
ఈ క్యూ1లో 813 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్
ఇందులో 43 శాతం వాటా ఫారినర్స్‌దే..
నివాస, వాణిజ్య విభాగంలోనే అధిక పెట్టుబడులు
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంటే.. మన దేశం మాత్రం వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సాధిస్తోంది. దేశీయ స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశాభివృద్ధిపై దేశీయ పెట్టుబడిదారులకు విశ్వాసం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరిగింది. దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, సులభతర పెట్టుబడి విధానం వంటి రకరకాల కారణాలతో విదేశీ పెట్టుబడిదారుల వాటా గతేడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 2 శాతం నుంచి ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 43 శాతానికి పెరిగిందని వెస్టియన్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో
విదేశీ పెట్టుబడుల వెల్లువ..
దేశంలోకి 2024 క్యూ1లో 552.1 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. ఇందులో విదేశీ పెట్టుబడులు కేవలం 4 శాతమే. అంటే 11 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అదే 2025 క్యూ1 నాటికి మొత్తం 813.3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఇందులో విదేశీ పెట్టుబడుల వాటా ఏకంగా 43 శాతం. 346.9 మిలియన్ డాలర్ల ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి.
నివాసంలోకే అత్యధికం..
నివాస విభాగంలో పెట్టుబడులకే విదేశీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రంగంలోకి 506 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రెసిడెన్షియల్ సెక్టార్ వాటా 62 శాతం. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 41 శాతం అధికం. విలువల పరంగా చూస్తే.. పెట్టుబడులు వార్షికంగా 125 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఆ తర్వాత వాణిజ్య విభాగంలోకి 307.2 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి.
ఇదీ చదవండి: పెరిగిన అద్దెలు.. హైదరాబాద్‌లో అక్కడే ఫుల్ డిమాండ్!
ఈ త్రైమాసికంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఈ విభాగం వాటా 38 శాతం. అయితే ఈ క్యూ1లో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి ఎలాంటి పెట్టుబడులు రాలేదు. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ రంగం, లాజిస్టిక్ ఖర్చుల తగ్గింపు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ విభాగంలోకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు అపారంగా ఉన్నాయి.