Terrorist organization
-
ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం
జెరూసలేం/టెల్ అవీవ్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత తారస్థాయికి చేరుతోంది. లెబనాన్‌కు చెందిన షియా ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘హెజ్బొల్లా’ ఇజ్రాయెల్‌పై తాజాగా రాకెట్లు ప్రయోగించింది. మొషావ్ బీట్ హిల్లెల్ ప్రాంతంలో పలువురు పౌరులు గాయపడినట్లు సమాచారం. తమపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే హెజ్బొల్లా ఈ చర్యకు దిగింది. మరోవైపు ఇరాన్ కూడా సోమవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగొచ్చని ఆ దేశంతో పాటు అమెరికా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా సైన్యం ఇప్పటికే రంగంలోకి దిగుతోంది. ఇరాన్ వెనక్కి తగ్గుతుందని న్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆశాభావం వెలిబుచ్చారు. హెజ్బొల్లా ముఖ్య నేత అలీ హతం దక్షిణ లెబనాన్‌లోని బజౌరీ పట్టణంపై ఇజ్రాయెల్ తాజాగా డ్రోన్ దాడిలో హెజ్బొల్లా ముఖ్యనేత అలీ అబిద్ అలీ మరణించాడు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. గాజాలో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడుల్లో 18 మంది మరణించారు. టెల్ అవీవ్‌లో పాలస్తీనా పౌరుని దాడిలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు.కంటైనర్ నౌకపై హౌతీల దాడి హౌతీ తిరుగుబాటుదారులు శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో సౌదీ అరేబియాకు వెళ్తున్న నౌకపై క్షిపణి దాడికి పాల్పడ్డారు. దానికి నష్టం వాటిల్లేదని తెలిసింది. -
సరికొత్త అధ్యాయం?!
మరో అడుగు ముందుకు పడింది. ఈశాన్య భారతంలో దీర్ఘకాలంగా సాగుతున్న సమస్యకు పరిష్కారం కనుక్కొనే ప్రయత్నంలో ఒక అభిలషణీయ పరిణామం గత వారం సంభవించింది. అస్సామ్‌లోని పేరుబడ్డ తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామ్’ (అల్ఫా)లోని ఒక వర్గం హింసామార్గం విడిచిపెట్టి, ప్రజాస్వామ్య పంథాలోకి రానున్నట్టు డిసెంబర్ 29న ప్రకటించింది. అల్ఫా వర్గానికీ, కేంద్ర, అస్సామ్ సర్కార్లకూ మధ్య ఈ తాజా త్రైపాక్షిక పరిష్కార ఒప్పందం (ఎంఓఎస్) స్వాగతించాల్సిన విషయం. ఈశాన్యంలో శాంతి స్థాపన నిమిత్తం కుదుర్చుకుంటూ వచ్చిన ఒప్పందాల వరుసలో ఇది తాజాది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజనీ, దీంతో అస్సామ్‌లో హింసాకాండకు పూర్తిగా తెర పడుతుందనీ కేంద్ర హోమ్ మంత్రి అమితమైన ఆశాభావం ప్రకటించారు. అయితే, ఇప్పటి దాకా కుదుర్చుకున్న అనేక ఒప్పందాల ఫలితాలు మిశ్రమంగానే మిగిలాయి. అందుకే, ఈ కొత్త ఒప్పందం కూడా కేవలం మరో పత్రంగా మిగులుతుందా? లేక శాంతిసాధనలో చరిత్రాత్మకం కాగలుగుతుందా అన్నది పలువురి అనుమానం. ‘సార్వభౌమాధికార’ అస్సామ్ను కోరుతూ 1979లో ‘అల్ఫా’ సాయుధ పోరాటం ప్రారంభించింది. అలా 44 ఏళ్ళుగా రగులుతున్న కుంపటిని తాజా ఒప్పందం చల్లారుస్తుందని ఆశ. 1985లో అస్సామ్ ఒప్పందం తర్వాత కూడా అక్కడి గ్రామీణ ప్రజల్లో అసంతృప్తిని రగిలించడంలో అల్ఫా సఫలమైంది. కిడ్నాపింగ్‌లు, దోపిడీలు, హత్యలు, బాంబు పేలుళ్ళతో ఒక దశలో అల్ఫా అట్టుడికించింది. దాంతో, ప్రభుత్వం 1990లో అల్ఫాను నిషేధించింది. కర్కశమైన ‘సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’ (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసుకురావాల్సి వచ్చింది. ‘అల్ఫా’ ఉచ్చదశలో వెలిగిపోతున్న రోజుల్లో దాని చేతులు అస్సామ్ మొదలు దక్షిణాసియా దాకా విస్తరించాయి. మయన్మార్, భూటాన్ లలో అల్ఫా శిబిరాలు, బంగ్లాదేశ్‌లో ఆ సంస్థ నేతలు, శ్రీలంక– పాకిస్తాన్లలో శిక్షకులున్న రోజులవి. అయితే, పరిస్థితులు మారాయి. శ్రీలంకలో ఎల్టీటీఈ పతనం, భూటాన్ గడ్డపై శిబిరాల్ని మూయించాల్సిందిగా ఆ దేశంపై ఒత్తిడి రావడం, అలాగే భారత్‌తో మైత్రి పాటించే షేక్ హసీనా ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక శక్తులను సహించక పోవడం, అల్ఫాలోని వర్గపోరు, భారత సర్కార్ ఉక్కుపాదం మోపడం... ఇవన్నీ కొన్నేళ్ళుగా అల్ఫాను బలహీనపరిచాయి. వలస కార్మికులనూ, సామాన్య నిరుపేదలనూ లక్ష్యంగా చేసుకొని సాగించిన హింస సైతం రైతాంగంలో అల్ఫా పలుకుబడిని పలుచన చేసింది. నిజానికి, గతంలో పలు సందర్భాల్లో అల్ఫాతో శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ మాటకొస్తే శాంతిప్రక్రియ 2009లోనే మొదలైంది. చర్చల అను కూల వర్గంతో 2011లోనే సంప్రతింపులు ఆరంభమయ్యాయి. సంస్థ బలహీనమయ్యేసరికి సార్వ భౌమాధికార డిమాండ్‌ను అల్ఫా పక్కనబెట్టక తప్పలేదు. స్థానిక ప్రజల ప్రయోజనాల పరిరక్షణ చాలనే విధంగా వ్యవహరించి, గౌరవప్రదంగా బయటపడేందుకు ప్రయత్నించింది. వెరసి, పుష్కర కాలం తర్వాత చర్చలు ఫలించాయి. పరిష్కార ఒప్పందం కుదిరింది. అయితే, అల్ఫా సంస్థాపకుల్లో ఒకరైన అప్పటి ‘కమాండర్–ఇన్–ఛీఫ్’ పరేశ్ బారువా శాంతి చర్చలను వ్యతిరేకిస్తూ 2012లోనే ‘అల్ఫా ఇండిపెండెంట్’ (అల్ఫా–ఐ)గా వేరుకుంపటి పెట్టుకున్నారు. అరబింద రాజ్‌ఖోవా సారథ్యంలోని వర్గమే తప్ప సైద్ధాంతికంగా కరడుగట్టిన ఈ ‘అల్ఫా–ఐ’ వర్గం ఒప్పందంలో భాగం కాలేదు. అది ఒక లోటే. అలాగని, కుదిరిన ఒప్పందాన్ని తీసిపారేయలేం. వేర్పాటువాదం ప్రబలడంతో ఒకప్పుడు గణనీయంగా నష్టపోయిన రాష్ట్రం తాజా ఒప్పందంతో మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించ గలుగుతుంది. కేంద్ర ఆర్థిక సహాయంతో అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. ఈ ఒప్పందం పుణ్యమా అని ఈ ఈశాన్య రాష్ట్రంలో సాంఘిక – సాంస్కృతిక అశాంతికి కూడా తెరపడుతుందని మరో ఆశ. ఎందుకంటే, అక్రమ వలసల మొదలు స్థానిక తెగల వారికి భూ హక్కుల వరకు పలు అంశాల పరిష్కారం గురించి తాజా త్రైపాక్షిక ఒప్పందం ప్రస్తావిస్తోంది. ఆ ఆశ నెరవేరితే అంతకన్నా కావాల్సింది లేదు. నిజానికి, అస్సామ్‌లో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకై ‘ఏఎఫ్ఎస్పీఏ’ కింద సాయుధ బలగాలకు అపరిమితమైన అధికారాలను ప్రభుత్వం ఎన్నడో కట్టబెట్టింది. అల్ఫా దూకుడు మునుపటితో పోలిస్తే తగ్గడం, అలాగే అనేక విమర్శల అనంతరం గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ చట్టాన్ని ఉపసంహరించారు. ఇప్పుడిక మిగతా ప్రాంతాల్లో సైతం ఈ అమానవీయ చట్టాన్ని ఎత్తివేసే దిశగా అస్సామ్ సర్కార్ అడుగులు వేయాలి. తాజా ఒప్పందంతో తీవ్రవాదానికి పూర్తిగా తెర పడిందని తొందరపడడానికి లేదు. అతివాద ‘అల్ఫా–ఐ’ వర్గం నేత బారువా ఇప్పటికీ చైనా–మయన్మార్ సరిహద్దులో గుర్తుతెలియని చోట దాగున్నారు. కొన్నేళ్ళుగా కొత్త చేరికలు లేక ఆయన వర్గం గణనీయంగా బలహీనపడినప్పటికీ, ఆ వర్గపు వ్యవహారం ఇంకా తేలనందున కేంద్ర, అస్సామ్ ప్రభుత్వాలు ఆచితూచి అడుగేయాల్సి ఉంది. కాక పోతే... ఒకపక్క రష్యా – ఉక్రెయిన్లు, మరోపక్క గాజాలో ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య యుద్ధా లతో రోజూ వార్తలను వేడెక్కించిన గడచిన 2023 ఎట్టకేలకు ఒక శాంతి ఒప్పందంతో ముగియడం ఒకింత ఊరట. ఒప్పందాన్ని సఫలం చేయడం ప్రభుత్వ, అల్ఫా వర్గాల ముందున్న సవాలు. అల్ఫా మాట అటుంచి, దీర్ఘకాల వేర్పాటువాదం అనంతరం ఈశాన్యంలో సుస్థిరంగా శాంతి వెల్లివిరియాలంటే ప్రభుత్వం ముందుగా అక్కడి ప్రతి పౌరుడూ జనజీవన స్రవంతిలో భాగమయ్యేలా చూడాలి. రైతాంగ జీవనప్రమాణాల్ని మెరుగుపరచాలి. వేర్పాటువాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలి. అందుకీ ఒప్పందం దోహదపడితేనే ఇన్నేళ్ళ సంప్రతింపుల శ్రమకు అర్థం, పరమార్థం! -
ఆరుగురు అలీగఢ్ వర్సిటీ విద్యార్థుల అరెస్ట్
లక్నో: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) తరఫున పనిచేస్తున్నారనే ఆరోపణలపై యూపీ పోలీసులు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిందితులందరికీ అలీగఢ్ యూనివర్సిటీ విద్యార్థుల సంఘమైన స్టూడెంట్స్ ఆఫ్ అలీగఢ్ యూనివర్సిటీ(సము)తో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ, ఐసిస్‌లోకి కొత్త వారిని చేర్చుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) విభాగం తెలిపింది. దేశంలో భారీ ఉగ్రదాడికి వీరు కుట్ర పన్నుతున్నారని వెల్లడించింది. అరెస్టయిన వారిలో రకీమ్ ఇనామ్, నవీద్ సిద్దిఖి, మహ్మద్ నొమాన్, మహ్మద్ నజీమ్ అనే నలుగురిని గుర్తించింది. వీరందరినీ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఈ విద్యార్థి సంఘం కార్యకలాపాలపై కేంద్ర నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయని కూడా పేర్కొంది. -
‘ఇస్లామిక్ స్టేట్’కు కొత్త చీఫ్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తమ అధినేత అబు హుస్సేన్ అల్ హుస్సెయినీ అల్ ఖురేషి మృతి చెందినట్లు ధ్రువీకరించింది. ఈ మేరకు టెలిగ్రామ్ చానల్ ద్వారా ఆ సంస్థ ప్రకటించింది. ఆ ప్రకటన ఏ తేదీన విడుదలైందీ తెలియరాలేదు. అతడు ఎప్పుడు, ఎలా మృతి చెందాడనే విషయం కూడా అందులో పేర్కొనలేదు. ఐఎస్ కొత్త అధిపతిగా అబు హఫ్స్ అల్ హషిమి అల్ ఖురేషి పగ్గాలు చేపట్టనున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు. -
శిక్షపడిన మరునాడే విడుదల!
సాక్షి, హైదరాబాద్: నిషిద్ధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి, దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో అరెస్టు అయిన పాతబస్తీ వాసి ఒబేదుర్ రెహ్మాన్‌కు ఢిల్లీ కోర్టు గత బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ శిక్షా కాలం రిమాండ్ పీరియడ్‌లోనే పూర్తి కావడంతో ఆ మర్నాడే ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడిపై బెంగళూరు సీసీబీ పోలీసులు నమోదు చేసిన మరో కేసులోనూ ఇప్పటికే శిక్షపడటం, రిమాండ్‌లోనే అదీ పూర్తవడం జరిగాయి. ఒబేదుర్ రెహ్మాన్ గత శుక్రవారం సిటీకి చేరుకున్నాడు. తొలి కేసు బెంగళూరులో నమోదు... పాతబస్తీలోని చంద్రాయణగుట్ట గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన ఒబేదుర్ రెహ్మాన్ డిగ్రీ చదువుతుండగానే ఉగ్రవాద బాటపట్టాడు. ఉగ్రవాద సంస్థ హుజీలో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరులో ఉన్న బీజేపీ నాయకులను, ప్రముఖులను హతమార్చడానికి ఈ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాదులు 2012లో రంగంలోకి దిగారు. ఈ విషయం గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్‌లో ఒబేద్‌తో పాటు నాందేడ్, బెంగళూరు, హుబ్లీలకు చెందిన 11 మందినీ అరెస్టు చేశారు. వీళ్లు జైల్లో ఉండగానే ఐఎం నేతృత్వంలో సాగిన మరో కుట్ర వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, ఢిల్లీల్లో పేలుళ్ళకు కుట్ర పన్నడంతో అదే ఏడాది ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ మరో కేసు నమోదు చేసింది. ఒబేద్ సహా మరికొందరికి బెంగళూరు జైలు నుంచి 2013లో తీహార్ జైలుకు తరలించింది. జైల్లో ఉండగానే రెండు ‘శిక్షలు’ పూర్తి... ఈ రెండు కేసులకు సంబంధించి ఒబేద్ సహా మరికొందరు ఉగ్రవాదులు 2012 నుంచి జైల్లో రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. బెంగళూరు కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు న్యాయస్థానంలో నేరం అంగీకరించారు. దీంతో కోర్టు వీరిని దోషులుగా తేలుస్తూ ఆరేళ్ళ శిక్ష విధించింది. అప్పటికే వీళ్ళు అంతకంటే ఎక్కువే జైలులో ఉండటంతో ఆ కాలాన్ని కోర్టు శిక్షగా పరిగణించింది. ఢిల్లీలో నమోదైన కేసు విచారణ పూర్తి కావడంతో ఈ నెల 7న ఒబేద్ సహా నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు బుధవారం పదేళ్ళ జైలు విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ ఉగ్రవాదులు అంతకంటే ఎక్కువ రోజులే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండటంతో శిక్షాకాలం పూర్తయింది. దీంతో ఒబేద్ తదితరులు పదేళ్ల శిక్షపడిన మరుసటి రోజైన గురువారమే తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇదే కేసులో భత్కల్ తదితరులు... ఢిల్లీ ఎన్ఐఏ యూనిట్ నమోదు చేసిన ఈ కేసులో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీపార్క్ ట్విన్ బ్లాస్ట్, దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ళకు బాధ్యులైన వాళ్ళూ నిందితులుగా ఉన్నారు. ఐఎం ఉగ్రవాదులైన రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ హడ్డీపై విచారణ జరగాల్సి ఉంది. వీరిలో రియాజ్ మినహా మిగిలిన వాళ్ళు అరెస్టు కావడం, నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసుల్లో శిక్షలు పడటం కూడా జరిగింది. ఐఎం కో–ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఆదేశాల మేరకు మిగిలిన ఉగ్రవాదులు ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మానవబాంబులతో మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నారని ఎన్ఐఏ గుర్తించింది. -
సిటీలో మకాం కోసం సుమేరా బాను యత్నం?
హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు అనుబంధంగా ఏర్పడిన ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావెన్సీలో (ఐఎస్కేపీ) కీలక పాత్ర పోషించిన సూరత్ మహిళ సుమేరా బాను మాలిక్ హైదరాబాద్‌లో అడ్డా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించిందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నాయి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) వర్గాలు. మంగళవారం నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం సదరు వ్యాపారి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకువెళ్లింది. ఆన్లైన్ ద్వారా ప్రేరణ పొంది.. ► సూరత్‌కు చెందిన సుమేరా బాను ఆన్లైన్ ద్వారా ప్రేరణ పొంది ఐఎస్‌కేపీలో చేరింది. విదేశాల్లో ఉన్న అబు హంజాలా అనే ఉగ్రవాది ఈమెకు హ్యాండ్లర్‌గా వ్యవహరించారు. టెలిగ్రామ్ సహా వివిధ సోషల్‌మీడియా గ్రూపుల ద్వారా అతడితో సంప్రదింపులు జరిపింది. ఉత్తరాదిలోని అనేక ప్రాంతాల్లో విధ్వంసాలు పథక రచన చేసిన సుమేరా శ్రీనగర్‌కు చెందిన నలుగురితో ముఠా కట్టింది. వీళ్లు కూడా అబు హంజాలా ద్వారానే ఈమెకు పరిచయం అయ్యారు. వీరిలో ఉబేద్ నాసిర్ మీర్, హనన్ హయత్ సోల్, మహ్మద్ హాజిం షాలను ఇటీవల గుజరాత్‌లోని పోర్బందర్కు పిలిపించింది. అక్కడి ఓ హోటల్లో బస చేసిన సుమేరా సహా నలుగురూ విధ్వంసాలపై కుట్రలు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఏటీఎస్ అధికారులు ఈ నెల 9న దాడి చేసి నలుగురినీ అరెస్టు చేశారు. వీరి విచారణలో శ్రీనగర్‌కు చెందిన జుబేర్ అహ్మద్ మున్షీ కూడా ముఠా సభ్యుడని తేలడంతో రెండు రోజుల క్రితం అతడినీ అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో సుమేరాను అహ్మదాబాద్ ఏటీఎస్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ► ఈ నేపథ్యంలోనే తాను హైదరాబాద్‌లో మకాం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన ఓ మెడికల్ షాపు యజమానితో ఈమెకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. కొన్నాళ్లు అతడితో సంప్రదింపులు జరిపిన సుమేరా తనకు హైదరాబాద్‌లో టీచర్ ఉద్యోగం కావాలని కోరింది. దాని కోసమే కాలాపత్తర్ వ్యాపారితో అనేకసార్లు ఫోనులోనూ మాట్లాడింది. సాంకేతికంగానూ ఈ విషయం నిర్థారించిన ఏటీఎస్ అధికారులు మంగళవారం నగరానికి చేరుకున్నారు. కాలాపత్తర్‌లోని సదరు వ్యాపారి ఇంటికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. అహ్మదాబాద్‌లో నమోదైన సుమేరా కేసులో ఇతడిని సాక్షిగా పరిగణిస్తున్నారు. భర్త నుంచి 2021లో వేరైన ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నట్లు సమాచారం. మరోపక్క సుమేరా హైదరాబాద్‌కు ఎందుకు రావాలని భావించింది? ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకుని ఏం చేయాలని పథకం వేసింది? నగరంలో ఇంకా ఎవరినైనా ఐఎస్కేపీ వైపు మళ్లించిందా? ఎవరితోనైనాసంప్రదింపులు జరిపిందా? ఇతర అంశాలపై రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ కస్టడీలో ఉన్న సుమేరాను విచారించడానికి ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లాలని నిర్ణయించింది. సుమేరా బాను సోషల్ మీడియా ద్వారా గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ తండ్రి, కూతురితో సంప్రదింపులు జరిపింది. మంగళవారం వీరిద్దరూ కరీంనగర్లో ఓ శుభ కార్యానికి వెళ్లిన విషయం తెలిసి అక్కడికి ఏటీఎస్ బృందం వెళ్లి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకుంది. -
ఐసిస్ చీఫ్ హతం.. కొత్త అధినేతను ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు. సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. తమ కొత్త నాయకుడిగా అబు అల్ హుస్సేన్ అల్ హుస్సేనీ అల్ ఖురేషిని ఎన్నుకున్నట్లు చెప్పింది. ఐసిస్ అధినేత మరణాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ఈయన సిరియాలో అమెరికా దళాలను పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ నెల మధ్యలో దక్షిణ సిరియా రెబల్స్.. హసన్ అల్ హమిషీని హతమార్చినట్లు పేర్కొన్నారు. ఐసిస్ చీఫ్‌గా హసన్ అల్ హషిమీ 9 నెలల క్రితమే బాధ్యతలు చేపట్టాడు. అతనికి ముందు ఈ ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా అబు ఇబ్రహీం ఖురేషి ఉండేవాడు. అమెరికా దళాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడ్ని సిరియాలో మట్టుబెట్టాయి. చదవండి: అఫ్గాన్ మదరసాలో పేలుళ్లు... 16 మంది దుర్మరణం -
9/11 మాస్టర్ మైండ్ జవహరీ హతం.. 15 ఏళ్లకే జవహరీ ఉగ్రబాట
వాషింగ్టన్: అల్–జవహరీ ఈజిప్టు రాజధాని ౖకైరోలో 1951లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ‘జమాత్ అల్–జిహాద్’ పేరిట సొంతంగా ఒక సంస్థను స్థాపించాడు. విరోధులను అంతం చేయడమే దీని లక్ష్యం. ఇది ఈజిప్టులో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. 1981 అక్టోబర్ 6న ఉగ్రవాద దాడుల్లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ బలయ్యారు. ఈ దాడుల్లో ‘జమాత్ అల్–జిహాద్’ హస్తం ఉన్నట్లు తేలింది. జవహరీ వైద్య విద్య అభ్యసించాడు. కొన్నాళ్లు సర్జన్‌గా పనిచేశాడు. జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఒక ల్యాబ్‌ను నడిపించాడు. గతంలో ఓ కేసు విచారణలో భాగంగా జవహరీ కోర్టుకు హాజరయ్యాడు. ‘‘మేము త్యాగాలు చేశాం. ఇస్లాం విజయం సాధించేవరకూ ఎన్ని త్యాగాలు చేయడానిౖకైనా సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కోర్టు గదిలో గట్టిగా అరిచాడు. లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను జవహరీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక దక్షిణాసియాకు చేరుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. 1988లో ఒసామా బిన్ లాడెన్ అల్‌ఖైదాను స్థాపించాక అందులో చేరాడు. చురుగ్గా కార్యకలాపాలు సాగించాడు. 1990 తర్వాత తన ‘జమాత్ అల్–జిహాద్’ సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేశాడు. అతి తక్కువ కాలంలోనే లాడెన్‌కు నమ్మిన బంటుగా మారాడు. 1990వ దశకంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలు తొలిసారిగా జవహరీపై దృష్టి పెట్టాయి. అల్‌ఖైదా ముఠాలో అతడి ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. అల్‌ఖైదా నిర్వహించే విలేకరుల సమావేశాల్లో లాడెన్ పక్కనే జవహరీ తప్పనిసరిగా కనిపించేవాడు. 1997లో అఫ్గానిస్తాన్‌లో ఉన్నప్పుడు ఈజిప్టు పర్యాటకులను చంపేందుకు ప్లాన్ చేశాడు. 1998లో లాడెన్ అల్‌ఖైదా ఉప నాయకుడిగా జవహరీ పేరును ప్రకటించాడు. అంటే ఉగ్రముఠాలో లాడెన్ తర్వాతి స్థానం జవహరీదే కావడం గమనార్హం. అణ్వాయుధాలు సంపాదించుకోవాలన్న అల్‌ఖైదా ఆశయం వెనుక జవహరీ ప్రోత్సాహం ఉంది. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో.. ఆత్మాహుతి దాడులకు వ్యూహాలు రచించడంలో జవహరీ దిట్ట. నిధులు సేకరించడంలోనూ నేర్పరి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ అల్–జవహరీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. పదేళ్ల క్రితం అమెరికా నేవీ సీల్స్ దాడుల్లో లాడెన్ హతమయ్యాక జవహరీ అల్‌ఖైదా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. చెల్లాచెదురైన అల్‌ఖైదాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అల్‌ఖైదా సభ్యులకు సుప్రీంలీడర్‌గా దిశానిర్దేశం చేశాడు. అఫ్గాన్‌పై అమెరికా సేనలు పట్టు బిగించడంతో జవహరీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జవహరీ చనిపోయాడన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ, అమెరికా నిఘా సంస్థలు నమ్మలేదు. ఓపికగా వేట కొనసాగించాయి. చివరకు అఫ్గానిస్తాన్‌లోనే అంతం చేశాయి. అమెరికన్లను హతమార్చడమే లక్ష్యం 1998 ఆగస్టు ఏడో తేదీన టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. జవహరీ నేతృత్వంలోనే ఈ దాడులకు వ్యూహాలు రూపొందించారు. అప్పుడు అతడి వయసు 47 సంవత్సరాలు. ఇక అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ‘2001 సెప్టెంబర్ 11’ దాడుల వెనుక లాడెన్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికన్లను, వారి మిత్రులను అంతం చేయడమే ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హతమార్చాలి’’ అని 1998లో తన మేనిఫెస్టోలో జవహరీ స్పష్టంగా రాసుకున్నాడు. ‘సెప్టెంబర్ 11’ దాడుల తర్వాత అమెరికాలో మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అఫ్గానిస్తాన్‌లో జీవ ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కానీ, అఫ్గాన్‌పై అమెరికా దండెత్తడంతో అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారసుడు ఆదెల్? జవహరీ మరణంతో అల్ ఖైదా నాయకునిగా ఈజిప్టు మాజీ సైనికాధికారి మహ్మద్ సలాహ్ అల్ దిన్ జైదన్ అలియాస్ సైఫ్ అల్ ఆదెల్ (60) పేరు గట్టిగా వినవస్తోంది. అల్ ఖైదా అగ్ర నేతల్లో పిన్న వయస్కుడితడే. ఎవరీ ఆదెల్? ఈజిప్టుకు చెందిన ఆదెల్ మాజీ కల్నల్. అల్‌ఖైదా వ్యవస్థాపక సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సైనికులనెందరినో చంపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర రిక్రూట్మెంట్లు, నిధుల కోసం 1980ల్లో ఒసామా బిన్ లాడెన్ నెలకొల్పిన మక్తాబ్ అల్ ఖిద్మత్ (ఎంఏకే)తో కూడా అనుబంధముంది. లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గానూ వ్యవహరించాడు. అప్పుడే జవహరీతోనూ పరిచయమేర్పడింది. 1993లో సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు 19 మంది అమెరికా సైనికులను చంపి మృతదేహాలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఈ దాడి ఆదెల్ కనుసన్నల్లోనే జరిగింది. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన దాడులు, పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిగిన దాడులతోనూ ఇతడికి సంబంధముంది. దీంతో అమెరికా ఆదెల్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చి అతడి తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. లాడెన్ మరణం తర్వాత కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. 20 ఏళ్లుగా ఇరాన్‌లోనే ఉన్నట్టు అనుమానం. సిరియాలోని ఉగ్ర ముఠాలకు టెలిగ్రాం ద్వారా సూచనలిస్తాడని చెబుతారు. లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను కూడా 2019లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అల్‌ఖైదా పగ్గాలు ఇతని చేతుల్లోకే వెళ్తాయని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ అంటోంది. -
పాక్ 12 ఉగ్ర సంస్థలకు నిలయం
వాషింగ్టన్: అమెరికా విదేశీ ఉగ్ర సంస్థలుగా గుర్తించిన 12 గ్రూపులు పాకిస్తాన్‌లోనే ఊపిరి పోసుకున్నాయని అమెరికా కాంగ్రెషనల్ కమిటీ తెలిపింది. వీటిలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి అయిదు సంస్థలు కేవలం భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ‘టెర్రరిస్ట్ అండ్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్తాన్’అంశంపై స్వతంత్ర కంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్ఎస్) రూపొందించిన ఆ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థల్లో కొన్ని 1980ల నుంచే అక్కడ ఉన్నాయని తెలిపింది. వీటిల్లో కొన్ని ప్రపంచవ్యాప్తంగా, మరికొన్ని అఫ్గానిస్తాన్ లక్ష్యంగా, ఇంకొన్ని భారత్, కశ్మీర్ లక్ష్యంగా, కొన్ని షియా వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వివరించింది. 2008లో ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా 1980ల్లోనే పాకిస్తాన్లో అవతరించగా అమెరికా దీనిని విదేశీ ఉగ్రసంస్థ(ఎఫ్టీఓ)గా 2001లో గుర్తించింది. కశ్మీర్ ఉగ్రనేత మసూద్ అజార్ నేతృత్వంలో 2000లో జైషే మొహమ్మద్ ఏర్పాటైంది. భారత పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఈ సంస్థను అమెరికా 2001లో ఎఫ్టీఓ గుర్తించింది. మరో సంస్థ హర్కతుల్ జిహాద్ ఇస్లామీ 1980లో ఏర్పాటై అఫ్గాన్‌లో సోవియెట్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడింది. 1989 నుంచి ఈ గ్రూపు భారత్, బంగ్లాదేశ్, అఫ్గాన్, పాక్‌లలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థను అమెరికా 2010లో ఎఫ్‌టీఓగా ప్రకటించింది. 1989లో పాక్‌లో ఆవిర్భవించిన హిజ్బుల్ముజాహిదీన్ను కూడా అమెరికా 2017లో ఎఫ్టీఓ ప్రకటించింది. కశ్మీర్లో కార్యకలాపాలు సాగించే అతిపెద్ద గ్రూపు ఇదే. మరో ఉగ్ర సంస్థ అల్ ఖాయిదా కూడా పాకిస్తాన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సీఆర్ఎస్ తెలిపింది. ఈ సంస్థకు పాక్‌లోని అనేక గ్రూపుల నుంచి మద్దతు అందుతోందని పేర్కొంది. ఇవికాకుండా, ఇస్లామిక్ స్టేట్–ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ, ఐఎస్–కె), అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్వర్క్, తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ), బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, జుందల్లా, సిపాహ్ సహాబా పాకిస్తాన్, లష్కర్–ఇ–జంగ్వి వంటివి కూడా పాకిస్తాన్లో ఉన్నాయని వివరించింది. చుట్టుపక్కల దేశాలే లక్ష్యంగా పనిచేసే అనేక ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ నిలయంగా మారిందంటూ 2019లో విదేశాంగ శాఖ రూపొందించిన నివేదికను సీఆర్ఎస్ ఉటంకించింది. కాగా, సీఎస్ఆర్ నివేదిక అమెరికా కాంగ్రెస్ అధికార నివేదిక కాదు. దీనిని స్వతంత్ర నిపుణులు తయారు చేసి, చట్టసభల ప్రతినిధులకు అందజేస్తుంటారు. -
చెన్నై విమానాశ్రయంలో కలకలం..
సాక్షి, చెన్నై: దుబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో ఓ యువకుడి చర్యలు అనుమానాలకు దారి తీశాయి. నిషేధిత తీవ్ర వాద సంస్థ ఐసీస్‌లో శిక్షణ పొంది చెన్నైకు వచ్చినట్టుగా వచ్చిన సమాచారం కలకలం రేపింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో నిషేధిత తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో గతంలో సాగిన పేలుళ్ల తదుపరి తరచూ కేరళ నుంచి ఎన్ఐఏ వర్గాలు రాష్ట్రంలోకి రావడం, అనుమానితులు, నిషేధిత సంస్థల సానుభూతి పరులను పట్టుకెళ్లడం జరుగుతోంది. ఈ పరిణామాలతో సముద్ర తీరాల్లో, విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ విమానంలో 31 ఏళ్ల యువకుడిపై అధికారుల దృష్టి పడింది. అతడి పాస్‌పోర్టు, వీసాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒమన్‌కు ఎందుకు వెళ్లినట్టో.. ఏడాదిన్నర క్రితం ఉద్యోగ రీత్యా ఆ యువకుడు దుబాయ్ వెళ్లినట్టు గుర్తించారు. గత ఏడాది కరోనా సమయంలో ఇతడు దుబాయ్ నుంచి తిరిగి రాలేదు. అదే సమయంలో ఆరు నెలలు ఒమన్‌లో ఉండడం అనుమానాలకు దారి తీసింది. నిషేధిత ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ కార్యకలాపాలకు కేంద్రంగా ఒమన్ మారి ఉండడంతో ఆ దేశంపై భారత్ నిషేధం విధించింది. ఇక్కడకు తమిళనాడు నుంచి ఇప్పటికే పలువురు యువకులు సరిహద్దులు దాటి వెళ్లినట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఈ పరిస్థితుల్లో ఈ యువకుడు ఒమన్‌కు వెళ్లిరావడం అనుమానాలకు బలం చేకూరినట్టు అయింది. ఆ యువకుడు పెరంబలూరుకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అతడి కుటుంబం నేపథ్యం గురించి విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఐఏ వర్గాలు సైతం యువకుడిని విచారించారు. దుబాయ్‌లో ఉద్యోగం నచ్చక, ఒమన్‌కు వెళ్లి పనిచేసినట్టుగా ఆ యువకుడు పేర్కొంటున్నాడు. అందులో వాస్తవాలు లేవని భావించిన అధికారులు చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించే పనిలో పడ్డారు. యువకుడు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అతడికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? లేదా, అతడితో పాటుగా పెరంబలూరు నుంచి దుబాయ్‌కు వెళ్లిన వారి వివరాలను సేకరించి, విచారణను ముమ్మరం చేశారు. చదవండి: హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి.. ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’ -
కలిసే చదివారు... విడివిడిగా చేరారు!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుమానితులుగా, ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్ అనుచరులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ 3 రోజులుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు హాజరవుతున్న మసూద్ తహాజ్, షిబ్లీ బిలాల్ క్లాస్మేట్స్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. విదేశంలో పీజీ వరకు కలిసే చదువుకున్నట్లు వెల్లడైంది. అయితే ఐసిస్‌లోకి మాత్రం బాసిత్ వేసిన ట్రాప్‌లో వేర్వేరుగా ఇరుక్కున్నారని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఈ ఇద్దరితో పాటు మరో అనుమానితుడు జీషాన్‌ను సైతం అధికారులు వరుసగా మూడో రోజైన సోమవారమూ ప్రశ్నించారు. మాదాపూర్‌లోని హైదరాబాద్ యూనిట్ కార్యాలయంలో వీరిని, బాసిత్ రెండో భార్య మోమిన్‌ను మహారాష్ట్రలోని వార్దాలో విచారించారు. మహారాష్ట్రకు చెందిన మసూద్, షిబ్లీ కుటుంబాలు కొన్నేళ్ల క్రితం ఒమన్‌ను వలసవెళ్లాయి. దీంతో ఇద్దరూ అక్కడి ఎంబసీ అదీనంలో నడిపే భారతీయ పాఠశాలలో చదువుకున్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఇద్దరూ క్లాస్మేట్స్. గతేడాది ఎవరికి వారుగా భారత్‌కు వచ్చి నగరంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వేర్వేరు సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. బాసిత్ అనుచరులుగా... ఐసిస్ భావజాలానికి ఆకర్షితులైన వీరు వెబ్సైట్లు, సోషల్ మీడియాల్లో ఆ అంశాల కోసం బ్రౌజింగ్ చేస్తుండేవారు. ఈ క్రమంలో బాసిత్ నిర్వహిస్తున్న ఫేస్బుక్ పేజ్, టెలిగ్రామ్ చానల్ గ్రూప్‌ల్లో సభ్యులుగా మారారు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు బాసిత్‌కు అనుచరులయ్యారు. పాతబస్తీలో జరిగిన సమావేశంలో నేరుగా పాల్గొనే వరకు తామిద్దరం ఒకే సూత్రధారితో కలసి పని చేస్తున్నామన్నది మసూద్, షిబ్లీకి తెలియదు. మరోపక్క బాసిత్‌కు మోమిన్ పరిచయమైంది కూడా ఇలాంటి ఐసిస్ సంబంధిత సోషల్ మీడియా గ్రూపుల్లోనే. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన ఈమె ఆయా గ్రూపుల్లో చేస్తున్న చర్చలు బాసిత్‌ను ఆకర్షించాయి. దీంతో గత ఏడాది తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మోమిన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చి మలక్‌పేటలో కాపురం పెట్టాడు. విదేశాల్లో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్లతో బాసిత్‌తో పాటు మోమిన్ సైతం సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేది. గత ఏడాది ఆగస్టులో బాసిత్ అరెస్టు తర్వాత ఈమె వ్యవహారం కీలకంగా మారిందని అధికారులు చెప్తున్నారు. బిలాల్ తండ్రీ ఉగ్రవాద కేసు నిందితుడే... పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో (ఎల్ఈటీ) సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్న షిబ్లీ బిలాల్ తండ్రి మహ్మద్ షఫీఖ్ ముజావర్ 2002లో దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడే కావడం గమనార్హం. ఈ కేసులో ముజావర్‌పై నాంపల్లి కోర్టు నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కొన్నేళ్లుగా ఒమన్ కేంద్రంగానే వ్యవహారాలు నడిపిన ముజావర్ గత ఏడాది ఫిబ్రవరిలో ఖతర్ పయనమయ్యాడు. ఖతర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇతడిని పట్టుకున్న ఇంటర్ పోల్ భారత్‌కు బలవంతంగా (డిపోర్టేషన్) పంపింది. ఢిల్లీకి చేరుకున్న ఇతడిని సీఐడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టు నేపథ్యంలోనే షిబ్లీ బిలాల్ సైతం హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. గత జూన్‌లో ముజావర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
బ్రిటన్‌లో మోసం.. అల్ కాయిదాకు నిధులు!
లండన్: బ్రిటన్‌లో పన్నుమోసాలకు పాల్పడిన కొందరు ఆసియా పౌరులు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్ర సంస్థ అల్ కాయిదాకు నిధులు సమకూర్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది. లండన్, బర్మింగ్‌హామ్, బకింగ్‌హామ్‌షైర్ లాంటి ప్రాంతాల్లో క్రియాశీలంగా ఉన్న ఈ ముఠా పన్ను మోసాలకు పాల్పడటం ద్వారా భారీగా ఆర్జించిందని, అందులో ఒక శాతాన్ని అల్ కాయిదాకు పంపించినట్లు ‘ది సండే టైమ్స్’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఈ నిధులను మదరసాల నిర్వహణ, ఉగ్ర శిక్షణ, ఇతర ఉగ్ర కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు తెలిపింది. రెండు దశాబ్దాలుగా పన్నులు ఎగ్గొట్టి అధికారులను మోసగించడంతో పాటు వ్యక్తులు, బ్యాంకులు లక్ష్యంగా క్రెడిట్ కార్డుల రూపంలో 80 మిలియన్ పౌండ్లను కొల్లగొట్టినట్లు పేర్కొంది. యూకేలోని పలు ప్రభుత్వ విభాగాల్లోని అధికారులు, నేతలతో పరిచయాలు పెంచుకుని వారికి లంచాలు ఇచ్చినట్లు తెలిపింది. పాక్ నేతలతో కూడా ఈ గ్యాంగ్‌కు సంబంధాలున్నట్లు తెలిíపింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ముఠా వివరాలు వెల్లడికాలేదు. -
పుల్వామా ఘటన దారుణం
వాషింగ్టన్: ఇటీవల పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో జరిపిన దాడిని చాలా దారుణమైనదిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తమ పాలనావ్యవస్థ మొత్తం భారత్‌కు సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ హేయమైన చర్యకు కారకులను శిక్షించాల్సిం దిగా పాకిస్తాన్‌కు సూచించారు. ఈ నెల 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన దాడి కారణంగా 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. దీంతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైట్‌హౌస్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలు నెలకొంటే చాలా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. పుల్వామాలో ఉగ్రదాడి చాలా హేయమైనదని, దీనిపై తమకు నివేదికలు అందాయని చెప్పారు. ‘ఈ ఘటనను చూశాను. దీనిపై చాలా నివేదికలు నాకు అందాయి. సరైన సమయంలో దీనిపై స్పందించాల్సి ఉంది’అని చెప్పారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాదు.. భారత్‌కు మద్దతు కూడా ఇస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ‘ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో అంతం చేసేందుకు భారత్‌కు అన్ని విధాలా సాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నాం’అని విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో తెలిపారు. పాకిస్తాన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడామని, ఉగ్రదాడికి సంబంధాలున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా పాకిస్తాన్‌కు సూచించామని పేర్కొన్నారు. -
హిజ్బుల్ టాప్ కమాండర్ వనీ హతం
శ్రీనగర్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు కశ్మీర్ లోయలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఆ సంస్థ టాప్ కమాండర్ మనాన్ బషీర్ వనీతో పాటు అతని అనుచరుడు హతమయ్యారు. 27 ఏళ్ల వనీ పీహెచ్‌డీని మధ్యలో మానేసి మిలిటెన్సీ బాటపట్టాడు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన మరో ఉగ్రవాదిని ఆషిక్ హుస్సేన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాదులకు గౌరవసూచకంగా శుక్రవారం బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. లొంగిపొమ్మన్నా వినలేదు.. హంద్వారాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో భద్రతా దళాలు వెళ్లి అక్కడ గురువారం వేకువజాము నుంచే సోదాలు నిర్వహించాయి. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు తొలుత భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారని, దీనికి స్పందించిన భద్రతా దళాలు కూడా కాల్పులకు దిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఇలా ఇరు పక్షాల మధ్య ఉదయం 11 గంటల వరకు కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. మిలిటెంట్లు లొంగిపోవాలని పోలీసులు పలుమార్లు మైకు ద్వారా ప్రకటించినా ఎలాంటి ప్రయోజనంలేకపోయిందని అన్నారు. ఎన్కౌంటర్ ముగిశాక ఆ ఇంటి నుంచి వనీ, హుస్సేన్‌ల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అంత్యక్రియలకు 10వేల మంది: లోలాబ్ ప్రాంతంలోని టేకిపురా సమీపంలో ఉన్న వనీ స్వగ్రామంలో జరిగిన అతని అంత్యక్రియలకు సుమారు 10 వేల మంది హాజరయ్యారు. మరోవైపు, బషీర్ వనీ మరణవార్త తెలియగానే శ్రీనగర్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వారు. శాంతి, భద్రతల సమస్య తలెత్తకుండా ఉత్తరకశ్మీర్‌లో అన్ని పాఠశాలలు, కళాశాలలను అధికారులు మూసేశారు. పుకార్లు, విద్వేష ప్రసంగాలు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించాలని వేర్పాటువాద నాయకులు పిలుపునిచ్చారు. స్వీయపాలన కోసం పోరాడుతున్న ఓ భావి మేధావిని కోల్పోయామని మితవాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ చెప్పారు. వనీ ఎన్‌కౌంటర్‌పై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా విచారం వ్యక్తం చేశారు. పీహెచ్డీ వద్దని మిలిటెన్సీలోకి 2016లో బుర్హాన్ వనీ హతమైన తరువాత మిలిటెన్సీ వైపు ఆకర్షితులైన విద్యావంతుల్లో బషీర్ వనీ ఒకడు. ముందునుంచి చదువుల్లో చురుకుగా ఉన్న బషీర్ వనీ ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్లో 11, 12వ తరగతులు పూర్తిచేశాడు. మెరిట్ విద్యార్థిగా పాఠశాల, కళాశాల రోజుల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. ఎన్సీసీ క్యాడెట్‌గా పంద్రాగస్టు, రిపబ్లిక్ డే కవాతుల్లో కూడా పాల్గొన్నాడు. 2010, 2016లో కశ్మీర్ లోయలో చెలరేగిన తీవ్ర నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి వాడు, అలీగఢ్ యూనిర్సిటీలో పీహెచ్డీ చదువుతుండగా 2017 చివరన దక్షిణ కశ్మీర్‌కు చెందిన కొందరు విద్యార్థులతో ఏర్పడిన పరిచయంతో మిలిటెన్సీలో చేరాడు. ఈ ఏడాది జనవరి 3న అలీగఢ్ వర్సిటీని వదిలి వెళ్లాడు. అతని పేరు ఇప్పటికీ వర్సిటీ అధికారిక వెబ్సైట్లో కనిపిస్తోంది. భూగర్భశాస్త్రంలో పీహెచ్డీ చదువుతున్న వనీకి భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్’ అవార్డు కూడా దక్కింది. -
కాబూల్‌లో మళ్లీ ఆత్మాహుతి దాడి
కాబూల్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆత్మాహుతి దాడితో అఫ్గానిస్తాన్ మరోసారి ఉలిక్కి పడింది. ఆ దేశ రాజధాని కాబూల్‌లోని ఓ ఓటరు నమోదు కేంద్రం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. 112 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో అధికశాతం మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ స్పష్టం చేసింది. దాడితో ఘటనాస్థలంలో భీతావహ వాతావరణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రెండంతస్తుల భవనంతోపాటు అక్కడ ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి ఓటరు నమోదు కార్యాలయం ప్రధాన ద్వారం వద్దే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు కాబూల్ పోలీస్ చీఫ్ దావూద్ అమీన్ తెలిపారు. ఈ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. బాంబు దాడిని నాటో ఖండించింది. ‘ఈ హింస అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను వ్యతిరేకించే శక్తుల అమానుషత్వాన్ని, పిరికితనాన్ని తేటతెల్లం చేస్తుంది’ అని అమెరికా అంబాసిడర్ జాన్ బాస్ ట్వీటర్లో పేర్కొన్నారు. మరోచోట ఆరుగురు దుర్మరణం కాబూల్‌లోని బగ్లాన్ ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన జరిగిన మరో బాంబు దాడిలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈ రెండు దాడులను తీవ్రంగా ఖండించారు. వరుస దాడులు అక్టోబరు 20న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అఫ్గాన్ ప్రభుత్వం ఈ నెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కాబూల్‌లో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాలకు రక్షణ కల్పించడం అఫ్గాన్ పోలీసులకు సమస్యగా తయారైంది. -
‘మక్కా’ నుంచే మారాడు..
సాక్షి, సిటీబ్యూరో: వికారుద్దీన్ అహ్మద్... తెహరీక్–గల్బా–ఏ–ఇస్లాం (టీజీఐ) లోకల్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి... మరో నలుగురితో కలిసి మాడ్యుల్ తయారు చేసి... 2009–10 మధ్య ఏడాదిన్నర కాలంలో మూడుసార్లు పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది ఇతడు. హైదరాబాద్‌తో పాటు గుజరాత్‌లోనూ అనేక నేరాలు చేసిన వికార్... ఉగ్రవాద బాటపట్టడానికి ‘మక్కా కాల్పులే’ కారణం. 2006 మే 18న మక్కా మసీదులో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య తొమ్మిది అయినప్పటికీ... ఘటనాస్థలిలో చనిపోయింది ఐదుగురు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దర్స్గా జిహాద్ ఏ షెహదత్ (డీజేఎస్) అనే సంస్థలో పని చేస్తున్న వికారుద్దీన్ ఈ ఘటనతో పోలీసులపై కక్ష పెంచుకున్నాడు. ఓల్డ్ మలక్‌పేట ప్రాంతానికి చెందిన ఇతడు కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సులేమాన్ తదితరులతో కలిసి ముఠా కట్టి హఠాత్తుగా 2008 డిసెంబరు 3న సంతోష్‌నగర్‌లో ప్రత్యక్షమై నిఘా విభాగం అధికారులపై కాల్పులు జరిపాడు. ఆపై టీజీఐ పేరులో ఏకంగా సంస్థనే ఏర్పాటు చేసి 2009 మే 18న ఫలక్‌నుమాలో, మరికొన్ని రోజులకు శాలిబండలో హోంగార్డు బాలస్వామి, కానిస్టేబుల్ రమేష్‌లను పొట్టనపెట్టుకున్నాడు. ‘మక్కా కాల్పులకు’ ప్రతీకారంగా అంటూ పోలీసులను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ గ్యాంగ్‌ను 2010 జూలైలో అరెస్టు చేసిన పోలీసులు వరంగల్ కారాగారానికి తరలించారు. 2015 ఏప్రిల్‌లో విచారణ నిమిత్తం నగరానికి తీసుకువస్తుండగా పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించగా... పోలీసులు జరిపిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు హతమయ్యారు. ‘మక్కా’ కారణంగానే ఐఎం విధ్వంసం.. దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్‌ను రెండుసార్లు టార్గెట్‌గా చేసుకుంది. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ల వద్ద విధ్వంసాలు సృష్టించింది. 2002 నుంచి ఐఎం దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడింది. ఈ సంస్థలో మీడియా సెల్ ఇన్చార్జ్గా వ్యవహరించిన పుణే వాసి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మన్సూర్ అస్ఫర్ పీర్భాయ్ బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో ఎథికల్ హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మక్కా పేలుడు జరిగినప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్న అతను మసీదు వద్దకు వెళ్ళి చూసి వచ్చాడు. ఆ తర్వాత ఐఎంకు చెందిన కీలక ఉగ్రవాదులు రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్ తదితరుతో పుణేలో సమావేశమై ‘భవిష్యత్తు కార్యాచరణ’పై చర్చించారు. ఇందులో పాల్గొన్న పీర్భాయ్ ‘మక్కా’ ఉదంతాన్ని వివరించడంతో రియాజ్ అందుకు ప్రతీకారంగా హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుందామని నిర్ణయించాడు. 2007 ఆగస్టులో సిటీకి వచ్చిన రియాజ్, అనీఖ్, అ క్బర్ అదే నెల 25న జంట పేలుళ్లకు పాల్పడి పారిపోయారు. ప్రస్తు తం ఈ కేసు విచారణ సైతం తుది దశకు చేరుకుంది. ఈ కేసునూ మక్కా పేలుడు కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థే ఇన్వెస్టిగేట్ చేయడం కొసమెరుపు. ఈ కేసు కూడా అనేక చేతులు మారిన తర్వాతే ఎన్ఐఏకే చేరింది. -
పాకిస్తాన్లో ‘టెర్రర్ బ్రదర్స్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ‘జంట పేలుళ్ల’ కేసుల్లో నిందితులుగా ఉన్న, దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు వాంటెడ్‌గా మారిన ‘టెర్రర్ బ్రదర్స్’ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారని రూఢీ అయింది. వారిద్దరూ అక్కడే ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలనూ నిఘావర్గాలు సేకరించాయి. గత నెల్లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ విచారణతో ఇది నిర్థారణైంది. 2008 నుంచి పాక్‌లోనే ఉంటూ భారత్‌లో పేలుళ్లకు కుట్రలు చేస్తున్న ఈ ద్వయానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భద్రత కల్పిస్తోందని బయటపెట్టాడు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఏర్పాటులో ఈ బ్రదర్స్ కీలకపాత్ర పోషించారు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ జంట పేలుళ్లతో దద్దరిల్లింది. ఆ రోజు గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో చోటు చేసు కున్న పేలుళ్లు 42 మంది ప్రాణాలు తీశాయి. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ ప్రాంతంలోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల్లో పేలుళ్లు జరిగాయి. గోకుల్‌చాట్ వద్ద బాంబు పెట్టింది రియాజ్ కాగా.. కుట్రలో ఇక్బాల్ ఉన్నాడు. 2013 పేలుళ్ల నాటికి రియాజ్ దేశం దాటేసినా కుట్రలో కీలకంగా వ్యవహరించాడు. 9 రాష్ట్రాల్లో వాంటెడ్..: కోల్‌కతాలో ఆసిఫ్రజా కమాండో ఫోర్స్(ఏఆర్డీఎఫ్) పేరుతో విధ్వంసాలు సృష్టించి కరాచీకి మకాం మార్చిన అమీర్ రజా ఖాన్ ప్రోద్భలంతో ఏర్పాటైన ఐఎంలో భత్కల్ సోదరులు కీలకపాత్ర పోషించారు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఈ ద్వయం అమీర్ ఆదేశాల మేరకు స్థానిక యువతను ఆకర్షించి విధ్వంసాలు సృష్టించింది. రియాజ్ ఐఎంకు సదర్ రీజియన్ కమాండర్‌గా వ్యవహరించాడు. రియాజ్, అతని సోదరుడైన ఇక్బాల్ 2005 నుంచి దేశవ్యాప్తంగా 11 పేలుళ్లకు పాల్పడ్డారు. యూపీలోని లక్నో, ఫరీదాబాద్, వారణాసి కోర్టుల్లో, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ పేలుళ్లతో పాటు రామ్‌పూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి, సూరత్‌లో పేలుళ్లకు కుట్రల్లోనూ వీరు వాంటెడ్. 2008 సెప్టెంబర్‌లో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌తో ఢిల్లీ పోలీసులకు ఐఎం మూలాలు తెలిశాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ‘టెర్రర్ బ్రదర్స్’ సరిహద్దులు దాటి అమీర్రజా దగ్గర షెల్టర్ తీసుకుంటున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఐఎస్ఐ రక్షణలో కరాచీలోని డిఫెన్స్ కాలనీలో వీరు స్థిరపడ్డారని తౌఖీర్ విచారణలో తేలింది. -
పాక్ చేరుకున్న రాజ్‌నాథ్
ఇస్లామాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ ఆందోళనల మధ్య సార్క్ దేశాల హోంమంత్రుల సదస్సులో పాల్గొనడానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బుధవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. నేటి నుంచి జరగనున్న సదస్సులో ఆయన పాల్గొననున్నారు. దక్షిణాసియా దేశాల్లో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు అడ్డుకునే సహకారం కోసం ప్రయత్నిస్తానని రాజ్‌నాథ్ పాక్ పర్యటనకు బయలుదేరే ముందు స్పష్టం చేశారు. దేశాల భద్రత గురించి చర్చించడానికి ఈ సమావేశాలు ఒక మంచి వేదిక అని అన్నారు. భారత్‌లో దాడులకు పాల్పడుతున్న పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే- మొహమ్మద్‌ల గురించి రాజ్‌నాథ్ ఈ చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. కాగా రాజ్‌నాథ్ పాక్ పర్యటనపై పాక్‌లో పలు సంఘాలు నిరసన తెలిపాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన ఆందోళనలకు హిజ్బుల్ ముజాహిదీన్, యూనెటైడ్ జీహాద్ కౌన్సిల్( యూజేసీ) చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ నేతృత్వం వహించాడు. -
కీలక ‘హోదా’ల్లో నగరవాసులే!
‘జునూద్’ ఫైనాన్స్ చీఫ్‌గా నఫీజ్ ఖాన్ ఏయూటీ దక్షిణ భారత అధిపతిగా ఇబ్రహీం సిటీబ్యూరో: ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన ఉగ్రవాద సంస్థల్లో కీలక హోదాల్లో సిటీకి చెందిన వారే ఉంటున్నారు. మొన్నటికి మొన్న జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ మాడ్యుల్, తాజాగా చిక్కిన అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) మాడ్యుల్ ఈ విషయాలనే స్పష్టం చేస్తున్నాయి. ‘జునూద్’ మాడ్యుల్‌కు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఈ ఏడాది జనవరిలో నగరంలో అరెస్టు చేసిన నలుగురిలో ఒకడైన నఫీజ్ ఖాన్ ఆ సంస్థలోనే కీలక వ్యక్తని పోలీసులు గుర్తిం చారు. ప్రస్తుతం సిరియా కేంద్రంగా ఐసిస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ మాడ్యుల్ యాక్టివ్‌గా పని చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దీనికి ముంబైలో పట్టుబడిన ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్ చీఫ్‌గా ఉన్నాడని, ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన రిజ్వాన్ అలీ డిప్యూటీ చీఫ్‌గా, కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన నజ్మల్ హుడా మిలటరీ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. హైదరాబాద్‌లో పట్టుబడిన నఫీజ్ ఖాన్ ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్ చీఫ్‌గా ఉన్నాడని నిర్థారించారు. ‘జునూద్’లోకి రిక్రూట్మెంట్, ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ కోసం షఫీ ఆర్మర్ నుంచి ముదబ్బీర్‌కు రూ.8 లక్షల హవాలా రూపంలో అందాయని, వీటి నుంచి రూ.2 లక్షల్ని హైదరాబాద్‌లో ఉన్న నఫీజ్‌కు పంపాడని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. బుధవారం చిక్కిన ఏయూటీ మాడ్యుల్ ప్రస్తుతానికి నగరానికే పరిమితమైంది. అయితే భవిష్యత్తులో దక్షిణ భారత దేశ వ్యాప్తంగా విస్తరించడానికి షఫీ ఆర్మర్ పథక రచన చేశాడు. ఈ బాధ్యతల్ని చెత్తాబజార్‌కు చెందిన మహ్మద్ ఇబ్రంహీం యజ్దానీకి అప్పగించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి సౌత్ ఇండియా చీఫ్‌గా నియమించాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. -
అతడో ‘ఆషిక్’
⇒‘జునూద్’ ఉగ్రవాది ప్రేమకథ.. ⇒అమ్మాయి కోసం ప్లాస్టిక్ సర్జరీకి ఆషిఖ్ నిర్ణయం ⇒డబ్బు సంపాదనకు ఆఫ్ఘనిస్థాన్ వెళ్లేందుకు యత్నం ⇒ఆ ప్రయత్నంలోనే ‘ఉగ్ర’బాట.. ⇒నగరంలో చిక్కిన నఫీజ్ ఖాన్‌కు అనుచరుడు సిటీబ్యూరో: ‘ఆషిక్’ అంటే ‘ప్రేమికుడు’ అని అర్థం. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర పన్నిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ మాడ్యుల్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది ఆషిఖ్ అహ్మద్ కూడా ప్రేమికుడే. ఇతడి జీవితంలోనూ ఓ ప్రేమ కథ ఉంది. ఆ అమ్మాయి కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం ఆఫ్ఘనిస్థాన్ వెళ్లి నల్లమందు పండించాలని యోచిం చాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆన్లైన్ ద్వారా ‘జునూద్’కు దగ్గరై ఉగ్రబాట పట్టాడు. హైదరాబాద్‌లో చిక్కిన ఉగ్రవాది నఫీజ్‌ఖాన్‌కు ప్రధాన అనుచరుడిగా మారాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మార్చి 18న ఆషిఖ్‌ను అరెస్టు చేసింది. న్యాయస్థానంలో అతడిచ్చిన వాంగ్మూలంలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ‘ముఖం’ మార్చుకోవాలని.. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా మజీర్‌పుర ప్రాంతానికి చెందిన ఆషిఖ్ అహ్మద్ 11,12 తరగతులు చదువుతున్న సందర్భంలో మరో వర్గం యువతితో ప్రేమలో పడ్డాడు. తన క్లాస్మేట్ నుంచి పోటీ వచ్చినా వెనక్కు తగ్గకుండా ‘పోరాటం’ చేశాడు. ఆమె ప్రేమను జయిస్తున్నానని ఆషిఖ్ భావిస్తున్న తరుణంలో ఊహించని షాక్ తగిలింది. మరో వర్గానికి చెందిన యువకుడితో పెళ్లిని తన కుటుంబం ఒప్పుకోదని, తన వర్గాన్ని, కుటుంబాన్ని వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని సదరు యువతి స్పష్టం చేసింది. అయినా ఆ యువతిపై ప్రేమ చంపుకోలేని ఆషిఖ్ తన రూపురేఖలు మార్చుకుని, యువతి వర్గానికే చెందిన యువకుడిగా ఆమె కుటుంబానికి పరిచయం కావాలని భావించాడు. అందుకోసం తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు కోసం ఆన్లైన్ ద్వారా ‘ఆదాయ మార్గాలను’ అన్వేషించాడు. అఫ్ఘన్‌లో ‘నల్లమందు’ పండించాలని.. ప్లస్ టూ తర్వాత ఆషిఖ్ డిప్లొమో చేయడానికి దుర్గాపూర్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు. ఆన్లైన్ సెర్చ్ చేస్తుండగా.. ఆఫ్ఘనిస్థాన్‌లో నల్లమందు తయారీకి అవసరమైన పాపీ గింజల్ని విస్తారంగా పండిస్తారని, దాన్ని ద్వారా అక్కడి ఉగ్రవాద సంస్థలు డబ్బు సంపాదిస్తాయని తెలుసుకున్నాడు. తానూ అక్కడకు వెళ్లి నల్లమందు పండించి డబ్బు సంపాదించి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని పథకం వేశాడు. ఆ దేశం వెళ్లేందుకు మార్గాలను అన్వేషిస్తూ, సహకరించాల్సిందిగా ఫేస్బుక్లో పేజీ ఓపెన్ చేశాడు. అలా ఆన్లైన్లో జిహాదీ భావజాలం ఆకర్షణలో పడ్డాడు. ఈనేపధ్యంలోనే ఫేస్బుక్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన నఫీజ్ ఖాన్‌కు పరిచయమయ్యాడు. ఈ ఏడాది జనవరి 22, 23 తేదీల్లో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో వరుస దాడులు చేసిన ఎన్ఐఏ బృందాలు 14 మందిని అరెస్టు చేశాయి. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నఫీజ్ ఖాన్‌తో పాటు ఒబెదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్ ఉన్న విషయం తెలిసిందే. కీలక సమావేశంలో పాల్గొన్న ఆషిఖ్ అప్పటికే ఐఎస్ఐఎస్ భారత విభాగం చీఫ్ ఫషీ ఆర్మర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న నఫీజ్ ఖాన్ అతడి ఆదేశాల మేరకు విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు చూసే ఫైనాన్స్ చీఫ్‌గానూ నఫీజ్ ఖాన్ మారాడు. ‘జునూద్’లోకి రిక్రూట్మెంట్, ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ కోసం షఫీ ఆర్మర్ నుంచి ముంబైకి చెందిన ‘జునూద్’ మాడ్యుల్ చీఫ్ ముదబ్బీర్‌కు రూ.8 లక్షలు హవాలా రూపంలో అందాయి. వీటిలో రూ.2 లక్షలు ముదబ్బీర్ హైదరాబాద్‌లో ఉన్న నఫీజ్‌కు పంపాడు. పేలుళ్ల ద్వారా విధ్వంసాలు సృష్టించడంతో పాటు టార్గెట్ చేసుకున్న ప్రముఖుల్నీ కాల్చి చంపడం ద్వారా టై క్రియేట్ చేయడానికి ‘జునూద్’ మాడ్యుల్ సిద్ధమైంది. దీనికోసం తుపాకులు, తూటాలను పశ్చిమ బెంగాల్లో ఖరీదు చేయాలని భావించింది. ఆయుధాల కోసం బెంగాల్ వెళ్లిన నఫీజ్ ఖాన్ పలుమార్లు దుర్గాపూర్ వెళ్లి ఆషిఖ్‌ను కలిశాడు. జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ బెంగాల్ యూనిట్‌కు నేత ృత్వం వహించాల్సిందిగా సూచించాడు. మరికొందరి ఉగ్రవాదులతో కలిసి ఆ ప్రాంతంలో జరిగిన ఓ సమావేశంలోనూ నఫీజ్, ఆషిఖ్లు పాల్గొన్నారు. ‘జునూద్’ మాడ్యుల్‌కు అవసరమైన ఆయుధాలు సమకూర్చడం, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు అంగీకరించాడు. ఈ మాడ్యుల్ టార్గెట్ చేసిన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన త ృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సైతం ఉన్నారని, దానికి సంబంధించిన రెక్కీ బాధ్యతల్ని ఆషిఖ్ చేపట్టాడని అధికారులు చెబుతున్నారు. -
‘ఐఎస్ ఒంటరి తోడేలు దాడి’కి అవకాశం
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ మద్దతుదారులు దేశంలో దాడులకు తెగబడే అవకాశముందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ‘ఒంటరి తోడేలు దాడి’కి అవకాశముందని, పటిష్ట భద్రతాఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఆన్లైన్లో ఐఎస్ మద్ధతుదారుల కార్యకలాపాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఐఎస్ ప్రమాదంపై కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులు, 13 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐఎస్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న విషయం వాస్తవమే. గణతంత్ర దినోత్సవాల వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒంటరి తోడేలు దాడి అవకాశాలపై అప్రమత్తంగా ఉండాలని అందరినీ ఆదేశించాం’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఏదైనా ఒక సంస్థ, ఉద్యమం, లేదా సిద్ధాంతానికి మద్దతుగా, ఎవరి సహాయసహకారాలు లేకుండానే, ఒంటరిగా హింసాత్మక దాడికి పాల్పడే వ్యక్తిని ఒంటరి తోడేలు(లోన్ వోల్ఫ్)గా అభివర్ణిస్తారు. డిసెంబర్లో జైపూర్‌లో అరెస్టైన సిరాజుద్దీన్ ఆ దిశగానే వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. కుటుంబ సభ్యులు, మత పెద్దలు మొదలైనవారి సహకారంతో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చేపట్టిన చర్యలను అధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు. -
ఐసిస్‌లో భారతీయుల పరిస్థితి దారుణం
న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భయంకర ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో 23 మంది భారతీయులు చేరినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇందులో ఆరుగురు వివిధ సందర్భాల్లో మానవబాంబులుగా, ప్రత్యర్థుల దాడుల్లో హతమయ్యారు. చనిపోయిన వారిలో అతిఫ్ వసీమ్ మహమ్మద్ (తెలంగాణ, ఆదిలాబాద్), ఉమర్ సుభాన్ (బెంగళూరు), ఫైజ్ మసూద్ (బెంగళూరు), మౌలానా సుల్తాన్ అమర్ (భత్కల్, కర్ణాటక), ఫారూఖీ టంకీ (థానే, మహారాష్ట్ర), మహమ్మద్ సజ్జద్ (ఆజంగఢ్, యూపీ) ఉన్నారు. నిఘా వివరాల ప్రకారం.. ఐసిస్ ఆర్మీలో చేరేందుకు ఆసియన్ దేశాల నుంచి వెళ్లిన వారి జీవితాలు దుర్భరంగా ఉంటాయని, కిందిస్థాయిలోనే వీరిని వాడుకుంటారని వెల్లడైంది. ఆసియా దేశాల వారిలో పోరాడేతత్వం తక్కువని , అందుకే వీరిని మానవబాంబులుగానే వినియోగించుకుంటారని తెలిసింది. ట్యునీషియా, పాలస్తీనా, సౌదీ, ఇరాక్, సిరియానుంచి వచ్చిన వారిని ఐసిస్‌లో ఉన్నత స్థానాల్లో నియమిస్తూ భారత్, పాక్, బంగ్లాదేశ్ దేశస్తులను కిందిస్థాయిలో చేర్చుకుంటున్నారు. ఇంటర్నెట్ వలవేసి చేర్చుకుంటున్న వారిలో వీరే ఎక్కువ. అసలైన ఇస్లాం వీరికి తెలియదని అవమానపరుస్తూ నీచంగా చూస్తారు. వీరిరికిచ్చే ఆయుధాలు అధునాతనమైనవి కావు. అయినా వీరిని యుద్ధానికి పంపిస్తారు. సిరియా యుద్ధంలో చనిపోతున్న వారిలో వీరే ఎక్కువ. పారిపోకుండా ఉండేందుకు వీళ్ల పాస్‌పోర్టులు కాల్చేస్తారు. భారత్, పాక్‌లలో ఉండే ముస్లింలు అసలైన ముస్లింలు కారని, ఒక్కసారి జిహాద్లో చేరిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. వారిని ‘జిన్’ (దెయ్యం) వెంటాడుతుందని భయపెడుతున్నారని రిపోర్టులు వెల్లడించాయి. దీంతో ఐసిస్‌లో చేరిన వారంతా మింగలేక కక్కలేక భయంతో మగ్గిపోతున్నారని తెలిపాయి. -
ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యం
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ♦ ఇరాక్, సిరియాల్లో పలు ప్రాంతాలు స్వాధీనం ♦ అమెరికా, పాశ్చాత్య దేశాలపై దెబ్బతీయడంపై దృష్టి ♦ ‘ఖలీఫా’ను పునరుద్ధరించడమే లక్ష్యంగా విస్తరణ ఐఎస్ఐఎస్.. గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఉగ్రవాద సంస్థ ఇది. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను అనూహ్యమైన బలప్రయోగంతో తమ అధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ఐఎస్... తాను ‘ఖలీఫా’ను స్థాపించానని, తమ ఖాలీఫ్ అబుబకర్ అల్-బగ్దాదీ అని ప్రకటించింది. ఖాలీఫా అంటే ‘ఇస్లాం రాజ్యం’. ఖాలీఫ్ అంటే ఆ రాజ్యానికి అధినేత, మహమ్మద్ ప్రవక్త వారసుడు. అరేబియా ప్రాంతంతో పాటు మధ్య ప్రాచ్యమంతా ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని.. యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియా వరకూ విస్తరిస్తామని, అమెరికా శ్వేతసౌధం పైనా తమ జెండా ఎగురవేస్తామని ఐఎస్ఐఎస్ తన ‘ప్రణాళిక’ను వెల్లడించింది. అందులో భాగంగా భారీ స్థాయిలో ఉగ్రదాడులకు తెగబడుతోంది. ఫ్రాన్స్‌లోనూ శుక్రవారం మారణహోమం సృష్టించి 128 మందిని బలి తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఐఎస్ఐఎస్ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా విస్తరిస్తోందనే దానిపై ప్రత్యేక కథనం.. ఎలా పుట్టింది? ఇరాక్‌లో జమాత్ అల్-తాహిద్ వల్-జిహాద్ అనే పేరుతో 1999లో ఒక ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఆ తర్వాత 2004 సంవత్సరంలో అల్‌ఖైదాతో చేతులు కలిపి.. ‘అల్-ఖైదా ఇన్ ఇరాక్’ (ఏక్యూఐ) అని పేరు మార్చుకుంది. 2003లో ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో.. ఆ దేశంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏక్యూఐ పాలుపంచుకుంది. 2006లో ఇతర సున్నీ తీవ్రవాద సంస్థలతో కలసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా మారింది. ఆ తర్వాత కొద్ది కాలానికే.. ఇస్లామిక్ రాజ్యంఏర్పాటును ప్రకటించింది. తన పేరును ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’ (ఐఎస్ఐ)గా మార్చుకుంది.అబుబకర్ అల్-బాగ్ధాదీ నాయకత్వంలో ఈసంస్థ గణనీయంగా పెరిగింది. సిరియా అంతర్యుద్ధంలో ప్రవేశించి.. ఆ దేశంలోని సున్నీ మెజారిటీ ప్రాంతాల్లో గట్టి పట్టు సాధించింది.2013 ఏప్రిల్‌లో అక్కడి అల్‌ఖైదా అనుబంధఉగ్రవాద సంస్థ జభాట్ అల్-నుస్రా ఫ్రంట్నువిలీనం చేసుకుని.. పేరును ‘ఇస్లామిక్ స్టేట్ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ - ఐఎస్ఐఎస్గా (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరా అండ్ ద లెవాంట్ -ఐఎస్ఐఎల్ అనీ అంటారు) మార్చుకుంది.ఇది 2014 ఫిబ్రవరి వరకూ కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సన్నిహతసంబంధాలు కలిగివుంది. కొంత కాలం ఆధిపత్య పోరు తర్వాత ఐఎస్ఐఎస్తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు అల్‌ఖైదా అధినేతఅల్-జవహరి ప్రకటించారు. ఐఎస్ఐఎస్ ‘ఖలీఫా’.. ఒకప్పుడు అరబ్ దేశాలన్నీ ‘ఖలీఫా’ పాలనలో ఉండేవి. దాదాపు వందల ఏళ్ల పాటు ఒకే ఛత్రం కింద కొనసాగాయి. కానీ పశ్చిమ దేశాల ప్రభావం, ప్రపంచ యుద్ధాల్లో దెబ్బతినడంతో... ఇప్పుడున్న రూపంలో స్వతంత్ర దేశాలుగా రూపొందాయి. అయితే.. ఇస్లాం రాజ్యాన్ని పునరుద్ధరించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఖలీఫాను రాజకీయ చర్యలద్వారా పునరుద్ధరించాలని ముస్లిం బ్రదర్హుడ్, హిజ్బ్ ఉట్-తాహ్రిర్ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. శతాబ్దాల పాటు కొనసాగిన తమ ‘ఖలీఫా’ విచ్ఛిన్నం కావడానికి కారణం పశ్చిమ దేశాలేనన్న ఆలోచన ఇస్లాం ప్రపంచంలో బలంగా నాటుకుపోయింది. ఆ తర్వాత కూడా పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించి ఇజ్రాయెల్ ఏర్పాటు, అఫ్గానిస్థాన్ ఆక్రమణ, ఇరాక్ ఆక్రమణ వంటి అనేక పరిణామాలు.. ముస్లిం ప్రపంచంలో పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతను పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బలప్రయోగం ద్వారా ఖాలీఫాను పునరుద్ధరించాలని, పశ్చిమ దేశాలను దెబ్బ తీయాలనే లక్ష్యంతో అల్‌ఖైదా వంటివి పుట్టుకొచ్చాయి.అనూహ్యంగా తెరపైకి వచ్చిన ‘ఐఎస్ఐఎస్’ మాత్రం.. ఇరాక్, సిరియాల్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించి ‘ఖాలీఫా’ను స్థాపించినట్లు ప్రకటించుకుంది. 2014 జూన్ 29న తాను ప్రపంచవ్యాప్త ఖలీఫాగా ఐఎస్ఐఎస్ సంస్థ ప్రకటించుకుంది. తన పేరును ‘ఇస్లామిక్ స్టేట్’గా మార్చుకుంది. అయితే ఏదేశం కానీ, ప్రధాన స్రవంతి ముస్లిం సంస్థలు కానీ దీనిని ఖాలీఫాగా గుర్తించటానికి నిరాకరించాయి. నాయకుడు ఎవరు? ప్రపంచంలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ టైస్ట్‌గా ఉన్న అబుబకర్ అల్-బాగ్దాదీ (43) అసలు పేరు ఇబ్రహీం ఇబిన్ అవ్వాద్ అల్-బాద్రి అల్-సమర్రాయి. 1971లో ఇరాక్‌లోని సమర్రా నగరంలో పుట్టాడు. స్వతహాగా బిడియస్తుడని పేర్కొంటారు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ నుంచి ఇస్లామిక్ స్టడీస్‌లో పీహెచ్డీ పూర్తిచేశాడు. ఇతడు నేరుగా మహమ్మద్ ప్రవక్త వారసుడని ప్రచారం. ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ నేపథ్యంలో తన నగరంలో ‘జైష్ హల్ అల్ సున్నా అల్-జమా’ అనే ఒక చిన్న సున్నీ తిరుగుబాటు సంస్థను నెలకొల్పాడు. కొన్ని నెలలకే 2004 ఫిబ్రవరిలో ఫలుజాలో ఇతడిని అమెరికా బలగాలు నిర్బంధంలోకి తీసుకుని.. బాగ్దాద్ శివార్లలో ‘క్యాంప్ బుక్కా’ జైలుకు తరలించాయి. అదే ఏడాది డిసెంబర్లో విడుదల చేశాయి. అనంతరం 2006లో బాగ్దాదీ సంస్థ, మరికొన్ని సున్నీ తిరుగుబాటు సంస్థలు కలిసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’గా ఏర్పడ్డాయి. అది ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్’గా పేరు మార్చుకున్నపుడు అందులో బాగ్దాదీ హోదా పెరిగింది. 2010 మే నాటికి ఆ సంస్థ అధినేత అయ్యాడు. బగ్దాదీ ఉన్నట్లా.. లేనట్లా? బగ్దాదీ గాయపడ్డాడని, మరణించాడని పలుమార్లు వార్తలు వెలువడ్డాయి... అయితే అతని మృతి చెందాడని గట్టిగా ధృవీకరించి ఏ దేశమూ చెప్పడం లేదు. ఈ ఏడాది మార్చి 18న సిరియా సరిహద్దుల్లోని అల్ బాజ్ జిల్లాలో.. వైమానిక దాడుల్లో బగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. తదుపరి నేతను ఎన్నుకోవడానికి ఐఎస్ఎస్ అగ్రనేతలు సమావేశమయ్యారని కూడా వినవచ్చింది. బగ్దాదీ పూర్తిగా కోలుకోలేదని, బగ్దాదీకి డిప్యూటీగా పనిచేసిన ఫిజిక్స్ ఉపాధ్యాయుడు అబూ అలా అల్- ఆఫ్రీ (ఇరాక్ దేశస్తుడు)ని ఐఎస్ఐఎస్ తాత్కాలిక నాయకుడిగా ఎన్నుకున్నారని ఏప్రిల్ 22న ఇరాక్ ప్రభుత్వవర్గాలు తెలిపాయి. బగ్దాదీ వెన్నముక దెబ్బతిందని, కదల్లేని స్థితిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. మే 14న బగ్దాదీ ఆడియో టేపుగా ఐఎస్ఐఎస్ ఒక టేపును విడుదల చేసింది. ఇందులో అతను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇస్లామిక్ స్టేట్‌కు తరలిరావాలని, తమ తరఫున పోరాడాలని పిలుపిచ్చాడు. బగ్దాదీ గాయపడ్డాడు లేదా మరణించాడనే వార్తలు నిజం కాదని ఈ ఏడాది జులై 20న న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అక్టోబరు 11న బగ్దాదీ కాన్వాయ్‌పై తాము దాడి చేశామని ఇరాక్ వాయుసేన ప్రకటించుకుంది. కానీ ధృవీకరణ జరగలేదు. మొత్తం మీద అగ్రరాజ్యం అమెరికా సహా ఏ దేశమూ బగ్దాదీ చనిపోయాడని ధృవీకరించకపోవడం గమనార్హం. బలాన్ని చాటే యత్నం సిరియా అధ్యక్షుడు అసాద్‌ను తొలగించాలని, అతని అసమర్థత వల్లే ఐఎస్ఐఎస్ విస్తరిస్తోందని అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు వాదిస్తున్నాయి. అసాద్ తప్పితే మరొకరు ఐఎస్ఐఎస్ను నిలువరించలేరని రష్యా అధ్యక్షుడు పుతిన్ వాదన. అసాద్ బలగాలకు మద్దతు తమ వైమానిక దళాలతో రష్యా ఐఎస్ఐఎస్పై వైమానిక దాడులు మొదలుపెట్టింది. మరోవైపు అమెరికా ఐఎస్ఐఎస్ ఆధీనంలోని చమురు బావులు, ఇతర కీలక స్థావరాలపై దాడులను ముమ్మరం చేసింది. సింజార్ ఐఎస్ ఆధీనంలో నుంచి జారిపోయింది. కుర్దు బలగాలు సింజార్ను వశం చేసుకున్నాయి. వీటన్నింటిని నేపథ్యంలో ఇటీవల ఐఎస్ఐఎస్ కాస్తా వెనకంజ వేయాల్సి వచ్చింది. బలం కూడా తగ్గినట్లు కనపడింది. ఈ నేపథ్యంలోనే పాశ్చాత్యదేశాల్లో వణుకు పుట్టించడం... తద్వారా తామింకా బలంగానే ఉన్నామని చాటడమే లక్ష్యంగా ఐఎస్ఐఎస్ భారీదాడికి వ్యూహరచన చేసి... పారిస్‌పై విరుచుకుపడి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. యువత ఎలా ఆకర్షితమవుతోంది..? ఐఎస్ఐఎస్లో చేరేందుకు.. అరబ్ దేశాల నుంచేకాదు.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వంటి పాశ్చాత్య దేశాల నుంచీ.. భారత్ నుంచీ గణనీయమైన సంఖ్యలో యువత ప్రయాణమవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఇస్లాం రాజ్యాన్ని విస్తరించేందుకు జిహాద్ (పవిత్రయుద్ధం)లో బాధ్యతగా పాల్గొనాలని ఐఎస్ఐఎస్ ఇస్తున్న పిలుపు ఒకటైతే.. ఇరాక్, సిరియాల్లో తాను ఇస్లాం రాజ్యాన్ని స్థాపించానంటూ ‘సాధించిన విజయం’పై చేసుకుంటున్న ప్రచారం మరొకటి. యుక్తవయసులోఉండే ఉడుకు రక్తంతో పాటు.. పాశ్చాత్య దేశాలపై వ్యతిరేకతతో రగులుతున్న ముస్లిం యువతకు ఇదితమకు అందివచ్చిన ఒక అవకాశంగా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే.. ఒకసారి అందులోకి వెళ్లాక.. అక్కడి అంతులేని హింస, అరాచకత్వాలను సహించలేక.. అందులో నుంచి బయటకు రాలేక తల్లడిల్లుతున్న యువకుల ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. జాతుల హత్యాకాండ.. ఐఎస్ఐఎల్ తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ‘జాతి, మత పరమైన’ హత్యాకాండలకు, హింసకుపాల్పడుతోందని.. ఇతర జాతుల వారిని తుడిచిపెట్టే కార్యక్రమం కొనసాగిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వారందరూ ఇస్లాం మతాన్ని స్వీకరించి.. సున్నీ ఇస్లాం, షరియా చట్టాలకు తాను ఇచ్చే భాష్యం ప్రకారం జీవించాలని ఈసంస్థ స్పష్టం చేస్తోందని.. వినని వారిపై హింసకు పాల్పడుతోందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగాషియా ముస్లింలు, స్థానికులైన అస్సీరియన్, చాల్దియన్, సిరియాక్, ఆర్మీనియన్ క్రిస్టియన్లు, యాజిదీలు, డ్రూజ్, షబాక్లు, మాందియాన్లను లక్ష్యంగా చేసుకుని హింసిస్తోంది. ఖ్వినియేలో 90 మంది వరకూ, హర్దాన్‌లో 60 మంది, సింజార్‌లో 500 మందివరకూ, రమాదీ జబాల్లో 70 మంది, ధోలాలో50 మంది, ఖానాసోర్లో 100 మంది, హర్దాన్‌లో 300 మంది వరకూ, అల్-షిమాల్లో డజన్ల సంఖ్యలో, జదాలాలో 14 మంది, టాల్ అఫర్ జైలులో200 మంది యాజిదీలను ఐఎస్ఐఎస్ హత్యచేసింది. ఖోచోలో 400 మంది యాజిదీలను చంపేసివేయి మందిని అపహరించింది. బేషిర్లో 700మంది షియా తుర్కుమెన్లను చంపింది. మోసుల్‌లోని బాదుష్ జైలులో 670 మంది ఖైదీలను చంపింది. ఈ హత్యలన్నీ ఇరాక్‌లోని ఆయా ప్రాంతాలను ఐఎస్‌ఐల్ ఆక్రమించుకుంటున్న క్రమంలో 2014 ఆగస్టులో జరిగినవే. ఇక సిరియాలోనూ ఘ్రానీజ్, అబు హమాన్, కాష్కియే పట్టణాల్లో సున్నీ అల్షియాటట్ తెగకు చెందిన 700మందిని హతమార్చారు. -
జేమ్స్‌బాండ్ @ 2200 కోట్లు
ప్రపంచమంతా తెలిసిన సూపర్‌స్టార్ జేమ్స్‌బాండ్... అతనికి క్లాసూ, మాసూ తేడా తెలీదు... కుల, మత, ప్రాంతీయ భాషా భేదాలు అస్సలుండవ్... తెలిసిందల్లా తన అడ్వెంచర్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడం... ఈ అంతర్జాతీయ గూఢాచారి ఈసారి ‘స్పెక్టర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు... జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే వెయింటింగ్... రెండు వేల రెండువందల కోట్ల రూపాయల బడ్జెట్లో రూపొందిన ‘స్పెక్టర్’ గురించి స్పెషల్... 1962 నుంచి జేమ్స్ బాండ్ ప్రపంచ సినీ అభిమానులకు ఓ వ్యసనంలా తయారయ్యాడు. వచ్చే నెల 5న విడుదల కానున్న ‘స్పెక్టర్’ ఈ సిరీస్‌లో 24వ సినిమా. ట్రైలర్స్ నుంచే ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. గత చిత్రాలతో పోలిస్తే ‘స్పెక్టర్’లో అంతకుమించిన యాక్షన్ ఉంటుందని అర్థమవుతోంది. జేమ్స్‌బాండ్‌గా డానియల్ క్రెగ్‌కి ఇది నాలుగో సినిమా! ‘ స్కైఫాల్’ని తెరకెక్కించిన శామ్ మెండస్ ‘స్పెక్టర్’నూ తీశాడు.. ఆ అమ్మాయి కోసం చీకటి సామ్రాజ్యంలో తన అక్రమాలను సాగిస్తూ, ప్రపంచానికి పెనుముప్పులా మారిన స్పెక్టర్ అనే ఉగ్రవాద సంస్థ అంతు చూసే క్రమంలో జేమ్స్‌బాండ్ ఓ అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది? అసలా అమ్మాయి ఎవరు? ఆమెను విలన్లు ఎందుకు వెంటాడుతున్నారనేదే మిగతా కథ. ‘స్పెక్టర్’ కోసం కేసు 1962లో వచ్చిన ‘డాక్టర్ నో’, 1965లో వచ్చిన ‘థండర్‌బాల్’ చిత్రాలలో ‘స్పెక్టర్’ ఓ ఉగ్రవాద సంస్థగా కనిపిస్తుంది. 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రంలో కనిపిస్తుంది. అసలు ‘స్పెక్టర్’ యాక్టివిటీ గురించి కెవీ మెక్లోరి అనే స్క్రిప్ట్ రైటర్ తన సినిమా కోసం రాసుకున్నారు. దాన్నే ఇయాన్ ఫ్లెమింగ్ లీగల్ రైట్స్ ఏవీ తీసుకోకుండా ‘థండర్‌బాల్’లో వాడుకున్నారు. అప్పటి నుంచి ఇయాన్ ఫ్లెమింగ్, మెక్లోరీల మధ్య కేసు నడుస్తూనే ఉంది. 2013లో హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మెట్రో గోల్డెన్ మేయర్.. మెక్లోరీతో ఓ ఒప్పందం కుదుర్చుకొని స్పెక్టర్‌కు సంబంధించిన పూర్తి హక్కులను చేజిక్కించుకుంది. ఓల్డ్ లేడీతో రొమాన్స్ ‘స్పెక్టర్’లో జేమ్స్‌బాండ్ 51 ఏళ్ల లేడీతో రొమాన్స్ చేస్తాడు. ఇలా నడివయసు స్త్రీతో జేమ్స్‌బాండ్ ప్రేమ నడపడం బాండ్ సిరీస్ హిస్టరీలోనే ఫస్ట్‌టైమ్. 51 ఏళ్ల ఓల్డ్‌లేడీ పాత్రను మోనికా బెలూసి పోషించగా, బాండ్ గర్ల్‌గా లియా సీదూ నటించారు. ఖరీదైన కార్ల విధ్వంసం మెక్సికో, ఇటలీ, బ్రిటన్, ఆస్ట్రియా, మొరాకో, రష్యా దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. చేజింగ్ సీక్వెన్సెస్ కోసం అత్యంత ఖరీదైన 10 ఆస్టిన్ మార్టిన్ కార్లను వాడారు. ఆస్టిన్ మార్టిన్ సంస్థ డీబీ10 అనే స్పోర్ట్స్ కారును ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా తయారు చేయించింది. సినిమాలో 7 కార్లను ధ్వంసం చేశారట. కార్ల కోసం ఆస్టిన్ సంస్థ ఖర్చుపెట్టింది 240 కోట్ల రూపాయలు. సినిమాలో వాటి విధ్వంసం కోసం అయిన ఖర్చు 54 కోట్లు. తయారీ, విధ్వంసం కోసం పెట్టిన మొత్తం ఖర్చు 294 కోట్ల రూపాయలు. రోమ్‌లో చిత్రీకరించిన ఓ యాక్షన్ సన్నివేశం కోసం అక్కడ ఉన్న కొన్ని చారిత్రక కట్టడాలు కూడా దెబ్బతినడంతో స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైందట. అలాగే మెక్సికోలో బాంబుపేలుడు సన్నివేశం చిత్రీకరణ కోసం ఓ పాత కట్టడాన్ని కూల్చేశారట. మెక్సికోతో రహస్య ఒప్పందం? ఈ సినిమా ప్రధానంగా మెక్సికో నగరం చుట్టూ సాగుతుంది. ఇప్పటికే డ్రగ్ మాఫియా మచ్చను మోస్తున్న మెక్సికో.. మరింత అపఖ్యాతిని మూటగట్టుకోకుండా ఉండేలా ఈ స్క్రిప్ట్‌లో మార్పులు చేయమని చిత్రబృందంతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందట. దీనికి బదులుగా ఈ సినిమా విడుదల సమయంలో భారీగా పన్ను రాయితీలు కల్పించిందని సమాచారం. అందుకే విలన్‌ను మొదట మెక్సికో జాతీయుడిగా చూపిద్దామనుకున్నా, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చిత్ర బృందం విలన్ పాత్రలో మార్పులు, చేర్పులు చేసిందని టాక్. లండన్ రాజకుటుంబంతో ‘బాండ్’ అది లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్. అభిమానులందరూ ఆ హాల్ చుట్టూ గూమిగూడారు. తమకెంతో ఇష్టమైన తారల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కారులోంచి బ్లాక్ సూట్లో ఓ వ్యక్తి స్టయిలిష్‌గా దిగారు. పక్కనే అందాల రాశులు. వారి ఎంట్రీతో ఆ హాలు మొత్తం అరుపులతో మోతమోగిపోయింది. ఫొటోలకు ఓపిగ్గా పోజులు ఇస్తూ, అభిమానులతో సెల్ఫీలు కూడా దిగారు. ఇంతకీ వీళ్లెవరా అనుకుంటున్నారా? అతనే... బాండ్... జేమ్స్‌బాండ్ పాత్రధారి డానియల్ క్రెగ్, కథానాయికలు మోనికా బెలూసీ, లీయా సీదు. 23 ఏళ్ల బాండ్ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన బాండ్ సిరీస్‌లోని తాజా చిత్రం ‘స్పెక్టర్’ ప్రీమియర్ వేడుకలో కనిపించిన దృశ్యాలివి. లండన్ రాజకుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ షో తారల తళుకులతో కళకళలాడింది. రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్టన్ ముఖ్య అతిథులుగా ఈ ప్రీమియర్‌లో పాల్గొని ‘స్పెక్టర్’ చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించారు. -
కలకలం రేపుతున్న యాసిన్ భత్కల్
తాజాగా మరోసారి లేఖ విసిరిన యాసిన్ హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్భత్కల్ కలకలం రేపుతున్నాడు. బాంబు పేలుళ్ల కేసులో ట్రయల్స్ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి హాజరైనప్పుడల్లా ఏదో ఒకరకమైన చర్యలతో పోలీసులను పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా మంగళవారం కోర్టు విచారణకు హాజరైన భత్కల్ ఒక లేఖను విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈసారి విసిరిన లేఖలో తనకు జైల్లో తగిన సదుపాయాలు కల్పించాలని న్యాయమూర్తిని కోరిన ట్లు సమాచారం. ఇప్పటికే భత్కల్ పరారీకి పలు ఉగ్రవాద సంస్థలు కుట్ర చేస్తున్నాయనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ నెల 6న కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఒక లేఖ విసిరేశాడు. తనకు తగిన భద్రత కల్పించాలని అందులో విన్నవించాడు. రెండోసారి పువ్వును ప్రదర్శించిన అతడు తాజాగా మరోసారి లేఖ విసిరేశాడు. అయితే భత్కల్ ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తున్నాడనే దానిపై పోలీసులు, నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నాయి.