![Army Man Kidnapped By Terrorists From Home In Jammu - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/9/SOLIDER.jpg.webp?itok=409hGoO-)
శ్రీనగర్: కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సెలవుల్లో ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్‌ను ఎత్తుకెళ్లారు. బుద్గాంలోని క్వాజిపొరా చదురా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యాసిన్ భట్ ఆర్మీలోని లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సెలవు మంజూరుచేయడంతో ఇంటికొచ్చారు. యాసిన్ కదలికలపై కన్నేసిన ఉగ్రవాదులు శుక్రవారం ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకీ గురిపెట్టి లాక్కెళ్లారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారు.
కాగా, యాసిన్ భట్ అదృశ్యం నేపథ్యంలో పోలీసులు, ఆర్మీ ఈ ప్రాంతాన్ని అణువణువునా గాలిస్తున్నారు. గతేడాది జూన్‌లో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్ ఔరంగజేబ్‌ను ఇదే తరహాలో కిడ్నాప్‌చేసిన ఉగ్రవాదులు తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారు. మరోవైపు బాలకోట్ దాడిని ప్రస్తావిస్తూ ఐఏఎఫ్ ఓ కవితను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఈరోజు కొందరు(భారత వాయుసేన) సరిహద్దును దాటారు. ఎందుకంటే మరికొందరు(పాకిస్తాన్) అన్ని పరిమితుల్ని అతిక్రమించారు’ అని కవి బిపిన్ అలహాబాదీ రాసిన కవితలో రెండు చరణాలను ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment