అసలేం జరిగింది..?
సాక్షి, బెంగళూరు : మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సెంటర్ డెరైక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి రశ్మి మహేష్‌పై జరిగిన దాడికి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్‌తో కలిసి మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు.
ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై నజర్‌బాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేంద్రను సస్పెండ్ చేశామన్నారు. అదేవిధంగా దాడికి ప్రయత్నించిన 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ అధికారులపై భౌతిక దాడులకు దిగడం నేరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే సందర్భంగా మైసూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వీ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ...త్వరలో ఈ విషయమై కలెక్టర్ శిఖ, కమిషనర్ సలీంతో పాటు ఎస్పీ అభినవ్‌కర్‌ను స్వయంగా కలిసి ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటానన్నారు.
అసలేం జరిగిందంటే..
రశ్మి మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఐ)లో కొంత మంది సిబ్బందిని రశ్మి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఐ హాస్టల్ వార్డన్ వెంకటేష్ బుధవారం సంస్థ ఆవరణంలోని సంప్‌లో చనిపోయి కనిపించారు. పోస్ట్‌మార్టం అనంతరం బంధువులు కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని సంస్థ ఆవరణంలోనే ఉంచి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. రశ్మి వేధింపులకు తట్టుకోలేకనే వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు.
ఇదిలా ఉండగా వెంకటేష్ అంతిమ దర్శనానికి వెళ్లిన రశ్మిపై అక్కడే ఉన్న కొంతమంది రాళ్లు, చొప్పులతో దాడికి దిగారు. చివరికి పోలీసులు రక్షణ వలయంగా ఏర్పాడి రశ్మిను అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు ఏటీఐలో గతంలో జరిగిన అక్రమాలపై రశ్మి ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందించింది. అంతే కాకుండా మరిన్ని నిజాలు బయటకు రావాలంటే సీబీఐతో దర్వాపు జరిపించాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది దుండగులు రశ్మిపై భౌతిక దాడులకు దిగారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి 12:30 గంటలకు మూడు కేసులు నమోదయ్యాయి.