islamic state
-
Hizb-ut-Tahrir: హిజ్బ్–ఉత్–తహ్రీర్‌పై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: జిహాద్, ఉగ్ర కార్యకలాపాలతో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న హిజ్బ్–ఉత్–తహ్రీర్(హెచ్‌యూటీ)పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1953లో జెరుసలేంలో ప్రారంభమైన ఈ సంస్థ, దేశంలో దారితప్పిన యువతను చేరదీసి వారిలో ఉగ్ర భావజాలాన్ని నూరిపోస్తోందని కేంద్ర హోం శాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. వివిధ సామాజిక మాధ్యమ వేదికలు, రహస్య యాప్‌లు, ప్రత్యేక సమావేశాల ద్వారా యువతను ఇది గ్రూపులో చేర్చుకుంటోందని తెలిపింది. వారిని జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాలవైపు మళ్లించి ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ప్రభుత్వాలను కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన హిజ్బ్–ఉత్– తహ్రీర్ భద్రతకు ముప్పుగా పరిణమించిందని హోం శాఖ వెల్లడించింది. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం–1967 కింద ఈ సంస్థపై నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్లో ప్రకటించింది. -
కాంగోలో ఉగ్ర ఘాతుకం.. 36 మంది మృతి
గోమా: ఆఫ్రికా దేశం కాంగోలో ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్(ఏడీఎఫ్) జరిపిన మారణకాండలో 36 మంది పౌరులు చనిపోయారు. నార్త్ కివు ప్రావిన్స్ ముకోండి గ్రామంలోకి బుధవారం రాత్రి కత్తులు, తుపాకులతో ప్రవేశించిన ఉగ్రమూకలు ఇళ్లకు నిప్పుపెట్టాయి. బయటకు వచ్చిన పౌరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాయి. ఘటనలో 36 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరిని ఎత్తుకుపోయారు. ఏడీఎఫ్ ఉగ్రమూకలు చిన్నారులపైనా దారుణాలకు పాల్పడుతున్నాయి. -
కశ్మీర్లో మరిన్ని దాడులు చేస్తాం: ఐఎస్కేపీ హెచ్చరిక
న్యూఢిల్లీ: కశ్మీర్లో ఇటీవలి కాలంలో జరిగిన లక్షిత దాడుల వంటివే మరికొన్ని చేపడతామంటూ జమ్మూకశ్మీర్ ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ) హెచ్చరికలు పంపింది. తన అధికార ఆన్లైన్ పత్రిక ‘వాయిస్ ఆఫ్ హింద్’లో సోమవారం ఒక ఫొటోను ప్రచురించింది. చిరు వ్యాపారిని వెనుక నుంచి తుపాకీతో కాలుస్తున్నట్లున్న ఆ ఫొటోకు ‘మేం వస్తున్నాం(వుయ్ ఆర్ కమింగ్)’అంటూ శీర్షిక పెట్టింది. త్రిశూలంతో ఉన్న హిందూ దేవుళ్ల ఫొటోను కూడా ప్రచురించింది. తమ తదుపరి లక్ష్యం వారేనంటూ పరోక్షంగా హెచ్చరించింది. పండుగ సీజన్లో పేలుళ్లకు పథకం వేసిన ఉగ్రవాదులను ఇటీవల భద్రతా బలగాలు పట్టుకున్న విషయం తెలిసిందే. ఐఎస్కేపీ స్లీపర్ సెల్స్ కశ్మీర్ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. -
‘ఇస్లామిక్ స్టేట్’ ప్రేరణతో ఉగ్ర ఉచ్చులోకి..
న్యూఢిల్లీ/చెన్నై: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రేరణతో భారత్‌లోనూ ముష్కరులు పెచ్చరిలి్లపోతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ఉగ్రవాద దాడులు, కుట్ర, నిధుల అందజేతకు సంబంధించిన 37 కేసుల్లో ఇప్పటిదాకా 168 మందిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. 31 కేసుల్లో చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేశామని తెలిపింది. నిందితుల్లో ఇప్పటిదాకా 27 మందిని న్యాయస్థానాలు దోషులుగా తేల్చాయని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ముఠా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఆమాయక యువతపై వల విసురుతోందని, భారత్‌లో తన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం పట్ల ఆకర్షితులైన వారిని విదేశాల నుంచే సోషల్ మీడియా వేదికల ద్వారా సంప్రదించి ఉచ్చులోకి లాగుతున్నారని తెలిపారు. తమిళనాడులో ఒకరి అరెస్టు ఇస్లామిక్ స్టేట్, హిజ్‌్బ–ఉత్–తహ్రీర్ ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలు, భావజాలాన్ని ఫేస్బుక్ ద్వారా వ్యాప్తి చేస్తున్నారన్న సమాచారంతో తమిళనాడులో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం రాష్ట్రంలో రెండు చోట్ల సోదాలు నిర్వహించి ఒకరిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. తిరువారూర్ జిల్లాలో బవా బహ్రుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. -
టర్కీ దళాల చేతిలో ఐఎస్ చీఫ్ బాగ్ధాది సోదరి..
న్యూఢిల్లీ : అమెరికా సేనల ఆపరేషన్‌లో హతమైన ఐఎస్ చీఫ్ అల్ బాగ్ధాది సోదరి సిరియాలో టర్కీ దళాలకు చిక్కినట్టు టర్కీ అధికారి వెల్లడించారు. బాగ్ధాది సోదరి, 65 సంవత్సరాల రస్మియా అవద్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్నారు. అలెప్పో ప్రావిన్స్‌లోని అజాజ్ పట్టణంలోని ఓ కుటుంబంతో కలిసి నివసిస్తున్న కంటెయినర్‌పై దాడి జరిపిన క్రమంలో రస్మియా అవద్‌ను టర్కీ దళాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. బాగ్ధాది సోదరి రస్మియాతో ఆమె భర్త, కోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని, కుటుంబ సభ్యులను ఇంటారాగేట్ చేస్తున్నామని టర్కీ అధికారి వెల్లడించారు. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో అలెప్పో ప్రాంతాన్ని టర్కీ దళాలు తమ అదుపులోకి తీసుకుని జల్లెడ పడుతున్నాయి. రస్మియా చిక్కడంతో ఐఎస్ కార్యకలాపాలపై లోతైన సమాచారంతో ఐఎస్ ఉగ్ర మూకలను పట్టుకునే అవకాశం లభిస్తుందని టర్కీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అల్ బాగ్ధాదిని గత నెల అమెరికన్ దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. -
అమెరికా అగ్రవాదమే ఈ ఉగ్రవాదం!
‘‘అబద్ధాల మీద ఆధారపడి యుద్ధాల ద్వారా అమెరికా లక్షలాది ప్రజల్ని చంపేసిన మాట నిజమే. ఇందుకు గాను అమెరికా 8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 566 లక్షల కోట్లు) ఖర్చు చేయవలసి వచ్చింది.’’ – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోలు : అమెరికా ‘ఇన్ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్’’ (ఐసీహెచ్) సమాచారం: బిల్ వాన్ ఆకెన్; 10–10–2019 ‘సిరియాలో తిష్ట వేసిన ఇస్లామిక్ స్టేట్ అగ్రనాయకుడు అబూ బక్రాలా బాగ్దాదీ అమెరికా సైన్యం జరిపిన దాడిలో కుక్కచావు చచ్చాడు, పిరికివాడిలా చచ్చాడు. డీఎన్ఏ పరీక్ష ద్వారా అతడు బాగ్దాదీ అని చెబుతున్నారు’ (అసోసియేటెడ్ ప్రెస్). కానీ హతమైంది బాగ్దాదీ యేనని ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మూవీ చూస్తున్నట్లు ఓ ప్రకటనలో ధృవీకరించాడు. కానీ బాగ్దాదీని వేటాడటానికి సైనికులు సహాయం తీసుకుంది డాగ్ స్క్వాడ్‌కి చెందిన ఒక కుక్కనే అన్న సంగతి ట్రంప్ మరిచిపోయాడు. కారణం.. పాశవిక హింసాప్రియుడు ట్రంప్. ‘‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’’ అన్నట్లు 26వ తేదీన చంపామని ట్రంప్ ఉద హరించిన బాగ్దాదీ ఎవరో కాదు. మీరు పెంచి పోషించిన వ్యక్తే సుమా అని కామన్ డ్రీమ్స్ సంస్థ తరపున సీఎన్‌బీసీ రిపోర్టర్ జాన్ హార్యుడ్ ప్రకటించారు (27–10–2019). ఇరాన్ నాయకులు కూడా అలానే ప్రకటించారు. ఈ గాథలు, ప్రపంచ ఘటనలు, అమెరికా నాయకస్థానంలో ఉన్న వలస సామ్రాజ్య వాద పాలకుల చేష్టలు, ప్రకటనలు గమనిస్తూంటే, ప్రపంచ ఉగ్రవాద ప్రమాదం గురించిన వీరి అంచనాలు ఒకరకంగా ఉంటూ, ఉగ్రవాద నిర్మూలన పేరిట నేడు జరుగుతున్నది అమెరికా అగ్రవాదమే అనిపిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే, కొన్నేళ్ల క్రితం బిన్ లాడెన్ పేరిట ప్రపంచవ్యాప్తంగా అమెరికా–బ్రిటన్లు జరి పిన వేటకు, ఆ ముసుగులో అప్ఘానిస్తాన్, ఇరాక్, ఇరాన్‌ల మీద జరి పిన పాశవిక దాడులకు ఇటీవల సిరియాలో జోక్యం దారీ వేటకు ఎత్తుగడలు, వ్యూహాలన్నీ రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల నాయకుల కనుసన్నలలోనే జరుగుతున్నాయని పైన తెల్పిన ట్రంప్ ప్రకటనే (అబద్ధాలపై ఆధారపడి యుద్ధాలను అమెరికా నిర్వహిస్తోందని) చెప్పక చెబుతోంది! బాగ్దాదీని అంతం చేశామని ప్రకటించిన ట్రంప్ తీరు చూస్తే సామ్రాజ్యవాద పాలకులే కాదు.. కొన్ని దేశాల పాలకులు కూడా ఎన్నికలలో విజయావకాశాలను పెంచుకునేందుకు కూడా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి ఇరుగు పొరుగు మీదకో లేదా తమకు పడని దేశాల మీదకో యుద్ధకాహళులూది, ఉద్రిక్తతలు పెంచ డానికి వెనుదీయరని గత చరిత్రే కాదు, నడుస్తున్న చరిత్రకూడా దాఖ లాలుగా ఉన్నాయి. ట్రంప్ ఇంత సీరియస్‌గా బాగ్దాదీ చావు గురించి అంత హడా వుడిగా చేసిన ప్రకటన ఆధారాల్ని పాశ్చాత్య పరిశీలకులు, కొన్ని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. అవి: 1. కొన్ని నెలల్లో రానున్న అధ్యక్ష ఎన్నికల పూర్వ రంగంలో ఇటీవల ట్రంప్ రష్యా, చైనాల పైన పొంతన లేని ఆరోపణలు చేస్తుండటం, తద్వారా అమెరికా ప్రతిష్టను దిగజార్చడానికి నిరసనగా అమెరికా పార్లమెంటులో ట్రంప్‌కు వ్యతి రేకంగా అభిశంసన తీర్మానం రాబోవడం. 2. సిరియాలో అమెరికా, కుర్దిష్ అనుయాయులపై టర్కీ జరిపే దాడులకు దూరంగా ఉండటం కోసం సిరియా నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవాలని ట్రంప్ అకస్మాత్తుగా ప్రకటించడాన్ని రిపబ్లికన్, డెమోక్రాటిక్ పక్షాలు రెండూ విమర్శించడం. ఇందుకు అనుగుణంగా టర్కీ, కుర్దూల మధ్య యుద్ధవిరమణను ప్రకటిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించ డమూ! ఇది ఇలా ఉండగా, బాగ్దాదీని ఖతం చేసినట్లు స్వయానా ట్రంప్ అకస్మా త్తుగా చేసిన ప్రకటనను స్వయానా అమెరికన్ సైనిక యుద్ధ తంత్ర కార్యాలయం (పెంటగన్) సైతం ధృవీకరించడానికి నిరాకరించింది. చివరకు ‘ఆసులో గొట్టాం’ మాదిరిగా చీమ చిటుక్కుమంటే చాలు విసుగూ విడుపూ లేకుండా ప్రచారం కోసం ప్రకటనలు విడుదల చేస్తూండే ట్రంప్ అధ్యక్ష ప్రాసాద సాధికార ప్రతినిధి హాగన్ గిడ్లీ సహితం నోరు మెదపకుండా అదంతా ట్రంపే చూసుకుంటాడు లెమ్మని ముక్తసరిగా చెప్పాడు. పైగా బాగ్దాదీని అంతమొందించడా నికి జరిగిన దాడి ప్రయత్నం ‘జయ ప్రదమయిందా’ అన్న ప్రశ్నకు దాడిని నిర్వహించానని చెప్పిన అధికారి కూడా వివరాలు తెల్పడానికి నిరాకరించాడు. ఇక సుప్రసిద్ధ ప్రపంచ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ సంప్రదించిన అమెరికన్ అధికారులు కూడా నిజానిజాల గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇన్ని వైరుధ్యాల మధ్య బాగ్దాదీ ‘హతం, ఖతం’ వార్తలు విడుదలయ్యాయి. అందుకే, గతంలో ‘9/11’ (2001–2002) నాటి అమెరికా జంట వాణిజ్య కేంద్ర భవన సముదాయంపై జరిగిన ఆకస్మిక దుర్మార్గపు దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ దాడికి వ్యూహకర్త, ఇస్లామిక్ ఉగ్ర వాద నాయకుడు బిన్‌లాడెన్ స్వయంగా దాడికి కారకుడని ప్రచార ప్రకటన జార్జిబుష్ ప్రెసిడెంట్‌గా ఉన్న కాలంలో జరిగింది. కానీ, ఆ తర్వాత 1,500 మంది అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రసిద్ధ భవన నిర్మాణ ఇంజనీర్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, పలువురు శాస్త్రవేత్తలు, భౌగోళికంగా భవన పునాదుల నిర్మాణ సంబంధమైన వాస్తు శిల్పులు, సామాజిక శాస్త్ర వేత్తలతో ఏర్పడిన కమిటీ భేటీ జరిపి సమర్పించిన నివేదికలో న్యూయార్క్, వాషింగ్టన్ వ్యూహ కేంద్రాలపై దాడి చేసిన సివిలియన్ విమానాలు ఎక్కడివో కావు, అమెరికావేననీ, ఫ్లారిడా (అమెరికా)లోని సైనిక కేంద్రం నుంచి బయలు దేరినవేనని ప్రకటించారు.. అంతవరకూ అమెరికా ప్రజలు, ప్రపంచ ప్రజలూ అది ఉగ్రవాద మూకల దాడేనని నమ్మాల్సి వచ్చింది, విశ్వసించాల్సి వచ్చింది. ఆ విశిష్ట నిపుణుల సంఘం ఇప్పటికీ దాడి అనంతర వాస్తవాలను తవ్వి తీయడం మానలేదు సుమా! పైగా, ట్విన్ టవర్లపై దాడి, బిన్ లాడెన్‌పై దాడి, అతగాడి మృతి గురించి కూడా పరస్పర విరుద్ధ కథనాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. 2001 సెప్టెంబర్ 11న జంట వాణిజ్య సముదాయాలపై ఉగ్రవాద దురాగతం జరిగిందనీ, ఈ దాడిని నిర్వహించినవాడు బిన్‌లాడెన్ అనీ మనం నమ్ముతూ వస్తున్నాం. కానీ, ఆ లాడెన్ 2001 అక్టోబర్ 10న రావ ల్పిండి ఆసుపత్రిలో ఉన్నాడని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అమెరికాలోని జంట వాణిజ్య సముదాయ భవనాలు కూలిపోయింది 2001 సెప్టెంబర్ 11న అనీ, 2001 సంవత్సరం మధ్యలో లాడెన్ దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ సీబీఎస్ న్యూస్ యాంకర్ డాన్ రాదర్ రాశాడు. ఇక ‘న్యూయార్క్ టైమ్స్’ అయితే, లాడెన్ మృతిని 2001 డిసెంబర్‌గా పేర్కొన్నది. అతణ్ణి ఖననం చేసింది అప్ఘానిస్తాన్ అని చెప్పింది. ఇక అమెరికా అయితే లాడెన్‌ను పట్టుకుని ఖతం చేసింది అబ్బాటోబాద్లో అని రాసింది. ఇన్ని వైరుధ్యాల మధ్య లాడెన్ వాస్తవాలు దోబూచులా డుతూ వచ్చాయి. అసలింతగా లాడెన్ వెనుక దాగివున్న అసలు రహస్యమేమిటి? అది అమెరికాకే తెలుసు. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్‌లో ఏలుబడిలో ఉన్న సోషలిస్టు అనుకూల ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వాన్ని ఈ లాడెన్, అతని అనుయాయుల సహకారంతోనే ఆయుధాలిచ్చి అమెరికా కూలదోసింది. ఆ తర్వాత లాడెన్ తనకు ‘ఏకు మేకై’ పోయాడు కాబట్టి, అతణ్ణి హత మార్చాలి. లాడెన్‌ను ఖతం చేసిన అమెరికా అతని అస్థిపంజరం ఆధారంగా వరస వారీగా ఇరాక్, ఇరాన్, సిరియాలపై యథేచ్చగా దాడులు చేసి, ఆ దేశాల వాస్తు శిల్ప సంపదను దోచేసి అమెరికాకు తరలించుకుపోవడం మరపురాని సామ్రాజ్యవాద యుద్ధ సత్యాలు. కనుకనే, సామాజిక చేతనాజీవులైన అసాంజే (వికీలీక్స్), అమె రికా యుద్ధతంత్ర వ్యవస్థలో జాతీయ భద్రతా దళ శాఖలో పనిచేసి కళ్లారా చూసిన ఘోరాలకు చలించిపోయి కాందిశీకుడై ప్రపంచ ప్రజ లకు అమెరికా యుద్ధోన్మాద వ్యవస్థ స్వరూప స్వభావాలను ప్రాణా లకు తెగించి ఈరోజుదాకా ఎండగడుతూ వచ్చిన ఎడ్వర్డ్ స్నోడెన్ మరపురాని త్యాగశీలురుగా సజీవులై బాధలను భరిస్తూ మనకళ్ల ముందే అమెరికాకు చిక్కకుండా నిత్య సింహస్వప్నాలై వెలుగొందు తున్నారని మరవరాదు. 9/11 జంట వాణిజ్య సముదాయాల ఘోర కలికి అమెరికా పాలకులు ఎలా కారకులో నిరూపిస్తూ ప్రపంచ ప్రజలు ఎన్నటికీ మరవకూడని ‘శాశ్వత రికార్డు’ (పర్మనెంట్ రికార్డ్) పేరిట ఇటీవలనే (2019) ఒక ప్రసిద్ధ గ్రంథాన్ని రాశాడు స్నోడెన్. ‘‘9/11 ఘోరకలి ఘటనలు ప్రతిచోట అగాథాలు సృష్టించాయి. కుటుంబాలలో ఛిద్రాలు, వివిధ వర్గాల ప్రజలు, సామాజికుల మధ్య విచ్ఛిన్నాలు, కమ్యూనికేషన్స్ విచ్ఛిత్తీ, ఉపరితలంపైనే కాదు, భూగ ర్భంలోనూ విచ్ఛిన్న శకలాలే’’నని రాశాడు. ఈ స్వవినాశన చర్యకు ఫలితంగా అమెరికా చెప్పిన సమాధానం– పదిలక్షలమంది ప్రజల హత్యాకాండ అని రాశాడు (పేజి 77–78). అలాగే, 9/11 దుర్మార్గ ఘటన గురించి అమెరికా ప్రభుత్వం ‘సాధికారిక నివేదిక’ పేరిట (మిస్టీరియస్ కొలాప్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్–7, ది ఫైనల్ రిపోర్ట్, ఎబౌట్ 9/11) వెలువరించిన కవిలకట్ట కాస్తా ‘శుద్ధ అబద్ధపు అశా స్త్రీయ దస్తరం’ అని డేవిడ్ రే అనే పరిశోధకుడు వెల్లడించారు. ఈ ‘నివేదిక’ మనకాలపు పచ్చి అబద్ధాల పుట్టే కాదు, ప్రపంచంలో ఎవరి మీద కాలు దువ్వని అనేక శాంతి కాముక దేశాలపై ఏదో ఒక మిష పైన అమెరికన్ దురాక్రమణ యుద్ధాలు నిర్వహించడానికి ఈ తప్పుడు నివేదిక ద్వారాలు తెరిచిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
బాగ్దాదీ ‘ఆపరేషన్’!
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అధినాయకుడు, ఉగ్రవాది అబూ బకర్ అల్ బాగ్దాదీ కోసం అమెరికా అయిదారేళ్లుగా సాగిస్తున్న వేట ముగిసింది. అతగాడిని సిరియాలో తమ దళాలు వెంటాడి ఓ సొరంగంలో చిక్కుకున్నాక మట్టుబెట్టాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ముందు ట్విటర్ ద్వారా ఏకవాక్య ప్రకటన చేసి, ఆ తర్వాత మీడియా సమావేశం ద్వారా బాగ్దాదీ మృతి వివరాలను ఆయన వెల్లడించారు. వీక్షకుల్లో ఉత్కంఠ రేపేందుకు చానెళ్లు సస్పెన్స్ దట్టించి మధ్యమధ్యలో విడుదల చేసే టీజర్ల మాదిరి ఆ ట్వీట్ ఉంది. తమ బలగాల చర్య పర్యవసానంగా ఐఎస్ నడ్డి విరచగలిగామని ట్రంప్ సంతోషపడుతున్నారు. ఆ మాటెలా ఉన్నా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని మళ్లీ గెలుచుకోవాల్సిన సమయం దగ్గర పడుతున్న వేళ బాగ్దాదీ మరణం ఖచ్చితంగా ఆయనకు కలిసిరావొచ్చు. ఇరాక్ తదితర దేశాల్లో అనేకానేక దురాగతాలకూ, దుర్మార్గాలకూ కారణమైన సంస్థ అధినాయకుడు మరణించాడంటే సహజంగానే ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఒక జర్మన్ పాత్రికేయుడు యూర్గన్ టోడెన్ హ్యోపర్‌కి అయిదేళ్లక్రితం ఎదురైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాక్‌లోని మోసుల్‌లోఐఎస్ ముఠాలో కొందరిని కలిసి బాగ్దాదీని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరిన ఆయనతో ‘అతను కేవలం వ్యక్తిమాత్రుడు. విద్యావంతులు, నాయకులు సభ్యులుగా ఉండే ఒక మండలి ఆయన్ను నాయకుడిగా ఉంచింది. ఆయన మరణిస్తే ఆ మండలి మరొకరిని ఆ స్థానంలో ప్రతిష్టిస్తుంది. మీరు కలవదల్చుకుంటే మండలి సభ్యుల్ని కలవండి’ అని సలహా ఇచ్చారట! కనుక బాగ్దాదీ మరణంతో ఐఎస్, దాని దుర్మార్గాలు కనుమరుగవుతాయని భావించడం దురాశే. ఒకపక్క దురాగతాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు కొనసాగిస్తూనే.... ఆ సంస్థ పుట్టుకకూ, అది పుంజుకోవడానికి ఏ కారణాలు దోహదపడ్డాయో గుర్తించడం, అందుకు కారకులెవరో తేల్చడం, వారిపట్ల ఎలా వ్యవహరించాలో నిర్ణయించడం ఇప్పుడు ప్రపంచ ప్రజల కర్తవ్యం. లేనట్టయితే బాగ్దాదీలాంటివారు మున్ముందు కూడా పుట్టు కొస్తూనే ఉంటారు. ఊహకందని మారణహోమాలు సృష్టిస్తూనే ఉంటారు. సరిగ్గా ఎనిమిదేళ్లక్రితం అల్ కాయిదా నాయకుడు బిన్ లాడెన్‌ను అమెరికా మెరైన్లు మట్టు బెట్టినప్పుడు కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా మీడియా సమావేశం ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. అయితే అందులో ట్రంప్ ప్రదర్శించినంత నాటకీయత లేదు. ఆయన ఒక ప్రకటన చదవబోతున్నట్టు తెలుసుకున్న వెంటనే అప్పటికప్పుడు చానెళ్లు అన్నిటినీ నిలిపి దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఒబామా ప్రకటనలో అవసరమైన వివరాలేమీ లేవు. కానీ ట్రంప్ తీరు వేరు. ఆపరేషన్ మొత్తం ఎలా జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పారు. ఆయన మాటలు జాగ్రత్తగా విన్న ప్రతి ఒక్కరూ అది కళ్లముందే జరిగిందన్న భ్రాంతికి లోనుకావడం ఖాయం. అమెరికన్ బలగాలు గుర్తించి కాల్పులు మొదలెట్టిన వెంటనే బాగ్దాదీ ముగ్గురు పిల్లల్ని తీసుకుని లబోదిబోమంటూ ఒక సొరంగంలో దూరిన వైనం, ఆ సొరంగానికి బయటకుపోయే మార్గం లేకపోవడం గురించి ట్రంప్ వివరించారు. అనంతరం పాత్రికేయులడిగిన సందేహాలన్నిటికీ జవాబి చ్చారు. మొత్తం నలభై నిమిషాలపాటు ట్రంప్ ప్రసంగించారు. బాగ్దాదీ తొలిసారి ప్రపంచానికి పరిచయమైననాటికీ, ఇప్పుడు మరణించేనాటికీ పరిస్థితుల్లో వచ్చిన వ్యత్యాసాన్ని గమనిస్తే ఐఎస్ ఉత్థానపతనాల గురించి స్థూలంగా అర్ధమవుతుంది. 2010లో ఐఎస్ ఆవిర్భావాన్ని ప్రకటించి నప్పుడు అది ప్రపంచ ముస్లింలందరికీ మార్గదర్శకత్వంవహిస్తుందని బాగ్దాదీ చెప్పుకున్నాడు. కానీ ఇరాక్, ఇరాన్, సిరియా, అఫ్ఘానిస్తాన్ వగైరాల్లో అమెరికా అనుసరిస్తున్న ధోరణుల్ని గట్టిగా వ్యతిరేకించే ప్రపంచ ముస్లిం ప్రజానీకంలో సైతం అతనికి పెద్దగా మద్దతు లభించింది లేదు. సరిగదా కార్యకలాపాలు సాగించిన ప్రాంతాల్లోనే అది క్షీణించింది. తన చుట్టూ ఉండేవారిలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని స్థితికి అతను చేరుకున్నాడు. అల్ కాయిదా, ఐఎస్ మొదట్లో కలిసి పనిచేసినా 2013లో తెగదెంపులు చేసుకున్నాక ఆ రెండు సంస్థలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికాకు సాగిలబడిన ద్రోహులు మీరంటే మీరని నిందించుకు న్నాయి. పిరికిపందలని తిట్టుకున్నాయి. కానీ అల్ కాయిదా అనుబంధ సంస్థ హయత్ తహ్రిర్ అల్ షామ్(హెచ్‌టీఎస్)కు పలుకుబడి ఉన్న సిరియాలోని అద్లిబ్ ప్రాంతంలో ఇప్పుడు బాగ్దాదీ పట్టు బడటాన్ని గమనిస్తే చిట్టచివరిలో అతని స్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఖలీఫాగా తనను తాను ప్రకటించుకున్నాక అతను నేరుగా దానికి నాయకత్వంవహించింది తక్కువ. పైగా దాని కంటూ ప్రత్యేకించి ఒక స్థావరం లేదు. 2003లో అమెరికా దురాక్రమించే సమయానికి ఇరాక్ ఎంతో ప్రశాంతంగా ఉండే సోషలిస్టు, సెక్యులర్ రాజ్యం. రాజ్యాంగంలో ఇస్లామ్‌ను అధికార మతంగా ప్రకటించడానికి ఆ దేశాధ్యక్షుడు సద్దాంహుస్సేన్ నిరాకరించారు. అలాంటి దేశాన్ని వల్లకాడుగా మార్చి అప్పటికి పాఠశాల చదువు కూడా పూర్తిచేయని బాగ్దాదీ లాంటివారిని ఉగ్రవాదులుగా రూపాంతరం చెందే స్థితికి చేర్చింది అమెరికాయే. ఐఎస్ బాధితుల్లో అత్యధికులు ముస్లింలే. ఈ వాస్తవాన్ని దాచి అది మత సంస్థగా చిత్రించడం పాశ్చాత్య మీడియా అవగాహన లేమి పర్యవసానం. సిరియా అధ్యక్షుడు అసద్‌ను పదవీచ్యుతుణ్ణి చేయడం కోసం య«థేచ్ఛగా డాలర్లు, ఆయుధాలు కుమ్మరించి, ఎందరు మొత్తుకుం టున్నా వినక ఐఎస్‌ను పెంచి పోషించిన అమెరికాయే ఇప్పుడు బాగ్దాదీ మరణంలో తన విజ యాన్ని వెదుక్కుంటున్న తీరు విడ్డూరం. కనీసం ఇప్పటికైనా తన చేష్టలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తున్నాయో గ్రహించి తీరు మార్చుకోవడం అమెరికా బాధ్యత. ఆ బాధ్యతను అది గుర్తించేలా చేయడం ప్రపంచ ప్రజానీకం కర్తవ్యం. -
‘హిందూ విలయంగా నామకరణం చేశాం’
కశ్మీర్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. దానికి ‘హిందూ విలయం’గా పేరు పెట్టినట్లు ఐసిస్ పేర్కొంది. ఈ విషయాన్ని ఉగ్రవాద సంస్థకు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కశ్మీర్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత ఐసిస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాక షోపియాన్ జిల్లాలోని అమ్షిపొరాలో తాము జరిపిన దాడిలో భారత ఆర్మీకి బాగానే ప్రాణ నష్టం జరిగిందని ఐసిస్ పేర్కొంది. ఐసిస్ చేసిన ప్రావిన్స్ ఏర్పాటు ప్రకటనను ఎస్ఐటీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కట్జ్ కొట్టిపారేశారు. ఈ సంస్థ ఇస్లామిక్ ఉగ్రవాదులను ట్రాక్ చేసే పనిలో ఉంటుంది. అసలు దాని ఉనికే లేని వేళ.. ఐసిస్ ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేసినట్టు చెప్పడం పూర్తిగా అసంబద్ధమని ఎస్ఐటీఈ పేర్కొంది. ఇక శుక్రవారం నాటి ఎన్కౌంటర్లో మృతి చెందిన సోఫి కశ్మీర్‌లోని పలు ఉగ్రవాద గ్రూపుల్లో దశాబ్దకాలంగా యాక్టివ్‌గా ఉన్నాడు. శ్రీనగర్ కేంద్రంగా నడిచే ఓ మేగజైన్‌కు సోఫి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐసిస్ సానుభూతిపరుడినని పేర్కొన్నట్టు మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. సోఫి ఈ ప్రాంతంలో భద్రతా దళాలపై జరిగిన పలు గ్రనేడ్ దాడుల్లో పాల్గొన్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం నాటి ఎన్కౌంటర్లో తమవైపు నుంచి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదని అధికారి స్పష్టం చేశారు. కశ్మీర్లో మిగిలి ఉన్న ఐసిస్ సానుభూతి పరుడు అతడొక్కడేనని, తాజా ఎన్కౌంటర్లో అతడు కూడా హతమయ్యాడని అధికారులు తెలిపారు. -
ఐదేళ్లకు కన్పించిన ఐఎస్ చీఫ్ బాగ్దాది
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అధినేత అబు బకర్ అల్ బాగ్దాది ఐదేళ్లలో తొలిసారిగా ఒక వీడియోలో కన్పించాడు. ఐఎస్ సంస్థ సోమవారం ఒక ప్రచార వీడియో విడుదల చేసింది. ఈ వీడియోను ఎప్పుడు తీశారో తెలియలేదు. కానీ తూర్పు సిరియాలోని ఐఎస్ స్థావరం బాగౌజ్ కోసం నెలల తరబడి కొనసాగించిన పోరాటం గురించి బాగ్దాది ప్రస్తావించారు. ‘బాగౌజ్ కోసం పోరాటం ముగిసింది’ అని బాగ్దాది తన ఎదురుగా ఉన్న వారితో అన్నాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల గురించి మాట్లాడారు. పేలుళ్లకు పాల్పడిన వారిని ప్రశంసించారు. -
‘శ్రీలంక పేలుళ్లు మా పనే’
కొలంబో : శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. పేలుళ్ల ఘటన ఐఎస్ మిలిటెంట్ గ్రూపు చర్యేనని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదులో ఇటీవల జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లకు పాల్పడ్డారని శ్రీలంక అధికారులు పేర్కొన్నారు. పేలుళ్ల ఘటనకు లంకకు చెందిన రెండు ఇస్లామిస్ట్ గ్రూపులే బాధ్యులని భావిస్తున్నారు. న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించారు. కాగా పేలుళ్ల ఘటనకు సంబంధించి అనుమానితుడిగా భావించి ఓ సిరియన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. -
సిరియా టు దక్షిణాసియా!
సాక్షి, హైదరాబాద్: లష్కరేతోయిబా, తాలిబన్, అల్ కాయిదా.. కరుడుగట్టిన ఈ ఉగ్రవాద సంస్థల్ని తలదన్నేలా ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న సంస్థే ఐసిస్. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్), ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనే పేర్లతో ప్రారంభమైన దీని ప్రస్థానం ప్రస్తుతం ఖండాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక విభాగాలతో విస్తరించింది. ఇరాక్, సిరియాల్లో షియాల ఆధిపత్యానికి గండికొడుతూ సున్నీల ప్రాబల్యం పెంచుతూ ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా ఐసిస్ ఏర్పడింది. ఇరాక్, సిరియాల్లో ఉన్న సున్నీ ప్రాంతాలను కలిపి ఓ రాజ్యంగా ఏర్పాటు చేయాలన్నది దీని తొలినాటి లక్ష్యం. తాజాగా భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేసి ప్రత్యేక దేశంగా చేయాలంటూ ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ అండ్ కశ్మీర్ (ఐఎస్‌జేకే) పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది హైదరాబాద్‌లో అరెస్టు అయిన ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్‌కు ఈ విభాగంతో సంబంధాలున్నాయి. సౌదీ అరేబియా ఆ చుట్టుపక్కల దేశాల్లో కార్యకలాపాలకు ఇస్లామిక్ స్టేట్ అరబ్ పెనిన్సులా (ఐఎస్ఏపీ), దక్షిణాసియా లో ఆపరేషన్స్ కోసం పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖురాసాన్ కేంద్రంగా మరో విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐసిస్ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్ బాగ్దాదీ, భారత్ వ్యవహారాల చీఫ్ షఫీ ఆర్మర్ మృతి తర్వాత విభాగాల వారీగా నేతలు తయారయ్యారు. దక్షిణాసియా లక్ష్యంగా.. ఐసిస్ ఖురాసాన్ మాడ్యూల్స్ కొన్నేళ్లుగా దక్షిణాసియా దేశాలను లక్ష్యం చేస్తూ వచ్చాయి. కేవలం పాక్, బంగ్లాదేశ్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకే అడ్డాగా మారిన నేపథ్యంలో తన ఉనికి చాటుకోవడానికి ఐసిస్ ప్రయత్నించింది. ఇలాంటిదే తొలి సారిగా ఢాకాలో 2016 జూలైలో జరిగిన బేకరీ ఘటన. భారత్‌లోనూ విధ్వంస కార్యక్రమాలు చేయట్టాలని ఐఎస్ చేసిన యత్నాలు నిఘా వర్గాల అప్రమత్తతతో సఫలీకృతం కాలేదు. మాల్దీవులలో కూడా 90 మంది ఐసిస్ ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో పెనుముప్పుతప్పింది. కానీ, తాజాగా శ్రీలంకలో వారి ప్రయత్నం సఫలమైంది. -
అఫ్గాన్‌లో ‘ఐఎస్’కు ఎదురుదెబ్బ
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు నంగరార్లో 27 మంది ఉగ్రవాదులను అఫ్గాన్ ప్రత్యేక భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దీనికి ప్రతిగా తాలిబన్లు ఉత్తర అఫ్గాన్‌లో భద్రత బలగాలపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 15 మంది పోలీసులు మృతిచెందారు. ఐఎస్ ఉగ్రవాదులకు కంచుకోటగా ఉన్న అఫ్గాన్‌లోని అచిన్ జిల్లా నంగరార్లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం ప్రత్యేక బలగాలు హెలికాప్టర్ల ద్వారా దాడులు చేశాయి. ఈ దాడుల్లో 27 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు నంగరార్ ప్రాంతీయ కౌన్సిల్ సభ్యుడు అజ్మల్ ఒమర్ మీడియాకు తెలిపారు. అయితే ఈఘటనను ఉగ్రవాద సంస్థకు చెందిన మీడియా అమఖ్ వార్తా సంస్థ మాత్రం అఫ్గాన్–అమెరికా సంయక్త దళాల చర్యను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొంది. అయితే అజ్మల్ ఒమర్ మాత్రం ఈ ఆపరేషన్‌లో అమెరికా దళాలు పాల్గొన్నాయా లేదా అన్నది తెలియదని స్పష్టం చేశారు. -
‘మా కుమారుడ్ని విడిచిపెట్టండి’
శ్రీనగర్: కశ్మీర్‌కు చెందిన మరో యువకుడు ఉగ్రవాదుల్లో చేరాడు. గ్రేటర్ నోయిడాలోని శారద విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్న అహ్‌తెసామ్ బిలాల్ సోఫీ(17) ఇస్లామిక్‌స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్(ఐఎస్‌జేకే) ఉగ్రసంస్థలో చేరాడు. ఐఎస్ జెండా ముందు బిలాల్ దిగిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. శ్రీనగర్‌కు చెందిన సోఫీ నోయిడాలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేందుకు వర్సిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని అక్టోబర్ 28న వర్సిటీ నుంచి బయలుదేరిన సోఫీ అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు నోయిడాతో పాటు శ్రీనగర్‌లోని ఖన్యార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని దయచేసి ఇంటికి పంపాలని ఉగ్రవాదులను వేడుకుంటూ సోఫీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోఫీ తండ్రి బిలాల్ ఓ వీడియోలో ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మా మీద దయ చూపండి. దయచేసి నా కుమారుడిని ఇంటికి పంపండి. మా మొత్తం కుటుంబంలో ఏకైక మగ సంతానం అతడే. సోఫీ.. మన కుటుంబంలోని 12 మందికి నువ్వే దిక్కు. గత రెండేళ్లలో మన కుటుంబంలో నలుగురిని పోగొట్టుకున్న సంగతి మర్చిపోయావా?’ అని అన్నారు. ఇంటికి రావాల్సిందిగా తల్లి సైతం కొడుకును వీడియోలో కోరింది. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు భారీ ఎన్కౌంటర్ చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిపిన ఎన్కౌంటర్లో జమ్మూ కశ్మీర్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌జేకే) చీఫ్ దావూద్ అహ్మద్ సోఫీ సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీసు, మరో పౌరుడు మృతిచెందారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పలు హత్య కేసు లు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఘటనల్లో సోఫీ కీలక నిందితుడని తెలిపారు. వచ్చే వారం (జూన్ 28 నుంచి) అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ భద్రతాబలగాలకు నైతిక బలాన్నిచ్చింది. మరోవైపు, పుల్వామా జిల్లాలోని త్రాల్ మార్కెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. తెల్లారేసరికి ఆపరేషన్ పూర్తి శుక్రవారం తెల్లవారుజామునే ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన భద్రతా బలగాలు.. తెల్లారేసరికి పనిపూర్తి చేశాయి. ఉగ్రవాదులు దాక్కున్నారన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అర్థరాత్రే బలగాలు చేరుకున్నాయి. అయితే.. తెల్లవారాకే మృతుల్లో దావూద్ సోఫీ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని ఐఎస్‌జేకే సభ్యులైన ఆదిల్ రెహమాన్ భట్, మహ్మద్ అష్రఫ్ ఇటూ, మాజిద్ మంజూర్ దార్లుగా గుర్తించినట్లు కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి వెల్లడించారు. ‘ఈ ఆపరేషన్ విజయవంతమైంది. రాష్ట్ర పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సమన్వయంతో పని పూర్తిచేశారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో ఖిరం గ్రామానికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఓ ఇంట్లో దాక్కున్నారు. ఇంటిని చుట్టుముట్టిన బలగాలు ఆపరేషన్ పూర్తి చేశాయి’ అని ఆయన వెల్లడించారు. భారత్‌కు ఐఎస్ ముప్పు! ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఐఎస్ ప్రభావం భారత్‌లో పెద్దగా లేదని.. మన ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతోంది. కశ్మీర్‌లోనూ మిగిలిన ఉగ్రవాద సంస్థలతో పోలిస్తే.. ఐఎస్ ప్రభావం అసలేమాత్రం లేదని చెప్పుకొస్తోంది. కానీ కొంతకాలంగా కశ్మీర్లో ఐఎస్ జెండాలు కనబడుతున్నాయి. రాళ్లు రువ్విన ఘటనల చిత్రాల్లో యువకుల చేతిలో ఐఎస్ జెండాలు కనిపిస్తూనే ఉన్నాయి. అనంత్‌నాగ్‌లో శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌తో ఐఎస్ లోయలో ఐఎస్ ప్రభావం ఉన్నట్లు సుస్పష్టమైంది. జమ్మూకశ్మీర్ కోసం ఐఎస్ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు తేలింది. ఏ++ కేటగిరీ (ఉగ్రవాదుల స్థాయిని బట్టి భద్రతా బలగాలు ఇచ్చే రేటింగ్) ఉన్న జేకేఐఎస్ చీఫ్ దావూద్ సోఫీని హతమార్చటం ద్వారా.. లోయలో విస్తరించేందుకు ఐఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తుందనేది సుస్పష్టమైంది. హిట్ లిస్ట్‌తో ఆర్మీ ఆపరేషన్ కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భద్రతా బలగాలు ‘ఆపరేషన్ ఆలౌట్’ను ప్రారంభించాయి. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని.. ఒక్కో ఉగ్రవాద సంస్థను, అందులోని ముఖ్యనేతలను పక్కాగా టార్గెట్ చేస్తూ 22మందితో జాబితాను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ (11 మంది), లష్కరే తోయిబా (7), జైషే మహ్మద్ (2), అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్, జేకేఐఎస్ల నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో ఉన్నారు. జేకేఐఎస్ చీఫ్ హతంతో ఈ జాబితా 21కి చేరింది. భద్రతను సమీక్షించిన విజయ్ జమ్మూకశ్మీర్ గవర్నర్ సలహాదారుగా నియమితుడైన రిటైర్డు ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ కశ్మీర్ లోయలోని భద్రతా పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం ఉదయమే ఆయన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. అటు, గవర్నర్ రూల్ అమల్లోకి రావడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో నేషనల్ కాన్ఫరెన్స్ తరపున ఒమర్ అబ్దుల్లా, పీడీపీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిలావర్ మిర్ సహా.. వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ గవర్నర్‌ను కలిసి.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జూన్ 28 నుంచి 60 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్రలో యాత్రికుల వాహనాలకు ట్రాకింగ్ చిప్స్‌ను అమర్చనున్నట్లు జమ్మూ రేంజ్ ఐజీ ఎస్డీ సింగ్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో యాత్రికులు, వారి వాహనాల భద్రతను నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా?: జైట్లీ న్యూఢిల్లీ: సామాన్య పౌరుల మానవహక్కుల్ని పరిరక్షించేందుకు ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరిని అవలంబించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. చంపడానికి, చావడానికి సిద్ధమై వస్తున్న ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా? అని ప్రశ్నించారు. కశ్మీర్లో సైనిక ఆపరేషన్లలో ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ వ్యాఖ్యానించడంపై జైట్లీ మండిపడ్డారు. ‘ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు చావడానికి సిద్ధంగా ఉంటాడు. అతను ఇతరుల్ని చంపడానికీ వెనుకాడడు. అలాంటివాళ్లు ఎదురుపడినప్పడు వారిని సత్యాగ్రహంతో ఎదుర్కోమంటారా? ఉగ్రవాది చంపడానికి ముందుకొస్తుంటే భద్రతాబలగాలు అతడిని చర్చలు జరిపేందుకు ఆహ్వానించాలా?’ అని ప్రశ్నించారు. మావోయిస్టుల మద్దతున్న మానవహక్కుల సంఘాలు వేర్పాటువాదం, హింసను ప్రోత్సహిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి గ్రూపుల్ని కాంగ్రెస్ గతంలో వ్యతిరేకించినా జేఎన్‌యూ, హెచ్‌సీయూలో దేశవ్యతిరేక నినాదాలు ఇచ్చినవారితో చేతులు కలిపేందుకు రాహుల్ గాంధీకి ఎలాంటి ఇబ్బంది లేదని విమర్శించారు. కశ్మీరీల తొలి ప్రాధాన్యం స్వాతంత్య్రమే కాంగ్రెస్ నేత సోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలకు ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అవకాశమిస్తే వారు స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గుచూపుతారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమనీ, పార్టీకి దానితో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో సోజ్ మాట్లాడుతూ.. ‘కశ్మీరీలు పాకిస్తాన్లో విలీనం కావాలనుకోవడం లేదని ముషార్రఫ్ చెప్పారు. ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అధికారం కశ్మీరీలకు ఇస్తే వారు స్వతంత్ర కశ్మీర్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారన్నారు. ఆయన చెప్పింది అప్పటికీ, ఇప్పటికీ నిజమే. నేను కూడా అదే చెప్పాను. కానీ కశ్మీర్‌కు స్వాతంత్య్రం రావడం అన్నది అసాధ్యమని నాకూ తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి తీవ్రనిరసన వ్యక్తమైంది. దీంతో సోజ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఖండించారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉందనీ, భవిష్యత్‌లోనూ ఉంటుందనీ స్పష్టం చేశారు. త్వరలో మార్కెట్లోకి రానున్న తన పుస్తకం అమ్మకాలను పెంచుకునేందుకే సోజ్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారని సూర్జేవాలా విమర్శించారు. కాగా సోజ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కాంగ్రెస్‌ను డిమాండ్ చేసింది. -
63మంది ఉగ్రవాదులు హతం
కాబూల్: అఫ్గానిస్తాన్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతపై దృష్టిసారించాయి. దీంతో కేవలం 24 గంటల వ్యవధిలో 63 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు అఫ్గాన్ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఐసిస్‌కు చెందిన 14 మంది ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా విభాగం భావిస్తోంది. ఫరా, కాందహర్, పాక్తియా, ఉరుజ్గన్, నంగర్హర్ ప్రావిన్సులలో తమ భద్రతా సిబ్బంది ఆపరేషన్ చేపట్టారని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదులను మట్టుపెట్టిన తమ సిబ్బంది వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధులలో ఒకరైన మహ్మద్ రద్మానిష్ వెల్లడించారు. భద్రతా బలగాల ఆపరేషన్‌పై ఏ ఉగ్రసంస్థ కూడా స్పందించలేదని ఆయన వివరించారు. -
తౌఫీఖ్ సొంతూరు భద్రాది జిల్లా చండ్రుగొండ
-
తౌఫీఖ్ వివరాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఇస్లామిక్ స్టేట్, స్థానిక టెర్రరిస్ట్ సంస్థల్లో మాత్రమే ఇప్పటివరకు హైదరాబాద్ యువత పేరు వినిపించేది. తాజాగా కశ్మీర్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. అనంతనాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురు అన్సార్ గజ్వతుల్ హింద్ (ఏజీహెచ్) ఉగ్రవాదుల్లో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన మహ్మద్ తౌఫీఖ్ ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ తౌఫీఖ్ ఎవరో గుర్తించేందుకు రాష్ట్ర నిఘా వర్గాలు రికార్డులు తిరగేస్తున్నాయి. 2017లో కశ్మీర్‌కు వచ్చిన తౌఫీఖ్ ఏజీహెచ్‌లో కీలక స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కొన్నాళ్లుగా అల్ కాయిదా కశ్మీర్‌లోనూ ప్రాబల్యం చాటేందుకు ప్రత్యేకంగా ఏజీహెచ్‌ను ఏర్పాటు చేసింది. గతంలో ఇస్లామిక్ స్టేట్‌లో పని చేసిన వారు ఏజీహెచ్‌లో చేరినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. కాగా తౌఫిక్ సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడంతోపాటు, ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. -
'ట్రంప్ ఓ కుక్క.. ఇక మీపై బాంబుల వర్షమే..'
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించడంపై ఓ పక్క ముస్లిం దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుండగా ఏకంగా అమెరికాపై బాంబులు వేస్తామంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించింది. అమెరికాపై వరుస దాడులకు పాల్పడతామంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతకంటే ఎక్కువ వివరాలు మాత్రం తెలియజేయలేదు. జెరూసలేంను ట్రంప్ ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆ నిర్ణయంపై అటు పాలస్తీనీయన్లతోపాటు ఇతర ముస్లిం దేశాల వాళ్లు యురోపియన్ దేశాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఓ టెలిగ్రాం విడుదల చేసింది. 'మాకోసం ఎదురు చూడండి. ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడు మన్హట్టన్లో ఉంది' అంటూ అందులో పేర్కొంది. 'ఇరాక్, యెమెన్, లిబియా, సిరియా, అస్ఘనిస్థాన్లో మీరు ఎలాంటి విధ్వంసం సృష్టించారో అదే మేం చేయనున్నాం. కాస్త ఎదురుచూడండి. మీ కుక్క(డోనాల్డ్ ట్రంప్) జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించాడు. అందుకే మీ రాజధానిపై బాంబులు కురిపించి మేం గుర్తింపునిస్తాం' అంటూ హెచ్చరించింది. -
'వారిని వెతికి వేటాడి చంపండి'
లండన్ : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరే బ్రిటన్‌కు చెందిన పౌరులను వెతికి వేటాడి చంపాల్సిందేనని ఆ దేశ రక్షణశాఖ మంత్రి గావిన్ విలియమ్సన్ అన్నారు. పలువురు బ్రిటన్ నుంచి ఇరాక్, సిరియా వంటి దేశాలకు వెళ్లి అక్కడ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారని, ఈ విషయాలను తాము జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అలాంటి వారిని కచ్చితంగా వేటాడి చంపాల్సిందేనని సూచించారు. ప్రస్తుతం ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్‌లో దాదాపు 270మంది బ్రిటన్ పౌరులు ఉన్నట్లు తాము గుర్తించామని, వారిని మట్టుబెట్టేందుకు అవసరం అయితే బలగాలు వైమానిక దాడులు కూడా చేయాలని సూచించారు. 'వీలయిన ప్రతీది మనం తప్పకుండా చేయాలి. బెదిరింపులను తప్పించేందుకు మనం కూడా విధ్వంసం చేయాలి' అని ఆయన ఆవేశంగా అన్నారు. అంతేకాకుండా బ్రిటన్ నుంచి వెళ్లి ఐసిస్‌లో చేరినవారిని తిరిగి బ్రిటన్ రానివ్వకుండా చేయాలని, వారిని అంతమొందించాలని చెప్పారు. -
‘ఇస్లామిక్ స్టేట్‌ను ఊడ్చేశాం’
బిరుట్ : ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్.. ఇక పూర్తిగా ముగిసిన చరిత్ర అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూనీ మంగళవారం ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్‌ను దేశం నుంచి పూర్తిగా తుడిచేశామని, ఈ విషయాన్ని ప్రకటించేందుకు గర్వంగా ఉందని రెవెల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖసీమ్ సొలేమాని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఇరాన్లో ఇస్లామిక్ స్టేట్ విస్తృతంగా విస్తరించింది. ఈ క్రమంలో పలు ఉగ్రవాద దాడులను ఇరాన్ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్‌పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. కొన్ని నెలలుగా ఐఎస్‌ను ఇరాన్ సైన్యం ఊచకోత కోస్తూ వస్తోంది. అందులో బాగంగానే శనివారం నాటికి దేశసరిహద్దుల నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను తరిమికొట్టినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. -
ఇస్లామిక్ స్టేట్ కథ ముగిసింది?
మాస్కో : సిరియాలో ఇస్లామిక్ స్టేట్ కథ దాదాపు ముగిసినట్టేనని రష్యా మిలటరీ అధికారులు వెల్లడించారు. సిరియాలో కేవలం 8 శాతం భూభాగం మాత్రమే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతిలో ఉందని.. దీనిని కూడా కొద్ది రోజుల్లోనే స్వాధీనం చేసుకుంటామని రష్యన్ మిలటరీ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదులపై సైన్యం విజయం సాధిస్తోందని.. సిరియాలో సైన్యానికి నాయకత్వం వహిస్తున్న సెర్గీ రుడోస్కీ తెలిపారు. రష్యా వైమానిక దళం క్రమం తప్పకుండా ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయని అన్నారు. -
ఆ 39 మంది ఏమయ్యారో?!
బాగ్దాద్ : మూడేళ్ల కిందట మోసుల్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల ఆచూకీ ఇంత వరకూ తెలియలేదని ఇరాక్ ప్రధాని హైదర్ ఆల్ అబాదీ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇరాక్ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆదివారం చెప్పారు. మూడేళ్ల కిందట అపహరణకు గురైన 39 మంది జీవించి ఉన్నారా? లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. అయితే వాళ్లు ప్రాణాలతో ఉండాలని మాత్రం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. గత వారంలో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్.. 39 మంది కార్మికులను క్షేమంగా విడిపించాలని తనను కోరినట్లు ఆయన చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ నుంచి మోసుల్‌ను స్వాధీనం చేసుకున్న క్షణం నుంచి 39 భారతీయుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
లండన్‌లో బాంబు దాడి: ఒకరి అరెస్టు!
బీరట్: లండన్ భూగర్భ మెట్రోరైలులో జరిగిన బాంబు దాడికి తమదే బాధ్యత అని ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ అనుబంధ సంస్థ మెట్రో రైలులో బాంబు దాడి నిర్వహించిందని పేర్కొంది. ఈ మేరకు తన 'అమాక్' ప్రొపగండ ఏజెన్సీ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ బాంబు దాడి కేసులో అనుమానితుడిగా భావిస్తున్న 18 ఏళ్ల యువకుడిని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. తాజా ఉగ్రవాద దాడి నేపథ్యంలో లండన్ నగరానికి తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం పశ్చిమ లండన్‌లోని పార్సన్స్ గ్రీన్ అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ లైన్ ట్రైన్లో భారీ పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. మొదట్లో దీన్ని ప్రమాదంగా భావించినప్పటికీ.. అనంతరం లండన్, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దీన్ని ఉగ్రవాదుల బకెట్ బాంబు విస్ఫోటనంగా తేల్చా రు. బకెట్లో ఐఈడీ (ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)ను ఉపయోగించి ఈ పేలుళ్లకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ రూటు గుండా వెళ్లే రైలు సర్వీసులను రద్దుచేశారు. లండన్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఏడాదిగా ఐసిస్ చెరలో.. నేడు భారత్‌కు..
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు ఏడాదిపాటు ఉగ్రవాదుల చేతిలో బందీగా ఉన్న కేరళకు చెందిన క్రైస్తవ మత ప్రబోధకుడు ఫాదర్ టామ్ ఉజున్నాలిల్ ఎట్టకేలకు బయటపడ్డారు. ఆయన మంగళవారం రాత్రిలోగా కేరళకు చేరుకుంటారని కేంద్ర విదేశాంగ వర్గాల సమాచారం తెలిపింది. ఫాదర్ టామ్‌ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 2016 మార్చి నెలలో యెమెన్‌లోని అడెన్‌లో మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంపై దాడి చేసి ఎత్తుకెళ్లారు. ఆ దాడిలో దాదాపు 15మంది ప్రాణాలు కోల్పోయారు. ఫాదర్ టామ్‌ను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లడం కేరళలో పెద్ద కలకలమే రేపింది. యెమెన్‌లో భారత్‌కు రాయబార కార్యాలయం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని వివిధ దేశాలను సంప్రదించడం ద్వారా యెమెన్‌కు దగ్గరవడంతో అక్కడి అధికారులు, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పరస్పర సమన్వయంతో తిరిగి ఆయనను భద్రంగా ఉగ్రవాదుల చెర నుంచి విడిపించగలిగారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ 'ఫాదర్ టామ్ సురక్షితంగా బయటపడ్డారనే విషయాన్ని వెల్లడిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది' అంటూ ఆమె ట్వీట్ చేశారు. -
‘బాగ్దాదీ బతికే ఉండొచ్చు’
వాషింగ్టన్: అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇంకా బతికే ఉండొచ్చని అమెరికా టాప్ మిలిటరీ కమాండర్ అనుమానం వ్యక్తం చేశారు. తాము జరిపిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ హతమైనట్లు రష్యా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాగ్దాదీ ఇంకా బతికే ఉన్నాడని అనిపిస్తోంది’ అని యూఎస్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ స్టీఫెన్ టౌన్సెండ్ తెలిపారు. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడులు చేస్తున్న సంకీర్ణ దళాలకు స్టీఫెన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికా పెంటగాన్‌లోని విలేకరులతో స్టీఫెన్.. బాగ్దాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘బాగ్దాదీ చనిపోయినట్లు ముందు నేను కూడా భావించాను. అయితే కొన్ని నిఘా వర్గాల సమాచారం చూస్తుంటే బాగ్దాదీ బతికే ఉన్నాడని అనిపిస్తోంది. అతడి కోసం మా దళాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఒకవేళ వారు అతడిని గుర్తిస్తే కచ్చితంగా చంపేస్తారే గానీ.. బందీగా పట్టుకోరు’ అని స్టీఫెన్ తెలిపారు. యుఫరేట్స్ నదిని ఆనుకొన్న ప్రాంతాల్లో బాగ్దాది దాగి ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నామని స్టీఫెన్ అన్నారు.