kidnaap
-
మూడేళ్ళ పాపను ఎత్తుకెళ్లిన యువకుడు
-
డబ్బు కోసం తన ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేసిన తండ్రి
జడ్చర్ల: తాగుడు, జల్సాలకు అలవాటు పడిన ఓ తండ్రి తన ముగ్గురు బిడ్డలను అమ్మకానికి హైదరాబాద్‌కు తీసుకెళ్లగా.. పోలీసులు తల్లి చెంతకు చేర్చిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం.. స్థానిక నిమ్మబావిగడ్డకు చెందిన హబీబున్నీసాకు భూత్పూర్ మండలం తాడిపత్రికి చెందిన రఫీక్‌తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల రుమానాబేగం, మూడేళ్ల రమీజ్, ఏడాది షోయబ్ పిల్లలున్నారు. ఈ కుటుంబం కొంతకాలంగా గౌరీశంకర్‌కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రఫీక్ తాగుడు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఆదివారం తన ముగ్గురు పిల్లలను దుస్తులు కొనిస్తానంటూ నమ్మబలికి బైక్‌పై హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి భార్యకు ఫోన్‌చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని, తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రఫీక్ ఫోన్ ట్రాక్‌చేసి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించగా.. చంచల్‌గూడ సమీ పంలో అదుపులోకి తీసుకున్నారు. తండ్రి ఇచ్చి న ఆధారాలతో యాకుత్‌పురాలో ఓ కారులో పిల్లలను పోలీసులు, బంధువులు గుర్తించారు. కారులో ఉన్న వారిని ప్రశ్నించగా రఫీక్ తమకు రూ.9 లక్షలు ఇవ్వాల్సి ఉందని.. డబ్బులు తీసుకొస్తానంటూ పిల్లలను అప్పగించి వెళ్లాడని చెప్పి పరారయ్యారు. కాగా.. తన పిల్లలను రూ.9 లక్షలకు విక్రయించే ప్రయత్నం చేశాడని భార్య ఆరోపించింది. గోవాలో ఉంటున్న తన భర్త రఫీక్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వేధిస్తుంటాడని వాపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
అమెరికాలో మహిళకి మరణశిక్ష అమలు
టెర్రెహాట్: పదిహేడేళ్ల క్రితం నిండు గర్భిణిని హత్య చేసి, ఆమె కడుపు కోసి గర్భంలో ఉన్న శిశువుని ఎత్తుకుపోయిన నేరానికి కాన్సాస్‌కి చెందిన లీసా మాంట్గొమెరీ అనే మహిళకు మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో ఒక మహిళకు మరణశిక్షను అమలు చేయడం 1953 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారి. ఇండియానాలోని టెర్రెహాట్ జైలులో 52 ఏళ్ల వయసున్న లీసాకి ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1.31 గంటలకు ఆమె తుది శ్వాస విడిచినట్టుగా జైలు అధికారులు వెల్లడించారు. మరణశిక్ష అమలు చేయడానికి ముందు లీసా కాస్త ఆందోళనతో కనిపించినట్టు జైలు అధికారులు చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు జైలులోని మహిళా అధికారి లీసా దగ్గరగా వచ్చి, ఆమె ముఖాన్ని కప్పి ఉంచిన మాస్కు తీసి, చివరగా చెప్పాల్సినదేమైనా ఉందా అని ప్రశ్నించారు. దానికి లీసా నెమ్మదిగా, వణుకుతున్న గొంతుతో ‘‘నో’’అని బదులిచ్చారు. మిస్సోరి పట్టణంలో నివాసం ఉన్న లీసా 2004 సంవత్సరం డిసెంబర్లో ఇంటర్నెట్లో కుక్క పిల్లల అమ్మకానికి ఉన్నాయన్న ప్రకటన చూసింది. ఆ ప్రకటన ఇచ్చిన బాబీ జో స్టిన్నెట్ (23) మహిళని కాంటాక్ట్ చేసింది. స్టిన్నెట్ ఇంటికి వెళ్లిన లీసా ఉన్మాదంతో ప్రవర్తించింది. అప్పటికే ఎనిమిదో నెల గర్భిణి అయిన స్టిన్నెట్ మెడకి తాడు బిగించి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత వంటగదిలో ఉన్న కత్తిని తీసుకువచ్చి ఆమె గర్భాన్ని చీల్చి లోపల ఉన్న శిశువుని అపహరించింది. -
నైజీరియాలో 19 మంది భారతీయుల విడుదల
అబుజా: ప్రైవేటు బోటులో ప్రయాణిస్తున్న భారతీయులను గత నెలలో కిడ్నాప్ చేసిన నైజీరియా సముద్ర దొంగ లు వారిని విడిచిపెట్టారు. డిసెంబర్ 15న ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట ఎమ్టీ డ్యూక్ పడవలో వెళుత ున్న 20 మందిని సముద్ర దొంగలు కిడ్నాప్ చేశారు. అయితే, ప్రయాణికుల్లోఒకరు మరణించారని నైజీరియాలోని భారత కార్యాలయం ఆదివారం తెలిపింది. మిగిలిన 19 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది. కిడ్నాప్ వార్త తెలిసిన వెంటనే స్పందించిన నైజీరియా ప్రభుత్వానికి ఆ దేశంలోని భారత అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుమలలో కిడ్నాప్ కలకలం
సాక్షి, తిరుమల : : మూడు నెలల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన తిరుమలలో కలకలం రేపింది. తమిళనాడులోని ఇల్లిపురం గ్రామానికి చెందిన కైసల్య, భర్త మధిరతో కలిసి తిరుమల కొండపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి తిరుమల ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మగబిడ్డ (వీరా)ను పక్కన పడుకోబెట్టుకొని నిద్రిస్తున్నసమయంలో గుర్తుతెలియని దుండగులు అపహరించారు. వీర కనిపించకపోవడంతో మధిర, కౌసల్య ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో బాలుడి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సెలవుల్లో ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్‌ను ఎత్తుకెళ్లారు. బుద్గాంలోని క్వాజిపొరా చదురా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యాసిన్ భట్ ఆర్మీలోని లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సెలవు మంజూరుచేయడంతో ఇంటికొచ్చారు. యాసిన్ కదలికలపై కన్నేసిన ఉగ్రవాదులు శుక్రవారం ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకీ గురిపెట్టి లాక్కెళ్లారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారు. కాగా, యాసిన్ భట్ అదృశ్యం నేపథ్యంలో పోలీసులు, ఆర్మీ ఈ ప్రాంతాన్ని అణువణువునా గాలిస్తున్నారు. గతేడాది జూన్‌లో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్ ఔరంగజేబ్‌ను ఇదే తరహాలో కిడ్నాప్‌చేసిన ఉగ్రవాదులు తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారు. మరోవైపు బాలకోట్ దాడిని ప్రస్తావిస్తూ ఐఏఎఫ్ ఓ కవితను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈరోజు కొందరు(భారత వాయుసేన) సరిహద్దును దాటారు. ఎందుకంటే మరికొందరు(పాకిస్తాన్) అన్ని పరిమితుల్ని అతిక్రమించారు’ అని కవి బిపిన్ అలహాబాదీ రాసిన కవితలో రెండు చరణాలను ట్వీట్ చేసింది. -
కిడ్నాప్ కలకలం : మృతుల్లో భారతీయుడు
కాబుల్ (అఫ్గానిస్తాన్) : ఉగ్రదాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న అఫ్గానిస్తాన్‌లో మరో కలకలం రేగింది. ఇప్పటికే వలసవాదులపై దాడులకు తెగబడుతున్న తాలిబన్ ఉగ్రవాదులు తాజాగా ముగ్గురు విదేశీయుల్ని చంపారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. వివరాలు.. సోడెక్సో ఇంటర్నేషనల్ ఫుడ్ కంపనీలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు విధులకు వెళ్తుండగా ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ముసాహీ జిల్లాలోని పార్కింగ్ చేసి ఉన్న కారులో మృత దేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మలేసియా (64), ఇండియా (39), మాసిడోనియా (37) పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారని అంతర్గతభద్రత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నుష్రత్ రహీమి తెలిపారు. మృతదేహాల పక్కన కొన్ని ఐడీ కార్డులు పడి ఉన్నాయనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఇన్నాళ్లూ స్వదేశీయుల్ని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకుంటున్న క్రిమినల్స్ కోవలోకి తీవ్రవాదులు సైతం చేరారు. విదేశీయులే లక్ష్యంగా రెచ్చిపోతూ బాంబు దాడులు, కిడ్నాప్‌లకు తెగబడుతున్నారు. -
నేరాల అడ్డా.. చీమకుర్తి గడ్డ!
చీమకుర్తి రూరల్ (ప్రకాశం): దేశవ్యాప్తంగా గ్రానైట్‌కు పేరుగాంచిన చీమకుర్తి నేరాల అడ్డాగా మారింది. 40 ఏళ్ల క్రితం ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రెండు బాంబులు వేసుకొని.. రెండు బైకులు తగలపెట్టుకుంటే ఇది మన సంస్కృతి కాదే.. ఎలా వచ్చిందని ఆ నాటి పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గెలుపోటములు సహజం. అంతమాత్రాన ఇంత దారుణాలకు పాల్పడాలా? అంటూ ఒకరికి ఒకరు ప్రశ్నించుకున్నారు. ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎక్కడో నల్గొండలో సుమంత్ అనే విద్యార్థి కిడ్నాప్ అయితే దాని మూలాలు ఇక్కడ బయట పడ్డాయి. చీమకుర్తి పరిసరాలకు చెందిన నలుగురు కలిసి విద్యార్థిని కిడ్నాప్ చేసి రామతీర్థం రిజర్వాయర్ పరిసరాల్లో దాచి బేరాలాడుకుంటూ పోలీసులకు చిక్కిన విషయం రెండేళ్ల క్రితం స్థానికంగా సంచలనం కలిగించింది. పెరిగిన వేధింపులు, హత్యలు మహిళలను టార్గెట్ చేయడం, వేధించడం.. వీలైతే వాడుకోవడం, కుదరకపోతే చంపేయడం.. ఇదీ చీమకుర్తిలోని హిమగిరి కాలనీ, గంగాకాలనీకి చెందిన 9 మంది యువకుల దండుపాళ్యం ముఠా చేష్టలు. ఐదారు నెలల క్రితం సంతనూతలపాడు, ఒంగోలు, మద్దిపాడు పరిసరాల్లో మహిళలను వేధించి చంపేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయట పడిన ముఠా స్వస్థలం చీమకుర్తి కావడం స్థానికులను కలవర పెడుతోంది. ఇటీవల వివాహేతర సంబంధాల నేపథ్యంలో అగ్రహారం గ్రామానికి చెందిన యువకుడిని అదే గ్రామానికి చెందిన ముగ్గురు చీమకుర్తి శివారులో హత్య చేశారు. దీనికి ముందు చీమకుర్తికి చెందిన ఓ మహిళను ఇంజినీరింగ్ విద్యార్థులు బైకుల మీద తీసుకెళ్లి తాళ్లూరు పరిసరాలు న్న మొగిలిగుండాల చెరువు వద్ద గొంతు కోసి చంపిన ఉదంతం ఇప్పటికీ కళ్లముందు కదులుతోంది. అంగన్వాడీ కేంద్రంలో అభం శుభం తెలియని చిన్న పిల్లోడిని కుర్కురే ప్యాకెట్లో ఎలుకల మందు పెట్టి చంపిన ఘటన పిడతలపూడిలో ఇటీవలే వెలుగు చూసింది. చిన్న విషయంలో మాటా మాటా పెరిగి ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి 8 కత్తిపోట్లు పొడిచిన ఘటన రామతీర్థం పరిసరాల్లో జరిగింది. క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోయి చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలేనికి చెందిన యువకుడు రామతీర్థం రిజర్వాయర్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రెండు నెలల క్రితం జరిగింది. చోరీలు కోకొల్లలు. కోటకట్లవారి బజారులో ఒక మహిళను తలపై కొట్టి మెడలో బంగారు గొలుసు పట్టపగలే లాక్కొని పరారైన సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఇలా నెలకు ఒకటి రెండు సార్లు పట్టణంలో దొంగతనాలు జరుగుతున్న సంఘటనలు చూసి స్థానికులు అభద్రతాభావానికి గురవుతున్నారు. గ్రానైట్ పేరుతో ఆర్థిక నేరాలు గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలకు అనుబంధంగా ఇటీవల జరిగిన ఆరిర్థిక నేరాలు వ్యాపారులను బెంబేలెత్తిస్తోంది. పచ్చిమగోదావరి జిల్లాకు చెందిన అజిత్‌రెడ్డి అనే మీసాలు కూడా రాని చిన్న యువకుడు 10–15 గ్రానైట్ ఫ్యాక్టరీలకు చెందిన యజమానులకు నెత్తిన టోపీ పెట్టి సుమారు రూ.2 కోట్ల విలువైన గ్రానైట్ మెటీరియల్ తీసుకెళ్లాడు. రెండు వారాల క్రితం చీమకుర్తికి చెందిన ఎన్.చంద్రశేఖర్ అనే వ్యక్తి దాదాపు 20 మందిని సినిమా ఫక్కీలో మోసం చేసి వారికి సంబంధించిన 8 పొక్లెయిన్లు, కారు, లక్షల కొద్దీ డబ్బు, బంగారు నగలు తీసుకొని కుటుంబంతో సహా ఉడాయించాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ సీబుక్‌ల సృష్టించి ఎంచక్కా దాదాపు రూ.30 కోట్ల విలువైన సంపదను కొల్లగొట్టారు. చీటీపాటల మోసాలు అన్నీఇన్ని కావు నమ్మకంగా పాటలోకి దించుతారు. వరుసగా రెండు మూడు పాటలు నిర్వహించి పాడుకున్న వారికి డబ్బులు సక్రమంగా చెల్లిస్తారు. జనంలో నమ్మకం కుదిరాక కనీసం రెండు కోట్లు చేతులు మారుతున్న సమయంలో చెప్పా పెట్టకుండా సర్దేస్తున్నారు. మెయిన్ రోడ్డులో ఒక పక్క బట్టల వ్యాపారం నడుపుతూ మరో పక్క చీటీపాటతో దాదాపు రూ.రెండు కోట్లతో మహిళ జంపై పలువురు కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇది మరిచిపోక ముందే నెల వ్యవధిలోనే పవర్ ఆఫీస్ వద్ద మరో మహిళ సుమారు కోటి రూపాయలకు సభ్యులకు టోపీ పెట్టింది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే చీమకుర్తిలో ఇటీవల పెరిగిన నేరప్రవృత్తికి స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. గ్రానైట్, దానికి అనుబంధంగా ఉన్న వ్యాపారాల కోసం దేశంలోని పలు రాష్ట్రాలు, తెలుగు రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి వేలాది మంది కార్మికులు వచ్చి నివాసం ఉండటంతో దొంగలు ఎవరో దొరలు ఎవరో గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. -
ముక్కలుగా చేసి, సెప్టిక్ ట్యాంకులో దాచి..
సాక్షి, న్యూఢిల్లీ: డబ్బు కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కిరాతకులు అతన్ని దారుణంగా హతమార్చి ముక్కలు చేశారు. పోలీసులకు పట్టుబడకుండా వాటిని మూటకట్టి సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టారు. ఈ దారుణ ఘటన ద్వారకలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్లో నివాసముండే సచిన్ యాదవ్(21) ఒక ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే షాప్‌లో పనిచేసే వరుణ్ (26), అతని బావమరిది రితురాజ్ అలియాస్ విక్కీ (24)తో కలిసి సచిన్‌ను మే 12ని అపహరించారు. వారి బారినుంచి తప్పించుకునే క్రమంలో సచిన్ యాదవ్ దొరికిపోవడంతో హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. కొడుకు ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినా సచిన్‌కు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదని ద్వారకా డీసీపీ షిబేశ్ సింగ్ తెలిపారు. కిడ్నాప్ జరిగిన రోజున సచిన్ తల్లిదండ్రులకు ఒక బెదిరింపు కాల్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘మీ కొడుకుని కిడ్నాప్ చేశాం. 50 లక్షల రూపాయలు తీసుకొస్తేనే అతన్ని వదిలేస్తామ’ని సచిన్ తల్లిదండ్రులకు గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అనుమానం నిజమైంది.. సచిన్‌తో పాటు అదే ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్న వరుణ్ కిడ్నాప్ జరిగిన రోజు నుంచి పనిలోకి రావడంలేదు. అతను ఇల్లు ఖాళీ చేయడం, ఫోన్ చేస్తే స్పందించక పోవడంతో వరుణ్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేయడంతో నిందితులు పట్టుబడ్డారని డీసీపీ షిబేశ్ తెలిపారు. -
కిడ్నాప్ ముఠా రిమాండు
డబ్బుల కోసం వ్యాపారి అపహరణ.. నిందితుల నుంచి ఇన్నోవా.. డమ్మీ పిస్తోలు స్వాధీనం వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ శంషాబాద్: డబ్బుల కోసం ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఓ ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్ గ్రామం అల్కాపూరి టౌన్షిప్లో నివాసముండే రమేష్‌చంద్ అగర్వాల్ (61) నగరంలోని బషీర్‌బాగ్‌లో బాలాజీ గ్రాండ్ బజార్ సూపర్‌మార్కెట్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణానికి సమీపంలోనే రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రిపురంలో నివాసముండే వాజిద్ అలీ (32) కారు మెకానిక్ షెడ్డును నడిపిస్తున్నాడు. చెడు వ్యసనాల కారణంగా వ్యాపారంలో నష్టాలతో ఇబ్బంది పడుతున్న వాజిద్ అలీ కన్ను రమేష్‌చంద్ వ్యాపారంపై పడింది. ఆయనను కిడ్నాప్ చేసి ఆర్థిక ఇబ్బందులను పరిస్థితులను చక్కబెట్టుకోవాలని పథకం వేశాడు. దీనికి అతడికి పరిచయస్తులైన మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సాజిద్ అలీ(32)తో పాటు హైదరాబాద్ బహదూర్‌పురాకు చెందిన షేక్ మోయిన్, షేక్మోయిజ్, అర్బాజ్‌లతో కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. ఈక్రమంలో ఈనెల 14న రమేష్‌చంద్ తన షాపు మూసేసి బంధువు అయిన ప్రమోద్ అగర్వాల్‌తో కలిసి రాత్రి 10 గంటల సమయంలో కారులో ఇంటికి బయలుదేరాడు. గమనించిన ముఠాసభ్యులు ఇన్నోవా వాహనంలో వారిని అనుసరిస్తూ వచ్చారు. నెక్నాంపూర్ శివారులోకి రాగానే కారు నడిపిస్తున్న ప్రమోద్ను కత్తితో గాయపర్చి రమేష్‌చంద్ అగర్వాల్‌ను ఇన్నోవా కారులోకి బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చే శారు. రమేష్‌చంద్ నుంచి సెల్‌ఫోన్‌తో పాటు రూ. 20 వేల నగదును దోచుకొని బషీర్‌బాగ్‌లో వదిలేశారు. కిడ్నాప్ చేసిన క్రమంలో అతడి నుంచి ఆయన కుమారుడు అతీష్ ఫోన్ నంబరు తీసుకున్నారు. అతీష్కు ఫోన్ చేసిన ముఠా సభ్యులు రూ. రెండు కోట్లు ఇవ్వకపోతే త్వరలోనే మీ కుటుంబాన్ని హతమారుస్తామంటూ బెదిరించడం ప్రారంభించారు. అతీష్ ఈ విషయమై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పక్కా వ్యూహంతో డబ్బు లు ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు అతీష్తో ముఠా సభ్యులకు సమాచారం అందించారు. ఆదివారం ఆరాంఘర్‌కు వచ్చిన ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఓ నిందితుడు ఆర్బాజ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు ఓ బొమ్మ పిస్తోలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. -
వైద్యవిద్యార్థిని సుస్మిత సురక్షితం
స్నేహితునితో వెళ్లిందని నిర్ధారణ కడప అర్బన్: కడప రిమ్స్ హౌస్‌సర్జన్ కొత్తూరు సుస్మిత కిడ్నాప్ కాలేదని తేలింది. శుక్రవారం రాత్రి సుస్మిత కిడ్నాప్ అయ్యిందనే సమాచారంతో రిమ్స్ అధ్యాపకులు, సహచర విద్యార్థులు, పోలీసులు ఒక్కసారిగా ఉత్కంఠకు లోనయ్యారు. ఓఎస్డి రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు గాలి స్తుండగా ఆమె క్షేమంగా ఉన్నదనే సమాచారం అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కడప శివార్లలోని రిమ్స్‌లో హౌస్‌సర్జన్ విద్యార్థులు సుస్మిత, సాధనారెడ్డిలు 19వ తేదీ రాత్రి 7 గంటలకు హాస్టల్ నుంచి అనుమతి తీసుకుని ఆటోలో నగరానికి వచ్చారు. సుస్మితను బ్యూటీపార్లర్ వద్ద వదిలి సాధనారెడ్డి షాపింగ్ కోసం వెళ్లింది. గంట తర్వాత ఫోన్ చేయగా ఆటోలో ఎవరో తీసుకెళ్తున్నారని చె ప్పడంతో సాధనారెడ్డి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసు బృం దాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టా యి. ఈ నేపథ్యంలో స్నేహితుడు ఉదయ్‌తో కలిసి తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు శనివారం ఉదయం 7 గంటలకు సుస్మిత తన తల్లిదండ్రులు, సోదరునికి ఫోన్ ద్వారా తెలిపింది. హైదరాబాద్ వెళ్లిన పోలీసు బృందం సుస్మిత, ఆమె తల్లిదండ్రులు, ఆమె స్నేహితుడు ఉదయ్‌తో కలిసి కడపకు బయలు దేరారు. సుస్మి త అతన్ని వివాహం చేసుకునేందుకు సాధనారెడ్డితో కలిసి ఈ నాటకానికి తెరతీసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వైద్యవిద్యార్థిని సుస్మిత సురక్షితం