కాబుల్ (అఫ్గానిస్తాన్) : ఉగ్రదాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న అఫ్గానిస్తాన్‌లో మరో కలకలం రేగింది. ఇప్పటికే వలసవాదులపై దాడులకు తెగబడుతున్న తాలిబన్ ఉగ్రవాదులు తాజాగా ముగ్గురు విదేశీయుల్ని చంపారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. వివరాలు.. సోడెక్సో ఇంటర్నేషనల్ ఫుడ్ కంపనీలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు విధులకు వెళ్తుండగా ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు.
ముసాహీ జిల్లాలోని పార్కింగ్ చేసి ఉన్న కారులో మృత దేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మలేసియా (64), ఇండియా (39), మాసిడోనియా (37) పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారని అంతర్గతభద్రత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నుష్రత్ రహీమి తెలిపారు. మృతదేహాల పక్కన కొన్ని ఐడీ కార్డులు పడి ఉన్నాయనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఇన్నాళ్లూ స్వదేశీయుల్ని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకుంటున్న క్రిమినల్స్ కోవలోకి తీవ్రవాదులు సైతం చేరారు. విదేశీయులే లక్ష్యంగా రెచ్చిపోతూ బాంబు దాడులు, కిడ్నాప్‌లకు తెగబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment