీన్ని చట్టంలో నిర్వచించలేదు. అందుకని ఇది కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు భార్యా భర్తల మధ్య తగువు ఏర్పడి కట్నం కోసం వేధిస్తున్నారన్న దరఖాస్తుతో బాటు మరెన్నో కేసులను పెట్టిన సందర్భాలను మనం చూస్తున్నాం. ఆ కేసులు నిజమైనవా అబద్ధమైనవా అన్న విషయం అప్పుడు తెలియదు. ఈ కేసులు భర్త మీదే కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా పెడుతున్నారు. అలాంటప్పుడు వారందరికీ సంకెళ్ళు వేసే పరిస్థితి చట్టం కల్పిస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంతటి అసౌకర్యానికి గురవుతారో, ఎంతటి అవమానానికి గురవుతారో ఊహించవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇట్లా ఎన్నో కేసులను ఉదాహరించవచ్చు. చట్టం అనుమతి ఇవ్వనప్పుడే సంకెళ్ల సంస్కృతి మన దేశంలో ఉంది. సంకెళ్ళు వేయడమే కాదు నేరారోపణలకు గురి అయిన వ్యక్తులను ఊరేగించడం మనం చూస్తున్నాం. ప్రజలు ఆవిధంగా కోరుకుంటున్నారు కాబట్టి మేము ఊరేగిస్తున్నామని పోలీసులు అంటారు. చట్టం అనుమతి ఇవ్వనప్పుడు ఆ విధంగా ఊరేగించటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కొన్ని సందర్భాలలో సంకెళ్ళు వేయడాన్ని చట్టం అనుమతి ఇస్తుంది. ఇలాంటప్పుడు సంకెళ్ళు వేసి దుర్వినియోగం చేసే పరిస్థితి ఎక్కువ అవుతుంది. సంకెళ్ళు వేయడం రాజ్యాంగ విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీం కోర్టు చాలా కేసుల్లో చెప్పింది. ఆ తీర్పులన్నింటినీ ప్రక్కన పెట్టి కొత్త చట్టంలో సంకెళ్ళు వేసే వెసులుబాటును పార్లమెంటు కల్పించింది. ఈ వెసులుబాటు మరెంత దుర్వినియోగం అవుతుందో వేచి చూడాలి.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ ‘ 9440483001 -
రచ్చ రేపిన కొత్త మరణ దండన
ప్రపంచదేశాల్లో ఇప్పటి వరకూ మరణ శిక్ష... ఉరి, విద్యుత్ కుర్చీ, విషపు ఇంజెక్షన్స్, తుపాకీ కాల్పులు వంటి పద్ధతుల ద్వారా ఎక్కువగా అమలవుతూ వస్తోంది. కానీ ప్రపంచంలోనే తొలి సారిగా అమెరికాలో ఓ 58 ఏళ్ల హంతకుడికి నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష విధించారు. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య సహా పలు సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ తరహా మరణశిక్ష అమలు అనాగరికమంటూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రమైన అల బామాలో ఇటీవలే ప్రయోగాత్మకంగా స్మిత్ అనే ఖైదీకి మాస్క్ తగిలించి అందులో నైట్రోజన్ గ్యాస్ పంపడం ద్వారా అతన్ని అపస్మారక స్థితి లోకి తీసుకెళ్లి మరణశిక్షను విజయవంతంగా అమలు చేశారు. అంతే కాదు ఈ మరణశిక్ష అమ లును వీక్షించేందుకు కెన్నెత్ స్మిత్ కుటుంబీకులు, బాధిత కుటుంబ సభ్యులు, లాయర్లను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించారు. చాలా సులువుగా కేవలం 22 నిమిషాల వ్యవధిలో కెన్నెత్ స్మిత్ ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఇప్పుడు దీన్ని అమలు చేసిన అమెరికా మాత్రం ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడింది. స్వదేశంలోనే ఈ మరణదండనపై తీవ్ర నిరస నలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి, ఐరోపా దేశాల సమాఖ్య (ఈయూ)లు అమెరికా తీరును ఖండించాయి. ఈ ఖండనలు, నిరసనలు ఏ స్థాయిలో ఉన్నా యంటే స్వయంగా వైట్ హౌస్ ఈ నైట్రోజన్ గ్యాస్ మరణ శిక్ష తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందనీ, ఇది క్రూరంగానే ఉందనీ అంగీకరించింది. అమెరికాలో తాజాగా రెండు మరణశిక్షలు ఇంజెక్షన్ ద్వారా అమలు చేశారు. ప్రస్తుతం నైట్రోజన్ మరణశిక్షను అమలు చేసిన అల బా మాతో పాటు మరో రెండు రాష్ట్రాలు ఓక్లహోమా, మిస్సిసిపీలు ఈ తరహా మరణ శిక్ష అమలును ఆమోదించాయి. తాజాగా జరిగిన నైట్రోజన్ మరణశిక్ష అమలును అలబామా అటార్నీ జన రల్ స్టీవ్ మార్షల్ సమర్థించుకున్నారు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ పద్ధతిలో జరిగిందన్నారు. కెన్నెత్ యూజీన్ స్మిత్‌కు ప్రాణాంతకమైన మందులతో మరణశిక్ష అమలు చేయాలని 2022 నవంబర్‌లో నిర్ణయించారు. జైలు సిబ్బంది ఒక ఇంట్రావీనస్ లైన్‌ను చొప్పించారు. అయితే ప్రాణాంతక ఇంజెక్షన్‌ను ఇవ్వడానికి రెండు లైన్లు అవసరం. రెండవ లైను చొప్పించడానికి వారు ఒక గంట పాటు పోరాడిన తర్వాత, ఉరిశిక్ష రద్దు చేశారు. కానీ స్మిత్ 1988లో ఒక బోధకుని భార్యను కిరాయికి చంపిన కేసులో ఇటీవల దోషిగా తేలడంతో మరణ శిక్ష విధించింది కోర్టు. ఈ శిక్షను నైట్రోజన్ వాయువును ఉపయోగించి అమలు చేశారు. అమెరికా రాష్ట్రాలు కొన్ని ఇప్పటికీ ఉరి, ఫైరింగ్ స్క్వాడ్ లేదా ఎలక్ట్రిక్ కుర్చీ ద్వారా మరణ దండన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్ర న్యాయస్థానాలు మాత్రం పలు రకాల మరణశిక్ష పద్ధతులను నిషేధించాయి. అయితే, గత కొన్ని దశాబ్దాల కాలంలో చాలా రాష్ట్రాలు ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్షను అమలు చేయడానికి అంగీకరించాయి. స్మిత్‌కు మునుపటి ఉరిశిక్ష అమలుకు చాలా నెలల ముందు, అలబామా అధికారులు మరో ఖైదీ అలాన్ మిల్లర్‌కు ఐవీ సూదిని చొప్పించడంలో ఇబ్బందుల కారణంగా మరణశిక్ష అమలు చేయడంలో విఫలమయ్యారు. అలాగే ఇతర ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా కూడా మరణశిక్ష అమలు కాలేదు. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలు ఇటీవల ప్రాణాంతక ఇంజెక్షన్ మందులను పొందడంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఔషధ తయారీదారులు యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్లు 2011లో ఇటువంటి ప్రాణాంతక ఇంజె క్షన్ల ఎగుమతులను నిషేధించాయి. దీంతో ఔషధ తయారీ కంపెనీలు వాటి తయారీని నిలిపివేశాయి. ఈ కారణంగా మరణ శిక్షను అమలు చేయడానికి రాష్ట్రాలుఇతర మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. అందులో ఒకటి నైట్రోజన్ వాయువును అందించి ప్రాణాలు తీయడం. దోషి కెన్నెత్ స్మిత్ ముఖానికి మాస్క్ కట్టి, స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును జైలు అధికారులు అందించారు. వాయువు విషపూరితమైనది కాదు. భూ వాతావరణంలో మూడు వంతుల కంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. కానీ స్వచ్ఛమైన సాంద్రీకృత రూపంలో ఉన్న ఈ గ్యాస్‌ను పీల్చడం వల్ల మెదడుకు ప్రసారం అయ్యే ఆక్సిజన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అల బామా స్టేట్ అటార్నీ జనరల్ స్టీవ్ మార్షల్ మాట్లాడుతూ... నైట్రోజన్ వాయువును ఉప యోగించి, మరణశిక్షను అమలు చేయడం అత్యంత మానవీయమైన పద్ధతి’ అని పేర్కొ నడం గమనార్హం. – వి.వి. వెంకటేశ్వరరావు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 63008 66637 -
నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు
అట్మోర్(అమెరికా): మూడు దశాబ్దాల క్రితం వేయి డాలర్ల సుపారీ తీసుకుని ఒక మహిళను హత్యచేసిన కేసులో దోషికి అమెరికా నూతన పద్ధతిలో మరణశిక్షను అమలుచేసింది. 58 ఏళ్ల కెన్నెత్ ఎజీన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలాచేసి మరణశిక్షను అమలుచేసింది. ఇలా నైట్రోజన్గ్యాస్ను వాడి దోషికి మరణశిక్షను అమలుచేయడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఈ శిక్షను స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి అమలుచేశారు. అమెరికాలో 1982 ఏడాది నుంచి విషం ఇంజెక్షన్‌తో దోషులకు మరణశిక్షను అమలుచేయం మొదలెట్టాక మరో నూతన శిక్షా విధానాన్ని అమల్లోకి తేవడం ఇదే తొలిసారి. ఎలా అమలుచేశారు?: అట్మోర్ నగరంలోని హోల్మ్యాన్ కరెక్షన్ ఫెసిలిటీలో నైట్రోజన్ హైపోక్సియా శిక్ష అమలు ప్రక్రియను ఐదుగురు మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి చూపించారు. నైట్రోజన్ గ్యాస్ నింపిన సిలిండర్ పైపును దోషి స్మిత్ ముక్కుకు బిగించిన మాస్క్ ద్వారా శరీరంలోకి పంపించారు. స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ అనేది ప్రాణాధారమైన ఆక్సీజన్‌ను శరీరకణాలకు అందకుండా చేస్తుంది. దీంతో కణాలు ఆక్సీజన్ లేక క్షణాల్లోని మృతిచెందుతాయి. దీంతో మరణం సంభవిస్తుంది. రాత్రి 7.53 గంటలకు గ్యాస్‌ను పంపించారు. 8.25 గంటలలోపు అతను మరణించినట్లు ప్రకటించారు. ఏమిటీ కేసు?: చార్లెస్ సెన్సెట్ అనే మతాధికారి 1980లలో భారీగా అప్పులుచేశాడు. భార్యను చంపేస్తే బీమా సొమ్ము వస్తుందని ఆమె హత్యకు పథకం వేశాడు. చార్లెస్ నుంచి సుపారీ తీçసుకుని జాన్ ఫారెస్ట్ పార్కర్, స్మిత్ ఆయన భార్య ఎలిజబెత్‌ను చంపేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చాత్తాపంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2010లో పార్కర్‌కు అమలు శిక్షను అమలుచేయగా తాను నిర్దోషినంటూ ఇన్నాళ్లూ స్మిత్ కోర్టుల చుట్టూ తిరిగారు. జ్యూరీ జీవితఖైదు సిఫార్సుచేయగా జడ్జి ఏకంగా మరణశిక్ష విధించారు. ఇంతవరకూ లేని కొత్త విధానంలో శిక్ష అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. దీనిపై గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఇంతవరకు వాడని, క్రూరమైన, అసాధారణ శిక్షా విధానాన్ని ఎలా అమలుచేస్తారని స్మిత్ లాయర్లు వాదించినా శిక్ష అమలుకే కోర్టు పచ్చజెండా ఊపింది. -
ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణ శిక్ష రద్దు
న్యూఢిల్లీ: ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడిన 8 మంది భారత నావికాదళం మాజీ అధికారులకు భారీ ఊరట లభించింది. వారికి విధించిన మరణ శిక్షను ఖతార్ అప్పిలేట్ కోర్టు రద్దు చేసింది. ఈ శిక్షను కేవలం జైలు శిక్షగా మారుస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. అయితే, వారు ఎంతకాలం జైలులో శిక్ష అనుభవించాలన్నది తెలియరాలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ కేసులో ఖతార్ కోర్టు 8 మందికి శిక్షను తగ్గించినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. గూఢచర్యం కేసులో 8 మంది నేవీ మాజీ అధికారులు 2022 ఆగస్టులో ఖతార్‌లో అరెస్టయ్యారు. అప్పిలేట్ కోర్టు తాజా తీర్పును భారత దౌత్య విజయంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాప్–28 సదస్సు సందర్భంగా ఇటీవల దుబాయ్‌లో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్–థానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖతార్‌లో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష గురించి ఈ భేటీలో మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. శిక్ష నుంచి వారికి విముక్తి కలి్పంచాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తి పట్ల ఖతార్ పాలకులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమంపై అల్–థానీతో చర్చించినట్లు ఈ భేటీ తర్వాత మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరణ శిక్షను రద్దు చేసి, జైలు శిక్షగా కుదిస్తూ ఖతార్ కోర్టు తీర్పు ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటాం ఖతార్ కోర్టు తాజా తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. తదుపరి చర్యల విషయంలో న్యాయ నిపుణులతో, బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. కోర్టులో గురువారం జరిగిన విచారణకు ఖతార్‌లోని భారత రాయబారి, ఇతర అధికారులు, బాధితుల కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారని తెలియజేసింది. బాధితులకు అండగా ఉంటామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేసింది. ఏమిటీ కేసు? 8 మంది భారత మాజీ అధికారులు ఖతార్ రాజధాని దోహాకు చెందిన అల్–దాహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ఈ సంస్థ ఖతార్ సైనిక దళాలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ ఇస్తోంది. ఇతర సేవలు అందిస్తోంది. అల్–దాహ్రా సంస్థలో పని చేస్తున్న 8 మంది భారతీయులను గత ఏడాది ఆగస్టులో ఖతార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ రహస్యాలను చోరీ చేస్తున్నట్లు వారిపై అభియోగాలు మోపారు. ఇతర దేశాలకు సమాచారం చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. అయితే, ఈ అభియోగాలను బహిరంగపర్చలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఖతార్ కోర్టు 8 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచి్చంది. దీంతో భారత ప్రభుత్వం న్యాయ పోరాటం ప్రారంభించింది. శిక్షను వ్యతిరేకిస్తూ ఖతార్‌లోని కోర్టు ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించింది. ఖతార్‌లో శిక్ష పడిన వారిలో నవతేజ్ గిల్, సౌరభ్ వశి‹Ù్ట, పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్‌పాల్, ఎస్.కె.గుప్తా, బి.కె.వర్మ, సుగుణాకర్ పాకాల, సైలర్ రాగేశ్ ఉన్నారు. వీరిలో సుగుణాకర్ పాకాల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారు. -
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట..
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళానికి చెందిన మాజీ అధికారులకు ఊరట లభించింది. ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మందికి విధించిన మరణ శిక్షను ఖతార్ కోర్టు తగ్గించింది. దీనిని జైలు శిక్షగా మారుస్తున్నట్లు తీర్పునిచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు బయటకు రాకపోవడంతో.. శిక్షను ఎంత తగ్గించారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు న్యాయ బృందంతోపాటు బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం పేర్కొంది. తాము మొదటి నుంచి భారతీయ మాజీ నేవీ అధికారులకు అండగా ఉన్నామని, రాయబార సంప్రదింపులతోపాటు చట్టపరమైన సహాయాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది. దీనిపై ఖతార్ అధికారులతోనూ చర్చిస్తున్నట్లు తెలిపింది. చదవండి: నిజ్జర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం?! కాగా భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు గూఢచర్యం కేసు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేసిన భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్‌లో వారికి మరణశిక్ష విధించింది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణ శిక్ష అపీల్‌పై ఖతార్ కోర్టు విచారణ జరిపి.. మరణ శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది. -
యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ
ఢిల్లీ: యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సుకు నిరాశే ఎదురైంది. ఆమె మరణశిక్షపై దాఖలు చేసిన అప్పీల్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరోవైపు తన కూతుర్ని విడిపించడానికి యెమెన్ వెళ్లాలని బాధితురాలి తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని గురువారం కోరింది. కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే మహిళ తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందే ప్రయత్నంలో తలాల్ అబ్దో మహదీ అనే వ్కక్తికి మత్తుమందు ఇచ్చి చంపినట్లు కోర్టు దోషిగా తేల్చింది. మరణశిక్ష విధించింది. ఈ కేసులో 2017 నుంచి నిమిషా ప్రియ యెమెన్‌లో జైలు శిక్ష అనుభవిస్తోంది. అరబ్ దేశంలో అంతర్యుద్ధం కారణంగా 2017 నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉంది. అయినప్పటికీ యెమెన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియను విడుదల చేయడానికి మహదీ కుటుంబంతో నష్టపరిహారం గురించి చర్చలు జరపడానికి యెమెన్ వెళ్లాలని కోరుకుంటోంది. తన బిడ్డను కాపడటానికి తప్పకుండా యెమెన్ వెళ్లాల్సి ఉందని ధర్మాసనానికి ప్రియ తల్లి విన్నవించుకున్నారు. అందుకు ప్రయాణ నిషేధం అడ్డుగా ఉందని పేర్కొన్నారు. యెమెన్ ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చని ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులు యెమెన్ వెల్లడానికి ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రియా విడుదల కోసం "సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్" అనే బృందం 2022లో హైకోర్టును ఆశ్రయించింది. నిమిషా ప్రియను రక్షించేందుకు దౌత్యపరమైన జోక్యం చేసుకోవడంతో పాటు కేంద్రం చర్చలు జరపాలని కోరింది. అయితే.. ప్రియాను రక్షించడానికి పరిహారం గురించి చర్చలు జరపాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు తెలిపింది. ఆమెను దోషిగా నిర్ధారించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ధర్మాసనం వెల్లడించింది. ఇదీ చదవండి: లాటరీలో రూ.45 కోట్లు గెలుచుకున్న కేరళవాసి -
అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు
ఢిల్లీ: ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారుల విషయంలో భారత ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అప్పీల్‌కు వెళ్లినట్లు గురువారం ప్రకటించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇది సున్నితమైన అంశమని, ప్రచారంలోకి వస్తున్న ఊహాగానాల్ని నమొద్దని కోరుతోంది. ‘‘ఈ సమస్యకు సంబంధించి ఖతార్‌లోని భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. తీర్పు గోప్యతకు సంబంధించిన అంశం. కేవలం న్యాయ బృందానికి మాత్రమే తీర్పు సంబంధిత వివరాల్ని తెలియజేస్తారు. అందుకే ఈ వ్యవహారంలో ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దు’’ అని విదేశీ వ్వవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ఎనిమిది మందిని కిందటి ఏడాది ఆగష్టులో అరెస్ట్ చేశారు. అక్టోబర్ నెలలో ఖతార్ కోర్టు వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది కూడా. ‘‘ఆ ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే ఢిల్లీలో ఆ కుటుంబ సభ్యుల్ని కలిశారు. వీలైనంత మేర దౌత్య, న్యాయపరమైన సహాయం వాళ్లకు అందించేందుకు సిద్ధం. మంగళవారం నుంచే దౌత్యపరమైన సాయం వాళ్లకు అందుతోంది. ఈ సున్నితమైన వ్యవహారంలో ఊహాగానాలు నమ్మొద్దు అని బాగ్చీ మరోసారి అన్నారు. ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులలో ఒకప్పుడు ప్రధాన భారతీయ యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన వాళ్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్ సమయంలో వాళ్లంతా దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ & కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. దహ్రా అనేది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ సేవలను అందించే ఒక ప్రైవేట్ సంస్థ. -
ఖతార్ ‘మరణ’ మృదంగం!
గల్ఫ్ దేశాల్లో పనిచేయటం కత్తిమీది సాము. అక్కడ అమలయ్యే చట్టాలు, న్యాయవ్యవస్థ తీరు తెన్నులు భిన్నమైనవి. కనుక ఉపాధి కోసం వెళ్లినవారు ఎంతో జాగురూకతతో వుంటారు. అందువల్లే ఆ దేశాల్లో ఒకటైన ఖతార్‌లో అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మన నావికాదళ మాజీ అధికారులు ఎనిమిది మంది గూఢచర్యం ఆరోపణల సాలెగూటిలో చిక్కుకోవటం, అక్కడి న్యాయస్థానం గురువారం వారికి మరణదండన విధించటం అందరినీ కలవరపెట్టింది. వాస్తవానికి గూఢచర్యం ఆరోపణలున్నాయని మీడియాలో కథనాలు రావటం మినహా అధికారికంగా ఖతార్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఖతార్‌తో నిరుడు ఆగస్టు నుంచి సంప్రదింపులు జరుపుతూ, వారి విడుదలకు కృషి చేస్తున్న మన విదేశాంగ శాఖ కూడా ఏమీ చెప్పలేదు. న్యాయస్థానంలో విచారణ సరేసరి. అంతా గోప్యంగా ముగిసిపోయింది. మరణశిక్ష పడినవారు సాధారణ వ్యక్తులు కాదు. మన నావికాదళంలో పనిచేసినన్నాళ్లూ తమ సత్తా చాటినవారు. వీరిలో తెలుగువారైన సుగుణాకర్ పాకాల కమాండర్ స్థాయిలో పనిచేసి రిటైరయ్యారు. తన సర్వీసు కాలంలో రెండుసార్లు నావికాదళ నౌక ఐఎన్ఎస్ తరంగిణిపై ఒంటరిగా వెళ్లి భూమధ్య రేఖప్రాంతంలో అట్లాంటిక్, పసిఫిక్ మహా సము ద్రాలను దాటివచ్చినవారు. ఇతరులు కూడా నావికాదళ విభాగాల్లో నిపుణులు, లబ్ధ ప్రతిష్టులు. ఒక సందర్భంలో అందరినీ స్వదేశం వెళ్లేందుకు సిద్ధంగా వుండమని చెప్పిన ఖతార్ అధికారులు అంత లోనే నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. వీరు పని చేసిన అల్ దహ్రా గ్లోబల్ సంస్థ నిర్వాహకులను కూడా అరెస్టు చేసిన ఖతార్ అధికారులు రెండు నెలలకే వారిపై ఎలాంటి విచారణ లేకుండా విడుదల చేశారు. మరి భారతీయుల విషయంలో ఈ వివక్ష ఎందుకో అర్థం కాని విషయం. ఇటలీ నుంచి ఖతార్ సమకూర్చుకున్న యు 212 జలాంతర్గామిపై ఆ దేశ నావికాదళ సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు హఠాత్తుగా వీరిని అరెస్టు చేశారంటున్నారు. ఆ జలాంత ర్గామి సాంకేతిక వివరాలను ఇజ్రాయెల్‌కు చేరేశారన్నది ప్రధాన అభియోగమని చెబుతున్నారు. నేరారోపణలు ఎదుర్కొన్నవారికి న్యాయసహాయం లభించిందా... అసలు వారిపై వున్న ఆరో పణలు ఏమిటన్నది వెల్లడి కాలేదు. కనీసం కుటుంబ సభ్యులకైనా ఆ వివరాలు అందించారా లేదా అన్నది అనుమానమే. సాధారణంగా గూఢచర్యం కేసుల్లో ప్రభుత్వాలు ఎక్కడలేని గోప్యతా పాటి స్తాయి. ఇందువల్ల అటు ముద్దాయిలకు అన్యాయం జరగటంతోపాటు ఆ దేశానికి కూడా అంత ర్జాతీయంగా చెడ్డపేరొస్తుంది. ఖతార్‌కు ఈ విషయాలు తెలిసేవుండాలి. ఖతార్‌తో వున్న ద్వైపాక్షిక సంబంధాలను వినియోగించుకుని వీరందరి విడుదలకూ మన దేశం చేసిన ప్రయత్నాలను ఆ దేశం వమ్ముచేసింది. అక్కడి మీడియా సంస్థలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఈ కేసు లొసుగులను ఎత్తి చూపుతూ రాసిన కథనం తమ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నదని ఆగ్రహించి ఆమెను సైతం అరెస్టు చేయటానికి ఖతార్ అధికారులు ప్రయత్నించారని ఒక ఆంగ్ల దినపత్రికలో ఇటీవలే కథనం వెలువడింది. దీనిపై ముందుగా ఉప్పందటంతో ఆ జర్నలిస్టు, అక్కడ వేరే ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త హుటాహుటీన ఆ దేశం విడిచి భారత్ వచ్చారని ఆ కథనం తెలిపింది. ఈ కేసుపై మొత్తంగా ఏడు వాయిదాల్లో విచారణ జరిగిందని చెబుతున్నారుగానీ, దాని తీరుతెన్నులెలా వున్నాయో జర్నలిస్టుకు ఎదురైన చేదు అనుభవమే తేటతెల్లం చేస్తోంది. ఆరోపణలొచ్చినంత మాత్రాన అన్నీ నిజమైపోవని ఖతార్‌కు తెలియదనుకోలేం. ఎందుకంటే ఆ దేశానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయంటూ ఆరేళ్ల క్రితం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) నుంచి దాన్ని సౌదీ అరేబియా సాగనంపింది. కానీ చివరికి మళ్లీ ఖతార్‌తో సంధి కుదుర్చుకోక తప్పలేదు. ఉగ్రవాదులుగా ముద్రపడిన తాలిబన్లకు ఆశ్రయం ఇచ్చి, వారితో అమె రికా చర్చలు జరిపేలా చేయటంలో ఖతార్ విజయం సాధించింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌లో చొరబడి ఆ దేశ పౌరులను కాల్చిచంపి, అనేకమందిని బందీలుగా పట్టుకున్న హమాస్‌కు సైతం ఖతార్‌లో కార్యాలయం వుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే హమాస్ తీవ్రవాదులు బందీల్లో ఇద్దరు అమెరికన్ పౌరులను విడుదల చేశారు కూడా. వీటన్నిటినీ చూపి ఖతార్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించాల్సిన అవసరం లేదు. గల్ఫ్ దేశాల్లో ఖతార్ చూడటానికి చిన్న దేశమే కావొచ్చుగానీ, దానికుండే సహజ వనరులు అపారమైనవి. దాని తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఖతర్కూ, ఇరాన్‌కూ మధ్య సముద్ర జలాల్లో అపారమైన సహజవాయు నిక్షేపాలున్నాయి. అందుకే ఆ దేశంతో ఖతార్‌కు స్నేహ సంబంధాలున్నాయి. ఇతర గల్ఫ్ దేశాల తీరు ఇందుకు భిన్నం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణశిక్ష పడినవారికి 2015లో భారత్–ఖతార్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ఒక ఆశాకిరణం. దాని ప్రకారం యావజ్జీవ శిక్ష పడినవారిని స్వదేశంలో శిక్ష అనుభవించటానికి వీలుగా వెనక్కిపంపే వీలుంటుంది. ప్రస్తుతం మరణశిక్ష పడిన ఎనిమిదిమందీ ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకుంటే వారిని నిర్దోషులుగా విడుదల చేయొచ్చు. కనీసం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చే అవకాశం వుంటుంది. అదే గనుక జరిగితే 2015 ఒప్పందం కింద వీరిని భారత్ పంపే వీలుంటుంది. ఏదేమైనా ఈ వ్యవహారం మన దౌత్య నైపుణ్యానికి పెద్ద పరీక్ష. గత తొమ్మిది నెలలుగా తెరవెనక సాగించిన యత్నాలు పెద్దగా ఫలించలేదు. కనీసం ఇకముందైనా ఖతార్‌ను ఒప్పించటంలో, అది సహేతుకంగా వ్యవహరించేలా చేయటంలో మన ప్రభుత్వం విజయం సాధించాలని ఆశించాలి. -
నేను అప్పుడే చెప్పినా..పట్టించుకోలేదు: అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ వైరల్
సాక్షి, హైదరాబాద్: గూఢచర్య ఆరోపణలతో భారత నేవీకి చెందిన ఎనిమిది మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మాజీ నావికాదళ అధికారులు ఇపుడు మరణం అంచున ఉండటం దురదృష్టకరమంటూ ఆయన ట్వీట్ చేశారు. (భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!) ఖతార్‌లో చిక్కుకున్న నావికాదళ మాజీ అధికారుల సమస్యను ఆగస్టులో పార్లమెంట్లో లేవనెత్తినట్లు ఒవైసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ఇస్లామిక్ దేశాలు తనను ఎంతగా ప్రేమిస్తున్నాయని గొప్పగా చెప్పుకునే ప్రధాని మోదీ మరణశిక్షను ఎదుర్కొంటున్న మన మాజీ నావికాదళ అధికారులను వెంటనే వెనక్కి తీసుకురావాలని ఒవైసీ డిమాండ్ చేశారు. కాగా ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులోఘీ ఎనిమిది మంది అధికారులను ఖతార్అదుపులోకి తీసుకుంది. వీరికి ఖతార్ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సాధ్యమయ్యే అన్ని చట్టపరమైన చర్యలను అన్వేషిస్తున్నట్లు ప్రకటించింది. In August, I had raised the issue of our ex-naval officers stuck in #Qatar. Today they have been sentenced to death. @narendramodi has boasted about how much “Islamic countries” love him. He must bring our ex-naval officers back. It’s very unfortunate that they face the death row pic.twitter.com/qvmIff9Tbk — Asaduddin Owaisi (@asadowaisi) October 26, 2023 -
భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష!
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళానికి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్‌లో మరణశిక్ష విధించారు. గురువారం ఖతార్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వెల్లడించింది. అయితే.. ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై అప్పీలుకు వెళ్లనున్నట్టు ప్రకటించింది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు వివరణాత్మక కాపీ కోసం ఎదురు చూస్తున్నామనీ, బాధితుల కుటుంబ సభ్యులు, న్యాయవాద బృందంతో చర్చించి అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు అధిక ప్రాముఖ్యతనిస్తామని, అన్ని రకాల సాయాన్ని అందిస్తామని వెల్లడించింది. గూఢచర్యం కేసులో ఈ 8 మందిని గతంలో అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. ఇండియన్ నేవీకి చెందిన 8 మందితో పాటు ఖతార్‌కు చెందిన మరో ఇద్దరిపై కూడా గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నట్లు ఖతార్ అధికారులు వాదన. వీరి బెయిల్ పిటీషన్లను పలుమార్లు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా తీర్పు సంచలనం రేపుతోంది. నిందితులు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పని చేస్తున్న క్రమంలో ఇటలీనుంచి అధునాతన జలాంతర్గాముల కొనుగోలుకు ఖతార్ రహస్యకార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్‌కు అందించా రనేది వారి ఆరోపణ. ఖతార్ అధికారులతో కలిసి ఈ నిఘాకు పాల్పడినట్టు ఆరోపింది. ఇదే కేసులో ఒక ప్రైవేటు డిఫెన్స్ కంపెనీ సీఈవోను, ఖతార్‌కు చెందిన అంతర్జాతీయ సైనిక కార్యకలాపాల అధిపతిని కూడా అరెస్ట్ చేసింది. వీరందరినీ భారతీయ నౌకాదళానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఎనిమిది మందిని 2022 ఆగస్టులో ఖతార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పటినుంచి అంటే ఏడాదికిపైగా కాలంగా వీరంతా జైల్లోనే ఉన్నారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్ నవతేజ్‌సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, అమిత్‌నాగల్, పురేందు తివారి, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, సెయిలర్ రాజేశ్ ఉన్నారు. -
నిఠారీ హత్యలు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశ్యవ్యాప్తంగా చర్చనీయాశమైన నిఠారీ హత్యల కేసులో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది.ముఖ్యంగా సురీందర్ కోలికి మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు కోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురీందర్ కోలీపై ఉన్న 12 కేసుల్లో నిర్దోషిగా తేల్చింది. అలాగే మరో నిందితుడు వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధేర్‌పై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషి అని కోర్టు సోమవారం నిర్ధారించింది. అత్యాచారం, హత్య ఆరోపణలపై దోషులుగా తేల్చిన ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ కోలీ, పంధేర్‌లు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్వీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్‌పై మొత్తం 6 కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా కోర్టు తేల్చిందని మోనీందర్ సింగ్ పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ వెల్లడించారు. 2006లో నోయిడాలోని నిథారీ ప్రాంతంలో మధ్య మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు కలకలం రేపాయి. 2006, డిసెంబరు 29న నోయిడాలోని నిథారీలోని పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో ఈ సంచల హత్యలు వెలుగులోకి వచ్చాయి. సురీందర్, పంధేర్ ఇంట్లో పనిమనిషిగా ఉండేవాడు. ఈ సందర్భంగా పిల్లలను మిఠాయిలు, చాక్లెట్లతో మభ్య పెట్టి ఇంట్లోకి రప్పించేవాడు. ఆ తరువాత పంధేర్వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడనేది ప్రధాన ఆరోపణ. బాధితుల్లో ఎక్కువ భాగం ఆ ప్రాంతం నుండి తప్పిపోయిన పేద పిల్లలు, యువతులవిగా గుర్తించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పిల్లల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడవేసేవారనీ సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాకుండా నరమాంస భక్షక ఆరోపణలు కూడా చేసింది. 2007లో పంధేర్, కోలీలపై సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. అయితే 19 కేసుల్లో మూడింటిని తొలగించిన సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా సురేంద్ర కోలీపై బాలికలపై అనేక అత్యాచారాలు , హత్యలకు పాల్పడి దాదాపు 10 కంటే ఎక్కువ కేసులలో మరణశిక్ష విధించాయి కోర్టులు. జూలై 2017లో, 20 ఏళ్ల మహిళ పింకీ సర్కార్ హత్య కేసులో స్పెషల్ CBI కోర్టు పంధేర్, కోలీలను దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్ హైకోర్టుకూడా సమర్ధించింది. అయితే, కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయంలో జాప్యంకారణంగా దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఈ నిఠారీ హత్యల్లో మరో బాధితురాలు 14 ఏళ్ల రింపా హల్దార్ హత్య, అత్యాచారానికి సంబంధించి 2009లో సాక్ష్యాలు లేకపోవడంతో పంధేర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. #WATCH | Manisha Bhandari, lawyer of Nithari case convict Moninder Singh Pandher, in Prayagraj, Uttar Pradesh "Allahabad High Court has acquitted Moninder Singh Pandher in the two appeals against him. There were a total of 6 cases against him. Koli has been acquitted in all… pic.twitter.com/BYQHeu3xvz — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023 -
20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్
మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరు దోషులను సింగపూర్ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా గత 20 ఏళ్లలో సింగపూర్‌లో మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్(టీజేపీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని జులై 26(బుధవారం)ఆగ్నేయాసియా నగరమైన చాంగీ జిల్లా జైలులో ఉరితీయనున్నట్లు తెలిపింది. అదే విధంగా 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి జులై 28న (శుక్రవారం) ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు పేర్కొంది. 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా తరలించిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారని.. ఉరిశిక్ష అమలు తేదీలపై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. కానీ దీనిపై జైలు అధికారులు ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్ 20 ఏళ్లలో తొలిసారి ఈ ఉరిశిక్ష అమలైతే దాదాపు గత 20 ఏళ్లలో సింగపూర్‌లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి కానుంది. చివరిసారి 2004లో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళా హెయిర్ స్టైలిష్ యెన్ మే వుయెన్‌కు ఉరిశిక్ష పడినట్లు టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. ఇదిలా ఉండగా సింగపూర్‌లో హత్యలు, కిడ్నాప్‌ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. అత్యంత కఠిన చట్టాలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసే వారికి మరణశిక్ష విధిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును సింగపూర్ నిలిపి వేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు 13 మందిని ఉరితీసింది. -
గోరఖ్‌నాథ్ ఆలయంపై దాడి కేసు.. నిందితుడు ముర్తజాకు మరణశిక్ష
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ గోరఖ్‌నాథ్ ఆలయంలోకి చొరబడి కత్తితో భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన అహ్మద్ ముర్తజా అబ్బాసీని దోషిగా తేల్చిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు.. అతనికి మరణశిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్ 121 ప్రకారం నిందితుడికి మరణశిక్ష విధించినట్లు ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. పోలీస్ సిబ్బందిపై దాడి చేసినందుకు సెక్షన్ 307 ప్రకారం జీవిత ఖైదు కూడా విధించినట్లు పేర్కొన్నారు. కాగా దాదాపు తొమ్మిది నెలల క్రితం గతేడాది ఏప్రిల్‌లో గోరఖ్‌పూర్ జిల్లాలోని గోరఖ్‌నాథ్ ఆలయం వద్ద ఓ వ్యక్తి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతానికే చెందిన ముర్తాజా అబ్బాసీ అనే వ్యక్తి.. ఆలయం వద్ద కత్తితో వీరంగం సృష్టించి.. ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అక్కడే సెక్యూరిటీగా ఉన్న పోలీసులు అతడ్ని అడ్డుకోబోగా పదునైన కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో నిందితుడితోపాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అనంతరం అతడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అబ్బాసీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఉగ్ర కుట్రలో భాగంగానే నిందితుడు ఆలయంలోకి ప్రవేశించి భక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీసీ) దర్యాప్తు చేపట్టింది. విచారణలో తనకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)తో సంబంధాలున్నట్లు నిందితుడు అంగీకరించాడు. ఐసీసీ్ కోసం పోరాడుతున్నట్లు, ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో అబ్బాసీని ఎన్ఐఏకోర్టు దోషిగా తేల్చింది. తాజాగా అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా గోరఖ్‌పూర్ సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన అబ్బాసీ.. 2015లో ఐఐటీ ముంబయి నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశాడు. అయితే 2017 నుంచి అబ్బాసీ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చదవండి: ఫుట్‌పాత్‌పై జుట్లు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్ -
ఇరాన్లో మాజీ అధికారికి ఉరి
దుబాయ్: బ్రిటన్ రహస్య నిఘా సంస్థ ‘ఎం16’కు సమాచారం చేర వేస్తున్నాడనే అనుమానంతో రక్షణ శాఖ మాజీ అధికారి అలీ రెజా అక్బారీని ఉరి తీసినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్–ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న అక్బారీ ఇరాన్ రక్షణ శాఖలో కీలకంగా ఉన్న అలీ షంఖానీకి సన్నిహితుడిగా పేరుంది. ఇరాన్ ప్రభుత్వం అక్బారీని 2019లోనే అదుపులోకి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే అక్బారీకి మరణ శిక్ష విధించి, తాజాగా ఆ విషయం బయటపెట్టి ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు అర్ధమవుతోందని పరిశీలకులు అంటున్నారు. తాము వద్దంటున్న అక్బారీకి ఇరాన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించడంపై బ్రిటన్, అమెరికా మండిపడుతున్నాయి. -
ఎంత చెప్పినా ఆమె వినలేదు.. ఆ సమయంలో ఆఫ్తాబ్‌ని కలిశా: శ్రద్ధా తండ్రి
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతం ఎన్నో మలుపులు తిరుగుతూ పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధా వాకర్ హత్య తర్వాత తొలిసారి ఆమె తండ్రి వికాస్ వాకర్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన నోరు విప్పారు. తన కూతుర్ని ఎలాగైతే చంపాడో అలాగే అఫ్తాబ్‌కీ పనిష్మెంట్ ఇవ్వాలని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. సరైన పద్ధతిలో విచారణ చేసి అఫ్తాబ్‌ని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు, ఈ హత్యతో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే శ్రద్ధా వాకర్ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు ఆమె తండ్రి వికాస్ వాకర్. పోలీసుల దర్యాప్తు విషయంలో తాను సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. కూతురు మరణం తనను కుంగిపోయేలా చేసిందని, దీంతో అనారోగ్యానికి గురయ్యానని వెల్లడించారు. అందువల్లే మీడియాతో మాట్లాడలేకపోయానని తెలిపారు. సమాజంలో ఇబ్బందులు సృష్టిస్తున్న పలు మొబైల్ అప్లికేషన్లపై కూడా చర్యలు తీసుకోవాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధించాలన్నారు. 18 ఏళ్లు నిండిన పిల్లలపై తప్పనిసరిగా కౌన్సిలింగ్ నియంత్రణ ఉండాలన్నారు. రెండేళ్లుగా శ్రద్ధాను సంప్రదించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని, కానీ తాను పెద్దగా స్పందించలేదని తెలిపారు. శ్రద్ధా శరీర భాగాలు ఆ హంతకుడి ఇంట్లో ఉన్న సమయంలో అఫ్తాబ్‌ని కలిశానని ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్తాబ్‌తో వెళ్లిన తర్వాత కూతుర్ని ఇంటికి రాకుండా అన్ని దారులు మూసేశారా? అని మీడియా ప్రశ్నించగా.. కూతురు హత్య అనంతరం తమపై అందరూ అనేక నిందలు వేశారని శ్రద్ధా తండ్రి వాపోయారు. కొందరు గొడవ పడి మరీ ఇంట్లోంచి వెళ్లింది మళ్లీ ఎలా రానిస్తారంటూ ప్రశ్నలు వేశారని తెలిపారు. అయితే తన కూతురు ఇంట్లోంచి వెళ్లే ముందు ఎన్నో రకాలుగా ప్రశ్నించినా ఆమె దేనికి సమాధానమివ్వకుండా వెళ్లిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ఈ కేసులో న్యాయం చేస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ పోలీసు అధికారులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారని శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ చెప్పారు. కాగా, అఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించినట్లు పోలీసుల వర్గాలు తెలిపాయి. చదవండి: 15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్లో మేనేజర్‌గా అవతారం ఎత్తి.. -
10 రోజుల్లో 12 మందికి శిరచ్ఛేదం.. మరణ దండనలో రాజీపడని సౌదీ..
రియాధ్: మరణదండన విషయంలో సౌదీ అరేబియా రాజీపటడం లేదు. 10 రోజుల్లోనే 12 మంది దోషుల తలలు నరికి మరణశిక్ష అమలు చేసింది. వీరంతా డ్రగ్స్ కేసులలో నేరం రుజువైన వారు. ఇలాంటి శిక్షలు తగ్గిస్తామని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అది కన్పిచండం లేదు. ఈ 12 మందితో కలిపి ఈ ఏడాది మొత్తం 132 మంది దోషులకు శిరచ్ఛేదము చేసింది సౌదీ ప్రభుత్వం. 2020, 2021లో రెండేళ్లలో అమలైన మొత్తం మరణశిక్షలకంటే ఈ సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పుడు మరణశిక్ష విధించిన 12 మందిలో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్‌కు చెందినవారు, ముగ్గురు సౌదీ పౌరులు ఉన్నారు. మరణశిక్షలను తగ్గించే విషయంపై ఆలోచిస్తున్నామని, ఈ శిక్షలను వీలైనంత తక్కువగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని 2018లోనే సౌదీ యువరాజు తెలిపారు. జమల్ కషోగ్గి హత్య తర్వాత.. మరణ శిక్షను సవరించేలాా చట్టంలో మార్పులు చేయాలని 2020లో సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అహింసా నేరాల్లో మృదువుగా వ్యవహరించనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది. కానీ ఇవేమీ ఆచరణకు నోచుకోవడం లేదు. చదవండి: రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ.. -
శ్రద్ధా దారుణ హత్య.. స్పందించిన బాలీవుడ్ నటి
న్యూఢిల్లీ: ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శ్రద్ధా శరీర భాగాలను పడేసిన ఢిల్లీలో మోహరౌలీ అడవుల్లోకి అఫ్తాబ్‌ను తీసుకెళ్లిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 13 శరీర భాగాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని గుర్తించాల్సి ఉంది. మరోవైపు ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలడంతో. అతడు వాడిన డేటింగ్ యాప్ ‘బబుల్’ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అఫ్తాబ్ డేటింగ్ హిస్టరీ ఇవ్వాలని బబుల్‌కు లేఖ రాశారు. అతడి ప్రొఫైల్, యువతుల వివరాలు ఇవ్వాలని కోరారు. అంతేగాక అఫ్తాబ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉన్నట్లు తేలింది. అతనికి ఇన్‌స్టాలో 28 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో.. ఇదిలా ఉండగా ఢిల్లీ హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియురాలిని అత్యంత క్రూరంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన కూతురిని హత్య చేసిన అఫ్తాబ్ అమీన్ పునావాలాకు మరణశిక్ష వేయాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనక లవ్ జిహాద్ కోణం ఉందని ఆయన ఆనుమానిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘లవ్ జిహాద్ (ప్రేమ ముసుగులో బలవంతంగా మత మార్పిడికి పాల్పడటం) పేరుతో నా కూతురిని హింసించాడని అనిపిస్తోంది. అఫ్తాబ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాను. కేసులో ఢిల్లీ పోలీసులపై నమ్మకం ఉంది. సరైన విధంగా విచారణ చేసి శిక్షిస్తారని ఆశిస్తున్నా. శ్రద్ధా వాళ్ల అంకుల్‌తో దగ్గరగా ఉంటుంది. నాతో ఎక్కువ మాట్లేడేది కాదు. నేను ఇప్పటి వరకు అఫ్తాబ్‌తో మాట్లాడలేదు. కూతురు కనిపించడం లేదని నవంబర్లోనే ముంబై వాసాయ్లో ముందుగా ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. అయితే శ్రద్ధ ఢిల్లీలో ఉందన్న విషయం తెలిసి కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. శ్రద్ధా అఫ్తాబ్ సంబంధం గురించి చెప్పడంతో కూతురు కనిపించకుండా పోవడం వెనక అతని హస్తం ఉందని అనుమానంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి కాగా శ్రద్ధా- అఫ్తాబ్ 2019 నుంచి రిలేషన్ షిష్‌లో ఉన్నారు. ఢిల్లీకి వచ్చే ముందు మార్చి ఏప్రిల్ నెలలో హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని ప్రదేశాలను చుట్టి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధా కంటే ముందే అఫ్తాబ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రద్ధాను హత్య చేసిన తరువాత 18 రోజులపాటుటు తెల్లవారుజామున 2 గంటలకు శరీర భాగాలను బయట పారేశాడు. శ్రద్ధా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించేవాడు. హత్య గురించి ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. శ్రద్ధాను చంపిన గదిలోనే తాను ఉండేవాడు. స్పందించిన స్వరా భాస్కర్ ఢిల్లీలో ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ కేసు ఎంతో విషాదకరమైనదని.. ఈ దారుణాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదని అన్నారు. ప్రేమించిన వ్యక్తిని నమ్మి వెళ్తే ఇంత ఘోరానికి పాల్పడటం తన హృదయాన్ని ద్రవింపజేస్తోందన్నారు. పోలీసులు త్వరగా విచారణను ముగిస్తారని, ఈ రాక్షసుడికి కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. NO WORDS for how horrifying, gruesome & tragic this case is. My heart goes out to this poor girl-awful betrayal by someone she loved & trusted. Hope police speedily conclude their investigation & hope this monster gets the harshest punishment he thoroughly deserves. #shradhha 💔 https://t.co/W4w10JjdDf — Swara Bhasker (@ReallySwara) November 14, 2022 -
సంచలన తీర్పు.. గ్యాంగ్ రేప్లో మరణ శిక్ష ఖైదీలకు విముక్తి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చావ్లా రేప్ కేసులో.. ఇవాళ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మరణ శిక్ష పడ్డ ముగ్గురు ఖైదీలను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. పదేళ్ల కింద జరిగిన ఈ దారుణ ఘటనలో.. తీర్పు సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి ధర్మాసనం ముందు నిల్చున్నారు. అయితే.. సెంటిమెంట్లకు ఇక్కడ తావు ఉండదంటూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ముగ్గురు దోషులను సుప్రీం కోర్టు ఇవాళ నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు సమయంలో కోర్టు హాల్లో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. అంతకు ముందు శిక్షను తగ్గించాలంటూ దోషుల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వాళ్ల వయసు, కుటుంబ నేపథ్యాలు, గత చరిత్రలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఇక.. ఢిల్లీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి.. ఈ గాయం బాధితురాలిది మాత్రమే కాదని.. సమాజానిదని వాదించారు. కేవలం హత్యాచారమే చేయకుండా.. ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి వాళ్లు పెద్ద తప్పు చేశారని ఆమె వాదనల్లో పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. కీలక తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా.. బాధితురాలి తండ్రి బాధను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు సీజేఐ లలిత్. అయితే.. వాస్తవాలు, సాక్ష్యాలు-ఆధారాల ఆధారంగా తీర్పు ఉంటుందని, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పదారి పట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ.. ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2012 Chhawla rape case: Supreme Court acquits three men who were awarded the death penalty by a Delhi court after being held guilty of raping and killing a 19-year-old woman in Delhi's Chhawla area in 2012 pic.twitter.com/CsbjUhROn3 — ANI (@ANI) November 7, 2022 2012 ఫిబ్రవరిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఢిల్లీ కుతుబ్ విహార్ వద్ద గురుగావ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. మూడు రోజుల తర్వాత.. హర్యానా రేవారి జిల్లా రోధాయి గ్రామ శివారులో సదరు యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. కారులోని పనిముట్లు, కుండపెంకులతో ఆమె జననాంగాలను ఛిద్రం చేసి ఘోరంగా హింసించి చంపారు దుండగులు. ఈ కిరాతకం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ కోర్టు 2014 ఫిబ్రవరిలో ఈ ముగ్గురికి పేర్కొంటూ మరణ శిక్షను ఖరారు చేసింది. అదే ఏడాది ఆగష్టు 26న ఢిల్లీ హైకోర్టు మరణ శిక్షను సమర్థిస్తూ తీర్పు వెల్లడించింది. మానవ మృగాలుగా దోషులను పేర్కొంటూ సమాజంలో తిరిగే హక్కును వీళ్లు కోల్పోయారంటూ ఆ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. -
న్యాయమైన ప్రయత్నం!
మరణశిక్షపై మళ్ళీ ఒకసారి చర్చ మొదలైంది. ఒకే అంశానికి సంబంధించి ఒక్కో కేసులో ఒక్కో రకమైన తీర్పులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతి పెద్ద శిక్షల విధింపుపై ఆలోచన మొదలైంది. మరణశిక్ష తీర్పుల విషయంలో నిర్ణీత నియమాలు ఏర్పరిచే అంశాన్ని సుప్రీమ్ కోర్టు తనకు తానుగా చేపట్టి, అయిదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సోమవారం నివేదించింది. మరణశిక్షపై వాదనలు ఎప్పుడు, ఎలా వినాలనే దానిపై పరస్పర విరుద్ధ తీర్పులు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ తెలిపింది. ఆలోచించి, అత్యంత సంయమనంతో విధించాల్సిన ఉరిశిక్షను నేరం రుజు వైన రోజే ప్రకటిస్తున్న కోర్టులు, కేసులు ఇప్పుడు అనేకం. అందుకే, శిక్ష పడ్డ వ్యక్తికి ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పద్ధతుల్లో మార్పు కోసం సుప్రీమ్ చేపట్టిన ఈ చర్య కచ్చితంగా ఆహ్వానించదగ్గది. ఇప్పటికి 42 ఏళ్ళ క్రితం 1980లో బచ్చన్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసులో అయిదుగురు సభ్యుల సుప్రీమ్ ధర్మాసనం మరణశిక్షను సమర్థిస్తూనే, ‘అత్యంత అరుదైన’ సందర్భాల్లోనే ఉరిశిక్ష వేయాలంటూ రక్షణ కవచం ఇచ్చింది. గత నాలుగు దశాబ్దాలలో అది ఎంత సమర్థంగా అమలైందంటే అనుమానమే. అరుదైన సందర్భాలంటే ఏమిటనే దానికి ఎవరి వ్యాఖ్యానం వారిది కావడమూ దానికో కారణం. తీవ్రవాద కేసుల్లో తప్ప మిగతావాటిలో మరణశిక్ష విధించరాదంటూ, 2015 నాటి లా కమిషన్ నివేదిక ఏకంగా ఉరిశిక్ష రద్దుకు సిఫార్సు చేసింది. ఇప్పటికే 144కి పైగా దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి. భారత్‌లో మాత్రం దీనిపై ఇంకా భిన్నాభిప్రాయాలున్నాయి. అంతకన్నా విచిత్రమేమిటంటే – కొద్దికాలంగా మన దగ్గర మరణశిక్ష తీర్పులు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అటు పూర్తి ఉరిశిక్ష రద్దుకూ, ఇటు ప్రతి చిన్న నేరానికీ ఉరిశిక్ష విధించే దూకుడుకూ మధ్య సమతూకం అవసరం. ఉరిశిక్ష విధింపునకు సంబంధించిన విధివిధానాలకు మరింత కట్టు దిట్టం చేసి, అంతటా ఒకే రకమైన ఉన్నత ప్రమాణాలు పాటించేలా చూడడం తప్పనిసరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఏకరూప నియమావళిని రూపొందించే పనిని సుప్రీమ్ భుజానికి ఎత్తుకుంది. కులం, మతం, వర్గం లాంటి దుర్విచక్షణ ఉరిశిక్ష విధింపుపైనా ప్రభావం చూపుతోందనేది నిష్ఠురసత్యం. ఇది వివిధ అధ్యయనాల మాట. ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన నేర సంస్కరణల అనుకూలవాద బృందం ‘ప్రాజెక్ట్ 39ఏ’ 2016లో 385 మంది ఉరిశిక్ష ఖైదీల వివరాలను విశ్లేషించింది. ఉరిశిక్ష పడ్డవారిలో 76 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలవారే. ఇక, నాలుగింట మూడొంతుల మంది ఆర్థికంగా వెనకబడ్డవారు. ఒక వర్గంపై సమాజంలో ఉండే చిన్నచూపు మరణశిక్ష విధింపులోనూ కొనసాగుతోందనిపిస్తోంది. ఇక, 2020లో ఆ బృందమే జరిపిన మరో అధ్యయనంలో ఇంకొక చేదునిజం బయటకొచ్చింది. 2000కూ, 2013కూ మధ్య ఢిల్లీలో కింది కోర్టులు 80 ఉరిశిక్షలు విధించగా, తర్వాత హైకోర్టులో 60 శాతానికి పైగా కేసుల్లో ఆ శిక్ష తగ్గడమో, రద్దవడమో జరిగింది. సమాజంలోని భావావేశాలు సైతం కొన్నిసార్లు ఉరిశిక్ష విధింపునకు దారి తీస్తున్నాయట. ఇలా వివిధ ప్రభావాలు, కోర్టు కోర్టుకూ తీర్పులు మారి పోవడంపై ఇప్పటికైనా నిజాయతీగా దృష్టి పెట్టి, సరిదిద్దాల్సిన అవసరం ఉంది. నిజానికి, ముంబయ్ 26/11 దాడి, 2001లో పార్లమెంట్‌పై దాడి, ‘నిర్భయ’ లాంటి తీవ్రమైన కేసుల్లోనే నేరస్థులకు ఉరిశిక్ష అమలవుతోంది. కానీ, దిగువ కోర్టులు ఏటా పదులకొద్దీ కేసుల్లో ఉరి శిక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఉరిశిక్ష వేయడానికి వీలు కల్పించే భారత శిక్షాస్మృతిలోని 302వ సెక్షన్, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా), పసిపిల్లలపై లైంగిక అత్యాచారాలకు సంబం ధించిన ‘పోక్సో’ చట్టం వగైరాలను అవసరానికి మించి అతి చొరవతో చేతుల్లోకి తీసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయని విమర్శ. సంపన్న వర్గాలతో పోలిస్తే ఆర్థికంగా నిరుపేదలకు నాణ్యమైన న్యాయసేవలు అందవనేది జగద్విదితం. అలాంటి సందర్భంలో మరణశిక్ష పడ్డ అమాయకులు కోర్టులో తమ వాదనను సమర్థంగా వినిపించుకోలేక అన్యాయమైపోతున్నారు. అందుకే, సర్వోన్నత న్యాయ స్థానం సైతం నేరస్థుడి సామాజిక నేపథ్యం, వయస్సు, విద్యార్హతలు, కుటుంబ పరిస్థితులు, మానసిక స్థితి, శిక్షానంతర ప్రవర్తన లాంటివన్నీ చూడాలంటోంది. ఆ కీలక అంశాలను బట్టి నింది తుడికి ఉరిశిక్ష అమలుపై నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టులకు నొక్కి చెబుతోంది. ఆ అంశాల రీత్యా నిందితుడికి శిక్షలో ఉపశమన చర్యలు అందించే వీలు పరిశీలించాలనేదే భావం. చాలా సందర్భాల్లో సుప్రీమ్ మార్గదర్శకాల స్ఫూర్తిని దిగువ కోర్టులు అక్షరాలా పాటిస్తున్నాయ నుకోలేం. ఇప్పటికీ రాజద్రోహం లాంటి కాలం చెల్లిన చట్టాలపై సుప్రీమ్ చూపిన మార్గంలో దిగువ కోర్టులు వెళుతున్నట్టు లేదు. ఐటీ చట్టంలోని ‘సెక్షన్ 66ఏ’ లాంటివి సుప్రీమ్ కొట్టేసినా, కింది కోర్టు లకు అది పట్టినట్టు లేదు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షల విధింపునకు స్పష్టమైన నియమావళిని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించడమే కాక, దిగువ కోర్టుల్లోనూ అది అమలయ్యేలా చూడాలి. వంద మంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు కానీ, ఒక్క అమాయకుడికైనా శిక్ష పడకూడదనేది అంతటా అంగీకరించే న్యాయసూత్రం. ఉరిశిక్ష పడుతున్న ఖైదీల విషయంలో అది అమలు కావాలంటే, నింది తుడి తరఫు వాదనలూ సాకల్యంగా వినాలి. అందుకు న్యాయబద్ధమైన అవకాశమిస్తూ, మార్గదర్శ కాలు రూపొందించే ప్రయత్నమే ప్రస్తుతం జరగనుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మేలు. -
మలేషియా సంచలన నిర్ణయం... మరణ శిక్ష రద్దు!
Death Penalty Remains Mandatory For Several Offences: మలేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. హత్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర తీవ్రమైన నేరాలకు మలేషియా దేశంలో మరణశిక్ష తప్పనిసరి. ఐతే మలేషియా ప్రభుత్వం కొన్ని నేరాల్లో విధించే తప్పనిసరి మరణశిక్షను రద్దు చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. 2018లోనే అధికారాన్ని చేజిక్కించుకున్న సంస్కరణవాద కూటమి మరణశిక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐతే రాజకీయ ప్రత్యర్థులు, బాధితుల కుటుంబాల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా ఈ మరణశిక్ష రద్దు నిలిచిపోయింది. ప్రస్తుతం కేబినేట్ మరణ శిక్షను రద్దు చేసేందుకు సమ్మతించినట్లు న్యాయశాఖ మంత్రి వాన్ జునైది తువాంకు జాఫర్ తెలిపారు. కానీ ఈ మరణశిక్షకు ప్రత్యామ్యాయంగా ఎలాంటి శిక్షలు విధించవచ్చనే దానిపై తదుపరి అధ్యయనం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు ఈ విషయంపై నిర్ణయం అన్ని పార్టీల హక్కులను రక్షించే విధంగా ఇవ్వడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మార్పులు చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయవలసి ఉంటుందన్నారు. పైగా ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి కూడా కాస్త సమయం పడుతుందని అన్నారు. మానవ హక్కుల ఆసియా డిప్యూటీ డైరక్టర్ ఫిల్ రాబర్ట్సన్ తప్పనిసరి మరణశిక్షను తొలగిస్తామని మలేషియా బహిరంగంగా ప్రకటించడం ఒక ముఖ్యమైన ముందడుగుగా అభినందించారు. ఐతే మలేషియాలో ఇంతవరకు వరుసగా అధికాలోకి వచ్చిన ఇతర ప్రభుత్వాలు ఈ మరణశిక్షను రద్దు చేస్తాం అంటూ... మాటలకే పరిమితం చేశాయే తప్ప ఆచరణలోకి తీసుకు రావడంలో విఫమయ్యాయి. (చదవండి: తనని తాను కాల్చుకునేలోపే ఊహించని దారుణం... ఆ తర్వాత) -
మనిషే కాదు వీడు.. వింటే వెన్నులో వణుకుపుట్టడం ఖాయం
Sakinaka Case: వావీవరుసలు లేని మానవ మృగం.. ఒంటరి మహిళపై అఘాయిత్యానికి తెగపడింది. అంతటితో ఆగలేదు.. పైశాచికత్వం ప్రదర్శించింది. వదిలేయమని బాధితురాలు బతిమాలినా వినలేదు. ఫలితం.. ప్రాణం కోసం పోరాడి కన్నుమూసింది. సంచలనం సృష్టించిన సాకినక ‘నిర్భయ’ కేసులో దోషికి మరణ శిక్ష ఖరారైంది. బాధిత కుటుంబం, న్యాయం కోసం తొమ్మిది నెలలపాటు పోరాడిన వాళ్ల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన.. సాకినక(ముంబై, అంధేరీ) అత్యాచారం, హత్య కేసులో దోషి మోహన్ కథ్వారు చౌహాన్ .. దిన్దోషి కోర్టు గురువారం మరణ శిక్ష ఖరారు చేసింది. ఇది అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించిన అదనపు సెషన్స్ జడ్జి హెస్.సి.షిండే.. ఇలాంటి సంఘటనల్లో దోషిపై కనికరం చూపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పింది. స్వయానా నిందితుడి తండ్రే.. తన కొడుకును ఛీదరించుకున్నాడని, ఉరి తీయాలంటూ వ్యాఖ్యానించాడని, పైగా తన సోదరుడి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించడం.. అతని స్వభావానికి అద్దం పడుతోందని, ఇంతకన్నా అతనికి మరణ శిక్ష విధించడానికి కారణాలు అక్కర్లదేని ఆయన అన్నారు. ‘‘ఇదొక భయానకం. బాధితురాలితో చౌహాన్ రాక్షసంగా ప్రవర్తించాడు. వీడు మనిషి కాదు.. కిరాతకుడు. అత్యాచారానికి పాల్పడ్డ తీరును తలచుకొంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇది అత్యంత అరుదైన కేసు కిందికి వస్తుంది’’ అని పేర్కొన్నారు. మరణ శిక్ష విధిస్తేనే సమాజంలోకి సరైన సందేశం వెళ్తుందన్నారు. మరణ శిక్షతో పాటు 32 వేల రూపాయల జరిమానా విధించారు జడ్జి. ఘోరంగా.. మోహన్ కథ్వారు చౌహాన్ (45).. యూపీకి చెందిన వ్యక్తి. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇంట్లోంచి గెంటేశారు. దీంతో భార్యాపిల్లలతో సహా ముంబై వచ్చి.. కూలీ పనులు చేసుకుంటున్నాడు. 2021 సెప్టెంబర్ 10న ముంబైలో నిలిపి ఉంచిన టెంపోలో.. 34 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పదునైన వస్తువులతో ఆమె జనానాంగాలను గాయపరిచాడు. ఈ ఘోరంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో నిర్భయ ఘటనగా ఇది సంచలనం సృష్టించింది. బాధితురాలు దళితురాలు కావడంతో ఈ కేసు.. ప్రముఖంగా చర్చల్లో నిలిచింది. దీంతో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక చొవర చూపించారు సీఎం ఉద్దవ్ థాక్రే. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు మోహన్ చౌహాన్. ఈ కేసులో చౌహాన్ తరపున వాదించేందుకు లాయర్లు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వమే.. న్యాయవాదిని ఏర్పాటు చేసింది. అడ్వొకేట్ కల్పన వాస్కర్.. చౌహాన్ తరపున వాదనలు వినిపించారు. అతని ఆర్థిక స్థితి, భార్య అనారోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్షను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ, కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. వాదనల సమయంలోనూ చౌహాన్ పదే పదే జోక్యం చేసుకోవడం న్యాయమూర్తిని చిరాకు తెప్పించింది. తాను అమాయకుడినని, మద్యం మత్తులో అలా జరిగిపోయిందని, పోలీసులు ఈ కేసులో పోలీసులు గోల్మాల్ చేశారంటూ మాట్లాడాడు. దీంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజీ మీద ఏం స్పందిస్తావ్ అంటూ నిలదీశారు. పైగా సొంత అన్న కూతురిపైనే అఘాయిత్యం చేస్తానని మోహన్ బెదిరించడాన్ని ప్రస్తావించారు. మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేని మృగంగా అభివర్ణించింది చౌహాన్‌ను న్యాయస్థానం. -
లైంగిక వేధింపులు బయట పడుతాయని హత్య.. నిందితుడికి ఉరిశిక్ష
సేలం( తమిళనాడు): మైనర్ తల నరికి దారుణంగా హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష, రూ. 25 వేలు జరిమానా విధిస్తూ సేలం కోర్టు మంగళవారం తీర్పిచ్చింది. వివరాలు.. సేలం జిల్లా, ఆత్తూర్ సమీపంలో తలవాయ్‌పట్టి గ్రామానికి చెందిన దినేష్‌కుమార్ (33) వరికోత వాహనంలో పని చేస్తున్నాడు. ఇతను 2018, అక్టోబర్ 20న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదేప్రాంతంలో ఉన్న దళిత వర్గానికి చెందిన సామువేల్ కుమార్తె అయిన మైనర్ పువ్వులు కట్టడానికి దారం కోసం వచ్చింది. అప్పుడు దినేష్‌కుమార్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు చెబుతానంటూ వెళ్లిపో యింది. లైంగిక వేధింపుల విషయం ఎక్కడ బయట పడిపోతుందోననే భయంతో దినేష్ కుమార్ ఆమెను ఇంటికి వెళ్లి దూషించాడు. అంతటితో ఆగకుండా తల్లి కళ్ల ఎదుటే ఆమె తలను తెగనరికి హత్య చేశాడు. తర్వాత ఆత్తూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ హత్యపై పోలీసులు ఐదు విభాగాల కింద కేసు నమోదు చేసి దినేష్ కుమార్‌ను అరెస్టు చేశారు. దళిత వర్గానికి చెందిన మైనర్ దారుణ హత్యకు గురైన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ కేసుపై సేలం ఫోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తరపు న్యాయవాది ఎ.ఆసైతంబి వాదించారు. మరెవరికీ.. కేసు విచారణ ముగిసి మంగళవారం న్యాయమూర్తి ఎం.మురుగానంద్ తుది తీర్పు ఇచ్చారు. హత్య చేసినందుకు దినేష్ కుమార్‌కు ఉరిశిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా జీవిత ఖైదు, రూ. 5 వేలు జరిమానా, మరో మూడు విభాగాల కింద 10, 6 సంవత్సరాలు, 4 నెలలు జైలు శిక్షను, తలా రూ. 5 వేలు వంతున జరిమానా విధించారు. మైనర్ తల్లిదండ్రులు సామువేల్, చిన్నపొన్ను మాట్లాడుతూ.. తమ కుమార్తెకు జరిగిన దారుణం మరెవరికీ జరగకూడదని, ఈ తీర్పు తమకు కాస్త ఊరట నిచ్చినట్లు తెలిపారు. ఈ వార్త కూడా చదవండి: కనికరించలేదు.. సింగపూర్‌లో ‘మానసిక వికలాంగుడు’ నాగేంద్రన్ను ఉరి తీశారు -
కనికరించలేదు.. నాగేంద్రన్‌కు ఉరిశిక్ష అమలు
సింగపూర్ సిటీ: పదేళ్లుగా మరణ శిక్ష నుంచి తప్పించాలంటూ చేసుకున్న అభ్యర్థనలు, పిటిషన్లు వ్యర్థం అయ్యాయి. డగ్ర్స్ కేసులో పట్టుబడ్డ భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ ధర్మలింగంను ఎట్టకేలకు సింగపూర్‌లో ఉరి తీశారు. ఇవాళ(బుధవారం) ఉదయం ఉరిశిక్షను అమలు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. పదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న ధర్మలింగంను.. మానసిక వికలాంగుడనే కారణంతో విడిచిపెట్టాలంటూ విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరి కోరిక తీర్చి.. నాగేంద్రన్న్ ఉరిని అతని కుటుంబ సభ్యులు సైతం ధృవీకరించారు. ఉరికి ముందు నాగేంద్రన్ చివరి కోరికను అధికారులు తీర్చినట్లు తెలుస్తోంది. చివరిసారిగా తన కుటుంబ సభ్యులను ఒకసారి కలుసుకోవాలని ఉందని చెప్పడంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన తర్వాత అతడికి మరణశిక్షను అమలు చేశారు. కేసు వివరాలు.. మలేసియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై దోషిగా తేలిన నాగేంద్రన్‌కు 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో గతేడాది నవంబరు 10న నాగేంద్రన్‌కు మరణశిక్షను అమలు చేసేందుకు అక్కడి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే.. విమర్శలు..నిరసనలు మానసిక వికలాంగుడైన(హైపర్ యాక్టివిటీ డిజార్డర్) నాగేంద్రన్‌కు మరణశిక్ష అమలు విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సింగపూర్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. యూరోపియన్ యూనియన్ సహా బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అతడి తల్లి తరపున న్యాయవాదులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. నాగేంద్రన్ పిటిషన్‌ను గత బుధవారం కొట్టేసింది. ఇది కోర్టు ప్రక్రియలను దుర్వినియోగం చేయడానికి, నాగేంద్రన్‌కు విధించిన చట్టబద్ధమైన శిక్ష అమలులో అన్యాయంగా ఆలస్యం చేయడానికి తాజా ప్రయత్నం అంటూ సింగపూర్ అటార్నీ జనరల్ చాంబర్స్ అభిప్రాయపడింది. దీంతో న్యాయమూర్తులు ఆండ్రూ ఫాంగ్, జుడిత్ ప్రకాష్, బెలిండా ఆంగ్ చివరి నిమిషంలో అతడి దరఖాస్తును తోసిపుచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ‘‘కోర్టు చివరి మాట అంటే చివరి మాటే..’’ అని అన్నారు. అలాగే బుధవారం(ఏప్రిల్ 27) ఉదయం ఉరిశిక్షను అమలు చేయాల్సిందిగా న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. మలేషియాలోని ఇపో పట్టణంలో నాగేంద్రన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతని సోదరుడు నవీన్ కుమార్ మీడియాతో చెప్పాడు. చదవండి: హద్దు మీరితే.. ఏడాదికి 560 విపత్తులు, 2030 దాకా! -
డాక్టర్ హత్య కేసు: అత్యాశే ఉరి తాడైంది
సాక్షి ప్రతినిధి, చెన్నై: బంధువును హతమార్చి, అక్రమంగానైనా ఆస్తిని కాజేయాలన్న పేరాశ ఆ కుటుంబాన్ని ఉరికంబానికి చేరువచేసింది. భర్త, ఇద్దరు కుమారులకు ఉరిశిక్ష, భార్యకు యావజ్జీవశిక్ష పడేలా చేసింది. మరో నలుగురికి కూడా ఉరి శిక్ష విధించింది. నరాల వైద్యనిపుణుడు సుబ్బ య్య హత్యకేసులో చెన్నై సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. వివరాలు.. కన్యాకుమారి జిల్లా సామితోప్పునకు చెందిన ప్రభుత్వ డాక్టర్ సుబ్బయ్య పదవీ విరమణ పొంది చెన్నై రాజా అన్నామలైపురంలో సొంత క్లినిక్ నడిపేవాడు. ఇతను 2013 సెప్టెంబర్ 9న దాడికి గురై అదే నెల 23న ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. బంధువులే రాబందులు.. డాక్టర్ సుబ్బయ్య మేనమామ పెరుమాళ్ నాడార్కు మూగ, చెవుడు. సంతానం లేరు. మొదటి భార్య మరణించడంంతో అన్నపళం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్దికాలంలోనే అన్నపళం భర్తను విడిచి వెళ్లిపోయింది. మూడేళ్ల తరువాత పసికందుతో మళ్లీ భర్త వద్దకు వచ్చి ఆస్తిలో వాటా కోరింది. ఇందుకు నిరాకరించిన పెరుమాళ్ తన ఆస్తినంతటినీ సోదరి అన్నకిళి (హతుడు సుబ్బయ్య తల్లి) పేరున రాసాడు. ఆస్తి కోసం పెరుమాళ్ రెండో భార్య అన్నపళం, సోదరి అన్నకిళి నడుమ న్యాయస్థానంలో కేసులు నడిచాయి. చివరకు ఇరుపక్షాలు సామరస్యపూర్వక ఒప్పందం చేసుకోగా హతుడు సుబ్బయ్య తల్లి అన్నకిళికి రెండుంక్కాల్ ఎకరా దక్కింది. కొన్ని ఏళ్ల తరువాత అన్నపళం కుమారుడైన పొన్నుస్వామి ఆస్తి విషయంలో తన తల్లి చేసుకున్న ఒప్పందం చెల్లదు అంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే ఈ కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పును పొన్నయ్యన్ ధిక్కరించి సదరు స్థలాన్ని తన భార్య మేరీ పుష్పం పేరున సెటిల్మెంట్ డాక్యుమెంట్‌గా రాసిచ్చాడు. 2013లో ప్రభుత్వ విధుల నుంచి రిటైర్డ్ అయిన డాక్టర్ సుబ్బయ్య తన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమై ఆక్రమణకు గురైనట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందాడు. పొన్నుస్వామిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కన్యాకుమారి జిల్లా అంజుగ్రామంలోని కొన్ని కోట్ల రూపాయల విలువచేసే రెండుంక్కాల్ ఎకరాల స్థలంపై హక్కుల కోసం ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడి హత్యకు దారితీసింది. ఈ కేసులో ప్రొఫెసర్ దంపతులైన పొన్నుస్వామి, మేరీ పుష్పం వీరి కుమారులైన న్యాయవాది ఫాసిల్, ఇంజినీర్ బోరిస్, న్యాయవాది విల్సన్, డాక్టర్ జేమ్స్ సతీష్‌కుమార్, కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్, మురుగన్, సెల్వప్రకాష్, అయ్యప్పన్..ఈ పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో అయ్యప్పన్ అప్రూవర్‌గా మారిపోయాడు. చెన్నై ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ జస్టిస్ అల్లి బుధవారం తీర్పు చెప్పారు పది మంది నిందితుల్లో 9 మంది దోషు లుగా నిర్ధారణైనట్లు తీర్పు చెప్పారు. పొన్నుస్వామి, న్యాయవాది ఫాజిల్, విలియం, డాక్టర్ జేమ్స్ సతీష్‌కుమార్, ఇంజినీర్ బేరిస్, మురుగన్, సెల్వప్రకాష్‌లకు ఉరిశిక్ష విధించింది. మేరి పుష్పం, కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ఒకే కుటుంబానికి చెందిన పొన్నుస్వామి, కుమారులు ఫాజిల్, బోరిస్‌లకు ఉరిశిక్ష పడింది. అప్రూవర్‌గా మారిన అయ్యప్పన్‌ను కోర్టు విడిచిపెట్టింది. తీర్పు ఎంతో సంతృప్తికరంగా ఉందని హతుడు డాక్టర్ సుబ్బయ్య సతీమణి అన్నారు. -
బాట్లాహౌస్ కేసు: అరిజ్‌ఖాన్‌కు ఉరిశిక్ష
న్యూఢిల్లీ: 2008 నాటి బాట్లాహౌస్ ఎన్కౌంటర్ కేసులో అరిజ్ ఖాన్‌కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు ఇన్స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మను చంపినందుకు అతడికి ఈ శిక్షను ఖరారు చేసింది. అరిజ్ చేసిన నేరం గరిష్ట శిక్ష విధించేందుకు వీలు కల్పించే అత్యంత అరుదైన కేటగిరీలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. అతడిని మరణించే వరకూ ఉరికి వేలాడదీయాలని అదనపు సెషన్స్ జడ్జి సందీప్ యాదవ్ తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అరిజ్ ఖాన్‌కు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించారు. రూ.10 లక్షలను తక్షణమే మోహన్‌చంద్ శర్మ కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది. న్యాయాన్ని కాపాడే అధికారిని చంపేశారు బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.టి.అన్సారీ వాదనలు వినిపించారు. అరిజ్ ఖాన్‌కు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నాయని చెప్పారు. న్యాయాన్ని కాపాడే ఒక అధికారిని చంపిన అరిజ్ ఖాన్‌కు మరణ శిక్ష విధించాలని కోరారు. ఇన్స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అరిజ్ ఖాన్‌తోపాటు మరికొందరు ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే మారణాయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారని గుర్తుచేశారు. అరిజ్ ఖాన్ తరపున అడ్వొకేట్ ఎం.ఎస్.ఖాన్ వాదనలు వినిపించారు. అరిజ్‌కు ఉరిశిక్ష విధించాలన్న వాదనను వ్యతిరేకించారు. అతడు ముందస్తు ప్రణాళిక ప్రకారం కాల్పులు జరపలేదన్నారు. ఎం.ఎస్.ఖాన్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ట్రయల్ కోర్టు 2013 జూలైలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఏమిటీ కేసు? ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులు బాట్లా హౌస్‌లో దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. పోలీసులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మ అమరులయ్యారు. ►2008 సెప్టెంబర్ 13: ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు. 39 మంది మృతి, 159 మందికి గాయాలు. ►2008 సెప్టెంబర్ 19: దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్లో ఉన్న బాట్లా హౌస్‌లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు. ►2009 జూలై 3: అరిజ్ ఖాన్, షాజాద్ అహ్మద్‌ను నిందితులుగా ప్రకటించిన న్యాయస్థానం. ► 2010 ఫిబ్రవరి 2: యూపీలోని లక్నోలో షాజాద్ అహ్మద్ అరెస్టు. ►2010 అక్టోబర్ 1: ఎన్కౌంటర్ కేసు విచారణ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ. ►2013 జూలై 30: షాజాద్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు. ►2018 ఫిబ్రవరి 14: అరిజ్ ఖాన్ అరెస్టు. ►2021 మార్చి 8: హత్య, ఇతర నేరాల్లో అరిజ్ ఖాన్ దోషిగా గుర్తింపు. ►2021 మార్చి 15: అరిజ్‌కు మరణ శిక్ష -
అమెరికాలో మహిళకి మరణశిక్ష అమలు
టెర్రెహాట్: పదిహేడేళ్ల క్రితం నిండు గర్భిణిని హత్య చేసి, ఆమె కడుపు కోసి గర్భంలో ఉన్న శిశువుని ఎత్తుకుపోయిన నేరానికి కాన్సాస్‌కి చెందిన లీసా మాంట్గొమెరీ అనే మహిళకు మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో ఒక మహిళకు మరణశిక్షను అమలు చేయడం 1953 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారి. ఇండియానాలోని టెర్రెహాట్ జైలులో 52 ఏళ్ల వయసున్న లీసాకి ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1.31 గంటలకు ఆమె తుది శ్వాస విడిచినట్టుగా జైలు అధికారులు వెల్లడించారు. మరణశిక్ష అమలు చేయడానికి ముందు లీసా కాస్త ఆందోళనతో కనిపించినట్టు జైలు అధికారులు చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు జైలులోని మహిళా అధికారి లీసా దగ్గరగా వచ్చి, ఆమె ముఖాన్ని కప్పి ఉంచిన మాస్కు తీసి, చివరగా చెప్పాల్సినదేమైనా ఉందా అని ప్రశ్నించారు. దానికి లీసా నెమ్మదిగా, వణుకుతున్న గొంతుతో ‘‘నో’’అని బదులిచ్చారు. మిస్సోరి పట్టణంలో నివాసం ఉన్న లీసా 2004 సంవత్సరం డిసెంబర్లో ఇంటర్నెట్లో కుక్క పిల్లల అమ్మకానికి ఉన్నాయన్న ప్రకటన చూసింది. ఆ ప్రకటన ఇచ్చిన బాబీ జో స్టిన్నెట్ (23) మహిళని కాంటాక్ట్ చేసింది. స్టిన్నెట్ ఇంటికి వెళ్లిన లీసా ఉన్మాదంతో ప్రవర్తించింది. అప్పటికే ఎనిమిదో నెల గర్భిణి అయిన స్టిన్నెట్ మెడకి తాడు బిగించి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత వంటగదిలో ఉన్న కత్తిని తీసుకువచ్చి ఆమె గర్భాన్ని చీల్చి లోపల ఉన్న శిశువుని అపహరించింది. -
గొర్రెకుంట హత్యలు: కిరాతకుడికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, వరంగల్/వరంగల్ లీగల్: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌కు ఉరిశిక్ష పడింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో 9 మందికి మత్తు మందిచ్చి, బావిలో పడేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి ఇదే సరైన శిక్షని కోర్టు తేల్చింది. ఈ మేరకు వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు జడ్జి కావూరి జయకుమార్ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ హత్యలన్నీ ఉద్దేశపూర్వకంగా, పకడ్బందీ కార్యాచరణతో చేసినట్టు రుజువైంది. దీంతో బిహార్‌లోని బేగుసరాయి జిల్లా దౌలత్‌పూర్‌కు చెందిన సంజయ్ కుమార్‌కు ఉరిశిక్ష ఖరారైంది. ఇదీ జరిగిన ఘోరం.. ఈ ఉదంతంలో మృతులు పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారు కాగా, నేరస్తుడు బిహార్ రాష్ట్రవాసి. సాక్షులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు వరంగల్‌వాసులు కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రాసిక్యూషన్ పక్షాన కేసు వాదించిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోగుళ్ల సత్యనారాయణగౌడ్ కథనం ప్రకారం.. సంజయ్‌కుమార్ (40) బతుకుదెరువుకు బిహార్ నుండి వలసవచ్చి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతంలోని గోనె సంచుల తయారీ కర్మాగారంలో పని చేస్తున్నాడు. అక్కడే ఉండే వివాహిత రఫీకతో సహజీవనం చేస్తూనే ఆమె మైనర్ కూతురిపై కన్నేశాడు. దీంతో రఫీక హెచ్చరించడంతో పాటు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. కుటుంబసభ్యులతో మాట్లాడటానికి స్వరాష్ట్రానికి వెళ్దామని చెప్పి ఆమెతో కలిసి ఈ ఏడాది మార్చి 6న గరీభ్‌ర«థ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు రెండు వేర్వేరు టికెట్లు తీసుకున్నాడు. మార్గమధ్యంలో రఫీకకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగ తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయాక గొంతునులిమి నడుస్తున్న రైల్లోంచి ఏపీలోని నిడదవోలు స్టేషన్ సమీపంలో బయటకు నెట్టేశాడు. సంజయ్‌కుమార్ రాజమండ్రి స్టేషన్లో దిగి తిరిగి వరంగల్ వచ్చాడు. తిరిగొచ్చాక ఆమె మైనర్ కూతురును లొంగదీసుకొని తల్లి బతికే ఉందని నమ్మిస్తూ మోసం చేయసాగాడు. మరోపక్క రఫీక ఏదని ఆమె బంధువులైన మక్సూద్ ఆలం, నిషా ఆలం నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో తన నేరం బయటపడుతుందని భావించిన సంజయ్ మక్సూద్ కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించాడు. మే 20న మక్సూద్ ఆలం కుమారుడి పుట్టిన రోజు కాగా, మెడికల్ షాపు నుండి 60 నిద్రమాత్రలు కొని, ఆ రోజు రాత్రి భోజన సమయంలో కూరలో కలిపాడు. మక్సూద్ ఆలం, ఆయన భార్య నిషా ఆలం, కుటుంబసభ్యులైన సోహెల్ ఆలం, బూష్రా, బబ్లూ, షకీల్, షాబాజ్ అలీతో పాటు పక్క గదిలో ఉండే బిహార్‌కు చెందిన వలస కార్మికులు శ్రీరాంకుమార్, శ్యాంకుమార్ షా ఆ కూరతో భోజనం చేశారు. అందరూ స్పృహ కోల్పోయాక, ప్రాణాలతో ఉండగానే ఒక్కొక్కరిని గోనె సంచుల్లో వేసి గొర్రెకుంటలోని బావిలో పడేశాడు. మర్నాడు వీరి మృతదేహాలు బయటపడ్డాయి. మొదట ఆత్మహత్యలుగా.. ఒకపక్క కరోనా విలయతాండవం.. మరోపక్క లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఆకలికి అలమటించి, జీవితంపై విరక్తితో వీరంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడారని తొలుత భావించారు. శవాలను వెలికితీసి పోస్టుమార్టం చేయగా హత్యలుగా తేలింది. దీంతో కేసు నమోదుచేసి శరవేగంతో పరిశోధన చేసిన గీసుకొండ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నేరస్తుడు సంజయ్‌కుమార్‌ను అరెస్టుచేసి ఐపీసీ సెక్షన్లు 449, 328, 364, 380, 404, 354/సీ, 302, 201, సెక్షన్ 67 ఐటీ చట్టం కేసు నమోదు చేసి మే 26న కోర్టులో హాజరుపర్చారు. ప్రత్యేక కేసుగా భావించిన కోర్టు సత్వరమే నేరపరిశోధన చేసి చార్జిషీట్ దాఖలుచేయాలని ఆదేశించింది. దీంతో జూలై 28న చార్జిషీట్ దాఖలైంది. శరవేగంగా విచారణ..శిక్ష ఖరారు చార్జిషీట్లో వంద మంది సాక్షులను పేర్కొన్న ప్రాసిక్యూషన్ విచారణ సందర్భంగా 67 మందిని కోర్టులో హాజరుపర్చింది. సెప్టెంబర్ 21న విచారణ ప్రారంభించిన కోర్టు 40 రోజుల్లోనే.. ఈనెల 20కి విచారణ పూర్తిచేసి బుధవారం తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాలను పరిశీలించాక నేరం రుజువు కావడంతో నేరస్తుడు సంజయ్‌కుమార్‌కు చనిపోయేంత వరకు ఉరి వేయాలని జడ్జి జయకుమార్ తీర్పు వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 302 హత్యానేరం కింద ఉరిశిక్ష విధించిన జడ్జి జయకుమార్ నేరస్తుడిపై ఉన్న ఇతర అభియోగాలపై కూడా వివిధ సెక్షన్ల క్రింద జీవితఖైదు, జైలుశిక్ష, జరిమానా వి«ధిస్తూ తీర్పునిచ్చారు. కేసు సత్వర పరిశోధనలో మామునూరు ఏసీపీ జి.శ్యాంసుందర్, గీసుకొండ సీఐ జె.శివరామయ్య పాలుపంచుకోగా, లైజన్ ఆఫీసర్ దేవరకొండ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కానిస్టేబుల్ జె.లింగయ్య సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. -
నిందితుడికి ఉరిశిక్ష వేయాలి: సీతక్క
సాక్షి, రాజేంద్రనగర్: మహిళలకు, మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకోవడం కాదు.. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మైనారిటీ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మొయినాబాద్ మండలం హిమాయత్‌సాగర్‌లో ఇంటి యజమాని వేధింపులు తాళలేక ఓ మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలిక సోదరి రాజేంద్రనగర్ బుద్వేల్ గ్రీన్ సిటీలో ఆశ్రమం పొందుతుండటంతో ఆమె మంగళవారం మధ్యాహ్నం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: (యజమాని వేధింపులు: బాలిక ఆత్మహత్య ) ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకుడు మైనార్టీ కుటుంబానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. నాలుగేళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకొని అఘాయిత్యం చేశాడని ఆరోపించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి ఉరి శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లుతోపాటు ఆర్థిక సహాయం చేయాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మృతురాలి సోదరికి ఉన్నత చదువుతో పాటు కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఘటనపై జిల్లా మంత్రితోపాటు హోంమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో డబ్బాలు కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. బయటకు వస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తుందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు టీఆర్ఎస్ నేత కావడంతో అతడిని రక్షించేందుకు ప్రభుత్వం యత్నించిందని ఆరోపించారు. మైనార్టీల పక్షాన పోరాడుతున్నామని గొప్పలు చెప్పుకొనే ఓవైసీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కనీసం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. నిందితుడు టీఆర్ఎస్ నేత కావడంతో మజ్లిస్ మిన్నకుండిపోయిందని విమర్శించారు. మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. హర్యానాలో జరిగిన ఓ సంఘటనపై ట్వీట్ చేసిన ఓవైసీ తన ఇంటి పక్కనే మైనారిటీ బాలికపై జరిగిన అఘాయిత్యం విషయంలో స్పందించేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. తాము వాస్తవ పరిస్థితిని తెలుసుకునే యత్నం చేస్తుంటే అరెస్టులు చేస్తూ నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క బాలిక సోదరికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు నేరేళ్ల శారద, మాజీ మంత్రి చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నేతలు ఇందిరారెడ్డి, శోభన, వర్రి లలిత్ ఉన్నారు. విచారణ వేగవంతం మొయినాబాద్(చేవెళ్ల): బాలిక అనుమానాస్పద మృతి కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపిన పోలీసు ఉన్నతాధికారులు కేసు విచారణను వేగవంతం చేశారు. మంగళవారం శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి మొయినాబాద్ ఠాణాకు వచ్చారు. నిందితుడు మధుయాదవ్ గత పరిస్థితులు, కేసుల వివరాలను తెలుసుకున్నారు. మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌కు చెందిన బాత్కు మధుయాదవ్ ముందు నుంచి వివాదాస్పదంగా ఉండేవాడు. రియల్ వ్యాపారం చేస్తూ పలు భూములను వివాదాస్పదంగా మార్చడంతోపాటు సొంత బంధువులకు చెందిన భూమిని కూడా కబ్జాచేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అతనిపై పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. గతంలోనే స్థానిక పోలీసులు అతనిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఈ వివరాలన్నీ తెసుకున్న డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఘటన జరిగిన గదిలోని ఆనవాళ్లు, బాలిక సోదరి వెల్లడించిన విషయాలతో మధుయాదవ్ చేసిన దురాఘతాలపై తెలుసుకున్నారు. అదేవిధంగా ఘటన జరిగిన రోజున మొయినాబాద్ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపైనా డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆరా తీశారు. ఇప్పటికే కేసు విచారణాధికారిగా ఇన్స్పెక్టర్ జానయ్యను తప్పించి రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌చక్రవర్తికి అప్పగించారు. మరిన్ని వివరాల సేకరణ కోసం నిందితుడిని కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా నిందితుడిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీఐపై వేటుకు పెరుగుతున్న డిమాండ్ బాలిక మృతి కేసులో మొయినాబాద్ సీఐ జానయ్య వ్యవహరించిన తీరుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. దీనికి తోడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజాసంఘాల నాయకులు సైతం ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విషయంలో హోంమంత్రి మహమూద్‌అలీ, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. -
కుల్‌భూషణ్‌కు కోర్టులో ఊరట
ఇస్లామాబాద్: మరణశిక్ష పడి, పాకిస్తాన్ జైల్లో మగ్గుతోన్న కుల్‌భూషణ్ జాదవ్ తరఫున న్యాయవాదిని నియమించుకోవడానికి, భారత్‌కి మరో అవకాశం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షని సమీక్షించడానికి ఇస్లామాబాద్ హైకోర్టు కేసు విచారణకు చేపట్టింది. భారత నావికాదళంలో పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్‌కి, గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 2017లో మరణశిక్ష విధించింది.కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించుకోవాలని కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని భారత్‌కు తెలపాలని ఈ కేసుని అక్టోబర్ 3కి వాయిదా వేసింది. -
నిర్భయ దోషులకు ఉరి: చివర్లో ఉత్కంఠ
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరితీయ బడ్డ నలుగురు దోషులు అద్భుతం జరుగుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష వేయకుండా నిలిపివేస్తారని ఆశ పడ్డారని తెలిపాయి. కోర్టు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని పదేపదే అడిగారని జైలు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో విచారణ జరగడంతో చివరి నిమిషంలో తమకు మరణదండన తప్పుతుందన్న ఆశ నలుగురు నేరస్తుల్లో కనిపించినట్టు చెప్పారు. తీహర్ జైలులోని 3వ నంబర్ బరాక్‌లో ఉన్న దోషుల చివరి నిమిషం వరకు ’కోర్టు నుంచి ఏదైనా వర్తమానం వచ్చిందా’ అన్న ప్రశ్న తమకు ఎదురైందని వెల్లడించారు. ఉదయం 5.30 గంటలకు ఉరితీసే వరకు తమకు కాపలా ఉన్న 15 మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారట. (ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!) లడ్డూలు, నూడుల్స్ అడిగారు నలుగురు దోషులకు గురువారం మధ్యాహ్నం రోజూ మాదిరిగా ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఇచ్చారు. ప్రత్యేకంగా ఏమి అడగలేదని, అందరూ లంచ్ చేశారని జైలు అధికారులు తెలిపారు. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. అక్షయ్, పవన్ రాత్రి భోజనం చేయలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముకేశ్, అక్షయ్, వినయ్ తమకు లడ్డూలు, నూడుల్స్ కావాలని అడగడంతో వాటిని తెప్పించి పెట్టినట్టు వెల్లడించారు. గురువారం రాత్రి 11 గంటలకు దోషులు నలుగురికి న్యాయవాది, మానసిక వైద్యుడి సమక్షంలో చివరిసారిగా వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్ (పశ్చిమ) డెత్‌వారెంట్‌ను దోషులకు చదివి వినిపించారు. ఉరిశిక్షకు భయపడిన పవన్ కాసేపు గలాభా సృష్టించడంతో అతడి వద్ద ఎక్కువ మంది పోలీసులను ఉంచారు. జైలు సిబ్బంది ఇచ్చిన బట్టలు వేసుకునేందుకు అతడు నిరాకరించాడు. ‘మేము ఇచ్చిన బట్టలను వేసుకోకుండా నేలకేసి కొట్టాడు. తనను క్షమించాలని ఏడుస్తూ వేడుకున్నాడు. ఉరి కంబం దగ్గరకు తీసుకెళుతుండగా దోషులందరూ తమను క్షమించాలని కన్నీళ్లు పెట్టుకుంటూ అర్ధించార’ని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. (నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి తగలబెట్టేవాడిని..) 8వ నంబర్ సెల్ ఉన్న వినయ్ శర్మ, ముఖేష్ సింగ్.. ఒకటో నంబర్‌సెల్ ఉన్న పవన్ గుప్తా, ఏడో నంబర్ సెల్లో ఉన్న అక్షయ్ సింగ్‌లను భద్రత సిబ్బంది ఉరికంబం వద్దకు తీసుకొచ్చారు. వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్‌లను ఒకేసారి ఉరి తీశారు. ఆ సమయంలో జిల్లా మేజిస్ట్రేట్, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు సహాయ సూపరింటెండెంట్స్, వార్డెన్, వైద్యాధికారి, ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ ఉన్నారు. యూపీలోని మీరట్‌కు చెందిన తలారి పవన్ జలాద్‌కు ఒక్కో ఉరికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.60 వేలు చెల్లించినట్టు సమాచారం. జైలులో పనిచేసిన సంపాదించిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని దోషులు చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2 వేల నుంచి మూడు వేల వరకు ఉన్నట్టు సమాచారం. డబ్బుతో పాటు వారి బట్టలు, దుప్పట్లను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. (తలారికి లక్ష నజరానా.. జైలు వద్ద హడావుడి) -
నా కూతురి ఆత్మ శాంతించింది!
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కావడంపై బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు న్యాయం లభించిందని, ఇప్పుడు భద్రంగా ఉన్నామని మహిళలు భావిస్తారని వ్యాఖ్యానించారు. శిక్ష అమలు ఇంతగా వాయిదా పడటానికి కారణమైన చట్టపరమైన లోపాలపై ఇకపై తాము పోరాటం చేస్తామన్నారు. నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని ఆశాదేవి వ్యాఖ్యానించగా, తమ కూతురికి న్యాయం జరిగిందని, ఇలాంటి అన్యాయానికి గురైన బాధితుల కోసం ఇకపై పోరు కొనసాగిస్తామని బద్రీనాథ్ పేర్కొన్నారు. ఉరిశిక్ష అమలు మూడుసార్లు వాయిదా పడటంపై స్పందిస్తూ.. శిక్ష అమలును వాయిదా వేసేందుకు చేసే ఇలాంటి కుయుక్తులకు అడ్డుకట్ట వేసేలా మార్గదర్శకాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టును వారు అభ్యర్థించారు. ‘ఇప్పటికైనా మిగతా బాధితులకు సకాలంలో న్యాయం జరగాలి. అందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు జరగాలి. ఆ దిశగా పోరాటం సాగిస్తాం’ అన్నారు. ఈ రోజు తన కూతురి ఆత్మ శాంతించిందని భావిస్తున్నానని భావోద్వేగంతో ఆశాదేవి వ్యాఖ్యానించారు. మా ఊరి ప్రజలు ఈ రోజే హోళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ శిక్ష తరువాతైనా.. తల్లిదండ్రులు మహిళలతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తమ కుమారులకు నేర్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. ‘గురువారం రాత్రి సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఇంటికి వచ్చి నా కూతురు ఫొటోను హత్తుకుని, బేటీ.. నీకు న్యాయం జరిగింది’ అని విలపించానని ఆశాదేవి తెలిపారు. రాత్రంతా తామిద్దరికి కంటి మీద కునుకు లేదన్నారు. మార్చి 20వ తేదీ చరిత్రలో నిలిచిపోవాలని, ఈ రోజును ఏటా ‘నిర్భయ న్యాయ దివస్’గా జరుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆశాదేవి ఇంటి వద్ద తెల్లవారు జామున గుమికూడిన ప్రజలు ఉరిశిక్ష అమలుపై ‘కౌంట్ డౌన్’ నిర్వహించారు. -
ఉరేసరి
నిర్భయ అత్యాచారం కేసులో నిందితులుగా నిలిచిన నలుగురిని శుక్రవారం ఉరి తీశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ స్పందనను తెలియజేశారు. ‘ఉరే సరి’ అని అభిప్రాయాలను పేర్కొన్నారు. ఆలస్యమైనా న్యాయం జరిగింది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోకుండా ఉండేందుకు నిర్భయ కేసు మరో ఉదాహరణ అయింది. నిర్భయ కేసు కోసం పోరాడిన ఆమె తల్లి, న్యాయవాదులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. న్యాయ వ్యవస్థకు నా గౌరవాన్ని తెలియజేస్తున్నాను. ఇలాంటి ఘోర సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరిన్ని కఠిన చట్టాలు, సత్వర తీర్పులు తీసుకురావాలని కోరుతున్నాను. – మహేశ్‌బాబు ఏడేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత నిర్భయ దోషులను ఉరి తీశారు. న్యాయం కోసం ఇన్నేళ్లు నిర్విరామంగా పోరాడిన నిర్భయ తల్లిగారు, న్యాయవాదులకు నా సెల్యూట్. – రవితేజ నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జైహింద్. – మనోజ్ మంచు ఒకరి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే కొంతమందికి భయాన్నిస్తే చాలు. – హరీష్ శంకర్ నిర్భయ దోషులను ఉరి తీశారనే అద్భుతమైన వార్తతో నా రోజుని ప్రారంభించాను. న్యాయం చేకూరింది. – తమన్నా భాటియా చాలా ఏళ్ల తర్వాత నిర్భయ తల్లిదండ్రులు ప్రశాంతంగా నిద్రపోతారని అనుకుంటున్నాను. చాలా పెద్ద యుద్ధమే చేశారు. ఆశా దేవి (నిర్భయ తల్లి) గారికి నా సెల్యూట్ – తాప్సీ న్యాయం నిజంగా జరిగిందనుకుందామా? అత్యాచారం చేసిన ఆరు నెలల్లో ఉరి తీయాలనే చట్టాన్ని తీసుకురావాలి. ఇలాంటి సంఘటనల్లో అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయినా తీర్పును అమలు చేయడంలో ఇంత ఆలస్యం చేయడమెందుకు? – వరలక్ష్మీ శరత్ కుమార్ నిర్భయ కేసు మరింత త్వరగా ముగిసి ఉండాల్సింది. ఇప్పటికైనా ముగిసినందుకు సంతోషం. – ప్రీతీ జింటా నిర్భయ దోషులను ఉరి తీశారు. అత్యాచారానికి శిక్ష మరణమే. ఈ నిర్ణయం ఇండియాలోనే కాదు...ప్రపంచవ్యాప్తంగా కూడా ఓ ఉదాహరణగా నిలవాలి. మహిళలను గౌరవించాలి. నిర్భయ దోషులను ఉరి తీయడాన్ని ఆలస్యం చేయడానికి ప్రయత్నించిన వారిని చూసి సిగ్గుపడతున్నా – రిషీ కపూర్ ఈ భూమి మీద నలుగురు రాక్షసులు (నిర్భయ దోషులను ఉద్దేశిస్తూ) ఇకపై లేరు. నిర్భయ తల్లిదండ్రులు దీనికోసం ఏడేళ్లుగా ఎదురు చూశారు. చివరికి నిర్భయ ఆత్మకు శాంతి కలిగింది – రవీనా టాండన్ కఠినమైన చట్టాలు, శిక్షలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర తీర్పులు వంటివి మాత్రమే నిర్భయలాంటి ఘటనలకు పాల్పడాలనుకునేవారికి భయాన్ని కలిగిస్తాయి. కాస్త ఆలస్యమైనా న్యాయం చేకూరింది – రితేష్ దేశ్‌ముఖ్ ఇవాళ (శుక్రవారం) దేశానికి న్యాయం జరిగింది. నిర్భయ తల్లి రూపంలో మనందరికీ ఓ హీరో దొరికారు. ఈ తీర్పు వల్ల న్యాయవ్యవస్థ మీద గౌరవం అలానే కొనసాగుతుంది. అలాగే తప్పు చేయాలనుకునే ఆలోచనలు ఉన్నవాళ్లకు ఓ హెచ్చరికగానూ ఉంటుంది. – ప్రణీతా సుభాష్ ఈ కేసు గెలవడానికి నిర్భయ తల్లికి ఏడేళ్లు పట్టింది. ఈ ఏడేళ్ల సమయంలో ఎన్నో అవమానాలు, మాటలు భరించాల్సి వచ్చిందామె. అవన్నీ దాటుకుంటూ ముందుకు వచ్చి పోరాడారు.. ‘అంత ఆలస్యంగా బయట ఏం చేస్తుందో?’ అని సులువుగా ఓ మాట అనేసి తన (నిర్భయ) వ్యక్తిత్వాన్ని తప్పుబట్టినవాళ్లందరూ స్వీయ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. -
‘నిర్భయ’దోషులకు ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ తల్లిదండ్రుల ఏడేళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. 2012లో రాజధాని నడిబొడ్డున నడుస్తున్న బస్సులో పారామెడికో విద్యార్థిని నిర్భయని అత్యంత క్రూరంగా హింసించి అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషులైన ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31)లను శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు తీహార్ జైల్లో ఉరితీశారు. ఇలా ఒకేసారి నలుగురికి ఉరి శిక్ష అమలు చేయడం తీహార్ జైలు చరిత్రలో ఇదే మొదటిసారి ప్రాణాల మీద ఆశతో దోషులు చివరి వరకు ఉరిశిక్ష అమలును ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకుంటూ ఆఖరి వరకు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. దాంతో, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వారి ఉరిపై సందిగ్ధత నెలకొంది. గురువారం రాత్రి పవన్ గుప్తా పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు అత్యవసర విచారణ చేపట్టాయి. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రెండోసారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పవన్ గుప్తా వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు బెంచ్ అసాధారణ రీతిలో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రారంభించింది. గంటపాటు జరిగిన వాదనల అనంతరం ఆ పిటిషన్‌ను బెంచ్ కొట్టివేసింది. దాంతో, ఉరి శిక్ష అమలు చేయడానికి చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఉరిశిక్ష అమలుకు ముందు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినివ్వాలని అక్షయ్ సింగ్, పవన్ గుప్తా పెట్టుకున్న అభ్యర్థనను కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇది జరిగిన మూడు గంటల్లోనే తీహార్ జైలు అధికారులు నలుగురికీ ఉరి శిక్ష అమలు చేశారు. నిబంధనల ప్రకారం.. ఉరి వేసిన తరువాత అరగంట పాటు వారిని ఉరికంబానికే వేలాడదీసి ఉంచారని జైలు అధికారులు తెలిపారు . ‘ఉరిశిక్ష అనంతరం డాక్టర్లు పరీక్షించారు. నలుగురూ మృతి చెందారని నిర్ధారించారు’ అని ఆ తరువాత తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ ప్రకటించారు. ఆ తరువాత డీడీయూ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించామన్నారు. అక్షయ్, ముఖేష్‌ల మృతదేహాలను బిహార్, రాజస్తాన్‌ల్లోని తమ తమ గ్రామాలకు వారు తీసుకెళ్లారని చెప్పారు. వినయ్, పవన్‌ల మృతదేహాలను ఢిల్లీలో రవిదాస్ క్యాంప్‌లో ఉన్న వారి ఇళ్లకు తరలించామన్నారు. చివరి క్షణాలు ఒకవైపు కోర్టులో వాదనలు జరుగుతున్నా.. తీహార్ జైలు అధికారులు ఉరిశిక్ష అమలుకు సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. గురువారం రాత్రి నుంచే మొత్తం జైలుని లాక్డౌన్ చేశారు. దోషులు నలుగురిని వేర్వేరు గదుల్లో ఉంచారు. రాత్రి డిన్నర్‌ని ముఖేష్, వినయ్ రోజూ మాదిరిగా ఇచ్చిన టైమ్‌కి తినేశారు. వారికిచ్చిన ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఉన్నాయి. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. ఆ తర్వాత అతను ఏం తీసుకోలేదు. పవన్ గుప్తా కూడా ఆహారం తీసుకోవడానికి నిరాకరించాడు. వారిలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని, రాత్రంతా కూడా వారు ముభావంగానే గడిపారని జైలు అధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత లాంఛనాలు పూర్తి చేయడానికి తెల్లవారు జామున 3.30 గంటలకి ఆ దోషులు నలుగురిని నిద్ర లేపడానికి అధికారులు వెళ్లారు. అయితే వారు మేలుకొని ఉన్నారు. రాత్రంతా వారు నిద్రలేకుండానే గడిపారని జైలు అధికారులు వెల్లడించారు. స్నానం చేయడానికి, అల్పాహారం తినడానికి ఇష్టపడలేదు. నిర్వికారంగానే ఉరికంబం వైపు అడుగులు వేశారు. ఒకరి ఆత్మహత్య.. మరొకరి విడుదల దోషులుగా తేలి, ఉరిశిక్షకు గురైన నలుగురితో పాటు మరో ఇద్దరు నిందితులుగా విచారణ ఎదుర్కొన్నారు. విచారణ జరుగుతుండగానే.. ఆ ఇద్దరిలో రామ్‌సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు నేరం జరిగిన సమయానికి మైనర్ కావడంతో.. నిర్బంధ వసతి గృహంలో మూడేళ్లు శిక్ష అనుభవించి 2015 సంవత్సరంలో విడుదల అయ్యాడు. ప్రధాని మోదీ హర్షం నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. నిర్భయ కేసును ప్రస్తావించకుండా.. ‘న్యాయం గెలిచింది. మహిళల గౌరవం, భద్రత మనకు అత్యంత ముఖ్యమైన విషయం. మన మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మహిళల సాధికారతపై ప్రధానంగా దృష్టి పెట్టే.. మహిళలకు సమానత్వం, సమాన అవకాశాలు లభించే సమాజాన్ని మనమంతా కలిసి నిర్మించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, మహిళలపై హింసను నివారించేందుకు మరణశిక్ష ఏ నాటికి పరిష్కారం కాబోదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. ఈ ఉరి శిక్ష భారతదేశ మానవహక్కుల చరిత్రలో ఒక మరకలా నిలిచిపోతుందని పేర్కొంది. ఆఖరి కోరికలివే ఉరికంబం ఎక్కడానికి ముందు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ తన అవయవాలను దానం చేశాడు. అదే తన ఆఖరి కోరికని చెప్పాడు. వినయ్ తాను జైల్లో ఉన్నప్పుడు వేసిన పెయింటింగ్‌లను జైలు సూపరింటెండెంట్‌కి ఇవ్వమని కోరాడు. తాను చదివే హనుమాన్ చాలీసా తన కుటుంబసభ్యులకు ఇవ్వమని చెప్పినట్టు జైలు అధికారి వెల్లడించారు. ముఖేష్, వినయ్, పవన్, అక్షయ్ ఎవరూ ఎలాంటి విల్లు రాయలేదని ఆ అధికారి చెప్పారు. విజయ సంకేతం చూపుతున్న నిర్భయ తల్లిదండ్రులు, లాయర్లు సీమా కుష్వాహ, జితేంద్ర ఝా 2012 నుంచి 2020 వరకు న్యూఢిల్లీ: నిర్భయ ఘటన 2012 డిసెంబర్ 16న చోటు చేసుకోగా, దోషులకు ఉరిశిక్ష 2020 మార్చి 20న అమలైంది. ఏడు సంవత్సరాలకు పైగా ఈ కేసు విచారణ సాగింది. దోషులుగా తేలి, ఉరిశిక్షను నిర్ధారించిన తరువాత కూడా కేసును సాధ్యమైనంత సాగదీశారు. విచారణ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కార్యాలయం చుట్టూ పలుమార్లు ఈ కేసు చక్కర్లు కొట్టింది. చివరగా, మార్చి 5న ట్రయల్ కోర్టు మార్చి 20న ఉరిశిక్షను అమలు చేయాలని డెత్ వారెంట్లను జారీ చేసింది. ‘నిర్భయ’ తలారికి లక్ష నజరానా యశవంతపుర: నిర్భయ హంతకులను ఉరి తీసిన తలారి పవన్ జల్లూద్కు రూ.లక్ష నజరానా ప్రకటించినట్లు నటుడు జగ్గేశ్ ట్వీట్ చేశారు. హంతకులను ఉరితీసే వ్యక్తికి రూ. లక్ష బహుమతిగా ఇస్తానని గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఉరితీతతో సత్యం, ధర్మానికి న్యాయం లభించిందన్నారు. ఈ డబ్బుతో తన కుమార్తె వివాహం చేస్తానని జల్లూద్ గతంలో పేర్కొనడాన్ని జగ్గేష్ గుర్తు చేశారు. జైలు వద్ద నినాదాలు తీహార్ జైలు వెలుపల గురువారం రాత్రంతా జనం హడావుడి కనిపించింది. కరోనా భయాన్ని కూడా పక్కనపెట్టి వందలాది మంది గుమిగూడారు. దోషులను ఉరి తీశారన్న వార్త వినగానే జాతీయ జెండాను ఎగురవేస్తూ లాంగ్ లివ్ నిర్భయ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేశారు. న్యాయం దక్కింది నిర్భయ దోషులకు ఉరిశిక్షపై పలువురు ప్రముఖుల హర్షం న్యూఢిల్లీ/బెంగళూరు: నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని మోదీ సహా, పలువురు కేంద్రమంత్రులు, మహిళా సంఘాలు సానుకూలంగా స్పందించాయి. పలువురు రాజకీయ నేతలు న్యాయనిపుణులు హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష అమలును పలువురు కేంద్ర మంత్రులు స్వాగతించారు. దేశంలో మహిళలపై జరిగే అత్యాచారాలకు కఠిన శిక్షలు అమలు చేయాలని బాలీవుడ్ ప్రముఖులు రిషి కపూర్, తాప్సీ పన్ను, రితేశ్ దేశ్‌ముఖ్ తదితరులు పేర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాత్రం.. మహిళలపై అత్యాచారాలకు దోషులకు మరణ శిక్ష విధించడం ఏమాత్రం పరిష్కారం కాదని తెలిపింది. భారత్ మానవహక్కుల రికార్డుపై ఈ ఘటనను మాయని మచ్చగా అభివర్ణించింది. దోషులకు కఠిన శిక్షలు పడేలా నిర్భయ తల్లి సాగిస్తున్న పోరాటాన్ని స్వయంగా చూశాం. ఇందుకు కొంత సమయం తీసుకున్నా, చివరికి ఆ కుటుంబానికి న్యాయం దక్కినందుకు సంతోషంగా ఉంది. నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుతో నేరగాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని గట్టి హెచ్చరిక పంపినట్లయింది. –మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ నిర్భయ ఘటనల వంటివి భవిష్యత్తులో జరక్కుండా చూస్తామని ఈ సమయంలో మనమంతా ప్రతినబూనాలి. ఏ కూతురికీ ఇలాంటి ఆపద రాకూడదు. వ్యవస్థలో లోపాలను అధిగమించేందుకు పోలీసులు, కోర్టులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలి. –ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర వేదనను అనుభవించిన ఒక కూతురు నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. మరణశిక్ష అమల్లో జాప్యం అయ్యేలా దోషులు తప్పుదోవ పట్టించకుండా ఇకపై న్యాయవ్యవస్థ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. –కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ నిర్భయకు ఎట్టకేలకు న్యాయం దొరికింది. ఆమె ఆత్మకు శాంతి లభించింది. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయడం మిగతా వారికి హెచ్చరికలా పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఈ కేసు బయటపెట్టింది. వీటిని నలుగురు దోషులు వాడుకున్నారు. –జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ నిర్భయ నివాసంలో హర్షం దోషులకు ఉరిశిక్ష అమలు శుక్రవారంనాడు పూర్తి కావడంతో పశ్చిమ ఢిల్లీ ద్వారకా ప్రాంతంలోని నిర్భయ కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగువారు సంతోషం వ్యక్తం చేశారు. నిర్భయ కుటుంబసభ్యులను కలిసేందుకు జనం క్యూ కట్టారు. ఈ సందర్భంగా వారంతా స్వీట్లు పంచుకున్నారు. పాటలు పాడుకుంటూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ‘గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి మా ఇంటి ఆవరణలో నిర్భయకు నివాళిగా రోజూ కొవ్వొత్తులను వెలిగిస్తున్నాం. ఇటీవల ఒక రోజు రాత్రి భారీ వర్షం కురిసినా కూడా ఒక కొవ్వొత్తి వెలుగుతూనే ఉండటం గమనించాం. దీనిని మేం శుభ సూచికంగా భావించాం’అని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ తెలిపారు. నిర్భయ దోషుల మృతదేహాలతో ఆస్పత్రి వద్దకు వచ్చిన వ్యాన్ -
ఆ ఆరుగురి పాపమే !
న్యూఢిల్లీ: డిసెంబర్ 16, 2012.. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కదులుతున్న బస్సులో ఢిల్లీ మెడికో విద్యార్థిని నిర్భయపై జరిగిన దారుణం అత్యంత హేయమైనది. నిర్భయపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెని, ఆమె స్నేహితుడ్ని ఐరన్ రాడ్లతో రక్తాలు కారేలా చితకబాది కదులుతున్న బస్సులోంచే బయటపడేసిన అకృత్యమది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనతో యావత్ జాతి కదలిపోయింది. నిర్భయ దోషులకు తగిన శాస్తి జరిగే వరకు పోరాడతామని ఎలుగెత్తి చాటింది. నిర్భయ తల్లిదండ్రులు, రేపిస్టులపై జాతి యావత్తు చేసిన పోరాటం నలుగురి ఉరితీతతో ముగిసింది. ఈ నేరం చేసిన ఆరుగురి వివరాలేంటో చూద్దాం రామ్‌సింగ్, ప్రధాన నిందితుడు : నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన బస్సు డ్రైవరే రామ్ సింగ్. దక్షిణ ఢిల్లీలో రవిదాస్ కేంప్ మురికివాడల్లో నివాసం ఉండే అతనే ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఢిల్లీ పోలీసులు రామ్సింగ్ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. రామ్‌సింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే అతని సోదరుడు ముఖేష్ సింగ్ సహా మిగిలిన అయిదుగురిని అరెస్ట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతుండగానే రామ్ సింగ్ 2013, మార్చి 10న జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబితే, అతనిని హత్య చేశారంటూ అతని తల్లిదండ్రులు ఆరోపించారు. మైనర్: అత్యంత హేయమైన ఈ నేరంలో ఒక మైనర్ ప్రమేయం కూడా ఉంది. నిర్భయను క్రూరంగా హింసించింది ఈ మైనరే. అతనిని ఆనంద్‌విహార్ ప్రాంతంలో మర్నాడు ఉదయం నిర్బంధించిన పోలీసులు జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. నేర నిర్ధారణ కావడంతో మూడేళ్లు రిమాండ్ హోమ్‌కి తరలించారు. మైనర్ అయినందున అతని వివరాలేవీ బయటకు వెల్లడించలేదు. మూడేళ్ల నిర్బంధం తర్వాత 2015 డిసెంబర్లో అతనిని విడుదల చేశారు. ఉరిశిక్ష అమలు చేసింది ఈ నలుగురికే ముఖేష్ సింగ్, బస్సు క్లీనర్ తీహార్ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తమ్ముడే ముఖేష్ సింగ్ (32). దక్షిణ ఢిల్లీలోని మురికివాడల్లో సోదరుడితో కలిసి నివసించేవాడు. అత్యాచారం జరిగిన రాత్రి నిర్భయను, ఆమె స్నేహితుడిని ఐరన్ రాడ్‌తో చితకబాదాడని ముఖేష్‌పై అభియోగాలున్నాయి. నేరం జరిగాక ముఖేష్ సింగ్ అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు అతనిని రాజస్తాన్‌లోని కరోలిలో అదుపులోనికి తీసుకున్నారు. నిర్భయపై అత్యాచారం చేసినప్పుడు ఆమె ప్రతిఘటించలేదని బీబీసీ ఇండియా డాటర్ అనే డాక్యుమెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పవన్ గుప్తా, పండ్ల వ్యాపారి పవన్ గుప్తా (25) పండ్ల వ్యాపారి. అతను కూడా రవిదాస్ మురికివాడల్లోనే నివాసం ఉంటాడు. డిసెంబర్ 16 మధ్యాహ్నం తప్పతాగాడు. ఆ తర్వాత అన్నం తిని మద్యం మత్తులోనే బయటకు వెళ్లాడు. నిర్భయ దుర్ఘటన జరిగినప్పుడు బస్సు దరిదాపుల్లో కూడా లేడని పవన్ కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ పవన్ గుప్తా ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తే అతను నేరం జరిగిన సమయంలో బస్సులోనే ఉన్నాడని బయటపడింది. వినయ్ శర్మ, జిమ్ ట్రైనర్ వినయ్‌శర్మ (26) కూడా రవిదాస్ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిట్నెస్ ట్రైనర్. ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడగలడు. పోలీసులు అతనిని జిమ్ బయటే అదుపులోనికి తీసుకున్నారు. నేరం జరిగిన సమయంలో తాను బస్సు దగ్గర లేనని, ఒక సంగీత కార్యక్రమానికి హాజరవడానికి వెళ్లానని వినయ్ శర్మ పదే పదే చెప్పుకున్నాడు. 2016లో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కానీ జైలు అధికారులు అతనిని కాపాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా జైలు గోడలకి తలని బాదుకొని గాయపరుచుకున్నాడు. అక్షయ్ ఠాకూర్, స్కూల్ డ్రాపవుట్ అక్షయ్ ఠాకూర్ (31) బీహార్ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు. స్కూల్ డ్రాపవుట్ అయిన అక్షయ్ 2011లో బీహార్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన అయిదు రోజుల తర్వాత అక్షయ్‌ని బీహార్‌లో అతని స్వగ్రామం తాండ్వాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్షయ్ భార్య తన కుమారుడితో కలిసి బీహార్లోనే ఉంటోంది. ఉరితీతకు మూడు రోజుల ముందు అతను రెండోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. అక్షయ్ ఉరి శిక్షకు ముందు తాను వితంతువుగా జీవితాంతం బతకనని, తనకి విడాకులు ఇప్పించాలని కోరుతూ అతని భార్య కోర్టుకెక్కింది. -
నిర్భయ దోషులకు నేడే ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరికి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఏడు సంవత్సరాల మూడు నెలలపాటు దర్యాప్తు, విచారణ ప్రక్రియ శిక్ష అమలుపై ఇక ముగియనుంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ దోషులు మరోసారి పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ అనే నలుగురు దోషులు బలిపీఠం ఎక్కడం ఖాయమైంది. ఇప్పటికే మూడు పర్యాయాలు ఉరిశిక్ష వాయిదా పడగా మరోసారి స్టే విధించాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా గురువారం విచారించారు. ‘ఈ పిటిషన్ సమర్థనీయం కాదని నేను భావిస్తున్నాను. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాను’అని ప్రకటించారు. ‘ఈ కేసు కోసం న్యాయవ్యవస్థ ఎంతో సమయాన్ని వెచ్చించింది. చట్ట పాలనపై తలెత్తిన ఎన్నో అనుమానాలకు సమాధానాలు కూడా ఇచ్చింది’ అని పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత: తీర్పు వెలువడిన తర్వాత కోర్టు ప్రాంగణంలో హైడ్రామా చోటుచేసుకుంది. అక్షయ్ భార్య తనతోపాటు తన కుమారుడిని కూడా ఉరితీయాలంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది. రేపిస్టు భార్యగా జీవించలేకనే విడాకుల కోసం పిటిషన్ వేసినట్లు తెలిపింది. నిర్భయ తల్లి వ్యాఖ్య తన కూతురి ఆత్మకు ఇక ప్రశాంతత లభిస్తుందని ఈ తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. ‘దోషులకు ఇక ఉరి తప్పదు. నాకు ఇప్పటికి శాంతి దొరికింది’అని తెలిపారు. దోషి అక్షయ్ భార్య విడాకుల కోసం పెట్టుకున్న పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ ముగ్గురు దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.ఢిల్లీకి చెందిన ఫిజియోథెరపీ విద్యార్థిని(23) 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి దారుణ అత్యాచారానికి గురై దాదాపు 15 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దురంతానికి నిర్భయ ఘటనగా పేరుంది. ఈ కేసులో ఆరుగురు దోషులు కాగా వీరిలో ఒకరు మైనర్. మరొకరు జైలులోనే ఉరి వేసుకున్నారు. మిగిలిన నలుగురు ముకేశ్(32), పవన్(25), వినయ్(26), అక్షయ్(31) అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నారు. -
నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి
న్యూఢిల్లీ/ఔరంగాబాద్: నిర్భయ దోషుల ఉరికి సర్వం సిద్ధమవుతోంది. మీరట్ నుంచి తలారి పవన్ తీహార్ జైలుకు చేరుకొని బుధవారం డమ్మీ ఉరి వేసి తాళ్లను పరీక్షించారని జైలు అధికారులు తెలిపారు. దోషులకు ఉరి వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన మనీలా తాళ్లను ఉపయోగిస్తారు. తలారి పవన్ వీటినే పరీక్షించారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఉరి, ఈ నెల 20న తెల్లవారుజామున 5:30 గంటలకు ఖరారైన సంగతి తెలిసిందే. నలుగురు దోషుల్లో ఒకరు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టేసింది. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్‌లో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ ఠాకూర్ భార్య తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఔరంగాబాద్ కోర్టులో కేసువేశారు. రేప్ చేసిన వ్యక్తికి భార్యగా కొనసాగడం తనకు ఇష్టంలేదని పునీతా మంగళవారం పిటిషన్ దాఖలు చేయగా గురువారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. -
శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి
న్యూఢిల్లీ: ‘‘నాకు చావు అంటే భయం లేదు. నా కూతురిపై ఆ మృగాళ్లు అత్యాచారం చేసిన రోజే నేను చచ్చిపోయాను. ఇప్పుడు కూడా నేను వాళ్లను నిందించాలనుకోవడం లేదు. న్యాయ వ్యవస్థలోని లొసుగులు అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్న తీరును విమర్శిస్తున్నా’’ అని అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. దోషులకు వెంటనే శిక్ష అమలు చేయడం వల్ల తన కూతురు లాంటి ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడే సాహసం ఇకముందు ఎవరూ చేయలేరని పేర్కొన్నారు. ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం, పలు సార్లు దోషుల ఉరిశిక్ష అమలుపై స్టేలు, అనేక పిటిషన్ల అనంతరం నిర్భయ దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌ను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఆశాదేవి.. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. డిసెంబరు 16, 2012 నాటి నిర్భయ ఘటనను గుర్తుచేసుకున్నారు. తన కూతురిపై జరిగిన అత్యాచార కాండ, హత్య, దోషులకు శిక్ష వేయించడానికి తాము చేసిన పోరాటం గురించి పంచుకున్నారు. మానవ హక్కుల పేరిట దోషులను రక్షిస్తున్నారంటూ విమర్శించారు. మరోసారి నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడితే న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.(నిర్భయ దోషులను ఎప్పుడో చంపేశారు) తన జాడ తెలియలేదు.. శరీరమంతా రక్తం ‘‘ఆరోజు ఆదివారం. దాదాపు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో నిర్భయ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రెండు- మూడు గంటల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పింది. రాత్రి ఎనిమిది అవుతున్నా తన నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో తనకు పలుమార్లు ఫోన్ చేశాం. కానీ కాల్ కట్ అయ్యింది. వెంటనే నేను, నా కొడుకు బస్టాండ్‌కు వెళ్లి తనకోసం వెతికాం. అయినా తన జాడ తెలియరాలేదు. దాదాపు రాత్రి 10 గంటలకు అనుకుంటా. నిర్భయ వాళ్ల నాన్న ఇంటి వచ్చారు. ఆయన కూడా తనకోసం వెదకడం ఆరంభించారు. పదకొండు గంటల వరకు మేం బయటే నిల్చుని ఉన్నాం. తనకోసం ఎదురుచూస్తున్నాం. ఇంతలో సఫ్దార్జంగ్ ఆస్పత్రి నుంచి కాల్ వచ్చింది. మా ఆయన ఫోన్ ఎత్తగానే.. నిర్భయ ఆస్పత్రిలో ఉందని.. తనకు గాయాలయ్యాయని చెప్పారు. వెంటనే మేం అక్కడికి చేరుకున్నాం. ఆలోగా తనను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. నన్ను చూడగానే నిర్భయ ఏడ్వడం మొదలుపెట్టింది. (తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని) తన శరీరమంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నాకు ఒక్కసారిగా ఏం అర్థంకాలేదు. నేర తీవ్రతను కూడా అంచనా వేయలేకపోయాం. అప్పుడే తన మీద ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. తన పెదాలు చీరుకుపోయి ఉన్నాయి. తన తల మీద చర్మం అంతా ఊడిపోయింది. ఒంటి నిండా కోతలు, గాయాలు, వాటి నుంచి కారుతున్న రక్తం. కొన్నిచోట్ల మాంసం కూడా బయటకు వచ్చింది. తన పరిస్థితి చూసి డాక్టర్లకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. తనను ఎలా బతికించాలో వారికి అంతుపట్టలేదు. ఇరవై ఏళ్ల కెరీర్లో తాను ఎంతో మందిని బతికించాను గానీ.... ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఓ సీనియర్ డాక్టర్ మాకు చెప్పారు. అంటే నా కూతురి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా మాలో ఆశ చావలేదు. తనకు స్పృహ వస్తుందని ఎంతగానో ఎదురుచూశాం. ఆశించినట్టే తను కళ్లు తెరిచింది. తనకు నయం అవుతుందని భావించాం. అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తను బతికే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. తనకు స్పృహ వచ్చిన వెంటనే మంచినీళ్లు కావాలని అడిగింది. కానీ డాక్టర్లు అందుకు నిరాకరించారు. చెంచాడు నీళ్లు తాగేందుకు కూడా తన శరీరంలో ఏ వ్యవస్థ సహకరించదని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నా కూతురు దాదాపు 10- 20 రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. కానీ ఈ ప్రపంచం నుంచి ఒక్క చుక్క మంచినీరు కూడా తీసుకోలేకపోయింది’’అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఆశాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.(‘నా కూతురు బతికిలేదు.. చాలా సంతోషం’) తన న్యాయం పోరాటం గురించి చెబుతూ... ‘‘ గడిచిన ఏడు- ఎనిమిదేళ్ల కాలంలో మేం ఎక్కని కోర్టు మెట్టులేదు. మొదట జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు.. అనంతరం సుప్రీంకోర్టు ఇలా అన్నిచోట్లకు వెళ్లాం. సర్వోన్నత న్యాయస్థానం దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పగానే మాకు న్యాయం జరిగినట్లేనని భావించాం. దోషుల రివ్యూ పిటిషన్‌ను 2018లో కోర్టు తిరస్కరించగానే సంతోషపడ్డాం. అప్పటి నుంచి నేటి దాకా ప్రతీ విచారణకు నేను హాజరవుతూనే ఉన్నాను. నా కుటుంబాన్ని వదిలేసి మరీ కోర్టుల చుట్టూ తిరిగాను. న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాను. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. (లాయర్‌ను తొలగించా.. టైం కావాలి: నిర్భయ దోషి) అయితే నా కూతురి పట్ల అత్యంత హేయంగా వ్యవహరించిన ఆ మృగాళ్లు తమ లాయర్‌ను అడ్డుపెట్టుకుని శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తారని నేను అస్సలు ఊహించలేదు. వాళ్లను నేరస్థులుగా చిత్రీకరించామని వాళ్లకు వాళ్లు చెప్పుకోవచ్చు. వాళ్ల తీరు నన్నెంతగానో బాధ పెట్టి ఉండవచ్చు. వాళ్ల ఎత్తుగడల వల్ల... నా కూతురి మీద అత్యాచారం జరిగిందని నేను పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది. ఈ అయినా నేను పోరాటం ఆపలేదు. ఎందుకంటే ఇలాంటి అకృత్యాలు కేవలం నా కూతురి ఘటనతోనే ఆగిపోలేదు. ఆగిపోవు కూడా. వాళ్ల ఉరిశిక్ష వాయిదా పడటం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. ఇలాంటి దోషుల వల్లే న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయి.(సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా..) మానవ హక్కుల పేరిట వ్యాపారం.. ఇక ఎప్పుడైతే దోషుల మెడకు ఉరి బిగుసుకుపోతుందని వాళ్ల కుటుంబాలకు, లాయర్‌కు తెలుస్తుందో.. అప్పుడే వాళ్లు పేదవాళ్లు అనే సంగతి గుర్తుకువస్తుంది. ఇంకో విషయం.. ప్రపంచ మానవ హక్కుల సంస్థ.. ఇలాంటి నేరస్థుల హక్కుల గురించి మాట్లాడుతుంది. వాళ్లకు మద్దతుగా నిలుస్తుంది. పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి పేరు సంపాదించుకుంటుంది. మానవ హక్కుల పేరిట పెద్ద వ్యాపారమే చేస్తోంది’’అని ఆశాదేవి విమర్శించారు. ఒకవేళ ఇలాంటి నేరగాళ్లు బెయిలు మీద బయటకు వస్తే.. బాధితులను, బాధితుల కుటుంబాలను చంపడానికైనా సిద్ధపడతారు. తగులబెట్టేందుకు కూడా వెనుకాడరు. మన కూతుళ్లు సురక్షితంగా ఉండాలంటే.. ఇలాంటి మృగాళ్లను ఉరితీయాల్సిందే’’ అని అభిప్రాయపడ్డారు.(దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి) -
20న నిర్భయ దోషుల ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి వేయాలంటూ ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన దారులు ముగిశాయని, కాబట్టి ఉరి తేదీ ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. దోషుల్లో ఒకడైన పవన్ ఇటీవల రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడం.. దాన్ని రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరి తేదీలు ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును చేరింది. దీంతో ఈ నెల 20న ఉదయం అయిదున్నరకు ఉరి వేయాల్సిందిగా అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా తెలిపారు. దీనికి ఎలాంటి నోటీసు అవసరం లేదని ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లి స్పందిస్తూ.. ఈ నెల 20 ఉదయం తమ జీవితాల్లో వెలుగు నింపే ఉదయమని చెప్పారు. దోషుల మరణాన్ని చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చట్టంలోని లొసుగులను దోషులు చక్కగా ఉపయోగించుకుంటున్నారని, ఏది జరగకూడదో అదే జరుగుతోందని శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నా తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజలు కోర్టుల మీద నమ్మకం కోల్పోరని భావిస్తున్నట్లు చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఖరారు చేశాక అవి అమలు జరిగితీరాలని చెప్పింది. దానిపై 23న విచారిస్తాం: సుప్రీంకోర్టు నిర్భయ కేసు దోషులను ఒకేసారి ఉరితీయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 23న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఒకే నేరానికి సంబంధించిన దోషులను వేరువేరుగా ఉరి తీసే అంశంపై లోతుగా పరిశీలన జరుపుతామని చెప్పింది. ఢిల్లీలోని ట్రయల్ కోర్టు మార్చి 20న దోషులకు ఉరిని ఖరారు చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. దోషులు చట్టంలోని లొసుగులతో ఆడుకుంటున్నారని చెప్పారు. ఈ నెల 23న విచారణ జరుగుతుందని, ఇకపై వాయిదాలు ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి..
బొమ్మలరామారం: హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఉదయం నుంచి ఎదురుచూపులు సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందోనని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే త గిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఉరితీసిన రోజే సంతృప్తి:పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సం తృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. -
వారు న్యాయవ్యవస్థతో ఆడుకుంటున్నారు
-
ఇంకా సమయం ఇవ్వొద్దు!
న్యూఢిల్లీ: ‘నిర్భయ’పై పాశవికంగా హత్యాచారం జరిపిన దోషులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని కేంద్రం కోరింది. వారికి ఇంక ఎంతమాత్రం సమయం ఇవ్వడం సరికాదని, అందుకు వారు అర్హులు కారని స్పష్టం చేసింది. నిర్భయ హత్యాచారం కేసు దోషుల ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ముందు ఆదివారం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా, గత సంవత్సరం డిసెంబర్లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ‘దిశ’ సామూహిక అత్యాచారం, హత్య ఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, ఆ ఎన్కౌంటర్ షాకింగ్ ఘటనే అయినా, ప్రజలు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ‘ఆ ఘటన తీవ్రమైన తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరిచింది. న్యాయవ్యవస్థ విశ్వసనీయత, సొంత తీర్పును అమలు చేసే అధికారం ప్రశ్నార్థకంగా మారాయి’ అని మెహతా వ్యాఖ్యానించారు. ఉరిశిక్ష పదేపదే వాయిదా పడేలా నిర్భయ దోషులు వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజల ఓపికను పరీక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘ఆ నలుగురు దోషులు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తూ చట్టం ఇచ్చిన తీర్పును అవహేళన చేస్తున్నారు’ అన్నారు. పవన్ గుప్తా ఇన్నాళ్లు క్యురేటివ్ పిటిషన్ కానీ, క్షమాభిక్ష పిటిషన్ కానీ దాఖలు చేయకపోవడం ఈ ఉద్దేశపూర్వక ప్రణాళికలో భాగమేనన్నారు. సాధ్యమైన అన్ని మార్గాలను ఉపయోగించుకుని ఉరి శిక్ష అమలును వాయిదా వేయడం లక్ష్యంగా వారు ప్రయత్నిస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థతో ఆ దోషులు ఆడుకుంటున్నారని మెహతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులు అక్షయ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తాల తరఫున న్యాయవాది ఏపీ సింగ్, మరో దోషి ముకేశ్ కుమార్ తరఫున న్యాయవాది రెబెకా జాన్ వాదనలు వినిపించారు. ఉరిశిక్ష అమలుపై స్టే విధించడాన్ని కేంద్రం సవాలు చేయకూడదని రెబెకా అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణలో కేంద్రం ఎన్నడూ భాగస్వామి కాలేదన్నారు. ఉరిశిక్ష అమలు జరిగేలా డెత్ వారెంట్లను జారీ చేయాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించింది బాధితురాలి తల్లిదండ్రులే కానీ కేంద్రం కాదని ఆమె కోర్టుకు గుర్తు చేశారు. దోషులను ఒకే రోజు కాకుండా, వేర్వేరు రోజుల్లో ఉరి తీసే అవకాశంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని హైకోర్టుకు రెబెకా తెలిపారు. అంతేకాకుండా, ఒకే తీర్పు ద్వారా ఆ నలుగురు దోషులకు ఉరి శిక్ష పడినందువల్ల.. వారిని వేర్వేరు రోజుల్లో ఉరి తీయడం చట్టబద్ధంగా సమ్మతం కాదన్నారు. ‘నేనొక దుర్మార్గుడిని. దారుణ నేరానికి పాల్పడ్డాను. ఉరి ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాను. ఇవన్నీ నేను ఒప్పుకుంటున్నాను. అయినా, ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును కోరుకునే హక్కు నాకుంది’ అని దోషుల తరఫున రెబెకా వాదించారు. చట్టబద్ధంగా తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునే హక్కు దోషులకు ఉందని తేల్చిచెప్పారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన వాదనల అనంతరం.. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతూ న్యాయమూర్తి సురేశ్ కాయిట్ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు దోషుల్లో ముకేశ్, వినయ్‌ల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. అక్షయ్ సింగ్ శనివారం క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్‌లో ఉంది. పవన్ ఇంకా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించలేదు. -
చివరి కోరికపై మౌనంగా నిర్భయ దోషులు
-
చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: ఆడపిల్లల రక్షణ విషయంలో యావత్ దేశాన్ని అభద్రతలోకి నెట్టివేసిన ఢిల్లీ నిర్భయ ఘటనలో దోషులు నలుగురినీ ఫిబ్రవరి 1వ తేదీన ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉరితీయడానికి ముందు ఏ ఖైదీనైనా వారి ఆఖరి కోరిక ఏమిటని అడగడం ఆనవాయితీ. తీహార్ జైలు అధికారులు సైతం ఈ నలుగురినీ ఆఖరి కోరిక ఏమిటని ప్రశ్నించగా నలుగురిలో ఏ ఒక్కరు కూడా సమాధానమివ్వకుండా మౌనాన్ని ఆశ్రయించారనీ, వారి సమాధానం కోసం వ్డేచి చూస్తున్నామని అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్‌కుమార్ వెల్లడించారు. నలుగురినీ రాతపూర్వకంగా తమ చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు ప్రశ్నించినట్టు ఆయన తెలిపారు. (నిర్భయ కేసు : పిటిషనర్‌కు సుప్రీం చురకలు) ఒకసారి వారు నోరువిప్పి తమ చివరి కోరిక ఏమిటో చెపితే దాన్ని తీర్చగలుగుతామా లేదా అన్న విషయాన్ని జైలు అధికారులు పరిశీలిస్తారని వ్యాఖ్యానించారు. ‘అయితే అన్ని కోర్కెలూ తీర్చే అవకాశం ఉండదు. ఖైదీలు తమ కోర్కెను రాతపూర్వకంగా ఇచ్చిన తరువాత దానిపై అధికారులు నిర్ణయం తీసుకొంటారు’అని తెలిపారు. కనీసం మీరు చివరిసారిగా ఎవరినైనా కలుసుకోవాలనుకుంటున్నారా? అనీ, మీ ఆస్తులను, మీకు సంబంధించిన వాటిని ఎవరికైనా అప్పజెప్పాలనుకుంటున్నారా అని కూడా వారిని ప్రశ్నించినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ హైకోర్టు నిర్భయ దోషులైన వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్(31), ముఖేష్ కుమార్ (32), పవన్(26)లను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6గంటలకు ఉరి తీయాలని ఆదేశాలు జారీచేసింది. (దోషులను క్షమించడమా... ఆ ప్రసక్తే లేదు!) చదవండి: కంగన మాటల్లో తప్పులేదు: నిర్భయ తల్లి ‘ఆమెను నిర్భయ దోషులతో కలిపి ఉంచాలి’ నిర్భయ దోషి పిటిషన్ కొట్టివేత ఒక్కొక్కరిని ఉరి తీయండి.. అప్పుడే: నిర్భయ తల్లి న్యాయమూర్తి అరోరా సుప్రీంకు బదిలీ నిర్భయ ఘటనలో దోషులకు మరణ శిక్ష విధించిన సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరాను డిప్యుటేషన్ ప్రాతిపదికన అదనపు రిజిస్ట్రార్‌గా సుప్రీంకోర్టుకు బదిలీ చేశారు. అరోరా నిర్భయ కేసుతోసహా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దాఖలు చేసిన పలు కేసులను విచారించారు. (ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు) -
నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక హత్యాకాండలో శిక్ష అనుభవించబోతున్న దోషులకు సంబంధించి సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దోషులు అక్షయ్ ఠాకూర్ సింగ్, ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు జనవరి 22 న ఉదయం 7 గంటలకు ఉరి తీయనున్నట్లు ఢిల్లీ కోర్టు ఈ నెల ప్రారంభంలో డెత్ వారెంట్ జారీ చేసింది. అటు మరణశిక్షకు వ్యతిరేకంగా ముగ్గురు దోషులు దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో వీరికి మరణశిక్ష అమలు కానుంది. గత ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న వీరు అనేకసార్లు జైలు నిబంధనలు ఉల్లంఘించారు. అంతేకాదు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 2012 డిసెంబర్ 16 న యువ వైద్య విద్యార్థిని (నిర్భయ)ను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ డిసెంబరు 29న నిర్భయ కన్నుమూయడంతో ఆందోళన ఉరింత ఉధృతమైంది. ఈ కేసులో సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నలుగురు దోషులు, అక్షయ్, ముకేష్, పవన్, వినయ్ శర్మలకు మరణ శిక్ష అమలు కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తీహార్ జైల్లో ఈ నలుగురు 23 సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారని వర్గాలు తెలిపాయి. జైల్లో వీరి సంపాదన మొత్తం దాదాపు రూ .1,37,000. గత ఏడు సంవత్సరాల సమయంలో జైలు నియమాలను ఉల్లంఘించినందుకు వినయ్ 11 సార్లు, అక్షయ్ ఒకసారి శిక్ష అనుభవించాడు. ముకేశ్ మూడుసార్లు, పవన్ ఎనిమిది సార్లు నిబంధనలను అతిక్రమించారు. ముకేశ్ ఎలాంటి పని చేయకూడదని నిర్ణయించుకోగా అక్షయ్ రూ .69 వేలు సంపాదించగా, పవన్ రూ .29 వేలు, వినయ్ రూ .39 వేలు సంపాదించాడు. 2016లో ముగ్గురు దోషులు - ముకేష్, పవన్, అక్షయ్ - 10 వ తరగతికి అర్హత సంపాదించి పరీక్షలకు హాజరయ్యారు కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వినయ్, 2015 లో, బ్యాచిలర్ డిగ్రీ కోసం ఎంట్రన్స్ పాస్ అయినా కాని అతను దానిని పూర్తి చేయలేకపోయాడు. ఉరిశిక్ష అమలుకు ముందు దోషులందరి కుటుంబానికి కలవడానికి రెండుసార్లు అనుమతించారు అధికారులు. దీంతో వినయ్‌ను తండ్రి మంగళవారం కలిశారు. కాగా ఈ నలుగురిని ఉరి తీసే ఏర్పాట్లు గత నెలలో ప్రారంభమయ్యాయి. దోషులను సీసీటీవీ పర్యవేక్షణలో వేర్వేరు గదుల్లో ఉంచారు. అటు ఉరితీత సన్నాహకాల్లో భాగంగా జైలు అధికారులు ట్రయల్ కూడా నిర్వహించారు. మీరట్‌కు చెందిన పవన్ జల్లాద్ ఈ నలుగురిని ఉరి తీయనున్నారు. మరోవైపు ముకేష్ దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్‌కు మంగళవారం మెర్సీ పిటిషన్ పెట్టుకున్నసంగతి విదితమే. చదవండి : నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు నిర్భయ దోషులకు సుప్రీంలో షాక్! -
ముషారఫ్‌కు భారీ ఊరట
లాహోర్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు మరణ శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. అన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. 2013లో నాటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది. ఆరేళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి గత డిసెంబర్లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటును, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం లాహోర్ హైకోర్టులోని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహ్మద్ అమీర్ భట్టీ, జస్టిస్ చౌధరి మసూద్ జహంగీర్ల త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ముషారఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసు కూడా చట్టప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కేసు నమోదు నుంచి ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం వరకు అన్నీ రాజ్యాంగ వ్యతిరేకమని లాహోర్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది’ అని పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ ఇష్తియాక్ ఖాన్ తెలిపారు. ఈ తీర్పుతో జనరల్ ముషారఫ్‌కు స్వేచ్ఛ లభించిందన్నారు. కాగా, లాహోర్ హైకోర్టు తీర్పుపై జనరల్ ముషారఫ్ హర్షం వ్యక్తం చేశారు. -
ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష
రియాద్: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పుని చ్చింది. విచారణను ఎదుర్కొన్న ఇద్దరు ఉన్నతస్థాయి వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షలాన్ అల్ షలాన్ సోమ వారం ఈ విషయాలు తెలిపారు. నేరాన్ని కప్పి ఉంచేందుకు యత్నించారన్న ఆరోపణ లపై ఈ కేసులో మరో ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో 11 మంది విచారణను ఎదు ర్కోగా ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి జైలు విధించగా మిగిలిన వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ బద్ధ వ్యతిరేకి అయిన ఖషోగ్గీ గత ఏడాది అక్టోబర్ 2న ఇస్తాంబుల్ (టర్కీ)లోని సౌదీ ఎంబసీలో హత్యకు గురయ్యారు. దౌత్య కార్యాలయ అధికారులు ముందు హత్యను నిరాకరిం చినా.. ఘర్షణలో అతడు మరణించినట్లు తర్వాత ఒప్పుకున్నారు. -
జైపూర్ పేలుళ్ల కేసులో నలుగురికి ఉరి
జైపూర్: 2008 నాటి జైపూర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ శర్మ శుక్రవారం తుదితీర్పు వెలువరించారు. దోషులకు రూ.50 వేల జరిమానా విధించారు. ‘వేర్వేరు ప్రాంతాల్లో బాంబులు ఏర్పాటు చేసినందుకు ఐపీసీ 302 సెక్షన్ కింద నలుగురు దోషులకు మరణశిక్ష విధించారు’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీచంద్ తెలిపారు. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని దోషుల తరఫు లాయర్ చెప్పారు. రెండు రోజుల క్రితం మహమ్మద్ సైఫ్, మహమ్మద్ సర్వార్ అజ్మీ, మహమ్మద్ సల్మాన్, సైఫురీష్మన్ అనే నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునివ్వగా మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్‌ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా విడుదల చేసింది. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అదే ఏడాది ఢిల్లీల్దో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. -
త్వరలో నిర్భయ దోషులకు ఉరి అమలు ?
లక్నో: నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో నిర్భయ దోషుల్ని ఉంచిన తీహార్ జైలు అధికారులు ఇద్దరు తలారుల్ని పంపవలసిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) ఆనంద్ కుమార్ తాము తలారుల్ని పంపడానికి సిద్ధంగా ఉన్నామని గురువారం విలేకరులకు వెల్లడించారు. తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయడానికి తలారులు లేరు. అందుకే అవసరమైతే అతి తక్కువ కాల వ్యవధిలో చెప్పినా తలారుల్ని పంపాలంటూ ఢిల్లీ జైళ్ల శాఖ నుంచి తమకు డిసెంబర్ 9న ఫ్యాక్స్ ద్వారా ఒక లేఖ అందిందని ఆనంద్ కుమార్ వెల్లడించారు. అయితే ఆ లేఖలో నిర్భయ దోషుల ఉరి ప్రస్తావన లేదు. తలారుల అవసరం ఉందని మాత్రమే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, లక్నో జైళ్లలో మాత్రమే తలారులు ఉన్నారు. 17న అక్షయ్ రివ్యూ పిటిషన్‌పై విచారణ నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మరణ శిక్షను సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు 17న విచారణ జరపనుంది. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో అందరి ఆయుష్షు తగ్గిపోతోందని, ఇక ఉరి తియ్యడమెందుకని అక్షయ్ ఆ పిటిషన్లో ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 17, మధ్యాహ్నం ఓపెన్ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే మిగిలిన దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్‌లను ఉరి తియ్యడానికి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 2012 డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీ బస్సులో నిర్భయను పాశవికంగా హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ‘ఉన్నావ్’ కన్నా ఘోరంగా చంపుతా! బాగ్పత్: ‘నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే.. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కన్నా దారుణంగా చంపేస్తా’అని ఓ అత్యాచారం కేసులో నిందితుడు ఏకంగా బాధితురాలి ఇంటి గోడపై పోస్టర్ అతికించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భయానికి గురైన బాధితురాలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి, లేఖపై దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు ఎస్పీ ప్రతాప్ గోపేంద్ర తెలిపారు. తన గ్రామానికే చెందిన నిందితుడు సోహ్రాన్ సింగ్ తన ఇంటి గోడపై బెదిరింపు లేఖ అతికించినట్లు బాధితురాలు పేర్కొన్నట్లు వివరించారు. గతేడాది ముఖర్జీనగర్‌లో బాధితురాలిని సోహ్రాన్ ఓ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడని, పైగా వీడియో తీసి బెదిరిస్తున్నాడని తెలిపారు. ఈ కేసు ఢిల్లీ కోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. ఈ కేసులో సోహ్రాన్ బుధవారమే బెయిల్‌పై బయటకు వచ్చాడు. -
అతివలకు సీఎం వైఎస్ జగన్ అభయం
సాక్షి, విజయనగరం: పసికందు నుంచి పండు ముసలమ్మ వరకు.. ఎక్కడో అక్కడ.. నిత్యం అఘాయిత్యాలకు బలవుతున్నారు. హత్యాచారాలతో ఎందరో స్త్రీమూర్తులు నేల రాలిపోతున్నారు. లైంగిక దాడులతో కీచక మూకలు చెలరేగిపోతున్నారు. చట్టాల్లో లొసుగుల్ని ఉపయోగించుకుంటున్నారు.. సత్వర న్యాయం జరగక.. బాధితులు నీరుగారిపోతుంటే.. నేరస్తులు మరింత పేట్రేగిపోతున్నారు. తెలంగాణాలో దిశ విషాదం యావద్దేశాన్ని కదిలించింది. నిందితులకు సత్వర శిక్ష పడాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. మృగాల గుండెల్లో వణుకు పుట్టించేందుకు కఠిన చట్టానికి రూపకల్పన చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఈ బిల్లుపై చర్చ జరిపి, ప్రతిపక్షం సలహాలు, సూచనలను ఆహ్వానించింది. శాసనసభలో బుధవారం బిల్లును ప్రవేశపెట్టనుంది. మహిళపై నేరాలకు పాల్పడే వారికి విధించే శిక్షల గురించి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354లో ఇప్పటికే ఎ,బి,సి,డి ఉండగా కొత్తగా ‘ఇ’ని చేర్చనున్నారు. దీని ప్రకారం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడిన వారిని 21 రోజుల్లో చట్ట ప్రకారం ఉరి తీసేందుకు అవకాశం కలుగుతుంది. కేసు విచారణకు ప్రతిజిల్లాలోనూ ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతాయి. అతివల రక్షణకు అద్భుతమైన చట్టానికి రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అక్షరాలా ఇది చారిత్రాత్మక చట్టమని జిల్లాలోని వైఎస్సార్ సీపీ శాసనసభ్యుల అభిప్రాయపడ్డారు. మహిళల తరపున ధన్యవాదాలు మహిళలపై అరాచకత్వానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నారు. ఆడపిల్లల తండ్రిగా, రాష్ట్ర మహిళలకు జీవితాంతం గుర్తుండిపోయే చట్టాన్ని రూపొందిస్తున్నారు. ఆడపిల్లలపై జరిగే ఘోరాలను దృష్టిలో పెట్టుకొని దోషులు తప్పించుకునే వెసులుబాటు లేకుండా ఉండేలా తయారు చేస్తున్నారు. అది కూడా సరైన సాక్ష్యాలతో 3వారాలలో కఠిన శిక్ష పడేలా ఉంటుంది. మంత్రిగా ముఖ్యమంత్రికి మహిళల తరపున ధన్యవాదాలు. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సాహసోపేతమైన నిర్ణయం మహిళల మాన, ప్రాణాల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన చట్టం రూపొందిస్తుండటాన్ని స్వాగతిస్తున్నాం. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై నేరం రుజువైన 21 రోజుల్లో శిక్ష పడేలా చట్టాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తుంటే.. ప్రతి పక్షాలు ఉల్లిపాయల లొల్లి చేయడం వారికి మహిళలపై ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోంది. తెలుగుదేశం తీరు చూసి రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రతి ఆలోచన ప్రజా హితం కోసమే. – అలజంగి జోగారావు, ఎమ్మెల్యే, పార్వతీపురం చారిత్రాత్మకం దారుణ నేరాలు చేసే వారికి సరైన శిక్షలు పడని వ్యవస్థలో..ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాలకు కఠినమైన శిక్షలు పడేలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. చిన్నారులు, మహిళలు బలవుతున్నా ప్రభుత్వాలు నామమాత్రంగానే స్పందిస్తున్న తరుణంలో చట్టాలున్నా, అమల్లో జాప్యం వల్ల బాధితులకు న్యాయం జరగటం లేదు. నిర్భయ కేసులో దోషులు నేటికీ బతికే ఉన్నారు. దిశ కేసుతో దేశ ప్రజలంతా విరక్తి చెందారు. ముఖ్యమంత్రి తనను నమ్మిన ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అభినందనీయం, స్పష్టమైన ఆధారాలుంటే.. ఆరు వారాల్లో కఠిన శిక్ష అమలు చేసే చట్టానికి ఓటేస్తున్నందుకు గర్వపడుతున్నాను. – కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, శృంగవరపుకోట వీరశివాజీలా నిలబడ్డారు భారతదేశంలో మహిళలకు అండగా నాడు వీర శివాజీ నిలబడ్డారు. ఇప్పుడా స్థానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారు. భవిష్యత్‌లో ఏ మహిళకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో పగడ్బందీగా బిల్లు రూపొందిస్తున్నారు. బిల్లు రూపకల్పనలో భాగంగా ఇప్పటికే న్యాయ నిపుణులతో సైతం ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు. మహిళాబిల్లు రాకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు శాసన సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర మహిళలకు అండగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలుస్తున్నాయి. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు సీఎం నిర్ణయం అద్భుతం మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అద్భుతం. అత్యాచారాలు, హత్యలకు పాల్పడేవారికి ఉరిశిక్ష వేయడమనే ప్రతిపాదన ఎంతో సముచితం. మద్యం తాగేవారే ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఆదాయం ఎక్కువ వస్తున్నా దీనిని పక్కన పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ముఖ్యమంత్రి గారి ఆలోచనకు మేం కట్టుబడి ఉన్నాం. ఆయన ఆలోచనను స్వాగతిస్తున్నాం. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్యే, బొబ్బిలి రాద్ధాంతం చేస్తున్న టీడీపీ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో ప్రతిపక్ష టీడీపీ అర్థం లేని రాద్ధాంతం చేస్తోంది. బిల్లుపై చర్చలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు లేనిపోని అపోహలతో కాలయాపన చేస్తున్నారు. శాసనసభలో రభస సృష్టిస్తున్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారు. బిల్లు చట్టంగా రూపొందితే రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణ భద్రత లభిస్తుంది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారికి ఈ చట్టం సింహస్వప్నంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చట్టం అమలుతో లైంగిక దాడులకు పాల్పడేందుకు వెనకంజ వేస్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు. – బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్యే, నెల్లిమర్ల మహిళలకు భరోసా గతంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా భయం కలిగేది. ఇప్పుడు సరికొత్త చట్టం తెచ్చేందుకు సీఎం భరోసా ఇవ్వడంతో వారికి అండ దొరికింది. మహిళలకు తానున్నానంటూ ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇచ్చారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప చట్టం రూపకల్పనకు హామీ ఇచ్చారు. ఆయన నిర్ణయంతో యావత్ మహిళాలోకం ఆనందంలో ఉంది. – బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్యే, గజపతిగరం -
ఆరు నెలల్లో ఉరి...రేపటినుంచే దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరోసారి పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గత కొద్ది రోజులుగా నమోదైన అత్యాచార సంఘటనలతోపాటు, హైదరాబాద్‌లో చోటు చేసుకున్న దిశ హత్యాచార ఘటనతో తల్లిడిల్లిన ఆమె మరోసారి నిరహారదీక్షకు దిగనున్నారు. రేపిస్టులకు 6 నెలల లోపు మరణ శిక్ష విధించాలనేది స్వాతి మలేవాల్ డిమాండ్ చేస్తూ రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలనుంచి జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడిన నేరస్థులకు మరణశిక్ష విధించాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి కచ్చితమైన హామీ లభించేంతవరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం ఆమె చేశారు. కాగా మైనర్లపై అత్యాచార కేసుల్లో నేరస్తులకు మరణ శిక్ష వేయాలని స్వాతి గతంలో చాలా సార్లు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై గత ఏడాది ఏప్రిల్‌లో నిరాహార దీక్షను చేపట్టారు. అయితే 12 యేళ్ల లోపు బాలికలపై అత్యాచార ఘటనల్లో నిందితులకు మరణశిక్ష సహా, కఠిన శిక్షలు అమలు చేసేలా కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను పాస్ చేయడంతో 10 రోజుల తరువాత ఆమె తన దీక్షను విరమించిన సంగతి తెలిసిందే. Swati Maliwal, Chairperson, Delhi Commission for Women: I'll sit on hunger strike from 10 am tomorrow at Jantar Mantar. I won't get up until I get assurance from centre that rapists will be served death penalty within 6 months. Police accountability needs to be set. pic.twitter.com/69oauKVGnB — ANI (@ANI) December 2, 2019 -
కోయంబత్తూర్ రేప్ దోషికి ఉరే సరి
సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ ఘటనలో దోషిగా తేలిన మనోహరన్‌కు మరణ శిక్షే సరైన శిక్ష అని గురువారం సుప్రీంకోర్టు పునః నిర్ధారించింది. ఈ మేరకు ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. కోయంబత్తూర్‌లో 2010 అక్టోబర్ 29న పాఠశాలకు వెళ్తున్న పదేళ్ల బాలికను, ఏడేళ్ల ఆమె తమ్ముడిని మనోహరన్, మోహన కృష్ణన్ అనే ఇద్దరు బలవంతంగా ఎత్తుకెళ్లారు. పిల్లలిద్దరి చేతులు కట్టేసి, ఆ బాలికపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం వారికి విషమిచ్చి చంపే ప్రయత్నం చేశారు. విష ప్రభావంతో కూడా ఆ చిన్నారులు చనిపోకపోవడంతో.. వారిని చేతులు, కాళ్లు కట్టేసి పరంబికులం–అక్సియార్ ప్రాజెక్టు కాలువలో పడేసి ప్రాణాలు తీశారు. ఆ తరువాత పోలీసుల ఎన్కౌంటర్లో మోహన కృష్ణణ్ హతమయ్యాడు. మనోహరన్‌కు ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు ఆ తీర్పును సమర్ధించింది. ఈ ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు సైతం వారికి ఉరే సరైన శిక్ష అని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన దారుణంగా ఆ ఘాతుకాన్ని అభివర్ణించింది. అనంతరం మనోహరన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆ రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నారిమన్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజీవ్ ఖన్నా గత తీర్పును సమర్ధిస్తూ రివ్యూ పిటిషన్‌ను 2:1 తేడాతో తోసిపుచ్చారు. మరణ శిక్షను ఇద్దరు న్యాయమూర్తులు సమర్ధించగా, జస్టిస్ ఖన్నా మాత్రం చనిపోయేంత వరకు కఠిన కారాగార శిక్ష విధించడం సరైన శిక్ష అవుతుందని అభిప్రాయపడ్డారు. మెజారిటీ జడ్జీల తీర్పు మేరకు మనోహరన్‌కు ఉరిశిక్ష ఖాయమైంది. -
సైనేడ్ కిల్లర్‌కు మరణశిక్ష
మహిళ కనిపిస్తే మాటలు కలుపుతాడు. తానో పెద్ద మనిషినని, మీ కష్టాలు తీర్చేస్తానని నమ్మిస్తాడు. షికార్లకు తీసుకెళ్లడం, తలనొప్పి మాత్ర పేరుతో సైనేడ్ ఇచ్చి ప్రాణాలు తీయడం అతనికి మంచినీళ్లు తాగినంత సులభం. ఆపై నగలు, డబ్బుతో ఉడాయిస్తాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది వనితల ఉసురు తీసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నా యి. బెంగళూరులో ఓ యువతి హత్య కేసులో మరోసారి మరణశిక్ష తీర్పు వెలువడింది. కర్ణాటక, యశవంతపుర: యువతిని అత్యాచారం చేసి హత్య కేసులో మానవ మృగాడు, సైకో కిల్లర్ సైనేడ్ మోహన్ కుమార్ (56)కు మరణ శిక్ష ఖరారయింది. మంగళూరులోని ఆరో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. మహిళపై అత్యాచారం కేసులో అతనిపై నేరారోపణలు రుజువయ్యాయి. విచారణ పూర్తి కావడంతో బుధవారం న్యాయమూర్తి జస్టిస్ సయిదున్నిసా గురువారం శిక్ష ఖరారు చేస్తానని తెలిపారు. గురువారం తీర్పు వెలువరిస్తూ మోహన్‌కు మరణ శిక్షను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పును ధృవీకరించిన తరువాత మరణ శిక్ష అమలు చేయాలని తెలిపారు. హైకోర్టు మరణ శిక్షను ధృవీకరిస్తే ఇతర నేరాల్లో కోర్టులు అతనికి విధించిన శిక్షలను కూడా ఇందులోనే కలిపేయాలని ఆదేశించారు. మొత్తం 17 కేసులకు గాను నాలుగింటిలో అతనికి మరణ శిక్ష ఖరారు అయింది. బెళగావి జైలు నుంచి వీసీ ద్వారా హంతకుడు మోహన్ ప్రస్తుతం బెళగావిలోని హిండల్గా సెంట్రల్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యాడు. అతడు పాల్పడిన నేరం దృష్ట్యా మరణ శిక్షకు అర్హుడని ప్రభుత్వ న్యాయవాది జుడిత్ ఓల్గా వాదనలు వినిపించారు. మధ్యాహ్నం న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. తీర్పును ముద్దాయి ఎలాంటి స్పందన లేకుండా ప్రశాంతంగా ఆలకించాడు. తాజా కేసు ఇదీ సుమారు పదేళ్ల కిందట... దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళ తాలూకా బాళెపుణి అంగనవాడిలో సహయకురాలిగా పని చేస్తున్న యువతిని పరిచయం చేసుకుని, ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చి మెజెస్టిక్ వద్ద లాడ్జిలో దిగారు. మరుసటి రోజుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలంటూ సైనేడ్‌ఇచ్చాడు. ఆమె నగలు, డబ్బుతో పరారయ్యా డు. సైనైడ్ మింగిన యువతి కొంతసేపటికే మరణించింది. మరో కేసులో అతన్ని పట్టుకుని విచారిస్తుండగా నేరం బయటపడింది. నరహంతకుడు అతనికి మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకోవడం, డబ్బుదస్కంతో ఉడాయించడం నైజం. వెళ్తూ వెళ్తూ సైనైడ్‌తో మట్టుబెట్టడంలో ఆరితేరాడు. సుమారు 20 మంది అమాయ మహిళలను ఇలా హత్య చేసినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. 1980 నుంచి 2003 వరకు మంగళూరు ప్రాంతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఆ సమయంలో నిస్సహాయ మహిళలను గుర్తించి వారితో పరిచయం పెంచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతూ వచ్చాడు. కేరళ, మంగళూరు తదితర ప్రాంతాల్లో సైనైడ్‌ను ఉపయోగించి తన హత్యా పరంపరపను కొనసాగించాడు. పలువురు మహిళల హత్య కేసుల్లో ఇతనికి 2013లో కూడా మంగళూరు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం, బెదిరించడం వంటి కేసుల్లోనూ మోహన్ నిందితుడు. 2007లో బెంగళూరులో ఒక సంగీత ఉపాధ్యాయన్ని నమ్మించి ఇలాగే హత్య చేశాడు. -
మృగాడిగా మారితే... మరణశిక్షే
సాక్షి, వరంగల్ : ప్రస్తుత వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయ ప్రధా న ద్వారం.. గతంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోలీసు హెడ్‌క్వార్ట ర్స్ ముఖ ద్వారానికి అటూఇటు పరిశీలిస్తే ఎడమ పక్క పోలీసు హెడ్‌క్వార్టర్స్ అనీ, మరోపక్క ‘ఎవర్ విక్టోరియస్’ అని పెద్ద అక్షరాలతో ఉంటుం ది. దీనికి అర్థం ‘ఎప్పుడూ విజేతలే’ అని! దీనిని సార్థకం చేసుకునేలా వరంగల్ పోలీసు పనితీరు ఉంటోంది. తాజాగా తొమ్మిది నెలల చిన్నారి పై అత్యాచారం, హత్య చేసిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు 48 రోజు ల్లో ఉరిశిక్ష పడేలా దర్యాప్తు చేసిన పోలీసులను ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ విషయాన్ని, పోలీసు తీరుపై వచ్చిన విమర్శలను కాసేపు పక్కన పెడితే... మగాళ్లు మృగాళ్లుగా మారితే ఇక అంతేనన్న విషయం మాత్రం సుస్పష్టం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొన్నేళ్లుగా జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇది నిజమేనని అంగీకరించాల్సి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్ పోలీసుల దర్యాప్తు తీరు మరోసారి మార్మోగింది. ఇక్కడి పోలీసులకు వర్ విక్టోరియస్(ఎప్పుడు విజేతలే)గా ఉన్న పేరు మరోసారి నిజం చేసుకున్నట్లయింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వారు కేసులను త్వరితగతిన చేధిస్తున్నారు. శ్రీహిత కేసును రికార్డు స్థాయిలో 48 రోజుల్లోనే తీర్పు వచ్చేలా కేసుకు సంబంధించి అన్ని రకాల సాక్షాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఎక్కడ కూడా కేసు వీగిపోకుండా తీసుకున్న జాగ్రత్తలే పోలేపాక ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడడానికి కారణమయ్యాయి. గతంలో సైతం పోలీసులు తీసుకున్న నిర్ణయాలు, ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ మరోసారి కూడా దక్కింది. ఈ మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్న పలు ఘటన వివరాలను ఓసారి పరిశీలిద్దాం. అశోక్‌రెడ్డి కేసులో 16మందికి యావజ్జీవం హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన గౌరు అశోక్‌రెడ్డితో జరిగిన స్థానిక గొడవలను పెద్దగా తీసుకున్న కొందరు 4 మార్చి 2012న హత్య చేశారు. అశోక్‌రెడ్డి భార్య ఫిర్యాదుతో హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఇన్స్పెక్టర్ మోజెస్ సుమారు 27 మందిని సాక్షులుగా పేర్కొంటూ వారి వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి ప్రతీ సాక్ష్యాన్ని పకడ్బందీగా సేకరించారు. దీంతో పాటే అశోక్‌రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న 27 మంది ఎవరి ప్రలోభాలకు లొంగకుండా, వెనక్కి తగ్గకుండా నిజం చెప్పేలా పోలీసులు వారికి ధైర్యం, భరోసా కల్పించారు. ఈ కేసులో తీర్పు ఈనెల 5వ తేదీన వచ్చిందంటే ఏడేళ్లకు పైగా సాక్షులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కాపాడగలిగారు. దీంతో కోర్టు నిందితులు 16 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జిల్లాలో ఒకేసారి ఇంత మందికి యావజ్జీవం పడటం సంచలనం కలిగించడమే కాకుండా పోలీసుల తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కమిషనరేట్‌లో 82 పీడీ యాక్టు కేసులు నేరం చేయాలంటే వెన్నులో భయం పుట్టేలా ప్రస్తుత వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ నేరం చేసే వ్యక్తులు మరోసారి నేరం చేయకుండా ఉండేలా పీడీ యాక్టు నమోదు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ రకాల నేరాలు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులపై ఇప్పటి వరకు 82 పీడీ యాక్టు కేసులు నమోదు చేశారు. పెట్రోల్, యాసిడ్ దాడులు... పీడీ యాక్టు ప్రేమ నిరాకరించిందన్న కోపంతో ఈ ఏడాది ఫిబ్రవరి 27న హన్మకొండ కిషనపురలో హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్తున్న డిగ్రీ విద్యార్థిని తోపుచర్ల రవళిపై సాయి అన్వేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. రవళి తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మార్చి 4న తుదిశ్వాస విడిచింది. అనంతరం మే 18న నిందితుడు సాయి అన్వేష్‌పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. అలాగే, 2017లో ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో వివాహిత బోయిన మాధవిపై యాసిడ్‌తో దాడి చేయగా ఆమె మృతి చెందింది. ఈ కేసులో నిందితులు కల్వల చంద్రశేఖర్, అడెపు అనిల్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించడంతో పాటు వారిపై పీడీ యాక్టు నమోదు చేశారు. యాసిడ్ దాడి... ఆపై ఎన్కౌంటర్ రాష్త్రంలో తీవ్ర సంచలనం కలిగించిన యాసిడ్ దాడి సంఘటన 2008 డిసెంబర్లో హసన్‌పర్తి మండలం భీమారం దగ్గర జరిగింది. కిట్స్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతపై శాఖమూరి శ్రీనివాస్ ఇద్దరు స్నేహితులతో కలిసి యాసిడ్‌తో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన స్వప్నిక చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రణీత తీవ్ర గాయాలతో బయటపడింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోగా.. సాక్షాల సేకరణ సమయంలో వారు తప్పించుకునేందుకు యత్నించగా ఎన్కౌంటర్ చేయడంతో ముగ్గురూ మృతి చెందారు. ఆ సమయంలో ప్రజలు తండోపతండాలుగా, స్వతంత్రంగా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుని ఎస్పీ సజ్జనార్‌ను భుజాలపై ఎత్తుకుని జేజేలు కొట్టారు. ఆ సమయంలో ‘తప్పు చేస్తే వరంగల్ పోలీసులు వదలరు’ అనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. జంట హత్యకేసు... 24 గంటల్లో ఛేదన హసన్‌పర్తి మండల కేంద్రంలో 2018 జూన్ 18న గడ్డం దామోదర్, గడ్డం పద్మ దంపతుల హత్య జరిగింది. ఈ కసులో నిందితుడు కామరపు ప్రశాంత్‌ను హసన్‌పర్తి పోలీసులు 24 గంటల్లోపే అరెస్టు చేశారు. నిందితుడు దొంగిలించిన రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అనేక కేసుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుల పక్షాన నిలిచి న్యాయం జరిగేలా చేసిన కృషితో పోలీసు అధికారులు, సిబ్బంది కీర్తి పెరిగిపోతోంది. మనీషా కిడ్నాప్... ముగ్గురు ఎన్కౌంటర్ వరంగల్‌కు చెందిన పత్తి వ్యాపారి కుమార్తె మనీషాను 2008లో కిడ్నాప్ చేసి హత్య చేశారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అప్పటి ఎస్పీ సౌమ్యామిశ్ర ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లను అర్థం చేసుకుని కేసులో ముందుకు సాగారు. డబ్బు కోసం అభంశుభం తెలియని పాప మనీషాను నిర్ధాక్షిణంగా హత్య చేసిన ముగ్గురిని విచారించే క్రమంలో ధర్మసాగర్ మండలం తాటికాయల వ్యవసాయ బావి వద్ద ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఈ ఘటనలో కూడా వరంగల్ పోలీసులకు ప్రజల నుంచి మద్దతు.. ఎస్పీ సౌమ్యామిశ్రాకు ప్రశంసలు లభించాయి. సిబ్బందిలో ఆత్మస్థైర్యం పెరిగింది శ్రీహిత కేసులో నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు ఉరిశిక్ష పడడంతో పోలీసు అధికారులు, సిబ్బందిలో ఆత్మస్థైర్యం పెరిగింది. ప్రజలకు ఇంకా సేవ చేయాలనే తపన వస్తోంది. ఇలాంటి కేసుల్లో విజయం వల్ల పోలీసులు మరింత స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో న్యాయం జరగడం వల్ల ప్రజల్లో మాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో మేం మరింత బాధ్యతగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదు. – డాక్టర్ రవీందర్, వరంగల్ సీపీ -
ఉరిశిక్ష అమలులో జాప్యం, సంచలన తీర్పు
సాక్షి,ముంబై : టెకీ కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసులో బాంబేహైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో దోషులుగా తేలిన వారి ఉరిశిక్ష అమలు ఆలస్యమైన కారణంగా దోషుల శిక్షను 35 ఏళ్ల కారాగార శిక్షగా మారుస్తూ తీర్పునిచ్చింది. తమకు విధించిన మరణశిక్షను అమలు చేయడంలో తీవ్రజాప్యం జరిగిందని, ఇది తమ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని, ఈ నేపథ్యంలో తమకు విధించిన శిక్షను మార్చాలని కోరుతూ దోషులు పురుషోత్తమ్ బొరాటే, ప్రదీప్ కోకడే కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన బొంబాయి హైకోర్టు ఇద్దరికీ 35 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. 12 ఏళ్ల నాటి ఈ కేసు వివరాలు : నవంబర్ 1, 2007 టెక్ దిగ్గజం విప్రోకు చెందిన బీపీవో కంపెనీలో పనిచేస్తున్న 22 ఏళ్ల మహిళా ఉద్యోగి, విధుల నిమిత్తం క్యాబ్‌లో వెళ్తుండగా, ఆమెను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ పురుషోత్తం, అతని అనుచరుడు ప్రదీప్ కలిసి అత్యాచారం చేసి అతిదారుణంగా చంపేసారు. కనీసం గుర్తుపట్టలేని విధంగా ముఖాన్ని ఛిద్రం చేసి, పొదల్లో విసిరిపారేశారు. ఈ కేసులో వీరిని అరెస్టు చేసిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సెషన్సు కోర్టులో విచారణ అనంతరం 2012 మార్చిలో వీరికి కోర్టు మరణ శిక్ష విధించగా, బాంబే హైకోర్టు, అనంతరం 2015 మే లో సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను సమర్ధించాయి. అలాగే దోషులు పెట్టుకున్న క్షమాపణ పిటిషన్‌ను 2016లో మహారాష్ట్ర గవర్నర్ తోసిపుచ్చగా, 2017లో రాష్ట్రపతి కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో జూన్ 24 ను వీరికి శిక్ష అమలు చేయాల్సిందిగా 2019 ఏప్రిల్10 న వారెంట్ జారీ చేసింది . అయితే ఇక్కడే ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. ఉరిశిక్షను అమలు చేయడంలో 1,509 రోజులు (50 నెలలకు మించి) ఆలస్యం జరిగిందని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించి, ఏడు సంవత్సరాల పాటు పూణేలోని యరవాడ సెంట్రల్ జైలులో తమని అక్రమంగా నిర్బంధించారంటూ దోషులు ఈ ఏడాది మే నెలలో కోర్టును ఆశ్రయించారు. తమకు ఉరిశిక్షనుంచి మినహాయింపునించి, శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాల్సిందిగా కోరారు. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఉరిశిక్ష షెడ్యూల్ ప్రకారం జరగకూడదని హైకోర్టు జూన్ 21 ఆదేశించింది. ఉరిశిక్షలపై స్టే విధించిన అనంతరం వీరి వాదనలను పరిశీలించిన జస్టిస్ భూషణ్, జస్టిస్ స్వాప్నా జోషితో కూడిన బెంచ్ శిక్షను అమలు జాప్యంతోపాటు, ఇప్పటివరకు వారు జైలులో గడిపిన కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, శిక్షను 35 సంవత్సరాల కారాగార శిక్షగా మారుస్తూ తాజా తీర్పును వెలువరించింది. -
‘మరణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’
న్యూఢిల్లీ: మరణశిక్ష రద్దుపై ఏకాభిప్రాయం తీసుకునే అవసరం ఉందని.. దీనిపై అన్ని రాష్ట్రాల అభిప్రాయం రావాల్సి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభలో మరణశిక్ష రద్దు కోరుతూ.. ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ తమ్తా అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున.. కేవలం కేంద్రం నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్రాలు కూడా అంగీకరించాలని తెలిపారు. కాగా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందని.. దీనిపై నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరణ దండన విధించాలనేది తమ అభిప్రాయం కాదంటూ.. దోషులకు మరణశిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. నిర్భయ ఘటన సమయంలో దోషులకు ఉరిశిక్ష విధించాలని ప్రజలు కోరారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో పాటు మరణ శిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు ఉందన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మరణ శిక్ష విధిస్తారని చెబుతూ.. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రదీప్ తమ్తాను కోరారు. దీనిపై ప్రదీప్ తమ్తా స్పందిస్తూ మరణ శిక్షకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ముందుకు వస్తున్నాయని అన్నారు. అన్ని రాష్ట్రాలతో ఈ అంశాన్ని కేంద్రం చర్చిస్తుందని మంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. -
32 రోజుల్లోనే ‘మరణ శిక్ష’ తీర్పు
భోపాల్: మైనర్ బాలికను రేప్ చేసి చంపిన కేసుతో పాటు మరో లైంగిక దాడికి పాల్పడిన కేసుల్లో దోషికి మధ్యప్రదేశ్ కోర్టు మరణ శిక్ష విధించింది. గత నెల 8న విష్ణు బమోరా(32), ఓ బాలికను (12) రేప్ చేసి చంపేశాడు. ఈ బాలికతో పాటు మరో ఎనిమిదేళ్ల బాలికపై అసహజ లైంగిక దాడి చేసినందుకు పోలీసులు పోక్సో, ఐపీసీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. పోక్సో చట్టం కింద భోపాల్‌లో ప్రత్యేక జడ్జి కుముదిని పటేల్ ఈ కేసును విచారించారు. 30 మంది చెప్పిన సాక్ష్యాలను, ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన డీఎన్ఏ రిపోర్టులను పరిశీలించారు. వీటితో పాటు పోలీసులు గత నెల 12న 108 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేలుస్తూ మూడు, ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు మరణ శిక్షను విధించారని రాష్ట్ర న్యాయ శాఖ అధికార ప్రతినిధి సుధా విజయ్ సింగ్ భదోరియా తెలిపారు. ఈ శిక్షలన్నీ ఒకేసారి అమలవుతాయని తెలిపారు. -
మూడు గుణాలు
ఉమర్ బిన్ ఖత్తాబ్ (ర) ఒకసారి కొలువు తీరి ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడిని బంధించి ఈడ్చుకుంటూ అక్కడకు తీసుకువచ్చి ‘ఓ విశ్వాసుల నాయకా..! వీడు మా తండ్రిని హత్య చేశాడు, మీరు వీడికి మరణశిక్ష విధించాలి..’ అని అన్నారు ఉమర్ (ర) ఆ యువకుడి వైపు చూస్తూ .. ‘ఎందుకు చంపావు వీళ్ల తండ్రిని..?’ అని అడిగాడు. ఆ యువకుడు.. ‘నేనొక ఒంటెల కాపరిని. అనుకోకుండా నా ఒంటె ఒకటి వారి పొలంలో మేసింది. అది చూసి వీళ్ల నాన్న ఒక పెద్ద రాయిని దాని మీదకు విసిరాడు. రాయి కంటికి తగిలి అది బాధతో గిల గిల లాడింది. నేను కోపంతో అదే రాయిని తీసి వాళ్ల నాన్న మీదకు విసిరాను. అది ఆయన తలమీద పడి ఆయన చనిపోయాడు’ అని చెప్పాడు. ‘అలా అయితే నేను నీకు అదే శిక్ష విధిస్తాను’ అన్నారు ఉమర్ (ర). యువకుడు కంగారుగా.. ‘ఓ నాయకా..! దయచేసి నాకు మూడు రోజులు గడువు ఇప్పించండి. మా నాన్న చనిపోతూ నాకు కొంత ఆస్తిని ఇచ్చాడు, ఇంకా నాకు ఒక చెల్లెలు ఉంది. ఆమె బాధ్యత కూడా నా మీద ఉంది. మీరు నన్ను ఇప్పుడే చంపేస్తే నా ఆస్తికి రక్షణ, నా చెల్లెలికి సంరక్షణ ఉండదు. నాకు మూడు రోజులు గడువు ఇవ్వండి. నేను నా చెల్లెలికి సంరక్షణ ఏర్పాటు చేసి వెంటనే తిరిగి వస్తాను’ అన్నాడు. దానికి ఉమర్ (ర).. ‘సరే, నీకు పూచీగా ఎవరు ఉంటారు?’ అని అడిగారు. యువకుడు అక్కడ గుమిగూడి ఉన్న జనంలోకి చూశాడు. అందరూ తలలు వంచుకున్నారు. కానీ ఒక చేయి పైకి లేచింది. అది హజరత్ అబూజర్ గిఫారీ (ర) గారిది.‘ఇతనికి పూచీగా ఉంటావా అబూజర్..?’ అని అడిగారు ఉమర్. ‘ఉంటాను నాయకా...!’ అన్నాడు అబూజర్ (ర). ‘‘అతను తిరిగి రాకపోతే ఆ శిక్ష నీకు పడుతుంది, తెలుసుగా...?’ అన్నారు ఉమర్. ‘ నాకు సమ్మతమే నాయకా! అన్నాడు అబూజర్ (ర). ఆ యువకుడు వెళ్లి పోయాడు.. రెండు రోజులు గడిచిపోయాయి. మూడవ రోజు సాయంత్రం కావస్తుంది. ఆ యువకుడి జాడ లేదు. అతడు తిరిగి రాకపోతే అబూజర్ (ర) కు మరణ శిక్ష పడవచ్చని అందరూ భయపడసాగారు. సూర్యాస్తమయానికి ఇంకా కొంచెం సమయం ఉందనగా.. ఆ యువకుడు వచ్చి సభలో ఉన్న హజరత్ ఉమర్ (ర) ముందు హాజరయ్యాడు. అలసి సొలసినట్లు ఉన్న ముఖంతో అతడు ఇలా అన్నాడు.. ‘..ఓ నాయకా! నా ఆస్తిని, చెల్లెలి సంరక్షణ బాధ్యతను మా మామయ్యకు అప్పచెప్పాను... ఇక మీరు నాకు శిక్ష విధించవచ్చు’ అని!ఉమర్ (ర) ఆశ్చర్యంతో.. ‘శిక్ష నుండి తప్పించుకొనే అవకాశం ఉన్నా సరే ఎందుకు తిరిగి వచ్చావు?’ అని అడిగాడు. ‘ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే సమర్థతను మనుషులు కోల్పోయారని అందరికీ అనిపిస్తుందని భయం వేసింది, అందుకే తిరిగి వచ్చాను’ అన్నాడు యువకుడు. ఉమర్(ర) : (అబూజర్ వైపు చూస్తూ) ‘అసలు నీవెందుకు అతడికి పూచీగా ఉన్నావు? అబూజర్ (ర) : సాటి మనిషి ఆపదలో ఉండి చేయి చాస్తే అతడికి మేలు చేసే ఆకాంక్షను మనుషులం కోల్పోయాం అనిపిస్తుందని భయం వేసింది. అందుకే పూచీగా ఉన్నాను.. అన్నాడు. ఇక హత్యానేరాన్ని మోపిన ఆ వ్యక్తులు ఇదంతా చూసి ఇలా అన్నారు.. ‘ఓ నాయకా! మేము కూడా ఈ యువకుడిని క్షమించి వేస్తున్నాము, దయచేసి అతడిని శిక్షించకండి’ అన్నారు. ఉమర్ (ర) అమితాశ్చర్యంతో.. ‘అదేంటి? ఎందుకు క్షమించి వేస్తున్నారు?’ అన్నారు. క్షమాగుణం మనుషుల హృదయాల నుండి తుడిచి పెట్టుకు పోయినట్లనిపిస్తుందని భయం వేస్తోంది. అందుకే క్షమిస్తున్నాము’ అన్నారు ఆ వ్యక్తులు. – మర్యమ్ -
మరణాన్ని తప్పించిన కవిత్వం
న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన ఖైదీ జైల్లో రాసుకున్న కవిత్వం అతని తలరాతను మార్చేసింది. మరణం అంచుల్లో ఉన్న అతను రాసిన కవితలను చదివిన సుప్రీం కోర్టు ధర్మాసనం మనసు కరిగి ఆ ఖైదీకి కింది కోర్టు విధించిన మరణశిక్షను ఇటీవల యావజ్జీవ ఖైదుగా మార్చింది. మహారాష్ట్రకు చెందిన ధ్యానేశ్వర్ సురేష్ బార్కర్ అనే వ్యక్తి 18 ఏళ్ల క్రితం ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి అతని తల్లిదండ్రుల్ని భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. అయితే వారు అడిగినంత సొమ్ము ఇవ్వకపోవడంతో ఆ అబ్బాయిని చంపేశాడు. ఈ కేసును విచారించిన కింది కోర్టు బార్కర్‌కు మరణశిక్ష విధించింది. బొంబాయి హైకోర్టు కూడా అతనికి మరణశిక్షను సమర్థించింది. 22 ఏళ్ల వయసులో ఉండగా నేరం చేసిన బార్కర్ గత 18 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బొంబాయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బార్కర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా బార్కర్ తరఫు లాయరు ఆయన రాసిన కవితలను సుప్రీం కోర్టుకు సమర్పించారు. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఆ కవితలను చదివింది. ‘నేరస్తుడు పశ్చాత్తాప పడుతున్నాడని, మంచి మనిషిగా మారాడని అతని కవితలను బట్టి అర్థమవుతోంది. నేరస్తుడు చేసింది ఎంత పెద్ద ఘోరమో మాకు తెలుసు. అయినా అతనికి మరణ శిక్ష విధించే విషయంలో మమ్మల్ని మేం సంతృప్తి పరచుకోలేకపోతున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. నిందితుడు సమాజంలో భాగం కావాలనుకుంటున్నాడని, నాగరికుడిగా మారాలనుకుంటున్నాడని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక అతనికి మరణశిక్ష విధించడం సరికాదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
నేటి నుంచి జాధవ్ విచారణ
హేగ్: భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(48)కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడంపై నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో సోమవారం నుంచి వాదనలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 18 నుంచి 22 వరకూ నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కోర్టు భారత్, పాకిస్తాన్ల వాదనల్ని విననుంది. ఈ కేసులో భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే, పాకిస్తాన్ తరఫున బారిస్టర్ ఖవార్ ఖురేషీ వాదనలు వినిపించనున్నారు. 2016, మార్చి 3న ఇరాన్ నుంచి బలోచిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించింది. ముస్లిం పేరున్న నకిలీ పాస్పోర్టుతో జాధవ్ పాక్‌లో గూఢచర్యం చేసేందుకు ప్రవేశించారనే నేరంపై పాక్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ అల్లర్ల కేసులో ఒకరికి మరణశిక్ష
న్యూఢిల్లీ: 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మొదటిసారిగా న్యాయస్థానం ఒకరికి మరణశిక్ష విధించింది. 34 ఏళ్ల క్రితం ఇద్దరు సిక్కు యువకుల మృతికి కారణమైన యశ్పాల్ సింగ్(55)కు మరణ శిక్షను, నరేశ్ షెరావత్(68)కు యావజ్జీవ కారాగారాన్ని విధిస్తూ అదనపుసెషన్స్ జడ్జి అజయ్ పాండే మంగళవారం తీర్పు వెలువరించారు. దోషులు ఉన్న తీహార్ జైలులోనే కట్టుదిట్టమైన భద్రత మధ్య జడ్జి మంగళవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. ఇద్దరు యువకుల హత్య అత్యంత అరుదైందిగా పేర్కొన్న జడ్జి.. యశ్పాల్ సింగ్‌కు మరణశిక్ష విధించారు. నరేశ్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జీవితకాల జైలు శిక్షతో సరిపెట్టారు. దీంతోపాటు దోషులిద్దరికీ చెరో రూ.35 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని మృతుల కుటుంబాలకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరణశిక్షకు సంబంధించిన తమ తీర్పు అసలు రికార్డులను ఢిల్లీ హైకోర్టుకు అందజేయాలని ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు ధ్రువీకరించిన తర్వాత మాత్రమే మరణశిక్ష అమలు చేయాలనే నిబంధన ఉంది. సిట్ తన చార్జిషీటులో.. ‘ఒక మతానికి చెందిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం సంఘ విద్రోహ మూకలు కిరోసిన్, కర్రలు తీసుకుని కొందరి ఇళ్లపై దాడులు చేశారు. అంతర్జాతీయంగా ప్రభావం చూపిన మారణకాండ ఇది. మరణశిక్ష విధించదగ్గ నేరమిది’ అంటూ పేర్కొంది. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రాజధాని ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే సిక్కులే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు సంబంధించి 650 కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆధారాలు లేవంటూ 267 కేసులను మూసివేశారు. మూసివేసిన కేసుల్లో 60 కేసుల విచారణ చేపట్టిన సిట్.. 52 కేసుల్లో ఆధారాలు లేవని పేర్కొంది. సరైన ఆధారాలున్న మిగతా 8 కేసులో ఐదింటికి సంబంధించి చార్జిషీటు దాఖలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్‌కుమార్ నిందితుడిగా ఉన్న మిగతా కేసుల విచారణ మాత్రం పెండింగ్‌లో ఉంది. చార్జిషీటు దాఖలు చేసిన కేసుల్లో మరణ శిక్ష తీర్పు వెలువడిన మొట్టమొదటి కేసు ఇదే కావడం గమనార్హం. తీర్పును స్వాగతించిన సిక్కు నేతలు సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కోర్టు మరణశిక్ష విధించడంపై పలువురు సిక్కు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఏమన్నారంటే: హేయమైన నేరానికి ఒడిగట్టిన దోషులను ఎట్టకేలకు న్యాయస్థానం శిక్షించింది. ఇలాంటి మిగతా కేసుల్లో కూడా న్యాయస్థానాలు త్వరలో తీర్పు వెలువరిస్తాయని ఆశిస్తున్నా. అకాలీదళ్‌నేత మజీందర్ సింగ్ సిర్సా: 34 సంవత్సరాల తర్వాత వెలువడిన ఈ తీర్పు సంతృప్తికరంగా ఉంది. షెరావత్కు యావజ్జీవం విధించడాన్ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అతడికి కూడా ఉరి పడాల్సిందే. కాంగ్రెస్: న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసింది. ఎటువంటి ఒత్తిడులకు గురికాకుండా, తీర్పు వెలువరించడం గర్వించదగ్గ అంశం. ఈ కేసులో ఘటనల క్రమమిదీ.. 1984 నవంబర్ 1: సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో సుమారు 300 మందితో కూడిన గుంపు దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో హర్దేవ్ సింగ్, అవ్తార్ సింగ్ అనే వారిని కొట్టి చంపింది. 1985 ఫిబ్రవరి 23: ఈ ఘటనకు సంబంధించి జైపాల్ సింగ్ అనే వ్యక్తిపై చార్జిషీట్ దాఖలైంది. 1985 మే: ఈ దాడులపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటయింది. 1985 సెప్టెంబర్ 9: దీనిపై ఢిల్లీ పోలీసుల అల్లర్ల వ్యతిరేక విభాగం దర్యాప్తు చేపట్టింది. 1986 డిసెంబర్ 20: జైపాల్ సింగ్‌ను నిర్దోషిగా పేర్కొంది. ∙1994 ఫిబ్రవరి 9: హర్దేవ్ సింగ్ మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయారు. అనుమానితులెవరినీ ప్రశ్నించకుండానే కేసు మూసివేశారు. ∙2015 ఫిబ్రవరి: అల్లర్లపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ∙2016 ఆగస్టు: సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఆధారాలుంటే తెలియజేయాలని ప్రజలను కోరుతూ పంజాబ్, ఢిల్లీల్లోని ప్రముఖ వార్తా పత్రికల్లో సిట్ ప్రకటనలు ఇచ్చింది. 2017 జనవరి 31: హర్దేవ్ సింగ్, అవ్తార్సింగ్ హత్యా సంఘటనకు సంబంధించి 18 మంది సాక్షులను విచారించిన సిట్.. నరేశ్ షెరావత్, యశ్పాల్ సింగ్ అనే వారిని దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో చార్జిషీటు వేసింది. 2018 నవంబర్ 14: ఆ ఇద్దరూ దోషులేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2018 నవంబర్ 15: ఈ కేసులో తీర్పును నిలుపుదల చేసింది. పాటియాలా కోర్టు ఆవరణలోనే దోషులపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. నవంబర్ 20: యశ్‌పాల్‌కు మరణశిక్ష, షెరావత్కు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. -
మలేసియాలో మరణశిక్ష రద్దు
కౌలాలంపూర్: మలేసియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని ప్రకటించింది. ప్రధాని మహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మలేసియా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో త్వరలో మరణశిక్ష అమలు కానున్న 1,200 మందికి పైగా ఖైదీలకు ఊరట లభించినట్లయింది. సాధారణంగా హత్య, డ్రగ్స్ అక్రమరవాణా, దేశద్రోహం, ఉగ్రదాడులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో దోషులుగా తేలినవారికి మలేసియాలో ఇప్పటివరకూ మరణదండన విధిస్తున్నారు. తాజా నిర్ణయంపై మలేసియా న్యాయశాఖ మంత్రి ల్యూ వుయ్ కియాంగ్ మాట్లాడుతూ.. మరణదండనకు సంబంధిం చి సవరించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తామనీ, మరణశిక్షను రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని వెల్లడించారు. కాగా, మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంస్థ‘లాయర్స్ ఫర్ లిబర్టీ’ స్వాగతించాయి. ఈ సందర్భంగా కొత్త చట్టంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని నేరాలకు మరణశిక్షను రద్దు చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శి కుమీ నైదూ విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 142 దేశాలు మరణదండనను తిరస్కరించాయని వెల్లడించారు. భారత్, సింగపూర్, చైనా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు ఇంకా మరణశిక్షను అమలు చేస్తున్నాయన్నారు. -
మాజీ మంత్రులకు మరణశిక్ష
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్‌ఫోజ్మన్ బాబర్‌కు గ్రెనేడ్ దాడి కేసులో స్థానిక కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. మాజీ మంత్రి బాబర్‌తో పాటు మరో 19 మందికి ఆ కేసులో మరణశిక్షను ఖరారు చేశారు. తీర్పు సందర్బంగా స్పెషల్ కోర్టు న్యాయమూర్తి షెహజాద్ నురుద్దిన్ ఆ సంఘటనను వివరిస్తూ.. ఈ నిందితులు ఇక జీవించే హక్కు లేదని ఉద్విగ్నభరితంగా తీర్పులు వెలువరించారు. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్ రెహ్మాన్‌కు జీవిత ఖైదు శిక్ష పడింది. 2004, ఆగస్టు 21న జరిగిన గ్రేనేడ్ దాడిలో 20 మందికిపైగా మరణించారు. సుమారు 500 మంది గాయపడ్డారు. షేక్ హసీనాను టార్గెట్ చేస్తూ గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బంగ్లా ప్రధాని అయిన హసీనా.. దాడి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే పేలుడు వల్ల హసీనా పాక్షికంగా వినికిడిని కోల్పోయారు. బహిరంగ సభ కోసం వచ్చిన షేక్ హసీనా ట్రక్కు నుంచి దిగుతున్న సమయంలో దాడి జరిగింది. ఇదే కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ సలామ్ పింటూకు కూడా మరణశిక్షను ఖరారు చేశారు. బీఎన్పీ పార్టీలో కార్యదర్శిగా చేసిన హరిస్ చౌదరీకి జీవిత శిక్షను వేశారు. గ్రేనేడ్ దాడి కేసులో మరో 11 మంది ప్రభుత్వ అధికారులకు కూడా శిక్ష ఖరారైంది. -
ఎన్సీబీసీ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ (ఎన్సీబీసీ)కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం పార్లమెంటు ఆమోదం లభించింది. దీంతో వెనుకబడిన వర్గాల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన సంపూర్ణాధికారాలు ఎన్సీబీసీకి లభించనున్నాయి. రాజ్యాంగ (123వ సవరణ) బిల్లు–2017పై రాజ్యసభలో చర్చ జరిగిన అనంతరం మూడింట రెండొంతుల ఆధిక్యంతో సభ బిల్లును ఆమోదించింది. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చట్టం–1993ను రద్దు చేసిన అనంతరం తాజా బిల్లుకు ఆమోదం లభించింది. సోమవారం చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడుతూ కులాలవారీ జనగణన లెక్కలను ప్రభుత్వం బయటపెట్టాలనీ, ఆయా కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని ప్రధాని మోదీ అన్నారు. ‘రేప్‌లకు ఉరి’ బిల్లుకూ ఆమోదం 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్షను విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ జూలై 30నే ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఆందోళన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా త్వరలో నియమితులు కానున్న జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని ప్రభుత్వం తగ్గించేందుకు ప్రయత్నిస్తోందన్న విషయంపై విపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వంపై మండిపడ్డాయి. బిహార్‌లోని ముజఫర్‌పూర్ శరణాలయంలో బాలికలపై లైంగిక దోపిడీ జరిగిన అంశంపైనా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. పీఏసీ సభ్యుడిగా రమేశ్ పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఎన్నికయ్యారు. విపక్ష ఐక్య కూటమి ఏకగ్రీవంగా రమేశ్‌ను ఎన్నుకుంది. ఎగువసభలో ఆరుసీట్లున్న టీడీపీ.. పీఏసీ సభ్యత్వం కోసం 106 ఓట్లు సాధించింది. మరో సభ్యుడిగా ఎన్నికైన బీజేపీ ఎంపీ భూపేందర్‌కు 69 ఓట్లొచ్చాయి. పీఏసీలో 15 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులుంటారు. -
కేవలం ఐదు రోజుల్లోనే ఉరి శిక్ష ఖరారు
భోపాల్ : మృగాళ్లను వెంటనే ఉరి తీయాలి అని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని కట్ని కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందుతునికి కేవలం ఐదురోజుల్లోనే ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ కోల్ అనే ఆటో డ్రైవర్ స్కూల్‌కు వెళ్లడం కోసం తన ఆటో ఎక్కే ఓ ఐదేళ్ల చిన్నారిపై ఈ నెల 4న అత్యాచారం చేశాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు జులై 7 న రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ నెల 12 న అతడిపై చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ నెల 23న విచారణ ప్రారంభమయ్యింది. నేర చట్ట (సవరణ) 2018లో ప్రవేశపెట్టిన సెక్షన్ 376(ఏ)(బీ), బాలల పట్ల లైంగిక నేరాల నిరోధింపు చట్టం కింద ఉన్న సంబంధిత సెక్షన్ల ప్రకారం నిందుతుడు రాజ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధించారు. విచారణ ప్రారంభమైన 5 రోజుల్లోనే అనగా నేడు (జులై 28) ప్రత్యేక అదనపు కోర్టు జడ్జి మధురి రాజ్ లాల్ ఈ తీర్పును వెలువరించారు. -
రేప్‌కు మరణదండన!
న్యూఢిల్లీ: 12 ఏళ్ల లోపున్న బాలికలపై అత్యాచారం చేసిన కేసులో దోషులకు మరణశిక్ష ప్రతిపాదిస్తూ బిల్లును కేంద్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ప్రధాని నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తాజా బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే ఆర్డినెన్స్ రద్దవుతుంది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు.. ► 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారిపై రేప్‌కు పాల్పడి దోషిగా తేలితే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష(జీవితఖైదుగా పొడిగించొచ్చు) లేదా మరణ దండన విధిస్తారు. సామూహిక అత్యాచారం చేస్తే జీవితఖైదు లేదా ఉరిశిక్ష వేస్తారు. ► మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టేవారికి కనీసం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. ఈ శిక్షను జీవితఖైదుగా పొడిగించే వెసులుబాటు కల్పించారు. ► 16 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికలపై రేప్‌కు పాల్పడితే కనీస జైలు శిక్షను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు. దీన్ని కూడా జీవితఖైదుగా మార్చొచ్చు. ► అత్యాచారాలకు సంబంధించిన అన్ని కేసుల విచారణను 2 నెలల్లో పూర్తిచేయాలి. ► అప్పీళ్లను 6 నెలల్లోగా పరిష్కరించాలి. ► 16 ఏళ్ల లోపున్న బాలికపై రేప్, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులకు ముందస్తు బెయిల్ జారీ చేయడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ► ఒకవేళ వారికి బెయిల్ మంజూరీపై నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, 15 రోజుల ముందే బాధితురాలి తరఫు లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కోర్టు నోటీసులు. కేబినెట్ ఇతర నిర్ణయాలు ► ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు ఆమోదం. ► చెరకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.20 పెంపు. దీంతో అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నుంచి మిల్లులు రైతులకు క్వింటాలు చెరకుకు కనీసం రూ.275 చెల్లించాలి. ► జైలులో శిక్ష అనుభవిస్తున్న వృద్ధ ఖైదీలకు కేంద్రం క్షమాబిక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. శిక్షను కనీసం సగం పూర్తిచేసుకున్న 55 ఏళ్లకు పైబడిన మహిళలు, 60 ఏళ్లకు పైబడిన పురుషులను మూడు విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ అక్టోబర్ 2, వచ్చే ఏడాది ఏప్రిల్ 10, వచ్చే ఏడాది అక్టోబర్ 2న దఫాల్లో వారికి విముక్తి కలిగించనున్నారు. అయితే వరకట్న హత్యలు, అత్యాచారాలు, మనుషుల అక్రమ రవాణా, పోటా, టాడా, ఫెమా లాంటి తీవ్ర నేరాల్లోని దోషులకు ఈ పథకం వర్తించదు. ► మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలైన విదర్భ, మరాఠ్వాడాల్లో 81 సాగునీటి ప్రాజెక్టులకు రూ.13 వేల కోట్ల సాయానికి అనుమతి. ► మైనారిటీ విద్యార్థులకు ప్రిమెట్రిక్, పోస్ట్ మెట్రిక్, ప్రతిభ ఆధారిత ఉపకార వేతనాలను 2020 వరకు కొనసాగించాలని నిర్ణయం. ఇందుకోసం రూ.5 వేల కోట్లకు వ్యయం కానుంది. -
అత్యాచారానికి పాల్పడితే మరణశిక్షే
డెహ్రాడూన్ : మైనర్ బాలికలపై నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడే మృగాళ్లకు మరణ శిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ మేరకు బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. కాశీపూర్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అత్యాచారాలను అరికట్టడానికి ఇకపై కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, త్వరలోనే ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని రావత్ వెల్లడించారు. కాగా, మైనర్ బాలికలపై అత్యాచారం జరిపిన వారికి మరణశిక్ష విధించాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ప్రభుత్వాలు ఇదివరకే చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ ప్రకటించిన విషయం విధితమే. -
వారికి ఉరే సరి
న్యూఢిల్లీ: సంచలన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో తమకు విధించిన ఉరిశిక్షపై పునఃసమీక్ష కోరుతూ ముగ్గురు దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. గత తీర్పును పునఃసమీక్షించేందుకు తగిన కారణమేదీ లేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం దోషుల పిటిషన్లను తోసిపుచ్చింది. 2012 డిసెంబరు 16న రాత్రి ఢిల్లీలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు కదులుతున్న బస్సులో అత్యాచారం జరిపి, ఆమెను మాటల్లో చెప్పలేని తీవ్ర శారీరక హింసకు గురిచేసి రోడ్డుపైకి విసిరేసి వెళ్లిపోయారు. అనతరం ఆమె చికిత్స పొందుతూ డిసెంబరు 29న సింగపూర్‌లో ప్రాణాలు కోల్పోయింది. నిర్భయ అత్యాచార ఘటనగా పేర్కొనే ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. మహిళలకు రక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆంక్షలను ధిక్కరించి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అత్యాచారాలను నిరోధించడానికి ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని కూడా తీసుకురావడం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు 2012 డిసెంబరులోనే అరెస్టు చేశారు. వారిలో ఒకరు నేరానికి పాల్పడిన సమయానికి మైనర్ కావడం, అతను 2013 ఆగస్టులో దోషిగా తేలడంతో మొదట మూడేళ్ల శిక్ష విధించి బాలల కారాగారానికి తరలించారు. అయితే 2015 డిసెంబరులోనే విడుదలయ్యాడు. మిగిలిన ఐదుగురిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ జరుపుతుండగా 2013 మార్చిలో రామ్ సింగ్ అనే నిందితుడు జైలులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మిగిలిన నలుగురిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషులుగా తేల్చి 2013 సెప్టెంబరులో మరణ శిక్ష విధించింది. అనంతరం వారికి ఉరిశిక్షను 2014లోనే ఢిల్లీ హైకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత దోషులు ఉరిశిక్షను సుప్రీంకోర్టులోనూ సవాల్ చేయడంతో 2017 మే నెలలోనే సుప్రీంకోర్టు కూడా వారికి ఉరిశిక్ష సరైందేనని తీర్పు చెప్పింది. గతంలోనే నిశితంగా విన్నాం.. నిర్భయ అత్యాచారం కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లకు ఉరిశిక్ష విధించింది. ఈ శిక్షను గతంలోనే సుప్రీంకోర్టు కూడా సమర్థించినప్పటికీ, మరణశిక్షపై మరోసారి సమీక్షించాలంటూ ముకేశ్, పవన్, వినయ్‌లు మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. గతంలో విచారణ సమయంలోనే ఈ ముగ్గురి వాదనలను న్యాయమూర్తులు నిశితంగా పరిశీలించారనీ, ఇప్పుడు మళ్లీ నాటి తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదనీ ధర్మాసనం స్పష్టం చేసింది. అక్షయ్ సింగ్ మాత్రం శిక్షపై పునఃసమీక్ష కోరలేదు. మరణ వాంగ్మూలాలపై... నిర్భయ ఇచ్చిన మరణ వాంగ్మూలాలు ఒకదానితో ఒకటి సరిపోలడం లేదనే వాదనను దోషుల తరఫు న్యాయవాది లేవనెత్తగా ధర్మాసనం తోసిపుచ్చింది. దోషులు మళ్లీ మళ్లీ ఇదే అంశాన్ని లేవనెత్తడం సరికాదని మంద లించింది. నిర్భయ డిసెంబరు 16, 21, 25 తేదీల్లో మూడుసార్లు వాంగ్మూలాలిచ్చింది. మరణశిక్షను రద్దు చేయలేం.. బ్రిటన్, పలు లాటిన్ అమెరికా దేశాలు, ఆస్ట్రేలియా తదితర చోట్ల మరణశిక్షను రద్దు చేశారు కాబట్టి భారత్‌లోనూ అలాగే చేయాలనడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. శిక్షా స్మృతిలో మరణశిక్ష ఉన్నన్ని రోజులూ, ఆ శిక్ష విధింపదగ్గ కేసుల్లో కోర్టులు మరణ శిక్షనే విధిస్తాయనీ, ఇందుకు కోర్టులను ఎవరూ నిందించజాలరని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని నిబంధనలు, పౌరుల, నేరస్తుల హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలను పరిశీలించిన మీదట, మరణ శిక్ష విధించడం రాజ్యాంగబద్ధమేనంది. నమ్మకం తిరిగొచ్చింది: నిర్భయ తల్లి ‘ఉరిశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడం.. అలాంటి హీన నేరాలకు పాల్పడేవారికి ఓ హెచ్చరిక. న్యాయవ్యవస్థపై మా నమ్మకం తిరిగొచ్చింది. మహిళలు, అమ్మాయిలపై దురాగతాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని నేను కోరుతున్నా’ అని నిర్భయ తల్లి ఆశాదేవి పేర్కొన్నారు. దోషులకు శిక్షను అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందనీ, ఈలోపు దేశంలో తన కూతురిలాగే మరెంతోమంది అమ్మాయిలు బలైపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత ఏం చేయొచ్చు? దోషులకు మరణశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడంతో ప్రస్తుతం ఉరి శిక్షను తప్పించుకోడానికి మరో రెండు మార్గాలున్నాయి. వాటిలో ఒకటి.. మరణ శిక్షను నిలిపేయాల్సిందిగా కోరుతూ దోషులు మళ్లీ సుప్రీంకోర్టులోనే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం. రెండోది క్షమాభిక్ష పెట్టాల్సిందిగా రాష్ట్రపతిని వేడుకోవడం. ఈ రెండు అవకాశాల్లో కూడా దోషులకు ఊరట లభించని పక్షంలో వారికి ఉరి శిక్ష తప్పదు. కేసులో దోషులకు శిక్షను తగ్గించేందుకు సాయపడేవైనప్పటికీ గతంలో ఎప్పుడూ కోర్టు దృష్టికి తీసుకురాని అంశాలేవైనా ఉంటే, ఆ అంశాలపై విచారణ కోసం దాఖలు చేసేది క్యూరేటివ్ పిటిషన్. అలాంటి అంశాలేవైనా ఉన్నా యని ముందుగా జడ్జీలు భావిస్తేనే పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తారు. లేదంటే పిటిషన్ వేసిన వారికి జరిమానా వేస్తారు. ఉరితో నేరాలు తగ్గవు: ఆమ్నెస్టీ ఉరి శిక్షలు విధించినంత మాత్రాన మహిళలపై నేరాలు తగ్గవని మానవ హక్కుల పోరాట సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా పేర్కొంది. ‘ఉరిశిక్ష వల్ల మహిళలపై నేరాలు కానీ, మరే ఇతర నేరాలు కానీ తగ్గినట్లు రుజువులేవీ లేవు. చట్టాలు సరిగ్గా అమలయ్యేందుకు, వీలైనన్ని ఎక్కువ కేసుల్లో దోషులకు సరైన శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేకూ ర్చేందుకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. రేప్‌ల చట్టాల సంస్కరణలపై ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ కూడా ఉరిశిక్షను వ్యతిరేకించింది’ అని ఆమ్నెస్టీ ఇండియా ప్రోగ్రాం డైరెక్టర్ అస్మిత అన్నారు. నిర్భయ అత్యాచారం, హత్య కేసులో గత తీర్పును పునఃసమీక్షించేందుకు తగిన కారణమేదీ లేదు. గత విచారణ సమయంలోనే ఈ ముగ్గురి వాదనలను న్యాయమూర్తులు నిశితంగా పరిశీలించారు. ఆ తీర్పులో ఏ తప్పూ లేదు. – సుప్రీంకోర్టు ధర్మాసనం ఉరిశిక్షను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించడం.. అలాంటి హీన నేరాలకు పాల్పడే వారికి ఇది ఓ హెచ్చరిక. మహిళలు, అమ్మాయిలపై దురాగతాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతున్నా. – నిర్భయ తల్లి ఆశాదేవి సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లిదండ్రులు -
నిర్భయ కేసు: సుప్రీం సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని తీర్పు వెలువరించింది. తమకు విధించిన ఉరి శిక్షను రద్దు చేసి, జీవిత ఖైదుగా మార్చాలంటూ నిర్భయ కేసు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు సహా కింద కోర్టులు విధించిన ఉరి శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దోషులు చేసింది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. నిందితులకు ట్రయల్ కోర్టు.. ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన ఉరి శిక్షలను గతేడాది మేలోనే సుప్రీం కోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం తీర్పును సమీక్షించాలని కోరుతూ దోషులు ముఖేష్(29), పవన్ గుప్తా(22), వినయ్ శర్మ(23)ల తరపున రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు భానుమతి, అశోక్ భూషణ్‌ల ఆధర్వ్యంలో ధర్మాసనం నేడు(సోమవారం) ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది. 2012 డిసెంబర్ 16న ఈ కిరాతకమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. నిర్భయ కేసు... 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు యువతి కన్నుమూసింది. కేసులో ఆరుగురు నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెలువరించింది. కానీ ఈ తీర్పును రివ్యూ చేయాలంటూ ముగ్గురు దోషులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం వీరి రివ్యూ పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మా పోరాటం ఇంతటితో ఆగలేదు. ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతోంది. ఇది సమాజంలోని కూతుర్లపై ప్రభావం చూపుతుంది. న్యాయ విధానాన్ని కఠినతరం చేయాలని అభ్యర్థిస్తున్నా. ఎంత వీలైతే అంత త్వరగా నిర్భయ కేసు దోషులను ఉరి తీయాలని కోరుతున్నా. ఇది సమాజంలోని ఇతర అమ్మాయిలకు, మహిళలకు ఎంతో సాయపడుతుంది. - నిర్భయ తల్లి -
‘డ్రగ్ ఫ్రీ పంజాబ్’ కోసం సంచలన నిర్ణయం...
చండీఘడ్ : డ్రగ్ మాఫియాను అంతమొందించేందుకు పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై నిషేధిత డ్రగ్స్ విక్రయించే, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందించేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ‘తరతరాలను నాశనం చేయగల శక్తి డ్రగ్స్‌కు ఉంది. వీటిని నివారించేందుకు కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది. డ్రగ్ ఫ్రీ పంజాబ్ పట్ల శ్రద్ధ వహిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానంటూ’ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. డ్రగ్ మాఫియాను అరికడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినఅమరీందర్ సింగ్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదంటూ ప్రతిపక్షం శిరోమణి అకాళీదళ్ గత కొన్ని రోజులుగా విమర్శల దాడి పెంచింది. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. My govt has decided to recommend the death penalty for drug peddling/smuggling. The recommendation is being forwarded to the Union government. Since drug peddling is destroying entire generations, it deserves exemplary punishment. I stand by my commitment for a drug free Punjab. pic.twitter.com/dXZTsDwVpf — Capt.Amarinder Singh (@capt_amarinder) July 2, 2018 -
పెంకా.. బతుకుతుంది ఇంకా..
పెంకా బతకనుంది.. మరికొన్ని రోజుల్లో మరో బుల్లి పెంకాకు బతుకునివ్వనుంది. అక్రమంగా దేశ సరిహద్దును దాటినందుకు పెంకా అనే ఆవుకు బల్గేరియా ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, పెంకాను రక్షించాలంటూ అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి ఆ దేశ సర్కారు తలొగ్గింది. గర్భంతో ఉన్న పెంకాకు ఇటీవల నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లోనూ దానికి ఏ విధమైన వ్యాధులు సోకలేదని నిర్ధారణ అయింది. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతోపాటు పెంకాను రక్షించాలంటూ పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమమూ మొదలైంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పెంకాకు విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తోడేళ్లు వెంటబడటంతో పెంకా సరిహద్దును దాటి సెర్బియాలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న దాని యజమాని తిరిగి తెస్తున్నప్పుడు సరిహద్దు భద్రతాధికారులు అడ్డుకున్నారు. సరైన పత్రాలు లేకుండా యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశం కాని సెర్బియాకు వెళ్లడం.. తిరిగి రావడం సహించరాని నేరమంటూ పెంకాకు మరణశిక్ష విధించారు. – సాక్షి, తెలంగాణ డెస్క్