సాక్షి ప్రతినిధి, పుట్టపర్తి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా తయారీకి క్రమేణా అడ్డుకట్ట పడుతోంది. ఇటు అనంతపురం జిల్లా, అటు శ్రీసత్యసాయి జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) పోలీసులు చెక్‌పోస్టుల్లో పకడ్బందీగా తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం వ్యాపారులకు చెక్ పెడుతున్నారు. ఇప్పుడు రెండు జిల్లాల్లోనూ సారా తయారీ, ఎన్‌డీపీఎల్ (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2021లో నమోదైన కేసులతో పోలి్చతే 2022లో సగం కేసులు కూడా నమోదు కాలేదు.
సగానికి తగ్గిన అరెస్టులు
2021లో 9 మాసాల్లో (జనవరి నుంచి సెపె్టంబర్ 30 వరకు) కాపు సారా, నల్లబెల్లం, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ (అక్రమ మద్యం) రవాణా కేసుల్లో 3,417 మంది అరెస్టు అయ్యారు. ఈ ఏడాది తొమ్మిది మాసాల్లో 1,419 మంది మాత్రమే అరెస్టయ్యారు. దీన్నిబట్టి అక్రమ మద్యం నియంత్రణ ఏస్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. ముఖ్యంగా కర్ణాటక నుంచి గతంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు విచ్చల విడిగా మద్యం వచ్చేది. కర్ణాటక – శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దు కొడికొండ చెక్‌పోస్టు వద్ద భారీ స్థాయిలో మద్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గించడం కూడా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాలో 15 గ్రామాలను నాన్‌పెయిడ్ లిక్కర్ అమ్మే గ్రామాలుగా గుర్తించారు. అందులో ఇప్పటికే 8 గ్రామాల్లో అమ్మకాలు పూర్తిగా లేకుండా చేశారు. శ్రీసత్యసాయిలో 8 గ్రామాల్లో అమ్ముతున్నట్టు గుర్తించారు. ఈ గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎవరినీ ఉపేక్షించం
సరిహద్దుల్లో నిఘా వేసి జిల్లాలోకి అక్రమంగా వస్తున్న మద్యం, వాహనాలను నియంత్రించాం. పర్యవేక్షణ పెంచడం ఒకటైతే.. ప్రధానంగా ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చే మద్యం తగ్గింది. రానురాను ఈ కేసుల సంఖ్య మరింతగా తగ్గిస్తాం. ఈ కేసుల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు.
–రామ్మోహన్‌రావు, అడిషనల్ ఎస్పీ, సెబ్
Comments
Please login to add a commentAdd a comment