L
-
ఆంధ్రా సిమెంట్స్ వైజాగ్ స్థలం విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన విశాఖపట్నం యూనిట్లో కార్యకలాపాలను కొనసాగించరాదని సాగర్ సిమెంట్స్ బోర్డు నిర్ణయించింది. నగర పరిధిలోకి ఈ యూనిట్ రావడమే కంపెనీ నిర్ణయానికి కారణం. విశాఖ యూని ట్ 107 ఎకరాల్లో విస్తరించింది. ఆంధ్రా సిమెంట్స్ వైజాగ్ యూనిట్ స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలను చేస్తామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి ఇన్వెస్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో వెల్లడించారు. రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ తాజాగా సాగర్ సిమెంట్స్ పరం అయిన సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ.922 కోట్లు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అమరావతి బెంచ్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. జేపీ గ్రూప్‌నకు చెందిన ఆంధ్రా సిమెంట్స్‌కు గుంటూరు జిల్లా దాచేపల్లిలో క్లింకర్, సిమెంట్ ప్లాంటు, విశాఖపట్నం వద్ద గ్రైండింగ్ యూనిట్ ఉంది. -
Gujarat assembly elections 2022: గుజరాత్ ఎన్నికల్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని, తమకు ఓటేసి గెలిపించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆయన కోరారు. సూరత్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాదిరిగానే గుజరాత్ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని, ఆప్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన కాగితంపై రాసి చూపారు. 27 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని అన్నారు. పాత పింఛను విధానం సహా ఇతర డిమాండ్లను తీరుస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. -
ఒక మాతృభాష కథ
‘‘సూపర్ గుడ్ ఫిల్మ్స్‌లో చాలామంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాం. ఇప్పుడు ‘చెప్పాలని ఉంది’ తో యష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. యూనిక్ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నిర్మాత ఆర్బీ చౌదరి అన్నారు. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రల్లో అరుణ్ భారతి ఎల్.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. ఆర్బీ చౌదరి సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలలో ఆర్బీ చౌదరి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే తీశాం. ఆ తర్వాత తమిళ్‌తో పాటు మిగతా భాషల్లో రీమేక్ చేస్తాం’’ అన్నారు. ‘‘యాక్షన్, రొమాన్స్, కామెడీ అంశాలున్న చిత్రమిది’’ అన్నారు యష్ పూరి. ‘‘ఈ సినిమా చూశాను.. చాలా బాగుంది’’ అన్నారు నిర్మాత వాకాడ అప్పారావు. ‘‘చెప్పాలని ఉంది’ కి ప్రేక్షకుల సహకారం ఇవ్వాలి’’ అన్నారు అరుణ్ భారతి. ఈ వేడుకలో హమ్స్ టెక్ ఫిలిమ్స్ యోగేష్, మాటల రచయిత విజయ్ చిట్నీడి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్పీ డీఎఫ్టీ, సంగీతం: అస్లాంకీ. -
నీలాచల్‌కు విస్తరణ స్పీడ్
న్యూఢిల్లీ: ఇటీవల సొంతం చేసుకున్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్)ను పునఃప్రారంభించనున్నట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా సామర్థ్య విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేసింది. రానున్న కొన్నేళ్లలో వార్షికంగా 4.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) లాంగ్ ప్రొడక్టుల తయారీకి కంపెనీని సిద్ధం చేయనున్నట్లు పేర్కొంది. 2030 కల్లా 10 మిలియన్ టన్నులకు స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేర్చనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వేగంగా, సమర్థంగా ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించింది. అనుబంధ సంస్థ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) ద్వారా ఎన్ఐఎన్ఎల్ను కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రైవేటైజేషన్ పూర్తి: ఆర్థిక శాఖ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) ప్రైవేటైజేషన్ పూర్తయినట్లు ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. కంపెనీ యాజమాన్య నిర్వహణను టాటా గ్రూప్‌నకు సంపూర్ణంగా బదలాయించినట్లు పేర్కొంది. వెరసి ప్రస్తుత ప్రభుత్వం రెండో కంపెనీని విజయవంతంగా ప్రైవేటైజ్ చేసినట్లు తెలియజేసింది. ప్రైవేటైజేషన్ జాబితాలోని తొలి సంస్థ విమానయాన రంగ దిగ్గజం ఎయిరిండియాను సైతం టాటా గ్రూప్ చేజిక్కించుకున్న విషయం విదితమే. ఎన్ఐఎన్ఎల్ కొనుగోలుకి ఈ ఏడాది జనవరిలో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) వేసిన రూ. 12,100 కోట్ల విలువైన బిడ్ గెలుపొందింది. కాగా.. కంపెనీలో ప్రమోటర్లు, భాగస్వామ్య సంస్థలకుగల మొత్తం 93.71 శాతం వాటాను టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్‌కు పూర్తిగా బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. నిరవధిక నష్టాల నేపథ్యంలో ఒడిశాలోని కళింగనగర్లోగల 1.1 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంటును ఎన్ఐఎన్ఎల్ 2020 మార్చిలో మూసివేసింది. -
భవిష్యత్తునిచ్చే విద్యమ్మ!
తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ కొంతమంది.. జన్యులోపాలతో దివ్యాంగ శిశువులు పుడుతుంటారు. చిన్నదైనా పెద్దదైనా లోపం ఉన్నప్పటికీ తమ పిల్లల్ని ప్రేమగానే చూసుకుంటుంటారు తల్లిదండ్రులు. కానీ అన్ని అవయవాలు సరిగా ఉన్న పిల్లలు ప్రయోజకులు కాకపోతే భారంగా అనిపిస్తారు తల్లిదండ్రులకు. అటువంటిది మానసిక శారీరక లోపాలున్న పిల్లలు జీవితాంతం భారమే. ఇక ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. వీరి కనీస అవసరాలు తీరాలన్నా ఇబ్బందే. అలాగ పేరెంట్స్‌కు భారమైన అమ్మాయిలను తల్లిలా లాలిస్తోంది విద్యఫడ్కే. దివ్యాంగ అమ్మాయిల కోసం ఏకంగా ఒక హోమ్‌ను ఏర్పాటు చేసి ఆత్మీయతానురాగాలను పంచుతోంది విద్య. విద్యా ఫడ్కే నాసిక్‌లోని దివ్యాంగ ప్రత్యేక ప్రత్యేక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తోంది. 32 ఏళ్లుగా దివ్యాంగ బాలబాలికలకు చదువు నేర్పిస్తోన్న విద్య.. తన వృత్తిలో భాగంగా తరచూ ఆయా పిల్లల తల్లిదండ్రులను కలుస్తుండేది. తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందుతోన్న ఆ తల్లిదండ్రులు... తమ తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంటి... భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తుండేవారు. వసతి సదుపాయాలే గాక, అమ్మాయిల భద్రత గురించి కూడా వారు దిగులుపడుతుండేవారు. పదేపదే వారి బాధలు విన్న విద్యకు ఆ పిల్లలకోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ క్రమంలోనే వారికి చదువుతోపాటు, వివిధ రకాల నైపుణ్యాలు నేర్పించి ఆనందం గా ఉంచే ఒక హోమ్ వంటిది ఉంటే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. నలుగురితో... దివ్యాంగ పిల్లలకు మంచి హోం ఉంటే బావుంటుంది కానీ వారు దానిలో ఆనందంగా ఉండగలుగుతారా! అనే అనుమానం వచ్చింది విద్యకు. దీంతో ఓ నలుగురు అమ్మాయిలకోసం ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌లో భాగంగా నలుగురు అమ్మాయిలను నెలరోజులపాటు చూసుకుంది. నెలరోజుల తరువాత వారు ఇంటికి వెళ్లడానికి విముఖత చూపడమేగాక అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. దీంతో 2016లో కొంతమంది దాతల సాయంతో నాసిక్‌లోని పింపల్గావ్ బాహులలో ‘ఘర్కుల్ పరివార్’ పేరిట హోంను ప్రారంభించింది. దివ్యాంగ అమ్మాయిలు, మహిళల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి హోం అదే కావడంతో మహారాష్ట్ర నలుమూల నుంచి అమ్మాయిలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ వీరిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ హోమ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చింది కానీ, ఏవిధమైన నిధులూ మంజూరు చేయలేదు. అయినా, దాతలు ఇచ్చే విరాళాలమీదే విద్య దీనిని నడిపిస్తోంది. యాక్టివ్‌గా ఉంచేందుకు... హోమ్‌లోని పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచేందుకు మెడిసినల్ వాటర్‌తో స్నానం చేయించడం, ఆరోగ్యవంతమైన అల్ఫాహారం, వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వివిధ థెరపీల్లో భాగంగా సింగింగ్, డ్యాన్స్, యోగాలు రోజువారి దినచర్యలో భాగం. ఇవేగాక రోజువారి పనుల్లో అనేక కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నారు. వంటలో సాయం చేయడం, కూరగాయలు తరగడం, చపాతీ పిండి కలపడం వంటి వాటిని చేయిస్తున్నారు. వీరిలో కొంతమంది పెన్నులు తయారు చేయడం, డెకరేషన్ ఐటమ్స్ రూపొందిస్తున్నారు. మసాలా తయారీ, కుట్టు మిషన్, క్యాండిల్స్ తయారీ వంటి వాటిని నేర్పిస్తున్నారు. ఈ హోంలోని అమ్మాయిలంతా కలిసి రోజుకి ఎనిమిదివేల బాల్పెన్స్ను అసెంబుల్చేస్తున్నారు. వీరిలో కొంతమందికి ఎలా బిహేవ్ చేయాలన్న దానిపై కూడా తరచు శిక్షణ ఇచ్చి మంచి çనడవడికను నేర్పిస్తున్నారు. కష్టమైనా... ఇష్టంగానే! ‘‘మానసిక స్థితిగతులు సరిగా లేనివారు ఒక్కసారి చెబితే అర్థం చేసుకోరు. వారికి నేర్పించడానికి ఒకటికి పదిసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇది కష్టమే, కొన్నిసార్లు విసుగు కూడా వస్తుంది. కానీ మనమే విసుక్కుంటే వాళ్లకు తెలియదు. అందువల్ల మా కేర్ గివర్స్ ఎంతో సహనంతో వారికి నేర్పింస్తుంటారు. రెండేళ్ల కరోనా కాలమ్‌లో బాగా కష్టంగా అనిపించింది. కరోనా సమయంలో ఎక్కువమంది అమ్మాయిల ప్రవర్తనకు ఇబ్బందులకు గురై మమ్మల్ని ఆశ్రయించారు. ఆ సమయంలో హోమ్‌లో లేని పిల్లలకు ఆన్లైన్ ద్వారా బోధించాం. సరిగా మాటలు కూడా రాకుండా ఇక్కడకు వచ్చిన అమ్మాయిలు ఇప్పుడు చక్కగా పాటలు పాడడం, డ్యాన్స్ చేయడంతోపాటు పద్యాలు కూడా రాస్తున్నారు. మా సంస్థ తరపున అదితి అనే అమ్మాయి సింగపూర్‌లో జరిగే కాంపిటీషన్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ అమ్మాయి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండడమేగాక, సంస్థలో ఉన్న మరికొంతమంది అమ్మాయిలకు సింగింగ్, డ్యాన్స్ నేర్పిస్తుంది’ అని విద్యఫడ్కే వివరించారు. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్‌కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్‌ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
ఆంకజాతో జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టుల వ్యాపారంలో ఉన్న జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ నెదర్లాండ్స్ తాజాగా ఆంకజా పురా–2తో షేర్‌హోల్డర్స్, షేర్ సబ్స్క్రిప్షన్ ఒప్పందం చేసుకుంది. ఇండోనేషియా మిడాన్లోని క్వాలనాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి, కార్యకలాపాలకు సంబంధించిన ప్రాజెక్టును జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఈ ఏడాది నవంబర్‌లో చేజిక్కించుకుంది. ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 49 శాతం, ఆంకజా పురా–2నకు 51 శాతం వాటాలు ఉంటాయి. కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. -
Nagarjuna Bangarraju Movie: మైసూర్లో బంగార్రాజు
‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున– దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. నాగార్జున–నాగచైతన్యలు పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట కల్యాణ్ కృష్ణ. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీలో నాగార్జున పక్కన గ్రేస్‌ఫుల్‌గా కనిపించిన రమ్యకృష్ణ ‘బంగార్రాజు’ లోనూ నటిస్తున్నారు. నాగచైతన్య సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సత్యానంద్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
రాజ్యసభకు టీఎంసీ అభ్యర్థిగా జవహర్ సర్కార్
కోల్‌కతా: ఆగస్టు 9వ తేదీన పశ్చిమబెంగాల్ రాజ్యసభ సీటుకు జరగనున్న ఉప ఎన్నికకు రిటైర్డు ప్రభుత్వాధికారి జవహర్ సర్కార్(69)ను తమ అభ్యర్థిగా టీఎంసీ ఎంపిక చేసింది. అధికారిగా ప్రజలకు అమూల్యమైన సేవలందించిన సర్కార్ దేశానికి మరింతగా సేవ చేసేందుకు సహాయపడతారని ఆశిస్తూ ఎంపిక చేసినట్లు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కాగా, టీఎంసీ నేత దినేశ్ త్రివేది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో సీటు ఖాళీ అయింది. టీఎంసీకి పోటీగా బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించితే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. లేకుంటే రాజ్యసభకు జవహర్ సర్కార్ పోటీ లేకుండానే ఎన్నికవుతారు. సర్కార్ ప్రభుత్వ ఉద్యోగిగా 42 ఏళ్లపాటు పనిచేశారు. -
‘ఐఎస్ఐఎల్’ అంతుచూస్తాం
దేశ ప్రజలనుద్దేశించి టీవీ ప్రసంగంలో ఒబామా సమగ్ర వ్యూహ రచనతో ముందుకెళ్తాం ఉగ్ర నిధులను స్తంభింపజేస్తాం వాషింగ్టన్: ఇస్లామిక్ రాజ్యం స్థాపన లక్ష్యంగా ఇరాక్, సిరియాలలో ఆక్రమణలకు పాల్పడుతూ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎల్ను (ఐఎస్ఐఎస్ అని కూడా పిలుస్తున్నారు) దెబ్బతీసి అంతిమంగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతినబూనారు. ఉగ్రవాదుల ఏరివేతలో సమగ్ర వ్యూహ రచనతో ముందుకెళ్తామని గురువారం ‘వైట్‌హౌస్’ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి 15 నిమిషాలపాటు చేసిన టీవీ ప్రసంగంలో ఆయన ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు సిరియాలో తొలిసారి గగనతల దాడులు చేయడం సహా సైనిక చర్యలను విస్తరిస్తామని...ఇరాక్‌లో ఆ దేశ భద్రతా దళాలకు సహాయ సహకారాలు అందించేందుకు మరో 475 మంది సైనిక సలహాదారులను మోహరిస్తామన్నారు. ఈ విషయంలో ఇరాక్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. తమ దేశానికి ముప్పుగా పరిణమించే ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని వేటాడతామని ఒబామా పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల క్రూర ప్రవర్తనను ఒబామా వివరించారు. ‘‘వాళ్లు (ఉగ్రవాదులు) ఖైదీలను, చిన్నారులను దారుణంగా హతమార్చారు. మహిళలను బానిసలుగా చేసుకొని అత్యాచారాలకు పాల్పడటంతోపాటు బలవంతపు వివాహాలు చేసుకుంటున్నారు. మైనారిటీ వర్గంపై మానవహననానికి పాల్పడ్డారు. ముఖ్యంగా ఇద్దరు అమెరికన్ జర్నలిస్టులను (జిమ్ ఫోలే, స్టీవెన్ సాట్లాఫ్) అత్యంత దారుణంగా తలలు నరికి చంపారు’’ అని ఒబామా గుర్తుచేశారు. ఐఎస్ఐఎస్పై పోరులో చేతులు కలిపిన 36కుపైగా దేశాలతో కలిసి ఉగ్రవాదులకు అందుతున్న నిధులను స్తంభింపజేసేందుకు వారి దుష్ట వ్యూహాలను తిప్పికొట్టేందుకు తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తామన్నారు. కానీ క్యాన్సర్ వంటి ఐఎస్ఐఎల్ ఉగ్రవాద సంస్థను నిర్మూలించేందుకు సమయం పడుతుందన్నారు. ఇరాక్, అఫ్ఘానిస్థాన్లలో దేశం సాగించిన యుద్ధాలకన్నా ఈ ప్రయత్నం ఎంతో భిన్నమైనదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని దేశ ప్రజలను ఒబామా కోరారు.