moosi
-
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మళ్లీ పూర్వ వైభవం
మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలివీ.. –సాక్షి, సిటీబ్యూరోప్రభుత్వ ఆస్తులు, జలాశయాల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అవసరమే. కానీ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన తీరే గందరగోళాన్ని సృష్టించింది. హైడ్రా ప్రభావం ప్రాజెక్ట్‌లపై కంటే కస్టమర్ల సెంటిమెంట్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. రియల్టీ మార్కెట్ సైకిల్ వ్యవస్థ. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాల అమలులో జాప్యం, అధిక సరఫరా కారణంగా 2024లో రియల్టీ మార్కెట్ స్తబ్దుగానే ఉంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాలపై హైకోర్టు నుంచి అడ్డంకులు కూడా తొలగాయి. దీంతో మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రెండోదశ మెట్రో విస్తరణ పనులను జనవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం, 14 వేల ఎకరాల్లోని ఫ్యూచర్ సిటీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్ట్‌లతో నగరం మరింత అభివృద్ధి చెందడంతోపాటు కొత్త మార్గాలు, ప్రాంతాల్లో రియల్ అవకాశాలు మెరుగవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి.లుక్ ఆల్ డైరెక్షన్స్.. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చుతగ్గుల కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అందుకే పాలసీల్లో కొన్ని మార్పులు తేవాలి. ఔటర్ గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారమవుతుంది. అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. కానీ, కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వం లుక్ ఆల్ డైరెక్షన్ అమలు చేయాలి. రింగ్‌రోడ్డు చుట్టూ మొత్తం గ్రిడ్ రోడ్లు వేస్తే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి సామాన్యుడికి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.పెట్టుబడులకు సౌత్ బెటర్.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. రేవంత్ ప్రభుత్వం కొత్త విధానాలు, అభివృద్ధి పనులతో వచ్చే ఏడాది కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నందున సామాన్య, మధ్యతరగతి వారు స్థలాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వెస్ట్ జోన్లో అపార్ట్మెంట్ కొనే ధరకే చ.అ.కు రూ.7–9 వేలకే సౌత్‌లో విల్లా వస్తుంది. అంతేకాకుండా ఓఆర్ఆర్తో ప్రధాన నగరం నుంచి 30–40 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే సౌత్‌కు చేరుకోవచ్చు. -
తొలుత బాపూఘాట్ వరకే!
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కసరత్తు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలిదశలో బాపూఘాట్ ప్రాంతం వరకే పనులను పరిమితం చేయాలని భావిస్తోంది. నదీ తలంతోపాటు బఫర్ జోన్‌లోని నిర్మాణాల తొలగింపులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నగర శివార్లలోని బాపూఘాట్ వరకు పునరుజ్జీవం, సుందరీకరణ పనులు పూర్తిచేశాక.. దానిని నమూనాగా చూపి హైదరాబాద్ నగరం నడిబొడ్డున మిగతా పనులు చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. భూసేకరణ సమస్య లేకపోవడంతో.. వికారాబాద్ అడవుల్లో జన్మంచే మూసీ నది.. ఈసీ, మూసా అనే రెండు పాయలుగా ప్రవహిస్తూ వచి్చ, లంగర్‌హౌజ్ ప్రాంతంలోని బాపూఘాట్ వద్ద సంగమిస్తుంది. ఇందులో ఈసీపై హిమాయత్‌సాగర్, మూసాపై ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల దిగువ నుంచి ఈసీ, మూసా నదుల సంగమం బాపూఘాట్ వరకు భూసేకరణ సమస్యలు పెద్దగా ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. రెండు నది పాయల తీరప్రాంతం, బాపూఘాట్‌ను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందుకు అనుగుణంగా విభిన్న ప్రణాళికలు, నమూనాలతో సీఎం అధ్యక్షతన మూసీ పునరుజ్జీవంపై త్వరలో జరిగే భేటీకి రావాల్సిందిగా ప్రాజెక్టు కన్సల్టెంట్లను ఆదేశించింది. నిజానికి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు స్థితిగతులపై రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ జరిగింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు, కన్సల్టెంట్ సంస్థ మెయిన్‌హార్ట్ కన్సార్షియం ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ కోసం చేపట్టాల్సిన పనులపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ‘బఫర్’ మూసీకి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తించాలని ఇప్పటికే నిర్ణయించినా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బఫర్ జోన్‌ను డిజైన్ చేయాలని సర్కారు భావిస్తోంది. భవిష్యత్తులో మూసీకి ఇరువైపులా రోడ్లు, వంతెనలు, భారీ కూడళ్లు, మెట్రో రైలు మార్గం వంటివి నిర్మించేందుకు వీలుగా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేస్తారు. బఫర్ జోన్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, రాళ్లు, వ్యర్థాలను తొలగించి సమతలం చేస్తారు.ప్రభుత్వ భూముల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ విభిన్న డిజైన్లలో పర్యాటకులను ఆకర్షించేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు. అయితే.. బాపూఘాట్ సమీపంలో ఈసీ, మూసా నదుల సంగమం తీర ప్రాంతంలో రక్షణశాఖ భూములు ఉన్నాయి. ఆ భూముల వివరాలను రెవెన్యూ విభాగం ద్వారా సేకరించి.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించేలా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా బాపూఘాట్ ⇒ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపూ ఘాట్ ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేలా బాపూఘాట్ వద్ద స్కైవే, బ్రిడ్జితో కూడిన బరాజ్, పాదచారుల వంతెనను నిర్మించేలా నమూనాలు, ప్రణాళికలు సిద్ధం చేసే బాధ్యతను కన్సల్టెంట్‌కు అప్పగించారు. బాపూఘాట్‌కు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రతి బింబించేలా ఈ డిజైన్లు, ప్రణాళికలు ఉంటాయి.గుజరాత్‌లోని నర్మదానది వద్ద నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం తరహాలో బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. ఇక ఈసీ, మూసా సంగమ ప్రదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చి దిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని కన్సల్టెంట్‌ను ఆదేశించారు. సంగమ స్థలం వద్ద మహాప్రస్థానం, స్నాన ఘట్టాలతో ఘాట్ల నిర్మాణం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఉస్మాన్‌సాగర్‌కు గోదావరి జలాలు ⇒ జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వర కు భారీ అభివృద్ధి ప్రణాళికల నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, సేకరించాల్సిన భూమిపై రెవెన్యూ శాఖ కసరత్తు చేయాల్సి ఉంది. గోదావరి జలాలను హి మాయత్‌సాగర్ మీదుగా ఉస్మాన్‌సాగర్‌కు తరలించేందుకు కాలువ తవ్వాలా లేక టన్నె ల్ నిర్మించాలా? అన్న అంశాలను తేల్చే బా ధ్యతను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు కు అప్పగించారు. ఈ నెల 24న జరిగిన సమావేశంలో వీటిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ మరో సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
ప్రపంచాన్ని ఆకర్షించేలా ‘మూసీ’
సాక్షి, హైదరాబాద్: మూసీ నదీ తీర అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుబాయ్‌లో ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వరుసగా భేటీలు నిర్వహించారు. 56 కిలోమీటర్ల పొడవునా రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలను పరిశీలించడంతో పాటు వాటికి అవసరమైన పెట్టుబడుల గురించి దాదాపు 70 సంస్థలతో ఆయన సంప్రదింపులు జరిపారు. దుబాయ్ వేదికగా ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా దాదాపు అన్ని సంస్థలూ.. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చాయనీ, సంప్రదింపుల కోసం త్వరలోనే రాష్ట్రా నికి వచ్చేందుకు అంగీకరించాయని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్‌లో సండే వర్కింగ్ డే ఆదివారం సెలవుదినాన్ని సీఎం రేవంత్ అండ్ టీం దుబాయ్‌లో వర్కింగ్ డే తరహాలో గడిపింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ సమావేశాల్లో భాగంగా సీఎం రేవం™త్ మాట్లాడుతూ ‘చరిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుంది’అని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాలతో తాము పోటీ పడడం లేదని ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్ నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నామని చెప్పిన రేవంత్ అందుకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని కోరా రు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈనెల 15న ప్రారంభమైన సీఎం రేవంత్ దావోస్, లండన్, దుబాయ్ టూర్ ముగిసింది. ఈ మూడు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బృందం సోమ వారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దావోస్ పర్యటనలో భాగంగా ఈనెల 15 నుంచి జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ వార్షిక సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడితో సహా పలు దేశాల పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో పెట్టుబడుల కు అనువైన పరిస్థితులను వ్యాపార వర్గాలకు వివరించడం ద్వారా రూ.40వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన హామీలను రాబట్టగలిగారు. ఆ తర్వాత లండన్ వెళ్లిన సీఎం అక్కడ ఇండియా డయాస్పోరా అసోసియేషన్స్ సమావేశంలో పాల్గొ ని ప్రవాస తెలంగాణీయులనుద్దేశించి మాట్లాడా రు. లండన్‌లోని ప్రముఖ ప్రాంతాలను అధికారుల బృందంతో కలిసి సందర్శించిన రేవంత్ థేమ్స్ నది స్ఫూర్తితో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి దుబాయ్ చేరుకున్న రేవంత్ టీం మూసీ రివర్‌ఫ్రంట్‌పై ప్రత్యేక దృష్టితో రోజంతా సంప్రదింపులు జరిపారు. అనంతరం తన బృందంతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. దుబాయ్ వాటర్ ఫ్రంట్‌ను సందర్శించిన సీఎం దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక ఆకాశ హర్మ్యం మీదికి వెళ్లి ఏరియల్ వ్యూలో కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు. చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహరాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సీఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది ? ఎంత ఖర్చయింది ? ఏమేం సవాళ్లు ఎదురయ్యాయి..? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. -
మళ్లీ కదిలిన మహా ఫ్లైఓవర్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రద్దీకి చెక్‌పెట్టేలా.. కాలుష్యం లేకుండా మూసీ నది తీరం వెంబడి నిర్మించాలనుకున్న ‘మహా’ఫ్లైఓవర్ ప్రతిపాదనలో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పటికే హిమాయత్‌సాగర్ నుంచి గౌరెల్లి వరకు దాదాపు 52 కిలోమీటర్ల పొడవునా ఆరు లేన్ల విస్తీర్ణంతో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ రూపకల్పనపై చర్చలు జరిగినా అడుగు ముందుకు పడలేదు. అయితే తాజాగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించడంతో మరోసారి ఈ భారీ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. జీహెచ్ఎంసీ, పీసీబీ, హెచ్ఎండీఏ అధికారులు హాజరైన ఈ సమావేశంలో ఆస్తుల సేకరణ, భూసేకరణ సమస్య లేని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.నాలుగు వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాకు వచ్చారు. తూర్పు, పడమర మధ్య ప్రయాణం సాఫీగా... హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన రద్దీ, నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు అంటే నగరంలోని తూర్పు, పడమరలను కలిపే విధంగా ప్రత్యేక వంతెన నిర్మించనున్నారు. మూసీనది నగర శివారు పశ్చిమ ప్రాంతంలో హిమాయత్‌సాగర్ నుంచి ఈ వంతెన ప్రారంభమై నగర తూర్పు దిశలోని గౌరెల్లి వద్ద నగరాన్ని దాటుతుంది. నార్సింగి, టోలిచౌకి, మెహదీపట్నం, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, రామంతాపూర్, నాగోల్, ఉప్పల్‌ను అనుసంధానం చేయడంతో పాటు విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను వికారాబాద్ రాష్ట్ర రహదారిని కలుపుతుంది. ఈ మూసీ నది తీరం వెంబడి నిర్మించే ఈ వంతెనకు భూసేకరణ, ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణ వంటి పనులు లేకపోవడంతో తొందరగానే పూర్తి కానుంది. -
నోటీసులివ్వకుండానే.. 150 ఇళ్లు కూల్చివేత
హైదరాబాద్ : చైతన్యపురి మూసీ నాలా ఒడ్డున ఉన్న నిరుపేదలకు చెందిన 150 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని, తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారని పేదలు వాపోయారు. ఇళ్లు కూల్చినందుకు నిరసన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు. -
మూసీకి కొనసాగుతున్న వరద
కేతెపల్లి(నల్లగొండ): రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండటంతో.. అప్రమత్తమైన అధికారులు మూసీ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్థుతం 643 అడుగుల వరకు నీరు ఉంది. శనివారం ఉదయం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 41,309 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 34,360 క్యూసెక్కులుగా నమోదైంది. -
మూసీకి భారీగా వరద
కేతెపల్లి: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగుతోంది. దీంతో నల్లగొండ జిల్లా కేతెపల్లి వద్ద మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ నాలుగు గేట్లు రెండు అడుగుల మేరకు ఎత్తి 4,500 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత మూసి నిండటంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.