KJ George
-
కర్ణాటక మంత్రిపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన డిప్యూటీ ఎస్పీ ఎంకే గణపతి అనుమానాస్పద మృతి కేసులో ఆ రాష్ట్ర మంత్రి కేజే జార్జ్, మరో ఇద్దరు మాజీ పోలీసు అధికారులను సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చింది. గణపతి గతేడాది జూలై 7న చనిపోయారు. జార్జ్, మాజీ ఐజీపీ (లోకాయుక్త) ప్రణవ్ మొహంతీ, మాజీ అదనపు డీజీపీ ఏఎం ప్రసాద్‌లు తనను వేధిస్తున్నారనీ, తనకేమైనా జరిగితే అందుకు వారిదే బాధ్యతని మరణించడానికి ముందు గణపతి చెబుతుండేవారు. అనుమానాస్పద పరిస్థితుల్లో గణపతి మృతి చెందిన అనంతరం ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన తండ్రి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ గణపతి తండ్రి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. తాజాగా సీబీఐ తన ఎఫ్ఐఆర్లో జార్జ్‌తోపాటు అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. -
జార్జ్‌కు మళ్లీ అమాత్యపట్టం !
బెంగళూరు : డీఎస్పీ గణపతి ఆత్మహత్య సంఘటనతో మంత్రి పదవిని కోల్పోయిన కే.జే జార్జ్‌కు మళ్లీ అమాత్య పదవి దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కేసులో కే.జే జార్జ్ మొదటి నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థ దర్యాప్తులో గణపతి ఆత్మహత్య విషయంలో జార్జ్ పాత్ర ఏమీ లేదని తేలిందని ఈ మేరకు త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో కే.జే జార్జ్‌కు గతంలో ఆయన నిర్వర్తించిన బెంగళూరు నగరాభివృద్ధి శాఖనే కేటాయించడానికి సిద్ధరామయ్య సిద్ధపడుతున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక మంత్రిమండలిలో ఖాళీగా ఉన్న మరో స్థానాన్ని ఎం. కృష్ణప్పతో భర్తీ చేయడానికి కూడా సిద్ధరామయ్య అంగీకరించారు. -
కొడగు బంద్ విజయవంతం
స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించిన వ్యాపారులు, ప్రజలు మైసూరు-విరాజపేట రోడ్డుపై నిలిచినపోయిన వాహన రాకపోకలు బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, ఏబీవీపీ, కొడవ సముదాయం సంయుక్తంగా ఇచ్చిన జిల్లా బంద్ గురువారం విజయవంతమైంది. మడికేరి, కుశాల్‌నగర, సపిద్దాపుర, విరాజపేట పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాఠశాలలు, సినిమాహాల్స్, హోటల్స్, వస్త్ర దుకాణాలు తమ కార్యకలాపాలను స్వచ్ఛందంగా నిలిపి వేశారు. మడికేరిలోని ఫిల్డ్‌మార్షల్ కరియప్ప సర్కిల్, టోల్గేట్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. మైసూరు-విరాజపేట మార్గలో బిట్టంగాల గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పెద్ద వృక్షాన్ని కొట్టివేసి రోడ్డుకు అడ్డంగా పెట్టారు. దీంతో ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. బంద్ నేపథ్యంలో ముందుగానే సెలువు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకు పరిమిత మయ్యారు. కే.జే జార్జ్‌తో పాటు హోంశాఖ ఉన్నతాధికారులైన ప్రణబ్ మహంతి, ఎం.ఎస్ ప్రసాద్‌లు కూడా గణపతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని కొడవ సముదాయానికి చెందిన నాయకులు ఆరోపించారు. సదరు ఇద్దరు ఉన్నతాధికారులను కూడా వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. బందో బ(మ)స్తు... కొడుగు జిల్లా బంద్ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. 1200 మంది పోలీసు సిబ్బందితో పాటు మరో 300 మంది వివిధ విభాగాలకు చెందిన అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రతి చోట సీసీ కెమరాలతో పరిస్థితులను వీడియో రికార్డ్ చేశారు. నిరసన కారులు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సున్నిత ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. మొత్తంగా బంద్ సందర్భంగా ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోక పోవడంతో రాష్ట్ర హోంశాఖతో పాటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. -
సాక్ష్యాలున్నాయా?
డీఎస్పీ గణపతి ఆత్మహత్య పై కె.జె.జార్జ్ ప్రశ్న బెంగళూరు: ‘నేను ఆయన్ను ఇబ్బంది పెట్టానని డీఎస్పీ గణపతి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు ఉన్నాయా’ అంటూ బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కె.జె.జార్జ్ ప్రశ్నించారు. సోమవారమిక్కడి విధానసౌధ వద్ద తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘ఈ విషయంపై హోం శాఖ మంత్రి పరమేశ్వర్ సభలో వివరణ ఇచ్చిన తర్వాత నా పై వ్యక్తిగతంగా ఆరోపణలు వస్తే అందుకు నేను సమాధానం ఇస్తాను. గణపతి కుటుంబ సభ్యులు నా పై కేసు పెడితే పెట్టనివ్వండి, చట్ట ప్రకారమే విచారణ జరుగుతోంది, విచారణ అనంతరం అన్ని విషయాలు తెలుస్తాయి’ అని పేర్కొన్నారు. -
'ఇద్దరే చేస్తే గ్యాంగ్ రేప్ కాదు'
మహిళలపై అత్యాచారాల విషయంలో కర్ణాటక హోం మంత్రి కేజే జార్జి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరే మగవాళ్లు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని ఆయన అన్నారు. కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలి తప్ప, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి కదులుతున్న వ్యానులో అత్యాచారం చేసిన ఘటనపై మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరినప్పుడు జార్జి ఇలా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ యువతి డ్యూటీ ముగిసిన తర్వాత తన పీజీ హోంకు వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా వాళ్లు వచ్చి ఆమెను వ్యానులో ఎక్కించుకుని తీసుకెళ్లి, అత్యాచారం చేశారు. అయితే ఇంతటి దారుణమైన ఘటన విషయంలో రాష్ట్ర హోం మంత్రి స్పందించిన తీరుపట్ల జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ లలితా కుమారమంగళం మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా వ్యాఖ్యలుచేయడం సరికాదని ఆమె అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు మాట్లాడేముందు ఏం చెబుతున్నామో ఓసారి ఆలోచించుకోవాలన్నారు. కాగా ఇంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా అత్యాచారాల విషయంలో ఇలాగే వ్యాఖ్యానాలు చేశారు. ముందు అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేస్తారని, తర్వాత వాళ్లిద్దరూ గొడవ పడినప్పుడు అత్యాచారం కేసులు పెడతారని అన్నారు. అబ్బాయిలు తప్పులు చేయడం మామూలేనని, అయితే రేప్ చేసినంత మాత్రాన ఉరి తీస్తారా అని అడిగారు. నలుగురు అబ్బాయిలు కలిసి అత్యాచారం చేయలేరని, ఒకరు రేప్ చేస్తే మిగిలిన అందరి పేర్లూ పెట్టేస్తారని వ్యాఖ్యానించారు. -
చైతన్యమే మందు
సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో గత కొంతకాలంగా మహిళలు, చిన్నారులపై సాగుతున్న అత్యాచారాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రజల్లో విృ్తతంగా చైతన్యాన్ని కలిగించడమే సరైన మందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. వివిధ కేసుల్లో పోలీసులు రికవరీ చేసిన రూ. 65 కోట్ల విలువ చేసే వస్తువులను సొంతదారులకు అందజేసేందుకు మంగళవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చట్టాల్లోని కొన్ని లొసుగులు, చైతన్యం కొరవడడం, అత్యాచార ఘటనలను ఎక్కువ చేసి చూపించడం తదితర కారణాలతో లైంగిక దాడుల సంఖ్య పెరుగుతోందన్నారు. అభం.. శుభం ఎరగని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడేవారు వృుగాలకన్నా హీనమని పేర్కొన్నారు. జనసంఖ్య పెరుగుతున్న కొద్దీ నేరాల సంఖ్య కూడా పెరుగుతోందని, నేరాలను అడ్డుకునేందుకు గాను పోలీసులు శక్తికి మించి శ్రమించాల్సి ఉంటుందని అన్నారు. ఇక హొయసల వాహనాల ద్వారా గస్తీని పెంచి నేరస్తుల్లో భయాన్ని రేకెత్తించాలని సూచించారు. నేరాలు జరిగిన సమయంలో వాటికి ప్రత్యక్ష సాక్షులైన వారు కూడా న్యాయస్థానం ముందుకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని, తద్వారా చాలా మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారని అన్నారు. నేరాలు జరిగిన సమయంలో అక్కడి సాక్షాధారాలను పోలీసులు అత్యంత జాగ్రత్తగా సేకరించడం ద్వారా అసలైన దోషులకు శిక్ష పడేలా చేయవచ్చని పేర్కొన్నారు. అత్యాచారాలను నిరోధించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలతో పాటు ప్రజల్లో సైతం చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా అత్యాచారానికి పాల్పడితే ఎంత శిక్ష పడుతుంది తదితర అంశాలపై ప్రజలు అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. ఇక తమకు సంబంధించిన వస్తువులను సైతం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతపై ప్రజలపై ఉందన్నారు. ఎక్కువ మొత్తంలో అభరణాలు ధరించడం, లేదా ఒంటరిగా ఉన్న సమయాల్లో నగలు ధరించడం వల్ల కూడా దొంగతనాల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. ఇక ఇంత పెద్ద మొత్తంలో వస్తువులను రికవరీ చేసిన పోలీసు శాఖ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. సమాజం నుంచి బహిష్కరించాలి.... మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారిని సమాజం నుంచి బహిష్కరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ పేర్కొన్నారు. పోలీసులు రికవరీ చేసిన వస్తువులను సొంత దారులకు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయనఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో జరుగుతున్న అత్యాచార ఘటనలు ఆయా పాఠశాలలతో పాటు సమాజానికే కళంకాన్ని తెచ్చిపెడుతున్నాయన్నారు. అత్యాచార ఘటనల్లోని నిందితులను విచారించేందుకు, ఆయా కేసులను పరిష్కరించేందుకు పోలీసు అధికారులకు పూర్తి స్వాతంత్య్రం కల్పించినట్లు వెల్లడించారు. -
రేటింగ్‌ల కోసం రేప్‌లకు ప్రచారం!
కర్ణాటక హోంమంత్రి జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీజేపీ ధ్వజం బెంగళూరు: టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగ్‌ల కోసం అత్యాచారాల ఘటనలకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి కేజే జార్జ్ వ్యాఖ్యానించటంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. హోంమంత్రి మీడియాపై నెపం వేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విధులు సక్రమంగా నిర్వర్తించటం చేతకాకుంటే పదవి నుంచి తప్పుకోవాలని జార్జ్‌కు సూచించింది. ‘మీడియాపై నిందలేసి ఆయన తప్పించుకోవాలని భావిస్తున్నారు. అసలు రేప్ ఘటనలు వెలుగులోకి రావటానికి చాలావరకు మీడియా కృషే కారణం’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప గురువారం బెంగళూరులో చెప్పారు. హోంమంత్రి మాటలు ప్రభుత్వ నిస్సహాయతకు నిదర్శనమని య డ్యూరప్ప తెలిపారు. అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని ధ్వజమెత్తారు. మీడియాపై బురద చల్లటం సరికాదని మాజీ సీఎం, బీజేపీ నేత జగదీష్ షెట్టర్ సూచించారు. హోంమంత్రి వ్యాఖ్యల గురించి తనకు తెలియదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఎలాంటి సందర్భంలో ఆయన ఈ ప్రకటన చేశారో వివరణ కనుక్కుంటానని చెప్పారు. బెంగళూరు పాఠశాలల్లో ఇటీవల చిన్నారులపై తరచూ లైంగిక దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో జార్జ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీకు ఇలాంటి వార్తలే కావాలి. టీఆర్పీ పెంచుకునేందుకే వీటిని చూపుతున్నారు. మంచి వార్తలు చూపితే బాగుంటుంది’ అని జార్జ్ మీడియాను ఉద్దేశించి బుధవారం పేర్కొన్నారు. -
అసలేం జరిగింది..?
సాక్షి, బెంగళూరు : మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సెంటర్ డెరైక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి రశ్మి మహేష్‌పై జరిగిన దాడికి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్‌తో కలిసి మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై నజర్బాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేంద్రను సస్పెండ్ చేశామన్నారు. అదేవిధంగా దాడికి ప్రయత్నించిన 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ అధికారులపై భౌతిక దాడులకు దిగడం నేరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే సందర్భంగా మైసూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వీ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ...త్వరలో ఈ విషయమై కలెక్టర్ శిఖ, కమిషనర్ సలీంతో పాటు ఎస్పీ అభినవ్కర్ను స్వయంగా కలిసి ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలుసుకుంటానన్నారు. అసలేం జరిగిందంటే.. రశ్మి మైసూరులోని అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఐ)లో కొంత మంది సిబ్బందిని రశ్మి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఐ హాస్టల్ వార్డన్ వెంకటేష్ బుధవారం సంస్థ ఆవరణంలోని సంప్‌లో చనిపోయి కనిపించారు. పోస్ట్‌మార్టం అనంతరం బంధువులు కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని సంస్థ ఆవరణంలోనే ఉంచి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. రశ్మి వేధింపులకు తట్టుకోలేకనే వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా వెంకటేష్ అంతిమ దర్శనానికి వెళ్లిన రశ్మిపై అక్కడే ఉన్న కొంతమంది రాళ్లు, చొప్పులతో దాడికి దిగారు. చివరికి పోలీసులు రక్షణ వలయంగా ఏర్పాడి రశ్మిను అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు ఏటీఐలో గతంలో జరిగిన అక్రమాలపై రశ్మి ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందించింది. అంతే కాకుండా మరిన్ని నిజాలు బయటకు రావాలంటే సీబీఐతో దర్వాపు జరిపించాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది దుండగులు రశ్మిపై భౌతిక దాడులకు దిగారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి 12:30 గంటలకు మూడు కేసులు నమోదయ్యాయి. -
నిధుల కొరత రానివ్వం
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని 11 తాత్కాలిక పోలీసు శిక్షణా కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎట్టి పరిస్థితుల్లో నిధుల కొరత రానివ్వబోమని రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టం చేశారు. తక్షణమే రూ 50 లక్షలను విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బెంగళూరులో కేఎస్ఆర్పీ నూతన భవనాన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించన ఆయన మాట్లాడారు. రాష్ట్ర పోలీసు శాఖలో 27 వేల సిబ్బంది కొరత ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అదేవిధంగా శిక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూడా పెద్దపీఠ వేస్తామని తెలిపారు. పోలీసు అధికారుల రోజువారి కార్యక్రమాల్లో ప్రభుత్వం కలుగజేసుకోదన్నారు. అయితే తప్పుచేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని కేజే జార్జ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి రామలింగారెడ్డి, ఎమ్మెల్యే హారీష్ తదితరులు పాల్గొన్నారు. -
హోంకే మాఫియా బెదిరింపులు!
- శాసనసభలో ఏకరువు పెట్టిన కె.జె.జార్జ్ - ముఠాలకు వ్యతిరేకంగా చర్యలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా అథో జగత్తును ఏలుతున్న మాఫియా ముఠాల నుంచి రాష్ర్ట హోం మంత్రి కేజే. జార్జ్కూ బెదిరింపులు తప్పలేదు. వేరే దేశాల్లో ఉన్న మాఫియా ముఠాలు కోస్తాలోని పారిశ్రామికవేత్తలు, ధనవంతులకు ఫోన్లు చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న తనకూ బెదిరింపులు వస్తున్నాయని జార్జ్ మంగళవారం శాసన సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లోని ఐశ్వర్యవంతులు, వ్యాపారులకు అజ్ఞాత మాఫియా ముఠాలు ఫోన్లు చేసి, డబ్బులు వసూలు చేస్తున్నాయని వెల్లడించారు. ఒక వేళ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దీని వల్ల సామాన్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కాగా విదేశాల్లో ఉన్న ఈ మాఫియా ముఠాలు డబ్బులు ఇవ్వకపోతే ఇంటి యజమాని భార్య, పిల్లలకు కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సునీల్ కుమార్‌తో పాటు మరో బీజేపీ సభ్యుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి వివరించారు. ఈ పరిణామాలతో అధికారులే ప్రాణ భయంతో కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. ఈ దశలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ, ఈ బెదిరింపులు కేవలం కోస్తా జిల్లాలకే పరిమితం కాలేదని, రాష్ట్రమంతా జరుగుతోందని తెలిపారు. పోలీసుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచడం ద్వారా మాఫియాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే పోలీసు అధికారులెవరూ బెదరడం లేదని, జాతీయ, అంతర్జాతీయ నిఘా సంస్థలను సంప్రదిస్తూ మాఫియా ముఠాలను తుదముట్టించడానికి ప్రయత్నిస్తున్నారని జార్జ్ వెల్లడించారు. మాఫియా డాన్ల పేర్లను తాను సభలో వెల్లడించలేనని, ఒక వేళ చెబితే పత్రికల్లో వారు పేర్లు ప్రచురితమవుతుందని తెలిపారు. అలాంటి సందర్భాల్లో వారు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పారు. తాను కూడా బెదిరింపులకు భయపడడం లేదని, పుట్టుక, చావు హఠాత్పరిణామాలంటూ...మాఫియా ముఠాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలను చేపడతామని ఆయన ప్రకటించారు.