ముంబై: పరిపాలనా ప్రమాణాలను బలోపేతం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలను (హెచ్‌ఎఫ్‌సీలు) ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కోరారు. ఎంపిక చేసిన పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల ఎండీలు, సీఈవోలతో గవర్నర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వరంగంలోని ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల చీఫ్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సంస్థలు ఈ రంగంలోని మొత్తం ఆస్తుల్లో సగం నిర్వహిస్తుండడం గమనార్హం.
బ్యాంకింగ్ సేవలు చేరువ కాని లేదా అందుబాటులో లేని వర్గాలకు రుణాలను అందిస్తూ ఈ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ఆర్‌బీఐ గవర్నర్ గుర్తిస్తూ.. అనుకూల సమయాల్లో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అప్రమత్తం చేశారు. పరిపాలనా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. నిబంధనల అమలు, రిస్క్ నిర్వహణ, అంతర్గత ఆడిట్‌ల యంత్రాంగం విషయమై భరోసా అవసరమన్నారు.
ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు తమ నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే అన్‌సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో ఉండే రిస్క్, ఐటీ వ్యవస్థలు, సైబర్ భద్రత మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి సారించారు. ఎన్‌పీఏలకు మరిన్ని కేటాయింపులు చేయడం ద్వారా బ్యాలన్స్ షీట్ల బలోపేతం, ఒత్తిడిలోని రుణ ఆస్తులను పర్యవేక్షించడం, బలమైన లిక్విడిటీ, అస్సెట్ లయబిలిటీ మధ్య సమతుల్యం, రుణాలకు సంబంధించి పారదర్శకమైన రేట్లు, మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలోఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఎన్‌హెచ్‌బీ ఎండీ ఎస్‌కే హోతా కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment