వరంగల్: మరదలి ప్రవర్తన సరిగా లేకపోవడంతో మందలించిన బావను నమ్మించి మరో ఇద్దరి సాయంతో హత్య చేసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారు మున్నేరువాగు సమీపంలో గత శుక్రవారం కుళ్లిన స్థితిలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీలో సోమవారం కొత్త విషయం వెలుగుచూసింది. మరదలిపై అనుమానంతో తండావాసులు నిలదీయడంతో నిజం ఒప్పుకుంది. దీంతో కోపోద్రిక్తులైన తండావాసులు ఆమె మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. వివరాల్లోకి వెళ్తే.. డోర్నకల్ పట్టణ శివారు సిగ్నల్‌తండాకు చెందిన బానోత్ జగన్(30) ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించడం లేదు.
అవివాహితుడైన జగన్ హైదరాబాద్‌లో క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా ఈ నెల ఒకటవ తేదీన తండాకు వచ్చాడు. జగన్ సోదరుడు గోపి ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అతని భార్య తన ఇద్దరు పిల్లలను ఇతర ప్రాంతాల్లో పాఠశాలలో చదివిస్తూ తను ఒంటరిగా తండాలో ఉంటుంది. మరదలి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో జగన్ తరచూ మందలించేవాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి నుంచి జగన్ కనిపించకపోవడంతో సోమవారం తండావాసులు తన మరదలిపై అనుమానంతో గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని తండావాసులకు వివరించింది.
తన ప్రవర్తనపై బావ జగన్ తరచూ ప్రశ్నించేవాడని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చేవాడని తెలిపింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ అడ్డు తొలగించుకోవాలని తనకు సన్నిహితుడైన ఓ వ్యక్తితోపాటు మరొకరి సహాయం తీసుకున్నట్లు తెలిపింది. 2వ తేదీ రాత్రి కోరిక తీరుస్తానంటూ మున్నేరు శివారు శివాలయం సమీపానికి తీసుకెళ్లానని, అప్పటికే తన సమాచారం మేరకు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి బండరాళ్లతో తల, మెడపై కొట్టి చంపినట్లు ఒప్పుకుంది. దీంతో కోపోద్రికులైన తండావాసులు సదరు మహిళకు దేహశుద్ధి చేశారు. మెడలో చెప్పులదండ వేసి తండాలో ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment