Administrative
-
ఎన్బీఎఫ్సీల్లో పరిపాలన మరింత బలపడాలి
ముంబై: పరిపాలనా ప్రమాణాలను బలోపేతం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలను (హెచ్ఎఫ్సీలు) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కోరారు. ఎంపిక చేసిన పెద్ద ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఎండీలు, సీఈవోలతో గవర్నర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వరంగంలోని ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల చీఫ్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సంస్థలు ఈ రంగంలోని మొత్తం ఆస్తుల్లో సగం నిర్వహిస్తుండడం గమనార్హం. బ్యాంకింగ్ సేవలు చేరువ కాని లేదా అందుబాటులో లేని వర్గాలకు రుణాలను అందిస్తూ ఈ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ఆర్బీఐ గవర్నర్ గుర్తిస్తూ.. అనుకూల సమయాల్లో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అప్రమత్తం చేశారు. పరిపాలనా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. నిబంధనల అమలు, రిస్క్ నిర్వహణ, అంతర్గత ఆడిట్ల యంత్రాంగం విషయమై భరోసా అవసరమన్నారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో ఉండే రిస్క్, ఐటీ వ్యవస్థలు, సైబర్ భద్రత మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి సారించారు. ఎన్పీఏలకు మరిన్ని కేటాయింపులు చేయడం ద్వారా బ్యాలన్స్ షీట్ల బలోపేతం, ఒత్తిడిలోని రుణ ఆస్తులను పర్యవేక్షించడం, బలమైన లిక్విడిటీ, అస్సెట్ లయబిలిటీ మధ్య సమతుల్యం, రుణాలకు సంబంధించి పారదర్శకమైన రేట్లు, మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలోఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఎన్‌హెచ్‌బీ ఎండీ ఎస్కే హోతా కూడా పాల్గొన్నారు. -
ఇక న్యాయ, పాలనా సంస్కరణలపై కేంద్రం దృష్టి
కోల్‌కతా: ప్రభుత్వం తదుపరి సంస్కరణల ఎజెండాలో దేశంలోని పరిపాలనా, న్యాయ రంగాలేనని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అన్నారు.ఇక్కడ భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (బీసీసీ)లో సన్యాల్ మాట్లాడుతూ, 2014లో కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఇన్నోవేషన్ (ఆవిష్కరణ) ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ‘‘2014 నుండి సంస్కరణల కొత్త పథం అమలులోకి వచ్చింది. గత దశాబ్దంలో, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం సంస్కరణలు జరిగాయి. దివాలా కోడ్ (ఐబీసీ), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి కీలక వ్యవస్థలు అమల్లోకి వచ్చాయి. ద్రవ్యోల్బణ లక్ష్యం నిర్దేశ విధానం ప్రారంభమైంది’’ అని ఆయన అన్నారు. ‘‘ఇప్పుడు రెండు ప్రధాన సంస్కరణలు.. పరిపాలనా– న్యాయపరమైన సంస్కరణలు అవశ్యం. దీనికి విస్తృత ప్రజా మద్దతు అవసరం’’ అని ఆయన అన్నారు. 7 శాతం వరకూ వృద్ధి స్థూల ఆర్థిక అంశాలను పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సన్యాల్ విశ్లేíÙంచారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరత్వం ఉన్నాయని, కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) తగిన స్థాయిలో ఉందని, 13 నెలలకు సరిపడా విదేశీ మారక నిల్వలు (600 బిలియన్ డాలర్లు) ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్దీపనలతో దేశంలో డిమాండ్ పరిస్థితులను పెంచాల్సిన తక్షణ అవసరం ఏదీ లేదని కూడా ఆయన ఉద్ఘాటించారు. ఇలాంటి విధానాలతో దిగుమతులు పెరిగితే అది క్యాడ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. కోవిడ్ సంవత్సరాల్లో తీవ్ర ప్రభావానికి గురయిన సరఫరాల వ్యవస్థను పటిష్టంగా ఉంచాల్సిన అవసరం మాత్రం తక్షణం ఉందని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణంపై అప్పుడప్పుడు కూరగాయల ధరలు పెరుగుతున్న ప్రభావం మినహా అంతర్లీన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అంత బలంగా లేవని భరోసాను ఇచ్చారు. మౌలిక రంగం ఊతం మౌలిక రంగంలో గత పెట్టుబడులు ఇప్పుడు మనకు ప్రయోజనం సమకూర్చుతున్నట్లు సన్యాల్ తెలిపారు. ప్రపంచాన్ని నిరుత్సాహపరిచే పలు ఆర్థిక పరిస్థితలు నేపథ్యంలో భారత్ 6.5 శాతం వృద్ధి సాధించడం మామూలు విషయం కాదని కూడా స్పష్టం చేశారు. ఉద్దీపనల వంటి చర్యలతో వృద్ధి వేగాన్ని భారీగా పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం లేదని ఆయన పేర్కొంటూ, ‘‘స్పష్టమైన రహదారి ఉన్నప్పుడే మనం ఆ పని చేయగలం. ఇప్పుడు ఈ బాటలో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నాయి’’ అని విశ్లేíÙంచారు. స్థూల ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ఇప్పుడు కీలకమని పేర్కొన్న ఆయన ఈ విషయంలో బ్యాంకింగ్ వ్యవస్థ సుస్థిరత, సరఫరాల వ్యవస్థలో లోపాలు లేకుండా చేయడం ముఖ్యమన్నారు. జర్మనీ, జపాన్ సరేకానీ... అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఐదవ స్థానంలో నిలిచిన భారత్ ఎకానమీ మన ముందు ఉన్న దేశాలను అధిరోహిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదని అన్నారు. అయితే తొలి రెండు దేశాలు మాత్రం మనకంటే ఎంతో ముందు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేశారు. రూపాయిని అంతర్జాతీయం చేసి, వాణిజ్య మారి్పడిలో కీలక మారకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సన్యాల్ అన్నారు. ‘‘అమెరికా డాలర్ విషయంలో ఈ విధానం ఎంతమాత్రం జోక్యం చేసుకోదు. రూపాయిని భవిష్యత్తులో యాంకర్ కరెన్సీగా ఉండాలన్నదే దేశ విధానం’’ అని ఆయన చెప్పారు. చివరిగా 2011లో జరిగిన జనాభా లెక్క జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తదుపరి జనాభా గణన చేయాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా సన్యాల్ పేర్కొన్నారు. -
తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రక్షాళన.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డులో పాలనాపరమైన సంస్కరణలు మొదలయ్యాయి. గత కొన్నేళ్ళుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి చేతుల్లో ఉన్న అధికారాలను వికేంద్రీకరించారు. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ఏ పనికైనా ఇప్పటి వరకూ హైదరాబాద్ బోర్డ్‌కు రావాల్సిన పరిస్థితి ఉండేది. ఇక నుంచి జిల్లా పరిధిలోనే అవసరమైన పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీజోన్–1, మల్టీజోన్– 2కు ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. కాలేజీ ప్రిన్సిపల్స్ అన్ని రకాల సెలవులు ఇక నుంచి మల్టీజోన్ ఆర్జేడీ పరిధిలోనే పరిష్కరించుకోవచ్చు. సర్వీసు క్రమబ ద్ధీకరణ, సీనియారిటీ జాబితాలను మల్టీ జోన్ పరిధిలోకే తెచ్చారు. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత పొందే ప్రయోజనాలకు సంబంధించిన దస్త్రాలు కూడా ఈ పరిధిలోకే చేర్చారు. అలాగే ప్రిన్సిపల్స్, జిల్లా ఒకేషనల్ ఆఫీసర్స్, ఇతర జిల్లా అధికారులకు తమ పరిధిలో అవసరమైన అధికారాలు బదలాయించారు. ఉద్యోగుల సర్వీసులకు సంబంధించి నిర్ణయాధి కారాన్ని ఇచ్చారు. బయో మెట్రిక్ – ఈ ఆఫీస్ ఉద్యోగులు వేళకు రావడం లేదని, వచ్చినా ఫైళ్ళను చూడటం లేదనీ, కేవలం వ్యక్తిగత ప్రయోజనం ఉండే ఫైళ్ళనే ముట్టుకుంటున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు అందేవి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్‌లో ఉద్యోగుల పారదర్శకతను పెంచుతూ అన్ని స్థాయిల్లోనూ బయోమెట్రిక్‌ను అమలు చేస్తున్నట్టు నవీన్ మిత్తల్ తెలిపారు. బయోమెట్రిక్ వల్ల జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక ఇంటర్ బోర్డులో అనుమతులు, ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్ళు నెలల తరబడి పరిశీలనకు నోచుకోవడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ–ఫైలింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ఫైలింగ్ ద్వారా వ్యక్తులతో సంబంధం లేకుండానే ఆన్లైన్ ద్వారా ఫైళ్ళు వెళ్ళడం, పరిశీలన, అనుమ తులు ఇవ్వడం సాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ విద్య కమిషనర్ సంస్కరణలను తెలంగాణ విద్య పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్ స్వాగతించారు. అవినీతి పరుల ఆటకట్టేందుకు ఈ సంస్కరణలు దోహదపడతాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
త్వరలోనే విశాఖ వేదికగా పరిపాలన రాజధాని: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత విశాఖ రాజధాని అవుతుందన్నారు. ‘‘చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తారు. వరద నీటిని పట్టుకుని తాగునీరు అంటూ మాట్లాడతారా? అంటూ దుయ్యబట్టారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందన్నారు. చదవండి: మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు సింగర్ శ్రావణి భార్గవి పాట వివాదంపై.. సింగర్ శ్రావణి భార్గవి పాట వివాదంపై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. ఇది టీటీడీకి సంబంధించినది కాదని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటి మీద ఏ విధంగా స్పందిస్తామని ఆయన ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామికి ప్రియ భక్తుడైన అన్నమయ్య పాటకు అపచారం కలిగించడం అంటే మహాపాపం. తొలి వాగ్గేయకారుడిగా అన్నమయ్యను గౌరవించుకుంటున్నాం. అన్నమయ్య పేరు మీద జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. -
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పరిపాలనా అనుమతి
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకించి సుభిక్షం చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు రూ.17,050.20 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తొలిదశ పనుల అంచనా వ్యయం రూ.2,022.20 కోట్లు కాగా రెండో దశ పనుల అంచనా వ్యయం రూ.15,028 కోట్లు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు కోసం 63.20 టీఎంసీల గోదావరి నికర జలాలను కేటాయించడం గమనార్హం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి, రెండో దశలో 63.99 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 3.98 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. ప్రధాన కాలువలో మిగిలిన పనులతోపాటు భూదేవి రిజర్వాయర్ (6.55 టీఎంసీలు), వీరనారాయణపురం రిజర్వాయర్ (6.2 టీఎంసీలు), తాటిపూడి రిజర్వాయర్ (3.8 టీంసీలు) నిర్మాణం, సబ్ లిఫ్ట్‌ల పనులను చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖను ఆదేశించారు. ఆ పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేగంగా పూర్తి చేసేలా అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రభుత్వం చేపట్టింది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దిక్సూచిలా నిలుస్తుందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి... ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించాలనే ముందుచూపుతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం నుంచి రోజుకు 17,561 క్యూసెక్కులు (1.51 టీఎంసీలు) తరలించేలా పోలవరం ఎడమ కాలువను చేపట్టారు. పోలవరం ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తూనే 162.409 కి.మీ. నుంచి రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే టెండర్లు పిలిచినా ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచి్చన పాలకులు చంద్రబాబుతో సహా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా చేపట్టారు. డిస్టిబ్యూటరీల పనులు ప్రారంభం ♦పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశలో భాగంగా 3.15 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, 13.5 కి.మీ. పొడవున లీడింగ్ కెనాల్తోపాటు జామద్దులపాలెం, తీడ వద్ద రెండు లిఫ్ట్‌లు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్టిబ్యూటరీల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ♦రెండో దశలో 20.05 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, పాపయ్యపాలెం లిఫ్ట్‌తోపాటు 63.995 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 2.68 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ఇప్పటికే ప్రారంభించారు. మిగిలిన పనులు వేగవంతం.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండో దశలో మిగిలిన పనులు అంటే.. ప్రధాన కాలువలో మిగిలిన 37.585 కి.మీ. పొడవున తవ్వకం, ప్రధాన కాలువకు అనుబంధంగా 6.20 కి.మీ. వద్ద భూదేవి(అనకాపల్లి జిల్లా), 50 కి.మీ. వద్ద వీరనారాయణపురం(విజయనగరం జిల్లా), 69.10 కి.మీ. వద్ద తాటిపూడి(విజయనగరం జిల్లా) రిజర్వాయర్ల నిర్మాణం– వాటికి అనుబంధంగా ఎత్తిపోతలు, కొండగండేరు లిఫ్ట్, బూర్జువలస లిఫ్ట్, జి.మర్రివలస లిఫ్ట్, 4.02 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక వైపు భూసేకరణ చేస్తూనే మరోవైపు పనులు చేపట్టడం ద్వారా వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
ఆ ఘటన మహిళలకు తీవ్ర అవమానకరం.. ఎన్సీడబ్ల్యూ తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ: రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష సందర్భంగా బికనీర్ జిల్లాలోని ఓ కేంద్రం బయట మహిళా అభ్యర్థి ధరించిన టాప్ పొడుగు చేతులను పురుష సిబ్బంది ఒకరు కత్తిరించడంపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు మహిళలను ఘోరంగా అవమానించడమేనని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పరీక్ష కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల సోదా కోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించకపోవడంపై వివరణ అడిగింది. పరీక్షా కేంద్రం వద్ద ఒక అభ్యర్థిని ధరించిన పొడుగు చేతుల టాప్‌ను పురుష గార్డు కత్తెరతో కట్ చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. (చదవండి: Odisha: ‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు) -
విశాఖ విజయీభవ.. రాజధానిగా రాజముద్ర
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నాళ్లో వేచిన ఉదయం వెలుగుచూసింది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధానుల అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. వికేంద్రీకరణ ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవల రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను పరిశీలించిన గవర్నర్ తన ఆమోద ముద్ర వేశారు. తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఆవిర్భవించనున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, సమాన అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని ప్రాంతాల అభివృద్ధి ఓర్వలేని శక్తులు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెరవలేదు. ముఖ్యంగా విశాఖపట్నం పరిపాలన రాజధాని కావడాన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఎన్ని దుష్ప్రచారాలకు దిగినా.. చివరికి ఇది తుపానుల నగరంగా ముద్ర వేయాలని యత్నించినా.. సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు. ఈ రాష్ట్రానికి భవిష్యత్ కీర్తి రేఖ విశాఖేనని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి ఆ దిశగానే అడుగులు వేసి.. ఇప్పుడు ఉత్తరాంధ్రకు రాజబాట వేశారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా గవర్నర్ రాజముద్ర వేసిన నేపథ్యంలో జిల్లా అంతటా అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం, పార్టీశ్రేణులు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు సంబరాలు చేసుకున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు దేశాన్ని ముందుకు నడిపే శక్తి కేంద్రాలు. ఈ నగరాల జాబితాలో ముందు వరసలో కనిపిస్తుంది విశాఖ మహా నగరం. ఎందుకంటే.. విశాఖ అందాల నగరి.. సుందర సువిశాల తీరం.. ఇక్కడ అలల సవ్వడే తప్ప.. అలజడులకు తావు లేదు. ప్రశాంతతకు చిరునామా.. విపత్కర పరిస్థితులు తలెత్తవనే నమ్మకం.. నివాస యోగ్యమైన నగరం. ఇన్ని సానుకూలతలతో దేశంలోని మెట్రో సిటీలతో విశాఖ పోటీ పడుతోంది. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్.. అందర్నీ ఆకర్షిస్తోందంటూ ఆర్థిక సర్వేలో సైతం వెల్లడైంది. ఇంతకీ ఇంతలా ఆకర్షిస్తున్న విశాఖలో ఏముంది? సువిశాల సాగర తీరం ఉన్నా.. వందేళ్లలో ఒకే ఒక్క తుపాను మాత్రమే ఇక్కడ తీరం దాటడానికి గల అనుకూల వాతావరణ పరిస్థితులకు కారణాలేంటి..? అన్ని వర్గాల వారినీ ఈ నగరంలో ఇంతలా ఏం ఆకర్షిస్తోంది.. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరంగా విశాఖకు పేరుంది. నవ్యాంధ్రలోని నగరాలతో పోలిస్తే.. విశాఖ విశాలమైన, ప్లాన్డ్ సిటీగా దేశ విదేశీ ప్రముఖులు సైతం కొనియాడారు. అందమైన నగరంలో నివసిస్తే.. అద్భుతమైన జీవితం సొంతమవుతుందని అందరి అభిప్రాయం. భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న “రియల్’రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం వైపు చూసేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు నివాస యోగ్యమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందింది. అన్ని సర్వేలూ నివాసానికి, వ్యాపారానికి అనువైన నగరాల్లో విశాఖపట్నం ఉందని స్పష్టం చేస్తున్నాయి. నాటి బెస్త గ్రామమే.. నేటి మెగా సిటీ 1933.. అక్కడక్కడా విసిరేసినట్లుండే ఇళ్లు.. మిణుకుమిణుకుమనే దీపాలు.. చిన్నపాటి జ్వరం వచ్చినా.. ప్రాణాలు నిలుస్తాయో లేదో అనే దుస్థితి. మొత్తం కలిపి పట్టుమని 60 వేల జనాభా కూడా లేని వైజాగ్‌పట్నం. కాలం గిర్రున తిరిగింది. ఆకాశ హరŠామ్యల్లాంటి భవంతులు.. అద్దాల మేడలు.. విద్యుద్దీపాల ధగధగలు.. సువిశాల రహదారులు.. ప్రాణాలు నిలబెట్టే అత్యాధునిక ఆస్పత్రులు.. సిటీ అంటే ఇదీ అనిపించేలా ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం.. సువిశాల సాగరతీరం.. అడుగడుగునా పర్యాటక సోయగంతో నగరం మెట్రో సిటీలను తలదన్నేలా రూపుదిద్దుకుంది. ఇంతింతై.. జనాభా ఇంతై.. 1872లో కేవలం 6 చదరపు మైళ్లలో విస్తరించిన విశాఖ నగర జనాభా కేవలం 32,500 మాత్రమే. 1955లో విస్తీర్ణం 12 చ.మైళ్లకు చేరుకోగా జనాభా నాలుగు రెట్లు పెరుగుతూ 1.20లక్షలకు చేరుకుంది. క్రమక్రమంగా పారిశ్రామికీకరణతో పాటు అందాల నగరంగా పేరొందుతూ.. విశాఖపై అందరికీ ఇష్టం పెంచేలా మారిపోయింది. దీంతో ప్రస్తుతం మహా విశాఖ నగరం 625 చ.కిమీగా విస్తరించింది. 20.30 లక్షల జనాభాని తన గూటికి అక్కున చేర్చుకుంది. అందాల నగరిలో.. హాయిగా.. విశాఖ నగరం సామాన్యుడికీ స్వాగతం పలుకుతుంది.. బిలీనియర్‌కి రెడ్ కార్పెట్ వేస్తుంది. నెలకు రూ. 3 వేలు వేతనంతో జీవించే సగటు జీవి దర్జాగా బతకగల సౌకర్యాలున్నాయి. నెలకు రూ.3 లక్షలు వేతనం తీసుకునే ఉద్యోగి విలాసంగా జీవించే ఆధునికతా విశాఖ సొంతం. భారతదేశం ఎలాగైతే.. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు. మతాలు, భాషలతో భాసిల్లుతోందో.. విశాఖ మహా నగరం కూడా.. అదే తీరుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సొంతం చేసుకుంది. ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలే కాదు.. కశ్మీర్ నుంచి నుంచి తమిళనాడు వరకు.. రాజస్థాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు.. ప్రతి ఒక్కరూ ఇక్కడ నివసిస్తూ సిటీకి సలాం చేస్తున్నారు. ప్రతి 100 మందిలో 10 మంది వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన సెటిలర్సే ఉన్నారంటే... విశాఖ ఎలా విశాల నగరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. మెట్రో నగరాల్లో మనం అనుకున్న మొత్తానికి అద్దెకు ఇల్లు దొరకడమే గగనం.. ఇక సొంతింటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో సొంతిల్లు అంటే.. అందని ద్రాక్ష మాదిరే. కానీ విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో రెక్కల కష్టాన్ని కూడబెట్టుకొని సొంత ఇంటిని కొనుగోలు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో మేటి.. మహా నగరాల్లో నివసించడమంటే ఒక క్రేజ్‌గా భావించేవారు ఒకప్పుడు. కాల క్రమేణా.. మెట్రో నగరాలు ఓ విధంగా సామాన్యుడు భయపడే స్థాయికి దిగజారుతున్నాయి.. ఎందుకంటే పెరుగుతున్న జీవన వ్యయం, పెచ్చరిల్లుతున్న కాలుష్యం, చిన్న వయసులోనే ముంచుకొస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలు మెట్రో సిటీలకు ప్రజల్ని దూరం చేస్తున్నాయి. దీంతో అందరూ ఇప్పుడు టైర్–2, టైర్–3 సిటీస్ వైపే మొగ్గుచూపుతున్నారు. వీటిలో విశాఖ నగరం ది బెస్ట్ సిటీగా ఆహ్లాదకరమైన వాతావరణమే కాకుండా... సరికొత్త జీవన సరళికీ కేంద్రంగా నిలిచింది. ద్వితీయ శ్రేణి నగరమే అయినా మహానగరాలతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు విశాఖ నగరం సొంతం చేసుకుంది. వాతావరణ పరంగా విశాఖ బెస్ట్ వాతావరణ పరంగా చూసినా.. విశాఖ ది బెస్ట్ సిటీ. ఇక్కడ అంతా మోడరేట్ వాతావరణం. ఎండాకాలంలో విపరీతమైన ఎండ ఉండదు. వేసవిలోనూ విశాఖలో అత్యధిక ఉష్ణోగ్రతలు 38 నుంచి 42 మధ్యలోనే ఉంటాయి. 42 దాటడమనేది అతి స్వల్పం. గత వందేళ్ల వాతావరణ పరిస్థితుల్ని తీసుకుంటే.. మచిలీపట్నం, కాకినాడ మొదలైన తీరాలపై ఎఫెక్ట్ అయినన్ని తుపాన్లు.. విశాఖపై ప్రభావం చూపలేదు. విశాఖలో తుపాన్లు తీరం దాటడం అనేది బహుస్వల్పం. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా తుపాన్లు ఒడిశా వైపు గానీ.. కాకినాడ, మచిలీపట్నం వైపుగానీ తరలిపోతాయి. 2014 హుద్‌హుద్ మినహా ఏ తుపానూ విశాఖ తీరాన్ని తాకలేదు. ఈశాన్య పవనాల ప్రభావం కూడా అమరావతి, విజయవాడ ప్రాంతాలతో పోలిస్తే.. విశాఖపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. 10 నెలలు.. వరస పరిణామాలు ♦రాజధానిపై సలహాలు సూచనల కోసం 2019 సెప్టెంబర్ 13న రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ♦మూడు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ 2019 డిసెంబర్ 20న తన నివేదికను సమర్పించింది. మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది. ♦కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కోసం 2019 డిసెంబర్ 29న రాష్ట్రం హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ♦ఈ క్రమంలోనే జనవరి 3న బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు తమ నివేదికను సమర్పించింది. రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ♦ఈ ఏడాది 2020 జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికపై మంత్రి మండలి చర్చించింది. అనంతరం ఆ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ♦ఇందులో భాగంగానే జనవరి 22న బిల్లును శాసన మండలి ముందుకు తీసుకురాగా ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది, ♦న్యాయ నిపుణుల సలహా మేరకు 2020 జూన్ 16న రెండో సారి వికేంద్రీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించింది. ♦తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రాజముద్ర వేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. హర్షం వ్యక్తం చేస్తున్నా.. శ్రావణ శుక్రవారం రోజున రాష్ట్ర ప్రజలకు మరో పండగ మూడు రాజధానుల బిల్లు ఆమోదం. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నా.. విశాఖ పరిపాలన రాజధాని కావడంతో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది. –బి.సత్యవతి, ఎంపీ, అనకాపల్లి ఉత్తరాంధ్ర అభివృద్ధికి బీజం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడం అభినందనీయం. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి. ఒకే ప్రాంతానికి అభివృద్ధి పరిమితం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి తామంతా మద్దతు ఇస్తున్నాం. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. – వీసం రామకృష్ణ, నక్కపల్లి గవర్నర్‌కు కృతజ్ఞతలు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం అభినందనీయం. తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు ఈ బిల్లును అడ్డుకునేందుకు చాలా కుట్రలు చేశారు. రాష్ట్రాన్ని సమతుల్యంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఈ బిల్లులను ఆమోదించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు. రైతుల నుంచి కారు చౌకగా కొట్టేసిన భూములు కాపాడుకోవడం కోసమే చంద్రబాబు దీక్షలు చేయిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటయితే ఉత్తరాంధ్ర పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుంది. కర్నూల్లో న్యాయరాజధాని ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమకు సీఎం జగన్ న్యాయం చేశారు. – గొల్ల బాబూరావు, అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే, పాయకరావుపేట చాలా సంతోషంగా ఉంది.. నా జన్మదినోత్సవం రోజున ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం యాదృచ్ఛికమైనప్పటికీ.. నాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. మూడు రాజధానుల వల్ల భవిష్యత్‌లో ప్రాంతీయ అసమానతలకు ఆస్కారం ఉండదు. ఈ బిల్లును అడ్డుకోడానికి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మంచి సంకల్పం ముందు అవి ఫలించలేదు. గవర్నర్ ఆమోద ముద్రతో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయనడంతో ఎటువంటి సందేహం లేదు. – కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం జగన్ చరిత్రలో నిలిచిపోతారు అధికార వికేంద్రీకరణ జరగాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమైంది. సీఎం నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఇక తిరుగులేని అభివృద్ధి బాట పడుతుంది. నాయకుడు జనం నుంచి వస్తే... ఎలాంటి పరిపాలన ఇస్తారో సీఎం వైఎస్ జగన్‌ను చూస్తే అర్థమవుతుంది. నాడు పాదయాత్రలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. పరిశీలించడంతో ప్రతి ప్రాంతంపైనా ఆయనకు అవగాహన ఏర్పడింది. అందువలనే ఇలాంటి చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారు. – దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బిల్లుల ఆమోదం.. శుభపరిణామం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్ర అభివృద్ధికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడం శుభపరిణామం. అసెంబ్లీలో రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలిపినప్పటికీ.. శాసనమండలిలో ప్రతిపక్షం కుట్రపూరితంగా అడ్డుకుంది. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ ఈ రెండు కీలక బిల్లులను ఆమోదించి రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి తగిన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.. – చెట్టి పాల్గుణ, ఎమ్మెల్యే, అరకు విపత్తుల ప్రభావం అంతంత మాత్రమే.. భౌగోళికపరంగా విశాఖపట్నం అత్యంత అనుకూలమైన నగరం. సముద్రతీరంలోని రాష్ట్రంలోని మిగిలిన నగరాలు, పట్టణాలతో పోలిస్తే.. ఈ ప్రాంతానికి తుపాన్లు తాకే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. చలికాలంలో విపరీతమైన చలి ఉండదు. వానాకాలంలోనూ ముంచెత్తే వానలుండవు. కావల్సినంత వర్షాలు మాత్రమే పడతాయి. చలికాలంలో అందరూ స్వెట్టర్లు వేసుకునేంతగా చలి వణికించదు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం కూడా విశాఖపై తక్కువగానే ఉంటుంది. విజయవాడ, గుంటూరు, ప్రకాశం మొదలైన ప్రాంతాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం 40 నుంచి 42 శాతం వరకూ ఉండగా.. విశాఖపై కేవలం 10 నుంచి 12 శాతం మాత్రమే ఉంటుంది. అన్నింటికీ అనుకూల వాతావరణం ఉంటుంది కాబట్టి విశాఖ అందరికీ నివాసయోగ్యం – ప్రొఫెసర్ భానుకుమార్, ఏయూ వాతావరణ మాజీ విభాగాధిపతి -
మళ్లీ అదే చర్చ
న్యాయ, పరిపాలనా విభాగాల అధికారాల పరిధులకు సంబంధించిన వివాదం కొత్తదేం కాదు. కాకపోతే జాతీయ న్యాయ దినోత్సవ కార్యక్రమం అందుకు వేదిక కావడం, న్యాయవ్యవస్థ క్రియాశీలత (జ్యుడిషియల్ యాక్టివిజం) పేరిట దాని పరిధులను అతిక్రమిస్తున్నదని కేంద్ర మంత్రులే ఆరోపించడం విశేషం. ప్రజాస్వామ్య సౌధానికి మూడు మూలస్తంభాలుగా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను మన రాజ్యాంగకర్తలు నిర్వచించారు. వాటి అధికారాల పరిధులను స్థూలంగానే నిర్వచించి, అవి మూడూ ఒకే వ్యవస్థలోని సజీవ అంగాలుగా పనిచేయాలని భావించారు. అవి ఒకే కుటుంబంలోని భాగాలని, ఒకదానినొకటి బలోపేతం చేయ డానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలు ఆ స్ఫూర్తినే ప్రతి ధ్వనించాయి. అయితే, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. క్రియాశీలత పేరిట న్యాయవ్యవస్థ తన అధికారాల పరిధులను అతిక్రమిస్తోందని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్) సహాయంతో విధాన రూపకల్పనా విధులను చేపట్టాలనే తాపత్ర యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న విభేదాలు అనుకోని విధంగా ఇలా రచ్చకెక్కాయి. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా స్వయంగా తమ వాదాన్ని వినిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూడు అంగాల మధ్య అధికారాల విభజన సుస్పష్టంగా గిరి గీసినట్టు ఉండాలనే కోరిక మంచిదే గానీ ఆచరణ సాధ్యమైనది కాదు. రాజ్యాంగం పౌరులందరికీ హామీనిచ్చిన ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత న్యాయవ్యవస్థదే. ఆ క్రమంలో అది ప్రభుత్వానికి, చట్టసభలకు పలు నిర్దేశాలను చేయాల్సి వస్తుంది. అవసరమైతే కొత్త విధానాలను, చట్టాలను తేవాలని కోరాల్సి ఉంటుంది. ‘‘శాసన, పరిపాలనా విభాగాలు తాకకుండా వదిలేసిన వివిధ అంశాలు ప్రజాప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థ వాటిని పట్టించు కుంటుంది’’ అంటూ 2008లోనే కేంద్రానికి వ్యతిరేకంగా దాఖలైన ఒక వ్యాజ్యంలో జస్టిస్ హెచ్‌కే సేన్ స్పష్టం చేశారు. పిల్లకు, న్యాయవ్యవస్థ క్రియాశీలతకు వ్యతి రేకంగా వాదించే వారు అసలు వాటి పుట్టుకకు కారణమే శాసన, పరిపాలనా విభా గాల వైఫల్యాలనే విషయాన్ని విస్మరిస్తున్నారు. కాలుష్యం వంటి సమస్యల్లో కోర్టుల జోక్యాన్ని ఈ విమర్శకులు తరచుగా ప్రస్తావిస్తుంటారు. నిబంధనలను గాలికి వదలి పారిశ్రామిక వేత్తలు, సంస్థలు, వ్యక్తులు జీవనదులను, గాలిని, వాతావర ణాన్ని కాలుష్య కాసారాలుగా మారుస్తుంటే పట్టించుకోని ప్రభుత్వాల, చట్టసభల క్రియారాహిత్యమే కోర్టుల జోక్యాన్ని అవసరం చేస్తోంది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్నా కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి రోజూ కళ్లకు కడుతూనే ఉంది. పార్టీలకు అతీతంగా వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు, చట్ట సంస్థలు ప్రజలకు గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించలేని పరిస్థితుల్లోనే పిల్ అనే భావన పుట్టింది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉపయోగపడే ముఖ్య సాధనం అయింది. స్వాతంత్య్రానంతరపు తొలినాళ్లలో చట్టసభలు, ప్రభుత్వాలు తమ ఆకాంక్ష లను నెరవేర్చగలవనే దృఢ విశ్వాసం ఉండేది. గత ఏడు దశాబ్దాలుగా అది సడ లుతూ వస్తోంది. కారణం మన చట్టసభల, ప్రభుత్వాల పనితీరు నానాటికీ తీసి కట్టుగా దిగజారుతుండటమే. 2–జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు 122 లైసెన్స్‌లను రద్దు చేసింది. అంతేకాదు, ఆ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు వివరా లను ప్రధానికే వెల్లడించరాదని ఆదేశించింది. ఈ జోక్యాన్ని, క్రియాశీలతను నాడు యావద్భారతం ప్రశంసించింది. దాన్ని అధికారాల పరిధి అతిక్రమణగా నాటి ప్రతిపక్షాలు విమర్శించలేదు. అవసరమైనప్పుడు ఇతర రెండు వ్యవస్థలను సరిదిద్దే పనిని న్యాయవ్యవస్థకు అప్పగించిన రాజ్యాంగమే.. న్యాయ వ్యవస్థలోని తప్పు లను సరిదిద్దే హక్కును పార్లమెంటుకు ఇచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా న్యాయ క్రియాశీలతను అతిక్రమణగా విమర్శించడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ అంగాలేవీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేదు, అలాంటి సందర్భాల్లో వాటిని పరిర క్షించే బాధ్యత న్యాయవ్యవస్థదే. ‘‘ప్రాథమిక హక్కులు స్థిరాంకాలేమీ కావు. వాటిలో చాలా వరకు ఖాళీ పాత్రల వంటివి. ప్రతి తరమూ తమ అనుభవాల వెలుగులో వాటిలో సారాన్ని నింపాల్సి ఉంటుంది’’ అని కేశవానంద భారతి కేసులో జస్టిస్ కేకే మాథ్యూ చేసిన వ్యాఖ్య రాజ్యాంగం నిజస్ఫూర్తికి అద్దం పడుతుంది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరింపజేస్తూ, వాటికి జవసత్వాలను సమకూర్చడం అనే లక్ష్యంతో మూడు వ్యవ స్థలూ కలసి పరస్పర విశ్వాసంతో పనిచేయడం అవసరం. అయితే న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసే కీలక అంశాలూ ఉన్నాయి. అన్ని వ్యవస్థల నుంచి జవాబుదారీతనాన్ని కోరే న్యాయవ్యవస్థకు జవాబు దారీతనం అక్కర్లేదా? న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే అది పారదర్శకతకు అతీ తమైనదని అర్థమా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేని స్థితి తరచుగా న్యాయవ్యవస్థను ఇరకాటంలో పెడుతోంది. న్యాయ నియామకాలలో సహేతుకతను, పారదర్శకతను తేవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టంతో న్యాయవ్యవస్థపై ఆధిపత్యం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న మాట నిజమే అనుకున్నా.. తన స్వతంత్రతకు భంగకరంకాని మరో ప్రత్యామ్నాయాన్ని çసూచిం చకపోగా కొలీజియం వ్యవస్థనే అది కొనసాగించడం ఎవరికీ మింగుడుపడేది కాదు. న్యాయవ్యవస్థ ప్రజల అన్ని సమస్యలను పరిష్కరించలేదు, ప్రభుత్వాల నిష్క్రియా పరత్వాన్ని లేదా బాధ్యతారాహిత్యాన్ని అదే వదిలించలేదు. నిజానికి పిల్ల ఉచితా నుచితాలు, న్యాయవ్యవస్థ క్రియాశీలత చుట్టూ తిరుగుతున్న చర్చంతా.. పై నుంచి కింది వరకు చట్టసభలు, ప్రభుత్వాలు విశాల ప్రజానీకం ఆకాంక్షను నెరవేర్చే దిశగా, గౌరవప్రదంగా, ఆరోగ్యకరంగా జీవించే హక్కు సహా అన్ని హక్కులను పరి రక్షిస్తూ సాగేలా చేసేదెలా? అనే అతి పెద్ద సమçస్య నుంచి పుట్టుకొచ్చినవే. అ దిశగా అంతా దృష్టిని కేంద్రీకరించడం ఉత్తమం. -
అసలేం జరిగింది..?
సాక్షి, బెంగళూరు : మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సెంటర్ డెరైక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి రశ్మి మహేష్‌పై జరిగిన దాడికి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్‌తో కలిసి మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై నజర్బాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేంద్రను సస్పెండ్ చేశామన్నారు. అదేవిధంగా దాడికి ప్రయత్నించిన 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ అధికారులపై భౌతిక దాడులకు దిగడం నేరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే సందర్భంగా మైసూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వీ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ...త్వరలో ఈ విషయమై కలెక్టర్ శిఖ, కమిషనర్ సలీంతో పాటు ఎస్పీ అభినవ్కర్ను స్వయంగా కలిసి ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటానన్నారు. అసలేం జరిగిందంటే.. రశ్మి మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఐ)లో కొంత మంది సిబ్బందిని రశ్మి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఐ హాస్టల్ వార్డన్ వెంకటేష్ బుధవారం సంస్థ ఆవరణంలోని సంప్‌లో చనిపోయి కనిపించారు. పోస్ట్‌మార్టం అనంతరం బంధువులు కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని సంస్థ ఆవరణంలోనే ఉంచి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. రశ్మి వేధింపులకు తట్టుకోలేకనే వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా వెంకటేష్ అంతిమ దర్శనానికి వెళ్లిన రశ్మిపై అక్కడే ఉన్న కొంతమంది రాళ్లు, చొప్పులతో దాడికి దిగారు. చివరికి పోలీసులు రక్షణ వలయంగా ఏర్పాడి రశ్మిను అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు ఏటీఐలో గతంలో జరిగిన అక్రమాలపై రశ్మి ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందించింది. అంతే కాకుండా మరిన్ని నిజాలు బయటకు రావాలంటే సీబీఐతో దర్వాపు జరిపించాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది దుండగులు రశ్మిపై భౌతిక దాడులకు దిగారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి 12:30 గంటలకు మూడు కేసులు నమోదయ్యాయి.