పోలీసులకు పట్టుబడిన వరణ్, రితురాజ్
సాక్షి, న్యూఢిల్లీ: డబ్బు కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కిరాతకులు అతన్ని దారుణంగా హతమార్చి ముక్కలు చేశారు. పోలీసులకు పట్టుబడకుండా వాటిని మూటకట్టి సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టారు. ఈ దారుణ ఘటన ద్వారకలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్‌లో నివాసముండే సచిన్ యాదవ్(21) ఒక ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే షాప్‌లో పనిచేసే వరుణ్ (26), అతని బావమరిది రితురాజ్ అలియాస్ విక్కీ (24)తో కలిసి సచిన్‌ను మే 12ని అపహరించారు. వారి బారినుంచి తప్పించుకునే క్రమంలో సచిన్ యాదవ్ దొరికిపోవడంతో హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు.
కొడుకు ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినా సచిన్‌కు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదని ద్వారకా డీసీపీ షిబేశ్ సింగ్ తెలిపారు. కిడ్నాప్ జరిగిన రోజున సచిన్ తల్లిదండ్రులకు ఒక బెదిరింపు కాల్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘మీ కొడుకుని కిడ్నాప్ చేశాం. 50 లక్షల రూపాయలు తీసుకొస్తేనే అతన్ని వదిలేస్తామ’ని సచిన్ తల్లిదండ్రులకు గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అనుమానం నిజమైంది..
సచిన్‌తో పాటు అదే ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్న వరుణ్ కిడ్నాప్ జరిగిన రోజు నుంచి పనిలోకి రావడంలేదు. అతను ఇల్లు ఖాళీ చేయడం, ఫోన్ చేస్తే స్పందించక పోవడంతో వరుణ్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేయడంతో నిందితులు పట్టుబడ్డారని డీసీపీ షిబేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment