Budgam
-
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. రెండు వారాల్లో నాలుగోసారి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వలస కార్మికులే టార్గెట్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌లో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ఉస్మాన్ మాలిక్ (20), సోఫియాన్ (25)గా గుర్తించారు. అయితే, వారిద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. గత రెండు వారాల్లో కశ్మీర్ లోయలో వలస కార్మికులపై నాలుగో సారి దాడి జరిగింది. అక్టోబరు 20న గందర్బల్ జిల్లాలోని సొరంగం నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రదాడిలో స్థానిక వైద్యుడు, బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులతో సహా ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. -
జమ్ముకశ్మీర్‌లో బస్సు బోల్తా.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్ఎఫ్కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది. ఈ క్రమంలో బ్రెల్ గ్రామం వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు, సాయుధ బలగాలు అక్కడకు చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారుఘటనా స్థలంలో స్థానికులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలిదశ పోలింగ్ పూర్తికాగా.. రెండో దశ సెప్టెంబర్ 25న జరగనుంది. -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సెలవుల్లో ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్‌ను ఎత్తుకెళ్లారు. బుద్గాంలోని క్వాజిపొరా చదురా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ యాసిన్ భట్ ఆర్మీలోని లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సెలవు మంజూరుచేయడంతో ఇంటికొచ్చారు. యాసిన్ కదలికలపై కన్నేసిన ఉగ్రవాదులు శుక్రవారం ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకీ గురిపెట్టి లాక్కెళ్లారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన పోలీసులను ఆశ్రయించారు. కాగా, యాసిన్ భట్ అదృశ్యం నేపథ్యంలో పోలీసులు, ఆర్మీ ఈ ప్రాంతాన్ని అణువణువునా గాలిస్తున్నారు. గతేడాది జూన్‌లో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్ ఔరంగజేబ్‌ను ఇదే తరహాలో కిడ్నాప్‌చేసిన ఉగ్రవాదులు తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారు. మరోవైపు బాలకోట్ దాడిని ప్రస్తావిస్తూ ఐఏఎఫ్ ఓ కవితను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఈరోజు కొందరు(భారత వాయుసేన) సరిహద్దును దాటారు. ఎందుకంటే మరికొందరు(పాకిస్తాన్) అన్ని పరిమితుల్ని అతిక్రమించారు’ అని కవి బిపిన్ అలహాబాదీ రాసిన కవితలో రెండు చరణాలను ట్వీట్ చేసింది. -
ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్ము కశ్మీర్ : జమ్ము కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలింపుచర్యలు ముమ్మరం చేశాయి. -
బుద్గాం జిల్లాలో రీపోలింగ్
జమ్ముకశ్మీర్: శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్ అత్యల్పంగా నమోదైన బుద్గాం జిల్లాలోని 38 కేంద్రాల్లో గురువారం రీ పోలింగ్ జరుగుతోంది. గతంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో అల్లరి మూక దాడులు చేసిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీనగర్ లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన గొడవల్లో పోలీసులు కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
బుద్గాం, గండేర్బాల్ల్లో 144 సెక్షన్
శ్రీనగర్: కశ్మీర్‌లోయలోని శ్రీనగర్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘర్షణలు జరిగిన బుద్గాం, గండేర్బాల్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జిల్లాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. ఉప ఎన్నికల ఘర్షణలో 8 మంది యువకులు చనిపోవటాన్ని నిరసిస్తూ వేర్పాటువాదులు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. చాలాచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. దుకాణాలు, పెట్రోల్ స్టేషన్లు, ఇతర వ్యాపార సముదాయాలు తెరవలేదు. అటు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ రద్దీ కనిపించలేదు. కశ్మీర్ యూనివర్సిటీతోపాటు ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. -
వృద్ధుడు అక్రమాలు బయటపెడుతున్నాడని..
జమ్మూకాశ్మీర్: సమాచార హక్కు చట్టం ద్వారా తమ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడనే నెపంతో ఓ 62 ఏళ్ల వృద్ధుడిపై కొందరు ప్రబుద్ధులు విచక్షణా రహితంగా దాడి చేశారు. కిందపడుతున్న సమయంలో చేయందించి ఊతంగా నిలవాల్సిన వారు కిందపడేసి ఈడ్చి కొట్టారు. అనంతరం ఓ కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన జమ్మూకాశ్మీర్‌లో బుద్గాంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు బుద్గాం ప్రాంతంలోని నిరాశ్రయులకు ప్రభుత్వం తరుపున వస్తువులు ఏ విధంగా పంపిణీ చేశారు, ఎలా పంపిణీ చేశారు, అసలు పంపిణీ సక్రమంగా చేశారా లేదా అనే వివరాలు తెలుసుకునేందుకు ఓ 62 ఏళ్ల పెద్దాయన సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే, ఆయన అనుమానం ప్రకారం ఉచిత వస్తువుల పంపిణీ విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడే బయటపెడదాం అనుకుంటున్న సమయంలో ఆ అక్రమాలకు పాల్పడిన గ్రామపెద్ద అతడి మనుషులు కలిసి ముసలాయనను దారుణంగా కొట్టి కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.