Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt handed over AP state treasury to private individuals1
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'

అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్‌ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను ప్రైవేట్‌ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్‌ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్‌ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్‌ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్‌ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్‌ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్‌ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్‌ ప్రక్రియ లేకుండా మైనింగ్‌ లీజులు, మైనింగ్‌ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్‌ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్‌ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్‌ఆర్‌ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ (డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ ఎకౌంట్‌) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్‌బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్‌ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్‌ లోపల.. బడ్జెట్‌ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్‌ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్‌సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్‌ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్‌ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చింది. అంటే.. డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి నేరుగా డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ), వేజ్‌ అండ్‌ మీన్స్‌ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్‌ అధికారి అయిన ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్‌ కుమార్, మరో ఐఏఎస్‌ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్‌ కుమార్‌ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్‌ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్‌ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్‌ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్‌ బాస్‌ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sakshi Editorial On Pahalgam Terror Attack2
ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌!

ఎట్టకేలకు పాకిస్తాన్‌ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్‌గామ్‌ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్‌ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్‌ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్‌ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్‌ మునీర్‌ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్‌ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్‌ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్‌ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్‌గామ్‌ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్‌ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్‌ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్‌ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్‌ ప్రస్థానానికి భిన్నంగా భారత్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్‌’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్‌ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్‌ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్‌ భారత్‌’ అనే అంబేడ్కర్‌ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్‌.వి. కామత్‌ ఒక్కరే తొలుత ‘హింద్‌’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్‌ భారత్‌ షల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్‌ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్‌’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్‌ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్‌ సైన్యాలు కశ్మీర్‌ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్‌’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్‌ హుస్సేన్‌ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్‌’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్‌ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్‌ ప్రధాని జుల్ఫికర్‌ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్‌ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్‌ ఆర్మీ చీఫ్‌. సిసలైన పాక్‌ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్‌ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్‌ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్‌ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్‌ భూభాగం, పాక్‌ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్‌ నది, గిల్గిట్‌ నది, హూంజా నది, స్వాట్‌ నది ముఖ్యమైనవి. కానీ భారత్‌ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్‌ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్‌ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్‌లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్‌ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్‌), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్‌), 6 శతుద్రి (సట్లెజ్‌), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్‌ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్‌లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్‌లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్‌ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్‌ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్‌ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్‌ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Massive Arrangements for Today BRS Silver Jubilee Celebrations at Warangal3
రజతోత్సవ రణన్నినాదం

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్‌ఎస్‌గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’ పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్‌ఎస్‌ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా. సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్‌ఎస్‌గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్‌ఎస్‌ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి. దేశం దృష్టిని ఆకర్షించేలా.. 14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా ప్రస్థానం సాగించిన బీఆర్‌ఎస్‌.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్‌ఎస్‌ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్‌.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్‌ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది. ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్‌.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్‌లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. 2024 మార్చి 31న తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్‌ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్‌.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రకటించే భవిష్యత్‌ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. విద్యుత్‌ వెలుగుల్లో సభా ప్రాంగణం అట్టహాసంగా ఏర్పాట్లు రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్‌పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్‌ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సభా వేదికపై 500 మంది.. సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్‌ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్‌ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు.సభ ఏర్పాట్లు ఇలా⇒ సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు ⇒ బీఆర్‌ఎస్‌ అంచనా ప్రకారం సభకు హాజరయ్యే ప్రజలు: సుమారు 10 లక్షలు ⇒ మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు ⇒ ప్రధాన వేదికపై సీటింగ్‌: 500 మందికి ⇒ సభా సమయం: సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు. ⇒ వాహనాల పార్కింగ్‌ : 1,059 ఎకరాలు ⇒ సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్‌ బాటిళ్లు: 10.80 లక్షలు ⇒ మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు ⇒ సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు ⇒ మెడికల్‌ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ⇒ ట్రాఫిక్, పార్కింగ్‌ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు

Weekly Horoscope In Telugu From 27-04-2025 To 03-05-20254
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.వృషభం...ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దికుని ముందుకు సాగుతారు. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, ఆకుపచ్చ రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.మిథునం....ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు. . దేవీఖడ్గమాల పఠించండి.కర్కాటకం...పట్టుదల, ధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్యసమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అందరిలోఉద్యోగాలలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, తెలుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.సింహం..కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కన్య....వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వివాహాది వేడుకల నిర్వహణకు సమాయత్తమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతోకలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.తుల.....ప్రముఖులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. గులాబీ, నీలం రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వృథా ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత పసుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.ధనుస్సు...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. బంధువులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. అయినా ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు కొంత ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. . సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వివాహాది వేడుకలపై దృష్టి సారిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. దత్తాత్రేయుని ఆరాధించండి.కుంభం...ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. వాహన, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. . దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.మీనం...ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కొత్త రుణాలు కోసం యత్నాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. బంధువులు, మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు. గృహం కొనుగోలు, నిర్మాణాలలో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక డీలాపడతారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శు¿¶ వార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు.. ఆంజనేయ దండకం పఠించండి.

US President Donald Trump calls Pahalgam terror attack bad one5
భారత్, పాక్‌లది వెయ్యేళ్ల పోరు! 

న్యూయార్క్‌: భారత్, పాక్‌ తమ ఉద్రిక్తతలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశాభావం వెలిబుచ్చారు. పోప్‌ అంత్యక్రియల నిమిత్తం వాటికన్‌ వెళ్తూ శుక్రవారం ఎయిర్‌ఫోర్స్‌వన్‌ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, పాక్‌కు ఇది కొత్తేమీ కాదు. కశ్మీర్‌ కోసం ఇరుదేశాల మధ్య వెయ్యేళ్లకు పైగా పోరు నడుస్తోంది. బహుశా 1,500 ఏళ్లుగా అనుకుంటా’’అని చెప్పుకొచ్చారు. అంతేగాక పహల్గాం ఉగ్ర దాడిలో 30 మందికి పైగా పర్యాటకులు మరణించారంటూ సంఖ్యను కూడా తప్పుగానే చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలను నెటిజన్లు ఒక రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. కశీ్మర్‌ ఘర్షణల గురించి ట్రంప్‌కు తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో అంటూ ఒకరు వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ‘‘అవునా! నేనింకా పాకిస్తాన్‌ 1947లో పురుడు పోసుకుందనే అపోహలో ఉన్నా’’అని మరొకరు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Sakshi Guest Column On TRS Party establishment by KCR in Telangana6
పార్టీ స్థాపనకు ఏడాది ముందు...

టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లక్ష్య శుద్ధితో విజయం సాధించాలని కేసీఆర్‌ పార్టీని స్థాపించారు. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్‌ రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలు. వీరికి ధన బలంతో పాటు ప్రసార మాధ్యమాల తోడు ఉంది. ఒక్క అంశం అనుకూలంగా లేని, చుట్టూ గాఢాంధకారం అలుముకున్న ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సాహసోపేతం. ఈ సాహసం ఒక్క కేసీఆర్‌కే చెల్లు.విస్తృత చర్చలు– సంతృప్తికర వివరణలుతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపనకు ఒక సంవత్సరం ముందు నుండే సన్నాహాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. పార్టీ పేరు, జెండా, కండువా 2000 లోనే నిర్ణయమైనాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన నాటి పరిస్థితుల సమీక్ష జరిగింది. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను, తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మల్చుకొని కేవలం 9 మాసాల కాలంలోనే ఎన్టీయార్‌ అధికారం చేపట్టిన విషయం ప్రస్తావనకొచ్చింది.పార్టీ పెట్టాలనుకునే విషయం తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటివరకు కాపాడుతున్న సంఘాలు... తెలంగాణ జన సభ, తెలంగాణ మహా సభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్‌ యూనియన్, తెలంగాణ లాయర్స్‌ అసోసియేషన్, తెలంగాణ టీచర్స్‌ ఫెడరేషన్, తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్, తెలంగాణ డెవలప్మెంట్‌ ఫోరం, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ జన సంఘటనలకు చెందిన కొందరు వచ్చి చర్చించడం, తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. మరికొందరిని కేసీఆరే స్వయంగా ఆహ్వానించి చర్చించారు. తెలంగాణలోని ప్రముఖుల వివరాలను సేకరించి, సందర్భానుసారంగా వారితోనూ కేసీఆర్‌ చర్చలు జరిపారు. వారిలో దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, వైస్‌ ఛాన్స్‌లర్లు నవనీత రావు, ఆర్వీయార్‌ చంద్రశేఖర్‌ రావు, జయశంకర్, జస్టిస్‌ సీతారాం రెడ్డి, గౌరవ నిఖిలేశ్వర్, ‘ప్రెస్‌ అకాడమీ’ పొత్తూరి వెంకటేశ్వరరావు, జస్టిస్‌ భాస్కర్‌ రావు, ప్రొఫెసర్లు మధుసూదన్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కోదండరాం రెడ్డి, సింహాద్రి, బియ్యాల జనార్ధన రావు, కంచె ఐలయ్య, కేశవరావు జాదవ్, జల సాధన సమితి దుశర్ల సత్యనారాయణ, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ప్రభాకర్, ప్రజ్ఞా మ్యాగజైన్‌ కెప్టెన్‌ పాండురంగ రెడ్డి తదితరులున్నారు. వీరిలో చాలామందితో సంప్రదింపులు జరిపి, వారి సూచనలు స్వీకరించారు.తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, కవులు, కళాకారులతో చర్చలు సాగిస్తూనే, మరొవైపు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తన వద్దకు వచ్చేవారి సందేహాలన్నిటికీ సవివరమైన, సంతృప్తికరమైన వివరణ ఇచ్చి, అప్పటివరకు అపనమ్మకం ఉన్నవారిలో సంపూర్ణ విశ్వాసం పెంచేవారు. వివిధ పార్టీలలో పనిచేసే నాయకులు ఎవరికి వారుగా కేసీఆర్‌ను కలిసి, చర్చించి, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత కలిసి పనిచేయడానికి సంసిద్ధత చెప్పేవారు. ఇటువంటి వారిలో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, దేశిని చిన్న మల్లయ్య, నాయిని నర్సింహారెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీకాంతరావు ‘తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది?’ అని సంశయం వ్యక్తం చేయగా, కేసీఆర్‌ ఇచ్చిన సుదీర్ఘ వివరణ అనంతరం, ‘తెలంగాణ సిద్ధించిందనే భావన మీ జవాబుతో నాకు కలిగింది. ఇక నుండి ఎప్పుడు ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేయను, వివరణ కోరను. తెలంగాణ సాకారం అయ్యేంత వరకు మీతోనే నా పయనం’ అని ఉద్విగ్నుడయ్యారు. స్టేట్‌ ఫైట్‌– స్ట్రీట్‌ ఫైట్‌ కాదు!వివిధ రాజకీయ పార్టీల నాయకుల, కార్యకర్తల తాకిడి రోజురోజుకు పెరుగుతూ రేయింబవళ్ళు చర్చోపచర్చలు సాగేవి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలు మధ్యరాత్రి వరకు జరిగేవి. కొన్ని సందర్భాల్లో తెల్లవారు వరకు ఈ చర్చలు జరిగేవి. ఒకరిద్దరు ఉన్నా, పది మంది ఉన్నా, వందలాది మందిలో ఉన్నా కేసీఆర్‌ నాలుగైదు గంటలు నిరాఘాటంగా తెలంగాణ ఉద్యమం సాగించే క్రమాన్ని సోదాహరణలతో సహా వివరించేవారు. వారు లేవనెత్తిన సంశయాలకు సంతృప్తికర సమాధానం ఇచ్చి, వచ్చిన వారిలో అత్యధికులను ఉద్యమ కార్యోన్ముఖులను చేసేవారు. ఒకట్రెండు సందర్భాల్లో ఉద్యమం ఆవేశభరితంగా, ఆందోళన పథంలో సాగాలని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా... ఇది స్టేట్‌ ఫైట్, స్ట్రీట్‌ ఫైట్‌ కాదనీ; లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలనీ; పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి భావవ్యాప్తిని సాగించి, ప్రజలను సమీకరించి, శక్తిగా మలిచి, ఎన్నికల్లో గెలిచి, గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే రాష్ట్రం సాధించాలనీ; ఒక ప్రాంతానికి న్యాయం జరగాలని చేసే ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రాంతం వారికి ఇబ్బందులు కలిగించడం వాంఛనీయం కాదనీ; తాను శాంతియుత పంథాలో మాత్రమే పయనిస్తాననీ కరాఖండిగా చెప్పేవారు. ఈ విధానం నచ్చని కొందరు మళ్ళీ వచ్చేవారు కాదు. సంకీర్ణాల్లో ఒక్క ఓటైనా విలువే!2000వ సంవత్సరంలో తెరాస పార్టీని స్థాపించవలెననే చర్చలు సాగుతున్న తరుణంలో దేశ రాజకీయ చిత్రపటం అనుకూలంగా ఉందా లేదా అనే సమీక్ష కూడా జరిగింది. కారణం గతంలోని చేదు అనుభవం. అయితే 1969 – 71 నాటి రాజకీయ పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ భారీ మెజారిటీతో ఏక పార్టీ పాలన సాగింది. తదనంతరం కొన్ని దశాబ్దాలు తక్కువ మెజారిటీతో ఏక పార్టీ పాలన, అటుపిమ్మట సంకీర్ణ ప్రభుత్వాల కాలం సాగుతోంది. సంకీర్ణ యుగం రాష్ట్రం సాధించుకోవడానికి అనువైనదిగా తేలింది. 1999వ సంవత్సరంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షను కోల్పోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభలో ఒక సభ్యుడి ఓటు కూడా అత్యంత కీలకంగా మారిన ఈ పరిణామం ప్రస్తావనకు వచ్చింది. అంటే సంకీర్ణాల యుగంలో మూడు, నాలుగు లోక్‌సభ స్థానాలతో కూడా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించవచ్చని తేలింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజా సమితిని 14 స్థానాల్లో పదింట గెలిపించారు. టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపి ప్రజా విశ్వాసాన్ని పొందగలిగితే, కచ్చితంగా లోక్‌సభకు చెప్పుకోదగిన సంఖ్యకు ప్రతినిధులను తెలంగాణ ప్రజలు తప్పక గెలిపిస్తారనే నమ్మకం కలిగింది. 10 మంది లోక్‌సభ సభ్యులున్నప్పటికీ 1971లో తెలంగాణ రాష్ట్రం సాధించబడక పోవడానికి బలమైన కారణం లోక్‌సభలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని సంఖ్యా బలం ఉండటమే. నాడు అధికార బలంతో కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజా సమితి సభ్యులను విలీనపర్చుకుంది. కానీ దానికి భిన్నంగా నేడు సంకీర్ణాలే శరణ్యం కాబట్టి పార్లమెంట్‌లో కనీస ప్రాతినిధ్యంతో ఒత్తిడి ద్వారా రాష్ట్రాన్ని సాధించవచ్చని నమ్మకం కుదిరింది. తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని సంపూర్ణ విశ్వాసం కలిగిన కేసీఆర్‌... శాసన సభ్యత్వానికి, డిప్యుటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రజలను ఆలోచింపజేసి, ఆశలు రేకెత్తించి విశ్వాస బీజాలు నాటారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ సహకారంతో జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్‌ 27న పార్టీ జెండా ఎగురవేయబడింది. పదవీ త్యాగంతో పార్టీ స్థాపించారు, ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రం సాధించారు. వ్యాసకర్త బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతసిరికొండ మధుసూదనాచారి (బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాల సందర్భంగా)

International law allows India to suspend Indus Waters Treaty with Pakistan7
Indus Waters Treaty: సస్పెన్షన్‌ సాధ్యమే 

పూర్తిస్థాయి యుద్ధాలు. కార్గిల్‌ వంటి దురాక్రమణలు. మరెన్నో లెక్కలేనన్ని దుశ్చర్యలు. గత 75 ఏళ్లలో భారత్‌పై పాకిస్తాన్‌ మతిలేని ఉన్మాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. అయినా సామాన్య పాకిస్తానీలను దృష్టిలో పెట్టుకుని సింధూ జల ఒప్పందాన్ని భారత్‌ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా పతనావస్థకు చేరినా దాయాదికి ఇక బుద్ధి రాబోదని పహల్గాం దాడితో తేలిపోయింది. దాంతో ఓపిక నశించి పాక్‌కు శాశ్వతంగా బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా సింధూ ఒప్పందాన్ని భారత్‌ సస్పెండ్‌ చేసింది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారత్‌కు లేదంటూ పాక్‌ గగ్గోలు పెడుతోంది. ఇది తమపై యుద్ధ ప్రకటనేనంటూ ఆక్రోశిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల మేరకు భారత్‌ చర్య సబబేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోని పక్షంలో సింధూ ఒప్పందానికి నూకలు చెల్లుతాయంటూ పాక్‌ను భారత్‌ ఎన్నోసార్లు హెచ్చరించింది. సస్పెన్షన్‌కు సంబంధించి ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. పైగా అందులోని ఆర్టికల్‌ 12 ప్రకారం ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం. అలాంటప్పుడు సస్పెన్షన్‌ నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. 1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని సీనియర్‌ అడ్వకేట్‌ నీరజ్‌ కిషన్‌ కౌల్‌ స్పష్టం చేశారు. ‘పరిస్థితుల్లో మౌలిక మార్పులు’చోటుచేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్‌ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్‌ పి.కె.సక్సేనా వివరించారు. ఈ విషయంలో ఇంకా మరెన్నో చర్యలు తీసుకునే అవకాశం కూడా భారత్‌కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 62 ఏమంటోంది...? ఒప్పందం కుదుర్చుకున్న నాటితో పోలిస్తే అనంతర కాలంలో పరిస్థితుల్లో తలెత్తే మౌలిక మార్పులకు సంబంధించిన నియమ నిబంధనలను వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్‌ 62లో పేర్కొంటుంది. అవి ఒప్పంద సమయంలో ఊహించనివై, ఆ మార్పుల ప్రభావం వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే ఒప్పందాన్ని సస్పెండ్‌ చేయవచ్చని అది చెబుతోంది. కనుక ఈ విషయంలో పాక్‌ చేసేదేమీ ఉండబోదని కౌల్‌ అన్నారు. ‘‘చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టినా లాభముండదు. నిరంతర ఉగ్ర దాడులు, ఫలితంగా భౌతిక, ఆర్థిక భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తలెత్తుతున్న ముప్పు ఒప్పంద పరిస్థితుల్లో మౌలిక మార్పులకు దారి తీసిందని భారత్‌ వాదించవచ్చు. సింధూ ఒప్పందం కుదిరిందే ఇరు దేశాల నడుమ స్నేహం, సద్భావనల స్ఫూర్తికి కార్యరూపమిచ్చేందుకు! పాక్‌ చర్యల నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’అని వివరించారు. పర్యావరణ సవాళ్లు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరముందని కొన్నేళ్లుగా భారత్‌ చెబుతోందని గుర్తు చేశారు. ఇవన్నీ చేయొచ్చు... → ఒప్పందం సస్పెన్షన్‌ వల్ల సింధూ బేసిన్‌ నదుల నీటి ప్రవాహ నెలవారీ డేటాను భారత్‌ ఇకపై పాక్‌తో పంచుకోవాల్సిన అవసరం లేదు. → నీటి ప్రవాహాల ఉమ్మడి తనిఖీకి పాక్‌ అధికారులకు భారత్‌లోకి ప్రవేశం నిరాకరించవచ్చు. → నీటి ప్రవాహాలను నియంత్రించడం వంటి కఠిన చర్యలకు కూడా తీసుకోవచ్చు. → సింధూతో పాటు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లె జ్‌ నదుల ప్రవాహాలను కాల్వల వంటివాటిలోకి మళ్లించవచ్చు. వాటిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరింత నీటిని నిల్వ చేయవచ్చు. ఇలాంటి చర్యలతో పాక్‌లోకి వాటి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. → సింధూ బేసిన్‌కు సంబంధించి భారత్, పాక్‌ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్‌గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్‌ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. → వేసవి దృష్ట్యా సింధూ బేసిన్‌లోని నదీ ప్రవాహాలను భారత్‌ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్‌ తదితరాల కోసం పాక్‌ అల్లాడటం ఖాయమే. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Punjab Kings vs Kolkata Knight Riders match called off due to rain8
‘ఈడెన్‌’ను ముంచెత్తిన వాన

కోల్‌కతా: ఈ మ్యాచ్‌ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్‌ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్‌ బ్యాటింగ్‌ వండర్‌గా సాగింది. మైదానంలో జోష్‌ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్‌ వరకే పరిమితమైంది. కోల్‌కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్‌కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్‌కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఒక ఓవర్లో వికెట్‌ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్‌ మ్యాచ్‌ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్‌తో మొదలైన పంజాబ్‌ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్‌ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్‌లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్‌ 50 స్కోరును దాటింది. హర్షిత్‌ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్‌ 11వ ఓవర్‌ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్‌ కొడితే... ప్రభ్‌సిమ్రన్‌ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్‌ ఓపెనింగ్‌ జోడీకి చెక్‌ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్‌కు యత్నించి వైభవ్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్‌ వేసిన 14వ ఓవర్‌ను పూర్తిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్‌ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ అవుట్‌ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్‌వెల్‌ (7), మార్కో యాన్సెన్‌ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (16 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్‌ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఏ మ్యాచ్‌ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) వైభవ్‌ (బి) రసెల్‌ 69; ప్రభ్‌సిమ్రన్‌ (సి) పావెల్‌ (బి) వైభవ్‌ 83; శ్రేయస్‌ నాటౌట్‌ 25; మ్యాక్స్‌వెల్‌ (బి) వరుణ్‌ 7; యాన్సెన్‌ (సి) వెంకటేశ్‌ (బి) వైభవ్‌ 3; ఇన్‌గ్లిస్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–34–2, చేతన్‌ సకారియా 3–0–39–0, హర్షిత్‌ రాణా 2–0–27–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–39–1, సునీల్‌ నరైన్‌ 4–0–35–0, రసెల్‌ 3–0–27–1. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ నాటౌట్‌ 1; నరైన్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్‌ కోల్పోకుండా) 7. బౌలింగ్‌: యాన్సెన్‌ 1–0–6–0. మాల్దీవుల్లో సన్‌రైజర్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్‌ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్‌రైజర్స్‌ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్‌... మిగిలిన ఐదు మ్యాచ్‌లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్‌’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్‌లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Sit Tricks in illegal case registered against liquor policy9
‘సిట్‌’ చిలకమ్మ.. కట్టుకథలు

సాక్షి, అమరావతి: టీడీపీ వీరవిధేయ సిట్‌ కట్టుకథలు అంతూ పొంతూ లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు నివేదికల పేరిట అవాస్తవాలు, అభూతకల్పనలతో కనికట్టు చేసేందుకు బరితెగిస్తోంది. ఆ కేసులో అక్రమంగా అరెస్టు చేస్తున్నవారి వాంగ్మూలాల పేరిట న్యాయస్థానానికి సమర్పిస్తున్న రిమాండ్‌ రిపోర్టులే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. మొన్న రాజ్‌ కేసిరెడ్డి.. నిన్న చాణక్య.. నేడు శ్రీధర్‌ రెడ్డి.. ఈ ముగ్గురి రిమాండ్‌ రిపోర్టులు పరిశీలిస్తే ప్రభుత్వ కుతంత్రం బయటపడుతోంది. అంతా కనికట్టే! వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. దీనికోసం టీడీపీ వీరవిధేయ అధికారులతో కూడిన సిట్‌ ద్వారా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ కేసులో న్యాయస్థానానికి సమర్పించిన వరుసగా మూడో రిమాండ్‌ రిపోర్ట్‌ కూడా సిట్‌ కుయుక్తులను బయటపెట్టింది. ఈ కేసులో ఆరో నిందితుడిగా శ్రీధర్‌ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో శనివారం హాజరు పరుస్తూ సిట్‌ రిమాండ్‌ రిపోర్టు సమర్పిoచింది. అంతకుముందు రాజ్‌ కేసిరెడ్డి, చాణక్య రిమాండు రిపోర్టుల్లో పేర్కొన్న అవాస్తవ ఆరోపణలు, కల్పిత అభియోగాలనే శ్రీధర్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్టులోనూ సిట్‌ పునరుద్ఘాటించింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ అవాస్తవాలను వండి వార్చింది. పైగా అవన్నీ కూడా శ్రీధర్‌రెడ్డి తమ విచారణలో వెల్లడించారని సిట్‌ పేర్కొనడం గమనార్హం. కానీ ఆ వాంగ్మూలంపై సంతకం చేసేందుకు శ్రీధర్‌ రెడ్డి నిరాకరించారని ఆ నివేదికలో పేర్కొంది. మధ్యవర్తుల సమక్షంలో తాము వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపింది. అంటే ఈ కేసులో కుట్ర క్రమం అంటూ సిట్‌ వివరించిన విషయాలేవీ వాస్తవం కాదని స్పష్టమైంది. వాటిని శ్రీధర్‌రెడ్డి చెప్పనే లేదని.. అందుకే ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారన్నది బయటపడింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేస్తూ సిట్‌ అధికారులే అవాస్తవాలు, అభూతకల్పలను వాంగ్మూలంగా నమోదు చేసేశారని స్పష్టమైంది. ఇదే కేసులో రాజ్‌ కేసిరెడ్డి, చాణక్య కూడా చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్‌ ఏకపక్షంగా వారి పేరిట వాంగ్మూలంగా నమోదు చేసింది. కానీ తాము సంతకాలు చేయలేదనే విషయాన్ని వారే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే సిట్‌ అధికారులు ఆ విషయాన్ని రిమాండ్‌ రిపోర్టులో తప్పనిసరై వెల్లడించారు. ఇంత బరి తెగింపా..! ఇంత నిర్భీతిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్‌ దర్యాప్తు పేరుతో అటు న్యాయస్థానాలను ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అధికారులు యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. ఆ అబద్ధపు వాంగ్మూలాలను టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడమే సిట్‌ లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. ఈ కేసు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తుంది కేవలం రెడ్‌ బుక్‌ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది.

Direct tax mop up for 2024-25 fiscal misses target owing to higher refunds10
ప్రత్యక్ష పన్నులపై రిఫండ్‌ ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ: భారీ స్థాయిలో రిఫండ్‌లు జారీ చేయడంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకున్న లక్ష్యం స్థాయిలో వసూలు కాలేదు. 2024–25లో నికరంగా రూ. 22.37 లక్షల కోట్లు టార్గెట్‌గా పెట్టుకోగా నికరంగా రూ. 22.26 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13.57 శాతం అధికమే అయినప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మాత్రం చేరలేదు. గతేడాది జూలై నాటి బడ్జెట్‌లో రూ. 22,07,000 కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకోగా, దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 22,37,000 కోట్లకు సవరించారు. సాధారణంగా కార్పొరేట్‌ ట్యాక్సులు, సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ), నాన్‌–కార్పొరేట్‌ ట్యాక్సులు (గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను) మొదలైనవి ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) మొదలైన వర్గాలు కట్టే పన్నులు నాన్‌–కార్పొరేట్‌ ట్యాక్సుల పరిధిలోకి వస్తాయి. స్థూల వసూళ్లు 16 శాతం అప్‌.. అధికారిక డేటా ప్రకారం మార్చి 31తో ముగిసిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (రిఫండ్లకు ముందు) 15.59 శాతం పెరిగి రూ. 27.02 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 23.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక, రిఫండ్ల జారీ తర్వాత నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ప్రొవిజనల్‌ గణాంకాలు రూ. 22.26 లక్షల కోట్లుగా నమోదైయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 19.60 లక్షల కోట్లతో పోలిస్తే 13.57 శాతం పెరిగాయి. – ఇవన్నీ ప్రొవిజనల్‌ గణాంకాలు మాత్రమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది దశ రీకన్సిలియేషన్, సర్దుబాట్లు జరుగుతున్నందున నికర వసూళ్లు మరికాస్త పెరగొచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు.. → ఎస్‌టీటీ నుంచి రెవెన్యూ రూ.34,192 కోట్ల నుంచి రూ. 53,296 కోట్లకు పెరిగింది. → ప్రొవిజనల్‌ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు, జులై బడ్జెట్‌ లక్ష్యంతో పోలిస్తే (రూ. 22.07 లక్షల కోట్లు) 100.78 శాతం పెరగ్గా, ఫిబ్రవరిలో సవరించిన అంచనాలతో పోలిస్తే (రూ. 22.37 లక్షల కోట్లు) 99.51 శాతం పెరిగాయి. → 2024–25లో ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అత్యధిక స్థాయిలో రూ. 4,76,743 కోట్లు రిఫండ్‌ జారీ చేసింది. 2023–24లో నమోదైన రూ. 3,78,255 కోట్లతో పోలిస్తే ఇది 26.04 శాతం అధికం. → రికార్డు స్థాయిలో రూ. 4.76 లక్షల కోట్లు రిఫండ్లు జారీ చేసినప్పటికీ స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్లో నిర్దేశించుకున్న రూ. 22.37 లక్షల కోట్ల స్థాయిని మించి నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిసలైన క్లెయిమ్‌లను పారదర్శమైన, సముచితమైన విధంగా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని ట్యాక్స్‌పేయర్లకు ఇచ్చిన హామీకి డిపార్టుమెంట్‌ కట్టుబడి ఉండటం ఇందుకు కారణమని వివరించారు. → సమీక్షాకాలంలో నికర కార్పొరేట్‌ ట్యాక్సుల వసూళ్లు (ప్రొవిజనల్‌) 8.30 శాతం పెరిగి రూ. 9,86,719 కోట్లకు చేరాయి. స్థూల కార్పొరేట్‌ వసూళ్లు 12.41 శాతం వృద్ధితో రూ. 12,72,516 కోట్లుగా నమోదయ్యాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement