‘ఉగ్ర’ నేతల ప్రేమాయణం
► ‘ఇస్లామిక్ స్టేట్’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
► సిటీలో చిక్కిన సానుభూతిపరుడికి సోదరి
► అద్నాన్ విచారణలో వెలుగులోకి..
► కోర్టుకు తెలిపిన ఎన్‌ఐఏ
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయంగా ఏ అలజడి జరిగినా నగరం వణుకుతుంది. అంతేకాదు.. దానికి సంబంధించిన తీగ మహానగరాన్నీ అల్లుకుని ఉంటుంది. ఇలాంటి ఓ తీగ లాగితే.. ప్రేమ పునాదులపై వెలసిన భాగ్యనగరిలో ఐసిస్ ‘ఉగ్ర’ నేతల ప్రేమ కథ ఒకటి బయటపడింది. దీన్ని స్వయానా ఎన్‌ఐఏ ధ్రువీకరించింది. ఐసిస్ ఉగ్రవాదులనే ఆరోపణలపై దుబాయ్ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకువచ్చిన ముగ్గురిపై ఎన్‌ఐఏ సోమవారం ఢిల్లీలో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వీటిలో నగరానికి సంబంధించిన ఓ ‘ఉగ్ర’ ప్రేమకథ ప్రస్తావన ఉంది. సిరియా వెళ్లే ప్రయత్నాల్లో అరెసై్టన ‘ఐసిస్ త్రయం’ సోదరి, ఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్ర నేతల మధ్య జరిగిన ఈ వ్యవహారాన్ని ఎన్‌ఐఏ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఐసిస్ ఉగ్రవాదులైన షేక్ అజర్ ఉల్ ఇస్లాం (జమ్మూ కాశ్మీర్), అద్నాన్ హసన్ (భత్కల్, కర్ణాటక), మహ్మద్ ఫర్హాన్ షేక్ (ముంబ్రా, మహారాష్ట్ర)ను గత ఏడాది దుబాయ్ నుంచి డిపోర్ట్ చేశారు. వీరిపైనే సోమవారం ఎన్‌ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాల కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరేందుకు రెండుసార్లు ప్రయత్నించి అరెస్ట్ అయిన ‘ఐసిస్ త్రయం’ అబ్దుల్లా బాసిత్, ఒమర్ ఫారూఖ్, మాజ్ హసన్‌కు ఆర్థిక సాయం చేసింది అద్నాన్ అని వీటిలో స్పష్టం చేసింది.
రెండుసార్లు సిరియా పయనం..
చాంద్రాయణగుట్టలోని నసీబ్‌నగర్, గుల్షాన్ ఇక్బాల్ కాలనీ, హుమాయున్‌నగర్ ప్రాంతాలకు చెందిన అబ్దుల్లా బాసిత్, ఒమర్ ఫారూఖ్, మాజ్ హసన్ గత ఏడాది పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరాలని కుట్ర పన్నారు. అయితే వీరు గత ఏడాది డిసెంబర్‌లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పట్టుబడి జైలుకు వెళ్లారు. దీనికి ముందు 2014లోనూ ఈ త్రయంలో ఇద్దరు.. మరో ఇద్దరితో కలిసి బంగ్లాదేశ్ మీదుగా సిరియా ప్రయాణ మై కోల్‌కతా చేరుకున్నారు. పోలీసులు ఈ నలుగురిని వెనక్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్‌తో సరిపెట్టారు. దీంతో ఈ ముగ్గురూ సుదీర్ఘకాలం ఆన్‌లైన్ ద్వారా సిరియాలోని ఐసిస్ నేతలతో టచ్‌లో ఉన్నారు. ‘ఐసిస్ త్రయానికి’ రెండుసార్లు ఆర్థిక సాయం చేసినట్లు ఆరోపణలున్న భత్కల్ వాసి అద్నాన్ హసన్ విచారణలో ‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’ వెలుగులోకి వచ్చింది.
ఉగ్రనేతల ముక్కోణపు ప్రేమ కథ..
రెండుసార్లు దేశం దాటే ప్రయత్నాలు చేసిన ‘ఐసిస్ త్రయం’ అబ్దుల్లా బాసిత్, ఒమర్ ఫారూఖ్, మాజ్ హసన్‌తో సిరియా కేంద్రంగా షఫీ ఆర్మర్‌కు అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న ఉగ్రవాద నేత అబు జకారియా నేరుగా ఆన్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. ఐసిస్ ఉగ్రవాదులకు పెళ్లి సంబంధాలు కుదర్చడం కోసం జకారియా ప్రత్యేకంగా ‘జిహాదీ మ్యాట్రిమోని’ పేరుతో వెబ్‌సైట్ కూడా నిర్వహించాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఒకరి సోదరితో ‘ఉగ్ర’ నేత జకారియాకు పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను జకారియా వివాహం చేసుకోవాలని భావించాడు. సిరియా కేంద్రగానే పనిచేస్తున్న మరో ఉగ్రవాద నేత అబు హంజా అల్ ముజాహీర్ సైతం తరచుగా ‘ఐసిస్ త్రయం’తో సంప్రదింపులు జరిపేవాడు. ఇతడికీ సదరు యువతితో పరిచయం ఏర్పడింది. ఈమెను ఇష్టపడిన ముజాహీర్ సైతం వివాహానికి సిద్ధమయ్యాడు.
కథ కొలిక్కి రాకుండానే అరెస్టు
ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మరో మలుపు తీసుకోక ముందే ‘ఐసిస్ త్రయం’ గత ఏడాది పోలీసులకు చిక్కింది. అప్పట్లో సదరు యువతిని సైతం అదుపులోకి తీసుకున్న అధికారులు.. కౌన్సిలింగ్ చేసి వదిలేశారు. సిటీ యువతి సోదరుడైన ‘ఐసిస్ త్రయం’లోని ఒకడు.. అద్నాన్‌తో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. షఫీ ఆర్మర్ సూచనల మేరకు ఈ ముగ్గురికీ రెండుసార్లూ దుబాయ్ నుంచి అద్నానే ఆర్థిక సహాయం చేశాడు. ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీతో నేరుగా టచ్‌లో ఉన్న ఈ ముగ్గురినీ రెండుసార్లూ షఫీ ఆర్మరే సిరియా రావాల్సిందిగా సూచించి, ‘మార్గ నిర్దేశం’ చేశాడు.