
న్యూఢిల్లీ: ఐ–లీగ్ 2024–2025 సీజన్‌లో గోవాకు చెందిన చర్చిల్ బ్రదర్స్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకున్న చర్చిల్ బ్రదర్స్ జట్టు 40 పాయింట్లతో అగ్రస్థానంతో లీగ్‌ను ముగించింది. తాజా సీజన్‌లో 22 మ్యాచ్‌లాడిన చర్చిల్ బ్రదర్స్ జట్టు 11 విజయాలు, 4 పరాజయాలు, 7 ‘డ్రా’లు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో మొత్తం 45 గోల్స్ చేసిన ఆ జట్టు... ప్రత్యర్థులకు 25 గోల్స్ ఇచ్చుకుంది.
శ్రీనగర్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో చర్చిల్ బ్రదర్స్ జట్టు తరఫున రఫీఖ్ అమిను (50వ నిమిషంలో) ఏకైక గోల్ కొట్టగా... రియల్ కశ్మీర్ జట్టు తరఫున రామ్‌సంగ ట్లైచున్ (8వ నిమిషంలో) గోల్ చేశాడు. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్‌లో ఇంటర్ కాశీ జట్టు 3–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇంటర్ కాశీ జట్టు 22 మ్యాచ్‌లాడి 11 విజయాలు, 5 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 39 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఏఐఎఫ్‌ఎఫ్ నిర్ణయంపై ఉత్కంఠ
ఐ–లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే అర్హత సాధిస్తుంది. ప్రస్తుతానికి చర్చిల్ బ్రదర్ జట్టు ‘టాప్’లో ఉన్నప్పటికీ... సీజన్‌లో భాగంగా జనవరి 13న నామ్‌ధారి స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్హత లేని ఆటగాడిని బరిలోకి దింపారని ఇంటర్ కాశీ జట్టు ఆరోపించింది.
ఈ అంశంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఈ నెల 28న విచారణ చేపట్టనుంది. ఒకవేళ నిర్ణయం ఇంటర్ కాశీకి అనుకూలంగా వస్తే... మరో 3 పాయింట్లు వారి ఖాతాలో చేరనున్నాయి. అప్పుడు ఆ జట్టు 42 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానికి చేరనుంది. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్‌లో డెంపో స్పోర్ట్స్ క్లబ్ 4–3 గోల్స్ తేడాతో గోకులం కేరళ జట్టుపై గెలుపొందింది.
శ్రీనిధి డెక్కన్ జట్టుకు తొమ్మిదో స్థానం
మొత్తం 12 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్‌లో 22 మ్యాచ్‌లాడిన శ్రీనిధి జట్టు 7 విజయాలు, 8 పరాజయాలు, 7 ‘డ్రా’లతో 28 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 2021–2022 సీజన్‌లో మూడో స్థానం, 2022–2023 సీజన్‌లో రెండో స్థానం, 2023–2024 సీజన్‌లో రెండో స్థానం పొందిన శ్రీనిధి డెక్కన్ జట్టు ఈసారి మాత్రం నిరాశపరిచింది.