
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల విపణి క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. - సాక్షి, సిటీబ్యూరో
ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లయి తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్‌లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.
పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ..
గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది.