ఆదివారం దుబాయ్‌లో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసీ నదీ తీర అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుబాయ్‌లో ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వరుసగా భేటీలు నిర్వహించారు. 56 కిలోమీటర్ల పొడవునా రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలను పరిశీలించడంతో పాటు వాటికి అవసరమైన పెట్టుబడుల గురించి దాదాపు 70 సంస్థలతో ఆయన సంప్రదింపులు జరిపారు.
దుబాయ్ వేదికగా ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా దాదాపు అన్ని సంస్థలూ.. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చాయనీ, సంప్రదింపుల కోసం త్వరలోనే రాష్ట్రా నికి వచ్చేందుకు అంగీకరించాయని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
దుబాయ్‌లో సండే వర్కింగ్ డే
ఆదివారం సెలవుదినాన్ని సీఎం రేవంత్ అండ్ టీం దుబాయ్‌లో వర్కింగ్ డే తరహాలో గడిపింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ సమావేశాల్లో భాగంగా సీఎం రేవం™త్ మాట్లాడుతూ ‘చరిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుంది’అని అన్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాలతో తాము పోటీ పడడం లేదని ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్ నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నామని చెప్పిన రేవంత్ అందుకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని కోరా రు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
వారం రోజుల తర్వాత రాష్ట్రానికి
ఈనెల 15న ప్రారంభమైన సీఎం రేవంత్ దావోస్, లండన్, దుబాయ్ టూర్ ముగిసింది. ఈ మూడు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బృందం సోమ వారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దావోస్ పర్యటనలో భాగంగా ఈనెల 15 నుంచి జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ వార్షిక సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడితో సహా పలు దేశాల పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.
తెలంగాణలో పెట్టుబడుల కు అనువైన పరిస్థితులను వ్యాపార వర్గాలకు వివరించడం ద్వారా రూ.40వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన హామీలను రాబట్టగలిగారు. ఆ తర్వాత లండన్ వెళ్లిన సీఎం అక్కడ ఇండియా డయాస్పోరా అసోసియేషన్స్ సమావేశంలో పాల్గొ ని ప్రవాస తెలంగాణీయులనుద్దేశించి మాట్లాడా రు. లండన్‌లోని ప్రముఖ ప్రాంతాలను అధికారుల బృందంతో కలిసి సందర్శించిన రేవంత్ థేమ్స్ నది స్ఫూర్తితో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి దుబాయ్ చేరుకున్న రేవంత్ టీం మూసీ రివర్‌ఫ్రంట్‌పై ప్రత్యేక దృష్టితో రోజంతా సంప్రదింపులు జరిపారు. అనంతరం తన బృందంతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు.
దుబాయ్ వాటర్ ఫ్రంట్‌ను సందర్శించిన సీఎం
దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక ఆకాశ హర్మ్యం మీదికి వెళ్లి ఏరియల్ వ్యూలో కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు. చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహరాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సీఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది ? ఎంత ఖర్చయింది ? ఏమేం సవాళ్లు ఎదురయ్యాయి..? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment