స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించిన వ్యాపారులు, ప్రజలు
మైసూరు-విరాజపేట రోడ్డుపై నిలిచినపోయిన వాహన రాకపోకలు
బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, ఏబీవీపీ, కొడవ సముదాయం సంయుక్తంగా ఇచ్చిన జిల్లా బంద్ గురువారం విజయవంతమైంది. మడికేరి, కుశాల్‌నగర, సపిద్దాపుర, విరాజపేట పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాఠశాలలు, సినిమాహాల్స్, హోటల్స్, వస్త్ర దుకాణాలు తమ కార్యకలాపాలను స్వచ్ఛందంగా నిలిపి వేశారు. మడికేరిలోని ఫిల్డ్‌మార్షల్ కరియప్ప సర్కిల్, టోల్‌గేట్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మైసూరు-విరాజపేట మార్గలో బిట్టంగాల గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పెద్ద వృక్షాన్ని కొట్టివేసి రోడ్డుకు అడ్డంగా పెట్టారు. దీంతో ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. బంద్ నేపథ్యంలో ముందుగానే సెలువు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకు పరిమిత మయ్యారు. కే.జే జార్జ్‌తో పాటు హోంశాఖ ఉన్నతాధికారులైన ప్రణబ్ మహంతి, ఎం.ఎస్ ప్రసాద్‌లు కూడా గణపతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని కొడవ సముదాయానికి చెందిన నాయకులు ఆరోపించారు. సదరు ఇద్దరు ఉన్నతాధికారులను కూడా వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
బందో బ(మ)స్తు...
కొడుగు జిల్లా బంద్ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. 1200 మంది పోలీసు సిబ్బందితో పాటు మరో 300 మంది వివిధ విభాగాలకు చెందిన అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రతి చోట సీసీ కెమరాలతో పరిస్థితులను వీడియో రికార్డ్ చేశారు. నిరసన కారులు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సున్నిత ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. మొత్తంగా బంద్ సందర్భంగా ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోక పోవడంతో రాష్ట్ర హోంశాఖతో పాటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.
కొడగు బంద్ విజయవంతం
Published Fri, Jul 15 2016 2:23 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement