institutions
-
గురుకుల బోర్డుకు కొత్త సారథులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లో మార్పులు జరగనున్నాయి. కీలకమైన చైర్మన్, కన్వినర్ పోస్టుల్లో త్వరలోనే కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా ఉన్న మల్లయ్య బట్టును రా ష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీచేసింది. సొసైటీ నూత న కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి బి.సైదులను నియమించింది. దీంతో గత వారం ఆయ న బాధ్యతలు స్వీకరించారు. అయితే టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా వ్యవహరించిన మల్లయ్య బట్టు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో కన్వినర్ సీటు ఖాళీ అయ్యింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అత్యంత కీలకంగా వ్యవహరించే కన్వినర్ సీటు ఖాళీ కావడంతో బోర్డు పరిధిలో పలు నియామకాలకు సంబంధించిన అంశాలు పెండింగ్ లో పడిపోయాయి. ఈ క్రమంలో వాటి భర్తీతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే బో ర్డుకు కన్వినర్ నియామకం అనివార్యం కానుంది. బోర్డు సభ్యులుగా సొసైటీల కార్యదర్శులు రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీని వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా టీఆర్‌ఈఐఆర్‌బీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల కార్యదర్శులు బోర్డులో సభ్యులుగా ఉంటారు. గురుకుల సొసైటీల్లో సీనియర్ కార్యదర్శి ఈ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో సభ్యుడు కన్వినర్‌గా ఉంటారు. బోర్డు సభ్యుల అంగీకారం, ప్రభుత్వ ఆమోదంతో సొసైటీల్లోని అదనపు కార్యదర్శుల్లో ఎవరినైనా కూడా కన్వినర్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు. ప్రస్తుత చైర్మన్‌గా ఆయేషా మస్రత్ ఖానమ్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానమ్ ఉన్నారు. కన్వినర్‌గా కొనసాగిన మల్లయ్య బట్టును టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా బి.సైదులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న గురుకుల సొసైటీ కార్యదర్శుల్లో ఈయనే సీనియర్ అధికారి. బోర్డు చైర్మన్‌గా సీనియర్ అధికారిని నియమించాల్సి ఉండటంతో ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న మస్రత్ ఖానమ్‌కు కూడా స్థాన చలనం తప్పదని అధికారులు అంటున్నారు. కన్వినర్ పోస్టు కూడా ఖాళీ కావడంతో చైర్మన్, కన్వీనర్ రెండు పోస్టుల్లోనూ కొత్త వారినే నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు అధికారులు ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శుల సీనియారీ్ట, తదితర పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత చైర్మన్, కన్వినర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
ప్రపంచాన్ని ఆకర్షించేలా ‘మూసీ’
సాక్షి, హైదరాబాద్: మూసీ నదీ తీర అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దుబాయ్‌లో ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వరుసగా భేటీలు నిర్వహించారు. 56 కిలోమీటర్ల పొడవునా రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలను పరిశీలించడంతో పాటు వాటికి అవసరమైన పెట్టుబడుల గురించి దాదాపు 70 సంస్థలతో ఆయన సంప్రదింపులు జరిపారు. దుబాయ్ వేదికగా ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో భాగంగా దాదాపు అన్ని సంస్థలూ.. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చాయనీ, సంప్రదింపుల కోసం త్వరలోనే రాష్ట్రా నికి వచ్చేందుకు అంగీకరించాయని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్‌లో సండే వర్కింగ్ డే ఆదివారం సెలవుదినాన్ని సీఎం రేవంత్ అండ్ టీం దుబాయ్‌లో వర్కింగ్ డే తరహాలో గడిపింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ సమావేశాల్లో భాగంగా సీఎం రేవం™త్ మాట్లాడుతూ ‘చరిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుంది’అని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, నగరాలతో తాము పోటీ పడడం లేదని ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్ నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నామని చెప్పిన రేవంత్ అందుకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని కోరా రు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్‌రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈనెల 15న ప్రారంభమైన సీఎం రేవంత్ దావోస్, లండన్, దుబాయ్ టూర్ ముగిసింది. ఈ మూడు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బృందం సోమ వారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. దావోస్ పర్యటనలో భాగంగా ఈనెల 15 నుంచి జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ వార్షిక సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడితో సహా పలు దేశాల పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో పెట్టుబడుల కు అనువైన పరిస్థితులను వ్యాపార వర్గాలకు వివరించడం ద్వారా రూ.40వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన హామీలను రాబట్టగలిగారు. ఆ తర్వాత లండన్ వెళ్లిన సీఎం అక్కడ ఇండియా డయాస్పోరా అసోసియేషన్స్ సమావేశంలో పాల్గొ ని ప్రవాస తెలంగాణీయులనుద్దేశించి మాట్లాడా రు. లండన్‌లోని ప్రముఖ ప్రాంతాలను అధికారుల బృందంతో కలిసి సందర్శించిన రేవంత్ థేమ్స్ నది స్ఫూర్తితో మూసీని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి దుబాయ్ చేరుకున్న రేవంత్ టీం మూసీ రివర్‌ఫ్రంట్‌పై ప్రత్యేక దృష్టితో రోజంతా సంప్రదింపులు జరిపారు. అనంతరం తన బృందంతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. దుబాయ్ వాటర్ ఫ్రంట్‌ను సందర్శించిన సీఎం దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక ఆకాశ హర్మ్యం మీదికి వెళ్లి ఏరియల్ వ్యూలో కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు. చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహరాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సీఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది ? ఎంత ఖర్చయింది ? ఏమేం సవాళ్లు ఎదురయ్యాయి..? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. -
యూపీఐ లావాదేవీలు 1,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ రంగంలో దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2023 ఆగస్ట్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 1,000 కోట్ల మార్కును దాటి 1,024.17 కోట్లకు చేరుకుంది. వీటి విలువ రూ.1518456.40 కోట్లు. 2022 ఆగస్ట్‌లో లావాదేవీల సంఖ్య 658.19 కోట్లు కాగా, విలువ రూ.10,73,162 కోట్లు నమోదైంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 74.79 శాతం వాటాతో రూ.11,79,095.6 కోట్ల విలువైన 438.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. అలాగే వ్యక్తుల నుంచి వర్తకులకు 25.21 శాతం వాటాతో రూ.3,97,440.9 కోట్ల విలువైన 619.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. క్షణాల్లో చెల్లింపులు జరిపే వీలుండడంతో యూపీఐ యాప్స్‌కు ఊహించనంతగా ఆదరణ పెరుగుతోంది. భారత్‌లో యూపీఐ సేవలను 484 బ్యాంకులు, డిజిటల్ పేమెంట్స్ సంస్థలు అందిస్తున్నాయి. యూపీఐ యాప్స్‌లో టాప్–5లో వరుసగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, క్రెడ్, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి. చిన్న మొత్తాలే అధికం.. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల సంఖ్య ఏకంగా 84.5 శాతం వాటాతో 523.7 కోట్లు జరిగాయి. రూ.501–2,000 మధ్య 10.8 శాతం వాటాతో 67 కోట్లు, రూ.2,000లపైన 4.67 శాతం వాటాతో 28.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అలాగే వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు విలువ చేసేవి 55.6 శాతం వాటాతో 244 కోట్లు, రూ.501–2,000 విలువ కలిగినవి 22 శాతం వాటాతో 96.6 కోట్లు, రూ.2,000లపైన విలువైనవి 22.3 శాతం వాటాతో 97.9 కోట్ల లావాదేవీలు రిజిష్టర్ అయ్యాయి. విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు నమోదైన లావాదేవీల విలువ 3.44 శాతం వాటాతో రూ.40,558 కోట్లు. అలాగే రూ.501–2,000 మధ్య రూ.1,17,782 కోట్లు చేతులు మారాయి. రూ.2,000లపైన జరిగిన లావాదేవీల విలువ 86.57 శాతం వాటాతో రూ.10,20,754.8 కోట్లుగా ఉంది. ఇక వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 వరకు విలువ చేసే రూ.59,992.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. రూ.501–2,000 మధ్య రూ.68,665 కోట్లు, రూ.2,000లపైన రూ.2,68,782.5 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. -
ఎన్బీఎఫ్సీల్లో పరిపాలన మరింత బలపడాలి
ముంబై: పరిపాలనా ప్రమాణాలను బలోపేతం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలను (హెచ్ఎఫ్సీలు) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కోరారు. ఎంపిక చేసిన పెద్ద ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఎండీలు, సీఈవోలతో గవర్నర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వరంగంలోని ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల చీఫ్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సంస్థలు ఈ రంగంలోని మొత్తం ఆస్తుల్లో సగం నిర్వహిస్తుండడం గమనార్హం. బ్యాంకింగ్ సేవలు చేరువ కాని లేదా అందుబాటులో లేని వర్గాలకు రుణాలను అందిస్తూ ఈ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ఆర్బీఐ గవర్నర్ గుర్తిస్తూ.. అనుకూల సమయాల్లో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అప్రమత్తం చేశారు. పరిపాలనా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. నిబంధనల అమలు, రిస్క్ నిర్వహణ, అంతర్గత ఆడిట్ల యంత్రాంగం విషయమై భరోసా అవసరమన్నారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో ఉండే రిస్క్, ఐటీ వ్యవస్థలు, సైబర్ భద్రత మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి సారించారు. ఎన్పీఏలకు మరిన్ని కేటాయింపులు చేయడం ద్వారా బ్యాలన్స్ షీట్ల బలోపేతం, ఒత్తిడిలోని రుణ ఆస్తులను పర్యవేక్షించడం, బలమైన లిక్విడిటీ, అస్సెట్ లయబిలిటీ మధ్య సమతుల్యం, రుణాలకు సంబంధించి పారదర్శకమైన రేట్లు, మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలోఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఎన్‌హెచ్‌బీ ఎండీ ఎస్కే హోతా కూడా పాల్గొన్నారు. -
వాటిల్లో కుల వివక్ష తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై కుల వివక్షను ప్రదర్శించడం అత్యంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమని సుప్రీం కోర్టు పేర్కొంది. కుల వివక్షను రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో , ఏయే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని ఆదేశించింది. కులపరమైన వివక్షను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన రోహిత్ వేముల, ముంబైకు చెందిన పాయల్ తాడ్విల తల్లులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎ.ఎస్. బొపన్న, ఎంఎం. సంద్రేశ్లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఈ వివక్షను పారద్రోలడానికి చేపట్టిన చర్యలేంటో వెల్లడించాలని యూజీసీకి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఇది తీవ్రమైన అంశం. వారి ఆందోళల్ని మీరు ఎలా చూస్తున్నారు ? కులవివక్షకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టారు ? ఈ సమస్య పరిష్కారానికి యూజీసీ నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలి. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి’ కోర్టు∙యూజీసీ తరఫు∙లాయర్‌కు చెప్పింది. రోహిత్ వేముల, తాడ్వి తల్లుల తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ ఇందిర కొడుకు, కూతురిని పోగొట్టుకున్న వారి మనోవేదన తీర్చలేదని అన్నారు. వీరిద్దరే కాకుండా గత ఏడాది కాలంలో మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను తట్టుకోలేక నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
రిటైల్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: దేశ రిటైల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు (ఇనిస్టిట్యూషన్స్ ఇన్వెస్ట్మెంట్స్) గతేడాది అరు రెట్లు వృద్ధి చెంది 492 మిలియన్ డాలర్లుగా (రూ.4034 కోట్లు) నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావం అనంతరం రిటైల్ వ్యాపారాలు పుంజుకోవడాన్ని కొలియర్స్ ఇండియా ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. 2021లో రిటైల్ రియల్ ఎస్టేట్‌లోకి 77 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం గమనించాలి. 2020, 2021లో కరోనా ఉధృతంగా ఉండడం పెట్టుబడులపై ప్రభావం చూపించింది. ఇక భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి సంస్థాగత పెట్టుబడులు 2022లో 20 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 4.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డేటా కేంద్రాలు, సీనియర్ హౌసింగ్, హాలీడే హోమ్స్ తదితర ఆల్టర్నేటివ్ రియల్ ఎస్టేట్‌లోకి గతేడాది 867 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2021లో వచ్చిన 453 మిలియన్ డాలర్ల కంటే 92 శాతం పెరిగాయి. సంప్రదాయ సాధనాలతో పోలిస్తే మెరుగైన రాబడులను ఇచ్చే ప్రత్యామ్నాయ సాధనాల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల్లో 52 శాతం డేటా సెంటర్స్ ఆకర్షించాయి. ఆఫీస్ మార్కెట్లోకి 41 శాతం ఇక గతేడాది మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 41 శాతం ఆఫీస్ స్పేస్ విభాగంలోకి వచ్చాయి. అంటే 1.9 బిలియన్ డాలర్లను ఆఫీస్ స్పేస్ విభాగం ఆకర్షించింది. అంతకుముందు ఏడాది ఇదే విభాగంలో పెట్టుబడులు 1.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మిశ్రమ వినియోగ ప్రాజెక్టుల్లోకి రెట్టింపునకు పైగా పెరిగి 464 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ ఆస్తుల్లోకి 63 శాతం తక్కువగా 422 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 1,130 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నివాస ప్రాజెక్టుల్లోకి సైతం 29 శాతం తక్కువగా 656 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి పెట్టుబడులు గత కొన్నేళ్ల నుంచి స్థిరంగా వస్తున్నాయి. నిర్మాణాత్మక వచ్చిన మార్పుతో ఈ మార్కెట్ ఇంకా వృద్ధి చెందుతుంది’’అని కొలియర్స్‌ఇండియా తన నివేదికలో పేర్కొంది. తొమ్మిదేళ్ల గరిష్టానికి ఇళ్ల అమ్మకాలు దేశవ్యాప్తంగా ఎనమిది ప్రధాన నగరాల్లో గతేడాది 3,12,666 ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే 34 శాతం అధికం కాగా, తొమ్మిదేళ్లలో ఇదే గరిష్టం కావడం విశేషం. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ ఈ స్థాయి వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. ‘ముంబై అత్యధికంగా 85,169 యూనిట్లతో 35 శాతం వృద్ధి సాధించింది. ఢిల్లీ ఎన్సీఆర్ 58,460 యూనిట్లతో 67 శాతం, బెంగళూరు 53,363 యూనిట్లతో 40 శాతం, 43,410 యూనిట్లతో పుణే 17 శాతం అధికంగా విక్రయాలు నమోదు చేసింది. 28 శాతం వృద్ధితో హైదరాబాద్ 31,046 యూనిట్లు, 19 శాతం అధికమై చెన్నైలో 14,248 యూనిట్లు, 58 శాతం ఎక్కువై అహ్మదాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 14,062 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కత 10 శాతం క్షీణించి 12,909 యూనిట్లకు పరిమితమైంది. 2022లో ఆఫీస్ లీజింగ్ స్థలం స్థూలంగా 36 శాతం అధికమై 5.16 కోట్ల చదరపు అడుగులుగా ఉంది’ అని నివేదిక వివరించింది. -
మల్టీ డిసిప్లినరీ అటానమస్ సంస్థలుగా కాలేజీలు
యూనివర్సిటీల తరహాలో దేశంలోని అన్ని కాలేజీలు మల్టీ డిసిప్లినరీ (బహుశాస్త్ర మిశ్రిత) అటానమస్ సంస్థలుగా ప్రగతి సాధించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ముసాయిదా ప్రతిపాదనలను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా ఉన్నందున దేశంలోని కాలేజీలు కూడా ఆ స్థాయికి చేరేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలను రూపొందించింది. వీటిపై మార్చి 20లోగా దేశంలోని నిపుణులు, ఇతర స్టేక్ హోల్డర్లు తమ అభిప్రాయాలు వెల్లడించాలని యూజీసీ పేర్కొంది. పరిశోధనలు చేయించడంతో పాటు, ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన, డిగ్రీలను ప్రదానం చేసే అటానమస్ సంస్థలుగా కాలేజీలు రూపుదాల్చేలా చర్యలు చేపట్టనుంది. పారిశ్రామిక భాగస్వామ్యం, రీసెర్చ్ ప్రాజెక్టులు తదితర కార్యక్రమాల ద్వారా ఆయా సంస్థలు యూనివర్సిటీల స్థాయికి చేరుకోవడమే ఈ ముసాయిదా ప్రతిపాదనల లక్ష్యమని యూజీసీ వివరించింది. – సాక్షి, అమరావతి 2035 నాటికి అన్ని కాలేజీలూ స్వయం ప్రతిపత్తితో ఎదిగేలా.. 2035 నాటికి అన్ని కాలేజీలు స్వయం ప్రతిపత్తితో డిగ్రీలను ప్రదానం చేసే సంస్థలుగా ఎదిగేలా చేయాలన్నది వీటి ఉద్దేశం. 2030 నాటికి ప్రతి జిల్లాలో కనీసం ఒక్కటైనా పెద్ద సంస్థ ఈ విధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన స్థాయికి ఎదగాలని యూజీసీ నిర్దేశించింది. అలాగే నాలుగేళ్ల డ్యూయల్ మేజర్ డిగ్రీ ప్రోగ్రాములను అమలు చేసేందుకు వీలుగా ఉన్నత విద్యాసంస్థలకు అనుమతులు ఇచ్చే అంశాలను కూడా ఈ ప్రతిపాదనల్లో యూజీసీ చేర్చింది. భాగస్వామ్య విధానంలో విద్యార్థులు తాము చేరే సంస్థలో ఒక డిగ్రీ తీసుకోవడంతో పాటు సెకండ్ డిగ్రీని ఆ సంస్థతో ఒప్పందమున్న వేరే ఉన్నత విద్యాసంస్థలో పొందేందుకు వీలుగా ఆయా సంస్థలు సమన్వయంతో ముందుకు వెళ్లనున్నాయి. దీనికోసం రెగ్యులేటరీ సంస్థల నియమాలను అనుసరిస్తూ జాయింట్ సీట్ అలకేషన్ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ డిగ్రీ కోర్సులకు ఎంపికను కూడా సంబంధిత అర్హత పరీక్షల ఆధారంగానే చేపట్టాలి. భాగస్వామ్య సంస్థలు నిర్దేశించిన కనీస అర్హత మార్కులను ఆయా విద్యార్థులు సాధిస్తేనే సెకండ్ డిగ్రీతో డ్యూయల్ డిగ్రీకి అవకాశం ఉంటుంది. క్లస్టర్లుగా కాలేజీలు ఇందుకోసం కాలేజీలను ఒక క్లస్టర్‌గా రూపొందించి వాటిమధ్య పరస్పర సహకారం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం ఏదైనా ఉన్నత విద్యాసంస్థ అన్ని కోర్సులను నిర్వహించడానికి వీలైన వనరులను ఏర్పాటు చేయడం కష్టంగా మారుతోంది. దీంతో ఆ సంస్థల మల్టీ డిసిప్లినరీ కోర్సుల ఏర్పాటు, నిర్వహణ సాధ్యం కావడం లేదు. ఫలితంగా వాటిలో చేరికలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో క్లస్టర్ కాలేజీ భాగస్వామ్యంతో ఈ సమస్యను అధిగమించడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల కాలేజీల్లో చేరికలు పెరగడంతో పాటు విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని యూజీసీ పేర్కొంటోంది. భాగస్వామ్య విధానం వల్ల ఆయా సంస్థలు వనరులు సమకూర్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని, అదే సమయంలో విద్యార్థులకూ మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులోకి వస్తాయని యూజీసీ అభిప్రాయపడుతోంది. న్యాక్ అక్రిడిటేషన్, ఇతర గుర్తింపులను కూడా ఆయా సంస్థలు సాధించడానికి వీలుంటుందని యూజీసీ పేర్కొంది. -
‘అష్ట’కష్టాల్లో ఐఐటీలు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2008–09లో ఏర్పాటు చేసిన 8 ఐఐటీల్లో సమస్యలు తిష్టవేశాయని కాగ్ నివేదిక వెల్లడించింది. పరిపాలన, మౌలిక వసతుల కల్పన సహా పనితీరులో అనుకున్న మేర ఫలితాలను ఈ విద్యా సంస్థలు రాబట్టడం లేదని తెలిపింది. విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడం, పరిశోధన పత్రాల ప్రచురణలో వెనకబాటుతనం.. పీజీ, పీహెచ్డీ లాంటి కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం లాంటివి ఐఐటీల్లో డొల్లతనం బయటపెడుతున్నాయని చెప్పింది. ఐఐటీ హైదరాబాద్ సహా భువనేశ్వర్, గాంధీనగర్, ఇండోర్, జోధ్‌పూర్, మండి, పాట్నా, రోపార్‌లలోని 8 ఐఐటీల్లో 2014–19 మధ్య కార్యకలాపాలను కాగ్ పరిశీలించింది. తమ పరిశీలన నివేదికను ఇటీవలే ముగిసిన శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటుకు సమర్పించింది. 2008–09లో 8 ఐఐటీల స్థాపనకు రూ.6,080 కోట్లు ప్రతిపాదిస్తే 2019లో అవి పూర్తయ్యేనాటికి సవరించిన అంచనా వ్యయం రూ. 14,332 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఇందులో హైదరాబాద్ ఐఐటీ అంచనా వ్యయం రూ.760 కోట్ల నుంచి రూ.2,092 కోట్లకు చేరిందని వెల్లడించింది. 5 నుంచి 36 శాతం అధ్యాపకుల ఖాళీలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్య 1:10 నిష్పత్తిలో ఉండాల్సి ఉండగా హైదరాబాద్ ఐఐటీలో 2018–19 ఏడాదిలో 23 శాతం అధ్యాపకుల కొరత ఉందని కాగ్ నివేదిక పేర్కొంది. 2,572 మంది విద్యార్థులకు 257 మంది అధ్యాపకులు ఉండాలని, కానీ 197 మందే ఉన్నారని నివేదికలో తేల్చింది. ప్రతి ఏటా కొత్తగా అధ్యాపకులను తీసుకుంటున్నా 7 ఐఐటీల్లో 5 నుంచి 36 శాతం మేర ఖాళీలున్నాయంది. విద్యా నాణ్యతపై ఇది ప్రభావం చూపిందని తెలిపింది. అధ్యాపకుల స్థానాలకు తగినంత మంది అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం, పరిమిత మౌలిక సదుపాయాల వల్ల కొంతమంది విద్యార్థుల ఇన్‌టేక్ కెపాసిటీని పెంచలేకపోయారని వివరించింది. హైదరాబాద్ ఐఐటీలో ప్లేస్‌మెంట్స్ 63 శాతమే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్లేస్మెంట్ అనేది ర్యాంకింగ్ కొలమానాల్లో ఒకటని, అయితే హైదరాబాద్ ఐఐటీలో 2014–19 వరకు విద్యార్థుల ప్లేస్మెంట్ శాతం కేవలం 63గానే ఉందని కాగ్ వివరించింది. 95 శాతం ప్లేస్‌మెంట్స్ ఇండోర్, 84 శాతం ప్లేస్‌మెంట్స్‌తో భువనేశ్వర్ ఐఐటీ రెండో స్థానంలో ఉన్నాయని తెలిపింది. 8 ఐఐటీల్లో హైదరాబాద్ చివరన ఉందని చెప్పింది. 2014–19 మధ్య కాలంలో పీజీ కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నమోదు శాతం హైదరాబాద్ ఐఐటీలో చాలా తక్కువగా ఉందని కాగ్ వెల్లడించింది. ఎస్సీల్లో 25 శాతం, ఎస్టీల్లో 34 శాతం మంది పీజీ కోర్సుల్లో చేరలేదంది. పీహెచ్డీ కోర్సుల్లోనైతే ఎస్టీల్లో 73 శాతం, ఎస్సీల్లో 25 శాతం మందే చేరారని చెప్పింది. పేటెంట్లలో హైదరాబాద్ ఐఐటీ టాప్ ఆవిష్కరణలకు పేటెంట్లు సాధించడంలో మాత్రం హైదరాబాద్ ఐఐటీ ముందు వరుసలో ఉందని కాగ్ వివరించింది. 2014–19 మధ్య 94 ఆవిష్కరణల పేటెంట్లకు దరఖాస్తు చేసుకుంటే ఏకంగా 16 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకుందని చెప్పింది. ఐఐటీ జో«ధ్‌పూర్ 4, ఐఐటీ రోపార్ 2 ఆవిష్కరణలకు పేటెంట్లు దక్కించుకున్నాయని వెల్లడించింది. కాగ్ ఏం సూచించిందంటే.. ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, అధ్యాపకుల కొరత తీర్చేలా కేంద్రం చర్యలు చేపట్టాలని కాగ్ సూచించింది. కొత్త బోధన విధానాలు, సమయోచిత కోర్సుల పరిచయం, ఉన్నత విద్యా ప్రమాణాలను పాటిస్తే ఐఐటీలను మానవ వనరుల అవసరాలను తీర్చేందుకు వీలుగా అభివృద్ధి చేయవచ్చని వివరించింది. ఐఐటీలు ప్రచురించిన పేపర్లు, పొందిన పేటెంట్ల ద్వారా ప్రభుత్వేతర వనరుల నుండి నిధులను ఆకర్షించి పరిశోధనలపై మరింత దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలంది. ఐఐటీల కార్యకలాపాలపై గవర్నింగ్ బాడీలు పర్యవేక్షణ పెంచాలని, తరుచుగా భేటీ అవుతూ మంచి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
విద్యాసంస్థల తీరు మారడం లేదు: జస్టిస్ కాంతారావు
సాక్షి, అమరావతి: విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రంలోని విద్యాసంస్థల హెచ్చరించినప్పటికీ తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్, ప్రభుత్వాలు ఇది వరకే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినట్లు కాదని ఆసహనం వ్యక్తం చేశారు. (చదవండి: విద్యార్థుల అభీష్టమే ఫైనల్) ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా గత సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టించుకోవాలని తెలిపారు. అది కూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. దీనికి అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని విద్యాసంస్థలను హెచ్చరించారు. మరోవైపు మార్చి నెల నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మౌఖిక ఆదేశాలతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, జీతాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. తక్షణమే సిబ్బందికి జీతాలు అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. దీన్ని బేఖాతరు చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులతో, ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలను, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని విద్యాసంస్థలను గుర్తించాలని డీఈఓలు, ఆర్జేడీలు, ఆర్ఐవోలు ఆయన సూచించారు. (చదవండి: నిబంధనలు పాటించని స్కూళ్లు, కాలేజీల రద్దు!) తమ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడిన విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు ఉపాధ్యాయులు తమ సమస్యలను నేరుగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఫిర్యాదుల చేయోచ్చని చెప్పారు. 9150381111 కు ఫోన్ ద్వారా (ఫోన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది), apsermc2020@gmail.com కు ఈ - మెయిల్ ద్వారా, www.apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ అనే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు. -
ఉన్నత విద్య క్యాలెండర్ సిద్ధం
సాక్షి, అమరావతి: కరోనా ప్రభావంతో ఉన్నత విద్య అకడమిక్ క్యాలెండర్ అమలు తారుమారవుతోంది. కోవిడ్, లాక్డౌన్ కారణంగా సిలబస్ పూర్తికాకపోగా సెమిస్టర్ పరీక్షలు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తి చేయడంతోపాటు 2020–21 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై యూజీసీ సూచనలతో 9 అంశాలతో ఉన్నత విద్యామండలి ప్రణాళిక రూపొందించింది. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కాలేజీలు, వర్సిటీలు ఈ ప్రణాళిక ప్రకారం ప్రస్తుత విద్యాసంవత్సరం సిలబస్ పూర్తి, పరీక్షల నిర్వహణతోపాటు వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంపై సూచనలు పొందుపరిచింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ప్రణాళిక రూపొందించినా భవిష్యత్తు పరిణామాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు అవసరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నెలాఖరు కల్లా సిలబస్ పూర్తి చేయాలి.. ► 2019–20లో మిగిలిపోయిన సిలబస్‌ను విద్యాసంస్థలు జూన్ ఆఖరుకల్లా పూర్తిచేయాలి. కాలేజీల్లో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా 50 శాతం మంది విద్యార్థులను మాత్రమే తరగతులకు అనుమతించాలి. మిగతావారికి ఆన్లైన్, లైవ్ తరగతుల ద్వారా సిలబస్ పూర్తి చేయాలి. లేదా విద్యార్థులకు తరగతి గదుల్లో రెండు సెక్షన్లలో కూడా బోధించవచ్చు. ► ప్రాక్టికల్ తరగతులను కూడా భౌతిక దూరం పాటిస్తూ జూన్ ఆఖరునాటికి పూర్తిచేయాలి. ► 2019–20 ఫైనలియర్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు జూలై1నుంచి 15లోపు పూర్తిచేయాలి. చివరి పరీక్ష ముగిసిన 15 రోజుల్లోగా ఫలితాలను ప్రకటించాలి. ఇందుకు అనుగుణంగా మూల్యాంకన విధానాలు మార్పుచేసి త్వరితంగా ఫలితాలు ఇచ్చేలా చూడాలి. ఇతర సెమిస్టర్ల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ను 2020–21 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక ప్రకటిస్తారు. ఫైనలియర్ కాకుండా ఇతర సంవత్సరాలు చదువుతున్న ఈ విద్యార్థులను వారి అటెండెన్సును అనుసరించి పై సంవత్సరాలకు ప్రమోట్ చేస్తారు. ► పీహెచ్డీ స్కాలర్ల సెమిస్టర్, వైవా వాయిస్‌ల పరీక్షలను యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆన్లైన్లో పూర్తిచేయాలి. వైవా వాయిస్‌ను రికార్డుచేసి వర్సిటీలో భద్రపర్చాలి. కోవిడ్ తీవ్రతను బట్టి ప్రత్యామ్నాయ ప్రణాళిక ‘ఉన్నత విద్యామండలి రూపొందించిన ప్రణాళికకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దీని ప్రకారం తరగతుల నిర్వహణకు వర్సిటీలు, కాలేజీలు చర్యలు చేపట్టాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రణాళిక రూపొందించాం. వైరస్ తీవ్రత పెరగకుంటే దీని ప్రకారమే విద్యా సంస్థలు ముందుకు వెళతాయి. లేదంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది’ – ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
సమర శంఖం!
కరోనా వైరస్‌పై అన్నివైపుల నుంచి దాడికి ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఇతర పరిశోధనల సంస్థలు చేతులు కలిపాయి. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం దన్నుతో ఇంకో ఏడాదిలోగా కరోనా వంటి వైరస్‌లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేయనున్నాయి. వివరాలివీ... టీకా, మందు లేని కరోనా.. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తోంది. వేల మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కరోనా వైరస్ కుటుంబంలో మనకు ఇప్పటివరకు తెలిసింది ఏడు మాత్రమే. మిగిలిన 32లో ఏ ఒక్కటి తోక జాడించినా.. మన మనుగడ కష్టమే. ఈ నేపథ్యంలో ఈ రకమైన వైరస్‌లకు విరుగుడు కనిపెట్టేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగంలోని సైన్స్ అండ్ ఇంజినీరింగ్ బోర్డు.. దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థలకు ప్రాజెక్టులు అప్పగించింది. బాంబే, కాన్పూర్, ఢిల్లీ ఐఐటీలతోపాటు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లు వేర్వేరు మార్గాల్లో వైరస్ బెడద తొలగించుకునే మార్గాలను ఆవిష్కరించేందుకు సిద్దమయ్యాయి. బయో మార్కర్లతో ఆటకట్టు.. కరోనా బారినపడ్డ వారిలో వైరస్‌కు సంబంధించిన బయో మార్కర్లను గుర్తించేందుకు ఐఐటీ బాంబేకి చెందిన సంజీవ్ శ్రీ వాస్తవ ఓ ప్రాజెక్టు చేపట్టారు. జీవక్రియల్లో భాగంగా ఏర్పడే బయో మార్కర్లను గుర్తిస్తే వాటి ఆధారంగా వైరస్‌ను నిర్వీర్యం చేయగల చికిత్సల రూపకల్పన వీలవుతుంది. పదార్థాల తయారీ.. ప్రస్తుతం మనం వైరస్ల నుంచి రక్షణ కోసం శాని టైజర్లు, కొన్ని డిసిన్ఫెక్టెంట్లు ఉపయోగిస్తున్నాం. అలాగే వైరస్లు తమపై ఉండేందుకు అవకాశం కల్పించని పదార్థాల తయారీ కోసం ఐఐటీ కాన్పూర్‌కు చెందిన నగ్మా ప్రవీణ్ పరిశోధనలు చేపడుతున్నారు. సర్జికల్ మాస్కులు మొదలుకొని అనేక ఇతర వైద్య పరికరాల్లో, వైద్యశాలల్లో ఈ పదార్థాన్ని పూత పూయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవ చ్చు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లోని జయంత హల్దర్ కూడా తాకిన వెంటనే వైరస్‌లను మట్టుబెట్టగల సూక్ష్మ అణువులను, అణు సమ్మేళనాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శానిటైజర్లకు ప్రత్యామ్నాయం.. శానిటైజరుకు ప్రత్యామ్నాయంగా పరిసరాల్లోని వైరస్‌లను ఆకర్షించి చంపే వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఐఐటీ ఢిల్లీ శాస్త్రవేత్త బీఎస్ బుటోలా ఓ ప్రాజెక్టు చేపట్టారు. తడి గుడ్డతో ఇల్లు తుడిచినట్లే బుటోలా బృందం అభివృద్ధి చేసే పదార్థంతో ఉపరితలాలపై ఉండే వైరస్‌ను ఆకర్షించి మరీ మట్టుబెట్టవచ్చన్న మాట. యాంటీబాడీలు.. కరోనా సోకిన వ్యక్తుల రక్తంలో ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు తయారవుతాయి. ఇలాంటి యాంటీబాడీల తయారీకి ఐఐటీ బాంబే శాస్త్రవేత్త కిరణ్ కొండబాగిల్ పరిశోధనలు చేస్తున్నారు. కరోనా ఉపరితలంపై ఉండే గ్లైకోప్రొటీన్ పనిపట్టేందుకు ఈ యాంటీబాడీలు దోహదపడతాయి. – సాక్షి, హైదరాబాద్ -
యూనివర్సిటీలు ఇక మానవాభివృద్ధి కేంద్రాలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఉన్నత విద్యా కోర్సులను సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రతి సంస్థకు పారిశ్రామిక అనుసంధానం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో మానవ వనరుల అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకలి్పంచింది. యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లోని సంప్రదాయక కోర్సులను నేటి అవసరాలకు అనుగుణంగా నవీకరించడం, ఉన్నత విద్యా కోర్సులను సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆయా విద్యాసంస్థల్లోని బోధనా విధానాల్లో సమూల మార్పులు చేయడం, క్షేత్రస్థాయి పరిశీలనలు, పరిశోధనలు, ప్రాజెక్ట్ వర్క్‌ల ద్వారా విద్యార్థుల్లో అవగాహన, పరిశీలనాశక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలు పెరిగేలా నైపుణ్యాలను పెంచడం, బోధకులకు నూతన విధానాలపై ఎప్పటికప్పుడు పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి లక్ష్యాలతో మానవాభివృద్ధి కేంద్రాలు పనిచేస్తాయి. వీటిని శాశ్వత ప్రాతిపదికన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమయ్యే వనరులను యూజీసీయే సమకూరుస్తుంది. గ్రాడ్యుయేట్లు పెరుగుతున్నా.. ఉపాధి కరవు దేశంలో 950 యూనివర్సిటీలు, వాటి పరిధిలోని 42 వేల కాలేజీల్లో 3.1 కోట్ల మంది విద్యను అభ్యసిస్తున్నారు. గడచిన పదేళ్లలో ఆయా విద్యాసంస్థల్లో చేరికలు రెట్టింపయ్యాయి. ఏటా కాలేజీల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతున్నా నైపుణ్యాల లేమి కారణంగా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యం కావడం లేదు. లక్ష్యాల నిర్దేశం లేకుండా సాగుతున్న విద్యావిధానం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. విద్యాసంస్థల నుంచి బయటకు వచి్చన తరువాత ఉపాధి అవకాశాలు దక్కేలా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఇకనుంచి అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ (ఓబీఈ) విధానాన్ని అనుసరించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా దీనిని ప్రారంభించనున్నారు. లక్ష్యాలివీ.. ►ఉన్నత విద్యారంగంలో పరస్పర భాగస్వామ్యం ద్వారా సృజనాత్మకతల పెంపు. ►ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్యాసంస్థల్లోని గరిష్ట చేరికలు 25.2గా ఉంది. దాన్ని 50 శాతంగా చేయడం. ►ఉన్నత విద్యాసంస్థల్లోని గరిష్ట చేరికల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని.. లింగ, సామాజిక వ్యత్యాసాన్ని తగ్గించడం. ►ప్రపంచ స్థాయిలో ప్రతిభ కలిగిన ప్రతి నలుగురిలో ఒకరు భారతీయుడు ఉండేలా ఉన్నత విద్యారంగాన్ని తీర్చిదిద్దడం. ►అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 200 వర్సిటీల్లో 20 వర్సిటీలు దేశానికి సంబంధించినవే ఉండేలా రూపకల్పన చేయడం. ►ఫ్రీ మాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సు (మూక్స్) పెంచడం.. వ్యక్తి కేంద్రీకృతంగా నైపుణ్యాలు పెంచేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించడం. ►స్టార్టప్ ప్రోగ్రామ్‌లు, ఎంటర్ప్రెన్యూర్ షిప్ దిశగా విద్యార్థుల ఆసక్తిని మళ్లించడం.. ఇందుకు ‘ఇన్–హౌస్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇంక్యుబేటర్’ల ఏర్పాటు దిశగా టీచర్లను ప్రోత్సహించడం. ►ప్రతివారం అకడమిక్ లీడర్ షిప్, సాంకేతికాభివృద్ధి అభ్యసనం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, సామాజిక సంబంధాలు పెంపొందించేలా ‘థీమ్ బేస్డ్’ కార్యక్రమాల నిర్వహణ. ►వీటిద్వారా అంతర్జాతీయ, జాతీయ దృక్కోణంలో విద్య అంతఃస్సారాన్ని అర్థం చేసుకోవడం. 2020 నాటికి గుణాత్మక మార్పులు కనిపించేలా.. ►మానవ వనరుల అభివృద్ధి కేంద్రాల ద్వారా 2020 నాటికి ఉన్నత విద్యారంగంలో గుణాత్మక మార్పులు సాధించడం యూజీసీ లక్ష్యం. ►ఇందుకు ఇస్రో, నాసా సహకారంతో ‘శాటిలైట్ ఇంటరాక్టివ్ టెలివిజన్ ఎక్స్పర్మెంట్ (సైట్)’, యూజీసీ ‘కన్సారి్టయం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సీఈసీ)’ విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం. ►దేశంలో ‘ప్రీ డిజిటల్’ కాలానికి చెందిన లక్షలాది మంది బోధకుల్లో ఇన్సెంటివ్, ఇతర విధానాల ద్వారా మార్పులు తీసుకురావటం. మానవ వనరుల అభివృద్ధి కేంద్రాల పనితీరు ఇలా ►యూనివర్సిటీ స్థాయిలో ఏర్పాటు చేసే హెచ్‌ఆర్‌డీసీలు.. యూజీసీ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తితో కార్యకలాపాలు నిర్వహించాలి ►వర్సిటీలు, కాలేజీలకు మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చాలి.. వేర్వేరు రాష్ట్రాల్లోని వర్సిటీలను అనుసంధానించాలి ►యూజీసీ నిబంధనల మేరకు నూతన కోర్సులను ఇవి రూపొందించాలి ►ఇప్పటికే పనిచేస్తున్న బోధనా సిబ్బందికి పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించాలి ►వీటి నిర్వహణకు ఏటా రూ.25 లక్షల చొప్పున యూజీసీ అందిస్తుంది ►లైబ్రరీ, పరికరాల నిర్వహణ, ఇతర కార్యక్రమాలకు నిర్దేశిత మొత్తాలను ఇస్తుంది -
జేఈఈ ఫైనల్ ‘కీ’లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు (జీఎఫ్‌టీఐ)లలో బీఈ/బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షల ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ప్రకటించింది. ప్రాథమిక ‘కీ’తో పోల్చితే అం దులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 11 ప్రశ్నలకు జవాబులు మారిపోగా 11 ప్రశ్నలను తొలగించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 70 వేల మంది సహా దేశవ్యాప్తంగా 8,74,469 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ‘కీ’ ప్రకటించి వాటిపై విద్యార్థుల అభ్యం తరాలను స్వీకరించింది. దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకుండానే ఈ నెల 19న ఫలితాలను (విద్యార్థుల నార్మలైజేషన్ స్కోర్) ప్రకటించింది. అదే రోజు ఫైనల్ ‘కీ’ కూడా వెలువడుతుందని భావించినా ఎన్టీఏ దాన్ని బుధవారం ప్రకటించింది. ‘కీ’ని పరిశీలించిన జేఈఈ నిపుణులు ఉమాశంకర్ ప్రాథమిక ‘కీ’, ఫైనల్ ‘కీ’ మధ్య వ్యత్యాసం ఉందని అంచనా వేశారు. దీంతో 11 ప్రశ్నలను తొలగించడంతోపాటు మరో 11 ప్రశ్నలకు సంబంధించిన జవాబుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. తొలగిం చిన 11 ప్రశ్నలకు ఆయా షిప్ట్‌లలో పరీక్షలకు హాజరైన విద్యార్థులకు మార్కులను కేటాయిం చినట్లు ఎన్టీఏ తెలిపింది. అయితే 8 షిఫ్ట్‌లలో పరీక్షలు రాసిన విద్యార్థుల స్కోర్‌ను నార్మలైజేషన్ చేసి వారి పర్సంటైల్‌ను ఇటీవల ఎన్టీఏ ప్రకటించడం తెలిసిందే. దీనిలో భాగంగా 100 పర్సంటైల్‌లో సాధించిన వారు దేశవ్యాప్తంగా 15 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఆ ఫలితాలను ఎన్టీఏ ఎలా వెల్లడించిందన్న విషయం లో అనుమానాలు నెలకొన్నాయి. ప్రాథమిక ‘కీ’పై ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ‘కీ’ని సిద్ధం చేసి ఫలి తాలను ప్రకటించిందా లేక వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాలను ప్రకటించిందా? అనే గందరగోళం నెలకొంది. ఒకవేళ వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే ఫైనల్ ‘కీ’ ప్రకారం 100 పర్సంటైల్లోకి వచ్చే తెలుగు విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రకటించిన 100 పర్సంటైల్ విద్యార్థుల్లో తెలుగువారు ఐదుగురు ఉండగా ఆ ఫలితాల్లో ఫైనల్ ‘కీ’ని పరిగణనలోకి తీసుకోకపోతే జరిగిన మార్పు లు, ఫైనల్ ‘కీ’మేరకు చూస్తే మరో 10 మంది వరకు తెలు గు విద్యార్థులు 100 పర్సంటైల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇవీ వివిధ షిఫ్ట్‌లలో జవాబుల మార్పు, ప్రశ్నల తొలగింపు.. ఈ నెల 9న జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నకు జవాబును మార్చింది. అలాగే మ్యాథ్స్‌లో ఒక ప్రశ్న కు జవాబును మార్పు చేసింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నల జవాబులను మార్చింది.10వ తేదీన జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా, మ్యాథ్స్ లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయడంతోపాటు ఒక ప్రశ్నను తొలగించింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. 11వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు జవాబులను మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. మ్యాథ్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేసింది. అదేరోజు మధ్యాహ్నం జరిగిన రెండో షిప్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. అలాగే మ్యాథ్స్‌లో ఒక ప్రశ్నను తొలగించింది.12వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను తొలగించింది. -
6 విద్యా సంస్థలకు కిరీటం
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదా కల్పించింది. ఇందులో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలుగా తీర్చిదిద్దేందుకు వీటికి స్వయం ప్రతిపత్తి కల్పించడంతోపాటు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేయనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరుతోపాటు ప్రైవేటు సంస్థలైన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను కేంద్రం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించింది. ఐవోఈ హోదా పొందిన ఈ మూడు ప్రభుత్వ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్ల నిధులను కేంద్రం అందజేయనుంది. ప్రైవేటు సంస్థలకు మాత్రం ప్రభుత్వ నిధులు అందవు. మొత్తంగా 20 సంస్థలకు (10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థలు కలిపి) ఐవోఈ హోదా ఇవ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి నేతృత్వంలోని ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ (ఈఈసీ).. తొలి దశలో 6 సంస్థలకు ఐవోఈ ప్రకటించింది. టాప్ 100లో ఒక్క వర్సిటీ లేదు ‘ఐవోఈ దేశానికి ఎంతో ముఖ్యం. దేశంలో మొత్తం 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 100 వర్సిటీల్లో ఒక్కటి కూడా చోటు దక్కించుకోలేదు. కనీసం టాప్ 200లో నిలవలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపకరిస్తుంది’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్వీట్ చేశారు. ఐఓఈ హోదా కోసం తెలంగాణకు చెందిన ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు 114 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 సెంట్రల్ యూనివర్సిటీలు, 27 టాప్ ఐఐటీలు, ఎన్ఐటీలు, రాష్ట్రాలకు చెందిన 27 వర్సిటీలు, పది ప్రైవేటు వర్సిటీలు, నాలుగు గ్రీన్‌ఫీల్డ్ సంస్థలు ఉన్నాయి. ఇంకా స్థాపించని సంస్థకు ఐఈవోనా? రిలయన్స్ సంస్థకు చెందిన జియో ఇన్స్టిట్యూట్ను ఇంకా స్థాపించనేలేదనీ, ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను కాదని జియో ఇన్స్టిట్యూట్కు ఐఈవో హోదా ఎలా ఇచ్చా రని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు జియో ఇన్స్టిట్యూట్ అనే విద్యా సంస్థ ఒకటి రాబోతోందని ప్రపంచానికి తెలిసిందే సోమవారమని అంటున్నారు. ‘జియో ఇన్స్టిట్యూట్కు క్యాంపస్ లేదు. వెబ్సైట్ లేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పూర్ లేదా ప్రైవేట్ రంగంలోని అశోక వర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీ వంటి ప్రఖ్యాత సంస్థలనెన్నింటినో కాదని ఐఈవో హోదా జియోకు ఎలా దక్కింది?’ అని పలువురు విద్యావేత్తలు సహా అనేక మంది ట్వీటర్లో హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను ప్రశ్నించారు. అయితే జియోకు ఐఈవో హోదా ఇవ్వడాన్ని యూజీసీ సమర్థించుకుంది. గ్రీన్‌ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో జియోకు ఆ హోదా ఇచ్చామనీ, ఈ కేటగిరీ కింద మొత్తం 11 సంస్థలు దరఖాస్తు చేసుకోగా జియోను అవకాశం వరించిందని యూజీసీ పేర్కొంది. -
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం
అనంతపురం అర్బన్: జిల్లాలోని విద్యాసంస్థలు అన్నింటిలో రాగ్యింగ్ నిషేధిస్తున్నామని కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ జి.వి.జి.అశోక్‌కుమార్ తెలిపారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కి పాల్పడిన వారిపైనే కాకుండా ఇకపై యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా కేసులు నమోదవుతాయన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కలెక్టర్ అధ్యక్షతన ఆర్డీఓలు, విద్యాసంస్థల ప్రినిపాళ్లు, యూనివర్సిటీల రిజిస్ట్రార్, రెక్టార్లతో సమావేశం నిర్వహించారు. గజల్ శ్రీనివాస్ ఆలపించిన ‘ఆటకాదురా ఆటవికమురా... వద్దురా ర్యాగింగ్’ అనే వీడియోని సమావేశంలో ప్రదర్శించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థలలో విద్యార్థులను ఇబ్బందికి గురిచేసే చర్యలు చోటు చేసుకోకుండా యాజమాన్యాలు నిఘా ఉంచాలన్నారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై మాత్రమే ఇప్పటి వరకు చర్యలు ఉండేవన్నారు. ఇకపై విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా కేసులు నమోదవుతాయన్నారు. ర్యాగింగ్ నిరోధానికి జిల్లా యంత్రాగం చేసే సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2014లో వైద్య కళాశాలలో నమోదైన క్రిమినల్ కేసు మినహా ఇప్పటి వరకు ఎలాంటి ర్యాగింగ్ కేసులు జిల్లాలో నమోదు కాలేదన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు జరిగే వరకు కళాశాలల్లో సీసీ కెమెరాల ద్వారా, కమిటీల ద్వారా విద్యార్థులపై నిఘా ఉంచాలన్నారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు పెడదారిన పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. విద్యాసంస్థల్లో సందేశాత్మక, స్ఫూర్తిదాయక గేయాలను, మహనీయుల సత్సంగాలు, ప్రబోధాలు ఇప్పించాలన్నారు. డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి మాట్లాడుతూ కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ వైస్ చైర్మన్‌గా, ఆర్డీఓలు, ఎస్డీపీఓలు, కళాశాల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ ర్యాగింగ్ నిరోధక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టు ద్వారా మాజీ సీబీఐ డైరెక్టర్ ఆర్.కె.రాఘవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ విద్యాసంస్థల్లో ర్యాగింగ్ జరకుండా నిర్దేశించిన మార్గదర్శకాలను యాజమాన్యాలు పాటించాలన్నారు. యాంటీ ర్యాగింగ్‌పై ఎస్కేయూనివర్సిటీ రూపొందించిన ‘ర్యాగింగ్ చేస్తే ఇక జైలుకే’ పోస్టర్లను అధికారులు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓలు మలోలా, రామారావు, బాలానాయక్, డీఎస్పీ మల్లికార్జున వర్మ, సదానందరెడ్డి, జేఎన్టీయూ రెక్టార్ సుబ్బారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు పి.రాజారాం, తదితరులు పాల్గొన్నారు. -
వెళ్తున్నా..వెళ్తున్నా..
⇔ విశాఖకు తరలిపోయిన పెట్రో యూనివర్శిటీ, అదే బాటలో ఐఐఎఫ్‌టీ ⇔ రావల్సిన మరో మూడు పరిశ్రమలపైనా నీలినీడలు ⇔ నేతల నిర్లక్ష్యంతో ఇతర జిల్లాలకు తరలింపు ⇔ విశాఖకు ఎగరేసుకుపోయే ప్రయత్నాలు ⇔ ఆపేందుకు ప్రయత్నాలు శూన్యం జిల్లాకు రావల్సినవి కొత్త రెక్కలు కట్టుకొని ఇతర జిల్లాకు తరలిపోతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో కొరవడిన చిత్తశుద్ధి ఫలితంగా ఈ పరిస్థితి నెలకుంది. పర్సెంటేజీలు వస్తాయంటే చాలు ఆహ్వానించే నేతలున్న ఈ జిల్లా నేతలు విద్యార్థిలోకానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే సంస్థలు తరలిపోతున్నా కనీసం చీమకుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రగతిలో ముందుంటామని గొప్పలకుపోయే పాలకులు అరుదైన అవకాశాలను చేజార్చేస్తున్నారు. ఆర్థికంగా కలిసి వస్తుందంటే చాలు గద్దల్లా వాలిపోయే నేతలు ... తనకు కలిసి రాదంటే కన్నెత్తి కూడా చూడని దుస్థితి. విద్యార్థి లోకానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే అరుదైన ఇనిస్టిట్యూట్లు సరిహద్దులు దాటిపోతున్నా చీమకుట్టినట్టయినా లేదు. వీరి నిర్వాకంతో జిల్లాకు వచ్చిన మరో అరుదైన అవకాశం చేజారిపోయేలా కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో కేంద్రం జిల్లాకు పలు ఇనిస్టిట్యూట్లను మంజూరు చేసింది. ఇందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఒకటి. ఆ ఇనిస్టిట్యూట్‌ను రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లాకు వచ్చేట్టు చేయాల్సిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. చంద్రబాబు కేబినెట్లో నంబర్-2గా చెప్పుకునే మంత్రి యనమలతోపాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కనీసం ఈ సంస్థ ఏర్పాటుపై చేసిన ప్రయత్నం ఏమీ లేదు. విభజన తరువాత ప్రతిష్టాత్మకంగా భావించిన పెట్రో యూనివర్సిటీ జిల్లాకు మంజూరైంది. కృష్ణా గోదావరి బేసిన్లో కీలకమైన కోనసీమలో అపారమైన చమురు, సహజవాయువు నిక్షేపాలు వెలికి తీస్తున్న క్రమంలో పెట్రో యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటైతే జాతీయ స్థాయిలో జిల్లా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయనుకున్నారు. పెట్రోలియం రంగంలో శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలకు ఒక మార్గదర్శకంగా òపెట్రో యూనివర్సిటీ నిలుస్తుందని విద్యార్థి లోకం ఆశలు పెంచుకుంది. ఎంతో ఉపయోగకరం పెట్రో యూనివర్శిటీ... కొన్ని పరిశ్రమ కోసం ప్రజలు వద్దన్నా ప్రభుత్వమే బలవంతంగా వందల ఎకరాలను సేకరిస్తోంది. తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాయంటే పోలీసులను ఉసిగొల్పి కాలుష్య పరిశ్రమలైనా రప్పించుకుంటున్నాయి. అటువంటిది కేవలం 87 ఎకరాలు భూ సేకరణ చేస్తే సరిపోయే పెట్రో యూనివర్సిటీని గాలికొదిలేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, రాజానగరం, మండపేట తదితర ప్రాంతాల్లో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు కమిటీ పరిశీలన జరిపింది. అప్పుడు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం చొరవ తీసుకోకపోవడంతోనే ఆ యూనివర్సిటీ విశాఖ జిల్లాకు అక్కడి ప్రజాప్రతినిధులు ఎగరేసుకుపోయారు. అలా ప్రతిష్టాత్మక పెట్రో యూనివర్సిటీని జిల్లా నుంచి చేజారిపోగా, ఇప్పుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అదే బాటలో పయనిస్తోంది. ఈ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర పరిశీలన కమిటీ గత ఏడాది రాజమహేంద్రవరం, మండపేట, రాజానగరం పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రభుత్వ అసైన్ఢ్ భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఐఐఎఫ్టీతోపాటు లాజిస్టిక్ వర్సిటీ, ఇండస్ట్రియల్ పార్కు, కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జీడిపప్పు పరిశ్రమల ఏర్పాటు చేయాలనుకున్నారు. వీటిలో ఐఐఎఫ్‌టీకి రాజమహేంద్రవరం అనుకూలంగా ఉంటుందని సెర్చ్ కమిటీ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఆ కమిటీని కలిసి ఇనిస్టిట్యూట్ ఏర్పాటుపై కనీసం జిల్లా ప్రజాప్రతినిధులు ఒక్కసారి కూడా చర్చించకపోవడం వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. గతంలో పెట్రో యూనివర్సిటీ విషయంలో నిర్లక్ష్యం వహించిన రీతిలోనే ఇప్పుడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ విషయాన్ని కూడా పాలకులు గాలికొదిలేశారు. ఆ మంత్రులకున్న చిత్తశుద్ధి వీరికేదీ...? విభజన అనంతరం రాజధానిగా మంగళగిరి ఏర్పాటయ్యాక పారిశ్రామికంగా విశాఖపట్నంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న పలుకుబడిని వినియోగించి ఈ ఇనిస్టిట్యూట్‌ను విశాఖకు తరలించేందుకు విశాఖ ఎంపీ హరిబాబు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలియవచ్చింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ముగ్గురు ఎంపీలు మురళీమోహన్, తోట నరసింహం, పండుల రవీంద్ర అధికార పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా విద్యా సంస్థలు, పరిశ్రమలు తరలిపోకుండా అడ్డుకుంటారనే నమ్మకం జిల్లా ప్రజలకు కలగడం లేదు. వీటి ఏర్పాటుపై నియమితమైన సెర్చ్ కమిటీ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అనువుగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చింది. సహజంగా రాజమహేంద్రవరం అనే సరికి అక్కడి ఎంపీ మురళీమోహన్ కీలకమైన పాత్ర పోషించాలి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మురళీమోహన్ గట్టి ప్రయత్నం చేస్తే ఐఐఎఫ్టి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోనే ఈ సరికే ఏర్పాటయ్యేది. కాకినాడ ఎంపీ తోట నరసింహం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పలు స్టాండింగ్ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్యాధికుడిగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా ఆ స్థాయిలో వీటి కోసం ప్రయత్నం చేయడం లేదనే విమర్శలున్నాయి. ఐఐఎఫ్‌టీ ప్రయోజనాలెన్నో... ఈ ఇనిస్టిట్యూట్ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో 1963లో ఏర్పాటైంది. మానవ వనరుల అభివృద్ధిని విశ్లేషించడం, నిరంతరం పరిశోధనలు నిర్వహించడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యం. విదేశీ వాణిజ్యం నిర్వహణ, పెరుగుదల, ఎగుమతులను పెంపొందించాలనే లక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయీకరణకు దోహదపడేలా సరికొత్త ఆలోచనలు, నైపుణ్యాభివృద్ది, కార్పొరేట్, ప్రభుత్వ రంగంలో పరిశోధన ఆధారిత కన్సల్టెన్సీని అందించే సామర్థ్యం కలిగిన ఇనిస్టిట్యూట్ ఇది. నిరంతర పరిశోధన, కన్సల్టెన్సీల ద్వారా ప్రభుత్వం వాణిజ్య, పరిశ్రమ అవసరాల కోసం ఎప్పటికప్పుడు విజ్ఞానం ఆ«ధారంగా సేవలందిస్తుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, కెరీర్ నిపుణుల ఆకాంక్షలకు అనుగుణంగా కోర్సులు అందిస్తుండటంతో విదేశీ విద్యార్థులు కూడా ఆకర్షితులవుతారు. ‘ఐఐఎఫ్‌టీకి రాజమహేంద్రవరం అనుకూలం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటుకు అన్ని విధాలా రాజమహేంద్రవరం అనుకూలమైనది. విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం ఐఐఎఫ్టీతో మరింత ప్రగతిని సాధించడంతోపాటు ఏటా సుమారు రూ. వంద కోట్ల మేరకు వ్యాపార లావేదేవీలు జరగడానికి, సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు కూడా ఇక్కడనే ఉన్నందున ఐఐఎఫ్‌టీని కూడా రాజమహేంద్రవరంలోనే ఏర్పాటుచేయడం సముచితం. - ఆచార్య ఎస్. టేకి, డీన్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరం. ఉపాధి అవకాశాలు కోల్పోనున్న స్థానికులు నవ్యాంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారన్ ట్రేడ్ పరిశ్రమ రావడంపై హర్షం వ్యక్తం చేశాం. ఇప్పటికీ దాని కార్యాచరణ తెలపకపోగా ప్రస్తుతం అది కూడా ఇతర జిల్లాకు తరలిపోతున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మన జిల్లా నేతలు ఉన్న కారణంగా పరిశ్రమను ఇక్కడే ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని కోరుతున్నాం. జిల్లాలో సాంకేతిక విద్యతోపాటు మేనేజ్మెంట్ కోర్సు చేసిన అభ్యర్థులు వేలాది మంది ఉన్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు వస్తాయి. - బి.ప్రభాకరరావు, జేఎన్‌టీయుకే రెక్టార్ పరిశ్రమ ఇక్కడే ఏర్పాటు చేయాలి జిల్లాలో సాంకేతిక యూనివర్సిటీ జేఎన్టీయుకేతోపాటు నన్నయ్యవంటి వర్సిటీలు ఉన్న నేపథ్యంలో పరిశ్రమలు కూడా ఏర్పడితే జిల్లా అభివృద్ధితోపాటు పరిశ్రమలకు తగ్గ మ్యాన్ పవర్‌ను వర్సిటీల నుంచి తీసుకోవచ్చు. గతంలో జిల్లాకు పెట్రోలియం వర్సిటీ మంజూరు కాగా తరగతులను జేఎన్టీయుకేలో నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించగా, పెట్రో యూనివర్సిటీ ఇతర జిల్లాకు తరలించారు. ఈ పరిశ్రమ కూడా అ విధంగా చేజారకుండా చూడాలి. -ఎ.గోపాలకృష్ణ, డిజైన్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్, జేఎన్‌టీయుకే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి... పెట్రోలియం యూనివర్శిటీ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు స్థానికంగా ఏర్పాటైతే మన జిల్లాకు చెందిన యువతకు కొంత వరకు ఉపాధి అవకాశాల ప్రయోజనం ఉంటుంది. స్థానికంగా చమురు సంస్థలు ఉన్నందున ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యం యువతకు వస్తే వారి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అటువంటి యూవర్శిటీని జిల్లాకు వచ్చినట్టే వచ్చి పోవడం దురదృష్టకరం. – మట్టపర్తి రవిశంకర్, బీటెక్ , గంగలకుర్రు అగ్రహారం, అంబాజీపేట నేతలకు చిత్తశుద్ధి లేక పోవడం వల్లే... మన జిల్లా నేతలకు అభివృద్ధిపైనా..యువతకు మేలు చేసే యూనివర్శిటీల సాధన, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చిత్తశుద్ధి లేదు. ఈ కారణంగానే జిల్లాకు మంజూరైనా పెట్రోలియం యూనివర్శిటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫారన్ ట్రేడింగ్ వంటివి పక్క జిల్లాలకు వెళ్లిపోతున్నాయి. నేతలు ఇప్పటికైనా స్పందించి ఇటువంటివి సాధించడం ద్వారా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. – బండారు రామ్మోహనరావు, ఓయూ పూర్వవిద్యార్థుల సంఘం, అమలాపురం. -
మంచి మనుషులను తయారు చేయాలి!
విద్యాసంస్థలకు ప్రణబ్ సూచన పురూలియా: మారుమూల ప్రాంతాల్లో స్థానికులు ఏర్పాటుచేసే విద్యాసంస్థలు.. ప్రెసిడెన్సీ కాలేజీ, ద హిందూ స్కూల్ వంటి ప్రముఖ విద్యాలయాల స్థాయికి ఎదిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్లోని ‘ఝాల్దా సత్యభామ విద్యాపీఠ్’ వందేళ్ల వ్యవస్థాపక వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్ని ప్రసంగించారు. విద్యాసంస్థలు తెలివైన విద్యార్థులతోపాటు.. సమాజ రూపురేఖలు మార్చే మానవత్వం ఉన్న మంచి మనుషులను తయారుచేయాలన్నారు. -
26న విద్యా సంస్థల బంద్
నల్లగొండ టూటౌన్: ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26న∙రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ చేపడుతున్నట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిఖిత తెలిపారు. గురువారం ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. 22న సీఎం శవయాత్రలు, 25న రాస్తారోకోలు, 26న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టి పెంచిన ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ ఫీజులను పూర్తిస్థాయిలో ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం విద్యా సంస్థల బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నీరటి రమేష్, కో – కన్వీనర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటీ, ఎన్ఐటీల్లో ఫీజుల మోత!
-
‘స్వచ్ఛభారత్’ను విజయవంతం చేయాలి
ఖమ్మం సిటీ: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఈనెల 18న నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్లను కలెక్టర్ ఇలంబరితి ఆదేశించారు. జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై మున్సిపాలిటీలు దృష్టిసారించాలన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ ఇన్చార్జ్జ్ కమిషనర్ వేణుమనోహర్, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు సంపత్, వెంకటేశ్వర్లు, అంజనకుమార్, రవి, భాస్కర్, శ్రీనివాస్, డీఈలు వెంకటశేషయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
సేవలకు సెలవు
సాక్షి, తిరుపతి: సీమాంధ్ర బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 64 శాఖల్లో 115 సేవలు నిలిచిపోయాయి. ఉద్య మం ఆరంభమైన జూలై 31వ తేదీ నుంచి వివిధ శాఖలకు చెందిన సేవలు స్తంభించిపోయాయి. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. మొత్తం 46 వేల మందికి పైగా ఉద్యోగులు ఉద్యమంలో పా ల్గొంటున్నారు. సుమారు 15వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జిల్లాలో 42 లక్షల మందికి పైగా జనాభా ఉంది. వీరికి నిత్యం సేవలు అందించేందుకు వేలాది మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తెలంగాణ విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి తొమ్మిది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటున్నారు. దీంతో జిల్లాలో ప్రజాసేవలన్నీ ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. ఇన్నాళ్లు పంచాయతీలకు ఎన్నికలు లేకపోవటంతో పాలన పడకేసింది. ఎన్నికలు జరిగాయని సంబరపడుతుండగా చివరి దశ పోలింగ్ రోజే విభజన ప్రకటన వచ్చింది. దీంతో సర్పంచ్‌లు ఎన్నికైనప్పటికీ పాలన ముందుకు సాగించలేని పరిస్థితి. దీంతో పల్లె జనం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రీవెన్స సెల్‌కు అందని ఫిర్యాదులు సమైక్య ఉద్యమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు 72 గంటలపాటు పెన్‌డౌన్ ముగియగానే గురువారం నుంచి రిలే నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరి స్థితి. మొత్తం 29 సేవలు ఉంటే తాగునీరు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం మినహాయించారు. ఉద్యోగులెవ్వరూ విధుల్లో లేకపోవటంతో ప్రతిరోజూ స్థానిక సమస్యలపై వచ్చే ఫిర్యాదులు రావటం లేదు. ఒక్క తిరుపతిలోనే రోజుకు 100కుపైగా ఫిర్యాదులు వస్తుం టాయి. అలా జిల్లా వ్యాప్తంగా చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, పుత్తూరు, నగరి, పలమనేరు మున్సిపాలిటీల్లో మొత్తంగా 500కుపైగా ఫిర్యాదులు అందుతుంటాయి. ప్రస్తుతం ఫిర్యాదులు తీసుకునే వారే లేకపోవడం గమనార్హం. ప్రతి సోమవారమూ నిర్వహించే ‘కాల్‌యువర్ కమిషనర్’ కార్యక్రమానికి బ్రేక్ పడింది. దీంతోపాటు ప్రతి సోమవారమూ కలెక్టరేట్, ప్రతి మండలంలో రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స డే కార్యక్రమాలు నిలిచిపోయాయి. ‘మీ సేవ’ ద్వారా అందించే 16 సేవలు నిలిచిపోయాయి. సదస్సులు వాయిదా తెలంగాణ ప్రకటన చేయకపోతే ఆగస్టు మొదటి వారంలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభమయ్యేది. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఆగిపోయాయి. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా వాయిదా పడినట్లేనని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇలా జిల్లాలో సమైక్య ఉద్యమాలతో పాలన స్తంభించడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. అయినా ఉద్యమం మాత్రం ఆపేది లేదని ప్రజలు స్పష్టం చేస్తుండడం గమనార్హం.