‘ఐఎస్‌ఐఎల్’ అంతుచూస్తాం
దేశ ప్రజలనుద్దేశించి టీవీ ప్రసంగంలో ఒబామా
సమగ్ర వ్యూహ రచనతో ముందుకెళ్తాం
ఉగ్ర నిధులను స్తంభింపజేస్తాం
వాషింగ్టన్: ఇస్లామిక్ రాజ్యం స్థాపన లక్ష్యంగా ఇరాక్, సిరియాలలో ఆక్రమణలకు పాల్పడుతూ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎల్‌ను (ఐఎస్‌ఐఎస్ అని కూడా పిలుస్తున్నారు) దెబ్బతీసి అంతిమంగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతినబూనారు. ఉగ్రవాదుల ఏరివేతలో సమగ్ర వ్యూహ రచనతో ముందుకెళ్తామని గురువారం ‘వైట్‌హౌస్’ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి 15 నిమిషాలపాటు చేసిన టీవీ ప్రసంగంలో ఆయన ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు సిరియాలో తొలిసారి గగనతల దాడులు చేయడం సహా సైనిక చర్యలను విస్తరిస్తామని...ఇరాక్‌లో ఆ దేశ భద్రతా దళాలకు సహాయ సహకారాలు అందించేందుకు మరో 475 మంది సైనిక సలహాదారులను మోహరిస్తామన్నారు. ఈ విషయంలో ఇరాక్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. తమ దేశానికి ముప్పుగా పరిణమించే ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని వేటాడతామని ఒబామా పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల క్రూర ప్రవర్తనను ఒబామా వివరించారు. ‘‘వాళ్లు (ఉగ్రవాదులు) ఖైదీలను, చిన్నారులను దారుణంగా హతమార్చారు. మహిళలను బానిసలుగా చేసుకొని అత్యాచారాలకు పాల్పడటంతోపాటు బలవంతపు వివాహాలు చేసుకుంటున్నారు.
మైనారిటీ వర్గంపై మానవహననానికి పాల్పడ్డారు. ముఖ్యంగా ఇద్దరు అమెరికన్ జర్నలిస్టులను (జిమ్ ఫోలే, స్టీవెన్ సాట్లాఫ్) అత్యంత దారుణంగా తలలు నరికి చంపారు’’ అని ఒబామా గుర్తుచేశారు. ఐఎస్‌ఐఎస్‌పై పోరులో చేతులు కలిపిన 36కుపైగా దేశాలతో కలిసి ఉగ్రవాదులకు అందుతున్న నిధులను స్తంభింపజేసేందుకు వారి దుష్ట వ్యూహాలను తిప్పికొట్టేందుకు తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తామన్నారు. కానీ క్యాన్సర్ వంటి ఐఎస్‌ఐఎల్ ఉగ్రవాద సంస్థను నిర్మూలించేందుకు సమయం పడుతుందన్నారు. ఇరాక్, అఫ్ఘానిస్థాన్‌లలో దేశం సాగించిన యుద్ధాలకన్నా ఈ ప్రయత్నం ఎంతో భిన్నమైనదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని దేశ ప్రజలను ఒబామా కోరారు.