హోంకే మాఫియా బెదిరింపులు!
- శాసనసభలో ఏకరువు పెట్టిన కె.జె.జార్జ్
- ముఠాలకు వ్యతిరేకంగా చర్యలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా అథో జగత్తును ఏలుతున్న మాఫియా ముఠాల నుంచి రాష్ర్ట హోం మంత్రి కేజే. జార్జ్‌కూ బెదిరింపులు తప్పలేదు. వేరే దేశాల్లో ఉన్న మాఫియా ముఠాలు కోస్తాలోని పారిశ్రామికవేత్తలు, ధనవంతులకు ఫోన్లు చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న తనకూ బెదిరింపులు వస్తున్నాయని జార్జ్ మంగళవారం శాసన సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లోని ఐశ్వర్యవంతులు, వ్యాపారులకు అజ్ఞాత మాఫియా ముఠాలు ఫోన్లు చేసి, డబ్బులు వసూలు చేస్తున్నాయని వెల్లడించారు.
ఒక వేళ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దీని వల్ల సామాన్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కాగా విదేశాల్లో ఉన్న ఈ మాఫియా ముఠాలు డబ్బులు ఇవ్వకపోతే ఇంటి యజమాని భార్య, పిల్లలకు కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సునీల్ కుమార్‌తో పాటు మరో బీజేపీ సభ్యుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి వివరించారు. ఈ పరిణామాలతో అధికారులే ప్రాణ భయంతో కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. ఈ దశలో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ, ఈ బెదిరింపులు కేవలం కోస్తా జిల్లాలకే పరిమితం కాలేదని, రాష్ట్రమంతా జరుగుతోందని తెలిపారు.
పోలీసుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచడం ద్వారా మాఫియాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే పోలీసు అధికారులెవరూ బెదరడం లేదని, జాతీయ, అంతర్జాతీయ నిఘా సంస్థలను సంప్రదిస్తూ మాఫియా ముఠాలను తుదముట్టించడానికి ప్రయత్నిస్తున్నారని జార్జ్ వెల్లడించారు. మాఫియా డాన్ల పేర్లను తాను సభలో వెల్లడించలేనని, ఒక వేళ చెబితే పత్రికల్లో వారు పేర్లు ప్రచురితమవుతుందని తెలిపారు. అలాంటి సందర్భాల్లో వారు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పారు. తాను కూడా బెదిరింపులకు భయపడడం లేదని, పుట్టుక, చావు హఠాత్పరిణామాలంటూ...మాఫియా ముఠాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలను చేపడతామని ఆయన ప్రకటించారు.