ఇద్దరు ఉగ్రవాదుల హతం
అమరుడైన జవాను
జమ్మూ/భదర్వా: కశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. కథువా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమారిస్తే, దోడా జిల్లాలో చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించి పారిపోయారు. శివ్‌ఖోరీ నుంచి కాత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగి 9 మంది మరణించిన ఘటన మరువకముందే మళ్లీ కశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. వివరాలను జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ బుధవారం వెల్లడించారు.
‘‘మంగళవారం రాత్రి సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు సైదా సుఖాల్ గ్రామంలో చొరబడి ఒక ఇంట్లో తాగేందుకు నీళ్లు అడగడంతో గ్రామస్థులు భయపడి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్‌పీఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన కబీర్ దాస్ అనే సీఆర్‌పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఐఈడీలు, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఒక పౌరునికి సైతం గాయాలయ్యాయి.
చెక్‌పోస్ట్‌పై గుళ్ల వర్షం
దోడా జిల్లాలోని భదర్వా–పఠాన్‌కోట్ రోడ్డులోని ఛత్తర్‌గల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో తాత్కాలిక సంయుక్త చెక్‌పోస్ట్‌ను ఆర్మీ, పోలీసులు ఏర్పాటుచేశారు. మంగళవారం రాత్రి ఆ చెక్‌పోస్ట్ దాటేందుకు వచ్చిన నలుగురు ఉగ్రవాదులు చెక్‌పోస్ట్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment