
ఇటీవల హత్యకు గురైన అగ్రహారం యువకుడు
చీమకుర్తి రూరల్ (ప్రకాశం): దేశవ్యాప్తంగా గ్రానైట్‌కు పేరుగాంచిన చీమకుర్తి నేరాల అడ్డాగా మారింది. 40 ఏళ్ల క్రితం ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రెండు బాంబులు వేసుకొని.. రెండు బైకులు తగలపెట్టుకుంటే ఇది మన సంస్కృతి కాదే.. ఎలా వచ్చిందని ఆ నాటి పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గెలుపోటములు సహజం. అంతమాత్రాన ఇంత దారుణాలకు పాల్పడాలా? అంటూ ఒకరికి ఒకరు ప్రశ్నించుకున్నారు. ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎక్కడో నల్గొండలో సుమంత్ అనే విద్యార్థి కిడ్నాప్ అయితే దాని మూలాలు ఇక్కడ బయట పడ్డాయి. చీమకుర్తి పరిసరాలకు చెందిన నలుగురు కలిసి విద్యార్థిని కిడ్నాప్ చేసి రామతీర్థం రిజర్వాయర్ పరిసరాల్లో దాచి బేరాలాడుకుంటూ పోలీసులకు చిక్కిన విషయం రెండేళ్ల క్రితం స్థానికంగా సంచలనం కలిగించింది.
పెరిగిన వేధింపులు, హత్యలు
మహిళలను టార్గెట్ చేయడం, వేధించడం.. వీలైతే వాడుకోవడం, కుదరకపోతే చంపేయడం.. ఇదీ చీమకుర్తిలోని హిమగిరి కాలనీ, గంగాకాలనీకి చెందిన 9 మంది యువకుల దండుపాళ్యం ముఠా చేష్టలు. ఐదారు నెలల క్రితం సంతనూతలపాడు, ఒంగోలు, మద్దిపాడు పరిసరాల్లో మహిళలను వేధించి చంపేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయట పడిన ముఠా స్వస్థలం చీమకుర్తి కావడం స్థానికులను కలవర పెడుతోంది. ఇటీవల వివాహేతర సంబంధాల నేపథ్యంలో అగ్రహారం గ్రామానికి చెందిన యువకుడిని అదే గ్రామానికి చెందిన ముగ్గురు చీమకుర్తి శివారులో హత్య చేశారు. దీనికి ముందు చీమకుర్తికి చెందిన ఓ మహిళను ఇంజినీరింగ్ విద్యార్థులు బైకుల మీద తీసుకెళ్లి తాళ్లూరు పరిసరాలు న్న మొగిలిగుండాల చెరువు వద్ద గొంతు కోసి చంపిన ఉదంతం ఇప్పటికీ కళ్లముందు కదులుతోంది. అంగన్‌వాడీ కేంద్రంలో అభం శుభం తెలియని చిన్న పిల్లోడిని కుర్‌కురే ప్యాకెట్‌లో ఎలుకల మందు పెట్టి చంపిన ఘటన పిడతలపూడిలో ఇటీవలే వెలుగు చూసింది.
చిన్న విషయంలో మాటా మాటా పెరిగి ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి 8 కత్తిపోట్లు పొడిచిన ఘటన రామతీర్థం పరిసరాల్లో జరిగింది. క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోయి చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలేనికి చెందిన యువకుడు రామతీర్థం రిజర్వాయర్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రెండు నెలల క్రితం జరిగింది. చోరీలు కోకొల్లలు. కోటకట్లవారి బజారులో ఒక మహిళను తలపై కొట్టి మెడలో బంగారు గొలుసు పట్టపగలే లాక్కొని పరారైన సంఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఇలా నెలకు ఒకటి రెండు సార్లు పట్టణంలో దొంగతనాలు జరుగుతున్న సంఘటనలు చూసి స్థానికులు అభద్రతాభావానికి గురవుతున్నారు.
గ్రానైట్ పేరుతో ఆర్థిక నేరాలు
గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలకు అనుబంధంగా ఇటీవల జరిగిన ఆరిర్థిక నేరాలు వ్యాపారులను బెంబేలెత్తిస్తోంది. పచ్చిమగోదావరి జిల్లాకు చెందిన అజిత్‌రెడ్డి అనే మీసాలు కూడా రాని చిన్న యువకుడు 10–15 గ్రానైట్ ఫ్యాక్టరీలకు చెందిన యజమానులకు నెత్తిన టోపీ పెట్టి సుమారు రూ.2 కోట్ల విలువైన గ్రానైట్ మెటీరియల్ తీసుకెళ్లాడు. రెండు వారాల క్రితం చీమకుర్తికి చెందిన ఎన్.చంద్రశేఖర్ అనే వ్యక్తి దాదాపు 20 మందిని సినిమా ఫక్కీలో మోసం చేసి వారికి సంబంధించిన 8 పొక్లెయిన్‌లు, కారు, లక్షల కొద్దీ డబ్బు, బంగారు నగలు తీసుకొని కుటుంబంతో సహా ఉడాయించాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ సీబుక్‌ల సృష్టించి ఎంచక్కా దాదాపు రూ.30 కోట్ల విలువైన సంపదను కొల్లగొట్టారు.
చీటీపాటల మోసాలు అన్నీఇన్ని కావు
నమ్మకంగా పాటలోకి దించుతారు. వరుసగా రెండు మూడు పాటలు నిర్వహించి పాడుకున్న వారికి డబ్బులు సక్రమంగా చెల్లిస్తారు. జనంలో నమ్మకం కుదిరాక కనీసం రెండు కోట్లు చేతులు మారుతున్న సమయంలో చెప్పా పెట్టకుండా సర్దేస్తున్నారు. మెయిన్ రోడ్డులో ఒక పక్క బట్టల వ్యాపారం నడుపుతూ మరో పక్క చీటీపాటతో దాదాపు రూ.రెండు కోట్లతో మహిళ జంపై పలువురు కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇది మరిచిపోక ముందే నెల వ్యవధిలోనే పవర్ ఆఫీస్ వద్ద మరో మహిళ సుమారు కోటి రూపాయలకు సభ్యులకు టోపీ పెట్టింది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే చీమకుర్తిలో ఇటీవల పెరిగిన నేరప్రవృత్తికి స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. గ్రానైట్, దానికి అనుబంధంగా ఉన్న వ్యాపారాల కోసం దేశంలోని పలు రాష్ట్రాలు, తెలుగు రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి వేలాది మంది కార్మికులు వచ్చి నివాసం ఉండటంతో దొంగలు ఎవరో దొరలు ఎవరో గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది.