
గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ లావాదేవీలు 50.3 కోట్ల చ.అ.
ఇందులో 66 శాతం వాటా హరిత కార్యాలయాలదే..
వచ్చే 3 ఏళ్లలో 70 కోట్ల చ.అ.కు గ్రీన్ ఆఫీస్ స్పేస్
క్రెడాయ్– కొలియర్స్ నివేదిక
కరోనా తర్వాత స్థిరాస్తి కొనుగోలుదారులలో మార్పులు వచ్చాయి. తినే తిండితో పాటు ఉండే ఇల్లు కూడా హైజీన్‌గా ఉండాలని భావిస్తున్నారు. దీంతో పర్యావరణహితమైన భవన నిర్మాణాలకు ఆదరణ పెరిగింది. ఈ గ్రీనరీ కేవలం ఇళ్లకే కాదు పనిచేసే ఆఫీసులూ హరితంగానే ఉండాలని భావిస్తున్నారు. దీంతో ఉద్యోగస్తుల అభిరుచులకు తగ్గట్టుగానే యాజమాన్యాలు కూడా గ్రీన్ స్పేస్ ఆఫీసులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని క్రెడాయ్– కొలియర్స్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో
కరోనా తర్వాతి నుంచి బహుళ జాతి సంస్థలు ఇంధన సామర్థ్యం, కార్బన్ ఉద్గారాల తగ్గుదలతో పాటు ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో హరిత కార్యాలయాలకు ఆదరణ పెరుగుతుంది. 2010లో దేశంలోని ఆఫీసు స్పేస్ స్టాక్‌లో గ్రీన్ ఆఫీసు స్పేస్ వాటా 52 శాతంగా ఉండగా.. గత ఐదేళ్లలో ఏకంగా 80 శాతానికి పైగా చేరడమే ఇందుకు ఉదాహరణ. హరిత భవనాల అత్యధికంగా ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్ అండ్ ఫార్మా, ఇంజినీరింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి.

హరిత భవనాలు 1,300 కోట్ల చ.అ..
డెవలపర్లు, పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు గ్రీన్ సర్టిఫికెట్, ఇంధన సమర్థవంతమైన నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. స్థిరమైన భవన పద్ధతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సరళమైన నిబంధనలు గ్రీన్ బిల్డింగ్‌ల నిర్మాణానికి ప్రధాన కారణం. దీంతో గృహాలు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, గిడ్డంగులు, డేటా సెంటర్లు కూడా కార్బన్ ఉద్గారాల తగ్గించే భవన నిర్మాణానికే బిల్డర్లు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో హరిత భవనాలు 1,300 కోట్ల చ.అ.కు చేరాయని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) తెలిపింది. గతేడాది ముగింపు నాటికి దేశంలో 21
లక్షలకు పైగా గృహాలు, 6,500 వాణిజ్య సముదాయాలు, 750 పారిశ్రామిక ప్రాజెక్ట్‌లు గ్రీన్ సర్టిఫికెట్‌ను పొందాయి.

అద్దెలు ప్రీమియమే..
గ్రీన్ సర్టిఫికెట్ పొందిన ఆఫీసు భవనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటిల్లో ఆక్యుపెన్సీ లెవల్ 80–90 శాతం వరకు ఉంది. సాధారణ భవనాలలో పోలిస్తే గ్రీన్ ఆఫీసుల అద్దె 25 శాతం అధికంగా ఉంటుంది. దేశంలోని గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీసు స్పేస్ స్టాక్‌లో 31 శాతం వాటాతో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. ఢిల్లీ–ఎన్‌సీఆర్ 19 శాతం, హైదరాబాద్ 17 శాతంతో ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి. 2024 చివరి నాటికి 50.3 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ స్టాక్ ఉంది. వచ్చే 2–3 ఏళ్లలో 70 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.
పాత భవనాలు గ్రీనరీగా..
దేశంలో పదేళ్లకు పైగా మించిన 35.5 నుంచి 38.5 కోట్ల చ.అ.లలో పాత భవనాలు ఉన్నాయి. వీటిని గ్రీన్ ఆఫీసులుగా పునరుద్ధరించడానికి 425 బిలియన్లకు పైగా పెట్టుబడులు అవసరం. అలాగే పదేళ్లలోపు 8 నుంచి 11 కోట్ల చ.అ. పాత భవనాలు ఉన్నాయి. వీటి పునరుద్ధరణకు 22–32 బిలియన్లు అవసరం.
మార్కెట్‌లోకి ఆఫీసు స్పేస్ సరఫరా..
వచ్చే మూడేళ్లలో ఆరు ప్రధాన నగరాల్లో 17–20 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వస్తుందని అంచనా. అత్యధికంగా ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లో సరఫరా రానుంది.
ప్రయోజనాలివీ..
» ఏటా 6,430 యూనిట్ల విద్యుత్ ఆదా
» సంవత్సరానికి 19,800 కోట్ల లీటర్ల నీరు ఆదా
» వార్షికంగా 5.14 కోట్ల టన్నుల సీఓ–2 ఉద్గారాల తగ్గుదల
» ఏటా 25 లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం
» ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు
» తక్కువ యూటిలిటీ బిల్లులు