గొర్రెకుంట హత్యలు: కిరాతకుడికి ఉరిశిక్ష | Gorrekunta Case Death Sentence To Culprit Sanjay In Warangal | Sakshi
Sakshi News home page

గొర్రెకుంట హత్యలు: కిరాతకుడికి ఉరిశిక్ష

Published Thu, Oct 29 2020 12:27 AM | Last Updated on Thu, Oct 29 2020 7:15 AM

Gorrekunta Case Death Sentence To Culprit Sanjay In Warangal - Sakshi

తీర్పు అనంతరం సంజయ్‌కుమార్‌ను జైలుకు తరలిస్తున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/వరంగల్‌ లీగల్‌: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వరంగల్‌ జిల్లా గొర్రెకుంట హత్యల కేసులో నిందితుడు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌కు ఉరిశిక్ష పడింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో 9 మందికి మత్తు మందిచ్చి, బావిలో పడేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి ఇదే సరైన శిక్షని కోర్టు తేల్చింది. ఈ మేరకు వరంగల్‌ ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్, సెషన్స్‌ కోర్టు జడ్జి కావూరి జయకుమార్‌ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ హత్యలన్నీ ఉద్దేశపూర్వకంగా, పకడ్బందీ కార్యాచరణతో చేసినట్టు రుజువైంది. దీంతో బిహార్‌లోని బేగుసరాయి జిల్లా దౌలత్‌పూర్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌కు ఉరిశిక్ష ఖరారైంది.

ఇదీ జరిగిన ఘోరం..
ఈ ఉదంతంలో మృతులు పశ్చిమబెంగాల్, బిహార్‌ రాష్ట్రాలకు చెందినవారు కాగా, నేరస్తుడు బిహార్‌ రాష్ట్రవాసి. సాక్షులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు వరంగల్‌వాసులు కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రాసిక్యూషన్‌ పక్షాన కేసు వాదించిన డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ కమ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మోగుళ్ల సత్యనారాయణగౌడ్‌ కథనం ప్రకారం.. సంజయ్‌కుమార్‌ (40) బతుకుదెరువుకు బిహార్‌ నుండి వలసవచ్చి వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతంలోని గోనె సంచుల తయారీ కర్మాగారంలో పని చేస్తున్నాడు. అక్కడే ఉండే వివాహిత రఫీకతో సహజీవనం చేస్తూనే ఆమె మైనర్‌ కూతురిపై కన్నేశాడు. దీంతో రఫీక హెచ్చరించడంతో పాటు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. కుటుంబసభ్యులతో మాట్లాడటానికి స్వరాష్ట్రానికి వెళ్దామని చెప్పి ఆమెతో కలిసి ఈ ఏడాది మార్చి 6న గరీభ్‌ర«థ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు రెండు వేర్వేరు టికెట్లు తీసుకున్నాడు. మార్గమధ్యంలో రఫీకకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగ తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయాక గొంతునులిమి నడుస్తున్న రైల్లోంచి ఏపీలోని నిడదవోలు స్టేషన్‌ సమీపంలో బయటకు నెట్టేశాడు.

సంజయ్‌కుమార్‌ రాజమండ్రి స్టేషన్‌లో దిగి తిరిగి వరంగల్‌ వచ్చాడు. తిరిగొచ్చాక ఆమె మైనర్‌ కూతురును లొంగదీసుకొని తల్లి బతికే ఉందని నమ్మిస్తూ మోసం చేయసాగాడు. మరోపక్క రఫీక ఏదని ఆమె బంధువులైన మక్సూద్‌ ఆలం, నిషా ఆలం నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో తన నేరం బయటపడుతుందని భావించిన సంజయ్‌ మక్సూద్‌ కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించాడు. మే 20న మక్సూద్‌ ఆలం కుమారుడి పుట్టిన రోజు కాగా, మెడికల్‌ షాపు నుండి 60 నిద్రమాత్రలు కొని, ఆ రోజు రాత్రి భోజన సమయంలో కూరలో కలిపాడు. మక్సూద్‌ ఆలం, ఆయన భార్య నిషా ఆలం, కుటుంబసభ్యులైన సోహెల్‌ ఆలం, బూష్రా, బబ్లూ, షకీల్, షాబాజ్‌ అలీతో పాటు పక్క గదిలో ఉండే బిహార్‌కు చెందిన వలస కార్మికులు శ్రీరాంకుమార్, శ్యాంకుమార్‌ షా ఆ కూరతో భోజనం చేశారు. అందరూ స్పృహ కోల్పోయాక, ప్రాణాలతో ఉండగానే ఒక్కొక్కరిని గోనె సంచుల్లో వేసి గొర్రెకుంటలోని బావిలో పడేశాడు. మర్నాడు వీరి మృతదేహాలు బయటపడ్డాయి.

మొదట ఆత్మహత్యలుగా..
ఒకపక్క కరోనా విలయతాండవం.. మరోపక్క లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో ఆకలికి అలమటించి, జీవితంపై విరక్తితో వీరంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడారని తొలుత భావించారు. శవాలను వెలికితీసి పోస్టుమార్టం చేయగా హత్యలుగా తేలింది. దీంతో కేసు నమోదుచేసి శరవేగంతో పరిశోధన చేసిన గీసుకొండ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా నేరస్తుడు సంజయ్‌కుమార్‌ను అరెస్టుచేసి ఐపీసీ సెక్షన్లు 449, 328, 364, 380, 404, 354/సీ, 302, 201, సెక్షన్‌ 67 ఐటీ చట్టం కేసు నమోదు చేసి మే 26న కోర్టులో హాజరుపర్చారు. ప్రత్యేక కేసుగా భావించిన కోర్టు సత్వరమే నేరపరిశోధన చేసి చార్జిషీట్‌ దాఖలుచేయాలని ఆదేశించింది. దీంతో జూలై 28న చార్జిషీట్‌ దాఖలైంది.

శరవేగంగా విచారణ..శిక్ష ఖరారు
చార్జిషీట్‌లో వంద మంది సాక్షులను పేర్కొన్న ప్రాసిక్యూషన్‌ విచారణ సందర్భంగా 67 మందిని కోర్టులో హాజరుపర్చింది. సెప్టెంబర్‌ 21న విచారణ ప్రారంభించిన కోర్టు 40 రోజుల్లోనే.. ఈనెల 20కి విచారణ పూర్తిచేసి బుధవారం తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాలను పరిశీలించాక నేరం రుజువు కావడంతో నేరస్తుడు సంజయ్‌కుమార్‌కు చనిపోయేంత వరకు ఉరి వేయాలని జడ్జి జయకుమార్‌ తీర్పు వెల్లడించారు. ఐపీసీ సెక్షన్‌ 302 హత్యానేరం కింద ఉరిశిక్ష విధించిన జడ్జి జయకుమార్‌ నేరస్తుడిపై ఉన్న ఇతర అభియోగాలపై కూడా వివిధ సెక్షన్ల క్రింద జీవితఖైదు, జైలుశిక్ష, జరిమానా వి«ధిస్తూ తీర్పునిచ్చారు. కేసు సత్వర పరిశోధనలో మామునూరు ఏసీపీ జి.శ్యాంసుందర్, గీసుకొండ సీఐ జె.శివరామయ్య పాలుపంచుకోగా, లైజన్‌ ఆఫీసర్‌ దేవరకొండ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కానిస్టేబుల్‌ జె.లింగయ్య సాక్షులను కోర్టులో హాజరుపరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement