Triangle Love Story
-
ఒకరితో ప్రేమ.. మరొకరితో రహస్య వివాహం
విశాఖపట్నం: ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరిని పేమించి.. మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. వివాహం చేసుకున్న వాడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివీ.. కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన బాలిక(16) ఇటీవల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు పలువురు యువకులతో పరిచయాలున్నాయి. ఆదర్శనగర్‌కు చెందిన సీపాన సూర్యప్రకాష్‌రావుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ.. ఇందిరానగర్‌కు చెందిన లెంకా సాయికుమార్‌ను రహస్యంగా వివాహం చేసుకుంది. ఆమె సూర్యప్రకాష్‌తో చనువుగా ఉండడంతో సాయికుమార్‌కు నచ్చలేదు. అలాగే సాయికుమార్‌తో చనువుగా వ్యవహరించడం సూర్యప్రకాష్‌కు నచ్చలేదు. దీంతో వీరి ముగ్గురి మధ్య మనస్పర్థలు వచ్చాయి. బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి ఇద్దరూ వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె.. ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సూర్య ప్రకాష్, సాయికుమార్లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్యప్రకాష్ గోపాలపట్నం ఆర్ఆర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం మృతదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్‌గా గుర్తించారు. లంకా సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
Naveen Case: నవీన్‌తో బ్రేకప్ అయ్యాకే హరి దగ్గరయ్యాడు: నిహారిక!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తులో ముందుకు పోయే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకు.. నిహారిక ప్రేమే కారణమని నిందితుడు హరిహరకృష్ణ చెప్పగా, హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పలేదని.. నిందితుడికి తాము సాయపడ్డామని హరి ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్‌లు పోలీసులు ముందు ఒప్పుకున్నారు. నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక పోలీసుల ఎదుట నవీన్ నేరాన్ని అంగీకరిస్తూ.. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. కస్టడీ విచారణలో హరిహర కృష్ణ చెప్పింది ఇదే.. నేను ఇంటర్ 2017-2019 మధ్య దిల్షుక్ నగర్ లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నా. నవీన్ నాకు సెకండ్ ఇయర్ లో పరిచయం. అప్పటి నుంచి ఇద్దరం మంచి స్నేహితులం. వేర్వేరు చోట్ల ఇంజినీరింగ్ చేస్తున్నప్పటికీ.. ఇద్దరం తరచూ కలుసుకునేవాళ్లం. గతంలో నవీన్, నిహారిక ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. అన్ని విషయాలు నాతో పంచుకునేవాళ్లు. అయితే.. నవీన్ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసి నిహారిక గొడవ పడింది. అతనితో మాట్లాడడం మానేసింది. నీహారిక అంటే నాకు కూడా ఇష్టం. అందుకే ఆమెతో చనువుగా వుండే వాడిని. వాళ్లిద్దరూ విడిపోయారని తెలిశాక.. కొన్ని నెలల కిందట ఆమెకు ప్రపోజ్ చేశా. ఆమె సరే అంది. అప్పటి నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. అయితే.. నవీన్ అప్పుడప్పుడు నిహారికకు కాల్ చేసి, మెసేజ్‌లు చేసేవాడు. అది నిహారికకు నచ్చేది కాదు. ఆ విషయం నాతో చెప్పుకుని బాధపడింది. నిహారికను ఇబ్బంది పెడుతున్నాడనే కోపంతో నవీన్‌ను చంపాలని మూడు నెలల కిందటే నిర్ణయించుకున్నా. రెండు నెలల కిందట ఓ షాపింగ్ మార్ట్‌లో కత్తి కొన్నాను. అలాగే వేలి ముద్రలు పడకూడదని ప్లాస్టిక్ గ్లౌజ్‌లు కొన్నా. వాటిని ఇంట్లో సజ్జపైన ఎవరికీ కనిపించకుండా ఓ బ్యాగులో దాచా. జనవరి 16వ తేదీన.. ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నాం. కుదిరితే అదే రోజు నవీన్ ను హత్య చేయాలని అనుకున్నా. కానీ ఆ రోజు అందరూ కలవడం కుదురలేదు. మళ్లీ.. ఫిబ్రవరి 17వ తేదీన నవీన్ నాకు కాల్ చేసి , హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను, నా మరోస్నేహితుడు ఇద్దరం కలిసి ఉప్పల్‌లో సినిమాకు వెళ్లాం. ఈలోపు నవీన్ ఎల్బీ నగర్లో ఉన్నా అని కాల్ చేశాడు. నా బైక్‌పై నేను, నా ఫ్రెండ్ వెళ్లి.. నవీన్‌ను పికప్ చేసుకున్నాం. నాగోల్‌లో భోజనం చేశాక.. నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. నేను , నవీన్ మలక్ పేటలోని మా ఇంటికి వెళ్ళాం. ఆరోజు రాత్రి నవీన్ హాస్టల్ కు వెళ్తా అన్నాడు. నేను కూడా వస్తా అని చెప్పా. హత్యకు ఇదే ఛాన్స్ అనుకుని.. సజ్జపై దాచిన బ్యాగ్‌ను కూడా తీసుకెళ్లా. ఆరోజు నా ఫోన్ నుండి నవీన్.. నీహారికకు కాల్ చేసి ఆరు నుంచి ఏడు నిముషాలు మాట్లాడాడు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు ఓఆర్ఆర్ దాటగానే.. ఈ టైం లో అంత దూరం వద్దు అనుకున్నాం. ఇద్దరం కలిసి మందు తాగాం. ఆ తర్వాత నిహారిక గురించి మాట్లాడాలని నవీన్‌తో చెప్పాను. ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిహారికను నేను ప్రేమించుకుంటున్నామని, ఆమెను ఫోన్లు చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగా. నవీన్ కోపంతో నన్ను కొట్టాడు. నవీన్ చంపాలనే కసి మీద ఉన్న నేను.. ఆ కోపంతోనే నవీన్‌ను తోసేసి గొంతు నులిమి చంపేశా. శ్వాస ఆగిపోయిందని గుర్తించి.. కత్తితో శరీర భాగాలను వేరు చేశా. శరీర భాగాలను వేరు చేసే టైంలోనూ నాలో ఆవేశం చల్లారలేదు. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్లపొదల్లో పడేసాను. నవీన్ సెల్‌ఫోన్‌ను రోడ్డుపై పడేశా. శరీర భాగాలన్నీ ఓ బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. ఆ బ్యాగును రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్లపొదల్లో పడేసాను. అక్కడి నుంచి బ్రాహ్మణపల్లిలో ఉన్న నా ఫ్రెండ్ హాసన్ ఇంటికి వెళ్లా. అక్కడ బట్టలు మార్చుకుని.. హసన్‌కు అసలు విషయం చెప్పా. హసన్ భయపడ్డాడు. నన్ను తిట్టి వెంటనే పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు. ఉదయం వెళ్లి లొంగిపోతా అని చెప్పా. రక్తంతో తడిసిన నా బట్టలను ఒక బ్యాగ్‌లో వేసి.. సాగర్ కాంప్లెక్స్ బస్ స్టాప్ వద్ద రోడ్డు పక్కన చెత్త కుప్పలో పడేశా. ఉదయం 10 గంటలకు నిహారిక కు ఫోన్ చేసి రోడ్డు మీదకి రమ్మన్నా. అప్పుడు నవీన్‌ను చంపేశానని నిహారికతో మొత్తం జరిగింది చెప్పా. ఆమె భయపడింది.. తిట్టింది. ఆ తర్వాత బైక్ ఇంట్లో పెట్టి.. వరంగల్‌కు వెళ్లా. మా నాన్నకి విషయం చెప్పడంతో.. లొంగిపోవాలని సూచించాడు. తిరిగి 24వ తేదీ హాసన్ ఇంటికి వెళ్లా. ఇంకా ఎందుకు పోలేదు అని నిలదీశాడతను. దీంతో నేరుగా నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకొని .. హత్య చేసిన స్పాట్ కి వెళ్లా. అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేశా. ఆ తర్వాతే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ముందు లొంగిపోయా. నవీన్ దూరం అయ్యాకే.. హరి దగ్గరయ్యాడు! ఇక మరో ఇద్దరు నిందితులు హసన్, నిహారికలు సైతం నేరాన్ని అంగీకరించారు. నేరం గురించి తెలిసి కూడా భయంతో ఎవరికీ చెప్పలేదన్నారు. ఇక నవీన్ హత్య తర్వాత.. తనను హరి నాలుగుసార్లు కలిసినట్లు నిహారిక ఒప్పుకుంది. నవీన్ తాను ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, అయితే తమ బ్రేకప్ అయ్యాక హరి తనకు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడని చెప్పిందామె. నిహారిక కన్ఫెషన్ స్టేట్మెంట్.. ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ నేను ప్రేమించుకున్నాం. నవీన్ నేను చాలాసార్లు మా ఇంట్లో కలుసుకునేవాళ్లం. నవీన్ నేను గొడవ పడితే హరిహరకృష్ణ మాకు సర్ది చెప్పేవాడు. నవీన్ తో నాకు గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని. నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నవీన్ నాతో మాట్లాడానికి యత్నిస్తున్నాడని హరికి చెప్పా. నవీన్ కోపంతో రగిలిపోయేవాడు. కానీ, నేను అది సరదానేమో అనుకున్నా ఒక్కోసారి.. నవీన్‌ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని అనేవాడు. నేను తిడితే.. అదీ జోక్ అనేవాడు. ఒకరోజు వాళ్ల ఇంటికి తీసుకెళ్లి.. ఒక బ్యాగులో గ్లౌజులు, కత్తి చూపించాడు. నవీన్‌ను చంపేందుకే ఇవి అన్నాడు. అది నేను నమ్మలేదు. అలా మాట్లాడొద్దని తిట్టా. నవీన్‌తో మాట్లాడడం మానేశానని, ఇక అతను నన్ను మరిచిపోతాడని, మనం సంతోషంగా ఉందామని హరికి చెప్పా. హత్యకు రెండు రోజుల ముందు నుంచి ఇంటర్ ఫ్రెండ్స్ కలుస్తున్నట్లు హరి నాకు చెప్పాడు. నవీన్ గనుక ఈసారి కాల్ చేస్తే.. వేరే వాళ్లతో రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆరోజు హరి ఫోన్ నుంచే నవీన్ ఫోన్ చేశాడు. నేను హరి చెప్పినట్లే చెప్పా. ఎందుకు అలా చేస్తున్నావ్ అని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశాను. కొద్దిసేపటి తర్వాత హరి నాకు ఫోన్ చేశాడు. నవీన్ ఇంక నీతో మాట్లాడడంట అని చెప్పాడు. నేను సరే అన్నాడు. ఆ ఉదయం హరి నన్ను కలవాలని మేసేజ్ చేశాడు. పాత బట్టలతో వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీదకు వచ్చాడు. ఆ అవతారం చూసి ఏంటని అడిగా. అప్పుడు నవీన్‌ను చంపిన విషయం చెప్పాడు. ఆ తర్వాత వరంగల్ వెళ్లేందుకు డబ్బులు కావాలంటే.. మనీ ఇచ్చా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని డిసైడ్ అయ్యా. ఫిబ్రవరి 20వ తేదీ రోజున నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా .. హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్ స్టాప్ లో కలిసాడు. నవీన్‌ను చంపిన ప్రాంతాలను తిప్పి చూపించాడు. ఈలోపు నవీన్ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఆరాలు తీశారు. నాకు తెలియది చెప్పా. ఆ తర్వాత హరి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీన ఫోన్ చేశాడు. ఆ తర్వాత హసన్ ఫోన్ చేసి హరి మిస్సయినాడని, వాళ్ళ అక్కాబావ మలక్ పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పాడు. ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చెయమని సూచించాడు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హసన్ మరో ఎవరికీ ఫోన్ చేయొద్దని చెప్పించాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేను, నా ఫ్రెండ్ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్‌లో హరిని చూశాం. అక్కడ చాలాసేపు మాట్లాడి.. నేను పోలీసులకు లొంగిపోతాను అని చెప్పాడు. ఆపై విడిభాగాలను చంపిన స్థలంలోనే వేయమని హసన్, హరికి సూచించాడట. ఆ పని చేశాక.. బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చాడు. నాకు ఫోన్ చేసి.. మా ఇంటికి వచ్చాడు. మా ఇంట్లో హరి స్నానం చేసినాడు. మా బావ అడ్వకేట్. ఆయనతో మాట్లాడాలని.. హరి చెప్పగా, అప్పుడు నేను మా బావ భూపాల్ రెడ్డిని పిలిచి నవీన్ మర్డర్ గురించి చెప్పాం. ఇది పెద్ద కేసు వెంటనే పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలని చెప్పాడు. ఆపై హరి అదే రోజున వెళ్లి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులకు, నవీన్ ఫ్రెండ్స్‌కు కావాలనే హత్య గురించి చెప్పలేదు. ఈ కేసులో దొరికే అవకాశమే లేదని హరి నాతో చెప్పాడు. హరిహరకృష్ణ చెప్పిన మాటల్ని నమ్మాను అని నిహారిక పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చింది. -
మటన్ కావాలా.. భర్త కావాలా.. తేల్చుకో..!
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు మనం సినిమాల్లో, రియల్ లైఫ్‌లో ఎన్నో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది.. వాటన్నింటికి మించింది. సవాల్ చేస్తున్నాం.. మీరు ఇంతవరకు ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రపంచలో ఎక్కడా చూసుండరు. ఆ లవ్‌స్టోరీని మీరు చదవండి.. 100 శాతం శాఖాహారి అయిన ఓ వ్యక్తికి.. అద్భుతమైన సౌందర్యరాశితో వివాహం అవుతుంది. ఆమెది కూడా ప్యూర్ వెజిటేరియన్ కుటుంబం. శాఖాహార కుటుంబంలో జన్మించిన ఆమె అనుకోకుండా ఒకసారి మటన్ తిన్నది. ఆ తర్వాత దానికి ఎడిక్ట్ అయిపోయింది. ఇంట్లో తెలియకుండా బయట అడపాదడపా మటన్ తింటుండేది. (చదవండి: మాట తప్పావంటూ ట్రోలింగ్.. కోహ్లి కౌంటర్) అయితే దీని గురించి ఆమె వివాహానికి ముందే అనగా పెళ్లి చూపుల సమయంలోనే భర్తతో చెప్పింది. మటన్ అంటే చాలా ఇష్టం అని.. ఇంట్లో వారికి తెలియకుండా బయట తింటుంటానని భర్తకు తెలిపింది. అపూరూప సౌందర్యరాశిని ఇలాంటి కారణం వల్ల వదులుకోవడం ఇష్టం లేని వ్యక్తి.. ఓ కండిషన్ పెట్టి.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అందేంటంటే.. వివాహం తర్వాత ఇక జీవితంలో ఎప్పుడు మటన్ తినకూడదని షరతు పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించడంతో వారి వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు వారి కాపురం సజావుగా సాగింది. అయితే సదరు మహిళ భర్తకు ఇచ్చిన మాటను నిలపుకోలేకపోయింది. వివాహం అయిన తర్వాత కూడా ఆమె భర్తకు తెలియకుండా బయట మటన్ తినసాగింది. దీని గురించి కొన్ని రోజుల తర్వాత భర్తకు తెలిసింది. మాట తప్పిన భార్య మీద అతడికి చాలా కోపం వచ్చింది. అలా అని చెప్పి ఆమెను వదులుకోలేడు. అందుకని భార్యకు చివరి వార్నింగ్ ఇచ్చాడు. ‘నీకు మటన్ కావాలో.. భర్త కావాలో తేల్చుకో’ అని అల్టిమేటం జారీ చేశాడు. (చదవండి: అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్ మంచిదేనా?) అప్పటి వరకు బాగానే ఉంది కానీ.. ఆ తర్వాతే సదరు వ్యక్తికి ఓ అనుమానం వచ్చింది. కొంపదీసి భార్య.. తన బదులు మటన్ కావాలని కోరుకుంటే.. తన పరువు ఏం కావాలి అని ఆలోచించాడు.. ఇంతకు తన భార్య ఎవరిని ఎంచుకుంటందో అని ఆలోచించసాగాడు. ఈ క్రమంలో తన సమస్యను వివరిస్తూ.. ఓ ఫ్యామిలీ కౌన్సిలర్‌కి లెటర్ రాశాడు. కౌన్సిలర్ అతడికి ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.. ‘‘శుభాకాంక్షలు. ట్రయాంగిల్ లవ్ స్టోరీల్లో మీరు మొదటిసారి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. ఇక్కడ ఓ అమ్మాయి మనిషి, మేకల మధ్య తనకు ఎవరు కావాలో ఎన్నుకోనుంది. నా అభిప్రాయం ఎంటంటే.. ప్రేమించిన వ్యక్తి లేకుండా జీవించవచ్చు... కానీ ఆహారం లేకుండా బతకలేం కదా. మరి నీ భార్య ఎవరిని ఎంచుకుంటుందో ఊహించు’’ అని సమాధానం ఇచ్చాడు. (చదవండి: టేస్ట్ అదరహో.. మటన్ లందు కర్నూలు మటన్ వేరయా !) ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కౌన్సిలర్ ఇచ్చిన సమాధానం అన్ని ఓ పేపర్లో వచ్చాయి. ఈ క్లిప్పింగ్‌ని పరణ్జాయ్ అనే జర్నలిస్ట్ తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రసుత్తం ఇది తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మనిషి తాత్కాలికం.. మాంసం శాశ్వతం.. అనుమానమే లేదు.. మటన్‌నే ఎంచుకుంటుంది.. ఫన్నీగా అనిపిస్తున్నా ఇది చాలా సీరియస్ విషయం అని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. प्यार चाहिए या मटन चाहिए pic.twitter.com/JFJhRB1pbz — ParanjoyGuhaThakurta (@paranjoygt) December 1, 2021 చదవండి: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా? -
వైరల్: ట్రయాంగిల్ లవ్‌స్టోరీపై క్లారిటీ ఇచ్చిన అషూ..
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి ఆ తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఇక అదే షోతో పొల్గొన్న రాహుల్ సిప్లిగంజ్‌తో బిగ్‌బాస్ అనంతరం ప్రేమలో పడ్డట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట పునర్నవితో లవ్ ఎఫైర్ నడిపిన రాహుల్ షో అనంతరం అషూకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని పార్టీలకు వెళ్లడం, ఆ ఫోటోలను షేర్ చేయడంతో వీరి మధ్యా ఏదో ఉందనే గాసిప్ మొదలైంది. దీనికి తోడు అషూను ఎత్తుకొని ఫోటోకు ఫోజివ్వడం, ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పోస్టులకు ప్రేమ సందేశాలు పంపుకోవడం, ఆ వెంటనే రాహుల్ లవ్ అనౌన్స్మెంట్ అంటూ అషూతో ఫోటో షేర్ చేయడం వంటివన్నీ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. దీంతో వీరిదరూ ప్రేమ మైకంలో మునిగిపోయారని కొందరు నెటిజన్లు పబ్లిక్‌గానే కామెంట్స్ చేశారు. అయితే ఇటీవలె ఓ షోలో పాల్గొన్న అషూ ఎక్స్‌ప్రెస్ హరి అనే కమెడియన్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఇది ట్రయాంగిల్ లవ్ అవుతుందేమోన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అటు హరి సైతం అషూ కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నాడు. దీంతో రాహుల్-అషూ మధ్యలో హరి అంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన అషూకు ఇదే ప్రశ్న ఎదురైంది. హరి-రాహుల్‌లలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలంటూ ఫ్యాన్స్ కోరారు. దీంతో 'కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా అని అడిగితే ఏం చెప్పాలంటూ' అషూ ఫన్నీగా బదులిచ్చింది . అంతేకాకుండా ఈ ఇద్దరిలో ఒకరిని తాను ఇష్టపడుతుంటే, మరొకరు తనని ఇష్టపడుతున్నారంటూ చిన్న హింట్ కూడా ఇచ్చేసింది. దీంతో మొత్తానికి ఈ లవ్కహానీ ట్రయాంగిల్ స్టోరీ అని అర్థమయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ హరి తన పేరుపై వేసుకున్న టాటూ గురించి స్పందిస్తూ..అది ఒకషో కోసమని, షోలో చాలా జరుగుతుంటాయని చెప్పింది. దీంతో ఆ టాటూ ఫేక్ అని తేలిపోయింది. -
ఆ హీరోయిన్ను ఇద్దరు ప్రేమించారు, కానీ!
జబ్ కోయీ బాత్ బిగడ్ జాయే.. జబ్ కోయీ ముశ్కిల్ పడ్ జాయే.. తుమ్ దేనా సాథ్ మేరా.. ఓ హమ్‌నవా.. (అనుకున్నది జరక్కపోయినా.. అవాంతరాలు ఎదురైనా నా తోడు వీడొద్దు నేస్తమా!) ఈ పాట జుర్మ్ (1990) సినిమాలోనిది. పాడింది కుమార్ సాను, నటించింది మీనాక్షి శేషాద్రి. జీవితంలోనూ మీనాక్షి తోడు కావాలనుకున్నాడు... కానీ కష్టకాలంలో ఆ ఇద్దరూ ఒకరికొకరు తోడు కాలేకపోయారు. అసలు ఆ ప్రేమ ఎలా మొదలైంది... ఆ కష్టకాలం ఏంటి? వివరాలు.. జుర్మ్ సినిమా ప్రీమియర్ షోలో మీనాక్షిని చూశాడు కుమార్ సాను. ఆమె అందానికి అతని మనసు చెదిరింది. ఆమె నవ్వు అతనికి నిద్రలేకుండా చేసింది కొన్ని వారాలు. ఆమె ఇంటి ఫోన్ నంబర్ సంపాదించాడు. సంభాషణ కలిపాడు. ఒంటరిగా కలుసుకునే ప్రయత్నమూ చేశాడు. ఫలించింది. మీనాక్షి .. కుమార్‌ను కలిసింది. ఆమె అంటే తనకెంత ప్రేమో వివరించాడు. ఎప్పటిలాగే నవ్వింది మీనాక్షి. ‘నిజం’ అన్నాడు ఆ వివాహితుడు. ఆ స్నేహాన్ని స్వీకరించింది మీనాక్షి. ఏ కాస్త వెసులుబాటు దొరికినా కుమార్ సానుతో గడపడానికి ఆసక్తి చూపించసాగింది ఆమె. అతనూ అంతే మీనాక్షి ఏ కొంచెం టైమ్ ఇచ్చినా రెక్కలు కట్టుకొని చెప్పిన చోటికి వాలిపోయేందుకు సిద్ధమయ్యాడు. పెరిగిన చనువుతో ఆమెకూ కుమార్ అంటే ఇష్టం ఏర్పడింది. డేటింగ్ మొదలైంది. ఆ సమయంలోనే మీనాక్షి నటించిన ఘాయల్ (హీరో సన్నీ డియోల్ )సూపర్ డూపర్ హిట్ అయింది. సన్నీ డియోల్, మీనాక్షి జంటతోనే ఇంకో సినిమా ప్లాన్ చేశాడు ఘాయల్ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి. అదే దామిని (1993). అదీ బంపర్ హిట్. సన్నీ, మీనాక్షి, రాజ్‌కుమార్ సంతోషి త్రయానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మీనాక్షి పట్ల రాజ్‌కుమార్ సంతోషీకీ ప్రేమ మొదలైంది. ఇటు .. కుమార్ సాను, మీనాక్షి తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. అలా మూడేళ్లు గడిచాయి. రాజ్‌కుమార్‌కు మీనాక్షి పట్ల ఆరాధన అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకరోజు ధైర్యం చేసి మీనాక్షి వాళ్లింటికి వెళ్లి ‘నువ్వంటే ఇష్టం.. నీకూ ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను’ అని తన మనసులో మాట ఆమెకు వినిపించాడు. సున్నితంగా తిరస్కరించింది మీనాక్షి. కుంగిపోయాడు అతను. డిప్రెషన్‌లోకీ వెళ్లాడు. మరోవైపు.. తమ ప్రేమను ఎంత గుట్టుగా దాచినా ఆ పొగ ఇండస్ట్రీ మిత్రుల ద్వారా కుమార్ సాను భార్య రీటా భట్టాచార్యకు చేరింది. ఆమెలో అనుమానం మొదలైంది. ఈ లోపే మీడియా కుమార్ సాను సెక్రటరీని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆమె ‘కుమార్‌కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మాత్రం మీనాక్షితో డేటింగ్ చేస్తున్నాడు’ అని చెప్పింది. ఆ రాతప్రతి రీటా కంట్లోనూ పడింది. కుమార్ సానును నిలదీసింది. అదంతా రూమర్ అని కొట్టిపారేశాడు. దాంతో రీటా సమాధానపడలేదు. పదేపదే ప్రశ్నించించడంతో నిజమే అని ఒప్పుకోక తప్పలేదు కుమార్ సానుకు. విడాకుల దావా వేసింది రీటా. ‘భర్త తన సంపాదనంతా మీనాక్షి కోసమే ఖర్చుచేస్తున్నాడు’ అనే అపవాదునూ జతపర్చింది. ఈ సీన్‌కి మనస్తాపం చెందింది మీనాక్షి. అంతేకాదు నెంబర్ వన్‌గా, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా సాగుతున్న తన కెరీర్‌ను, ఇమేజ్ను దెబ్బతీసేలా ఉందనీ భావించింది. పైగా కుమార్ సాను నుంచీ తనకు అనుకూలంగా ఎలాంటి స్పందన రాలేదు. విడాకుల వ్యవహారంతో కుమార్ సాను కూడా అభాసుపాలయ్యాడు. విడాకులు మంజూరయ్యాయి. మీనాక్షితో రిలేషన్ కూడా బ్రేక్ అయింది. న కోయీ హై, నా కోయీ థా.. జిందగీ మే తుమ్హారే సివా.. తుమ్ దేనా సాథ్ మేరా.. ఓ హమ్‌నవా.. (నాకప్పుడూ ఎవరూ లేరు.. ఇప్పుడూ లేరు.. నువ్వు నాకు తోడు ఉండవా నేస్తమా) అనే పంక్తులు మిగిలాయి కుమార్ సానుకు పాడుకోవడానికి. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ రీటా, కుమార్ సాను ఒక్కటయ్యారు. ఘాతక్.. డిప్రెషన్ నుంచి బయటపడ్డా మీనాక్షి మీద ప్రేమను చంపుకోలేకపోయాడు రాజ్‌కుమార్ సంతోషి. మళ్లీ ఆమెతో కలసి పనిచేయాలని నిశ్చయించుకున్నాడు. ఆమెను అడిగాడు. ఒప్పుకుంది. ’ఘాతక్’ సినిమా వచ్చింది. ఆ తర్వాత మీనాక్షి శేషాద్రి అమెరికాలో స్థిరపడ్డ హరీష్ మైసూర్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌ను పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భారతీయ శాస్త్రీయ నృత్యశాలను నిర్వహిస్తోంది. రాజ్‌కుమార్ సంతోషి కూడా మిలన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏ ఇద్దరి ప్రేమకూ శుభం కార్డ్ వేయలేదు. - ఎస్సార్ -
ప్రియురాలి కోసం స్నేహితుల మధ్య చిచ్చు..
సాక్షి, గుంటూరు: ప్రియురాలి వ్యవహారంలో ఇద్దరి స్నేహితుల మధ్య రగిలిన చిచ్చు.. చివరకు స్నేహితుడి ప్రాణాలను బలిగొంది. కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి ఇవ్వడంతో ఆ స్నేహితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ, మర్రిపాలెంకు చెందిన కొమ్మూరి ప్రేమ్‌చంద్ స్నేహితులు. ప్రేమ్‌చంద్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తన వద్ద ఫోన్ లేకపోవడంతో స్నేహితుడైన గోపీ ఫోన్ ద్వారా తరచుగా మాట్లాడేవాడు. అయితే మిత్రుడికి తెలియకుండా అదే నంబర్‌కు గోపీ కూడా పలుమార్లు మాట్లాడిన విషయాన్ని ప్రేమ్‌చంద్ గ్రహించాడు. దీంతో స్నేహితుల మధ్య పలుమార్లు వివాదాలు నెలకొన్నాయి. చివరిగా ఈనెల రెండోతేదీన ఇద్దరూ ఈ విషయమై గొడవ పడ్డారు. ప్రియురాలి విషయంలో అడ్డుగా ఉన్న గోపీవర్మను కడతేర్చాలని ప్రేమ్‌చంద్ నిశ్చయించుకున్నాడు. (చదవండి: డేటింగ్ పేరుతో చీటింగ్) అదే రోజు రాత్రి గోపీవర్మను యడ్లపాడు–నాదెండ్ల మార్గంలోని చప్టా వద్దకు పిలిపించి ముందుగానే గడ్డిమందు కలిపి ఉంచిన కూల్‌డ్రింక్‌ను అతనితో తాగించి తర్వాత నిజం చెప్పాడు. వెంటనే గోపీ బైక్‌పై ఇంటికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. గోపీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో ఈ నెల 7న గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కామెడీ పూనమ్!
‘ఇండియా క్రికెట్ టీమ్ 2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలో తిరుగుతా’ అని స్టేట్మెంట్ ఇచ్చిన మోడల్, నటి పూనమ్ పాండే ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఆమె మాటలపై అప్పట్లో పెను దుమారమే రేగింది. హాట్ ఫొటోలు, కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పూనమ్ ‘మాలిని అండ్ కో’ తర్వాత తాజాగా మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. భవానీ మస్తాన్ దర్శకత్వంలో వీబీఆర్ క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాతలు విజయ్‌భాస్కర్ రెడ్డి, ఫక్రుద్దీన్ షా మాట్లాడుతూ- ‘‘వినోదమే ప్రధానంగా సాగే చిత్రమిది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. పూనమ్ పాండే నటన, అందచందాలు యువతను ఆకట్టుకుంటాయి. ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరో కూడా కనిపిస్తారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్. -
‘ఉగ్ర’ నేతల ప్రేమాయణం
► ‘ఇస్లామిక్ స్టేట్’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ► సిటీలో చిక్కిన సానుభూతిపరుడికి సోదరి ► అద్నాన్ విచారణలో వెలుగులోకి.. ► కోర్టుకు తెలిపిన ఎన్ఐఏ సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయంగా ఏ అలజడి జరిగినా నగరం వణుకుతుంది. అంతేకాదు.. దానికి సంబంధించిన తీగ మహానగరాన్నీ అల్లుకుని ఉంటుంది. ఇలాంటి ఓ తీగ లాగితే.. ప్రేమ పునాదులపై వెలసిన భాగ్యనగరిలో ఐసిస్ ‘ఉగ్ర’ నేతల ప్రేమ కథ ఒకటి బయటపడింది. దీన్ని స్వయానా ఎన్ఐఏ ధ్రువీకరించింది. ఐసిస్ ఉగ్రవాదులనే ఆరోపణలపై దుబాయ్ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకువచ్చిన ముగ్గురిపై ఎన్ఐఏ సోమవారం ఢిల్లీలో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వీటిలో నగరానికి సంబంధించిన ఓ ‘ఉగ్ర’ ప్రేమకథ ప్రస్తావన ఉంది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో అరెసై్టన ‘ఐసిస్ త్రయం’ సోదరి, ఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్ర నేతల మధ్య జరిగిన ఈ వ్యవహారాన్ని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఐసిస్ ఉగ్రవాదులైన షేక్ అజర్ ఉల్ ఇస్లాం (జమ్మూ కాశ్మీర్), అద్నాన్ హసన్ (భత్కల్, కర్ణాటక), మహ్మద్ ఫర్హాన్ షేక్ (ముంబ్రా, మహారాష్ట్ర)ను గత ఏడాది దుబాయ్ నుంచి డిపోర్ట్ చేశారు. వీరిపైనే సోమవారం ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాల కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరేందుకు రెండుసార్లు ప్రయత్నించి అరెస్ట్ అయిన ‘ఐసిస్ త్రయం’ అబ్దుల్లా బాసిత్, ఒమర్ ఫారూఖ్, మాజ్ హసన్‌కు ఆర్థిక సాయం చేసింది అద్నాన్ అని వీటిలో స్పష్టం చేసింది. రెండుసార్లు సిరియా పయనం.. చాంద్రాయణగుట్టలోని నసీబ్‌నగర్, గుల్షాన్ ఇక్బాల్ కాలనీ, హుమాయున్‌నగర్ ప్రాంతాలకు చెందిన అబ్దుల్లా బాసిత్, ఒమర్ ఫారూఖ్, మాజ్ హసన్ గత ఏడాది పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరాలని కుట్ర పన్నారు. అయితే వీరు గత ఏడాది డిసెంబర్లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పట్టుబడి జైలుకు వెళ్లారు. దీనికి ముందు 2014లోనూ ఈ త్రయంలో ఇద్దరు.. మరో ఇద్దరితో కలిసి బంగ్లాదేశ్ మీదుగా సిరియా ప్రయాణ మై కోల్‌కతా చేరుకున్నారు. పోలీసులు ఈ నలుగురిని వెనక్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్‌తో సరిపెట్టారు. దీంతో ఈ ముగ్గురూ సుదీర్ఘకాలం ఆన్లైన్ ద్వారా సిరియాలోని ఐసిస్ నేతలతో టచ్‌లో ఉన్నారు. ‘ఐసిస్ త్రయానికి’ రెండుసార్లు ఆర్థిక సాయం చేసినట్లు ఆరోపణలున్న భత్కల్ వాసి అద్నాన్ హసన్ విచారణలో ‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’ వెలుగులోకి వచ్చింది. ఉగ్రనేతల ముక్కోణపు ప్రేమ కథ.. రెండుసార్లు దేశం దాటే ప్రయత్నాలు చేసిన ‘ఐసిస్ త్రయం’ అబ్దుల్లా బాసిత్, ఒమర్ ఫారూఖ్, మాజ్ హసన్‌తో సిరియా కేంద్రంగా షఫీ ఆర్మర్‌కు అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న ఉగ్రవాద నేత అబు జకారియా నేరుగా ఆన్లైన్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. ఐసిస్ ఉగ్రవాదులకు పెళ్లి సంబంధాలు కుదర్చడం కోసం జకారియా ప్రత్యేకంగా ‘జిహాదీ మ్యాట్రిమోని’ పేరుతో వెబ్సైట్ కూడా నిర్వహించాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఒకరి సోదరితో ‘ఉగ్ర’ నేత జకారియాకు పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను జకారియా వివాహం చేసుకోవాలని భావించాడు. సిరియా కేంద్రగానే పనిచేస్తున్న మరో ఉగ్రవాద నేత అబు హంజా అల్ ముజాహీర్ సైతం తరచుగా ‘ఐసిస్ త్రయం’తో సంప్రదింపులు జరిపేవాడు. ఇతడికీ సదరు యువతితో పరిచయం ఏర్పడింది. ఈమెను ఇష్టపడిన ముజాహీర్ సైతం వివాహానికి సిద్ధమయ్యాడు. కథ కొలిక్కి రాకుండానే అరెస్టు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మరో మలుపు తీసుకోక ముందే ‘ఐసిస్ త్రయం’ గత ఏడాది పోలీసులకు చిక్కింది. అప్పట్లో సదరు యువతిని సైతం అదుపులోకి తీసుకున్న అధికారులు.. కౌన్సిలింగ్ చేసి వదిలేశారు. సిటీ యువతి సోదరుడైన ‘ఐసిస్ త్రయం’లోని ఒకడు.. అద్నాన్‌తో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. షఫీ ఆర్మర్ సూచనల మేరకు ఈ ముగ్గురికీ రెండుసార్లూ దుబాయ్ నుంచి అద్నానే ఆర్థిక సహాయం చేశాడు. ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీతో నేరుగా టచ్‌లో ఉన్న ఈ ముగ్గురినీ రెండుసార్లూ షఫీ ఆర్మరే సిరియా రావాల్సిందిగా సూచించి, ‘మార్గ నిర్దేశం’ చేశాడు. -
శ్రీనివాసుడి కళ్యాణం... ఎవరితో?!
ఓ హీరో... ఇద్దరు హీరోయిన్లు... ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ఇలా చెబితే కొత్తేముందిలే అనిపించవచ్చు. కానీ ఆ ప్రేమ కొన్ని కుటుంబాలతో ముడిపడినదైతే? ఎమోషన్స్ చుట్టూ తిరిగేదయితే? బంధ నాలుగా మారిన బంధాలను వదిలించుకోలేక అల్లాడేదయితే? అనుబంధాలను నిలుపుకోవడం కోసం త్యాగాలు చేసేది అయితే? అది గొప్ప ప్రేమ. అలాంటి ప్రేమే శ్రీనివాస్‌ది. అంటే ‘శ్రీనివాస కళ్యాణం’ సీరియల్ హీరోది. తన తల్లిదండ్రుల ప్రేమ పెళ్లి వల్ల విడిపోయిన కుటుంబాల్ని కలపడానికి నడుం కడతాడు శ్రీనివాస్. ఆ క్రమంలో ఓ మేనమామ కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అంతలో మరో మేనమామ కూతురు మంగ... శ్రీనివాస్ మీద ప్రేమ పెంచుకుంటుంది. శ్రీనివాస్ ఎవరో తెలిసి మేన మామలు తమ కూతుళ్లకి వేరే సంబంధాలు చూస్తారు. మంగ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెను కాపాడటం కోసం ప్రేమించినట్టు నటించమంటుంది పద్మ. తప్పక అంగీకరిస్తాడు శ్రీనివాస్. అటు ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేడు. ఇటు తనను ప్రేమిస్తున్న అమ్మాయిని అంగీకరించలేదు. ఈ సస్సెన్సే సీరియల్‌ని సక్సెస్ బాట పట్టించింది. చూడాలి మరి... శ్రీనివాసుడి కళ్యాణం ఎవరితో జరుగుతుందో!