Sakinaka Case: వావీవరుసలు లేని మానవ మృగం.. ఒంటరి మహిళపై అఘాయిత్యానికి తెగపడింది. అంతటితో ఆగలేదు.. పైశాచికత్వం ప్రదర్శించింది. వదిలేయమని బాధితురాలు బతిమాలినా వినలేదు. ఫలితం.. ప్రాణం కోసం పోరాడి కన్నుమూసింది. సంచలనం సృష్టించిన సాకినక ‘నిర్భయ’ కేసులో దోషికి మరణ శిక్ష ఖరారైంది. బాధిత కుటుంబం, న్యాయం కోసం తొమ్మిది నెలలపాటు పోరాడిన వాళ్ల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన.. సాకినక(ముంబై, అంధేరీ) అత్యాచారం, హత్య కేసులో దోషి మోహన్ కథ్వారు చౌహాన్ .. దిన్‌దోషి కోర్టు గురువారం మరణ శిక్ష ఖరారు చేసింది. ఇది అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించిన అదనపు సెషన్స్ జడ్జి హెస్.సి.షిండే.. ఇలాంటి సంఘటనల్లో దోషిపై కనికరం చూపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పింది. స్వయానా నిందితుడి తండ్రే.. తన కొడుకును ఛీదరించుకున్నాడని, ఉరి తీయాలంటూ వ్యాఖ్యానించాడని, పైగా తన సోదరుడి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించడం.. అతని స్వభావానికి అద్దం పడుతోందని, ఇంతకన్నా అతనికి మరణ శిక్ష విధించడానికి కారణాలు అక్కర్లదేని ఆయన అన్నారు.
‘‘ఇదొక భయానకం. బాధితురాలితో చౌహాన్ రాక్షసంగా ప్రవర్తించాడు. వీడు మనిషి కాదు.. కిరాతకుడు. అత్యాచారానికి పాల్పడ్డ తీరును తలచుకొంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇది అత్యంత అరుదైన కేసు కిందికి వస్తుంది’’ అని పేర్కొన్నారు. మరణ శిక్ష విధిస్తేనే సమాజంలోకి సరైన సందేశం వెళ్తుందన్నారు. మరణ శిక్షతో పాటు 32 వేల రూపాయల జరిమానా విధించారు జడ్జి.
ఘోరంగా..
మోహన్ కథ్వారు చౌహాన్ (45).. యూపీకి చెందిన వ్యక్తి. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇంట్లోంచి గెంటేశారు. దీంతో భార్యాపిల్లలతో సహా ముంబై వచ్చి.. కూలీ పనులు చేసుకుంటున్నాడు. 2021 సెప్టెంబర్ 10న ముంబైలో నిలిపి ఉంచిన టెంపోలో.. 34 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పదునైన వస్తువులతో ఆమె జనానాంగాలను గాయపరిచాడు. ఈ ఘోరంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో నిర్భయ ఘటనగా ఇది సంచలనం సృష్టించింది.
బాధితురాలు దళితురాలు కావడంతో ఈ కేసు.. ప్రముఖంగా చర్చల్లో నిలిచింది. దీంతో ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక చొవర చూపించారు సీఎం ఉద్దవ్ థాక్రే. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు మోహన్ చౌహాన్. ఈ కేసులో చౌహాన్ తరపున వాదించేందుకు లాయర్లు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వమే.. న్యాయవాదిని ఏర్పాటు చేసింది. అడ్వొకేట్ కల్పన వాస్కర్.. చౌహాన్ తరపున వాదనలు వినిపించారు. అతని ఆర్థిక స్థితి, భార్య అనారోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్షను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ, కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చింది.
ఇదిలా ఉంటే.. వాదనల సమయంలోనూ చౌహాన్ పదే పదే జోక్యం చేసుకోవడం న్యాయమూర్తిని చిరాకు తెప్పించింది. తాను అమాయకుడినని, మద్యం మత్తులో అలా జరిగిపోయిందని, పోలీసులు ఈ కేసులో పోలీసులు గోల్‌మాల్ చేశారంటూ మాట్లాడాడు. దీంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజీ మీద ఏం స్పందిస్తావ్ అంటూ నిలదీశారు. పైగా సొంత అన్న కూతురిపైనే అఘాయిత్యం చేస్తానని మోహన్ బెదిరించడాన్ని ప్రస్తావించారు. మహిళలపట్ల ఏమాత్రం గౌరవం లేని మృగంగా అభివర్ణించింది చౌహాన్‌ను న్యాయస్థానం.
Comments
Please login to add a commentAdd a comment