విస్తరణ, కొత్త యూనిట్ల ఏర్పాటుకు కంపెనీల ఆసక్తి
కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడలో డిమాండ్
ఈ ఏడాది 87 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తి
కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్పేస్ 85 లక్షల చ.అ.
లావాదేవీల్లో దేశంలోనే 3వ స్థానంలో హైదరాబాద్
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ సరికొత్త శిఖరాలను తాకింది. దేశంలో కార్యాలయాల స్థలాల లావాదేవీల్లో మూడో స్థానంలో, సరఫరాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలంలో గ్రేటర్‌లో 87 లక్షల చదరపు అడుగులు(చ.అ.) ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. కొత్తగా 85 లక్షల చ.అ. స్థలం సరఫరా అయ్యింది. ఏటేటా ఆఫీస్ స్పేస్ రంగంలో 34 శాతం వృద్ధి నమోదవుతోందని సావిల్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వంటి పని విధానాలకు స్వస్తి పలికి ఆఫీస్ యాజమాన్యాలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. దీంతో మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాలకు డిమాండ్ ఊపందుకుంది. – సాక్షి, సిటీబ్యూరో
ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, తయారీ రంగ సంస్థలు కొత్త యూనిట్ల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నాయి. దీంతో ప్రధాన ప్రాంతాలతో పాటు రవాణా సదుపాయాలున్న శివారు ప్రాంతాల్లోని ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నగరంలో 58 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ సరఫరా జరిగింది. వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరుగుదల నమోదైంది. 2024 మూడో త్రైమాసికంలో (జులై–సెప్టెంబర్)లోనే 30 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి. ఎక్కువగా 25 వేల నుంచి లక్షలోపు చ.అ. మధ్యస్థాయి ఆఫీస్ స్పేస్ ఒప్పందాలు ఎక్కువగా జరిగాయి. 54 శాతం వాటాతో ఈ విభాగంలో 16 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి.
బెంగళూరు–హైదరాబాద్ పోటాపోటీ..
కార్యాలయాల స్థలాల విభాగంలో ఐటీ హబ్‌లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉన్న నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. గ్రేటర్‌లో ఇప్పటి వరకు గ్రేటర్‌లో 12.57 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది. అత్యధికంగా బెంగళూరులో 23.15 కోట్ల చ.అ., ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 14.46 కోట్ల చ.అ. స్థలం అందుబాటులో ఉంది. ఇక, ముంబైలో 12.14, చెన్నైలో 9.13, పుణేలో 6.82 కోట్ల చ.అ. స్థలం ఉంది.
దేశంలో 7 కోట్ల చ.అ. దాటనున్న ఆఫీస్ స్పేస్..
దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ రికార్డ్‌లను బ్రేక్ చేసింది. దేశంలోని ఆరు మెట్రో నగరాల్లో 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో 5.51 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు పూర్తికాగా.. ఈ ఏడాది చివరి నాటికి 7 కోట్ల చ.అ.లను అధిగమిస్తుందని, ఆఫీస్ స్పేస్ సప్లయ్ 6.2 కోట్ల చ.అ.లకు చేరుతుందని సావిల్స్ ఇండియా అంచనా వేసింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ స్టాక్ 81 కోట్ల చ.అ. చేరుకుంటుంది. ఏటేటా ఆఫీస్ స్పేస్ రంగంలో 30 శాతం వృద్ధి రేటు నమోదవుతుంది. కార్యాలయాల స్థలాలకు డిమాండ్ ఉన్నప్పటికీ.. నిర్మాణం పూర్తి చేసు కొని, మార్కెట్‌లో అందుబాటులోకి ఆఫీస్ స్పేస్ మాత్రం మందగమనంలో సాగుతోంది. ఈ ఏడాది 9 నెలల్లో కొత్తగా 3.26 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ మార్కెట్‌లోకి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 12 శాతం తగ్గుదల. ఆఫీస్ స్పేస్ వేకన్సీ ఎక్కువగా ఉండటంతో ధరలు 15.5 శాతం మేర తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment