Steel products
-
భారంగా మారనున్న స్టీల్ దిగుమతులు!?
న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులు చౌకగా దిగుమతి అవుతున్నాయన్న దేశీ స్టీల్ పరిశ్రమ ఫిర్యాదుపై డైరెక్టరేజ్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) అధికారిక దర్యాప్తు మొదలు పెట్టింది. ఫ్యాబ్రికేషన్, పైపుల తయారీ, నిర్మాణ రంగం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ట్రాక్టర్లు, సైకిళ్లు, ఎలక్ట్రికల్ ప్యానెళ్ల కోసం వినియోగించే నాన్ అలాయ్, అలాయ్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తులపై దర్యాప్తు మొదలు పెట్టినట్టు డీజీటీఆర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉత్పత్తులపై 25 శాతం రక్షిత సుంకం విధించాలని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.ఇటీవల ఉన్నట్టుండి, పెద్ద ఎత్తున పెరిగిన ఈ దిగుమతులతో దేశీ పరిశ్రమకు శారాఘాతంగా మారినట్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశీ పరిశ్రమకు తీవ్ర హానికరంగా పేర్కొంది. దరఖాస్తుదారు (స్టీల్ పరిశ్రమ) సమర్పించిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించేందుకు కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాధారాలుట్టు భావిస్తున్నామని డీజీటీఆర్ తన నోటిఫికేషన్లో పేర్కొంది. హాట్ రోల్డ్ (హెచ్ఆర్) కాయిల్స్, షీట్స్ అండ్ ప్లేట్స్, హెచ్ఆర్ ప్లేట్ మిల్ ప్లేట్స్, కోల్డ్‌రోల్డ్ (సీఆర్) కాయిల్స్ అండ్ షీట్స్, మెటాలిక్ కోటెడ్ స్టీల్ కాయిల్స్ అండ్ షీట్స్, కలర్ కోటెడ్ కాయిల్స్ అండ్ షీట్స్ ఉత్పత్తులు డీజీటీఆర్ దర్యాప్తు పరిధిలోకి రానున్నాయి.విచారణ అనంతరం తన సిఫారసులను కేంద్ర ఆరి్థక శాఖకు డీజీటీఆర్ సమరి్పస్తుంది. ఈ సిఫారసుల ఆధారంగా దిగుమతులపై ప్రత్యేక సుంకాలు విధించే అవశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా చైనా నుంచి ఈ దిగుమతులు గణనీయంగా పెరిగినట్టు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి ఎనిమిది నెలల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. -
నీలాచల్‌కు విస్తరణ స్పీడ్
న్యూఢిల్లీ: ఇటీవల సొంతం చేసుకున్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్)ను పునఃప్రారంభించనున్నట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా సామర్థ్య విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేసింది. రానున్న కొన్నేళ్లలో వార్షికంగా 4.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) లాంగ్ ప్రొడక్టుల తయారీకి కంపెనీని సిద్ధం చేయనున్నట్లు పేర్కొంది. 2030 కల్లా 10 మిలియన్ టన్నులకు స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేర్చనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వేగంగా, సమర్థంగా ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించింది. అనుబంధ సంస్థ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) ద్వారా ఎన్ఐఎన్ఎల్ను కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రైవేటైజేషన్ పూర్తి: ఆర్థిక శాఖ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) ప్రైవేటైజేషన్ పూర్తయినట్లు ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. కంపెనీ యాజమాన్య నిర్వహణను టాటా గ్రూప్‌నకు సంపూర్ణంగా బదలాయించినట్లు పేర్కొంది. వెరసి ప్రస్తుత ప్రభుత్వం రెండో కంపెనీని విజయవంతంగా ప్రైవేటైజ్ చేసినట్లు తెలియజేసింది. ప్రైవేటైజేషన్ జాబితాలోని తొలి సంస్థ విమానయాన రంగ దిగ్గజం ఎయిరిండియాను సైతం టాటా గ్రూప్ చేజిక్కించుకున్న విషయం విదితమే. ఎన్ఐఎన్ఎల్ కొనుగోలుకి ఈ ఏడాది జనవరిలో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) వేసిన రూ. 12,100 కోట్ల విలువైన బిడ్ గెలుపొందింది. కాగా.. కంపెనీలో ప్రమోటర్లు, భాగస్వామ్య సంస్థలకుగల మొత్తం 93.71 శాతం వాటాను టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్‌కు పూర్తిగా బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. నిరవధిక నష్టాల నేపథ్యంలో ఒడిశాలోని కళింగనగర్లోగల 1.1 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంటును ఎన్ఐఎన్ఎల్ 2020 మార్చిలో మూసివేసింది. -
రియల్టీ రంగానికి స్టీల్ షాక్
కోల్‌కతా, సాక్షి: కోవిడ్-19 నేపథ్యంలో గత కొద్ది నెలలుగా నీరసించిన దేశీ రియల్టీ రంగం తాజాగా స్టీల్ ధరలతో డీలా పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అన్‌లాక్ తదుపరి ఇటీవలే నెమ్మదిగా పుంజుకుంటున్న రియల్టీ రంగం ప్రస్తుతం స్టీల్ ధరల పెరుగుదల కారణంగా ఒత్తిడిలో పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా నిర్మాణ రంగంలో వినియోగించే స్టీల్ ధరలు ఇటీవల భారీగా పెరిగినట్లు తెలియజేశారు. అయితే హౌసింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వమిస్తున్న ప్రోత్సాహకాలు, తీసుకుంటున్న చర్యలకుతోడు.. చౌక వడ్డీ రేట్ల ఫలితంగా ఇటీవల రెసిడెన్షియల్ విభాగం నిలదొక్కుకుంటున్నట్లు వివరించారు. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్ ) రూ. 45,000కు కోవిడ్-19కు ముందు ధరలతో పోలిస్తే ఇటీవల స్టీల్ ప్రొడక్టుల ధరలు 30-40 శాతం పెరిగినట్లు రియల్టీ రంగ వర్గాలు వెల్లడించాయి. నిర్మాణ రంగంలో అత్యధికంగా వినియోగించే టీఎంటీ బార్స్ ధరలు కొన్ని మార్కెట్లలో టన్నుకి రూ. 45,000ను తాకినట్లు తెలియజేశాయి. దీంతో రియల్టీ రంగ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు బెంగాల్ పీర్లెస్ హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ సీఈవో కేతన్ సేన్‌గుప్తా పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే రియల్టీ రంగం రికవరీ సాధిస్తున్నందున పెరిగిన వ్యయాలను కొనుగోలుదారులకు బదిలీ చేసేందుకు అవకాశంలేదని తెలియజేశారు. స్టీల్ ప్రొడక్టుల ధరల పెరుగుదల కారణంగా కంపెనీల స్థూల మార్జిన్లు 4-6 శాతం మధ్య క్షీణించే అవకాశమున్నట్లు క్రెడాయ్ బెంగాల్ అధ్యక్షుడు నందు బెలానీ అంచనా వేశారు. (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) హౌసింగ్ భేష్ ప్రస్తుతం హౌసింగ్ విభాగంలో మాత్రమే డిమాండ్ బలపడుతున్నట్లు నందు తెలియజేశారు. వాణిజ్య, పారిశ్రామిక రియల్టీ విభాగంలో పరిస్థితులింకా కుదుటపడలేదని పేర్కొన్నారు. అధిక వ్యయాల కారణంగా బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు వెనుకంజ వేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ఎలాంటి కొత్త ప్రాజెక్టులకూ శ్రీకారం చుట్టలేదని సేన్‌గుప్తా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పరిస్థితులను సమీక్షించాక ఒక నిర్ణయానికి రాగలమని తెలియజేశారు. -
ఉత్తమ్ గాల్వా ఎవరి పరం?
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ చేయడానికి పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మంచి పేరు సాధించిన ఈ కంపెనీ ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. టేకోవర్ బిడ్లకు సంబంధించిన గడువు గత నెల ముగిసింది. ఈ కంపెనీ టేకోవర్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరు రసవత్తరంగా ఉండనున్నది. లోహ దిగ్గజ కంపెనీలు ఈ కంపెనీని టేకోవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. లోహ కుబేరులు–లక్ష్మీ మిట్టల్, జిందాల్ సోదరులు(సజ్జన్, నవీన్ జిందాల్‌లు), వేదాంత కంపెనీ అనిల్ అగర్వాల్ ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ రేసులో ఉన్నారని సమాచారం. 2018లో దివాలా ప్రక్రియ ద్వారా ఈఎస్ఎల్ స్టీల్‌ను వేదాంత కంపెనీ టేకోవర్ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే వేదాంత కంపెనీ టేకోవర్ బిడ్‌ను వేదాంత సమర్పించిందని సమాచారం. ఈ లోహ కుబేరులతో పాటు కోటక్ మహీంద్రాకు చెందిన ఫీనిక్స్అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ) కూడా ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీపై కన్నేసింది. అయితే టేకోవర్ వార్తలపై ఈ సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు... ఉత్తమ్ గాల్వా కంపెనీని రాజేంద్ర మిగ్లాని స్థాపించారు. వాహనాలు, విమానాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమల్లో ఉపయోగించే విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి తొలి ఆర్నెల్లలో రూ.277 కోట్ల ఆదాయంపై రూ.140 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2020 మొదట్లో ఉత్తమ్ గాల్వా స్టీల్స్ కంపెనీ 67 లక్షల డాలర్ల విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఈ కంపెనీపై దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ 2020 మార్చిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో ఒక పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆరు నెలల తర్వాత ఎస్బీఐ పిటీషన్‌ను ఎన్సీఎల్టీ స్వీకరించింది. దివాలా ప్రక్రియను నిర్వహించడానికి కేఎమ్డీఎస్ అండ్ అసోసియేట్స్‌కు చెందిన మిలింద్ కసోద్కర్ను నియమించింది. అగ్ర భాగంలో ఆర్సెలర్ మిట్టల్... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరులో లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకే అధిక అవకాశాలున్నాయని సమాచారం. ఉత్తమ్ గాల్వా కంపెనీకి అత్యధికంగా అప్పులిచ్చింది లక్ష్మీ మిట్టల్ కంపెనీయే. ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.9,742 కోట్లుగా ఉంది. దీంట్లో ఆర్సెలర్ మిట్టల్ సంస్థల(ఆర్సెలర్ మిట్టల్ ఇండియా, ఏఎమ్‌ఎన్‌ఎస్ లగ్జెంబర్గ్) వాటాలే రూ.7,922 కోట్లుగా ఉన్నాయి. రుణదాతలకున్న మొత్తం ఓటింగ్ రైట్స్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 87.2% వాటా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ చెల్లించాల్సిన రుణాలను ఈ సంస్థలను చెల్లించి, ఆ మేరకు అప్పుల్లో వాటాను తీసుకున్నాయి. ఒకప్పు డు ఉత్తమ్ గాల్వాలో ఒక ప్రమోటర్‌గా ఆర్సెలర్ మిట్టల్ ఉండేది. దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి గాను ఉత్తమ్ గాల్వా స్టీల్ నుంచి ఆర్సెలర్ మిట్టల్ వైదొలగింది. ఎస్సార్ స్టీల్‌ను టేకోవర్ చేసి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియాగా పేరు మార్చింది. -
ఉక్కు ఉత్పత్తి నాణ్యత పెరగాలి: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: దేశీ ఉక్కు కంపెనీల ఉత్పత్తిలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దేశీ ఉక్కు పోటీనిచ్చే విధంగా క్వాలిటీ పెరగాలని కోరారు. భారత స్టీల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండే స్థాయిలో ఎదగాల్సిన అవసరం ఉందని ఈ రంగంలోని కంపెనీల సీఈఓల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. సామర్థ్యం పెంపు, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుదల, నాణ్యత పరంగా పరిశ్రమ చాలా పురోగతి సాధించిందని అన్నారు. -
ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర !
* త్వరలో నిర్ణయించనున్న కేంద్రం * దేశీయ స్టీలు కంపెనీలకు పెద్ద ఊరట * ఒకే పోర్టుకు దిగుమతులు పరిమితం! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఉక్కు (స్టీలు) రంగ కంపెనీలకు తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లో స్టీలు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర (ఎంఐపీ) నిర్ణయించనుంది. కేంద్ర వాణిజ్య శాఖతోపాటు ఉక్కు శాఖ సంయుక్తంగా 30-35 రకాల స్టీలు ఉత్పత్తులకు ఎంఐపీని నేడోరేపో ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఎంఐపీ కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల దిగుమతులకు చెక్ పెడతారు. దీంతో భారత్‌కు ప్రధాన ఎగుమతిదారైన చైనాతోపాటు జపాన్, దక్షిణ కొరియా, రష్యా తదితర దేశాల చవక ఉత్పత్తులకు అడ్డుకట్ట పడనుంది. మరోవైపు గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయం నుంచి మాత్రమే ఉక్కు ఉత్పత్తులను అనుమతించేలా నిబంధన రానుంది. చైనా, యూఎస్ తర్వాత అతిపెద్ద స్టీల్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఇన్ఫ్రా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రానుండడంతో ఇక్కడి విపణిపై సానుకూల పవనాలు వీస్తున్నాయి. పెద్ద కంపెనీలకూ కష్టాలు: చవక దిగుమతుల కారణంగా భారతీయ కంపెనీలు మార్కెట్లో పోటీపడలేకపోతున్నాయి. లాభాలు కుచించుకుపోతున్నాయని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్ తదితర దిగ్గజ కంపెనీలు కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశాయి. భారతీయ స్టీలు కంపెనీల తయారీ వ్యయం టన్ను స్టీలుకు సుమారు రూ.23 వేలుంటే, దిగుమతైన స్టీలు ధర రూ.16 వేలుంటోంది. ప్లాంట్ల సామర్థ్యం 20 శాతానికి మించడం లేదని, చాలా ప్లాంట్లు మూతపడ్డాయని ముంబైకి చెందిన ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఓఎన్జీసీ సైతం చైనా పైపులను దిగుమతి చేసుకుంటోందని వెల్లడించారు. పరిశ్రమను కాపాడాలంటే దిగుమతులకు అడ్డుకట్ట వేయాల్సిందేనని పలు స్టీలు కంపెనీలను నిర్వహిస్తున్న కామినేని గ్రూప్ చైర్మన్ కామినేని సూర్యనారాయణ సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు. లక్షల కోట్లలో పెట్టుబడులు.. దేశీయ స్టీలు కంపెనీలు విస్తరణకుగాను కోట్లాది రూపాయలను వెచ్చించాయి. ఇందుకోసం భారీగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల వద్ద నిరర్దక ఆస్తులు రూ.3.09 లక్షల కోట్లకు ఎగిశాయి. ఇందులో అత్యధిక వాటా స్టీల్ పరిశ్రమదేనని సమాచారం. కోల్డ్ రోల్డ్ ఫ్లాట్ స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం యాంటీ డంపింగ్ సుంకాన్ని రకాన్నిబట్టి 57.4 శాతం వరకు విధించింది. సీమ్‌లెస్ పైపులపైనా యాంటీ డంపింగ్ సుంకం విధించాలని మహారాష్ట్రకు చెందిన ఒక కంపెనీ ఎండీ తెలిపారు. భారత సీమ్‌లెస్ పైప్ మార్కెట్ రూ.15,000 కోట్లుగా ఉన్నప్పటికీ, ఒక్క భారతీయ సీమ్‌లెస్ పైప్ కంపెనీ కూడా ఆర్డరు పొందకపోవడం గమనార్హం. -
గతవారం బిజినెస్
ఉక్కు ఉత్పత్తులపై దిగుమతి సుంకాల పెంపు కొన్ని ఉక్కు ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (బీసీడీ) 2.5 శాతం మేర పెంచింది. నిర్దిష్ట ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులపై 7.5 శాతం నుంచి 10 శాతానికి, లాంగ్ స్టీల్ ఉత్పత్తులపై 5 శాతం నుంచి 7.5 శాతానికి సుంకాన్ని పెంచినట్లు కేంద్రీయ ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సీబీఈసీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. కార్వీపై ఏడాది నిషేధం ఐపీవో స్కాంకు సంబంధించి ఏడాది పాటు కొత్తగా ఎటువంటి ఐపీవోలు చేపట్టకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. దీని ప్రకారం సోమవారం నుంచి ఏడాది పాటు ఐపీవోలకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష కార్యకలాపాల నుంచి కేఎస్బీఎల్ని నిషేధించింది. ఎగుమతులు డీలా.. మే నెలలో ఎగుమతులు 20 శాతంమేర, దిగుమతులు 17 శాతంమేర క్షీణించాయి. గతేడాది మే నెలలో 27.99 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది అదే నెలలో 22.34 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అదే సమయలో దిగుమతులు 39.23 బిలియన్ డాలర్ల నుంచి 32.75 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. వాణిజ్యలోటు 10.4 బిలియన్ డాలర్లుగా ఉంది. చమురు దిగుమతులు 8.53 బిలియన్ డాలర్లుగా, చమురేతర దిగుమతులు 24.21 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం దిగుమతులు 10.47 శాతం వృద్ధితో 2.19 బిలియన్ డాలర్ల నుంచి 2.42 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఎస్బీఐ నుంచి ఆన్లైన్ ఫారె క్స్ ప్లాట్‌ఫామ్ ఖాతాదారులు విదేశీ మారక లావాదేవీలను ఆన్లైన్ మాధ్యమంలో జరిపేందుకు వీలుగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తాజాగా ఇం టర్నెట్ ఆధారిత ఈఫారెక్స్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ప్రత్యేకంగా బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు దీన్నుంచే ఫారెక్స్ రేట్లను తెలుసుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ఈ ఏడాది సిస్కో పెట్టుబడులు 174 కోట్ల డాలర్లు అమెరికా టెక్నాలజీ దిగ్గజం సిస్కో ఈ ఏడాది భారత్‌లో 174 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ప్రతీ ఏడాది భారత్‌లో పెడుతున్న పెట్టుబడులకు అదనంగా ఈ ఏడాది మరో 6 కోట్ల డాలర్లు (శిక్షణా కేంద్రాల విస్తరణకు 4 కోట్ల డాలర్లు, విద్యార్థుల శిక్షణకు 2 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నామని సిస్కో సిస్టమ్స్ చైర్మన్, సీఈఓ జాన్ టి. చాంబర్స్ చెప్పారు. హైదరాబాద్‌లో టీసీఎస్ ఆర్ అండ్ డీ కేంద్రం టీసీఎస్ హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (సీవోఈ) పేరుతో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని టీసీఎస్ ప్రారంభించింది. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే కొత్త టెక్నాలజీలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్క్స్, 5జీ, వైర్లెస్ లాన్ వంటి వాటిపై ఈ కేంద్రం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. బీపీసీఎల్‌లో 3% వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో (బీపీసీఎల్) 3 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా రూ. 1,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా బీపీసీఎల్‌లో 2.16 కోట్ల షేర్ల విక్రయించడానికి సంబంధించి అంతర్ మంత్రిత్వ శాఖలు చర్చించేందుకు ఆర్థిక శాఖ ఒక నోట్‌ను రూపొందించింది. బంగారం బాండ్లు వస్తున్నాయ్ నాణేలు, కడ్డీలు తదితర రూపాల్లో బంగారానికి డిమాండ్‌ను కట్టడి చేసే దిశగా కేంద్రం తాజాగా సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్బీజీ) జారీ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. కమీషన్ ప్రాతిపదికన పోస్టాఫీసులు, ఇతరత్రా బ్రోకర్ల ద్వారా వీటిని జారీ చేయనుంది. ఏటా దాదాపు 300 టన్నుల మేర కడ్డీల రూపంలో జరుగుతున్న కొనుగోళ్లలో కొంత భాగాన్నైనా డీమ్యాట్ రూపంలోని బాండ్లవైపు మళ్లించాలన్నది దీని వెనుక ఉద్దేశం. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు 50 టన్నుల పసిడికి సరిసమానమైన బాండ్ల జారీ ద్వారా రూ. 13,500 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. కాకినాడలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏపీలోని కాకినాడలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ సలహాదారు జె.సత్యనారాయణ చెప్పారు. ఈ ఏడాది చివరకు ఈ స్టార్టప్ టవర్‌ను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత అనంతపురం, తిరుపతిల్లోనూ ఒక్కో సెంటర్‌ను నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడాది స్టార్టప్ ఇన్నోవేషన్ నిధుల కింద రూ.100 కోట్లను ఖర్చు చేస్తామని తెలియజేశారు. ఫార్మాలో 4,000 కోట్ల ఎఫ్‌డీఐలకు కేంద్రం ఓకే ఫార్మా రంగంలో సుమారు రూ. 4,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టు బడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనల కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టొరెంట్ ఫార్మా రూ. 3,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన, బయోకాన్‌కి చెందిన రీసెర్చ్ సేవల సంస్థ సింజీన్ రూ. 930 కోట్ల ప్రతిపాదనతోపాటు పలు కంపెనీల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. నియామకం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రెసిడెంట్‌గా వెన్నం అనిల్‌రెడ్డి ఎన్నికయ్యారు. -
వాహన రంగ ఉక్కు అవసరాలపై దృష్టి: గెర్డావ్
హైదరాబాద్: వాహన, రైల్వే, రక్షణ రంగ సంస్థలకు అవసరమైన ఉక్కు ఉత్పత్తుల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు గెర్డావ్ ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా తాడిపత్రిలోని తమ ఉక్కు కర్మాగారాన్ని మరింతగా విస్తరిస్తున్నట్లు, త్వరలోనే కోక్ ఓవెన్లను కూడా ప్రారంభిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో దాదాపు 2,000 మంది పనిచేస్తున్నారని, ఇప్పటిదాకా సుమారు రూ. 2,700 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశామని గెర్డావ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.