-
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం,హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: బ.పంచమి ఉ.7.08 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తర సా.5.26 వరకు తదుపరి హస్త,వర్జ్యం: రా.2.43 నుండి 4.27 వరకు,దుర్ముహూర్తం: సా.4.20 నుండి 5.08 వరకు, అమృత ఘడియలు: ఉ.9.30 నుండి 11.01 వరకు.సూర్యోదయం : 6.39సూర్యాస్తమయం : 5.43రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం: కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం: కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మిథునం: ఆర్థిక ఇబ్బందులు. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.కర్కాటకం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.సింహం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కన్య: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.తుల: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.వృశ్చికం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. స్థిరాస్తివృద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.మకరం: మిత్రులతో కలహాలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.కుంభం: కష్టానికి ఫలితం కనిపించదు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.మీనం: కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బంధువుల కలయిక. స్థిరాస్తిపై ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.. -
ఇంటర్నెట్ యూజర్లు 90 కోట్లు
న్యూఢిల్లీ: భారతీయ భాషల్లో డిజిటల్ కంటెంట్‌కు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది 90 కోట్ల స్థాయిని దాటనుంది. గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి చెందనుంది. 2024లో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 88.6 కోట్లుగా ఉంది. ఐఏఎంఏఐ, కాంటార్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు సగం మంది గ్రామీణ భారతదేశంలో ఉన్నారు. వీరి సంఖ్య 48.8 కోట్లుగా ఉంది. దాదాపు 98 శాతం యూజర్లు భారతీయ భాషల్లో కంటెంట్‌ను వినియోగిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కంటెంట్ లభ్యత, డిమాండ్ అధికంగా ఉంది. పట్టణ ప్రాంత యూజర్లలో సగం మంది (సుమారు 57 శాతం) ప్రాంతీయ భాషల్లో కంటెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ వినియోగంలో లింగ అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని, ప్రస్తుతం మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 47 శాతం మంది మహిళలు ఉంటున్నారని నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నప్పటికీ, విస్తృతి వేగం నెమ్మదిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వృద్ధి రేటు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోంది. స్మార్ట్‌టీవీలు, స్మార్ట్ స్పీకర్లలాంటి సాంప్రదాయేతర సాధనాల వినియోగంలో పట్టణ ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. 2023తో పోలిస్తే 2024లో ఇది 54 శాతం పెరిగింది. ఓటీటీ వీడియోలు, మ్యూజిక్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా మొదలైన వాటి వినియోగంలో పట్టణ యూజర్లను మించి గ్రామీణ యూజర్లు ముందుంటున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఈ–కామర్స్, ఆన్లైన్ చదువులు తదితర అంశాల్లో పట్టణ ప్రాంతాల వారు ముందంజలో ఉంటున్నారు. -
మహా కుంభమేళా.. ‘కొబ్బరి’ ఆనంద హేల
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు తరలివస్తున్న మహా కుంభమేళా (Maha Kubh Mela) గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు (Coconut Market) పెద్ద వరమే అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj) కేంద్రంగా జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు వస్తున్న భక్తులు నదీ మాతకు అర్పించేందుకు కురిడీ కొబ్బరిని విరివిగా వినియోగిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరిగి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తయ్యే కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. మహా కుంభమేళా కారణంగా ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న ఈ కురిడీ రకం ధర అనూహ్యంగా పెరిగింది. కొబ్బరి మార్కెట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట (Ambajipeta) కొబ్బరి మార్కెట్లో కురిడీ కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంది. పాతకాయలో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.20 వేలు వరకు పలుకుతోంది. దీనిలో గటగట రకం రూ.17,500 వరకూ ఉండగా, కొత్త కాయలో గండేరా రకం రూ.19 వేలు, గటగటా రకం రూ.16 వేలుగా ఉంది. కురిడీ కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం వెయ్యి కాయలకు రూ.20 వేల ధర పలకడం ఇదే తొలిసారి. 2016లో వచ్చిన రూ.18 వేలు మాత్రమే ఇప్పటి వరకూ గరిష్ట ధరగా ఉంది. ఈ రికార్డుకు ఇప్పుడు బ్రేక్ పడింది.ఉత్తరాది రాష్ట్రాల్లో నదీమ తల్లికి భక్తులు నేరుగా కొబ్బరి కాయలు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళా కారణంగా కురిడీ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు కురిడీ కొబ్బరి అధికంగా తయారయ్యే తమిళనాడు, కేరళలో సైతం దీని లభ్యత తగ్గింది. ఈ రెండు కారణాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కురిడీ ఎగుమతి పెరిగింది. రోజుకు రూ.8 లక్షలు విలువ చేసే కురిడీ కొబ్బరి 20కి పైగా లారీల్లో ఎగుమతి అవుతోందని అంచనా. సాధారణ రోజుల్లో జరిగే ఎగుమతులకు కుంభమేళా ఎగుమతులు కూడా తోడవడం కురిడీ ధర పెరుగుదలకు కారణమైందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి.ఎనిమిదేళ్ల తరువాత మంచి ధర2016లో గండేరా రకానికి రూ.18 వేల ధర వచ్చింది. ఎనిమిదేళ్ల తరువాత కురిడీకి రూ.20 వేలు వచ్చింది. తమిళనాడు నుంచి ఉత్తరాదికి కురిడీ ఎగుమతులు తగ్గడం, కుంభమేళా కారణంగా డిమాండ్ వచ్చింది. గతం కన్నా మన ప్రాంతం నుంచి కూడా ఎగుమతులు తగ్గాయి. కానీ ధర పెరగడం వల్ల కురిడీకి మార్కెట్లో ఊహించని ధర వచ్చింది.– అప్పన శ్యామ్, కురిడీ వ్యాపారి, అంబాజీపేట -
వైద్యం.. భారం
⇒ అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన లీలావతి కాన్పు కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి వెళ్లింది. అక్కడ ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు పడుకుని ఉండటంతో ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు వెళ్లింది. నార్మల్ డెలివరీ అయింది కానీ.. రూ.30 వేలు బిల్లు వేయడంతో ఆ కుటుంబం విస్తుపోయింది.⇒ అనంతపురం హౌసింగ్‌బోర్డుకు చెందిన రంగనాయకులు అనే 45 ఏళ్ల వ్యక్తి ఛాతిలో నొప్పి రావడంతో ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లారు. గుండె కవాటాలు మూసుకుపోయాయని, స్టంటు వేసి రూ.2.70 లక్షల బిల్లు వేయడంతో రంగనాయకులు హతాశులయ్యారు. ⇒ ఈ రెండు సమస్యలే కాదు క్యాన్సర్, ప్రమాద బాధితుల వైద్య ఖర్చులు కూడా భారీగా ఉండడంతో జనం హడలెత్తిపోతున్నారు.సాక్షి ప్రతినిధి, అనంతపురం: సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఆ నాలుగు రకాల జబ్బులకు భయపడిపోతున్నారు. వైద్యం ఖరీదుతో కూడుకుని ఉండటమే ఇందుకు కారణం. గుండె, క్యాన్సర్, కాన్పులు, ప్రమాద బాధితులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. సంపన్నులు ఎలాగోలా వైద్యం చేయించుకుంటున్నారు. పేదల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. రూ.5 లక్ష ల్లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందేవి. గడిచిన ఐదేళ్లూ ఉచిత వైద్యసేవలు సజావుగా అందాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో ఒడుదుడుకులు మొదలయ్యాయి. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యమందించేందుకు నిరాకరిస్తున్నారు. ఇందుకు కారణం ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో రాకపోవడమేనని తెలుస్తోంది. విధిలేని పరిస్థితుల్లో అప్పోసప్పో చేసి ప్రైవేట్‌గా చికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. గుండెజబ్బులతో దడ గుండె జబ్బులు సామాన్యులను భయపెడుతున్నాయి. ఏటా 20 వేల వరకు గుండెపోటు కేసులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోVýæ్యశ్రీ సేవలు లేవంటున్నారంటే ఇక దారుణ పరిస్థితులే. ఒక స్టంట్ వేస్తే రూ.2 లక్షల వరకు అవుతోంది. దీంతో జనం బెంబేలేత్తుతున్నారు.క్యాన్సర్ కేసులతో ఆందోళన ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ కేసులు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఎక్కువ. చాలామంది హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. సర్జరీలు, కీమో థెరపీలకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రమాద బాధితులకు భరోసా లేదు అనంతపురం జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాద కేసులు నమోదవుతున్నాయి. పాలీ ట్రామా కేసుల చికిత్సకు భారీ వ్యయం అవుతుంది. సర్వజన ఆస్పత్రిలో లోడు పెరగడంతో చెయ్యలేకపోతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు ఒక్కోసారి సర్కారు నుంచి నిధులు రావడం లేదని చేతులెత్తేస్తున్నాయి. దీంతో రోజురోజుకూ సామాన్యుల్లో ఆందోళన పెరుగుతోంది. ఖరీదైన జబ్బులకు చిక్కే క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు, గుండె ఆపరేషన్లు లాంటి ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే పేదలకు చిక్కులు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలందించడం లేదు. ఇటీవల మా బంధువుల అబ్బాయి రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసినప్పటికీ.. అదనపు ఖర్చుల కింద రూ.వేలల్లో డబ్బు వసూలు చేశారు. – లీలావతి, బీటీపీ, గుమ్మఘట్ట మండలంకాన్పు జరిగితే గండం గడిచినట్టేఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 55వేల వరకూ కాన్పులు (డెలివరీలు) జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లు ఆరోగ్యశ్రీలో ఇబ్బంది లేకుండా నార్మల్, సిజేరియన్ డెలివరీలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవు. ప్రైవేటు ఆస్పత్రులు నిధుల సమస్యతో కేసులు తీసుకోవడం లేదు. దీంతో నార్మల్ డెలివరీకి రూ.30 వేలు, సిజేరియన్‌కు రూ.50 వేలు చెల్లించుకోవాల్సి వస్తోంది. -
ఇన్‌కం.. లేదు నమ్మకం!
దేశంలో 24 శాతం మంది మాత్రమే 2025లో తమ కుటుంబ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. అదే విధంగా 48 శాతం మంది తమ సంపాదన ఈ ఏడాది 25 శాతం వరకూ లేదా అంతకన్నా ఎక్కువ తగ్గొచ్చని ఆందోళన చెందుతున్నారు. ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు తేలింది. ఈ సర్వేలో 16,111 మంది పాల్గొన్నారు. సేవింగ్స్ గురించి ప్రశ్నించగా.. 27 శాతం మంది మాత్రమే ఈ ఏడాది తమ సేవింగ్స్ పెరుగుతాయని చెబితే.. 45 శాతం మంది 25 శాతం మేర తగ్గుతాయని చెప్పారు. ‘దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొనిఉన్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఆయా వర్గాల వారికి ఉపశమనం కలిగించేలా తగు చర్యలు తీసుకోవాలి’ అని లోకల్ సర్కిల్స్ నివేదిక పేర్కొంది. ప్రజల ఆదాయంలో వృద్ధి లేకపోవడం.. అలాగే ధరల పెరుగుదల వల్ల 2024లో నిత్యావసరాలుకాని వస్తువుల కొనుగోలు తగ్గిందని.. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లలో తాము ఆశించినంత వృద్ధి కనపడలేదని రిటైలర్లు పేర్కొన్నట్లు తెలిపింది. ఈ ఏడాది కూడా ధరలు మరింత పెరుగుతాయని ప్రజలు నమ్ముతున్నట్లు తన నివేదికలో తెలిపింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
టిక్ నో టాక్
స్వల్పనిడివి వీడియో మెసెంజింగ్ యాప్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి స్మార్ట్ఫోన్లలో స్థానం సంపాదించిన టిక్‌టాక్ యాప్ ఇప్పుడు అమెరికాలో అదృశ్యం కానుంది. ఆదివారం (జనవరి 19వ తేదీ) నుంచి అమెరికాలో యాప్ సేవలు దాదాపు ఆగిపోయినట్లేనని టిక్‌టాక్ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రిదాటాక ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ యూజర్ల డేటా దాని మాతృ సంస్థ అయిన ‘బైట్‌డ్యాన్స్’ద్వారా చైనా వామపక్ష ప్రభుత్వానికి చేరుతోందని అమెరికా ప్రధాన ఆరోపణ. చైనాతో బంధం తెంచుకుని, టిక్‌టాక్‌ను ఆదివారంకల్లా అమెరికా కేంద్రంగా పనిచేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా దేశ సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసినప్పటికీ బైట్‌డ్యాన్స్ ఈ దిశగా అడుగులువేయలేదు. దీంతో అమెరికాలో టిక్‌టాక్ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. వినోదం పంచిన యాప్ తర్వాత దేశభద్రత అంశంతో ముడిపడి చివరకు అగ్రరాజ్యాన్నే వదిలేస్తున్న వైనం ఆద్యంతం ఆసక్తిదాయకం. అగ్రస్థానం నుంచి అదృశ్యం దాకా.. చైనా వ్యాపారి ఝాంగ్ యిమిన్ 2012లో బైట్‌డ్యాన్స్ అనే సంస్థను స్థాపించారు. తర్వాత రెండేళ్లకు అలెక్స్ ఝూ అనే వ్యాపారి Musical.ly అనే స్టార్టప్‌ను రూపొందించాడు. వీడియోలకు తగ్గట్లు పెదాలు కదిలిస్తూ వీడియో తీసి అప్లోడ్ చేసే యాప్‌గా దీనిని అందుబాటులోకి తెచ్చాడు. ఇది 2015 జూలైకల్లా ఆపిల్ యాప్‌స్టోర్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ Musical.ly ను బైట్‌డ్యాన్స్ ఒక బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసి సొంత ‘డౌయిన్’యాప్‌లో విలీనంచేసి విదేశీ యూజర్ల కోసం కొత్తగా టిక్‌టాక్ యాప్‌ను తెచ్చింది. ర్యాపర్ లిల్ నాస్ ‘ఓల్డ్ టౌన్ రోడ్’పాటకు చేసిన డ్యాన్స్ వీడియో టిక్‌టాక్‌లో పాపులర్ అవడంతో అందరూ టిక్‌టాక్ బాట పట్టారు. పాపులర్ డ్యాన్స్ స్టెప్పులు, వంటల విశేషాలు, బ్యూటీ టిప్స్, పాటలకు తగ్గ పార్ఫార్మెన్స్ ఛాలెంజ్‌లను ప్రోత్సహిస్తూ సాగే వీడియోలతో టిక్‌టాక్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా నంబర్‌వన్ షార్ట్‌వీడియో మెసేజింగ్ యాప్‌గా అవతరించింది. చైనా వ్యతిరేకత అస్సలు కనపడదు ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశం ఒక పాటగానో, డ్యాన్స్గానో టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైనా చైనా వ్యతిరేక వీడియోలు మాత్రం అస్సలు కనబడవు. 1989 తియాన్మెన్స్కే్వర్ ఉద్యమం, నాటి ఊచకోత, టిబెటన్ల స్వాతంత్య్రపోరాటం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమంపైనా అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు కనిపించినా టిక్‌టాక్‌లో మాత్రం అలాంటివేమీ దర్శనమివ్వలేదు. కానీ ట్రంప్‌కు మద్దతు పలుకుతూ పెట్టిన #trump2020 హ్యాష్‌ట్యాగ్‌తో వచ్చిన పోస్టులు మాత్రం కోట్లాదిగా షేర్ అయ్యాయి. 2019లో అమెరికాలో తొలి ఆందోళన సెన్సార్టవర్ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. టిక్‌టాక్‌కు ప్రస్తుతం అమెరికాలో 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే అమెరికా సైన్యానికి చెందిన సమాచారాన్ని టిక్‌టాక్ తన మాతృసంస్థకు చేరవేస్తోందని 2019లో తొలిసారిగా ఆందోళన వ్యక్తమైంది. దీంత అన్ని స్మార్ట్ఫోన్లలో టిక్‌టాక్ యాప్ తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచి్చంది. అయినాసరే విపరీతంగా యాప్‌కు బానిసలుగా మార్చేసి అమెరికా చిన్నారుల పరిరక్షణా చట్టాలను టిక్‌టాక్ ఉల్లంఘిస్తోందని 2020 లో ప్రైవసీ సంస్థలు ఆందోళనకు దిగాయి. దీంతో తాము అమెరికన్లకు దగ్గరి వాళ్లమని మభ్యపెట్టేందుకు డిస్నీ ఉన్నతాధికారి కెవిన్ మేయర్‌కు టిక్‌టాక్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకుంది. భారత్‌లో బ్యాన్ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఘర్షణ తర్వాత జాతీయభద్రత ప్రమాదంలో పడిందని పేర్కొంటూ భారత్ టిక్‌టాక్‌ను 2020 జూలైలో నిషేధించింది. కోవిడ్ సంక్షోభంలో వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించని చైనాకు బుద్ధిచెప్పేందుకైనా టిక్‌టాక్‌ను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ సైతం నిషేధాన్ని సమరి్థంచారు. 90 రోజుల్లోపు అమెరికా నుంచి వైదొలిగితే మంచిదని 2020 ఆగస్ట్‌లో ట్రంప్ ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీచేశారు. తర్వాత టిక్‌టాక్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్‌మార్ట్ ప్రయతి్నంచినా అది కార్యరూపం దాల్చలేదు. బైడెన్ వచ్చాక.. 2021 ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడు బైడెన్ టిక్‌టాక్‌పై నిషేధానికి ట్రంప్ ఇచి్చన ఉత్తర్వులు అమలుకాకుండా మూలనపడేశారు. అయితే బక్కచిక్కిపోయేలా అతి ఆహార నియమాల వంటి తప్పుడు సూచనలు ఇచ్చే వీడియోల వరద టిక్‌టాక్‌లో ఎక్కువైందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక నివేదిక ఇవ్వడంతో టిక్‌టాక్‌పై బైడెన్ మళ్లీ దృష్టిసారించారు. అమెరికాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుంటూనే ఇన్‌స్టా గ్రామ్ను వెనక్కినెట్టి ప్రపంచంలో అత్యధిక డౌన్లోడ్లు జరిగిన యాప్‌గా టిక్‌టాక్ చరిత్ర సృష్టించింది. వంద కోట్ల మంది నెలకు తమ యాప్ వాడుతున్నారని ప్రకటించింది. మరోవైపు అమెరికా యూజర్ల డేటా భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో నష్టపరిహార చర్యలకు టిక్‌టాక్ దిగింది. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ పర్యవేక్షణలో ఉండే సర్వర్లకు డేటాను బదిలీచేస్తున్నట్లు ప్రకటించింది. రంగంలోకి ఎఫ్‌బీఐ జాతీయ భద్రత కీలకాంశం కావడంతో అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. అమెరికన్లను ప్రభావితం చేసేలా యాప్ అల్గారిథమ్‌ను చైనా మాతృసంస్థ మార్చేస్తోందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే 2022 డిసెంబర్లో ఆరోపించారు. 30 రోజుల్లోపు అన్ని ప్రభుత్వం జారీచేసిన స్మార్ట్ఫోన్ల నుంచి యాప్‌ను తీసేయాలని శ్వేతసౌధం 2023 ఫిబ్రవరిలో ఆదేశాలిచి్చంది. యాప్ నిబద్ధతపై టిక్‌టాక్ సీఈవో షూఝీ ఛెవ్ను మార్చిలో అమెరికా పార్లమెంటరీ కమిటీ గంటలతరబడి ప్రశ్నించింది. నిషేధానికి తొలి అడుగు అమెరికన్ సంస్థకు టిక్‌టాక్‌ను అమ్మాలని లేదంటే నిషేధిస్తామని 2024 మార్చిలో అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుపై 2024 ఏప్రిల్‌లో అధ్యక్షుడు బైడెన్ సంతకంచేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై బైట్‌డ్యాన్స్ కోర్టును ఆశ్రయించింది. మిగతా యాప్‌లను వదిలేసి మా సంస్థపైనే ప్రభుత్వం కక్షగట్టిందని వాదించింది. అయితే నిషేధాన్ని సమరి్థస్తూ ఫెడరల్ అప్పీళ్ల కోర్టు 2024 డిసెంబర్ ఆరున తీర్పు చెప్పింది. మాట మార్చిన ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిషేధిస్తానని ప్రతిజ్ఞచేసిన ట్రంప్ ఆ తర్వాత పదవి నుంచి దిగిపో యాక మాటమార్చారు. 2024 జూన్‌లో మళ్లీ టిక్‌టాక్ ఖాతా తెరచి ఈ యాప్‌కు మద్దతు పలికారు. టిక్‌టాక్‌ను నిషేధిస్తే ఫేస్‌బుక్‌కు లాభం చేకూరుతుందని ట్రంప్ వింత వాదన చేశారు. టిక్‌టాక్‌పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది. పొలోమంటూ రెడ్‌నోట్ డౌన్లోడ్ టిక్‌టాక్ కనుమరుగు దాదాపు ఖాయంకావడంతో ఇప్పటికే ఇలాంటి వీడియోలకు బానిసలైన అమెరికన్లు వెంటనే రెడ్‌నోట్ యాప్‌కు జై కొట్టారు. దీంతో అమెరికాలో అత్యంత ఎక్కువ డౌన్లోడ్లు ఉన్న యాప్‌గా రెడ్‌నోట్ రికార్డు సృష్టించింది. అయితే రెడ్‌నోట్ కూడా చైనా యాప్ కావడం విశేషం. లైఫ్‌స్టైల్ సోషల్‌మీడియా యాప్ అయిన రెడ్నోట్లోనూ చిన్నపాటి వీడియోలు చేయొచ్చు. ఫొటోలు, సందేశాలు పంపొచ్చు. లైవ్ స్ట్రీమింగ్, షాపింగ్ చేసుకోవచ్చు. గ్జియోహోంన్షు యాప్‌నే సులభంగా రెడ్నోట్గా పిలుచుకుంటారు. దీనిని ప్రస్తుతం 30 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. బద్ధశత్రువుల దేశాలకు చెందిన పౌరులు ఒకే ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించడం వింతే. ఇన్‌స్టా గ్రామ్, ‘ఎక్స్’యాప్‌లను చైనీయులు వాడలేరు. చైనా ఇంటర్నెట్లో వీటిని అక్కడి ఫైర్‌వాల్స్ అడ్డుకుంటాయి. మరోవైపు చైనా యూజర్లు టిక్‌టాక్‌ను వాడలేరు. వీళ్లనూ బుట్టలో వేసుకునేందుకు వాళ్ల కోసం చైనాలోనే డౌయిన్ అనే యాప్‌ను బైట్‌డ్యాన్స్ అందుబాటులో ఉంచింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదకొండేళ్లుగా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు విడుదల చేసిందని, ఈ దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఉండే కులసంఘాలు, ఇతర సంస్థలతో కలసి పనిచేస్తామన్నారు. శనివారం కిషన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించే అవకాశముందని వస్తున్న వార్తలపై స్పందించాలని విలేకరులు కోరినపుడు.. కేంద్ర మంత్రిగా ప్రజలకు, తన శాఖలో పనిచేస్తున్న వారికి సేవ చేయాలని అనుకుంటున్నానని ఆయన బదులిచ్చారు. తన బొగ్గు, గనుల శాఖ పరిధిలో 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి రూ.కోటి బీమా పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించే అవకాశం ఉందనే ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిస్తూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే వారికి ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని నిబంధన లేదు. బీజేపీ అధ్యక్ష పదవికి రెండు సార్లు క్రియాశీల సభ్యుడు అయి ఉండాలి. అయితే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. ఆ నిబంధన ఆయనకు వర్తించదు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌ను నేతల ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తారు. నామినేషన్ పద్ధతిలో వారం తర్వాత కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని తెలిపారు. మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగనున్న ఎన్నికల్లో అన్నింటిలోనూ గెలుస్తామనే నమ్మకం తమకుందన్నారు. ‘రాష్ట్రంలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు కదా’అన్న ప్రశ్నకు.. ఎన్నికలు ఉంటాయంటున్న కేటీఆర్, సుప్రీంకోర్టు జడ్జి కూడా అయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. సినీహీరో చిరంజీవి బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నకు.. ‘నా ఆహ్వానం మేరకు ఇటీవల ఆయన ఢిల్లీకి వచ్చారు, అనేక మంది సినీ ప్రముఖులకు బీజేపీతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. కొందరు పార్టీలో చేరారు. మంత్రులు అయ్యారు. కొందరు పార్టీకి ప్రచారం చేశారు. ఇకపై ఏవైనా ఫంక్షన్లకు నేను పిలిస్తే వస్తారంటే నాగార్జున, వెంకటేశ్, ఇతర హీరోలను కూడా పిలుస్తాను’అని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ఉచితాలు వద్దని ఎక్కడా చెప్పలేదు.. ‘బీజేపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు, ఉచితాల (ఫ్రీ బీస్)కు వ్యతిరేకం కాదు. ఉచితాలు వద్దు అని బీజేపీ ఎక్కడా చెప్పలేదు. రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని హామీలివ్వాలి’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించాం. తెలంగాణలో టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రీజినల్ రింగ్ రోడ్ నేనే తెచ్చా. ప్రధానిని ఒప్పించి మహబూబ్‌నగర్ సభలో పసుపు బోర్డు ప్రకటన నేనే చేయించా. మూసీ సుందరీకరణకు కేంద్రం నిధులను నిబంధనల మేరకు కచ్చితంగా ఇస్తాం. హైదరాబాద్ మెట్రోకి రూ.1,250 కోట్లు కేంద్రం ఇచ్చింది. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కచ్చితంగా సహకరిస్తాం. రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కేంద్రం డబ్బులు ఇచ్చింది. అలైన్మెంట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే’అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘తెలంగాణలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఎంఐఎం సహకరిస్తోంది. బీజేపీపై విషం చిమ్మడమే ఎంఐఎం నేతలు పనిగా పెట్టుకున్నారు. దేశంలో ముస్లింనేతగా ఎదగాలన్న ఆశతో ఆ పార్టీనేత అసదుద్దీన్ ఒవైసీ పిట్టల దొరగా మారారు’అని విమర్శించారు. -
నాడు అర్హులు.. నేడు అనర్హులట!
అనంతపురం : పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులపట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ నాటికి వారు వయసు రీత్యా అర్హులే. కానీ.. కోర్టు కేసు, ఎన్నికల కారణంగా గతంలో దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం« అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఐదు నెలలపాటు కాలయాపన చేసింది. ఇప్పుడు వయసు మీరిపోయిందంటూ అనేకమందిని ఇళ్లకు పంపేస్తోంది.వారు అర్హులైనప్పటికీ, వారి తప్పేమీ లేకపోయినప్పటికీ నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదేమిటని సెలక్షన్ అధికారులను అడిగితే.. తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్మెంట్ బోర్డుకు విన్నవించుకోవాలని సూచిస్తున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్ఐ, 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులకు 2023 జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. తమ సర్వీసును సైతం పరిగణనలోకి తీసుకోవాలని హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) బ్రేక్‌పడింది. అనంతరం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.అనంతరం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదునెలల పాటు ఈ పోస్టుల భర్తీని పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్లైన్లో ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండునెలల క్రితం ప్రకటించింది. అప్పట్నుంచి కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన పలువురు అభ్యర్థులను వయసు మీరిందంటూ అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.అన్యాయమైన నిర్ణయందేహదారుఢ్య పరీక్షలు జనవరి 17న నిర్వహిస్తున్నట్లు హాల్‌టికెట్ ఇచ్చారు. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియానికి వెళ్లాక.. ‘మీకు వయసు అయిపోయింది. అర్హతలేద’ని చెప్పారు. నోటిఫికేషన్ జారీ సమయానికి వయసును పరిగణనలోకి తీసుకోవాలిగానీ అందుకు విరుద్ధంగా తీసుకుంటున్నారు. ఈ పరీక్షలకు నెలన్నర నుంచి సిద్ధమయ్యాను. తీరా ఇప్పుడు అర్హతలేదనడంతో కానిస్టేబుల్ కల చెదిరిపోతోంది. నాలాగ ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 100 మంది వరకు అన్యాయానికి గురయ్యారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మా విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలి. – ఎన్. చంద్రశేఖర్, కానిస్టేబుల్ అభ్యర్థి, అనంతపురం -
పేరు మార్పు, ఖాతా బదిలీ చందాదారులే చేయొచ్చు
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు శుభవార్త చెప్పింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్‌లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్ఓకు క్లెయిమ్‌ను సమర్పించవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సేవలను శనివారం పరిచయం చేశారు. ‘2017 అక్టోబర్ 1 తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) పొందిన సభ్యులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. 2017 అక్టోబర్ 1 కంటే ముందు యూఏఎన్ జారీ అయితే ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా యాజమాన్యాలు ఈ వివరాలను సరిచేయవచ్చు. అటువంటి సందర్భాలలో పత్రాల ఆవశ్యకత కూడా సరళీకృతం చేశాం. ఆధార్‌తో యూఏఎన్ అనుసంధానం కాకపోతే ఏదైనా దిద్దుబాటు కోసం పత్రాలను యజమానికి భౌతికంగా సమర్పించాలి. ధ్రువీకరణ తర్వాత యాజమాన్యాలు ఆమోదం కోసం ఈపీఎఫ్ఓకు పంపాల్సి ఉంటుంది’ అని వివరించారు. సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు 27 శాతం ప్రొఫైల్/కేవైసీ సమస్యలకు సంబంధించినవేనని మంత్రి తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. -
కడపలో భూచోళ్లు!
కడప నగరంలో భూచోళ్లు పడ్డారు. భూ దాహంతో ‘సైకిల్ చక్రాలు’ కట్టుకుని మరీ ఊరంతా తిరుగుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నోరు తెరుస్తున్నారు. పట్టపగలే ప్రభుత్వ స్థలాలను చదును చేస్తూ కబ్జా చర్యలకు పదును పెడుతున్నారు. అధికారులకు మామూళ్ల మకిలీ అంటగట్టి.. ఆపై ఏంచక్కా నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను హాంఫట్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి కడప: కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు భూ ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కన్పిస్తే కబ్జాకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కడప నగరంలో ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆపై రెవెన్యూ డిపార్టుమెంటును మేనేజ్ చేయడంలో తల మునకలయ్యారు. ఇలా పక్కా స్కెచ్ తో కోట్లాది రూపాయల విలువజేసే స్థలాలను కొట్టేస్తున్నారు. తాజాగా కడప నగరంలోని ద్వారకానగర్‌లో రూ.12 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని చదును చేశారు. ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని హె చ్చరిక బోర్డును సైతం కబ్జాదారులు లెక్కచేయకుండా చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.కడప నగరం ద్వారకానగర్‌లో రైతు బజార్ సమీపంలో నాగరాజుపల్లె పొలం సర్వే నెంబరు 71/1లో 2.52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రైతు బజార్ ఏర్పాటు చేయగా మరో 40 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండిపోయింది. ఈ స్థలం బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్‌కు ఆనుకునే ఉంది. ఆన్లైన్లో రికార్డులల్లో అనుభవదారు పేరు ‘వాగు’అని ఇప్పటికీ వస్తోంది. కాగా ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. జిల్లా టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు స్వాహాకు ప్రణాళిక రచించారు. ప్రతిరోజు ముఖ్యనేత చుట్టు ఉండే తెలుగుతమ్ముళ్లు ఈకబ్జా వ్యవహారంలో క్రియాశీలక ప్రాత పోషించినట్లు ఆరోపణలున్నాయి.హెచ్చరిక బోర్డును లెక్కచేయని అక్రమార్కులురెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వ భూమి...దీనిని ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇవేవి తెలుగుతమ్ముళ్లు లెక్కచేయలేదు. కాగా ఈ స్థలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. ఈవ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు నేతలు తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారు. రూ.12కోట్ల విలువజేసే స్థలాన్ని కొట్టేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి ఇది తమదేనని చదును చేసేశారు. విషయం తెలుసుకున్న ద్వారకానగర్æకాలనీ డెవెలప్మెంట్ కమిటీ వారు రెవిన్యూ, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. దాంతో వ్యవహారం బహిర్గతం కావడంతో అధికారులు సైతం కాస్తా అప్రమత్తమయ్యారు. కోట్లు విలువైన భూమి కాజేసేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సైతం సృష్టించినట్లు సమాచారం. ఆమేరకు ఓ రెవెన్యూ అధికారితో సైతం సంప్రదించి సహాకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఓ నేతకు పీఏగా ఉన్న వ్యక్తి తలదూర్చడంతోనే సాధ్యమైందనే ఆరోపణలు లేకపోలేదు.ఇలాంటి చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం భూ కబ్జాలను అరికట్టేడంలో చేతులెత్తేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడప నగరంలో వార్డు సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు నిత్యం ఇక్కడే ఉంటారు. అలాంటి నగరంలోనే ప్రభుత్వ భూమిని పక్కాగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేయడం గమనార్హం. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తు వీడి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు.