
లీసా మాంట్‌గొమెరీ, బాబీ జో స్టిన్నెట్
టెర్రెహాట్: పదిహేడేళ్ల క్రితం నిండు గర్భిణిని హత్య చేసి, ఆమె కడుపు కోసి గర్భంలో ఉన్న శిశువుని ఎత్తుకుపోయిన నేరానికి కాన్సాస్‌కి చెందిన లీసా మాంట్‌గొమెరీ అనే మహిళకు మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో ఒక మహిళకు మరణశిక్షను అమలు చేయడం 1953 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారి. ఇండియానాలోని టెర్రెహాట్ జైలులో 52 ఏళ్ల వయసున్న లీసాకి ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1.31 గంటలకు ఆమె తుది శ్వాస విడిచినట్టుగా జైలు అధికారులు వెల్లడించారు.
మరణశిక్ష అమలు చేయడానికి ముందు లీసా కాస్త ఆందోళనతో కనిపించినట్టు జైలు అధికారులు చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు జైలులోని మహిళా అధికారి లీసా దగ్గరగా వచ్చి, ఆమె ముఖాన్ని కప్పి ఉంచిన మాస్కు తీసి, చివరగా చెప్పాల్సినదేమైనా ఉందా అని ప్రశ్నించారు. దానికి లీసా నెమ్మదిగా, వణుకుతున్న గొంతుతో ‘‘నో’’అని బదులిచ్చారు. మిస్సోరి పట్టణంలో నివాసం ఉన్న లీసా 2004 సంవత్సరం డిసెంబర్‌లో ఇంటర్నెట్‌లో కుక్క పిల్లల అమ్మకానికి ఉన్నాయన్న ప్రకటన చూసింది. ఆ ప్రకటన ఇచ్చిన బాబీ జో స్టిన్నెట్ (23) మహిళని కాంటాక్ట్ చేసింది. స్టిన్నెట్ ఇంటికి వెళ్లిన లీసా ఉన్మాదంతో ప్రవర్తించింది. అప్పటికే ఎనిమిదో నెల గర్భిణి అయిన స్టిన్నెట్ మెడకి తాడు బిగించి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత వంటగదిలో ఉన్న కత్తిని తీసుకువచ్చి ఆమె గర్భాన్ని చీల్చి లోపల ఉన్న శిశువుని అపహరించింది.
Comments
Please login to add a commentAdd a comment