టెక్కీ హత్యకేసులో దోషులకు మరణశిక్ష
పుణె: ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నయనా పూజారి(28) అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు దోషులకు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. దోషులు యోగేశ్ రౌత్, మహేశ్ ఠాకూర్, విశ్వాస్ కదమ్‌లకు మరణ శిక్ష విధించగా, అప్రూవర్‌గా మారిన మరో దోషి రాజేశ్ పాండురంగ్ చౌదరిని విడిచిపెట్టింది. ఖరాడి ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసే నయనా అక్టోబర్ 7, 2009లో పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా కిడ్నాప్ చేశారు.
రెండు రోజుల అనంతరం ఆమె మృతదేహాన్ని జరేవాడీ అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోషుల మీద మోపిన కిడ్నాప్, గ్యాంగ్ రేప్, హత్య, చోరీ, ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాలు నిరూపితమయ్యాయి. ఈ కేసులో ప్రధాన దోషిగా ఉన్న యోగేశ్ 2011 సెప్టెంబర్ 11న పోలీసుల కనుగప్పి పరారవ్వగా, 20నెలల అనంతరం అతన్ని షిర్డీలో అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో యోగేశ్ కొన్ని నెలల ముందు మరో మహిళను అత్యాచారం చేశాడన్న విషయం వెలుగులోకి వచ్చింది.