ఒకే అబ్బాయిని ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలు.. | Big Twist in Anantapur Triangle Love Story | Sakshi
Sakshi News home page

అటు రేష్మ, ఇటు శారద ఇద్దరితో ప్రేమ.. చివరికి ఏమైందంటే.?

Published Tue, Feb 25 2025 12:54 PM | Last Updated on Tue, Feb 25 2025 1:04 PM

Big Twist in Anantapur Triangle Love Story

వాస్మాయిల్‌ తాగిన ఇద్దరు యువతులు

ఒకరి మృతి, మరొకరు ఆస్పత్రిలో..

అనంతపురం: ఓ యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించి మోసం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన యువతులు వాస్మాయిల్‌ తాగారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం వన్‌టౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం గెరిశనపల్లికి చెందిన దివాకర్‌ అనంతపురం బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలో ముదిగుబ్బకు చెందిన రేష్మ అనే యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. పెద్దలు రేష్మకు వివాహం చేయగా.. పెళ్లయిన నెలకే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. మళ్లీ దివాకర్‌తో ప్రేమాయణం సాగించింది.

ఈ క్రమంలో రూ.2 లక్షలకు పైగా డబ్బు ఇచ్చింది. కాగా, కణేకల్లు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన శారద (23) అనే యువతితోనూ దివాకర్‌ ప్రేమాయణం సాగించాడు. అటు రేష్మ, ఇటు శారద ఇద్దరితోనూ ఏకకాలంలో ప్రేమ బంధం నడిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేసేవాడు. ఇటీవల శారదకు దివాకర్‌ తీరుపై అనుమానం వచ్చి ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశీలించగా.. రేష్మతో అతడి బాగోతం బయటపడింది. ఇదే క్రమంలో రేష్మ కూడా దివాకర్‌ను నిలదీసింది. విషయం తెలుసుకున్న రేష్మ కుటుంబ సభ్యులు ఆమెను కదిరిలో ఉన్న తమ బంధువుల ఇంటికి పంపారు.

అయితే, శనివారం దివాకర్‌తో మరోమారు రేష్మ ఫోన్‌లో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో దివాకర్‌ కదిరికి వెళ్లి ఆమెను బైక్‌పై అనంతపురం తీసుకొచ్చాడు. శారద ఉంటున్న హాస్టల్‌లోనే ఆమెను వదిలాడు. ఆదివారం సాయంత్రం రేష్మ, శారదలు దివాకర్‌ను తామున్న చోటుకు పిలిచి ఇద్దరినీ పెళ్లిచేసుకోవాలని కోరారు. అయితే, తానెవరినీ పెళ్లి చేసుకునేది లేదంటూ దివాకర్‌ వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు యువతులు ఆర్టీఓ కార్యాలయం వద్దకు వెళ్లి వాస్మాయిల్‌ తాగారు.

విషయాన్ని దివాకర్‌కు ఫోన్‌లో తెలియజేయగా.. వెంటనే అతను అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో ఇద్దరినీ ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక శారద మృతి చెందింది. రేష్మ పరిస్థితి నిలకడగా ఉంది. శారద వాస్మాయిల్‌ ఎక్కువ తాగిందని, రేష్మ కొంచెమే సేవించినట్లు గుర్తించిన పోలీసులు ఇందులో రేష్మ పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

‘అమ్మా.. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement