‘ఐఎస్ ఒంటరి తోడేలు దాడి’కి అవకాశం
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు దేశంలో దాడులకు తెగబడే అవకాశముందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ‘ఒంటరి తోడేలు దాడి’కి అవకాశముందని, పటిష్ట భద్రతాఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఆన్‌లైన్‌లో ఐఎస్ మద్ధతుదారుల కార్యకలాపాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
‘ఐఎస్ ప్రమాదంపై కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులు, 13 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐఎస్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న విషయం వాస్తవమే. గణతంత్ర దినోత్సవాల వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒంటరి తోడేలు దాడి అవకాశాలపై అప్రమత్తంగా ఉండాలని అందరినీ ఆదేశించాం’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఏదైనా ఒక సంస్థ, ఉద్యమం, లేదా సిద్ధాంతానికి మద్దతుగా, ఎవరి సహాయసహకారాలు లేకుండానే, ఒంటరిగా హింసాత్మక దాడికి పాల్పడే వ్యక్తిని ఒంటరి తోడేలు(లోన్ వోల్ఫ్)గా అభివర్ణిస్తారు. డిసెంబర్‌లో జైపూర్లో అరెస్టైన సిరాజుద్దీన్ ఆ దిశగానే వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. కుటుంబ సభ్యులు, మత పెద్దలు మొదలైనవారి సహకారంతో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చేపట్టిన చర్యలను అధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు.