![Tata Steel to complete Neelachal Ispat Nigam acquisition - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/5/TATA-GROUP-NEELACHAL-ISPAT-.jpg.webp?itok=WPnkuTGS)
న్యూఢిల్లీ: ఇటీవల సొంతం చేసుకున్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్‌ఐఎన్‌ఎల్)ను పునఃప్రారంభించనున్నట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా సామర్థ్య విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేసింది. రానున్న కొన్నేళ్లలో వార్షికంగా 4.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) లాంగ్ ప్రొడక్టుల తయారీకి కంపెనీని సిద్ధం చేయనున్నట్లు పేర్కొంది. 2030 కల్లా 10 మిలియన్ టన్నులకు స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేర్చనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వేగంగా, సమర్థంగా ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించింది. అనుబంధ సంస్థ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్‌ఎల్‌పీ) ద్వారా ఎన్‌ఐఎన్‌ఎల్‌ను కొనుగోలు చేయడం తెలిసిందే.
ప్రైవేటైజేషన్ పూర్తి: ఆర్థిక శాఖ
నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్‌ఐఎన్‌ఎల్) ప్రైవేటైజేషన్ పూర్తయినట్లు ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. కంపెనీ యాజమాన్య నిర్వహణను టాటా గ్రూప్‌నకు సంపూర్ణంగా బదలాయించినట్లు పేర్కొంది. వెరసి ప్రస్తుత ప్రభుత్వం రెండో కంపెనీని విజయవంతంగా ప్రైవేటైజ్ చేసినట్లు తెలియజేసింది. ప్రైవేటైజేషన్ జాబితాలోని తొలి సంస్థ విమానయాన రంగ దిగ్గజం ఎయిరిండియాను సైతం టాటా గ్రూప్ చేజిక్కించుకున్న విషయం విదితమే. ఎన్‌ఐఎన్‌ఎల్ కొనుగోలుకి ఈ ఏడాది జనవరిలో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్‌ఎల్‌పీ) వేసిన రూ. 12,100 కోట్ల విలువైన బిడ్ గెలుపొందింది. కాగా.. కంపెనీలో ప్రమోటర్లు, భాగస్వామ్య సంస్థలకుగల మొత్తం 93.71 శాతం వాటాను టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్‌కు పూర్తిగా బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. నిరవధిక నష్టాల నేపథ్యంలో ఒడిశాలోని కళింగనగర్‌లోగల 1.1 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంటును ఎన్‌ఐఎన్‌ఎల్ 2020 మార్చిలో మూసివేసింది.
Comments
Please login to add a commentAdd a comment