బృహత్తర ప్రాజెక్ట్‌లతో మళ్లీ పరుగులు
మూసీ, మెట్రో విస్తరణతో ప్రధాన నగరం ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీలతో శివార్ల అభివృద్ధి
గ్రోత్ కారిడార్లతో సామాన్యుల సొంతింటి కల సాకారం
పెట్టుబడులకు దక్షిణ ప్రాంతాలు బెటర్
‘సాక్షి’తో క్రెడాయ్ జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి
మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలివీ..
–సాక్షి, సిటీబ్యూరో
ప్రభుత్వ ఆస్తులు, జలాశయాల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అవసరమే. కానీ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన తీరే గందరగోళాన్ని సృష్టించింది. హైడ్రా ప్రభావం ప్రాజెక్ట్‌లపై కంటే కస్టమర్ల సెంటిమెంట్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. రియల్టీ మార్కెట్ సైకిల్ వ్యవస్థ. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాల అమలులో జాప్యం, అధిక సరఫరా కారణంగా 2024లో రియల్టీ మార్కెట్ స్తబ్దుగానే ఉంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.
ఇప్పటికే మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాలపై హైకోర్టు నుంచి అడ్డంకులు కూడా తొలగాయి. దీంతో మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రెండోదశ మెట్రో విస్తరణ పనులను జనవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం, 14 వేల ఎకరాల్లోని ఫ్యూచర్ సిటీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్ట్‌లతో నగరం మరింత అభివృద్ధి చెందడంతోపాటు కొత్త మార్గాలు, ప్రాంతాల్లో రియల్ అవకాశాలు మెరుగవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి.
లుక్ ఆల్ డైరెక్షన్స్..
ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చుతగ్గుల కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్‌లో భూముల ధరలు బాగా పెరిగాయి. అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అందుకే పాలసీల్లో కొన్ని మార్పులు తేవాలి. ఔటర్ గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారమవుతుంది. అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. కానీ, కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వం లుక్ ఆల్ డైరెక్షన్ అమలు చేయాలి. రింగ్‌రోడ్డు చుట్టూ మొత్తం గ్రిడ్ రోడ్లు వేస్తే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి సామాన్యుడికి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.
పెట్టుబడులకు సౌత్ బెటర్..
కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. రేవంత్ ప్రభుత్వం కొత్త విధానాలు, అభివృద్ధి పనులతో వచ్చే ఏడాది కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నందున సామాన్య, మధ్యతరగతి వారు స్థలాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వెస్ట్ జోన్‌లో అపార్ట్‌మెంట్ కొనే ధరకే చ.అ.కు రూ.7–9 వేలకే సౌత్‌లో విల్లా వస్తుంది. అంతేకాకుండా ఓఆర్‌ఆర్‌తో ప్రధాన నగరం నుంచి 30–40 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే సౌత్‌కు చేరుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment