
2024 డిసెంబర్ నాటికి రూ.74వేల కోట్లు
15 శాతం రియల్ ఎస్టేట్‌లోకే
అనరాక్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు) పెట్టుబడులు 2024 డిసెంబర్ నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’ ఏఐఎఫ్‌లకు సంబంధించి డేటాను విశ్లేషించి ఒక నివేదిక విడుదల చేసింది. గత డిసెంబర్ నాటికి ఏఐఎఫ్‌లు అన్ని రంగాల్లోనూ కలిపి రూ.5,06,196 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపింది. ఇందులో 15 శాతం మేర (రూ.73,903 కోట్లు) రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాయని.. రంగాల వారీగా అత్యధిక పెట్టుబడులు రియల్టీకే దక్కినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘ఏఐఎఫ్‌లతో దేశ రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ (రుణ సదుపాయం) గణీయమైన మార్పునకు గురైంది. నిధుల్లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్టులకు ఏఐఎఫ్ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయి. డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి’’అని అనరాక్ తెలిపింది.
ఏ రంగంలోకి ఎంత మేర..
రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధికంగా ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.26,807 కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్‌ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్ రూ.11550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్ పెట్టుబడులను 2024 డిసెంబర్ నాటికి ఆకర్షించినట్టు అనరాక్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్ రూపంలో పరిష్కారం లభించినట్టు అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు.
సంప్రదాయ నిధుల సమీకరణ మార్గాల్లో ఇబ్బందులకు ఈ రూపంలో పరిష్కారం లభించినట్టు చెప్పారు. ఏఐఎఫ్‌లు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి ఇన్వెస్టర్లకు అధిక రిస్క్‌తో కూడిన రాబడులను ఆఫర్ చేస్తుంటాయి. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి, తమ ప్రణాళికలకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన దశాబ్ద కాలంలో సెబీ వద్ద నమోదైన ఏఐఎఫ్‌లు 36 రెట్లు పెరిగాయి. 2013 మార్చి నాటికి 42గా ఉన్నవి 2025 మార్చి 5 నాటికి 1,524కు పెరిగినట్టు డేటా తెలియజేస్తోంది.